నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

13 - మోహినీసంమోహనమ్

వసిష్ఠమహర్షిపలికెను:- మోహినీదేవి రాజును లేపిఇటులపలికెను. ఓరాజేన్ల! సందేహించకుము. నేను పరిశుద్దయగుకన్యకనని తెలియుము. నన్ను గృహ్యవిధిచే వివాహమాడుము. కన్య వివాహములేకనే గర్భధారణచేసినచో అందరిచే నిందించబడును. పురాణమున ముగ్గురు చందౌలస్త్రీలని పండితులు చెప్పిరి. కన్యకుపుట్టిన స్త్రీశిశువు, సగోత్రజాత, శూద్రునివలన బ్రాహ్మణస్త్రీయందు పుట్టినది. కావున కన్యనగు నన్ను వివాహమాడుము. ఇట్లు మోహిని పలుకగా రుక్మాంగదమహారాజు చపలేక్షణ యగుమోహినిని యధోక్తవిధితో వివాహమాడి మిక్కిలి సంతోషించెను.

రుక్మాంగదమహారాజుపలికెను:- దేవీ! ఈమందరపర్వతమున నిన్ను పొందుట వలన కలుగు సంతోషము స్వర్గప్రాప్తితో కూడా కలుగదు. ఈ భూమండలమున నేను ఇంద్రునికంటే అధికుడని భావించుచున్నాను. ఇంద్రునికి నీవంటి త్రైలోక్యసుందరియగు భార్య లేదు కదా. కావున నీకేది సమ్మతమో దానినే చేతును. నన్నాజ్ఞాపింపుము. నీవిచటనే ఆనందింతువా? లేక నాభవనమున నుందువా? మలయ పర్వతమున కాని, మేరుశిఖరమునకాని, నందనవనమున కాని నివసింతువా తెలుపుము. ఇట్లు పలికిన రాజు మాటలను వినిన మోహిని మధురవచనములతో రాజును ఆనందింపచేయుచు ఇట్లు పలికెను. ఓరాజా? సవతుల వాడిచూపుల గాయములు నాశరీరమును కూడా గాయపరచును, ఏ స్త్రీ అయిననూ జీవితాంతము సవతిదుఃఖమును సహించజాలదు. అయిననూ నేను నామనసుతో నీవశమైతిని. నాకు సవతిపోరు తప్పదని తెలిసికూడా నిన్ను భర్తను చేసుకొంటిని. చాలా ఆశ్చర్యములుకల ఈ పర్వతమునందే నుండవలయునునని నాకోరిక. కాని నీవు నీపట్టపురాణియగు సంధ్యావలి నీవిడిచి ఉండజాలవుకదా? పుత్రవతియగు సంధ్యావలీ విరహము నిన్నెక్కువగా దు:ఖింపిచేయును. నీకు దుఃఖము కలిగినచో నాకు మరింత దుఃఖము కలుగును. కావున నీకెక్కడ ఆనందముగా నుండునో నేనచటనే యుండగలను. ఇష్టము లేకున్ననూ భార్య భర్తృస్థానముననే నుండవలయును. సమీపమున నున్న పతయే బంగారుమేరుపర్వతమని చెప్పెదరు. నీవెక్కడ ఆనందింతువో అదియే నాకోరికల మేరుపర్వతము కాగలదు. భర్త స్థానము కానిచో పితృస్థానమును కూడా విడువ వలయును. భర్భస్థానమును వదిలి పితృస్థానమును ఆశ్రయించు స్త్రీ సౌకరస్త్రీ కాగలదు. కావున నేనీదోషములను తెలిసినదానను అయినపుడు మందరమున ఎట్లుండగలను. నీవెంటనే వత్తును. నాసుఖదుఃఖములకు నీవే ప్రభువు. ఇట్లు మోహినిమాటలు వినిన రాజు సంతుష్ట చిత్తుడాయెను. మోహినిని కౌగిలించుకొని ఇట్లు పలికెను. ఓమోహినీ నీవు నాభార్యలందరిలో ఉన్నతస్థానమున నుందువు. నీకు దుఃఖము కలుగుననీ శంకించవలదు. నా ఇంటిలో నాప్రాణము కంటే నీవు మిన్నయగుదువు. కావున ఓ తన్వండీ! మన ఆనందము కోజుకు నగరమునకు వెళ్ళుదుము. నగరమున నుండి స్వేచ్చగా నాతో భోగముల ననుభవింపుము. ఇట్లు రుక్మాంగదమహారాజు ఆత్మ వినాశనము కోజుకు పలుకగా పార్వతిశోభను ఆకర్షించుచు నూపురనాదముతో బయలుదేరెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ సంమోహనమను పదమూడవ అధ్యాయము.