నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

28 - కాష్ఠీలోపాఖ్యానమ్

కాష్టీల పలికెను : కాలాంతకయమునిలా ఉన్న రాక్షసుడు పరుగెత్తుతూ వచ్చుటను చూచిన రాక్షసి అనుమానంతో నా భర్తతో ఇట్లు పలికెను. ఓదిగంబరరిపుప్రియా హేమవిభూషిత అనలసన్నిభయగు శక్తిని రాక్షసుని పై ప్రయోగించుము. నా భర్త మరణించవలయును. ఆ రాక్షసి మాటలను వినిన నా భర్త పౌరుషముతో రాక్షసుని వక్షస్థలమున శక్తిని ప్రయోగించేను. ఆ శక్తి అగ్నిహోత్రము వలె జ్వలించుచు పది దిక్కులు ప్రకాశింపచేయుచు దివ్యాంకుశ తీవ్ర వక్రాంతయై కింకిణీశత నాదితయై రక్తచన్దన లిప్తాంగి, రక్తవస్తోపశోభితయగు శక్తి బ్రాహ్మణుని చేతి నుండి విడివడి రాక్షసుని హృదయమున పడెను. రాక్షసుని భస్మము చేసి ఆకాశమునకెగరెను. ఇట్లు బ్రాహ్మణునిచే భర్తను చంపించి సంతోషముతో పులకించి తనను కృతకృత్యులాలిగా భావించెను. అంత రాక్షసి సంతోషించినదై శుభలోచనుడగు బ్రాహ్మణుని గూర్చి ఇట్లు పలికెను. ఓ ప్రియా! రమ్ము సుందరమగు గుహను యధేచ్చగా ప్రవేశించుము. నాతో కలిసి దివ్యమానుషభోగములను అనుభవించుము. అంతట నా భర్త సంతోషముతో పులికించిన వాడై అట్లేయని పలికెను. అపుడు ఆ రాక్షసి నా భర్తను తీసుకని తన గుహలో ప్రవేశించేను. తన భర్త దేహపు బూడిదరాశిని చూడకనే వెళ్ళేను. ఉన్నతమగు తన స్తనములతో నా భర్తను హత్తుకొనెను. గుహలో శయ్యపై నున్న ఆ రాజకుమారిని చూ పెను. ఈ నల్లని క్రీగంటి చూపులు కలది, బింబోష్టి, కాంచనప్రభయగు రాకుమారిని నా భర్త తనకు భార్యగా చేసుకొనుటకు, పాపములు చొరరానికాశీపట్టణము నుండి అపహరించుకొని వచ్చాను. ఆ కాశి శక్తిక్షేత్రము, పుణ్యప్రదము, పాపక్షయకరము, శంకరుని గృహము. ఇచ్చటికి పది కోసుల దూరముననున్నది. ఈ కాశీ నగరమున మరణించిన వారు మరల పుట్టరు. కావున నీవు మరల ఈమె తండ్రిగారి గృహమున చేర్చుము. ఇచటనున్న రత్నములు, శయనములు, ఆసనములు నాతోపాటు సమస్త సంపదను నీ ఇష్ట ప్రకారము అనుభవించుము. నేను నీ కొరకే మౌరుడగు రాక్షసుని చంపించితిని. నీ రూపమును. మోహించి నా భర్తను యమపురికి పంపితిని. కావున నా పైన నమ్మకము నుంచి కామరూపిణిని భక్తురాలినగునన్ను అనుభవించుము అని పలికెను. నా భర్త ఈ మాటలను విని రాజకుమారి సమీపమున కామ తప్తయగు రాక్షసితో ఇట్లు అనుమానముతో మధురముగా పలికెను.

ఓ సుందరీ! నీతి శాస్త్రములందు స్త్రీలను నమ్మరాదని చెప్పియున్నారు. యువకుడగు భర్తను చంపిన స్త్రీ నన్ను మాత్రము ఏల చంపదు. నాకంటే సౌందర్యవంతుడగు మరో పురుషుని చూచి అతని యందు మోహముతో నన్ను కూడా చంపవచ్చును. కాని నేను మాత్రము నమ్మవలయును కావున నిన్ను నమ్మేదను. ఈనాడు కాని, రేపు కాని, పక్షమున కు కాని, మాసమునకుగాని, సంవత్సరమునకుకాని, లేదా నీకు ఇష్టమొచ్చినపుడు యధేచ్చముగా చంపుము. నేను మాత్రము నిన్ను ఆశ్రయించియున్నాను. నీవిట్లే చేయుము. ఇపుడు నీకుపకారమును చేయవలయును. ప్రత్యుపకారమునకై నీకు నన్ను నేను అర్పించుకొనవలయును. నీవు నా కొరకు నిస్సందేహముగా నీ భర్తను చంపితివి. కావున నేను నీకు బదులు పలుకను. అంతట ఆ రాక్షసి నా భర్త మాటలను విని ఇట్లు పలికెను. నమ్మిన వారిని చంపుట బ్రహ్మహత్యతో సమానము. అయిననూ భర్తను చంపించిన నన్ను క్రూరరాక్టిసిగా తలచిననూ నేను నమ్మిన వానిని ఎట్లు చం పెదను. ధర్మ స్వరూపము పరమసూక్ష్మము. సామాన్యముగా తెలియరాదు. దైత్యరాక్షసులు దేవతలు మొదలగు వారికి కూడా తెలియరాదు. ధర్మసూక్ష్మమును తెలియుట కొందరు మానవులు సమర్దులగుదురు. అనిత్యమగు శరీరముచే మోక్షమును సాధించెదరు. ఈ విషయమున పురాణములలోని కొన్ని విషయములను ఇచట చెప్పుచున్నాను. ధర్మమును కాపాడుటకు సర్వశక్తివంతుడు శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించి బహుకష్టములను పొందెను. శ్రీనివాసుడగు రామచంద్రుడు సీత కొరకు లక్ష్మణునితో కలిసి నానా కష్టముల పాలై నాగపాశబంధాదులచే విలపించెను. దేవదేవుడు, విజ్ఞాన స్వరూపుడు, నిఖిలప్రపంచ రూపుడగు శ్రీహరి వసుదేవ పుత్రుడై బాల్యమున కన్నీటితో అల్లరి పనులతో, పెత్తనమును ఉగ్రసేనునికి, అర్జునునికి భృత్యుడుగా కష్టముననుభవించెను. ధర్మాను కూలముగా నుండు పరమేశ్వరుని కర్మలు మన ఊహలంకదనివి. వేదవిభాగమును చేసినవాడు, తత్యదర్శి యజ్ఞరూపుడు, పరాశరపుత్రుడగు వ్యాసుడు స్వయముగా కన్యాత్వమును ధ్వంసము చేయుచు పుట్టి కానీనుడపించుకొనునే. తమ్ముడగు విచిత్రవీర్యుని భార్యలను సంగమించినవాడు. గంగానదికి భర్తయగు శంతనుడు పరివేత్త దీధిషుయనబడెను. అక్క కు వివాహము కాకమునుపు చెల్లెలును వివాహమైనచో అక్కను దిధిషుయందురు. అన్నకు వివాహము కాకమునుపు తమ్మునికి వివాహమైనచో అన్నను పరివేత్త యందురు. సాక్షాత్తు వసువు దీధిషుపుత్రుడుగా భీష్ముడై జన్మించి అంబయను కాశీ రాజపుత్రిక నిందచే మరణించెను. భర్త జీవించియుండగా పరపురుషునిచే పుట్టిన వారు పాండవులు ఒకే తల్లి పిల్లలు. మొదట భర్త మరణించగా రెండవ భర్తతో పుట్టిన వారు కౌరవులు. ఈ కౌరవపాండవ సంకీర్తనము పావనము, పుణ్యప్రదము, పాపనాశకము, యోగమూర్తి, సనాతనుడు, ప్రహ్లాదాదులకు ఉపదేశమును చేసిన వాడగు శ్రీ మహావిష్ణువు యగు శ్రీనరసింహస్వామి వేశ్యాస మాస క్రుడు. దేవదేవుడు, అధిదేవత, రాక్షసనాశకుడు, సంసార వాసనా నాశకుడు, స్వర్ణాక్షభవన వాసి. ఇక జగమదగ్నిపుత్రుడగు పరశురాముడు స్వయముగా సిద్దుడు, తపస్సుచే పాపములను నశింపచేసుకొనినవాడు. క్షత్రియులను సంహరించిన ఈశ్వరుడు కూడా భ్రూణ హత్యాదిపాపములనాచరించేను. స్వయముగా తాను యోగియగు ఋషభుడు లోకమునకు ఉపదేశించు బ్రహ్మణుడై కూడా ధర్మానురోధమును చేయుచు లోకమునకు పీడా కరుడాయెను. నారదుడు ఎన్నిసార్లు పలికిననూ నారదుడే. నారాయణపరుడగు నరుడు. నరహితుడగు అమరుడు. గోపచేష్టాపరాయణుడగు గౌతముడు గౌతముడే, వేద బాహ్యార్థములను బోధించినవాడు. శాస్త్రకారకుడు. వేదములకు ఉపకారమును చేసిన వాడు. ఇక వసిష్టమహర్షి ఊర్వశీపుత్రుడు. అగస్త్యుడు కూడా ఇట్లే వీరిద్దరూ స్వయముగా సర్వసమర్థులు. ఈ వసిష్ఠమహర్షి లోకోపకారము కొరకు ఉత్తమమగు వాసిష్ట శాస్త్రమును రచించెను. ఈ శాస్త్రము పురాణవేద సమమాయెను. ఇతనే సాక్షాత్తు శ్రీరామచంద్రునకు గురువు. ఇతనే విశ్వామిత్రుని శాపముచే తిర్యగ్యోనిగా జన్మించెను. ఇక అగస్త్య మహర్షి వింధ్యపర్వతమును వంచెను. వాతాపిని సంహరించేను. సముద్రజలమును నిశ్శేషముగా త్రాగెను. అట్టి అగస్త్యుడే మృతకుని స్వీకరించెను. దుష్కరమగు తపమును చేయుచుండెను. సూర్యాదివందితుడగు వాడు సాక్షాత్తు సృష్టికర్తయగు బ్రహ్మయే తన పుత్రికారూపమును చూచి మోహించి తన దేహమునే విడిచెను. శుభమును ప్రసాదించువాడు, ప్రకృతి నాధుడగు సాక్షాత్తు శివుడు కూడా దేవపత్నులను సంగ మించినవాడు శ్మశానమున నివసించువాడు. కావున ఓ బ్రాహ్మణోత్తమా, యధావిధిగా సదాచార మునే అనుసరించవలయును. భావనలో ధర్మమే యుండవలయును. హోమములను ఆలోచించరాదు. ఆపవర్యము ధర్మముగా చెప్పబడినది. ధర్మమునకు : ముఖ్యసాధనము ధనము. అట్టి ధర్మమును ధర్మసాధనమగు ధనమును కూడా నేను సంపాదించితిని. ఓ బ్రాహ్మణోత్తమా? ఇచట ధర్మము యొక్క సూక్ష్మస్వరూపమును చెప్పెదను వినుము.

నా భర్త రాజకన్యను అపహరించి స్వకర్మలో నున్న నిన్ను చూచుచు వచ్చినపుడు అతని దోషమేమియూ లేదు. ఈ కన్యనేల తెచ్చితివని నేనడుగగా నీ ఆహారము కొఱకని అసత్యమును పలికెను. ఆ మాటలు విని ఆ కన్య ఇది అబద్ధమని పలికెను. అతని చేష్టల వలన అతని మాట అసత్యమని తెలుసుకొంటిని. భార్యకు అబద్ధము చెప్పిన వారు తత్త్యదర్శులు కారు. విరోధమును ప్రకటించునది భార్య కాదు. నరకములో పడవేయు పాపము నుండి భర్తను భార్య ఉద్దరించవలయును. సంసారమును ప్రదానము చేయు కర్మవల్లీ రూపమగు భార్య మరియొకతె. కావున ఈ విషయమున నా వలన జరిగిన పాపమేమిటో తెలుపుము. ప్రాణములు కంఠగతములుగా నున్ననూ సత్యమునే ఆచరించవలయును. సత్యములో సాక్షాత్తుగా ధర్మము నిలిచియున్నది. సత్యముననే బ్రహ్మయుండును. సత్యముననే సత్పురుషులు ఉందురు. ఈ ప్రపంచమంతయూ సత్యమునే నిలిచియున్నది. సత్యమునే చెప్పవలయునని వేదాంతములందు చెప్పబడియున్నది. బ్రహ్మస్వరూపమునే సత్యమని చెప్పుచున్నాము. సత్యము సర్వకాలములందు శుభము, శుభప్రదము, అసత్యము ఆత్మనాశకరము. అపుడు మాత్రమే నమ్మకమును కలిగించునది. స్త్రీలతో సత్యమును చెప్పరాదు. దానికి కారణమును వినుము. నిధిని గూర్చి స్త్రీకి చేప్పరాదని దోషనివారణము. ఇటు వంటి అసత్యము ధర్మజనకము. ధర్మసూక్ష్మమును చూపునది. దర్భలు, బ్రాహ్మణులు, నీరు, అగ్ని, వేదములు, భూమి, కాలము, దీక్కులు, దేవతలు, సాక్ష్యముగా నున్న దానినే వివాహమందురు. ఆ వివాహముతో ఏర్పడు దానినే దాంపత్యమందురు. వివాహమున సాంగకర్మవిధించబడినది. స్త్రీ పురుషులకు గురుశిష్యులకు ద్విజసంస్కారము విధించబడినది. కావున వధూవరులు పరస్పరము గురు శిష్యులని తెలియవలయును. జ్ఞానము కలవాడు దంపతులలో అణుమాత్ర భేదమును కూడా చూడజాలడు. ఆయాకర్మలననుసరించి స్త్రీ పురుషులకు ప్రాధాన్యము చెప్పబడినది. కొన్ని చోట్ల వ్యత్యయదోషమున్నచో దానికి దైవమే కారణము. దేవాసురమానవ రూపమగు ఈ జగత్తు సర్వము దైవాధీనమే. పూర్వజన్మలో సంచితమగు కర్మవాసనలననుసరించి దైవము మన కామననలను సమకూర్చును. అది శుభము కావచ్చును. ఆ శుభము కావచ్చును. దానిని శాంతమని పండితులు తెలియుదురు. సత్యసమాచారము శమింపచేయు ప్రాణిలోకమును వంచించువాడగును. దీనినంతటిని చక్కగా నేరిగి ఇతను భర్తకాదని తలచి చంపించితిని. నేను చేసిన ఉపకారము వలననే కన్యాత్వమును ధ్వంసము చేయు మహాపాపమునుండి తప్పించబడెను నీ చేతిలో మరణించి పుణ్యాత్ముల లోకమును చేరెను. ధర్మసూక్ష్మమును తెలిసిన నేను భర్తకు ఉపకారమును చేసితిని. అట్లే నీ ప్రాణరక్షణమును చేసిన నాకు విశేషధర్మము కలిగెను. ఆ ధర్మముచే నేమిలభించినదో చక్కగా తెలియుము. రాక్షస జాతిలో పుట్టిన నేను రాక్షసునకు భార్యగా యుండి కూడా కామరూపధారిణినైన నేను ఈ ధర్మ కారణము వలననే బ్రాహ్మణినైతిని (బాహ్మణ భార్య) ధర్మమును, కామమును వర్షించునది ధేనువు, సంతోషమును ప్రసాదించునది నందనవనము. మోక్షమునిచ్చేనది విద్య. తృష్ణ వైతరణినది. ఆ వైతరణిలో పడుచున్న భర్తను నేను ఉద్ధరించితిని. ఉత్తమ వర్ణమును చేర్చుటచే ఈ రాజ కుమారికి కూడా ఉపకరించితిని. ఈమె తండ్రి ఇంటిలో చేరును. నేను నీకు ఈమెకు సర్వకాలములందు రక్షకురాలనుగా నుందును. నాతో కలియుటకు ముందుగా నీకున్న భార్య కూడా తిర్యగ్టన్మను పొంది నాయనుగ్రహమున మోక్షమును పొందును. నేను కూడా పూర్వజన్మమున ఔర్వముని కూతురుగా కందలీయను పేరుతో నుంటిని. లోకోత్తర సౌందర్యవతిని తపఃప్రభావమును ఆశ్రయించితిను. నా తండ్రియగు ఔర్వముని నన్ను దుర్వాసునకు ఇచ్చెను. అతనిని భర్తగా పొందిన నేను పూర్వజన్మకర్మ వశమున భర్తతో ఎపుడూ కలహించుచుంటిని. నా భర్త కోపించి శపించగా భస్మమైతిని. కొంచెము పాప శేషముచే రాక్షసిగా పుట్టితిని. అపుడు ఈ రాక్షసుని భర్తగా పొందితిని. ఇతని పేరు గోభిలుడు. మహా పరాక్రమశాలి ఇతనిని నీవు సంహరించితివి. ఈ రాక్షసునికి యౌవనమున ఒక రాజకన్యా కారణమున నీకు మరణము సంభవించునని శాపము కలిగెను. నేను పూర్వజన్మకర్మ వశమున రాక్షసీ భావపము లేని దాననుగా నుండి శుభకరమగు బుద్దిచే నీకు సహాయము చేసితిని. నా భర్త పాపియై రాజకుమారిని అపహరించుటచే దుఃఖించి నీచే సంహరింప చేసితిని. నీవు నన్ను సర్వభావములచే నమ్మి యుంటివి. నాచే భర్తగా వరించబడితివి కావున నిన్ను సర్వ కాలములందు రక్షించుచుందును. నేను పంచభూతముల సాక్షిగా చేయు ఈ శపథము సత్యము. పరిపూర్ణ పురుషుని సన్నిధిలో నేను చెప్పుచుంటిని. నాతో ఎప్పుడు వాదమును ఆరంభించకుండుము. అన్ని విషయములలోను నీవు సో మాటయందు నిలువవలయును. ఇట్లు పలికిన రాక్షసి మాటలను వినిన నా భర్త ఆమె చేసిన - దానిని చేప్పిన దానిని నిజమని విశ్వసించి అంగీకరించెను. అంతట ఆ రాక్షసి ఆడయేనుగు రూపమును ధరించి, గుహలోని సంపదను, నాభర్తను తన వీపు పై కూర్చోబెట్టుకొని ఆరాజకుమారిని కూడా తీసుకొని ఆకాశమార్గమున కాశీ నగరమునకు బయలుదేరెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహా పురాణమున ఉత్తర భాగమున మోహినీ చరితమున కాష్ఠీలోపాఖ్యానమను ఇరువది యెనిమిదవ అధ్యాయము.