నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

33 - ధర్మాంగదోక్తి:

వసిష్ఠ మహర్షి పలికెను : అంతట సంధ్యావలీదేవి భర్త పాదములను పట్టుకొని ధర్మాంగద వినాశనము గురించి ఇట్లు పలికెను. ఓ రాజా మోహరూపయగు మోహినికి నీవు చెప్పినట్లుగా చాలా చెప్పి చూచితిని. అయిననూ ఏకాదశీ. భోజనము, లేదా తనయుని వధ కంటే ఇతరములు ఈమెకు ఇష్టములు కావు. ధర్మత్యాగమున కంటే పుత్రవధయే ఉత్తమ మని తలచెదను. పుత్రునికి జన్మనిచ్చుటలో తల్లి పడువేదన తండ్రికి యుండదు. గర్భమును ధరించుటలో భేదముతో కలుగు స్నేహము తల్లికి అధికముగా నుండును. తండ్రి కంతగా యుండదు. తండ్రి క్షేత్రమున బీజమునుంచు వాడు మాత్రమే. గర్భమును ధరించుటలో, జన్మనిచ్చుటలో పెంచి పోషించుటలో తల్లి ఎక్కువగా కష్టములననుభవించును. పుత్రుని యందు తండ్రి కంటే తల్లికి నూరురెట్లు ఎక్కువగా నుండును. స్నేహాధిక్యమును చూచియే తండ్రి కంటే తల్లిని అధికురాలనిగా , తెలియుదురు. అట్టి తల్లినగు నేను పరలోక జిగీషతో పుత్రునిపై స్నేహమును దూరముగా విడిచి పుత్రుని వధించుము. సత్యమును మాత్రము తప్పకుము. నామీద ఒట్టు పెట్టుచున్నాను. కష్టములతోనే శ్రీహరి ఫలప్రదుడగును. ఈ వ్రతము పూర్తి చేసినచో దేహమున కొద్ది బాధ కూడా కలుగదు. అధర్మముచే మానవుడు తప్పక స్వర్గ భ్రష్టుడగును. ప్రాణములను కాని, పుత్రులను కాని సర్వస్వమును కాని ఇచ్చి దైవమును అనుసరించు వాడే మహాపురుషుడుగా కీర్తించబడును. సత్యమును నిలబెట్టు ఆపదలు కూడా ధన్యములు. సత్యమును సరక్షించుట కొఱకు పడిన కష్టములు మోక్షప్రదములగును. కీర్తిని వ్యాపింపచేయుటకు మానవులెపుడూ స్నేహ ద్వేషములను విడిచి శాసోక్త కర్మలనాచరించవలయును. కావున పరితాపమును విడిచి సత్యమును కాపాడుము. సత్యపాలనముచే విష్ణు దేహము లభించును. ఈ విమోహిని నీ కొఱకు దేవతలు సృజించిన వరిపిడి రాయి. శత్రుత్యము వారు చేసిన దానిని మీరు తెలియుట లేదు. పుత్రుని వధించుటచే దేవతలు తలను వంచెదరు. దేవతల శిరము పై పాదుమునుంచి పరమ పదమును పొందెదవు. విష్ణుభక్తి కలవారికి దేవతలు శత్రువులు, లోకమున గుడ్డితనము వచ్చును. ఇపుడదియే ప్రకటించబడినది. నీ కర్మలచే ఈశ్వరుడు మొదలు .దేవతలందరూ నీకు శత్రువులైరి. నీ నిశ్చయమును చలింపచేసి మోక్షమార్గమును భేదించువారే. కావున నీవు దృఢనిశ్చయముతో ప్రియుడగు పుత్రుని వధించుము. నీ సత్యపాలనమునకై మోహిని మాటలను ఆచరించుము. నీవు నీ మాటను తప్పినచో బ్రహ్మహత్యా పాతకముతో సమమగు పాపము కలుగును. యమలోకమునకు వెళ్ళెదవు. ఈ భూమండలమున నీ కీర్తి నశించును. 

భార్యాయా వచనం శ్రుత్వా రాజా రు క్మాంగుదస్తదా ।

సంధ్యావలీ మువాచేదం మోహిన్యాస్సన్నిధౌ సృప.

పుత్రహత్యా మహాహత్యా బ్రహ్మహత్యాధికా ప్రియే ।

ఘాతయిత్వా సుతం లోకే కా గతిర్మే భవిష్యతి

క్వ గతో మందరం శైలం క్వ ప్రాప్తా మోహినీ మయా ।

ధర్మాంగద వినాశాయ దేవి కాలప్రియా త్వియమ్

ధర్మజ్ఞం వినయోపేతం ప్రజారంజన కారకమ్ ।

అప్రజం చ సుతం హత్వా కా గతిర్మే భవిష్యతి 

వసిష్ట మహర్షి పలికెను : రుక్మాంగద మహారాజు భార్య వచనములను విని మోహిని సమీపమున సంధ్యావలితో ఇట్లు పలికెను. ఓ ప్రియురాలా, పుత్రహత్య మహాహత్య. బ్రహ్మహత్య కంటే ఘోరమైనది. పుత్రుని వధించిన నాకు ఏ గతి లభించును. నేను మందారాచలమున కేల వెళ్ళితిని? మోహిని ఏల లభించినది? ధర్మాంగద వినాశమునకే వచ్చిన కాలుని ప్రియురాలు ఈ మోహిని. ధర్మజ్ఞుడు, వినయాన్వితుడు, ప్రజారంజన కారకుడు, సంతానవంతుడు కాని పుత్రుని చంపిన నాకు ఏ గతి పట్టును? దుష్ట పుత్రుని చంపిననూ తండ్రికి దుఃఖము కలుగును. ఇక ధర్మశీలుడు గురు సేవాపరాయణుని చంపిన చెప్పవలయునా? నేనొక జంబూద్వీపమును మాత్రమే అనుభవించితిని. నీ పుత్రుడు సప్తద్వీపములననుభవించెను. శ్రీహరి అంశ సంభూతుడు మాత్రమే తండ్రిని మించిన వాడగునని పురాణములలో పండితులు చెప్పియున్నారు. ఈ భూమండలమున ధర్మాంగదుడు అత్యధికుడని ప్రసిద్ధి నొంది నా వంశమును తరింపచేసి నా కీర్తిని పెంపొందించెను. నాకు పుత్రుని వలన ఎంత దుఃఖము కలుగుచున్నది. నీవు నాకు దుఃఖమును కలిగించు మోహరూపయగు మోహినికి ఇంకొకసారి మంచి మాటలతో చెప్పి చూడుము. ఇట్లు ప్రియురాలగు సంధ్యావలితో పలికి రుక్మాంగద మహారాజు మోహినిని సమీపించి ఇట్లు పలికెను. ఏకాదశినాడు భుజించను. పుత్రుని సంహరించను. నన్ను సంధ్యావలిని చంపుకొందును. నీ ఆజ్ఞతో ఇంకొక రౌరవకర్మను చేతును, పుత్రవధ విషయమున పట్టుదలను విడువుము. పుత్రుడగు ధర్మాంగదుని వధించిన నీకు కలుగు లాభమేమి? ఏకాదశీ భోజనమున మాత్రము నీకేమి లాభము? నీకు నేను దాసుడను భృత్యుడను వశవర్తిగ నుంటిని. నిన్ను శరణువేడుచున్నాను. మరొక వరమును కోరుము. నీకు కావలసిన ఇతర ప్రయోజనములను చే కూర్చెదను. నన్ను అనుగ్రహించుము. నాకు పుత్ర భిక్షను ప్రసాదించుము. గుణవంతుడగు పుత్రుడు దుర్లభుడు. హరి వాసరము కూడా దుర్లభమే. గంగా జలము, తల్లి, సత్కుల జన్మ, సద్వంశ జాతయగు ప్రియురాలు, స్వర్ణదానము, హరి పూజనము, వైష్ణవ దీక్ష, స్మృతి సంగ్రహము దుర్లభములు. నౌకరవాసము, హరి చిన్తనము, విష్ణు వాసర జాగరము, ఆత్మ సత్కారము, పుత్ర ప్రాప్తి, పుష్కర జలము, సజ్జన సంగతి, భక్తి, కపిలగోదానము, నీలమోక్షణము, త్రయోదశి శ్రాద్ధము దుర్లభములు. భూమి, పాతకనాశకవ్రతపాలనము తిలమయి విప్రగామిని యగు ధేనువు, ధాత్రీస్నానము, శ్రీహరి వాసరము దుర్లభములు. పర్వకాలమున శీతల జలస్నానము, విశేషించి మాఘ మాసోషః కాలమున శీతల జలస్నానము శాసోక్ష కర్మాచరణము, వధ్యమగు దానికి క్షేమము, ఔషథము, వ్యాధి విఘాతము, శాస్త్ర మార్గానుసరణము, మరణ కాలమున శ్రీమరి స్మరణము, దుర్లభములు. కావున ధర్మమును రక్షణ సేయు నా మాటను వినుము. పుత్ర ,వధతో నీకేమి లాభము. నా పై అనుగ్రహమును చూపుము. విషయ సుఖములను చక్కగా అనుభవించితిని. నిష్కంటకముగా రాజ్యపాలనమును గావించితిని. దేవగోవిప్రరక్షకుల పాదములను నా శిరమున దాల్చితిని. విషయ భోగములననుభవించని పుత్రుని నేను వధించజాలను. నా చేతిలో నేను స్వయముగా నా పుత్రుని చంపుటను మించిన మహాపాతకమింకొకటి యుండదు. 

మోహిని పలికెను : దర్మాంగదుడు నాకు శత్రువు కాడు. నేను నీ పుత్రుని చంపుట లేదు. నీవు హరి వాసరమున భుజించమని మొదటనే చెప్పితిని. నీ ఇష్టమొచ్చినంత కాలము చాలా సంవత్సరములు భూమిని పాలించుము. నేను నీ పుత్రుని చంపుట లేదు. నీవు భోజనము చేయుటయే నాకు కావలసినది. కాన నీ పుత్రుని చంపుటలో పనియేమియు లేదు. నీకు పుత్రుడు ప్రియుడైనచో హరివాసరమున భుజించుము. ధర్మ బహిష్కృతములగు ఈ విలాపములతో పనిలేదు. యత్నించి సత్యమును కాపాడుము. నా మాటను పాటించుము. ఇట్లు. మోహిని పలుకుచుండగా ధర్మాంగదడు చూచి నమస్కరించి ముందు నిలిచి ఇట్లు పలికెను.నీవు దీనినే స్వీకరించుము. ఓ దేవీ! సందేహించకుము. నిర్మల ఖడ్గమును తీసుకొని రాజు ముందు ఉంచి, తనను కూడా నుంచి సత్య ధర్మ నిష్ఠుడై ఇట్లు పలికెను. ఓ తండ్రీ! నన్ను చంపుటలో నీవాలసించకుము. నా తల్లి మాటలను, తల్లికి నీ విచ్చిన మాటను నిజము చేయుము. ధనములతో దారలతో, పుత్రులతో తనను తాను కాపాడుకొనుట ధర్మము. శ్రేయస్కాముడగు రాజునకు సంతానము ధర్మ మార్గ రక్షణ కొరకే. నీ కొరకు మరణించుట నాకక్షయ లోకమును ప్రసాదించును. నీకు కూడా నీ వాక్యపాలనతో నిర్మలలోకములు సంప్రాప్తించును. పుత్రుని సంహరించుట వలన కలుగు దుఃఖమును విడిచి పెట్టుము. సర్వరోగ వినిర్ముక్తము, ఇంద్రసమమగు ఈ మానవదేహమును విడుచుటకే నాప్రయత్నమంతయు. తండ్రి కొరకు కాని, తల్లికొరకు కాని, గోవుల కొరకు, బ్రాహ్మణుల కొరకు, స్త్రీల కొరకు, భూమి కొరకు, రాజు కొరకు, దేవతల కొరకు, బాలుల కొరకు, వికలులు కొరకు చనిపోయిన వారు తేజోమయ లోకములను వెళ్ళేదరు. కావున నీ పరితాపము చాలును. నన్ను ఉత్తమ ఖడ్గముచే వధించుము. ఓ రాజేన్గా! నీవు సత్యమును నిలుపుము. హరివాసరమున భుజించకుముర్మరక్షణ కొరకు పుత్రునికాని, భార్యను కాని చంపవచ్చును. అశ్వమేధయాగమున నున్నవారు యజ్ఞ విఘ్ననివారణకొరకు పుత్రుని వధించిననూ దోషము లేదని వేదవాక్యములలో చెప్పబడి యున్నది. ఓ రాజా నా తల్లి యగు మోహిని చెప్పిన మాటను అన్ని సందేహములను విడిచి ఆచరించుము. ఓ రాజా! ప్రసన్నుడవుకమ్ము. నా వధ కొరకు నేను చెప్పు మాటలను ఆచరించుము. మోహిని హస్తమున నున్న ఘోరమగు అనృత వాక్యము నుండి నిన్ను విడిపించుకొనుము. పుత్రుని వధచే నీకు యశము ప్రకాశమానమగును. యశః ప్రకాశము వలన కీర్తి అక్షయమగును. . 

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున దర్మాంగ దోక్తియను ముప్పది మూడవ అధ్యాయము.