47 - ఉద్ధవుడు గోపికలతో మాటలాడుట - భ్రమర గీతము

శ్రీశుక ఉవాచ

తం వీక్ష్య కృష్ణానుచరం వ్రజస్త్రియః

ప్రలంబబాహుం నవకంజలోచనమ్

పీతాంబరం పుష్కరమాలినం లస -  

న్ముఖారవిందం మణి మృష్ట కుండలమ్

 శ్రీశుక మహర్షి పలికెను --- శ్రీకృష్ణుని అనుచరుడగు ఉద్ధవుడు పచ్చని వస్త్రమును, పద్మముల మాలను దాల్చెను. పొడవైన చేతులు, అప్పుడే వికసించిన పద్మముల వంటి కన్నులు, పద్మమువలె ప్రకాశించే ముఖము, మణులు పొదిగిన ఉజ్జ్వలకుండలములు గల ఆయనను గోపికలు చూచిరి.

శుచిస్మితాః కోఽయమపీచ్యదర్శనః కుతశ్చ కస్యాచ్యుతవేష భూషణః,

ఇతి స్మ సర్వాః పరివవ్రురుత్సుకాస్తముత్తమశ్లోకపదాంబుజాశ్రయమ్

మనోహరమైన రూపము, శ్రీకృష్ణ భగవానుని వేషాలంకారములను పోలిన వేషాలంకారములు ఈతడు ఎవడు? ఎక్కడనుండి వచ్చినాడు? ఎవరివాడు? అంటూ స్వచ్ఛమగు చిరునగవు. గల గోపిలకలందరు కుతూహలముతో ఆయన చుట్టూ చేరిరి. ఆయన పుణ్యకీర్తి యగు శ్రీకృష్ణుని పద్మములవంటి పాదములను నమ్ముకున్నవాడు.

తం ప్రశ్రయేణావనతాస్సుసత్కృతం సవ్రీడహాసేక్షణసూనృతాదిభిః

రహస్య పృచ్ఛన్నుపవిష్ట మాసనే విజ్ఞాయ సందేశహరం రమాపతేః

 ఉద్ధవుడు లక్ష్మీపతియగు శ్రీకృష్ణుని సందేశమును తీసుకువచ్చినాడని తెలిసి గోపికలు ఆయనను ఏకాంతములో ఆసనముపై కూర్చుండబెట్టి, సిగ్గుతో కూడిన నవ్వుతో, చూపులతో, మధురభాషణముతో, అర్ఘ్యాదులతో సత్కరించిరి. తరువాత ఆయనకు నమస్కరించి వినయముతో ఇట్లు ప్రశ్నించిరి.

జానీమస్త్వాం యదుపతేః పార్షదం సముపాగతమ్

భర్త్రేహ ప్రేషితః పిత్రోర్భవాన్ ప్రియచికీర్షయా

 తమరు యాదవప్రభుడగు శ్రీకృష్ణుని అనుచరుడవనియు, ఆ ప్రభుడు తన తల్లిదండ్రులకు ప్రీతిని కలిగించగోరి పంపగా నీవు వచ్చినాడవనియు మాకు తెలియును.

 అన్యథా గోవ్రజే తస్య స్మరణీయం న చక్ష్మ హే

స్నేహానుబంధో బంధూనాం మునేరపి సుదుస్త్యజుః

 అట్లు గానిచో (తల్లిదండ్రులు తప్పు), ఆయనకీ గోకులమునందు గుర్తు రాదగ్గది ఏదీ ఉన్నట్లు మాకు కనబడదు. బంధువులయందలి ప్రేమ అనే పాశమును మహర్షులు కూడ తేలికగా విడిచి పెట్టలేరు.

అన్యేష్వర్ధకృతా మైత్రీ యావదర్థవిడంబనమ్

పుంభిః స్త్రీషు కృతా యద్వత్సుమనస్స్వివ షట్పదైః

  మానవుడు బంధువులు కానివారియందు స్నేహమును ఏదో ఒక ప్రయోజనము నిమిత్తముగా చేసి, ప్రయోజనము తీరువరకు స్నేహమును అనుకరించును. పురుషులు స్త్రీలయందు, తుమ్మెదలు పువ్వులయందు చేసే స్నేహము ఈ కోవకు చెందినదియే.

నిస్స్వం త్యజతి గణికా అకల్పం నృపతిం ప్రజాః

అధీతవిద్యా ఆచార్య మృత్విజో దత్త దక్షిణమ్

 వేశ్య సొత్తు లేనివానిని, జనులు సమర్థుడు కాని విద్యాభ్యాసము పూర్తి అయిన విద్యార్థులు ఆచార్యుని, ఋత్విక్కులు దక్షిణలనిచ్చిన యజమానుని విడిచి పెట్టెదరు.

ఖగా వీతఫలం వృక్షం భుక్త్వా చాతిథయో గృహమ్

దగ్ధం మృగాస్తథాఽరణ్యం జారో భుక్త్వా రతాం స్త్రియమ్

 పక్షులు పళ్లు రాలిపోయిన చెట్టును, అతిథులు భుజించిన పిదప ఆ ఇంటిని, మృగములు కాలిపోయిన అడవిని విడిచి పెట్టును. జారులు స్త్రీని అనుభవించి ఆమెకు ప్రేమ ఉన్ననూ విడిచి పెట్టెదరు.

ఇతి గోప్యో హి గోవించే గతవాక్కాయమానసాః

కృష్ణ దూతే వ్రజం యాతే ఉద్ధవే త్యక్తలౌకికాః

 గోపికలు మనోవాక్కాయములతో గోవిందునకే అర్పితమైనవారు. శ్రీకృష్ణుని దూతయై గోకులమునకు వెళ్లిన ఉద్ధవుని యెదుట వారు లోకవ్యవహారములో ఉండే సంకోచమును విడిచి పెట్టిరి.

గాయంత్యః ప్రియకర్మాణి రుదత్యశ్చ గతహొయః

తస్య సంస్మృత్య సంస్కృత్య యాని కైశోరబాల్యయోః

శ్రీకృష్ణుడు చిన్నతనమునుండి పదేళ్ల వయస్సు వరకు చేసిన ప్రీతికరమైన లీలలేవి గలవో వాటిని ఆ గోపికలు మరల మరల గుర్తు చేసుకొని గానము చేయుచుండిరి. ఇంతేగాక, వారు సిగ్గు విడిచి ఏడ్చుచుండిరి.

కాచిన్మధుకరం దృష్ట్వా ధ్యాయంతీ కృష్ణ సంగమమ్

ప్రియప్రస్థాపితం దూతం కల్పయిత్వేదమబ్రవీత్

ఒకామె శ్రీకృష్ణునితోడి కలయికను ధ్యానించుచుండగా తుమ్మెద కనబడెను. ఆమె దానిని ప్రియుడగు శ్రీకృష్ణుడు పంపిన దూతగా కల్పించి ఇట్లు పలికెను.

గోప్యువాచ

మధుప కితవబంధో మా స్పృశాంఘ్రిం సపత్న్యాః కుచవిలులితమాలాకుంకుమశ్మశ్రుభిర్నః

వహతు మధుపతిస్తన్మానినీనాం ప్రసాదం

యదుసదసి విడంబ్యం యస్య దూతస్త్వమీదృక్

 గోపిక ఇట్లు పలికెను --- ఓ తుమ్మెదా! నీవు మోసగాడగు శ్రీకృష్ణునకు పని చేసి పెట్టుదానవు. సవతి యొక్క వక్షఃస్థలముచే నొక్కబడిన వనపూల యందు ఆమె వక్షఃస్థలమునందలి కుంకుమ అంటుకొనగా, అది నీ మీసములకు తగుల్కున్నది. నీవు అట్టి మీసములతో మా పాదములను తాకవద్దు. మథురానగరములోని నాగరికయువతుల ప్రసాదమైన కుంకువును మథురానగరాధిపతియగు శ్రీకృష్ణుడే ధరించి యాదవుల సభలో అపహాస్యము పాలు అగును. అట్టి (కుంకుమ గల) వానికి నీవు ఇట్టి (కుంకుము గల, దూతవు.

సకృదధరసుధాం స్వాం మోహినీం పాయయిత్వా

సుమనస ఇవ సద్యస్తత్య జేఽస్మాన్ భవాదృక్

పరిచరతి కథం తత్పాదపద్మం తు పద్మా

హ్యాపి బత హృతచేతా ఉత్తమశ్లోకజల్పైః

 నీవు తేనెను త్రాగి పూవులను విడిచి పెట్టే మోసగాడవు. శ్రీకృష్ణుడు హడ నీవంటి నీవంటి మోసగాడే. ఆతడు మోహమును కలిగించే అధరామృతమును ఒక్కసారి మాచే పానము చేయించి వెంటనే మమ్ములను విడిచిపెట్టినాడు. ఆ లక్ష్మీదేవియైతే ఇతగాడిని ఎట్లు సేవించు చున్నది చెప్పుమా? అయ్యో! పవిత్రమగు కీర్తి గలవాడు అనే నారదా దుల పొగడ్తలచే ఆమె మనస్సు దోచివేయబడి మోసపోయినది కాబోలు!

కీమిహ బహు షడంఘ్రే గాయసి త్వం యదూనా -  

మధిపతి మగృహాణామగ్రతో నః పురాణమ్

విజయసఖసఖీనాం గీయతాం తత్ప్రసంగః

క్షపితకుచరుజస్తే కల్పయంతీష్టమిష్టాః

ఓ తుమ్మెదా! నీవు అడవిలో నివసించే యెదుట యాదవప్రభుడగు శ్రీకృష్ణుని గురించి అధికప్రసంగమేల చేసెదవు? ఆయన మాకు పాతవాడే. ఆ అర్జునమిత్రునకు కొత్తగా మథురానగర యువతులు సఖురాండ్రైనారు. పోయి వాళ్ల దగ్గర ఆయన ప్రసంగమును గానము చేయుము. ఆయన వారి హృదయములలోని దుఃఖమును పోగొట్టి వారికి ప్రియుడైనాడు. వారు నీకు నీవు కోరిన దానిని ఇచ్చెదరు.

దివి భువి చ రసాయాం కాః స్త్రియస్తద్దురాపాః

కపటరుచిరహాసభ్రూవిజృంభస్య యాస్స్యుః !

చరణరజ ఉపాస్తే యస్య భూతిర్వయం కా

అపి చ కృపణపక్షే హ్యుత్తమశ్లోకశబ్దః

 శ్రీకృష్ణుడు మోసగాడు. వాని అందమైన చిరునవ్వునకు, కనుబొమల ఏగుపునకు లొంగిపోని స్త్రీ స్వర్గమునందు కాని, భూలోకమునందు కాని, పాతాళమునందు కాని ఎవరు గలరు? (ఎవ్వరూ లేరు). సాక్షాత్తుగా లక్ష్మీదేవి వాని పాదధూళిని సేవించుచున్నది. వానికి నూ లెక్క (యెంత? (ఏమీ కాదు). కానైతే, దానికి ఉత్తమశ్లోకుడు (గొప్ప కీర్తి గలగాడు) అనే బిరు చము గలదు. ఆ బిరుదము దీసులపై దయ చూపువానికి మాత్రమే సార్ధకమగును సుమా! (శ్రీకృష్ణుడట్లు చేయుట లేదు గనుక, వానికి ఆ వీరుడు స్వర్గమని వానితో చెప్పుము).

విసృజ శిరసి పాదం వేద్మ్యహం చాటుకారైః

అనునయవిదుష స్తేఽభ్యేత్య దౌల్యైల్యేర్ముకుందాత్

స్వకృత ఇహ విసృష్టాపత్యపత్యస్యలోకా

వ్యసృజనకృతచేతాః కిం సు సంధేయమస్మిన్

ఓ తుమ్మెదా! నీ నక్కవినయములు కట్టి పెట్టు. నీ తల పైనున్న నా కాలిని విడిచి పెట్టుము. ఇట్టి దూతకార్యములను, ప్రియవచనములను ఆ మోసగాడగు శ్రీకృష్ణుని వద్ద నేర్చి పండితుడవైనావని నాకు తెలియును, శ్రీకృష్ణుడు చపలచిత్తుడు. ఆయన కొరకు మేము పిల్లలను, భర్తలను, పర లోకమును కూడ వదిలి పెడితే, ఆయన మమ్ములనీ బృందావనములో విడిచి పెట్టినాడు. వానితో సంధి చేసుకొని మేము పొందేది ఏమున్నది?

మృగయురివ కపీంద్రం వివ్యధే లుబ్ధధర్మా

స్త్రీయమకృత విరూపాం స్త్రీజితః కామయానామ్

బలిమపి బలిమత్త్వాఽవేష్టయద్ ధ్వాంక్షవద్యః

తదలమసితసఖ్యైర్ధుస్త్యజస్తత్కథార్థః

 క్రూర (కిరాత) స్వభావము గల ఈతడు రామావతారములో వానరరాజగు వాలిని వేటగాడు వలె (దాగియుండి) సంహరించెను. ఇంతేగాక, ఒక స్త్రీకి వశుడై తనను ప్రేమించుచున్న మరియొక (శూర్పణఖ) ను వికృత రూపము గలదానినిగా చేసెను. ఈతడు మహాబలి సమర్పించిన పూజాదికమును కాకి వలె స్వీకరించి ఆతనిని పాశములచే బంధింప జేసెను. కావున, ఈ నల్లవాని స్నేహములు మనకిక వద్దు. కాని, వాని లీలల ప్రసంగమును విడువ లేకున్నాము.

యదనుచరీతలీలాకర్ణ పీయూషవిపుట్ -  

సకృదధన విధూతద్వంద్వధర్మా వినష్టాః

సపది గృహకుటుంబం దీనముత్సృజ్య దీనా

బహవ ఇహ విహంగా భిక్షుచర్యాం చరంతి

 ఆ శ్రీకృష్ణుని అవతారచరితములనే లీలలు చెవులకు అమృతము పలె నుండును. ఆ అమృతము యొక్క ఒక్క బిందువునైననూ ఒక్కసారి ఆస్వాదించిన వ్యక్తికి సుఖదుఃఖది ద్వంద్వములయందలి ఆసక్తి కడిగివేయబడును. అట్టివారు లౌకికజీవనములో ఇమడలేక గాలిలో కలిసిపోయెదరు. ఇట్టివారు ఎంతోమంది ఈ లోకములో ఇల్లును, దీనులైన కుటుంబములోని వ్యక్తులను విడిచి పెట్టి సుఖము లేకుండా పక్షులవలె భిక్షాటనము చేస్తూ జీవించెదరు. (ఈయనను నమ్ముకున్నవారి గతి యింతే).   

వయమృతమివ జిహ్మవ్యాహృతం శ్రద్ధధానాః కులికరుతమివాజ్ఞః కృష్ణ వధ్వో హరిణ్యః

దదృశురసకృదేతత్తన్నఖస్పర్శతీవ్ర -  స్మరరుజ ఉపమంత్రిన్ భణ్యతామన్యవార్తా

 ఓ దూతా! కృష్ణ సారమృగము యొక్క ప్రియురాండ్రైన ఆడు లేళ్లు వేటగాని గానమును విని అది మోసమని తెలియక వాని వలలో పడి దుఃఖించును. అదే విధముగా, మేము కూడ ఇతగాడి అసత్యవచనములను సత్యములని నమ్మి ఈ పరిస్థితిని పలుమార్లు చూచితిమి. ఈతని చేతి గోళ్ల స్పర్శచే ప్రేమ అధికమై పీడనే పొందితిమి. చాలు చాలు. ఇంకేదైనా వార్తను చెప్పుము.

ప్రియసఖ పునరాగాః ప్రేయసా ప్రేషితః కిం

వరయ కిమనురుంధే మాననీయెఽసి మేంఽగ

నయసి కథమిహాస్మాన్ దుస్త్యజద్వంద్వపార్శ్వం

సతతమురసి సౌమ్య శ్రీర్వభూస్సాకమాస్తే

ఓయీ! నీవు శ్రీకృష్ణుని ప్రియమిత్రుడవు గదా! ప్రియుడగు శ్రీకృష్ణుడు పంపగా మరల విచ్చేసినావా? నీకేదేని కోరిక ఉన్నచో కోరుకొనుము. నిన్ను గౌరపించుట నా ధర్మము. ఇప్పుడు నీవు మమ్ములను ఆ శ్రీకృష్ణుని వద్దకు తీసుకుపోయెదవా? అది సరియగునా? సరియగునా? ఆయన ఇప్పటికే జతగట్టి యున్నాడు. ఆతనికి ఆ జత విడువ శక్యము కాదు. ఓ ప్రియదర్శనా! ఆతనికి తోడుగా వక్షఃస్థలము పై లక్ష్మీదేవి అనే సుందరి ఎల్లవేళలా కాపురమున్నది సుమా!

అపి బత మధుపుర్యామార్యపుత్రోఽధునాఽఽస్తే

స్మరతి స పితృగేహాన్ సౌమ్య బంధూంశ్చ గోపాన్

క్వచిదపి స కథా నః కిం కరీణాం గృణీతే

 భుజముగురుసుగంధం మూర్ధ్న్యధాస్యత్కదా ను

 ఓ ప్రియదర్శనా! పూజనీయుడగు నందుని కొడుకు ఇప్పుడు మథురానగరిలోనే ఉన్నాడా? ఆతడు తండ్రి యింటిని, బంధువులను, గోపాలకులనైనా స్మరించునా? దాసీలమగు మాగురించి ఎప్పుడైనా మాటలాడునా? ఆతడు అగురువు యొక్క పరిమళము గల భుజమును మా తలపై ఎప్పుడు ఉంచగలడు?

శ్రీశుక ఉవాచ

అథోద్ధవో నిశమ్యైవం కృష్ణ దర్శనలాలసాః

సాంత్వయన్ ప్రియసందేశైర్గో పీరిదమభాషత

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోపికలు శ్రీకృష్ణుని చూచుటయందు ఈ విధమైన ఉత్కంఠను కలిగియున్నారనే విషయమును చూచిన ఉద్ధవుడు అప్పుడు వారిని ప్రియుడగు శ్రీకృష్ణుని సందేశవాక్యములతో ఓదార్చి ఇట్లు పలికెను.

ఉద్ధవ ఉవాచ

అహో యూయం స్మ పూర్ణార్థా భవత్యో లోకపూజితాః

వాసుదేవే భగవతి యాసామిత్యర్పితం మనః

ఉద్ధవుడిట్లు పలికెను --- ఆహా! మీరు నిశ్చయముగా కృతార్థులు. మిమ్ములను లోకములు పూజించును. ఎందుకంటే, మీ మనస్సు శ్రీకృష్ణ భగవానునియందు ఇంతగా సమర్పితమైనది.

దానవ్రతతపోహోమజపస్వాధ్యాయసంయమైః

శ్రేయోభిర్వివిధైశ్చాన్యైః కృష్ణే భక్తిర్హి సాధ్యతే

 దానములు, వ్రతములు, తపస్సులు, హోమములు, జపములు, వేదాధ్యయనము, ఇంద్రియనిగ్రహము, ఇతరములగు కల్యాణ సాధనములు పరిపక్వమైనప్పుడు శ్రీకృష్ణునియందు భక్తి కలుగును.

భగవత్యుత్తమశ్లోకే భవతిభిరనుత్తమా !

భక్తిః ప్రవర్తితా దిష్ట్యా మునీనామపి దుర్లభా

 ఉత్తమకీర్తియగు శ్రీకృష్ణ భగవానునియందు మీరు సర్వోత్తమమైన భక్తిని చేసిరి. ఇది మంగళము. ఇట్టి భక్తి మునులకు కూడ సాధ్యము కాదు.

దిష్ట్యా పుత్రాన్ పతీన్ దేహాస్ స్వజనాస్ భవనాని చ

హిత్వాఽవృణీత యూయం యత్కృష్ణాఖ్యం పురుషం పరమ్

మీరు పుత్రులను, భర్తలను, దేహాభిమానమును, తమ వారిని, ఇళ్లను కూడ విడిచి పురుషోత్తముడగు శ్రీకృష్ణుని వరించిరి. ఇది మంగళము.

సర్వాత్మభావ్యోధికృతో భవతీ నామధోక్షజే

విరహేణ మహాభాగా మహాన్మేఽనుగ్రహః కృతః

 ఓ గొప్ప భాగ్యవతులారా! శ్రీకృష్ణుని యథార్థతత్త్వము ఇంద్రియగోచరము కాని సర్వాత్మత్వము. దానిని మీరు పొందిరి. మీ విరహము కారణముగా ఈ సందర్భమును కనుట అనేది నాకు గొప్ప అనుగ్రహమైనది.

శ్రూయతాం ప్రియసందేశో భవతీనాం సుఖావహః

 యమాదాయాగతో భద్రా అహం భర్తూ రహస్కరః

 ఓ మంగళవతులారా! శ్రీకృష్ణ ప్రభునకు రహస్యకార్యములను చేసి పెట్టే నేను ఆయన సందేశమును తీసుకొని వచ్చినాను. మీకు ప్రియుడగు శ్రీకృష్ణుని సందేశము మీకు సుఖమును కలిగించగలదు. వినుడు.

శ్రీభగవానువాచ

భవతీనాం వియోగో మే న హి సర్వాత్మనా క్వచిత్

యథా భూతాని భూతేషు ఖం వాయ్వగ్నిర్జలం మహీ

 తథాఽహం చ మనఃప్రాణభూతేంద్రియగుణాశ్రయః

శ్రీకృష్ణ భగవానుడిట్లు చెప్పెను --  సర్వమునకు ఆత్మ (సారతత్త్వము) నేనే. కాబట్టి నాకు ఎప్పుడైననూ ఎక్క డైననూ మీ వియోగము లేనే లేదు. ఆకాశము, వాయువు, అగ్ని, జలములు, పృథివి అనే పంచభూతములు ప్రాణులన్నింటియందు వ్యాపించి యున్నవి. అదే విధముగా, మనస్సు, ప్రాణాపానాదులు, ఇంద్రియములు, పంచభూతములు, సత్త్వరజస్తమోగుణములు ఆనువాటికి అధిష్ఠానముగా నేనే ఉన్నాను.

 ఆత్మన్యేవాత్మనాఽఽత్మానం సృజే హన్మ్యసుపాలయే

ఆత్మమాయాఽనుభానేన భూతేంద్రియగుణాత్మనా

 నేను నా మాయాశక్తి యొక్క ప్రభావముచే నన్ను నాయందే నాచేతనే పంచభూతములు, ఇంద్రియములు, సత్త్వరజస్తమోగుణముల రూపముగా క్రమముగా సృష్టించి, పాలించి, ఉపసంహరించెదను.

ఆత్మా జ్ఞానమయశ్శుద్ధో వ్యతిరిక్తోఽగుణాన్వయః

సుషుప్తిస్వప్నజాగ్రద్భిర్మా యావృత్తిభిరీయతే

జ్ఞానఘనమగు ఆత్మయందు ధర్మాధర్మముల స్పర్శ గాని, సత్త్వ రజస్తమోగుణముల అనువృత్తి గాని లేదు. ఆత్మ దేహేంద్రియాదులకంటె విలక్షణము. మాయాశక్తి జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు అవస్థలుగా ప్రకటమగుచున్నది. ఆ అవస్థల సాక్షిగా ఆత్మ అనుభవమునకు వచ్చును.

యేనేంద్రియార్థాన్ ధ్యాయేత మృహస్వప్నవదుత్తితః

తన్నిరుంధ్యాదింద్రియాణి వినిద్రః ప్రత్యపద్యత

నిద్ర లేచినవాడు మిథ్యయే అయిన స్వప్నమును గురించి ధ్యానించును. అదే విధముగా మనస్సు మిథ్యయే అయిన ఇంద్రియవిషములగు శబ్దాదులను ధ్యానించును. దేహేంద్రియాదుల మనుగడ కూడ మనస్సు యొక్క చలనము పైననే ఆధారపడును. అట్టి మనస్సును మనము జాగరూకులమై నిగ్రహించవలెను.

ఏతదంతస్సమామ్నాయో యోగస్సాంఖ్యం మనీషిణామ్

త్యాగస్తపో దమస్సత్యం సముద్రాంతా ఇవాపగాః

 నదులు అంతమయ్యేది. సముద్రములోనే. అదే విధముగా వివేకవంతులకు వేదముచే చెప్పబడిన సాధనకలాపము, కర్మయోగము, జ్ఞాసయోగము, త్యాగము, తపస్సు, ఇంద్రియనిగ్రహము, సత్యము అనువాటికి అన్నింటికీ పర్యవసానము (ఫలము) ఈ మనోనిగ్రహమే.

యత్త్వహం భవతీనాం వై దూరే వర్తే ప్రియో దృశామ్

మనసస్సన్నికర్షార్థం మదసుధ్యాన కామ్యయా

ప్రియుడనగు నేను మీ కన్నులకు దూరముగా నుండుట వాస్తవమే. మీరు సన్నే నిరంతరముగా ధ్యానిస్తూ మనస్సుతో నా సన్నిధిని అనుభవించాలనే ఆకాంక్షతో మాత్రమే నేను మీకు దూరముగా నున్నాను.

యథా దూరచరే ప్రేష్ఠే మన ఆవిశ్య వర్తతే

స్త్రీణాం చ న తథా చేతస్సన్నికృష్టేఽవేక్షి గోచరే

 స్త్రీలకు దూరమునకు వెళ్లిన ప్రియతమునియందు ఏ విధముగానైతే మనస్సు ఏకాగ్రమై నిలుచునో, ఆ విధముగా దగ్గరగా కంటికి కనబడుతూ ఉండేవానియందు మనస్సు నిలబడదు.

మయ్యా వేశ్య మనః కృత్స్నం విముక్తాశేషవృత్తి యత్

అసుస్మరంత్యో మాం నిత్యమచిరాన్మాము పైష్యథ

సకలవృత్తులను విడిచి పెట్టి మనస్సును పూర్ణముగా నాయందు ఏకాగ్రము చేసి ఎల్లవేళలా నన్నే స్మరించుడు. మీరు తొందరలో నన్ను పొందగలరు.

యా మయా క్రీడతా రాత్ర్యాం వనేఽస్మిన్ ప్రజ ఆస్థితాః

అలబ్ధరాసాః కల్యాణ్యో మాఽఽపుర్మద్వీర్యచింతయా

 ఓ పుణ్యవతులారా! గోకులములో ఉంటూ, నేను బృందావనములో క్రీడించినప్పుడు నాతో రాసక్రీడలో పాల్గొనని గోపికలు నా లీలలనే ధ్యానిస్తూ నన్ను పొందిరి.

శ్రీశుక ఉవాచ

ఏవం ప్రియతమాదిష్టమాకర్ణ్య వ్రజయోషితః

తా ఊచురుద్ధవం ప్రీతాస్తత్సందేశాగతస్మృతీః

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రియతముడగు శ్రీకృష్ణుడు పంపిన ఈ సందేశమును విని ఆ గోపికలు ఆనందమును పొందిరి. వారికి ఆ, సందేశము లీలలు గుర్తుకు వచ్చెను. ఉద్ధవునితో నిట్లనిరి.

గోప్య ఊచుః

దిష్ట్యా కహితో హతః కంసో యదూనాం సానుగోఽఘకృత్

దిష్ట్యాఽప్తైర్లబ్ధసర్వార్థైః కుశల్యా స్వేఽచ్యుతోఽధునా

 గోపికలిట్లు పలికిరి --- యాదవులకు శత్రువై పాపములను చేసిన కంసుడు వాని అనుచరులతో సహా వధించబడినాడు. ఇది మంగళము. శ్రీకృష్ణ భగవానుని ఆప్తులు సకలసంపదలను పొందినారు. వారితో కూడి ఆయన క్షేమముగా నున్నాడు. ఇది మంగళము.

కచ్చిద్గదాగ్రజస్సౌమ్య కరోతి పురయోషితామ్

ప్రీతిం నస్స్నిగ్ధసవ్రీడహా సోదా రేక్షణార్చితః

 ఓ ప్రియదర్శనా! గదుని తమ్ముడగు శ్రీకృష్ణుని మేము ప్రేమ నిండిన చూపులతో, సిగ్గుతో కూడిన చిరునవ్వుతో, కోరికలను తీర్చే చూపులతో సత్కరించితిమి. ఆయన మథురానగరములోని యువతులకు ప్రీతిని కలిగించుచున్నాడా?   

కథం రతివిశేషజ్ఞః ప్రియశ్చ వరయోషితామ్

నానుబధ్యేత తద్వాక్యైర్విభ్రమైశ్చానుభాజితః

 ప్రేమ అనే కళ బాగా తెలిసిన శ్రీకృష్ణుడు సుందరమైన యువతులకు ప్రియుడు అగును. వారు తమ పలుకులతో, విలాసలతో ఆయనను సత్క రించెదరు. ఆయన వారికి వశము కాకుండా ఎట్లుండును? (వశమగును).

అపి స్మరతి నస్సాధో గోవిందః ప్రస్తుతే క్వచిత్

గోష్ఠీ మధ్యే పురస్త్రీణాం గ్రామ్యా స్స్వైరకథాంఽతరే

 ఓ సజ్జనుడా! గోవిందుడు నగరమునందలి యువతుల సభామధ్యమునందు యథేచ్ఛగా విహరిస్తూ కబుర్లాడుచుండును. ఆ ప్రసంగముల మధ్యలో పల్లెటూరివారమగు మమ్ములను స్మరించునా?

తాః కిం నిశాస్స్మరతి యాసు తదా ప్రియాభిః

బృందావనే కుముదకుందశశాంకరమ్యే

 రేమే క్వణచ్చరణనూపురరాసగోష్ఠ్యాం

అస్మాభిరీడితమనోజ్ఞకథః కదాచిత్

 అందరిచే కొనియాడబడే మనోహరములైన లీలలు గల శ్రీకృష్ణుడు బృందావనములో నుండెడివాడు. అప్పుడు తెల్ల కలువలు; తెల్ల గన్నేరు పువ్వులు, చంద్రునితో సుందరమైన అడవిలో రాససభ జరిగెడిది. మా కాలియందెల ధ్వనితో నినదించే ఆ సభలో ఆతడు ప్రియురాండ్రమగు మాతో రమించెడివాడు. ఆ రాత్రులను ఆతడు ఒకప్పుడైనా స్మరించునా?

అప్యేష్యతీహ దాశార్హస్తప్తాస్స్వకృతయా శుచా

సంజీవయన్ను నో గాత్రైర్యథేంద్రోవనమంబుదైః

దాశార్హవంశీయుడగు శ్రీకృష్ణుని నిమిత్తముగా మేము దుఃఖముతో తపించబడుచున్నాము. పర్జన్యాధిపతియగు ఇంద్రుడు మేఘములతో వచ్చి అడవిని ఉజ్జీవింపజేయును. అదే విధముగా ఆతడు వచ్చి తన కరచరణాదులతో మమ్ములను ఉజ్జీవింప జేయునా?

కస్మాత్కృష్ణ ఇహాయాతి ప్రాప్తరాజ్యో హతాహితః

నరేంద్రకన్యా ఉద్వాహ్య ప్రీతస్సర్వసుహృద్వృతః

శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎందుకు వచ్చును? (రాడు). ఆతడు శత్రువును వధించి రాజ్యమును పొందినాడు. మహారాజకన్యలను వివాహమాడి సుఖించును. ఆతని చుట్టూ బంధువులు ఉండెదరు.

కిమస్మాభిర్వనౌకాభిరన్యాభిర్వా మహాత్మనః

శ్రీపతేరాప్తకామస్య క్రియేతాఽర్థః కృతాత్మనః

 శ్రీకృష్ణుడు మహాత్ముడు, లక్ష్మీపతి. ఆయన సిద్ధించినవాడు, మనోనిగ్రహము గలవాడు. ఆయనకు అడవిలో నివసించే మనము గాని, ఇతర స్త్రీలు గాని చేసే ఉపకారమేమున్నది?

పరం సౌఖ్యం హి నైరాశ్యం స్వైరిణ్యప్యాహ పింగలా

తజ్జనతీనాం నః కృష్ణష్ణే తథాకప్యాశా దురత్యయా

ఆశ లేకుండుట గొప్ప సౌఖ్యమని వేశ్యయగు పింగళ కూడ చెప్పెను. మనకా విషయము తెలియును. అయిననూ, మాకు శ్రీకృష్ణునియందు అతిక్రమించ శక్యము కాని అట్టి ఆశ గలదు.

క ఉత్స హేత సంత్యక్తుముత్తమశ్లోకసంవిదమ్

అనిచ్ఛతోఽపి యస్య శ్రీరంగాన్న చ్యవతే క్వచిత్

పుణ్యకీర్తియగు శ్రీకృష్ణుని ఏకాంతవార్తను విడిచి పెట్టుటకు ఎవడు ఉత్సాహపడును? (ఎవడైననూ విడిచి పెట్టడు). ఆయన కోరకున్ననూ లక్ష్మీదేవి ఆయన దేహమును ఏనాడైననూ విడిచి పెట్టదు.

సరిచ్ఛైలవనోద్దేశా గావో వేణురవా ఇమే

సంకర్షణ సహాయేన కృష్ణే నాచరితాః ప్రభో

ఓ ఉద్ధవప్రభూ! ఈ నదులు, పర్వతములు, అడవులలోని ప్రదేశములు, గోవులు, వేణునాదములు, బలదేవుడు తోడుగా గల శ్రీకృష్ణునిచే సేవించబడినవియే.

పునః పువస్స్మారయంతి నందగోపసుతం బత

శ్రీనికేతైస్తత్పదకైర్విస్మర్తుం నైవ శక్నుమః

అయ్యో! శోభకు నిలయములైన ఆ నందగోపుని పుత్రుడగు శ్రీకృష్ణుని కాలి గురుతులచే ఈ ప్రదేశములు ఆయననే మరల మరల గుర్తుకు తెస్తున్నవి. మేమాతనిని సుతరాము మరువ లేకున్నాము.   

గత్యా లలితయోదారహాసలీలావలోకనైః

మాధ్వ్యా గిరా హృతధియః కథం తం విస్మరామ హే

 అందమైన నడకతో, మనోరథములను పూరించే చిరునవ్వుతో, విలాసలతో కూడిన చూపులతో ఆ శ్రీకృష్ణుడు మా మనసులను దోచినాడు. మేమాయనను ఎట్లు మరువగలము? (మరువలేము).

హే నాథ హే రమానాథ వ్రజనాథార్తి నాశన

మగ్నముద్ధర గోవింద గోకులం వృజినార్ణవాత్

ఓ గోవిందా! మాకు, లక్ష్మీదేవికి, గోకులమునకు రక్షకుడవు నీవే. దుఃఖములను పోగొట్టువాడా! దుఃఖసముద్రములో మునిగిపోవుచున్న గోకులమును ఉద్ధరించుము.

శ్రీశుక ఉవాచ

తతసాః కృష్ణ సందేశైర్వ్య పేతవిరహజ్వరాః

ఉద్ధవం పూజయాంచక్రుర్ జ్ఞాత్వాఽఽత్మానమధోక్షజమ్

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుని సందేశవచనములచే గోపికల విరహతాపము దూరమ య్యేను. తరువాత వారు శ్రీకృష్ణుని స్వరూపము ఇంద్రియగోచరము కాద నియు, ఆయన ఆత్మరూపుడనియు తెలుసుకొని, ఉద్ధవుని పూజించిరి.

ఉవాస కతిచిన్మాసాన్ గోపీనాం వినుదఞ్ఛుచః

కృష్ణలీలాకథాం గాయన్ రమయామాస గోకులమ్

 ఉద్ధవుడు గోపికల శోకములను పోగొడుతూ అక్కడనే కొన్ని మాసములు నివసించెను. ఆయన శ్రీకృష్ణుని లీలల గాథలను గానము చేస్తూ గోకులమును రమింప జేసెను.

యావంత్యహాని నందస్య వ్రజేఽవాల్సీత్స ఉద్ధవః

వ్రజౌకసాం క్షణప్రాయాణ్యాసన్ కృష్ణస్య వార్తయా

ఆ ఉద్దవుడు సందుని గోకులములో ఎన్ని రోజులుండెనో, అన్ని రోజులు శ్రీకృష్ణుని ప్రసంగమును చేసెను. దానిచే, గోకులవాసులకు ఆ రోజులు క్షణములుగా గడిచిపోయెను.

సరిద్వనగిరిద్రోణీర్వీక్షన్ కుసుమితాన్ ద్రుమాన్

కృష్ణం సంస్మారయన్ రేమే హరిదాసో వ్రజౌకసామ్

 ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని శరణు జొచ్చిన భక్తుడు. ఆయన నదులను, అడవులను, పర్వతములను, లోయలను, పుష్పించిన చెట్లను చూస్తూ, గోకులవాసులకు శ్రీకృష్ణుని స్మరింపజేస్తూ విహరించెను.

దృష్ట్వైవమాది గోపీనాం కృష్ణావేశాత్మ విప్లవమ్

ఉద్ధవః పరమప్రీతస్తా నమస్యన్నిదం జగౌ

 ఈ పైన చెప్పినది మొదలుగా గల ప్రకారములచే గోపికల మనస్సు శ్రీకృష్ణునియందు లగ్నమై వ్యాకులపడెను. దానిని చూచిన ఉద్ధవుడు గొప్ప ప్రీతిని పొంది వారికి నమస్కరిస్తూ ఈ గీతిని గానము చేసెను.

ఏతాః పరం తనుభృతో భువి గోపవధ్వో

గోవింద ఏవ నిఖిలాత్మని రూఢభావాః

వాంఛంతి యద్భవభియో మునయో వయం చ

కిం బ్రహ్మ జన్మభిరనంతకథారసస్య

 సర్వాత్మరూపుడగు గోవిందునియందు ఈ గోపికల ప్రేమ దృఢముగా నెలకొన్నది. ఈ భూలోకములో కేవలము ఈ గోపికల జన్మ మాత్రమే సార్థకమైనది. సుసారము వలన భయపడే మేము, మహర్షులు కూడ అట్టి ప్రేమనే కోరుచున్నాము. శ్రీకృష్ణ భగవానుని గాథలయందు ప్రీతి గల వానికి పలు బ్రహ్మదేవుని జన్మలను పొందిననూ లాభమేమున్నది? (ఏమీ లేదు).

క్వేమాః స్త్రియో వనచరీర్వ్యభిచారదుష్టాః

కృష్ణే క్వ చైష పరమాత్మని రూఢభావః

నన్వీశ్వరోఽనుభజతోఽవిదుషోఽపి సాక్షాత్

శ్రేయస్తనోత్యగదరాజ ఇవోపయుక్తః

అడవులలో తిరుగుతూ శిష్టాచారము నెరుగని ఈ స్త్రీలు యెక్కడ? శ్రీకృష్ణ పరమాత్మ యందు వీరి ఇట్టి నిశ్చలమగు ప్రేమ యెక్కడ? (అసంభవమనుకున్నది సంభవమైనది), నిరంతరమగు భక్తిని చేయువాడు అజ్ఞానియే అయినా, బాగుగా వినియోగించబడిన శ్రేష్ఠమైన మందు (అమృతము) వలె, ఈశ్వరుడు వానికి స్వయముగా విస్తృతమగు శ్రేయస్సును కలిగించుననుటలో సందేహము లేదు.

నాయం శ్రియోకంఽగ ఉ నితాంతరతేః ప్రసాదః

స్వర్యోషితాం నలినగంధరుచాం కుతోఽన్యాః

 రాసోత్సవేఽస్య భుజదండగృహీతకంఠ -  

లబ్ధాశిషాం య ఉదగాద్వ్రజవల్లవీనామ్

 రాసక్రీడయందు ఈ శ్రీకృష్ణుడు దండమువంటి తన భుజములతో గోపాంగనలు కంఠమును కౌగిలించినప్పుడు, వారి మనోరథములు పూర్ణమై అనుగ్రహము (ప్రసన్నత) ఆవిష్కృతమయ్యెడిది. ఆశ్చర్యము! అట్టి అనుగ్రహము ఆయనయందు ఏకాంతమగు ప్రేమ కలిగి వక్షఃస్థలమునందు నిత్యనివాసము చేసే లక్ష్మీదేవికి కలుగలేదు. పద్మముల సుగంధము, కాంతి గల దేవతా స్త్రీలకు ఆ అనుగ్రహము కలుగలేదు. ఇతర స్త్రీల గురించి చెప్పునదేమున్నది?

ఆసామహో చరణ రేణుజుషామహం స్యాం

బృందావనే కిమపి గుల్మల తౌషధీనామ్

యా దుస్త్యజం స్వజనమార్యపథం చ హిత్వా

భేజుర్ముకుందపదవీం శ్రుతిభిర్విమృగ్యామ్

 శ్రుతులు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని పొందే మార్గమును వెదుకుచునే యుండును. గోపికలు బంధుజనమును, పెద్దల ధర్మమును కూడ విడిచి పెట్టి అట్టి ప్రేమ మార్గమును సేవించిరి. ఆహా! నేను బృందావనములో ఈ గోపికల పాదధూళిని సేవించే పొదలు, తీగలు, మొక్కలలో ఏదో ఒకటి అగుదును గాక!

యా వై శ్రియాఽర్చితమజాదిభిరాప్తకామైః

యోగేశ్వ రైరపి యదాత్మని రాసగోష్ఠ్యమ్

కృష్ణస్య తద్భగవతశ్చరణారవిందం

న్యస్తం స్తనేషు విజహుః పరిరభ్య తాపమ్

శ్రీకృష్ణ భగవానుని పద్మమువంటి పాదమును లక్ష్మీదేవి, పొందబడిన మనోరథములు గల బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలగువారు పూజించెదరు. మరియు యోగిరాజులు కూడ హృదయమునందు ఆ పాదమునే ధ్యానించెదరు. గోపికలు రాససభయందు ఆ పాదమును వక్షః లమునందుంచుకొని కౌగిలించి తాపమును విడనాడిరి.

వందే నందవ్రజస్త్రీణాం పాదరేణుమభీక్ ష్ణశః

యాసాం హరికథోద్గీతం పునాతీ భువనత్రయమ్

శ్రీహరి లీలలతో కలిపి గోపికల చరితము గానము చేయబడును. ఆ గానముచే ముల్లోకములు పవిత్రమగును. అట్టి నందగోకులమునందలి గోపికల పాదధూళికి నేను మరల మరల నమస్కరించుచున్నాను.

శ్రీశుక ఉవాచ ।

అథ గోపీరనుజ్ఞాప్య యశోదాం నందమేవ చ

గోపానామంత్ర్య, దాశార్హో యాస్యన్నారురు హే రథమ్

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత దాశార్హవంశీయుడగు ఉద్ధవుడు గోపికలు, యశోద, నందుడు, గోపాలకుల వద్ద సెలవు తీసుకొని ప్రయాణమునకు సిద్ధమై రథమునెక్కెను.

తం నిర్గతం సమాసాద్య నానోపాయనపాణయః

నందాదయోఽసురా గేణ ప్రావోచన్న శ్రులోచనాః

నందుడు, సుదాముడు మొదలగువారు చేతులలో అనేకములగు బహుమతులను పట్టుకొని బయలుదేరుచున్న ఉద్ధవుని వద్దకు వచ్చి ఇట్లు పలికిరి. ప్రేమ వలన వారి కన్నులలో నీరు ఉబుకుచుండెను.

మనసో వృత్తయో నస్స్యుః కృష్ణ పాదాంబుజాశ్రయాః

వాచోఽకభిధాయినీర్నామ్నాం కాయస్తమ్రహ్వణాదిషు

మా మనోవృత్తులు శ్రీకృష్ణుని పద్మమువంటి పాదమునందు నిలిచియుండునవి, వాగింద్రియము ఆయన మాటలను పలుకునది, దేహము ఆయనకు నమస్కరించుట, ప్రదక్షిణము చేయుట మొదలగువాటిని చేయునది అగుగాక!

కర్మభిర్భ్రామ్యమాణానాం యత్ర క్వాపీశ్వరేచ్ఛయా

మంగలాచరితైర్దానై రతిర్నః కృష్ణ ఈశ్వరే

 కర్మల కారణముగా ఈశ్వర సంకల్పముచే మేము ఏవో జన్మలను పొంది పుణ్యకార్యములను, దానములను చేయుదుము. పుణ్యము యొక్క ప్రభావముచే మాకు సర్వేశ్వరుడగు శ్రీకృష్ణునియందు ప్రేమ కలుగుగాక!

ఏవం సభాజితో గోపైః కృష్ణభక్త్యా నరాధిప

 ఉద్ధవః పునరాగచ్ఛన్మథురాం కృష్ణ పాలితామ్

 ఓ పరీక్షిన్మహారాజా! గోపాలకులు శ్రీకృష్ణునియందలి భక్తిచే ఉద్ధవుని ఈ విధముగా సత్కరించిరి. ఆయన శ్రీకృష్ణునిచే రక్షించబడే మథురా నగరమునకు తిరిగి వచ్చెను.

కృష్ణాయ ప్రణిపత్యాహ భక్త్యుద్రేకం వ్రజౌకసామ్

వసుదేవాయ రామాయ రాజ్ఞే చోపాయనాన్యదాత్

 ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే సప్తచత్వారింశోఽధ్యాయః

 ఉద్ధవుడు శ్రీకృష్ణునకు నమస్కరించి గోకులవాసుల భక్తి యొక్క ఆధిక్యమును గురించి చెప్పెను. వసుదేవుడు, బలరాముడు, ఉగ్రసేన మహారాజులకు ఉద్ధవుడు తాను తెచ్చిన బహుమతులనిచ్చెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో

ఉద్ధవుడు గోపికలతో మాటలాడుటను, భ్రమరగీతమును వర్ణించే

నలుబది ఏడవ అధ్యాయము ముగిసినది (47).