నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

68 -  కామోదాఖ్యానమ్

మోహిని పలికెను :

ఓ బ్రాహ్మణోత్తమా ఇపుడు నాకు కామోదామాహాత్మ్యమును చెప్పుము. నీనోటి నుండి విని నేను కృతార్థురాలనై శాంతిని పొందేదను.

వసువు పలికెను :

ఓమోహినీ ! కామోదాఖ్యానమును చెప్పేదను. వినుము. దీనిని విని సర్వ పాప వినిర్ముక్తుడగును. గంగా తీరమున కామోదయను నగరము కలదు. శ్రీహరి ప్రియురాళ్ళ గు కామోదలు దేవతలతో కలిసి ఇచటనే నివసింతురు. దేవదానవులు కలిసి క్షీరసాగర మధనము గావించినపుడు కన్యారత్న చతుష్టయమున కామోదకూడా ఉద్భవించెను. మొదటిది రమా, రెండవది వారుణీ. మూడవది కామోదా నాలుగవది వర. వీరిలో ముగ్గురు కన్యలు శ్రీ మహావిష్ణువును పొందిరి. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞచే వారుణిని అసురులు పొందిరి. అప్పటినుండి లక్ష్మీదేవి శ్రీవిష్ణు వక్షస్థలమున నుండెను. ఈమే సపతి రహితముగా విష్ణుపత్ని అయ్యెను. జరుగబోవు కార్యమును తెలిసిన దేవతలు శ్రీమహావిష్ణ్వాజ్ఞచే కామోదాయను నగరమును నిర్మించి అచట కామోదా దేవిని ప్రతిష్టించి పూజించు చుండిరి. కామోదాదేవి మాత్రము ఎల్లపుడు విష్ణు సంయోగమును కోరుచు ఇచటనే ఉండి భావముతో విష్ణు భార్యాత్వమును పొంది ధ్యాన పరాయణురాలాయెను. సర్వగతుడు భావగమ్యుడగు శ్రీ మహావిష్ణువు ఈమె సమీపముననే యుండెను. ఇచట శ్రీ మహావిష్ణువు దేవదానవ ముని మానవులకు అదృశ్య దేహునిగా ధ్యానమాత్ర గోచరునిగా యుండెను. ఇచట దేవతలు మునులు కూడా శ్రీ హరిని ధ్యానము చేతనే చూతురు. మహానుభావురాలగు కామోదా నవ్వినపుడు సంతోషాతిరేక యుక్తురాలైనపుడు కనుల నుండి నీటి బిందువులు పడును. గంగలో పడిన ఆనందాశ్రువులు కామోదములను పద్మము లగును. ఇవి పసుపు పచ్చగా సుగంధము కలవిగా ఉండును. అదృష్టవశమున ఈ పద్మములను పొందినవారు ఈ పద్మములతో శివుని పూజించ వలయును. అతను వాంఛితకామములను పొందునని పరమేశ్వరాజ్ఞ. కామోదాదేవికీ దుఃఖము కలిగినపుడు దుఃఖాశ్రువులు గంగలో పడి గంధరహితములగు పద్మములు పుట్టును. ఈ పద్మములతో శంకరుని పూజించినచో పూర్వ పాపమోహితుడై సకల దుఃఖములను పొందును. గంగా ద్వారమునకు ఉపరి భాగమున దశయోజన దూరము నున్న కామోద తీర్థమున ఒక సంవత్సరము ద్వాదశాక్షర మంత్రమును జపించ వలయును. వర్దంతమున చైత్ర ద్వాదశినాడు వసంత శోభను చూచి కామోదాదేవి సంతోషముతో నవ్వును. అపుడు ఆ పద్మములను పొందగలడు. మరియొక విధమున పొందజాలడు. ఇచట విష్ణుభక్తి పరాయణుడై కామోద పురమును ధ్యానము చేసి స్నానమాడినచో శ్రీహరి ప్రియుడగును. దేవతలకు పితరులకు కూడా ప్రీతి పాత్రుడగును. ఇచట పన్నెండు సంవత్సరములుండి జపపరాయణుడైనచో ప్రత్యక్షముగా కామోదాదేవిని దర్శించగలడు. ఈ తీర్థమున శుచియై స్నానము చేసినచో తలచిన కోరికలను పొందగలడు. ఈ తీర్థము పరమోత్తమము. భాగ్యవశమున మాత్రమే లభించును. మంచు. కరిగినపుడు మాత్రమే కనిపించును. అపుడైనను చాలా కష్టముచే వెళ్ళ దగిన వికట స్థలమున కలదు. ఇట్లు కామ శుభకరమగు కామోదాఖ్యానమును తెలిపితిని. ఈ ఆఖ్యానమును భక్తిచే వినిన వారు కూడా పాప విముక్తలగుదురు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున కామోదాఖ్యానమను మాహాత్మ్యమను అరువది యెనిమిదవ అధ్యాయము.