నారద మహా పురాణము - ఉత్తరార్థము
73 - త్ర్యంబక మాహాత్మ్యమ్
మోహిని పలికెను :
గురువర్యా ! నీవు చెప్పగా గౌతమ పుణ్య చరిత్రమును త్ర్యంబక మహాత్మ్యమును గోదాపంచవటి ప్రభావమును వింటిని. ఇక ఇపుడు పుండరీక పురోద్భవమగు మహిమను వినదలిచితిని. అచట మహాదేవుడు తాండవ నృత్యమునేట్లు చేసెనో ఆపరమ పావన చరిత్రమును తెలుపుము.
వసువు పలికెను :
మహాదేవుడు భక్తవశ్యుడు. సద్యోవరప్రదుడు. భక్తులకు ప్రత్యక్షమగును. వారి అభీష్టమును ప్రసాదించును. ఒకపుడు జైమినియను వ్యాస శిశ్యుడు మునీశ్వరుడు అగ్నివేదాది శిష్యులతో తీర్థములను పర్యటించుచు వెళ్ళుచుండెను. అమరావతిని బోలిన పుండరీకపురమునకు వెళ్ళెను. సర్వఋతు కుసుమయుత మగు వృక్షములచే అలంకరించబడినది. శీతలఛాయలతో శుభ్రవరి జలాశయులచే నానా పక్షి సంఘాకీర్ణములగు రమ్యమగు కలాకరములచే విద్యాధరుల కొంతీ గల నరులచే అస్సరసలచే యువతులచే, ప్రకాశించు భవనములచే విమానము వలె ప్రకాశించు చుండెను. ఆ నగర శోభను చూచి జైమిని మహర్షి ప్రీతి చెందెను. అచటి సరోవరమున స్నానమాడ సంకల్పించేను. దట్టమైన నీడ గలిగి నానాపుష్ప సుగంధి తమగు చెట్టు క్రింద సరసీరమున క్షణకాలము విశ్రమించి స్నానమాడి నిత్యకృత్యములను దేవర్షి పితృ తర్పణమును గావించెను. , పార్థివ లింగమును నిర్మించి అర్ఘ్య పాద్యాద్యుపచారములచే యధావిధిగా పూజించెను. ధూప దీపగంధనైవేధ్యములను సమర్పించేను. సుగంధి పుష్పములతో పూజించి నిలుచునంతలో ప్రసన్నుడగు శంకరుడు సాక్షాత్కరించెను. నానారత్న ప్రభలను వెదజల్లు ఆ పార్థివ లింగమున ప్రత్యక్షమైన శివుని చూచిన జైమిని భూమిమీద దండము వలే పడి నమస్కరించి మరల లేచి చేతులు జోడించి ప్రపన్నార్తిహరుడు హరార్ధాంగుడగు హరిని గూర్చి ఇట్లు పలికెను.
జైమినీ పలికెను :
నేను ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని. దేవదేవా! జగత్పతీ! బ్రహ్మాదిద్యేయుడవగు నీవు దృష్టి గోచరుడవైతివి. అంతట ప్రసన్నుడైన శంకరుడు తన హస్తమును జైమిని శిరస్సుపై నుంచి పుత్రా! ఏమి కావాలయునో చెప్పుము అని పలికెను. శంకరుని మాటలను విన్న జైమిని మహర్షి పార్వతితో విఘ్నేశకుమారులతో మిమ్ములను దర్శించవలయునని కోరెను. వెంటనే శంకరుడు జైమిని కోరికమేరకు దర్శనమిచ్చి ఇంకనూ ఏమి కావలయునని కోరెను. జగద్గురువగు శంకరుని దయను గుర్తించిన జైమిని విస్మయము చెందుచు తాండవనృత్యమును చేయుచున్న తమను చూడవలయునని కోరుచున్నాను అని పలికెను. జైమిని కోరికను నెరవేర్చుటకు పార్వతీపతి నానాక్రీడావిశారదులగు ప్రమధులనందరిని స్మరించెను. ఇట్లు తలచిన వెంటనే నంది భృంగి మొదలగు ప్రమధ గణములన్నియూ కౌతూ హలముతో పరస్పరము మాటలాడుచు వచ్చిరి. పార్వతీ పరమేశులను విఘ్నేశుని కుమారుని నమస్కరించి వారు దేవదేవుని ఆజ్ఞను ఎదురు చూస్తూ నిలిచిరి. అంతట శంకరుడు ఆ విచిత్ర వేష భూషణములు కలవాడై అద్భుత వేషమును ధరించి నటించుటకు సన్నద్ధుడాయెను. కదలాడు సర్ప కంకణములను ధరించి చిరునవ్వు మోముతో శిరమున ఉన్న చనలేఖతో కేశములు మెరయ శోభించు చుండెను. చక్కని కనులు చూపులతో భస్మదేహపు కాంతితో చంద్రుని వెన్నెలను జయించి, జటాకలాపము నుండి బయలు వెడలు గంగతో తడిసిన దేహము కలవాడై లలాట నేత్రము నుండి ప్రకాశించు అగ్నిచేత తపించు చంద్రుడు కలవాడై చంద్రుని నుండి వచ్చిన అమృతముచే బ్రతుకు చున్న లేడి కలవాడుగా నుండెను. కుమార స్వామి వాహనమగు నెమిలి చంచువుచే లాగబడుచున్న సర్ప ఫుంకృతి కలవాడై ప్రవహించు అమృతముచే జీవించు అబ్రయోని తుండుతుంకృతుడై, సర్పములకు భయపడు వినాయక వాహనమగు ఎలుక చేయు ధ్వని కలవాడై పార్వతి వాహనమగు సింహము గర్జనతో భయమును ప్రకటించు కనులు గలనంది అంభారావము కలవాడుగా నుండెను. మాటి మాటికి చేయు పదపాతములచే భూమిని కంపింప చేయుచు ప్రకర్ష వాద్య ధ్వనులచే సంతోషించి పులకాంకురములు కలవాడు దేవ దానవ మకుట కిరీట రత్నరాజిత పాద పద్మునిగా గణేశ కుమారస్వామి పార్వతులచే చూడబడు ముఖాంబుజము కలవాడు సంతోషము పెరిగిన భక్తులు చేయు జయ శబ్దములు కలవాడు పెరిగిన తాండవముతో దిక్కులను ప్రకాశింపచేయుచు శివుడు విరాజిల్లెను. శంకరుని నృత్యమును చూచిన జైమిని మహర్షి ఆనందసాగరమున మునిగి వేదపాదస్తవముతో శివుని స్తుతించెను.
చేయని వానిని దుర్గతిని అగునన్ను నీలగ్రీవుడు విలోహితుడగు శిశుడు స్వీకరించునా? కాల శూలానలాసక్తుని భీతుని వ్యాకులమనసుని నన్ను నీలగ్రీవుడు అగునతడు నన్నెపుడు కటాక్షించునో! ఓ గాయకులారా? మీరు రాగతాళాదులను నేర్వగోరినచో మీరొచ్చి కుబేర మిత్రుని సేవించుడు. ఓ జిహ్వా నీకు శుభమగుగాక. విద్యాదాతయగు ఉమాపతి స్తోత్రమును పెద్దగా పఠించుము. ఓ మనసా నీవీ సకల జగత్తును తెలియవు. శంకరునికి తృప్తిని కలిగించుటే ఓ చిత్తమా? జారుని యువతీవలే గాఢముగా ఆలింగనము చేసుకొనుము. మహామయూఖునకు మహాభుజునకు, మహాశరీరునకు, మహాంబరునకు, మహాకీరీటునకు మహేశ్వరునకు చక్కని స్తుతిని పలికెదను. ఏదో విధముగా రచించబడిన ప్రసన్నములగు చక్కని స్తుతులచే అషాఢుని ఉగ్రుని మహేశుని పూజించేదను. శివునకు త్రిపురాంతకునకు, జగత్రయేశునకు, దిగంబరునకు నమస్కారము. ముఖ్యునకు వికారికి భవునకు భవోద్దరునకు నమస్కారము. బహుప్రజ! అత్యంత విచిత్ర రూప ! నీనుండియే ఈ జగత్తు ప్రభవించినది. దేవతా మకుటతట ఘటిత కిరీట రత్న శోభిత పాద పద్మునకు, భస్మాంగరాగునకు నమస్కారము. నీకంటే పరము అపరము లేదు. సర్పరాజు చంద్రుడు పరస్పరము నీ శిరస్సునందు తమ స్థానము కొరకు యుద్ధము చేయగా చిక్కుపడిన జటా మండలముకల వానికి? సకల జగత్తును లయము చేసుకొను సుందర తాండవునకు నమస్కారము. మురారి నేత్రార్చిత పాద పద్ముని, ఉమాచరణ లాక్షా పరిరక్త పాణిని, నీలకంఠుని హిరణ్య దంతుని శుచి వర్ణుని నమస్కరించు చున్నాను. అనంతుని అవ్యక్తుని, అచింత్యుని, ఏకుని దిగంబరునీ, అంబరవర్లుని, అజుని, పురాణుని, అణువులలో అణువును, మహత్తులలో మహత్తును నమస్కరించు చున్నాను. అంతర్యామిని, ఆత్మ స్వరూపుని, అజుని, చూడజాలక మూర్ఖులు గిరి గహ్వరములందు భ్రమించు చుందురు. పశ్చిమమున ఉత్తరమున దక్షిణమున పూర్వమున క్రింద మీద అంతటా ఉంటివి. ఓ చంద్రమౌళీ ! మహానన్ద స్వరూపుని శోక దుఃఖ రహితుని ఈశ్వరుని హృదయాంబుజమున పరాత్మగా నివసించు వానిని సకల దిక్కులను విదిక్కులను మూలమగు వానిని నమస్కరించు చున్నాను. రాగకాపట్యము వలన పుట్టిన మహామయమగు సంసారముతో భ్రమించు నన్ను చూచి కాపాడుము. ఉత్తమవైద్యుడవని వైద్యునిచే వినుచున్నాను. దుఃఖ జలరాశిని, సుఖలేశహీనుని, పుణ్యస్పర్శ లేని వానిని, బహుపాతకుని, మృత్యువు చేతిలోనున్న వానిని భవరక్షణకై భీతుని ముందు వెనుక ఊర్ధ్వ భాగమున అధోభాగమున చూడుము. పార్వతీ సుందర ముఖావలోకనముచే చల్లబడిన దయాపూరిత మగు నీ చూపను నావచే మేము దురిత సాగరమును దాటవలయును. అపార సంసార సముద్ర మధ్యమున మునిగిన వానిని ఉత్రోశించు వానిని బహురాగములు కలవానిని అసమర్థుడనగు నన్ను ఓ జిష్టమగు దక్షిణచే సేవించబడు వానిని కాపాడుము. పూర్వ జన్మ సంచిత పాతకములను స్మరించి కఠినమగు యముని ముఖమునకు భయపడుచున్నాను.కావున క్షీణాయువునకు, లేదా గతాయువునకు నాకు ఆయుష్యమునిమ్ము. సుగంధులు సుందర భస్మరాగములుగల అనంత భోగములు కలవి మృదులములు సౌమ్యములు, స్థిరములు అగు తన అవయవములచే పురు రూపుడు ఉగ్రుడగు శివుడు నన్ను ఎపుడాలింగనము చేసుకొనును? భవసాగరమున పడి బిలమున పడిన మండూకము వలె క్రోశించుచున్న నన్ను హిరణ్యరూపుడు హిరణ్యనేత్రుడు అగు దేవదేవుడు నన్నెపుడు కాపాడును? చారుస్మితుని, చంద్రకలావతంసుని గౌరీ కటాక్షారుహయుగ్మనేత్రుని, ఆదిత్యవర్ణుని, తమమునకు పరుడగు సాంబుని ఎపుడు చూడగలను?. అనాది ముముక్షువులై మీరు రండు మీ హృదయ పద్మమున శివుని ధ్యానించుడు. వేదాన్త విజ్ఞాన సునిశ్చితార్థులు ఈ శివునే మోక్షము కొరకు ఎల్లపుడూ ధ్యానించు చుందురు. మీరందరూ రండు. ఆధిపత్యమును పొందుడు. యధేచ్చముగా గుహేశుడగు శంకరుని పూజించుడు. పూర్వమీట్లే బ్రహ్మ పూజించి సకలప్రాణి నాధుడాయెను. పుణ్యాత్ములారా? శ్రీ ఆయతనమగు శ్రీకంఠుని నమస్కరించుడు. ఈ శంకురుడు శ్రీమంతుడు శ్రీపతి వన్యపాదుడు. శ్రీలకు ఉదారుడు. వేగధారి ఇతనే. సుపుత్రనాములైననూ యువకుడగు శంకరుని పూజించును. జగద్విధాత యగు హిరణ్య గర్భుడు మొదటి ఇతని నుండే పుట్టెను. ఎక్కువగా చెప్పనేల? శంకరుని ఆశ్రయించుటచే సకలాభీష్టములు నెరవేరును. పూర్వము అగస్త్య మహర్షి శంకరుని పూజించియే జరావర్షితుడగు యువ కుడాయెను. కామనల తుమ్మెదలను ఇతరముల నొదిలి ఎపుడు శివునే ఆశ్రయించ వలయును. ఇతను అపూర్వ సుగంధము కలవాడు. సుకుమారుడు. స్వాదువు మకరందము కలవాడు. ఈ మహేశ్వరుని నీ వాక్కు నమస్కారమును పలికిన సాటిలేని వాడవు సమస్త రామరులను జయించువాడవగుదువు. కావున గర్త సదుడగు యువకుని స్తుతించుము. నీవు మనసు చే చింతించిన దంతయూ సిద్ధించగలదు. దుఃఖ విషయములందు ఎపుడూ ప్రవర్తించకుము. సౌమనస్యము కొరకు రుద్రుని పూజించేదము. పూర్వము అజ్ఞానము వలన నీయెడ చేసిన సకలాపచారములను దయాలుడవగు నీవు పుత్రులను తండ్రివలె క్షమించుము. సంసారమును క్రోధ సర్పము తీవ్రములగు రాగద్వేషము ఉన్మాదలోభాదిదంతములచే కరవబడిన నన్ను దయాలుడగు పినాకి రక్షించుగాక. ఇట్లు స్తుతించి సమాధి అంతమున నిన్ను నమస్కరించువారు జన్మ సర్పదష్టులైననూ నిన్ను చేరెదరు. నీలగ్రీవ సూత్రాత్మచే నేను బ్రహ్మచే - నమస్కరించు బడువాడనే నిన్ను చేరెను. సంసారమను మనోవ్యాధియను భీషణ జ్వరముతో పీడితులను మహామయులను అశేష పాతకాలయాన దూర కాలలోచనులకు అనాధ నాధుడవగు నీకరముచే ఔషధమును పొంది నీలో నివసింతుము. సర్వదేవ దానవ ప్రభువగు ఈశానుడు బలమును, వేగమును సూక్ష్మదృష్టిని ప్రసాదించిన అష్టదిక్పాలకులను, దివస్థలమును, భూస్థలమును, నభస్థలమును అన్నిటినీ జయించగలము. భవునకు హరునకు, భూతిభాసితో రస్కునకు భవాభిభూతి భీతి సంగికి, పిసాకీకి, శివునకు, విశ్వపాలునకు, శాశ్వత హేలకు నమస్కారము. ఇతనీ సేవకుడు చంపబడడు గేలువబడడు. సురపతి పతికీ, ప్రజాపతి పతికి, క్షిపతిపతికీ, అంబికాపతి పతికి, ఉమాపతికి నమస్కారము. వినాయకుని, నమస్కరించు మస్తకముల కిరీట సంఘటిత దేవమస్త కుని, ప్రణతార్తి నాశనుని, కవులకు కవిని నమస్కరించు చున్నాను. యుద్ధమున దేవతలు, యాగమున విప్రులు లోకమున మనుజులు నిన్ను పిలిచేదరు. కుమార స్వామి వలన ఇహ పరములను పొందెదరు. కావున సుబ్రహ్మణ్యుని నమస్కరించు చున్నాను. శివకు జగదంబికకు, శివప్రియకు శివ విగ్రహకు నమస్కారము. చతుష్కపర్దయువతి సు పేశగా ఈమెయే హిమవంతునికీ పుత్రికగా జన్మించెను. హిరణ్యవర్లను, మణనూపురాంఘిని, ప్రసన్నవక్రను, శుకపద్మహస్తను, విశాల నేత్రను, వేదార్థములను బోధించు గౌరిని నమస్కరించు చున్నాను. మేనాతనయకు, వేదార్థములను బోధించు గౌరిని నమస్కరించు చున్నాను. మేనాతనయకు అమేయను కాంతిమతిని, సఖుడు ప్రియుడగు శంకరుని ఆలింగనము చేసుకొని స్తనములను భూతిసితములుగా చేసుకొను పార్వతీ దేవిని నమస్కరించు చున్నాను. శంకరుని శరీర కాంతిచే ప్రకాశించు తలవంచిన మృగరాజము కలది, శంకరుని పార్శ్వమున నివసించునది సకల జగత్తులను క్రియాశీలముల నాచరించు పార్వతీదేవినీ నమస్కరించు చున్నాను. తుంగహీనస్తని, చంద్రచూడ, క్లిష్ట సర్వాంగరాగ, దుఃఖించు ప్రాణులకు ఆత్మకార్తి నొసగి ఆరాధింపచేయు పార్వతిని నమస్కరించు చున్నాను. దీన రక్షా వినోదము కలది, ఆనందదాత్రి సర్వవిద్యలకు, శుభములకు వాక్కులకు అధినేత్రి సూనృతప్రవర్తకురాలు మేనా పుత్రికయగు పార్వతిని నమస్కరించు చున్నాను. సంసారము వలన కలుగు ఘోర తాపమును హరించునది ఆందరిచే ఆనందమును అనుభవింప చేయు ఆభరణేక భోగురాలగు ఓ పార్వతీ దేవీ! నిరంతరము ఉత్తమమగు బుద్దిని ప్రసాదించుము. ఆ బుద్దిచే అన్ని దురితములను తరించేదను. ఓ పార్వతీ నీసములు ఈలోకమన ఎవరు కలరు? నీకు ప్రపంచ సృష్టి వినోదము. శివుడు నీ భర్త. శ్రీహరి దాసుడు. లక్ష్మి అనుచరురాలు. శచీదేవి, సరస్వతి పరిచారికలు. మాకు ధనసంపదల నిమ్ము.
ఇట్లు జైమిని మహర్షి శివుని స్తుతించి ఆనందాశ్రుపూర్ల నేత్రుడై శంకరునికి నమస్కరించెను. తాండవామృత మంగలుడగు శంకరుని మాటి మాటికి నేత్రలముచే పానముచేయుచు సకలాభీష్టములను పొంది అంతమును గణాధిప్యతమును పొందెను. జైమిని చే చేయబడిన ఈ స్తోత్రమును భక్తితో పఠించు వానికి వాక్సిద్ధి మతి సంపదలు ప్రజలు రాజును వరించుట్లు వరించును. - యుద్ధము చేయగోరు రాజు ఈస్తోత్రమును పఠించినచో అతని శత్రువులు యమలోకమును చేరెదరు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులలో ఈ స్తోత్రమును భక్తిచే పఠించినవారు దేహాన్తమున శివపార్శవర్తియై శివసామీప్యమును పొందెదరు. ఈ స్తోత్రమును పఠించువారు బుద్ది కాములైనచో బుద్దిని, పుష్టికాములు పుష్టిని, ధాన్యకాములు ధాన్యమును, పుత్రకాములు పుత్రులను పొందెదరు. ఈ స్తోములోని ఒకశ్లోమును కానీ, కార్డను కాని పాదమును కాని, పాదార్థమును కాని ప్రతినిత్యము పఠించు వారు శివలోకమును చేరెదరు. శివుడు తాండవము చేసిన ప్రదేశము పరమ పవిత్రమగు ప్రదేశము. ఇచట స్నానము చేసిన వారు ముక్తిని పొందెదరు. ఇచట పితరులను శ్రాద్ధమునాచరించినచో పితరులను తరింప చేయును. ఇచట గోవును, కాంచనమును, భూమిని, శయ్యను, వస్త్రమును, ఛత్రమును, జలమును, అన్నమును, బ్రాహ్మణునకు దానమును గావించినచో అది అంతయూ అక్షయమగును. పుండరీకపురమున జరిగిన ఈ కథను వినిన వారు, వినిపించినవారు కూడా రుద్ర ప్రియులగుదురు.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున వసుమోహినీ సంవాదమున త్ర్యంబకేశ్వర మాహాత్మ్యమున వేదపాదస్తవమను డెబ్బది మూడవ అధ్యాయము.
