నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

23 - రుక్మాంగద సంలాపః

 మోహిని పలికెను :-

ఓ రాజా ! కార్తిక మాసమున ఉపవాసమును గురించి చక్కగా చెప్పితిరి. కాని రాజులకు ప్రతాచరణము విధించబడినట్లు ఎక్కడా నిదర్శనము కానరాదు. ప్రతాచరణము బ్రాహ్మణులకు తప్ప శూద్రవైశ్యులకు కూడా విధించబడలేదు. రాజులకు దానము, ప్రజాపాలనము, యుద్ధము అను మూడు కర్మలు విధించబడియున్నవి. కావున నా మీద నీకు కోరిక యున్నచో నీవు వ్రతమును చేయరాదు. నీవు లేనిదే ఒక ముహూర్తకాలముకూడా నిలువ జాలను. ఇక ఒక నెల ఎట్లుండగలను? ఉపవాసమును చేయదలచిన సమయమున బ్రాహ్మణులకు భోజనమునిమ్ము. లేదా నీ పెద్ద భార్యయగు సంధ్యావలీ దేవి ఈ వ్రతమును ఆచరించనిమ్ము. మోహిని ఇట్లు పలుకగా రుక్మాంగద మహారాజు సంధ్యావతీ దేవిని పిలిచెను. సంధ్యావలీ దేవి భర్త పిలుపు నందుకొని వెంటనే రాజును చేరెను. మోహినీ దేవి బాహు పంజరములో నుండి మోహినీ స్తనాగ్ర ఘర్షణతో సకామయగు మోహినీ శయ్యపై నున్న భర్తను చూచి తలవంచుకొని చేతులు జోడించి రుక్మాంగద మహారాజుతో నన్నెందుకు పిలిపించితిరి? నేనేమి చేయవలయును? నాధా! నేను సవతిమీద ఈర్యను వదిలియున్నాను. నీ మాటను పొటీంచెదను. నీవు మోహినీదేవిచే రమించుచున్న విధానముతో సమముగా నీయందు నాకు ప్రీతి కలుగుచున్నది. భర్త సుఖించుచున్నపుడు దుఃఖించు భార్య ఎనిమిది సంవత్సరములు డేగగా నుండును. నన్ను ఆజ్ఞాపించుము. కాముకత్వముతో బిడియపడుకుము. రుక్మాంగద ఉవాచ :-

రుక్మాంగద మహారాజు పలికెను :-

ఓ ప్రియురాలా? నాకు నీ స్వభావము బాగుగా తెలియును. నేను నీ మాటతోనే చాలాకాలము మోహినితో రమించితిని. మోహినితో రమించుచుండగా చాలా కార్తీక మాసములు ప్రియాసౌఖ్యమోహములో గడిచినవి. ఒక్క హరివాసరమును మాత్రము విడువలేదు. ఇపుడునేను కొమ భోగములతో తృప్తిని చెందితిని. సర్వపాప నాశకమగు కార్తికమాసము వచ్చినదని తెలుసుకొంటిని. పరమ పుణ్యప్రదమగు కార్తీక వ్రతము నాచరించదలచితిని. కాని ఈ బ్రహ్మసుతయగు మోహిని వ్రతము నుండి నన్ను వారించుచున్నది. ఎట్టి పరిస్థితులలోను ఈమెను బాధించరాదు. కావున కాయమును శుష్కింపచేయు. నేను చేయదలచిన కృచ్చవ్రతమును నీవు ఆచరించుము. కొత్త బంగారము కాంతిగల, పీన పయోధరములు కల సంధ్యావలి భర్త మాటను విని సంతోషముచే పూర్ణచంద్రముఖియే నీ సంతోషము కొరకు వ్రతము నాచరించెదను. ఇటుల ఆచరించినచో కీర్తి యశము కలుగును. నీ కీర్తితో నాకానందము కలుగును. నీకానందమును కలిగించెదను. నీ కొఱకు నిప్పులో కూడా దూకుదును. అందులో ఇది చేయరాని కార్యము కూడా కాదు. నీ ఆజ్ఞతో కన్నకొడుకును కూడా చంపెదను. ఇక ఇంత చక్కని వ్రతమునేల చేయను. తప్పక ఈ సద్ర్వతము నాచరించెదను. ఇట్లు విశాలనేత్రయగు సంధ్యావలీ దేవి యమ శత్రువగు రుక్మాంగద మహారాజుతో పలికి సకలపాప వినాశము కొఱకు వ్రతము నాచరించెను. ఇట్లు సంధ్యావలీదేవి వ్రతము నాచరించుటచే రుక్మాంగద మహారాజు సంతోషించెను. అపుడు బ్రహ్మపుత్రికయగు మోహినితో నీవు చెప్పినట్లే చేసితిని అనెను. కావున నీవు సంతోషముతో నాయందు కలిగిన వాంఛాపూర్తికై చక్కగా రమించుము. నీ సంతోషము కొఱకే నేను అన్ని పనులను వదిలితిని. నా సౌఖ్యమునకు నీవు తప్ప మరొక స్త్రీ లేదు. రుక్మాంగద మహారాజు ఇట్లు పలుకగా సంతోషమును పొంది రాజుతో ఇట్లు పలికెను. నీవు చాలా కామముతో నున్న వాడవని తెలిసి నేను త్రివిష్టపము నుండి ఇటకు వచ్చితిని. దేవతలను, దైత్యులను, గంధర్వ యక్ష రాక్షస నాగులను నా కొరకు చూచువారి నందరిని విడిచి నీయందు ప్రీతితో మందరాద్రి యందు నిన్ను చేరితిని. లోకమున ప్రేయసీ ప్రియులిరువురు ఒకే మనసుతో నుండుటే కామఫలము. భేదాభిప్రాయములు గల వారి సంగమము శవముల సంగమము వంటిది. నా శరీరము, నా సౌందర్యము కాముకుడవగు నీచే సఫలమైనది. ఇట్లు మూడు లోకములలోను లభించదు. ఉన్నతములగుస్తనములతో ఆలింగనము చేసుకొనినపుడు ద్రవించని ప్రియుని హృదయము వజమువలె కఠినమని తలచెదను. స్తనములు హృదయమున హత్తుకొని మదవతి అధరమును పానము చేయుటే ఈ లోకమున అమృతము. ఇట్లు పలికి ఏకాంతములో నున్న రాజును గాఢముగా ఆలింగనము చేసుకొని వాత్స్యాయన కామ శాస్త్రానుసారముగా రాజును రమింప చేసెను. ఇట్లు రుక్మాంగద మహారాజు మోహినితో రమించుచుండగా రాజు చెవులకు భేరీధ్వని వినిపించెను. ధర్మాంగద మహారాజుగారి ఆజ్ఞతో మత్తగజ కుంభస్థలముపై మ్రోగించు చుండెను. రేపు ఏకాదశి. కావున ఈ దినము ఏక భుక్తముగా నుండుడు. ఉప్పుకారములను విడీచి, హవిష్యమును భుజించుడు. భూమి మీద పరుండుడు. ప్రియా సంగమమును విడువుడు. పురాణ పురుషోత్తముడగు శ్రీ మన్నారాయణుని స్మరించుడు. ఏక భుక్తముతో ఉపవాసము నాచరించుడు. ఇట్లు చేసినచో శ్రాద్ధమును చేయనివారు, పిండ ప్రదానమును చేయనివారు, గయకు వెళ్ళని పుత్రులు కలవారు కూడా శ్రీహరి లోకమునకు వెళ్ళుడు. ఈ ఏకాదశి కార్తిక శ్లు ఏకాదశి. శ్రీహరిని నిద్ర నుండి మేల్కొల్పునది. ప్రాతః కాలమున ఏకాదశి వచ్చుచున్నది. భోజనమును చేయకుడు. ఈ ప్రబోధినిన ఉపవసించినచో బ్రహ్మహత్యాది పాపములు, కామ వశముచే చేసిన పాపములు అన్నియూ నశించును. ఈ ఏకాదశి ధర్మపరులను, న్యాయాచార యుక్తులను ప్రబోధింప చేయును. సాక్షాత్తుగా శ్రీహరినే ప్రబోధింప చేయును. కావుననే ఈ ఏకాదశి ప్రబోధిని యనబడును. శ్రీహరి నిద్రను తొలగించు ఈ ఏకాదశిన ఒకసారి ఉపవసించిననూ మరలగర్భవాస దుఃఖమును అనుభవించడు. తమ తమ విభవాను సారముగా శ్రీహరిని పూజించుడు. వస్త్ర పుష్ప ధూప దీప చందన పుష్పములను, మధుర ఫలములను సమర్పించుడు. ఈ దినమున ధర్మకరము శ్రీ విష్ణులోక ప్రదమగు నా ఆజ్ఞను పాలించని వాడు దండించబడును. వధించబడును. ఈ దేశము నుండి బహిష్కరించబడును. ఇట్లు మేఘ గంభీరధ్వనిచే పటహము ధ్వనించుట వినిన రుక్మాంగద మహారాజు చేతినుండి కర్పూరముతో నున్న తాంబూలము జారిపడెను. మోహినీ దేవి స్తనములకు తగిలియున్న హృదయమును దూరముగా జరిపి రతి వర్ధనుడగు మహారాజు శయ్య నుండి లేచెను. మోహమార్తయగు మోహినీ దేవిని మధురమగు మాటలచే ఓదార్చుచు ఇట్లు పలికెను. ఓ దేవీ ! ఉదయము ఏకాదశి వచ్చుచున్నది. అది సర్వపాప నాశకము. నేను నియమ బద్దుడనగుదును. క్షమింపుము. క్షమింపుము. నీ యాజ్ఞతో నేను కృచ్చవ్రతమును సంధ్యావలికి అప్పగించితిని. కాని ప్రబోధ కరణియగు ఏకాదశీ వ్రతమును నేనే ఆచరించవలయును. ఈ ఏకాదశి సమస్త సంసార బంధములను ఛేదించును. ఉత్తమగతిని ప్రసాదించును. కావున నియమపరుడనై నేను హవిష్యమును భుజించెదను. నాతో పాటు నీవు కూడా ఉపవాసము నాచరించి అధోక్షజుడు హృషీకేశుడగు శ్రీమన్నారాయణుని ఆరాధించుము. ఇట్లు ఆచరించినచో దాహ ప్రలయ రహితమగు నిర్వాణమును పొందెదవు. మోహిన్యువాచ :-

మోహినీ దేవి పలికెను :-

ఓ రాజా? జన్మ మృత్యు జరాఛేదియగు చక్రపాణి పూజను చక్కగా బోధించితివి. నీ ఆజ్ఞచే నేను నాచరించెదను. కాని పూర్వము నీవు మందర పర్వత శిఖరమున దక్షిణకర ప్రదాన పూర్వకముగా నీసుకృతము పై శపథముతో ప్రతిజ్ఞచేసి యుంటివి. ఇపుడు ఆ సమయమొచ్చినది. ఇపుడు నేనడిగిన దానినిమ్ము, నేనడిగిన దానినీయనిచో నీవు పుట్టిన నాటి నుండి సంపాదించిన సమస్త పుణ్యము వెంటనే నశించును.

 రుక్మాంగద మహారాజు పలికెను :-

ఓ సుందరాంగీ ! రమ్ము. నీ మనసులోని మాటను చేయుదును. నా ప్రాణమును కూడా నీకిత్తును. నీకీయరానిదేదీ లేదు. ఇక గ్రామ ధన రాజ్యాదులెంతమాట !

మోహినీ దేవి పలికెను :-

ఓ నాథా ! ప్రియా ? ప్రభో ! రాజా? ప్రాణనాథా ! రతిప్రియా! నన్ను అనుభవించదలచినచో నీవు ఏకాదశినాడు ఉపవసించరాదు. ఉపవసించినచో నేను నీకు ప్రియురాలను కాను. నేను నీ సంయోగము లేనిదే ఒక ముహూర్తము కూడా ఉండలేదు ఉండలేను. కావున నన్ను అనుభవించు కోరిక కలదేని ఏకాదశీ ఉపవాసమును త్యజించుము. ఏకాదశినాడు భుజించుము. నాకీయవలసిన వరమిదియే. దీనినే నేను పూర్వము కోరితిని. నీవు అసత్యపరుడవై నాకీ వరము నీయనిచో ప్రళయకాలము వరకు ఘోరమగు నరకమున నుందువు.

రాజు పలికెను :-

ఓ కళ్యాణీ ! నీవిట్లు పలుకకుము. ఇది నీకు తగదు. బ్రహ్మ పుత్రికవై ధర్మ విఘ్నమును చేతువా? నా పుట్టుక నుండి నేను ఏకాదశి నాడు భుజించలేదు. ఇక ఇపుడు పండిన తల కలవాడనై ఎట్లు భుజింతును? యౌవనము తరిగి ఇంద్రియ బలము క్షీణించినవాడు గంగను సేవించుట, శ్రీహరిని పూజించుట ఉచితము. నేను బాల్యమున యావనమున చేయని హీనకర్మను వార్ధక్యమును ఎట్లు చేతును? ఓ చపలా పొంగీ ! వర వర్ణినీ ! ప్రసన్నురాలవు కమ్ము. వ్రతమును భంగ పరచకుము. నీకు నా రాజ్యమును సంపదల నిత్తును. ఇది వలదన్నచో మరోకటి ఇచ్చెదను. విమాన సమము శుభకరము అగు పల్లకీలో నిన్ను కూర్చుండబెట్టి నీవు చెప్పిన చోటికి భార్యా యుక్తుడనై కోని పోదును. ఇది కూడా వద్దన్నచో పగడములు పొదగిన బంగారు స్తంభములతో ఒక విమానమును నిర్మించి యుంటిని. ఆ విమానమున ఫలమయమగు ఊయల నేర్పరచి రాత్రింబవళ్ళు చాలా నెలలు ఆ ఊయలలో నిన్ను ఊ పెదను. కావున నాకు ప్రియురాలవు కదా. వ్రత భంగమును చేయకుము. చండాల మాసంము కాని, శునక మాంసముకాని, తన మాంసముకాని ఏకాదశీ భోజనము కంటే మేలు. మూడు లోకములను సంహరించిన పాపము, అమావాస్యనాడు స్త్రీ సంగమ పాపము, షష్టీదినమున క్షురకర్మ పాపము ఏకాదశీ భోజనము వలన కలుగును. షష్టి నాడు తైల భోజనము, తృతీయనాడు లవణ భోజనము సప్తమినాడు మాంస భోజనము, పూర్ణిమనాడు ఘృత భోజనము సూర్య సంక్రమణమున సురాపానము, గోచార లోపము, కపట సాక్ష్యము వలన కలుగు పాపము, నిక్షేపమును హరించుట వలన కలుగు పాపము, కన్యాత్వమును భంగపరిచిన పాపము, విశ్వాస ఘాతకునికి కలుగు పాపము, దూడ చనిపోయిన పశువునకు పాలు పితుకువాని పాపము, బ్రాహ్మణునకు ఇచ్చెదనని ప్రతిన చేసి ఈయనీ వాని పాపము, మణికూట పాపము, తులాకోటి పాపము, కన్యాన్నతము వలన కలుగు పాపము, గో అన్నతము వలన కలుగు పాపము ఏకాదశీ భోజనము వలన కలుగును. కావున ఇవి అన్నియూ తెలిసిన నేను ఏకాదశి నాడు ఎట్లు భుజించగలను?

మోహిని పలికెను :-

ఓ రాజేంద్ర ! ఏక భుక్తవతము కలవారు, అయాచిత వ్రతము కలవారు ఉపవాసముచే ద్వాదశిని లంఘించరాదు. గర్భవతులు, గృహస్థులు, బలహీనులు, రోగగ్రస్తులు, శిశువులు, వృద్ధులు ఉపవసించరాదు అని ధర్మ శాస్త్రము చెప్పుచున్నది. యజ్ఞములను ఆచరించువారు, యుద్ధము చేయువారు, పతివ్రతలు ఉపవసించరాదు. ఈ విషయమును నేను మందర పర్వతముపై నున్నపుడే నాకు గౌతమ మహర్షి చెప్పెను. ఇతరులు విష్ణు వాసరమున వ్రతమును ఆచరించవలయును. అగ్ని పరిగ్రహమున్న ద్విజులను గృహస్థులని, ప్రజాపరిపాలనమును చేయువారిని రాజులని, ఎనిమిది నెలలు నిండిన వారిని గర్భవతులని, ఎనిమిది సంవత్సరముల వరకు శిశువులని, ఎక్కువ లంఘణమును చేయువారు క్షీణగాత్రులని, ముడుతలు పడిన శరీరము గలవారు వృద్దులని, వివాహాది మంగల కర్మలలో, మహోత్సవములలో, ప్రవృత్తుల నుండి నివృత్తులగువారు యజ్ఞోద్యతులని, కాయిక వాచిక మానసికములతో భర్త హితమును కోరుచు యోని సంరక్షణా పరురాలు పతివ్రత యని శాస్త్రకోవిదులు చెప్పియున్నారు. వీరందరు ఉపవసించరాదని ధర్మ శాస్త్రము చెప్పుచున్నది. ఇవన్నియు నెందుకు? నీవేకాదశినాడు భుజించిననే నాకు నీయందు ప్రీతి నిలుచును. నీ శిరమును నీవే స్వయముగా ఖండించి ఇచ్చిననూ నాకు ప్రీతికరము కాదు. నీవు ఏకాదశినాడు భుజించినచో అబద్ధవాక్కువగు నీశరీరమును నేను తాకను. వర్ణాశ్రమాచారములన్నింటిలో సత్యమొక్కటే పూజించబడును. విశేషించి నీ వంటి రాజులకు సత్యము పాటించదగినది. సత్యముచే సూర్యుడు తపించును, చంద్రుడు ప్రకాశించును. సత్యము చేతనే భూమి నిలుచుచున్నది. జగత్తు సత్యము చేతనే ధరించబడుచున్నది. సత్యముచేతనే గాలి వీచుచున్నది. అగ్ని మండుచున్నది. ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయూ సత్యాధారముగనే నిలిచి యున్నది. సత్యము వలననే సముద్రము హద్దు దాటుటలేదు. సత్యము వలననే వింధ్య పర్వతము పెరుగుట లేదు. యువతి గర్భధారణ చేయుట లేదు (వివాహము కాకుండా) కాలము నియమమును అతిక్రమించుట లేదు. సత్యమున నిలిచియే వృక్షములు పుష్పములను, ఫలములను చూపుచున్నవి. మానవులకు దివ్యాది భోగములన్నియూ సత్యము నాధారము చేసుకొనియే లభించుచున్నవి. వేయి అశ్వమేధ యాగములకంటే సత్యమే విశిష్టము. అసత్య వాక్యము వలన మద్యపానము వలన కలుగు పాపము సంభవించును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున రుక్మాంగద సంలాపమను ఇరువది మూడవ అధ్యాయము.