భాగవత మహా పురాణము
90 - శ్రీకృష్ణ భగవానుని లీలా విహారము
శ్రీశుక ఉవాచ ।
సుఖం స్వపుర్యాం నివసస్ ద్వారకాయాం శ్రియః పతిః ।
సర్వసంపత్సమృద్ధాయాం జుష్టాయాం వృష్ణి పుంగవైః ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికేను --- లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు తన ద్వారకానగరమునందు సుఖముగా నివసించుచుండెను. సకలసంపదలతో సమృద్ధమైన ఆ నగరమును యాదవశ్రేష్ఠులు సేవించిరి.
స్త్రీభిశ్చోత్తమవేషాభిర్నవయౌవనకాంతిభిః ।
కందుకాదిభిర్హర్మ్యేషు క్రీడంతీభిస్తడిద్ద్యుభిః ॥
నూతనయౌవనముయొక్క కాంతీ గల ఆ నగరస్త్రీలు ఉత్తమ వేషములను దాల్చి ప్రాసాదములయందు బంతి, పాటలు మొదలగు వాటితో క్రీడించెడివారు. ఆ స్త్రీలు మెరుపు వలె ప్రకాశించెడివారు.
నిత్యం సంకులమార్గాయాం మదచ్యుద్భిర్మతంగజైః ।
స్వలంకృతైర్భటైర శ్వై రథైశ్చ కనకోజ్జ్వ లైః ॥
ఆ నగరములోని మార్గములు నిత్యము మదమును స్రవించే ఏనుగులతో రద్దీగానుండును. అచట బాగా అలంకరించుకున్న భటులు, గుర్రములు, బంగారము వలె మెరిసిపోయే రథములు ఉండెను.
ఉద్యానోపవనాఢ్యాయాం పుష్పితద్రుమరాజిషు ।
నిర్విశద్భృంగవిహగైర్నాదితాయాం సమంతతః ॥
ఉద్యానములతో, ఉపవనములతో సంపన్న మైన ఆ నగరము పుష్పించిన చెట్ల వరుసలలో ప్రవేశించే తుమ్మెదలచే, పక్షులచే అంతటా నినదింప జేయబడెను.
రేమే షోడశసాహస్రపత్నీనామేకవల్లభః ।
తావద్విచిత్రరూపోఽసౌ తద్గృహేషు మహర్దిషు ॥ ప్రోత్ఫుల్లోత్పలకహ్లరకుముదాంభోజరేణుభిః ।
వాసితామలతోయేషు కూజద్ద్విజకులేషు చ ॥
పదునార వేల భార్యలకు ఈ శ్రీకృష్ణుడు ఒకే ఒక ప్రియుడగు భర్త. గొప్ప సంపదలు గల వారి గృహములయందు ఆయన అన్ని అద్భుత మగు రూపములను దాల్చీ రమించెను. ఆ గృహములకు ఆనుకొని ఉన్న జలాశయములలోని జలములు పూర్తిగా వికసించిన సౌగంధిక పుష్పములు, ఎర్రదామరలు, పద్మముల పుప్పొడులతో సువాసితములై యుండెను. ఆ గృహములలో కూతలు కూసే పక్షుల గుంపులు ఉండెను.
విజహార విహ్యాంభో హ్రదినీషు మహోదయః ।
కుచకుంకుమలిప్తాంగః పరిరబ్ధశ్చ యోషితామ్ ॥
గొప్ప వైభవము గల శ్రీకృష్ణుడు నదుల నీటిలో ప్రవేశించి విహారించేను. ఆయనను యువతులు కౌగిలించగా వారి స్తనములయందలి కుంకుమ ఆయన అవయవములకు అలదుకొనెను.
ఉపగీయమానో గంధర్వైర్మృదంగపణవానకాన్ ।
పాదయద్భిర్ముదా వీణాం సూతమాగధవందిభిః ॥
గంధర్వులు, సూతులు, మాగధులు, వందులు మద్దెళ్లను, డోళ్లను, తప్పెటలను, వీణను వాయిస్తూ ఆయన కీర్తిని గానము చేసెడివారు.
సీచ్యమానోఽచ్యుతస్తాభిర్హసంతీభిస్మ రేచకైః ।
ప్రతిషించన్ విచిక్రీడే యక్షీభిర్యక్షరాడివ ॥
శ్రీకృష్ణ భగవానుని పత్నులు నవ్వుతూ ఆయనపై పిచికారీలతో నీళ్లను పోసి తడి పెడివారు. ఆయన కూడ వారిపై నీళ్లను పోసి తడుపుతూ, యక్ష ప్రభుడగు కుబేరుడు యక్షస్త్రీలతో వలే, క్రీడించేను.
తాః క్లిన్నవస్త్రవివృతోరుకుచప్రదేశాః
సించంత్య ఉద్ధృతబృహత్కబరప్రసూనాః ।
కాంతం స్మ రేచకజి హీరష యోపగుహ్య
జాతస్మరోత్సవలసద్వదనా విరేజుః ॥
శ్రీకృష్ణ పత్నుల వస్త్రములు తడియుటచే ఊరువులు, స్తనముల భాగములు ప్రకటమగుచుండెను. వారు నీటిని ఆయన పై చల్లుచుండగా పెద్ద కొప్పులలోని పువ్వులు జారిపోవుచుండెను. ఆయన చేతిలోని పిచికారీని లాగుకొనగోరి ఆయనను వారు కౌగిలించుచుండిరి. ఆ సమయములో పుట్టిన ప్రేమచే కలిగిన ఉత్సాహముచే ముఖముల శోభ ఇనుమడించి వారు విశేషముగా ప్రకాశించిరి.
కృష్ణస్తు తత్ స్తనవిషజ్జితకుంకుమస్రక్
క్రీడాఽభిషంగధుతకుంతలవృందబంధః ।
సించన్ముహుర్యువతిభిః ప్రతిషి చ్యమానో
రేమే కరేణుభిరి వేభపతిః పరీతః ॥
శ్రీకృష్ణుడా యువతులపై పలుమార్లు నీటిని చల్లగా, వారాయన పై తిరిగి నీటిని చల్లుచుండిరి. ఆయన మెడలోని మాలకు వారి స్తనముల కుంకుమ తగుల్కొనెను. ఆటయందలి పట్టుదలచే ముంగురుల సమూహమును కట్టిన బంధము కదిలిపోవుచుండెను. ఆడు యేనుగులచే చుట్టువారబడిన గజేంద్రుడు వలె, ఆయన వారితో కూడి రమించెను.
నటానాం నర్తకీనాం చ గీతవాద్యోపజీవినామ్ ।
క్రీడాఽలం కారవాసాంసి కృష్ణోఽదాత్తస్య చ స్త్రీయః ॥
శ్రీకృష్ణుడు, ఆయన భార్యలు తాము విహారము కొరకై దాల్చిన వస్త్రములను, అలంకారములను గానవాద్యములపై జీవించే నటులకు, నాట్యకత్తెలకు ఇచ్చిరి.
కృష్ణ స్యైవం విహరతో గత్యాలా పేక్షితస్మితైః ।
నర్మ క్ష్వేలిపరిష్వం గైః స్త్రీణాం కిల హృతా ధియః ॥
ఆ విధముగా విహరిస్తూ శ్రీకృష్ణుడు తన నడక, కబుర్లు, చూపులు, చిరునవ్వులు, సున్నితమైన హాస్యోక్తులు, గడుసైన హాస్యములు, కౌగిలింతలతో ఆ యువతుల హృదయములను దోచావే సెను సుమా।
ఊచుర్ముకుందైకధియోఽగిర ఉన్మత్తవజ్ఞడమ్ ।
చింతయంత్యోఽరవిందాక్షం తాని మే గదతశ్శృణు ।
ఆ యువతుల చిత్తము మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పై ఏకాగ్రమయ్యెను. వారు మౌనముగా ఆయననే ధ్యానించెడివారు. తరువాత వారు పిచ్చివారు వలే ఆలోచన లేకుండా మాటలాడెడివారు. వారి పలుకులను నేను చెప్పెదను. వినుము.
మహిష్య ఊచుః ।
కురరి విలపసి త్వం వీతనిద్రా న శేషే
స్వపితి జగతి రాత్ర్యామీశ్వరో గుప్తబోధః ।
వయమివ సఖి కచ్చిద్గాడనిర్భిన్నచేతా
నలిననయనహాసోదారలీలేక్షి తేన ॥
శ్రీకృష్ణపత్నులు ఇట్లు పలికిరి --- ఓ (ఆడు) లకుముకీ। ఈ జగత్తులో ఈ రాత్రివేళ నీవు నిద్ర మాని రోదిస్తున్నావు. నిద్రించవేమి? శ్రీకృష్ణ భగవానుడు సర్వమును మరచి (సర్వజ్ఞతను ఉపసంహరించి) నిద్రిస్తున్నాడు. ఓ మిత్రురాలా। ఒకచో నీ హృదయము కూడ మాకు వలెనే పద్మములవంటి కన్నులు గల ఆయన చిరునవ్వుతో స్వీకార సూచకముగా విలాసతో చూసే చూపుచే లోతుగా గాయపడలేదు గదా?
నేత్రే నిమీలయసీ నక్తమదృష్ట బంధుః
త్వం రోరవీషి కరుణం బత చక్రవాకి ।
దాస్యం గతా వయమివాచ్యుతపాదజుష్టాం
కిం వా సజం స్పృహయ సే కబ రేణ వోడుమ్ ॥
ఓ చక్రవాకీ! (ఆడు జక్కవ పక్షి) అయ్యో। రాత్రి నీవు కళ్లు మూసుకొని కరుణముగా బిగ్గరగా విలపించెదవు. భర్త కనబడడా యేమి? లేక, నీవు కూడ మా వలెనే శ్రీకృష్ణ భగవానునకు దాసివై ఆయన పాదములను సేవించిన పూల మాలను కేశపాశముపై ధరించ గోరుచున్నావా యేమి?
భో భోస్పదా నిష్ణన సే ఉదన్వన్
అలబ్దనిద్రోఽధిగతప్రజాగరః।
కీం వా ముకుందాపహృతాత్మలాంఛనః
ప్రాప్తాం దశాం త్వం చ గతో దురత్యయామ్ ॥
ఓయీ! ఓయీ! సముద్రుడా! నీకు నిద్ర పట్టదా? నీ అవస్థ జాగారమేనా? నీవు ఎల్లవేళలా ఆక్రోశిస్తూనే ఉంటావు. నీవు కూడ మా వలెనే శ్రీకృష్ణ భగవానుడు కౌస్తుభాది లాంఛనములనపహరించగా అతిక్రమించ శక్యము కాని అవస్థను పొందియున్నావా యేమి?
త్వం యక్ష్మణా బలవతాఽసీ గృహీత ఇందో
క్షీణస్తమో న నిజదీధితిభిః క్షిజోషి ।
కచ్ఛిన్ముకుందగదితాని యథా వయం త్వం
విస్మృత్య భోః స్థగితగీరుపలక్ష్యసే నః ॥
ఓయీ చంద్రుడా! నీకు పెద్ద రోగము పట్టుకున్నది. నీ కిరణములకు చీకటి తగ్గేది లేదు గాని, నీవు క్షీణించిపోతున్నావు. నీవు కూడ మాలాగే శ్రీకృష్ణ భగవానుని మాటలను మరచినావా యేమి? నీకు నోరు మూసుకు పోయినదా? నిన్ను చూస్తే అదే అయి ఉండునని మాకు తోచుచున్నది.
కిం త్వాచరితమస్మాభిర్మలయానిల తేఽప్రియమ్ ।
గోవిందాపాంగనిర్భిన్నే హృదీరయసి నస్మరమ్ ॥
ఓ మలయమారుతమా! గోవిందుని ప్రక్క చూపులచే గాయపడిన మా హృదయమునందు కాముని ఉద్దీపింపజేయుచున్నావు. మేము నీకు ఏమి అపకారమును చేసితిమి?
మేఘ శ్రీమంస్త్వమసి దయితో యాదవేంద్రస్య నూనం
శ్రీవత్సాంకం వయమివ భవాన్ ధ్యాయతి ప్రేమబద్దః । అత్యుత్కంఠశ్శబలహృదయోఽస్మద్విధో బాష్పధారాః
స్మృత్వా స్మృత్వా విసృజసి ముహుర్దుఃఖదస్తత్ప్రసంగః॥
శోభతో కూడిన ఓ మేఘుడా! నీవు యాదవప్రభుడగు శ్రీకృష్ణునకు నిశ్చయముగా ప్రియుడవు. నీవు మావలెనే (ప్రేమకు కట్టుబడి శ్రీవత్సమనే పుట్టుమచ్చ గల శ్రీకృష్ణ భగవానుని ధ్యానించెదవు. ఆయనను మాటి మాటికీ స్మరించి స్మరించి ఉత్కంఠ పెరిగి బేల హృదయముతో నీవు కూడ మావలెనే కన్నీటి ధారలను విడిచి పెట్టుచున్నావు. ఆయనయొక్క ప్రసక్తియే దుఃఖమును కలిగించును.
ప్రియరావపదాని భాష సే మృతసంజీవికయాఽనయా గిరా ।
కరవాణి కిమద్య తే ప్రియం వద మే వల్గితకంఠ కోకిల ॥
ఓ కోకిలా! నీవు రమణీయమగు కంఠముతో ప్రియమగు ధ్వనిని చేసెదవు. నీ శబ్దములు మృతునైననూ బ్రదికించును. ఈనాడు నీకు నేను ఏమీ ప్రియమును చేయవలెనో నాకు చెప్పుము.
న చలసి న వదస్యుదారబుద్దే
క్షితిధర చింతయ సే మహాంతమర్థమ్ ।
అపి బత వసుదేవనందనాంఘ్రిం
వయమివ కామయ సే స్త నైర్విధర్తుమ్ ॥
పెద్ద మనసు గల ఓ పర్వతమా! ఉలుకు పలుకు లేకుండా ఉన్నావు. ఏదో గొప్ప విషయాన్ని ధ్యానిస్తున్నావా యేమి? మేము స్తనములచే వలె నీవు శిఖరముతో వాసు దేవుని పాదమును ధరించ గోరుచున్నావా యేమి?
శుష్యద్ధ్రదాః కర్శితా బత సింధుపత్న్యః ।
సంప్రత్యహస్తకమలశ్రియ ఇష్ట భర్తుః ।
యద్వద్వయం మధుపతేః ప్రణయావలోక
మప్రాప్య ముష్టహృదయాః పురుకర్శితాస్స్మ ॥
సముద్రపత్నులగు ఓ నదులారా! ప్రియభర్త, మథురాధిపతి అగు శ్రీకృష్ణుని ప్రేమతోడి చూపు లభించక ఆయనచే దోచివేయబడిన హృదయములు గల మేము చాల చిక్కిపోతిమి. మా వలెనే మీకు కూడ, అయ్యో!, ప్రియభర్తయగు సముద్రుని అనుగ్రహము మేఘము ద్వారా లభించలేదు. ఈ వేసవిలో జలాశయములు ఎండి, కలువల శోభ తొలగి మీరు కూడ మావలెనే కృశించి యున్నారు.
హంస స్వాగతమాస్యతాం పిబ పయో బ్రూహ్యంగ శౌరేః కథాం
దూతం త్వాం ను విదామ కచ్చిదజితస్స్వస్త్యాస్త ఉక్తం పురా ।
కిం వా నశ్చలసౌహృదస్స్మరతి తం కస్మాద్భజామో వయం
క్షౌ ద్రాలాపయ కామదం శ్రీయమృతే సైవైకనిష్ఠా స్త్రీయామ్ ॥
ఓ హంసా! స్వాగతము, కూర్చుండి పాలను త్రాగుము. . ఓయీ! శూరవంశీయుడగు శ్రీకృష్ణుని వృత్తాంతమును చెప్పుము. నీవు ఆయన దూతవని మాకు తెలుసు. పరాజయమునెరుగని శ్రీకృష్ణుడు సుఖముగా ఉన్నాడా? ఆయన ప్రేమ స్థిరము కాదు. మాకు చెప్పిన మాటలు ఆయనకు గుర్తులో ఉన్నాయా? మేమాయనను ఎందువలన ప్రేమిస్తున్నామో? క్షుద్రుని దూతవగు ఓ హంసా! కోరికలను తీర్చే ఆయనను ఇచ్చటకు పిలువుము. కాని, లక్ష్మిని మాత్రం తీసుకురావద్దు. స్త్రీలలో అనన్యప్రేమ గలది లక్ష్మి ఒక్కతేయేనా? (కాదు).
ఇతీదృశేన భావేన కృష్ణే యోగేశ్వరేశ్వరే ।
క్రీయమాణేన మాధవ్యో లేభిరే పరమాం గతిమ్ ॥
ఈ విధముగా యోగిపుంగవులకు ప్రభుడగు శ్రీకృష్ణ భగవానునిపై ఇటువంటి (అనన్య) ప్రేమను చేసి, ఆయన పత్నులు సర్వోత్కృష్టమగు మోక్షఫలమును పొందిరి.
శ్రుతమాత్రోఽపి యః స్త్రీణాం ప్రసహ్యాకర్షతే మనః ।
ఉరుగాయెరుగీతో వా పశ్యంతీనాం కుతః పునః ॥
అనంతములగు గానములు శ్రీకృష్ణుని అనేకవిధములుగా కీర్తించినవి. ఆయన గురించి విన్నంత మాత్రాన స్త్రీల మనస్సులు బలముగా ఆకర్షించబడును. ఆయనను చూస్తూ ఉండే ఆయన భార్యల మనస్సులు ఆకర్షించబడునని వేరుగా చెప్పవలయునా?
యాస్సంపర్యచరన్ ప్రేమ్ణా పాదసంవాహనాదిభిః ।
జగద్గురుం భర్తృబుద్ధ్యా తాసాం కిం వర్ణ్యతే తపః ॥
జగద్గురువగు శ్రీకృష్ణుని భార్యలు ఆయనకు భర్త అనే భావనతో ప్రేమతో చక్కగా పాదములను నొక్కుట మొదలగు పరిచర్యలను చేసిరి. వారి తపస్సును ఏమని వర్ణించవలెను?
ఏవం వేదోదితం ధర్మమనుతిష్ఠన్ సతాం గతిః ।
గృహం ధర్మార్థకామానాం ముహుశ్చాదర్శయత్పదమ్ ॥
సత్పురుషులకాశ్రయమగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా నిరంతరముగా వేదవిహితమైన ధర్మమునాచరిస్తూ, గృహమే ధర్మార్థకామములకు నిలయమని లోకమునకు ప్రదర్శించెను.
ఆస్థితస్య పరం ధర్మం కృష్ణస్య గృహమేధినామ్ ।
ఆసన్ షోడశసాహస్రం మహిష్యశ్చ శతాధికమ్ ॥
గొప్ప దైన గృహస్థధర్మముననుష్ఠించిన శ్రీకృష్ణునకు పదునారు వేల ఒక వంద (ఎనిమిది) మంది భార్యలు ఉండిరి.
తాసాం స్త్రీరత్నభూతానామష్టౌ యాః ప్రాగుదాహృతాః ।
రుక్మిణీప్రముఖా రాజంస్తత్పుత్రాశ్చానుపూర్వశః ॥
ఓ పరీక్షిన్మహారాజా! యువతీలలామలగు వారిలో రుక్మిణి మొదలగువారు ఎనమండుగురు ప్రముఖులు. వారు, వారి పుత్రుల వివరములు ఇదివరలో చెప్పబడినవి.
ఏకైకస్యాం దశ దశ కృష్ణోఽజీజనదాత్మజాన్ ।
యావత్య ఆత్మనో భార్యా అమోఘగతిరీశ్వరః ॥
జగన్నాథుడగు శ్రీకృష్ణుని సంకల్పము అమోఘము. తనకు ఎంతమంది భార్యలు గలరో వారియందు ఆయన ఒక్కొక్క భార్యయందు పదేసి పుత్రులను కనెను.
తేషాముద్దామవీర్యాణామష్టాదశ మహారథాః ।
ఆసన్నుదారయశస స్తేషాం నామాని మే శృణు ॥
భయంకరమగు పరాక్రమము గల వారిలో పద్దెనిమిది మహారథులు విపులమగు కీర్తిని గడించిరి. వారి పేర్లను నేను చెప్పెదను. వినుము.
ప్రద్యుమ్నశ్చారుద్దశ్చ దీప్తిమాన్ భానురేవ చ ।
సాంబో మధుర్బృహద్భానుశ్చిత్రభానురృకోఽరుణః ॥ పుష్కరో వేదబాహుశ్చ శ్రుతదేవస్సునందనః ॥ చిత్రబాహుర్విరూపశ్చ కవిర్న్యగ్రోధ ఏవ చ ॥
ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు (మనుమడు), దీప్తిమంతుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహుడు, శ్రుతదేవుడు, సునందనుడు, చిత్రబాహుడు, విరూపుడు, కవి, న్యగ్రోధుడు అనునవి వారి పేర్లు.
ఏతేషామపి రాజేంద్ర తనుజానాం మధుద్విషః ।
ప్రద్యుమ్న ఆసీత్ప్రథమః పితృవద్రుక్మిణీసుతః ॥
మహారాజా! మధువును వధించిన శ్రీకృష్ణ భగవానుని పుత్రులగు వీరి లోనున్నూ రుక్మిణి పెద్ద కొడుకు ప్రద్యుమ్నుడు తండ్రిని పోలియుండెను.
స రుక్మిణో దుహితరముపయేమే మహారథః । తస్మాత్సుతోఽనిరుద్ధోఽభూన్నాగాయుతబలాన్వితః ॥
మహారథుడగు ఆ ప్రద్యుమ్నుడు రుక్మియొక్క కుమార్తెను వివాహమాడెను. వారికి పదివేల ఏనుగుల బలము గల అనిరుద్ధుడనే పుత్రుడు కలిగెను.
స చాపి రుక్మిణః పౌత్రీం దౌహిత్రో జగృహే తతః ।
వజ్రస్తస్యాభవద్యస్తు మౌసలాదవ శేషితః ॥
రుక్మికి కూతురు కొడుకైన అనిరుద్ధుడు రుక్మి కొడుకు కూతురుని వివాహమాడెను. వారికి పుట్టినవాడు వజ్రుడు. ముసలము నిమిత్తముగా యదువంశము నాశనము కాగా, వజ్రుడు మాత్రమే మిగిలెను.
ప్రతిబాహురభూత్తస్మాత్సుబాహుస్తస్య చాత్మజః ।
సుబాహోశ్శాంత సేనోఽభూచ్ఛత సేనస్తు తత్సుతః ॥
వజుని పుత్రుడు ప్రతిబాహుడు. ఆయన పుత్రుడు సుబాహుడు. ఆయన పుత్రుడు శాంత సేనుడు. ఆయన పుత్రుడు శతసేనుడు.
న హ్యేతస్మీన్ కులే జాతా అధనా అబహుప్రజాః ।
అల్పాయుషోఽల్పవీర్యాశ్చ అబ్రహ్మణ్యాశ్చ జజ్ఞిరే ॥
ఈ వంశమునందు దరిద్రులు, అధికసంతానము లేనివారు, తక్కువ ఆయుర్దాయము గలవారు, తక్కువ పరాక్రమము గలవారు, బ్రాహ్మణభక్తి లేనివారు పుట్టలేదు. ఇది నిశ్చయము.
యదువంశప్రసూతానాం పుంసాం విఖ్యాతకర్మణామ్ ।
సంఖ్యా న శక్యతే కర్తుమపి వర్షాయుతైర్నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! యదువంశములో పుట్టి లోకప్రసిద్దమైన కర్మలను చేసిన వ్యక్తుల సంఖ్యను నిర్ధారించుట కొన్ని వేల సంవత్సరములచేనైననూ సంభవము కాదు.
తిస్రః కోట్యస్సహస్రాణామష్టాశీతిశతాని చ ।
ఆసన్ యదుకులాచార్యాః కుమారాణామితి శ్రుతమ్ ॥
యదువంశములోని బాలకులకు శిక్షణను గరపిన ఆచార్యుల సంఖ్య మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు అని వినికిడి.
సంఖ్యానం యాదవానాం కః కరిష్యతి మహాఽఽత్మనామ్ ।
యత్రాయుతానామయుతల క్షేణాస్తే స ఆహుకః ॥
యాదవులు మహాత్ములు. వారి సంఖ్యను ఎవడు లెక్కించగలడు? ఆ ఉగ్ర సేనుని రాజ్యములో 1 00 00 00 00 00 000 (పది లక్షల కోట్ల) మంది జనులు ఉండిరి.
దేవాసురాహవహతా దైతేయా యే సుదారుణాః ।
తే చోత్పన్నా మను ష్యేషు ప్రజా దృప్తా బబాధిరే ॥
దేవాసురసంగ్రామములో మరణించిన భయంకరులగు రాక్షసులు మానవులై పుట్టి గర్వముతో ప్రజలను పీడించిరి.
తన్ని గ్రహాయ హరిణా ప్రోక్తా దేవా యదోః కులే ।
అవతీర్ణాః కులశతం తేషామేకాధికం నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! వారిని శిక్షించుటకై శ్రీహరి దేవతలనాదేశించగా, వారు యదువంశములో జన్మించిరి. వారియొక్క వృష్టి-అంధక-ఇత్యాది కులము (మానవ సముదాయము) లు నూట ఒకటి ఉండెను.
తేషాం ప్రమాణం భగవాన్ ప్రభుత్వేనాభవద్దరిః ।
యే చానువర్తినస్తస్య వవృదుస్సర్వయాదవాః ॥
ఆ యాదవులకు పాపములను పోగొట్టే శ్రీకృష్ణ భగవానుడే ప్రభువు, ఆదర్శము ఆయెను. సకలయాదవులు ఆయన ఆజ్ఞను పాలించి వర్ధిల్లిరి.
శయ్యాఽఽసనాటనాలాపక్రీడాస్నానాదికర్మసు ।
న విదుస్సంతమాత్మానం వృష్ణయః కృష్ణ చేతసః ॥
శ్రీకృష్ణునియందు లగ్న మైన చిత్తము గల యాదవులు పరుండుట, కూర్చుండుట, తిరుగుట, మాటలాడుట, క్రీడించుట, స్నానము, భోజనము ఇత్యాది క్రియలలో తమ దేహమును కూడ విస్మరించిరి.
తీర్థం చక్రే నృపోనం యదజని యదుషు స్వస్సరిత్పాదశౌచం
విద్విట్ స్నిగ్లాస్స్వరూపం యయురజితపరా శ్రీర్యదర్దేకన్యయత్నః । యన్నామామంగలఘ్నం శ్రుతమథ గదితం యత్కృతో గోత్రధర్మః
కృష్ణ స్యైతన్న చిత్రం క్షితిభరహరణం కాలచక్రాయుధస్య ॥
శ్రీకృష్ణుడు యదువంశములో అవతరించి విస్తరింపజేసిన కీర్తిచే, ఆయన పాదములను కడిగిన దేవనది గంగ కూడ తక్కువ తీర్థముగా చేయబడినది. ఆయనను విద్వేషించినవారు, ప్రేమించినవారు కూడ ఆయన స్వరూపమును పొందిరి. ఇతరులు లక్ష్మీదేవికొరకై పాట్లు పడుచుండగా, ఆమె ఆయన సేవలో నిమగ్నమయ్యెను. ఆయన పేరు నుడివినా, విన్నా అమంగళములను పోగొట్టును. ఋషుల వంశములలో ధర్మమునాయన నిలబెట్టెను. కాలమనే చక్రమే ఆయుధముగా గల అట్టి శ్రీకృష్ణుడు భూమి బరువును తగ్గించుట ఆశ్చర్యమేమీ కాదు.
జయతి జననివాసో దేవకీజన్మవాదో
యదువరపర్షత్స్వైర్ధోర్భిరసన్నధర్మమ్ ।
స్థిరచరవృజినఘ్నస్సుస్మితశ్రీముఖేన
వ్రజపురవనితానాం వర్ధయన్ కామదేవమ్ ॥
ప్రాణులకు ఆశ్రయమైన శ్రీకృష్ణ భగవానుడు దేవకికి కొడుకై పుట్టినాడనేది మాట వరుసకు చెప్పే మాట మాత్రమే. ఆయన పుట్టుక లేనివాడు. యాదవవీరులు ఆయన సేవకులు. ఆయన తన భుజబలముతో (అనుచరులే భుజములు కాగా) అధర్మమును పొరద్రోలేను. చరాచరప్రాణుల దుఃఖమును పోనాడే ఆయన చక్కని చిరునవ్వుతో శోభిల్లే ముఖముచే బృందావనము లోనే గాక మథురాది నగరములయందు కూడ యువతులకు ప్రేమభావమును, వర్ధిల్ల జేసెను. అట్టి శ్రీకృష్ణుడు సర్వోత్కర్షగానున్నాడు.
ఇత్థం పరస్య నిజవర్త్మరిరక్షయాఽఽత్త-
లీలాతనోస్తదనురూపవిడంబనాని ।
కర్మాణి కర్మకషణాని యదూత్తమస్య
శ్రూయాదముష్య పదయోరనువృత్తిమిచ్ఛన్॥
ఈ విధముగా పరమాత్మ తన వేదమార్గమును రక్షించగోరి విలాసగా దేహమును స్వీకరించి యాదవులలో శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడాయెను. ఆయన ఆ అవతారమునకు తగిన లీలలను చేసెను. ఈ పరమాత్మయొక్క పాదములయందాసక్తిని కోరే భక్తుడు పాపములను పోగొట్టే ఈ లీలలను శ్రవణము చేయవలెను.
మర్త్యస్తయాఽనుసవమేధితయా ముకుంద-
శ్రీమత్కథాశ్రవణకీర్తనచింతయైతి ।
తద్దాము దుస్తరకృతాంతజపాపవర్గం
గ్రామాద్వనం క్షితిభుజోఽపి యయుర్యదర్థాః ॥ ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధే నవతితమోఽధ్యాయః ॥ ॥ దశమ స్కంధస్య ఉత్తరార్ధస్సమాప్తః ॥
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణునియొక్క శోభాయుక్తమగు గాథలను విని - కీర్తించుటచే వాటియందు ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తిని ప్రతిక్షణము వర్ధిల్ల జేసుకొనే మానవుడు ఆ పరమేశ్వర స్వరూపమును పొంది, అతిక్రమించ శక్యము కాని కాలముయొక్క వేగమునుండి నివృత్తుడగును (అమృతత్వమును పొందును). ఆ మోక్షమును కోరియే మహారాజులు కూడ రాజ్యాదికమును విడిచి పెట్టి తపస్సు కై అడవికి వెళ్లిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము ఉత్తరార్ధములో
శ్రీకృష్ణ భగవానుని లీలావిహారమును వర్ణించే
తొంబదియవ అధ్యాయము ముగిసినది.
దశమ స్కంధము ఉత్తరార్ధము ముగిసినది.
హరిః ఓమ్, తత్సత్, శ్రీకృష్ణార్పణమస్తు.
Summary of chapter 90 of the Bhāgavata Mahā Purana is as follows:
The Tenth Skanda concludes with a magnificent summary of the opulences, family expansions, and divine pastimes of Svayam Bhagavān Śrī Kṛshṇa in Dvārakā. Śrī Śukadeva Gosvāmī details how Kṛshṇa lived surrounded by His 16,108 queens, His millions of children and grandchildren, and the vast Vṛshṇi dynasty comprising billions of warriors. The text describes the deep, unalloyed love of the queens of Dvārakā, who were so absorbed in meditating upon Kṛshṇa's lotus feet that they remained completely free from material illusion. Śukadeva Gosvāmī glorifies the supreme efficacy of hearing, chanting, and remembering Śrī Kṛshṇa's pastimes, declaring that anyone who absorbs their mind in the Tenth Skanda achieves complete freedom from the cycle of birth and death, attaining eternal spiritual residence in Vaikuṇṭha alongside Svayam Bhagavān Śrī Kṛshṇa.