నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

41 - దానాది విధివర్ణనమ్

వసువు పలికెను : ఓ బ్రహ్మపుత్రీ! రుక్మాంగద ప్రియురాలా, ఇపుడు స్నానాది పుణ్యకర్మల ఫలమును చెప్పేదను. సావధానముగా వినుము. ఒకసారి భక్తిచే గంగాస్నానము నాచరించినచో లక్షతరములను తరింపచేయును. సామాన్య ప్రదేశమున చేయు సంధ్యోపాసన కంటే గంగానదిలో పుత్రులు పితరులకు తర్పణము గావించినచో అక్షయమగు తృప్తిని కలిగించును. తర్పణమునకు ఎన్ని నువ్వులు ఉపయోగింతురో అన్ని వేల సంవత్సరములు పితృదేవులు స్వర్గమున నుందురు. పితృలోకమున నున్న పితృదేవతలందరు గంగాజలముచే తర్పణము గావించిన అమితమగు తృప్తిని పొందెదరు. సఫలమగు జన్మను సత్సాంతానమును కోరువారు గంగానదికి వెళ్ళి దేవతలకు పితరులకు తర్పణము గావించవలయును. దుర్గతిని పొందిన పితరులు కూడా పుత్రులు దర్బలచే తిలలచే గంగాజలముచే తర్పణముగావించిన శ్రీహరిపదమును పొందెదరు. స్వర్గమున నున్న పితరులు గంగా జలతర్పణముచే మోక్షమును పొందెదరు. అని బ్రహ్మవాక్యము, గంగా జలముచే ఒక మాసము తర్పణము గావించిన పితృదేవతలందరు సుప్రీతులై సూర్య సన్నిభతేజస్కులై అప్సరోగణ సంయుక్తములు, హేమరత్న విభూషితములు, ముక్తా జాలపరీచ్చన్నములు, వేణు వీణానినాదితములు భేరీ శంఖమ్పదంగాది నిర్దోషములు గల, ప్రగ్విభూషితములు, గంధర్వ దేహరుచిరములు, దివ్యభోగ సమన్వితములు అగు విమానములనధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. ప్రతి దినము గంగానదిలో స్నానమాచరించి శివార్చన చేయువాడు ఒకే జన్మతో మోక్షమును పొందును. అగ్నిహోత్రములు, వేదములు, బహు దక్షిణలగు యజ్ఞములు గంగాలింగ పూజలో కోట్యంశముతో కూడా సమములు కావు. పితరుల నుద్దేశించి కాని దేవతల నుద్దేశించి కాని గంగా జలముచే తర్పణము గావించవలయును. వెంటనే నరకములో నున్న పితరులు కూడా తృప్తి చెందెదరు. మృత్కుంభము కంటే తామకుంభములు శతగుణము, స్వర్ణకుంభములే కోటి గుణము పలము లభించును. ఇట్లు అర్ఘ్యమున నైవేద్యమున, బలిపూజాదులందు యధాక్రమముగా పాత్ర విశేషముచే ఫల విశేషము లభించును. విభవమున్ననూ విస్తరముగా విధి నాచరించని వాడు ఆయా వలములను పొందకపోగా దేవద్రోహియనబడును. దేవతలను దర్శించుట పుణ్యము. దర్శనము కంటే స్పర్శ విశేష పుణ్యప్రదము. స్పర్శనము కంటే అర్చనము అర్చనము కంటే ఘృత స్నానము విశేష పుణ్యప్రదము. గంగా జలస్నానము ఘృత స్నానసమమని పండితులు చెప్పియున్నారు. తామ్రపాత్రతో మాగధవ్రస్థ మాత్ర గంగా జలము పితరులకు దేవతలకు తర్పణ గావించిన పుత్రపౌత్రాదులతో స్వర్గమును పొందును. జలము, పాలు, కుశాగ్రములు, ఘృతము, దధి, తేనె, రక్తకరవీరములు, రక్త చందనము అను ఈ అష్టాంగములచే సూర్యునికి అర్ఘ్యము నీయవలయును. గంగాతీరమున శ్రీమహావిష్ణువును, శివుని, సూర్యుని, దుర్గను, బ్రహ్మను ప్రతిష్ఠించినవాడు, వీరి దేవాలయములను నిర్మించినవాడు. ఇతర తీర్థములలో చేసిన దాని కంటే కోటి కోట్ల రెట్లు ఫలము లభించును. గంగాతీర సంభవమగు మృత్తికచే సలక్షణముగా శివలింగములను ప్రతినిత్యము చేసి ప్రతిష్ఠించీ, శక్తి కొలది పూజించి గంగయందు పడవేసినచో అనంత పుణ్యము లభించును. సర్వానంద ప్రదాయిని యగు గంగానది యందు అష్టాక్షరీమంత్రమును జపించిన వానికి మోక్షము చేతిలో నుండును. “ఓం నమోనారాయణాయ' అను మంత్రమును నియమప్యూకముగా గంగానది యందు ఆరుమాసములు జపించువానికి సర్వసిద్ధులు. లభించును. గంగానది యందు "ఓం నమశ్శివాయ" అను మంత్రమును ఇరువది నాలుగులక్షలు జపించిన వాడు సాక్షాత్తు శంకరుడగును. పంక్షాక్షరీ విద్యాసిద్ధుడు సాక్షాత్తు శంకరుడే.అపవిత్రుడైనను పవిత్రుడైననూ జపముచే నిష్పాతకుడగును. గంగను పూజించినచో దేవతలందరూ పూజించిన వారగుదురు. కావున సర్య ప్రయత్నముచే గంగానదిని పూజించవలయును. చతుర్బుజ, త్రినేత్ర, సర్వావయవశోభిత, రత్నకుంభసితాంభోజ వరాభయకర శుభకరి, శ్వేత వస్త్రపరీత, ముక్తామణి విభూషిత, సుప్రసన్న, సువదన, కరుణార్ద్ర హృదయ, సుధాప్లావిత భూపృష్ణ, సదాత్రైలోక్యనమిత, జలమయియగు గంగను ధ్యానించి పూజించి పుణ్యములను పొందును. ఇట్లు మాసార్ధమైనను నిరంతరముగా పూజించినవాడు దేవ సదృశుడు, కాలాంతరమున అధిక ఫలమును పొందును. వైశాఖ శుద్ధసప్తమినాడు జహ్నుమహర్షి కోపముచే గంగను పానము చేసి మరల కర్ణరంధ్రము నుండి విడిచెను. కావున ఆ ప్రదేశమున గగన మేఖల యగు గంగను పూజించవలయును. వైశాఖమున అక్షయ తిథి యందు, కార్తీకమునందు కాని రాత్రి యందు జాగరమును గావించి యవాన్నములచే తిలలచే, విష్ణువును, గంగను, శంభుని భక్తి భావముచే పూజించవలయును. అట్లే సుగంధములచే, పుష్పములచే, కుంకుమాగురు చందనములచే తులసీ బిల్వపత్రాదులచే, మాతులుంగ ఫలాదులచే, విభవానుసారముగా ధూపదీప నైవేద్యములచే పూజించినచో దివ్యవిమానము నధిరోహించి కల్పకోటి శతములు, కల్పకోటి సహస్రములు విష్ణులోకమున విరాజిల్లును, తరువాత భూమండలమును చేరి ధార్మికడగు రాజగును. పుణ్యశీల గుణాన్వితుడై వివిధ భోగములననుభవించి జ్ఞానవంతుడై దేహాంతమున శివ సాయుజ్యమును పొందును. గంగానదిలో చేసిన యజ్ఞము, దానము, తపము, జపము, శ్రాద్ధము, దేవతార్చనము, కోటి కోటి గుణఫలప్రదమగును. ఇక ఇప్పుడు అక్షయ. తృతీయ నాడు గంగాతీరమున యధావిధిగా ఘృతధేనుదానమును గావించిన వానికి కలుగు ఫలమును వినుము.

సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై హేమరత్నమయము చిత్రము హంస భూషితమగు విమానమున పితరులతో కలిసి కల్పకోటి శతములు, కల్పకోటి సహస్రములు బ్రహ్మలోకమున విరాజిల్లును. తరువాత గంగాతీరమున ధనవంతుడగు విప్రునిగా పుట్టును. అంతమున బ్రహ్మజ్ఞానియై మోక్షమును పొందును. అట్లే యథావిధిగా గోదానమును చేసినవాడు గోలోమసంఖ్యా వత్సరములు స్వర్గలోకమున విరాజిల్లును. తరువాత ధనధాన్య సమా కులము, శీల విద్యాయశోయుతము రత్నకాంచన భూపూర్ణమగు కులమున పుట్టి పుత్రపౌత్ర సమన్వితుడై వివిధ భోగముల ననుభవించి మోక్షముననుభవించును. గంగా తీరమున యధావిధిగా వేదపారగుడగు విప్రునికి కపిలగోదానమును గావించినచో నరకములో నున్న పితరులందరు స్వర్గమును చేరెదరు. గంగాతీరమున నివర్తనమితమగు భూమిని దానము చేసినవాడు భూమిరేణు ప్రమాణాబ్దములు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి మరల భూమియందు పుట్టి సప్త ద్వీపాధిపతి యగును. ఇతను నిదురించినచో భేరీ శంఖాది ధ్వనులచే మేల్కాంచును. సర్వధర్మపరాయణుడై సర్వసౌఖ్యముల ననుభవించి, నరకములో నున్న పితరులనందరి స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న వారిని మోక్షమున చేర్చి స్వయముగా జ్ఞానియై పంచపర్వికయగు అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి పరమవైరాగ్యమును పొంది పరబ్రహ్మను చేరును. నివర్తనమనగా సప్తహస్తమితమగు దండములు ముప్పది పొడుగు. దీనిలో త్రిభాగహీనమగుచో గోచర్మ ప్రమాణముగా చెప్పబడినది. బ్రహ్మ విష్ణు శివ దుర్గాప్రీతి కొరకు గంగాతీరమున గ్రామదానమును చేసినవాడు సర్వదానములందు, సర్వయజ్ఞములందు తపోవ్రతాది పుణ్యకార్యము లందు కలుగు సమస్త ఫలమునకు వేయిరెట్లధికమగు ఫలమును పొందును. కోటి సూర్యసంకాశమగు విమానమున విష్ణుపురమున, శివపురమున కాని దేవాదుల చే స్తుతించబడుచు క్రీడించును. ఆలోకములలో భూరేణుమిత వత్సరములు నివసించి అణిమాది గుణయుక్తమగు యోగి కులమున పుట్టును. అక్షయ తిధియందు పదునారు మాసమితమగు స్వర్ణమును విప్రునకు దానము చేసినవాడు లోకములందు విరాజిల్లును. అన్నదానము విష్ణులోకము, తిలదానముచే శివలోకము, రత్నదానముచే బ్రహ్మలోకము, గోహిరణ్య దొనముచే ఇంద్రలోకము, స్వర్ణ వస్త్రాది దానముచే గంధర్వలోకము, కన్యాదానముచే కీర్తి, విద్యాదానముచే ముక్తి ప్రదమగు జ్ఞానము లభించును. గంగాతీరమున భక్తిచే నానావృక్ష సమన్వితమగు ఆరామమును, ఉపవనముచే కూడి యున్న గృహమును నిర్మించి, కదళీనారికేల, కపిత్త, అశోక చంపక పనస బిల్వకదంబాశ్వళ్ల పాటల, ఆమ తాల నాగరుగ వృక్షములచే, ఇతర వృక్షములచే కూడిన, జాతీ విజయ పాటలయుక్తముగా పుష్ప శోభితముగా ఆవాసమును ఏర్పరచి శివునకు, విష్ణువునకు, దుర్గకు, భాస్కరునికి కాని సర్వార్ధ పరికల్పనముగా భక్తితో సమర్పించిన వానికి అచట నున్న వృక్షములనున్న పుష్పమూల ఫల బీజములు, వాటి మూలముల సంఖ్యా ప్రమాణ కల్ప సహస్రములు వారి వారి లోకములో నుండును ఇది సంగ్రహముగా చెప్పిన ఫలితాంశము విస్తరముగా కాదు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున గంగా మాహాత్మ్యమున దానాది విధి వర్ణన మను నలుబది యొకటవ అధ్యాము.