నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

72 - గౌతమాశ్రమ మాహాత్మ్యమ్

మోహిని పలికెను :

వసూ ! పాప ప్రణాశనమగు పుష్కర మాహాత్మ్యమును వింటిని. ఇపుడు గౌతమాశ్రమ మాహాత్మ్యమును తెలుపుము.

వసువు పలికెను :

ఓ మోహినీ దేవీ ! గౌతమాశ్రమ మాహాత్మ్యమును చెప్పేదను వినుము. ఇచటికి వెళ్ళిన వాడు మరల యాతనలను పొందడు. గౌతమాశ్రమము పరమ పావనము. దేవర్షి గణ సేవితము. సర్వపాప ప్రశమనము. సర్వోపద్రవ శాంతి కరము. ఈ ఆశ్రమమున భక్తి భావముతో పన్నెండు సంవత్సరములు సేవించినచో మరల దుఃఖము కలగని శివలోకమును చేరును. ఇచటనే మాయాదేవీ సుతుడు ఉగ్రతపమునాచరించెను. ఇచటనే సర్వపాతక నాశిని యగు గోదావరి గంగ కలదు. ఆ ఋషి తపమాచరించు చుండగా పన్నెండు సంవత్సరములు వర్షము కురియలేదు. ఇట్లు ఘోరమగు క్షామము సర్వ ప్రాణి భయంకరమాయెను. భయంకరమగు దుర్భిక్షమున సకల మునీశ్వరులు నానాదేశములనుండి గౌతమాశ్రమమునకొచ్చి తపమునాచరించు చున్న గౌతమునితో ఇట్లు పలికిరి. మా ప్రాణములు నిలుచుటకు మాకు భోజనము నిమ్ము అని. ఇట్లు పలుకగా గౌతమ మహర్షి దయకలవాడై తనను నమ్మిన వారిని తపోబలముతో ఇట్లు పలికెను.

గౌతమ మహర్షి పలికెను :-

మీరందరు నాయాశ్రమ సమీపమున నివసించుడు. కరువు ఉన్నంతవరకు మీకు భోజనము నిత్తును. ఇట్లు మునులందరిని ఓదార్చి గౌతమ మహర్షి తపోబలముచే ప్రసన్నమగు మనసుతో సర్వార్ధ సాధని యగు గంగను ధ్యానించేను. తలచినంతనే గంగాదేవి అచట భూమినుండి ఉద్భవించెను. భూమిని తడిపిన గంగను చూచి గౌతమ మహర్షి ప్రాతః కాలమున బీజముల నాటి మధ్యాహ్నమున కోసిన ఆ వరియన్నముతో ఋషులను భుజింపచేసెను. ఆయన్నమును భుజించి మునులు తృప్తిని పొందిరి. ఆ గౌతమాశ్రమముననే నివసించిరి. ఇట్లు ప్రతిదినము పండిన వరిధ్యానముచే భక్తి భావముచే వారికి అతిధ్యము నిచ్చెను. ఇట్లు గౌతమ మహర్షి వారిని భుజింప చేయు చుండగా పన్నెండు సంవత్సరముల తరువాత దుర్భిక్షము తొలగి పోయెను. తరువాత ఆ ఋషులందరూ సుభిక్షము రాగానే గౌతమ మహర్షికి చెప్పి తమ తమ ప్రదేశములకు వెళ్ళిరి. ఆగౌతమ మహర్షి ఇంతటి ప్రభావము కలవాడు.చాలాకాలము ఇంద్రియ నిగ్రహముతో తపమునాచరించేను. తపస్సునకు సంతోషించిన శంకరుడు గణములతో ప్రత్యక్షమై వరమును కోరుమని పలికెను. అంతట గౌతమ మహర్షి దేవదేవుడగు ఉమాపతిని చూచి భూమి మీదపడి నమస్కరించెను. వెంటనే లేచి చేతులు జోడించి నాకు నిత్యము నీ పాద భక్తిని ప్రసాదించుము అని పలికెను. నా ఆశ్రమ న మీపమున ఈ పర్వతము మీద ఉన్న నిన్ను ఎప్పుడూ చూచుచుండవలయును. ఇదియే నాకు వరము. ఇట్లు పలుకగా భక్తవాంఛితప్రదుడగు పార్వతీనాధుడు అచట నిలిచి గౌతముని సంతోషింప చేసెను. అప్పటి నుండి ఆ పర్వతమునకు త్ర్యంబకాచలమని పేరు కలిగెను. గోదావరి గంగను చేరి భక్తితో స్నానమాడు వారు సంసార సాగరము నుండి విముక్తులగుదురు. గోదావరీ జలమున స్నానమాడి పర్వతమున ఉన్న శంకరుని ఉపచారములచే పూజించు వారు సాక్షాత్తు మహేశ్వరులగుదురు. ఇట్లు నేను త్ర్యంబక మాహాత్మ్యమును సంక్షేపముగా తెలిపితిని. విస్తరముగా మీతండ్రి యగు బ్రహ్మ కూడా వివరించ జాలడు. అచట గోదావరీ కనుపడు వరము పవిత్రములగు ఆశ్రమము లనేకము కలవు. ఆయాశ్రమములలో స్నానమాడి పితృ దేవతలకు తర్పణము గావించిన వారు వాంఛితార్థములను తప్పక పొందెదరు. పవిత్రమగు గోదావరీ నది కొన్నిచోట్ల ప్రకాశముగా కొన్ని చోట్ల గుప్త ముగా ఈ భూమిపై ప్రవహించుచు తడి పెను. గోదావరి ప్రకాశముగా నున్న ప్రాంతము పరమ పావనము. అచట స్నాన మాత్రముననే సర్వపాప హరము. అచట నుండి పంచవటిని చేరి గోదావరి ప్రకాశ రూపమును పొందెను. పంచవటిలోని గోదావరి యందు స్నానమాడు వారు సకలాభీష్టములను పొందును. త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు భార్యతో అను జునితో పంచవటిని చేరి అచటి గోదావరిని పావనతమమును చేసెను. ఇట్లు నీకు గౌతమాశ్రమ మాహాత్మ్యమంతయూ వివరించితిని. ఈ మాహాత్మ్యము చదువు వారికి విను వారికి సకలాభీష్టములను ప్రసాదించును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున గౌతమాశ్రమ మాహాత్మ్యమను గౌతమ తపశ్చర్యా ప్రభావ వర్ణనమను డెబ్బది రెండవ అధ్యాయము.