నారద మహా పురాణము - ఉత్తరార్థము

Table of Contents

55 - పురుషోత్తమ మాహాత్మ్యము

మోహినీ దేవి పలికెను :

ఓ బ్రాహ్మణోత్తమా! పురుషోత్తమ క్షేత్రమునకు ఏ సమయమున వెళ్ళవలయును ? పంచతీర్ధిని ఏ విధిచే ఆచరించవలయును? ఒక్కొక్క తీర్థమున స్నానము దానమున ఏ ఫలము కలుగును. దేవ దర్శనమున ఏ ఫలముకలుగునో దానినంతటిని విడివిడిగా తెలుపుము

వసువు పలికెను :

కురుక్షేత్రమున నిరాహారుడై, జితేంద్రియుడై జిత క్రోధుడై యేడు సంవత్సరములు ఒంటి కాలి పై తపస్సు చేయవలయును. జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు ఒకమారు పరుషోత్తమును దర్శించి ఉపవసించినచో అధిక ఫలము లభించును. కావున ఓ సుందరీ! జ్యేష్ఠమాసమున సర్వప్రయత్నముచే సావధానులై స్వర్గమును కోరువారు పురుషోత్తమ క్షేత్రమును దర్శించవలయును. జ్యేష్టమాసమున యధావిధిగా పంచతీర్థిని శుక్ల ద్వాదశిన అచరించి పురుషోత్తమును దర్శించవలయును. ద్వాదశినాడు అవ్యయుడు దేవుడుగు పురుషోత్తముని దర్శించిన వారు శ్రీ విష్ణులోకమును చేరి మరల ఇటకు రారు. కావున జ్యేష్ఠ శుక్ల ద్వాదశిన సర్వ ప్రయత్నములచే పంచ తీర్థమునకు వెళ్ళ వలయును. పురుషోత్తముని దర్శించవలయును. పురుషోత్తమ క్షేత్రమునకు చాలా దూరమున నున్నవారు కూడా ప్రతి దినము పరిశుద్ధమగు మనసుచే పురుషోత్తమమును కీర్తించిననూ, శ్రీవిష్ణు లోకమును చేరును. శ్రద్ధతో సావధానుడై శ్రీకృష్ణయాత్ర నాచరించినవాడు సర్వపాప వినిర్ముక్తుడై శ్రీ విష్ణులోకమును చేరును. పురుషోత్తమగోపురమున ఉన్న శ్రీహరి చక్రమును చూచి భక్తితో నమస్కరించిన వారు పాపము నుండి విముక్తులగుదురు.

ఓ మోహినీ : ఇపుడు పంచతీర్థ విధిని చేప్పెదను. శ్రద్ధగా వినుము. ఈ పంచతీర్థ విధినాచరించిన వారు శ్రీహరికి ప్రియులగుదురు. మార్కండేయ ప్రదమునకు వెళ్ళి ఉత్తరాభిముఖుడై శుచిగా హ్రదమున మూడుమార్లు మునుగవలయును. తరువాత ఈ మంత్రమును చ్చరించవలయును.

అనునది మంత్రము.

సంసార సాగరమును మునిగియున్న, పాపగ్రస్తుడను, జ్ఞానహీనుడనగు నన్ను కాపాడుము. ఓ త్రిపురారీ ! నీకు నమస్కారము. శివునకు శాంతునకు, సర్వపాపహరునకు నమస్కారము. ఓ దేవేశా! ఇచట స్నానమును చేయుచున్నాను. నా పాతకము నశించుగాత అని అర్థము.

నాభి మాత్ర జలమున నిలిచి యధావిధిగా దేవతలను ఋషులను, పితరులను, ఇతరులను మతిమంతుడై తిలోదకముచే తర్పణమును గావించ వలయును. ఇట్లు స్నానము గావించి ఆచనమును చేసి శివాలయమునకు వెళ్ళ వలయును. దేవాలయమున ప్రవేశించి దేవునికి మూడు సార్లు ప్రదక్షిణము గావించి ఆదరముతో మూల మంత్రముచే మార్కండేయేశుని చక్కగా పూజించి అఘోర మంత్రము చే నమస్కరించి క్షమాపణను కోరవలయును”

ఇది మంత్రము. త్రిలోచనా ! నీకు నమస్కారము. చంద్రభూషణా! నీకు నమస్కారము. ఓ పుండరీకాక్షా! నన్ను కాపాడుము. మహాదేవా! నమస్కారము. అని అర్థము. ఇట్లు మార్కండేయ ప్రదమున స్నానమాచరించి శంకరుని దర్శించి దశాశ్వమేధముల ఫలమును పొందును. సర్వ భోగములనను భవించి భూలోకమున బ్రాహ్మణునిగా పుట్టును. బహుశాస్త్రకోవిదుడగును. శంకరయోగమును పొంది మోక్షమునందును. తరువాత కల్పవృక్షమనకు వెళ్ళి మూడు మార్లు ప్రదక్షిణమును చేసి ఉత్తమ భక్తిచే ఈ వటవృక్షమును ఈ మంత్రముచే పూజించ వలయును.

ఇది మంత్రము. అవ్యక్త రూపునకు మహత్స్వరూపునకు, నతపాలకునకు, మహోద కోపవిష్టుడగు న్యగ్రోధమునకు నమస్కారము. నీవు ఎపుడూ హరి నివాసమగు వటమున నుంటివి. ఓన్యగ్రోధమా ! నా పాపమును హరించుము. కల్పవృక్షమా! నీకు నమస్కారము అని యర్థము. ఇట్లు కల్పవృక్షమును చేరి భక్తిచే ప్రదక్షిణమాచరించి, పాము కుబుసమును విడుచునట్లు వెంటనే పాపములను వీడును. కల్పవృక్షఛాయ నాశ్రయించినవారు బ్రహ్మహత్యా పాతకమును కూడా విడిచెదరు. ఇక ఇతర పాపముల కథయేమి? కృష్ణాంగ సంభూతమున పరమగు బ్రహ్మతేజ స్వరూపుడగు న్యగ్రోధాకారామున నున్న శ్రీహరిని దర్శించి నమస్కరించి రాజసూయా శ్వమేధముల ఫలమును పొందును. కులమును ఉద్దరించి విష్ణులోకమును పొందును. శ్రీకృష్ణ భగవానుని ముందున్న గరుడుని నమస్కరించి సర్వపాప వినిర్ముక్తుడై శ్రీహరీలోకమును చేరును. వటవృక్షమును, గరుడుని దర్శించి పురుషోత్తముని చూచినవాడు సంకర్షణుని, సుభద్రను చూచినచో ఉత్తమ గతిని పొందును. శ్రీహరి మందిరమును ప్రవేశించి. మూడు మార్లు ప్రదక్షిణము నాచరించి సంకర్షణునీ సుభద్రను భక్తిచే పూజించి ప్రసన్నుల గావించలవలయును. ఓహలధారీ! ముసలాయుధా! రేవతీకాస్త ! భక్తవత్సలా! బలిశ్రేషా! ధరణీధరా! ప్రలంబారీ! నీకు నమస్కారము. కృష్ణాగ్రజా! నన్ను కాపాడుము. ఇట్లు అజేయుడు, త్రిదశార్చితుడగు అనంతుని ప్రసన్నుని చేసి, కైలాస శిఖరాకారుడు చర్ఘకాస్త, వరాననుడు, నీల వస్త్రధరుడు, ఫణావికటమస్తకుడు, మహాబలుడు, హలధరుడు, ఏక కుండల విభూషితుడు, రోహిణేయుడగు బలభద్రుని భక్తిచే నమస్కరించి అభిమత ఫలమును పొందును. సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకమును పొందును. అచట ప్రళయకాలము వరకు భోగములననుభవించి పుణ్యక్షయమున ఇచట యోగికుల ఉత్తమ జ్ఞానమును పొంది దుర్లభమగు ముక్తిని పొందును. ఇట్లు బలరాముని పూజించి తరువాత సావధానముతో శ్రీకృష్ణుని ద్వాదశాక్షరమంత్రముచే పూజించ వలయును.

భక్తిచే ద్వాదశాక్షర మంత్రముతో ఎల్లకాలము పురుషోత్తముని పూజించువారు మోక్షమును పొందెదరు. ద్వాదశాక్షర తత్పరులు పొందు గతిని దేవతలు, యోగులు, సోమపానమును చేసిన వారు కూడా పొంద జాలరు. కావున జగద్గురువగు శ్రీకృష్ణుని ద్వాదశాక్షర మంత్రముచే గంధ పుష్పాదులచే చక్కగా పూజించి, నమస్కరించి ప్రసన్నుని చేసుకొనవలయును. కృష్ణా ! జగన్నాధా! సర్వపాప నాశన! చాణూరకేశిఘ్నా! కంస నిషూదనా ! నీకు జయము. పద్మపలాశాక్షా! చక్రగదాధరా! నీలమేఘశ్యామా! సర్వసుఖప్రదా! జగత్పూజ్యా! సంసార నాశనా! లోకపతీ! వాంఛాఫలప్రదా! నీకు జయము. ఘోరము, నిస్సారము, దుఃఖ బహుళము, క్రోధగ్రాహాకులము, రౌద్రము విషయోదక సంప్లవము, నానారోగోర్మికలిలము, మోహావర్తము, సుదుస్తరము, అగు సంసార సాగరమున నేను మునిగి యుంటిని. ఓ పురుషోత్తమా! నన్ను కాపాడుము. ఇట్లు వరప్రదుడు భక్తవత్సలుడగు దేవేశుని ప్రసన్నుని చేసుకొని, సర్వ పాపహరుడు, దేవుడు, సర్వకామఫలప్రదుడు, పీన భుజుడు, ద్విభుజుడు, పద్మపత్రాయతేక్షణుడు, మహోరస్కుడు, మహాబాహువు, పీతవస్రుడు, శుభాననుడు, శంఖ చక్రగదాపాణి, ముకుటాంగద భూషణుడు, సర్వలక్షణ సంయుక్తుడు, వనమాలా విభూషితుడు, అగు శ్రీకృష్ణ భగవానుని దర్శించి చేతులు జోడించి దండవత్రణామము లాచరించి సహస్రాశ్వమేథ ఫలమును పొందును. సర్వతీర్థములలో స్నానదానముల వలన కలుగు ఫలము శ్రీకృష్ణుని దర్శించి నమస్కరించినచో కలుగును. సర్వవేదములందు, సర్వ యజ్ఞములందు నుండు ఫలము శ్రీకృష్ణ ప్రణామముచే కలుగును. యధావిధిగా గృహస్థ ధర్మమును నాచరించిన వారికి కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే లభించును. సర్వదానములందు, వ్రతములందు, నియమములందు కలుగు ఫలము శ్రీకృష్ణ ప్రణామముచే లభించును. వానప్రస్థునికి వనవాసముచే కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే కలుగును. యధావిధిగా నాచరించు సన్యాసము చే కలుగు ఫలము శ్రీకృష్ణ సందర్శన ప్రణామములచే కలుగును. ఇంకనూ వేయేల? భక్తిచే శ్రీకృష్ణుని దర్శించినవారు మోక్షమును పొందుదురు. కోటి కల్పములనుండి వచ్చు పాపములచే విముక్తుడై, పరిశుద్దుడై ఉత్తమ సంపద్యుక్తుడై సర్వ సదుగో పేతుడై సర్వకామ సమృద్ధిని పొంది, చక్కని తేజోవంతమగు విమానముచే ఇరువది యొక కులములనుద్ధరించి శ్రీవిష్ణులోకమును పొందును. అచట నూరు కల్పముల కాలము మనకు నచ్చిన భోగములను అనుభవించి చతుర్భుజుడగు శ్రీహరివలె గంధర్వాప్సరసలతో ఆనందించి, అటనుండి భూలోకమున కొచ్చి ఉత్తమ బ్రాహ్మణ కులమున సర్వజ్ఞునిగా సర్వవేద పారంగతునిగా మత్సర రహితునిగా పుట్టును. స్వధర్మ నిరతుడు, శాంతుడు, దాత, భూతహితరతుడు,గానుండి విష్ణు జ్ఞానమును పొంది మోక్షమును పొందును.

తరువాత భక్తవత్సల యగు సుభద్రను మంత్రముచే పూజించి నమస్కరించి, చేతులను జోడించి, ప్రార్థించవలయును.

ఇది మంత్రము. సర్వ ప్రదేశములలో నుండే దేవీ! శుభసౌఖ్యప్రదాత్రీ ! నీ కునమస్కారము. పద్మపత్రాక్షీ ! నన్ను కాపాడుము. కాత్యాయనీ! నీకునమస్కారము. అని అర్థము. ఇట్లు సుభద్రాదేవిని ప్రార్థించి, బలదేవ సోదరి, వరద, శుభప్రద యగు సుభద్రను జగద్ధాత్రిని, జగద్గీతను నమస్కరించి కామగతిగల విమానముచే శ్రీహరిలోకమును చేరును. అచట ప్రళయ కాలము వరకు దేవతల వలే విహరించి, మరల భూలోకమున వేదవిత్తగు బ్రాహ్మణునిగా పుట్టి, శ్రీహరి యోగమును పొంది మోక్షమును పొందును. దేవాలయమునుండి బయలు వెడలి కృతకృత్యుడగును. తరువాత దేవాయ తనమున నమస్కరించి సావధానముగా ఇంద్రనీలమయుడగు శ్రీహరి వాలుకావృతుడుగా ఉన్న ప్రదేశమునకు వెళ్ళవలయును. అచట అంతర్థానముగా ఉన్ననూ శ్రీహరిని నమస్కరించి శ్రీవిష్ణులోకమును చెందును. సర్వదేవమయుడు, హిరణ్య కశ్యప సంహారకుడు, అర్థ సింహదేహుడగు నరసింహ దేవుడున్న ప్రదేశమునకు వెళ్ళి నృహరిని భక్తితో నమస్కరించి సకల పాప వినిర్ముక్తుడగును. ఈ భూలోకమున నరసింహస్వామి భక్తులకు దుష్కృతముండదు. అభీష్టఫలము లభించును. కావున సర్వ ప్రయత్నముచే శ్రీనృసింహదేవుని ఆశ్రయించవలయును. ధర్మార్థ కామమోక్షముల నొసంగును. కావున మహావీర్యుడు సర్వకామ ఫలప్రదుడు, అగు శ్రీ నృహరిని ఎల్లపుడూ భక్తిచే పూజించవలయును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అంత్యజాతిజులు సురశ్రేషుడగు శ్రీనృహరిని భక్తిచే పూజించి, కోటి జన్మలనుండి కలిగిన దు:ఖములనుండి అశుభముల నుండి విముక్తులగుదురు. శ్రీనృహరిని పూజించి అభీష్టములను పొందును. దేవత్వమును అమరేశత్వమును, ధనేశత్వమును, యక్షవిద్యాధరత్వమును, ఇంకా ఇతర ఫలములను కూడా పొందును. ఓ బ్రహ్మపుత్రీ! నరసింహభగవానుని ప్రభావము వినుము. శ్రీనృహరి అజితుడు, అప్రమేయుడు, భుక్తి ముక్తి ప్రదుడు అగు నరహరి సమస్త గుణములను ఎవరు చెప్పగలరు? నరసింహదేవుని ప్రభావమును సంగ్రహముగా చెప్పెదను. ఈ లోకమున కల దైవమానుష సిద్ధులు సమగ్రముగా నృహరి అనుగ్రహముతో లభించును. స్వర్గమున, భూలోకమున, పాతాలమున, ఆకాశమున, జలమున, దేవతలలో పర్వతములందు, నరహరి అనుగ్రహము వలన ‘అడ్డులేని గమనము కలవాడగును. ఈ చరాచరజగత్తులో నృహరికి అసాధ్యమగునది లేదు. శ్రీ నృహరి సర్వదా భక్తానుగ్రహశీలుడు. నృహరిని పూజించు విధానమును భక్తిప కారమును చెప్పెదను . ఈ విధానముచే శ్రీనృహరీ ప్రసన్నుడగును. నృహరితత్త్యము దేవదానవులకు కూడా తెలియదు. శ్రీనృహరి పూజకుడు శాకయావకమూలములను, ఫలములను, పిండిని భుజించుచు కాస కౌపీన ధారియై ధ్యానయు క్రుడు, జితేన్టియుడు కావలయును. అరణ్యమునందుకాని, ఏకాంత ప్రదేశమున కాని, నదీసంగమమున కాని పర్వత ప్రాంతమున కానీ, సిద్ధక్షేత్రమున, ఊషర ప్రదేశమున, నరసింహాశ్రమమున కాని నరసింహస్వామిని ప్రతిష్టించి వాని, స్వయంవ్యక్తుని కాని యధావిధిగా పూజించినచో ఉపపాతకములు కలవాడు, మహాపాతకములు కలవాడు కూడా అన్ని పాతకముల నుండి విముక్తుడగును. మొదట ప్రదక్షిణము నాచరించి నృహరిని పూజించవలయును. గంధపుష్పాదులను, ధూపదీపములను సమర్పించి, శిరసువంచి నమస్కరించి కర్పూర చందనములను, జాతీ పుష్పములను, నరసింహ స్వామి మస్తకమున నుంచవలయును. అపుడు సిద్ధి కలుగును. సర్వకార్యములందు విఘ్నములు కలుగవు. ఎచటా విచారించడు. ఇట్టి నరసింహ భక్తుని బ్రహ్మరుద్రాది దేవతలు కూడా అడ్డగించజాలరు. ఇక దానవులు, సిద్దులు, గంధర్వులు, మానవులు, విద్యాధరులు, యక్షులు, కిన్నరులు, మహోరగులు, ఏల అడ్డగించగలరు. దివ్యశక్తులన్నియూ శ్రీనృహరి దివ్యాగ్నితేజస్సుచే ధ్వంసమగును. ఒకసారి అగ్ని శిఖామంత్రమును జపించి సర్వోపద్రవములను నశింప చేయగలుగును. నృసింహ కవచమును మూడు మార్లు జపించి దైత్యదానవులనుండి కాపాడుకొనగలుగును. భూతములనుండి, పిశాచములనుండి, ఇతర శత్రువర్గమునుండి రక్షణను పొందును. మూడు మార్లు జపించిన కవచము సురాసురులచే కూడా భేదించ శక్యము కాదు. ద్వాదశయోజన పర్యంతము సర్వకాలములందు నృహరి కాపాడు చుండును. శ్రీనరసింహస్వామి మహా బలపరామము కలవాడు అంతటా కాపాడును.

తరువాత బిలద్వారమునకు వెళ్ళి మూడురాత్రులు పవసించి మోదుగు సమిధలచే అగ్నిని ప్రజ్వలింపచేసి మోదుగు సమిధలను పాలు పెరుగు చేతులలో కలిపి హోమమును గావించవలయును. రెండు పద్మాక్షముల జంటలు శకటమును హోమము గావించిన బిలాద్వారము క్షణకాలమున తెరుచుకొనును. అంతట నిస్సందేహముగా బిలద్వారమును ప్రవేశించవలయును. శకటము వెళ్ళు చుండగా చీకటి మోహము నశించును. అచట విశాలమగు రాజ మార్గము కనపడును. నరసింహస్వామిని స్మరించుచు పాతాళమున ప్రవేశించును. పాతాళమునకు వెళ్ళి అవ్యయుడగు నరసింహ స్వామిని జపించవలయును. అంత వీణాచామరపాణులగు వేలస్త్రీలు నగరమునుండి వెలుపలకు వచ్చి స్వాగతమును పలికెదరు. మంత్రసాధకుని చేయి పట్టుకొని నగరమున ప్రవేశింప చేతురు. అపుడు దివ్యమగు రసాయనమును త్రాగించేదరు. రసాయన పానము చేసిన వెంటనే దివ్యదేహుడు మహాబలుడగును. ప్రళయ కాలమువరకు దివ్యకన్యలచే క్రీడించును. భిన్న దేహుడైనచో వాసుదేవుని చేరును. ఈ దివ్యక్రీడలు రుచించనిచో మరల అటనుండి పట్టమును, శూలమును, ఖడ్గమును, రోచనమును, మణిని, రసమును, రసాయనమును, పాదుకలను, అంజనమును, కృష్ణాంజలిని, గుటికను, మనశ్శిలను, మండలమును, అక్షసూత్రమును, సంజీవనిని, సిద్ధ విద్యను, శాస్త్రములను తీసుకొని బయలు దేరును. మండు అగ్ని విస్పులింగ ప్రవాహ చక్రమును హృదయమున న్యాసము గావించును. ఈ న్యాసము ఒక మారు జరిగిన కోటి జన్మముల పాపములు భస్మములగును. విషమున నుంచిన విషమును దహించున శరీరమునున్న కుష్టువ్యాధిని నశింప చేయును. భ్రూణహత్యాది పాపములు నశించును. మహాగ్రహములు పట్టినచో ఈ జ్వాలను ధ్యానించ వలయును. వెంటనే ఆగ్రహములన్నియూ రోదించుచు నశించును. ఈ న్యాసమును బాలుల కంఠమున ధరించినచో ఎల్లకాలము రక్షించును. గండపిండ కృత్యములను నశింప చేయును. వ్యాధులు కలిగినచో సమిధలచే నేయిచే పాలచే హోమమును చేయవలయును. ఇట్లు ఒకనెల నశించును. ఈ చరాచర ప్రపంచమున ఇతనికి అసాధ్యమగున దేదియునుండదు. కోరిన ప్రతి సిద్ధి లభించును. నరసింహస్వామిని నూటా ఎనిమిది సార్లు పూజించి ఏడు పుట్టలలోని మట్టిని స్మశాన మృత్తికను, నాలుగు దారుల కూడలిలో మట్టిని రక్తచందనమును గోక్షీరములను కలిపి ఆరంగుళముల సింహప్రతిమను నిర్మించి గోరోచనముతో భూర్జపత్రమున వ్రాసి మంత్రించి కంఠమున బంధించి సంఖ్యాహీనముగా జపించి, జలాశయమున పూజించి ఇంద్రియ నిగ్రహముతో ఏడు దినములు జపించినంతనే భూమియంతయు జలమయమగును. లేదా పరిశుద్దమగు వృక్షాగ్రమున నృసింహస్వామిని పూజించవయును. నూటా ఎనిమిదిమారులు జపించినచో వర్షమును వారించును. ఈ మంత్రమును పింజకమున బంధించి తిప్పినచో క్షణకాలమున పెనుగాలి వచ్చును. ఏడుమార్లు జపించిన జలముచే తడిపిన నరసింహప్రతిమను ద్వారమున ప్రతిష్టించినచో గోత్రోత్సాదనము జరుగును. ప్రతిమనుద్ధురించిన శాంతి కలుగును. కావున ఎపుడూ మహావీర్యుడు, సర్వకామ ఫలప్రదుడు అగు మృగరాజును పూజించవలయును. నరసింహస్వామిని దర్శించి, విని నమస్కరించి, పూజించవలయును. నరసింహస్వామిని దర్శించిన వారు అక్షయ ఫలములను పొందెదరు. సర్వపాప వినిర్ముక్తులై విష్ణులోకమును చేరెదరు. సింహవపుర్ధరుడగు శ్రీనృహరిని ఒకమారు దర్శించినచో వాక్కాయ మనో సంభవములగు . అన్ని పాపములనుండి విముక్తిని పొందును. సంగ్రామమున, సంకటమున, దుర్గమున చోరవ్యాఘాది పీడలందు, అరణ్యమున, ప్రాణసంకటమున, విషవహ్నిజలములందు, రాజ భయమున, గ్రహరోగాది పీడలందు, నృసింహుని స్మరించినచో సకల సంకటములు తొలగును. సూర్యోదయమున చీకటివలే ఆపదలు నశించును. నరసింహదర్శనమున ఉపద్రవములు నశించును. జనపాతాలమున గుటికను, పాదలేప రసాయనమును, ఇతర వాంఛితములను నృసింహ ప్రసాదమున పొందగలుగును. ఇతరములగు కామములను మనసున సంకల్పించి నరసింహస్వామిని సేవించినచో ఆ కోరికలన్నింటిని నిశ్చయముగా పొందగలుగును.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున మోహినీవసు సంవాదమున పురుషోత్తమ మాహాత్మ్యమున యాబదియైదవ అధ్యాయము.