8 - శ్రీకృష్ణ బలరాముల బాల్య లీలలు

గర్గః పురోహితో రాజన్ యదూనాం సుమహాతపాః

ప్రజం జగామ నందస్య వసుదేవప్రచోదితః

ఓ పరీక్షిన్మహారాజా! యాదవుల పురోహితుడగు గర్గుడు చాల గొప్ప తపస్వి. వసుదేవుని ప్రేరణచే ఆయన నందుని గోకులమునకు వెళ్లాను.

తం దృష్ట్వా పరమప్రీతః ప్రత్యుత్థాయ కృతాంజలిః

ఆనర్చాధోక్షజధియా ప్రణిపాతపురస్సరమ్

ఆయనను చూచి నందుడు చాల ప్రీతిని పొందెను. ఆతడు అంజలి ఘటించి లేచి యెదు రేగెను. ఇంద్రియగోచరుడు కాని శ్రీహరియేనా అన్నట్లు పాదనమస్కారముతో ఆరంభించి నందుడాయనను పూజించెను.

సూపవిష్టం కృతాతిథ్యం గిరా సూనృతయా మునిమ్

నందయిత్వాఽబ్రవీద్బ్రహ్మన్ పూరస్య కరవామ కీమ్  

గర్గముని అతిథిసత్కారమును స్వీకరించి విశ్రాంతిగా కూర్చుని యుండెను. నందుడు ఆయనను అభినందించి యథార్థమధురమగు వాక్కుతో నిట్లనెను -- ఓ మహర్షీ! పూర్ణుడవగు నీకు మేము చేయదగినది ఏమి గలదు?

మహద్విచలనం నృణాం గృహిణం దీనచేతసామ్

నిశ్శ్రేయసాయ భగవన్ కల్పతే నాన్యథా క్వచిత్

ఓ పూజనీయా! గృహస్థులగు మానవులు దీనమైన చిత్తము కలిగి యుందురు. మహాత్ములు తమ స్థానమును వీడి వారి.. యింటికి వచ్చుట వారి పరమకల్యాణము కొరకే. అంతేగాని, మహాత్ముల రాకకు స్వప్రయోజనము ఏనాడైననూ ఉండదు.

జ్యోతిషామయనం సాక్షాద్యత్తజ్జ్ఞానమతీంద్రియమ్

ప్రణీతం భవతా యేన పుమాన్వేద పరావరమ్

అతీంద్రియమగు జ్ఞానమును బోధించే జ్యోతిశ్శాస్త్రమును రచించినది సాక్షాత్తు తమరే. దాని ద్వారా మానవుడు పూర్వజన్మల కర్మలను గురించి, ఇహజన్మయందలి సుఖదుఃఖముల గురించి తెలియగల్గును.

త్వం హి బ్రహ్మవిదాం శ్రేష్ఠస్సంస్కారాన్ కర్తుమర్హసి

బాలయోరనయోర్నృణాం జన్మనా బ్రాహ్మణో గురుః

నీవు వేదవేత్తలలో శ్రేష్ఠుడవనేది నిశ్చయము. తమరీ ఇద్దరు బాలకులకు నామకరణాది సంస్కారములను. చేయదగును. పుట్టుకచే బ్రాహ్మణుడు మానవులకు గురువు.

గర్గ ఉవాచ

యదూనామహమాచార్యః ఖ్యాతశ్చ భువి సర్వతః

సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీసుతమ్

గర్గాచార్యుడిట్లు పలికెను --- నేను యాదవుల గురువునని లోకములో అంతటా ప్రసిద్ది జెందినవాడను. నేను నీ పుత్రునకు సంస్కారమును - చేసినచో, జనులు నీ పుత్రుని దేవకీ పుత్రుడనియే భావించెదరు.

కంసః పాపమతిస్సఖ్యం తవ చానకదుందుభేః

దేవక్యా అష్టమో గర్భో న స్త్రీ భవితుమర్హతి

ఇతి సంచింతయఞ్చ్రుత్వా దేవకీదారికావచః

అపీ హంతాఽఽగతిశంకస్తర్హి తన్నోఽనయో భవేత్

కంసుడు దుర్బుద్ధి. నిన్ను చంపువాడు ఇప్పటికే పుట్టినాడు, అని దేవకీయొక్క కుమార్తె చెప్పినదానిని ఆతడు వినియున్నాడు. దానిని బట్టి దేవకీయొక్క ఎనిమిదవ శిశువు అమ్మాయి కాదని ఆతడు గ్రహించి యుండును. పైగా, నీకు వసుదేవునకు స్నేహమని కూడ ఆతనికి తెలియును. ఆతడు ఈ విషయములను విచారము చేసి శంక కలిగినవాడై, కృష్ణాదులను చంపినచో, అది మనకు అనర్థము అగును.

నంద ఉవాచ

అలక్షితోఽస్మిన్ రహసీ మామకైరపి గోవ్రజే

కురు ద్విజాతిసంస్కారం స్వస్తివాచనపూర్వకమ్

నందుడిట్లు పలికెను --- ఈ గోకులములోని గోశాలయందు ఏకాంతములో నోవారికి కూడ కనబడకుండా స్వస్తివాచనమును చేసి, నామకరణాది ద్విజసంస్కారమును చేయుడు.

శ్రీశుక ఉవాచ

ఏవం సంప్రార్థితో విప్రస్సచికీర్షితమేవ తత్

చకార నామకరణం గూఢో రహసి బాలయోః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గర్గుడు నామకరణమును చేయాలనే కోరెను. ఈ విధముగా నందుడు గట్టిగా కోరగా ఆయన ఏకాంతములో రహస్యముగా పిల్లలిద్దరికి నామకరణ సంస్కారమును చేసెను.

గర్గ ఉవాచ

అయం హి రోహిణీపుత్రో రమయన్ సుహృదో గుణైః

ఆఖ్యాస్యతే రామ ఇతి బలాధిక్యాద్బలం విదుః యదూనామపృథగ్భావాత్సంకర్షణముశంత్యుత

గర్గాచార్యుడిట్లు పలి కెను --- ఈ రోహిణియొక్క పుత్రుడైతే మిత్రులను తన మంచి గుణములచే రమింపజేయును. కావున, ఇతడు రాముడు అని పిలువబడగలడు. ఈతనికి బలము అధికముగా నుండుట వలన జనులు బలుడు అని పిలిచెదరు. ఈతడు యాదవులలో ఐకమత్యమును స్థాపించును గనుక, ఇతనిని సంకర్షణుడు (దగ్గరకు లాగువాడు) అని కూడ జనులు పిలువ గోరెదరు.

ఆసన్ వర్ణాస్త్ర హ్యస్య గృష్ణతోఽనుయుగం తనూః

శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణతాం గతః

ప్రతియుగమునందు దేహములను స్వీకరించే ఈ 'నీ పుత్రునకు తెలుపు, ఎరుపు, పచ్చన అనే మూడు రంగులు ఇదివరలో ఉండెను. ఇప్పుడు నలుపు రంగును పొందినాడు.(కావున, కృష్ణుడనబడును).

ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః

వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాస్సంప్రచక్షతే

శోభిల్లే ఈ నీ పుత్రుడు పూర్వము ఒకప్పుడు వసుదేవునకు పుత్రుడైనాడు. కావున, రహస్యము దెలిసినవారు ఈతనిని వాసుదేవుడు (వసుదేవ పుత్రుడు) అని పిలిచేదరు.

బహూని సంతి నామాని రూపాణి చ సుతస్య తే

గుణకర్మానురూపాణి తాన్యహం వేద నో జనాః  

నీ పుత్రునకు గుణములకు లీలలకు తగిన చాల పేర్లు, రూపములు కూడ గలవు. అవి నాకు తెలియునే గాని, జనులకు తెలియవు.

ఏష వశ్శ్రేయ ఆధాస్యధోపగోకులనందనః

అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ

గోపాలకులను, గోకులమును ఆనందింపజేసే ఈ బాలకుడు మీకు శ్రేయస్సును కలిగించగలడు. ఇతని ద్వారా మీరు కష్టములనన్నింటినీ అతిక్రమించెదరు.

పురాఽనేన ప్రజపతే సాధవో దస్యు పీడితాః

అరాజ కే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్ సమేధితాః

పూర్వము ఒకప్పుడు (వేనుని కాలమునందు) అరాచకమేర్పడెను. అప్పుడు చోరులు సజ్జనులను పీడించజొచ్చిరి. అపుడీతడు వారిని రక్షించి వర్ధిల్ల జేయగా, వారు చోరులను జయించిరి.

య ఏతస్మిన్మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానవాః

నారయోఽభిభవంత్యేతాన్ విష్ణుపక్షానివాసురాః

విష్ణువును ఆశ్రయించిన దేవతలను అసురులు పరాభవించలేరు. అదే విధముగా, గొప్ప భాగ్యము గల ఏ మానవులు వీనియందు ప్రీతిని చేయుదురో, వారిని (బాహ్య-ఆంతర) శత్రువులు పరాభవించలేరు.

తస్మాన్నందాత్మజోఽక్యం తే నారాయణసమో గుణైః

శ్రియా కీర్త్యాఽనుభావేన గోపాయస్వ సమాహితః

ఓ నందా! కావున, గుణములు, శోభ, సంపద, కీర్తి, ప్రభావములలో ఈ  నీ పుత్రుడు నారాయణునితో సముడు. నీవు సావధానుడవై కాపాడుము.

ఇత్యాత్మానం సమాదిశ్య గరే చ స్వగృహం గతే

నందః ప్రముదితో మేనే ఆత్మానం పూర్ణమాశిషామ్

గర్గుడీ విధముగా నందునకు ఉపదేశించి యింటికి వెళ్లాను. చాల ఆనందించిన నందుడు తన సకలాభీష్టములు పూర్ణ మైనవని తలపో సెను.

కాలేన ప్రజతాఽకల్పేన గోకులే రామకేశవౌ

జానుభ్యాం సహ పాణిభ్యాం రింగమాణౌ విజహ్రతుః

నామకరణము తరువాత కొద్ది కాలమునకే గోకులములో బలరామకృష్ణులు మోకాళ్లతో చేతులతో ప్రాకుతూ విహరించిరి.

తావంఘ్రియుగ్మమనుకృష్య సరీసృపంతో 

ఘోషప్ర ఘోషరుచిరం ప్రజకర్దమేషు

తన్నాదహృష్ణమనసావనుసృత్య లోకం

ముగ్ధప్రభీతవదు పేయతురంతి మాత్రోః

వారిద్దరు గోకులమునందలి వాకీళ్ల బురదలో కాళ్లజంటను ముందుకు లోగుతూ వంకర టింకరగా ప్రాకుచుండగా వారి ఆభరణముల చిరుగంటలు మధురమగు ధ్వనిని చేయుచుండెను. గోకులమునందలి జనులు వారిని ప్రోత్సహిస్తూ మధురమగు శబ్దములను చేసెడివారు. ఆ ధ్వనులకు, ఆ శబ్దములకు వారిద్దరికి మనస్సులో హర్షము కలిగెడిది. మార్గముగుండా  వెళ్లే అపరిచితవ్యక్తి వెనుక అమాయికముగా కొద్ది దూరము వెళ్లి, భయపడినారా యన్నట్లు వెనుదిరిగి తల్లులవద్దకు చేరెడివారు.

తన్మాతరౌ నిజసుతౌ ఘృణయా స్రువంత్యౌ

పంకాంగరాగరుచిరావుపగుహ్య దోర్బ్యామ్

దత్త్వా స్తనం ప్రపిబతోస్స్మ ముఖం నిరీక్ష్య

ముగ్ధస్మితాల్పదశనం యయతుః ప్రమోదమ్

వారిద్దరి దేహములు వాకిలిలోని మట్టియే చందనము కాగా (మట్టి మరియు చందనముతో) సుందరముగా నుండెడివి. ప్రేమచే పాలను స్రవించుచున్న తల్లులిద్దరు తమ పుత్రులనిద్దరిని రెండు చేతులతో కౌగిలించి పాలనిచ్చెడివారు. వారిద్దరు పాలు త్రాగుచుండగా, చిన్న పళ్లు గల వారీ ముఖములపై అమాయికమైన చిరునవ్వు తొంగి చూచెడిది. అట్టి వారీ ముఖములను చూచి తల్లులు మహానందమును పొందెడివారు.

యర్హ్యంగనాదర్శనీయకుమారలీలో 

అంతరజే తదబలాః ప్రగృహీతపుచ్చైః

వరితస్తత ఉభావనుకృష్యమాణా

ప్రేక్షంత్య ఉజ్జతగృహా జహృషుర్ఘసంత్యః

వారిద్దరు కొంచెము పెరిగి పెద్దవారు కాగా వారి లీలలను గోకులములోని యువతులు చూడ దొడంగిరి. గోకులము మధ్యలో వారిద్దరు దూడల తోకలను గట్టిగా పట్టుకోగా, వారిని దూడలు ఇటునటు లాగుచుండెడివి. అప్పుడు గోకులమునందలి యువతులు ఇంటి పనులను ప్రక్కన బెట్టి వారిని చూస్తూ నవ్వుతూ హర్షించెడివారు.

శృంగగ్నిదంష్ట్ర్యసిజలద్విజకంట కేభ్యః  

క్రీడాపరావతీచలో స్వసుతో నిషేద్దుమ్

గృహ్యాణి కర్తుమపి యత్ర న తజ్జనన్యౌ  

శ్వేత ఆపతురలం మనసోఽనవస్థామ్

ఎక్కువగా అల్లరి చేసే బలరామకృష్ణులిద్దరికీ ఆటలే ముఖ్యమాయెను. కొమ్ములతో పొడిచే ఆవులు, ఎద్దులు, దూడలు, నిప్పు, కోరలు గల జంతువులైన కుక్కలు మొదలగునవి, పక్షులు, ముళ్లు అనువాటినుండి వారిద్దరిని తల్లులు కాపాడవలెను. అదే సమయములో ఇంటిలోని పనులను చేసుకొనుట ఆ తల్లులకు వీలు కాకుండెను. ఈ విధముగా వారిద్దరి తల్లులు మనస్సులో ఆందోళనను పొందెడివారు.

కాలేనాల్పేన రాజర్షే రామః కృష్ణశ్చ గోకులే

అఘృష్ణజానుభిః పద్భిర్త్విచక్రమతురంజసా

మహర్షివంటి ఓ పరీక్షిన్మహారాజా! కొద్ది కాలములోనే బలరామకృష్ణులు మోకాళ్లు భూమికి తగలకుండానే లేచి నిలబడి గోకులములో అంతటా తేలికగా వేగముగా సంచరించ జొచ్చిరి.

తతస్తు భగవాన్ కృష్ణో వయస్యైర్వ్రజబాలకైః

సహరామో ప్రజస్త్రీణాం చిక్రీడే జనయన్ముదమ్

తరువాత శ్రీకృష్ణ భగవానుడు గోకులమునందలి స్త్రీలకు ఆనందమును కలిగిస్తూ, రామునితో మరియు గోకులమునందలి బాలకులతో కలిసి క్రీడించెను.

కృష్ణస్య గోప్యో రుచిరం వీక్ష్య కౌమారచాపలమ్

శృణ్వత్యాః కిల తన్మాతురితి హోచుస్సమాగతాః

శ్రీకృష్ణుడు బాల్యములో చేస్తున్న అందమైన అల్లరిని చూచిన గోపికలు గుమిగూడి, ఆతని తల్లియగు యశోద వినుచుండగా స్పష్టముగా ఈ విధముగా చెప్పిరి.

వత్సాన్ముంచన్ క్వచిదసమయే క్రోశసంజాతహాసః 

స్త్యం స్వాద్వత్త్యథ దధి పయః కల్పితైః స్తేయయోగైః

మర్కాన్ భోక్ష్యన్ విభజతి స చేన్నాత్తి భాండం భినత్తి

ద్రవ్యాలాభే స గృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్

ఆ కృష్ణుడు ఒకప్పుడు వేళ కాని వేళ దూడలను విడిచి పెట్టును.(అవి పాలను త్రాగివేయగా ఇంటిలోనివారు) కూకలేసినప్పుడు నవ్వును. మరియు ఆతడు అపహరించే ఉపాయములనాచరించి . తియ్యని పెరుగును, పాలను అపహరించి త్రాగివేయును. (తాను త్రాగిన పిదపు కోతులకు పిల్లులకు త్రాగిపించుటకై వాటాలను వేయును. ఒకానొక కోతి తినకపోయినచో, (చికాకు పుట్టి) కుండను పగులగొట్టును. పెరుగు-పాలు మొదలైనవి దొరకకపోయినచో, ఆ ఇంటి (ఐరి) పై కోపించి ఆతడు పిల్లలను (గిల్లి) ఏడిపించి వెళ్లిపోవును.

హస్తాగ్రాహ్యో రచయతి విధిం పీఠకోలూఖలాద్యైః

ఛిద్రం హ్యంతర్నిహితవయునశ్శక్యభాండేషు తద్విత్

ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థ ప్రదీపం

కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః

పెరుగు కుండ చేతికి అందనిచో పీట, రోలు, మిత్రుని భుజము మొదలగువాటి ఆసరాతో అది చేతికి అందే ఉపాయమును ఆచరించును. ఉట్టియందలి కుండలో ఏమున్నదో, దానిని ఏ విధముగా అందుకోవాలో అతనికి తెలియును. ఒకచో ఆతడు దానికి చిల్లు పెట్టి లోపలి వస్తువును చేజిక్కించుకొనును. చీకటి గదిలో తాను ధరించిన మణుల సమూహమే దీపమై పదార్థములను ప్రకాశింప జేయును. ఆతడీ పనులను గోపికలు ఇంటి పనులలో చాల హడావుడిగా ఉన్నప్పుడు చేయును.

ఏవం ధారిష్ట్యాన్యుశతి కురుతే మేహనాదీని వాస్తా 

స్తేయోపాయైర్విరచితకృతిస్సుప్రతీకో యథాఽస్తే

ఇత్థం స్త్రీభిస్సభయనయనశ్రీముఖాలోకినీభిః

వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ న హ్యుపాలబ్దుమైచ్చత్

ఓ సుందరీ! యశోదా! బాలకృష్ణుడీ విధముగా దిట్టదనపు పనులను చేయును. ఇంటిలో మాలిన్యమును వేయుట మొదలగు పనులను చేయును. వెన్నను ఎత్తుకుపోయే ఉపాయములతో వివిధచేష్టలను చేసే కృష్ణుడు బుద్ధిమంతుడు వలే కనబడును . అని ఈ విధముగా, భయముతో కూడిన కన్నులతో శోభిల్లే బాలకృష్ణుని ముఖమును చూస్తూ గోపీకలు వివరించి చెప్పిరి. కాని, నవ్వుతో నిండిన ముఖము గల యశోదకు కృష్ణునిపై కోపపడుట ఇష్టము కానే లేదు.

ఏకదా క్రీడమానాస్తే రామాద్యా గోపదారకాః

కృష్ణో మృదం భక్షితవానికి మాత్రే న్యవేదయన్

ఒకనాడు గోపబాలకులు ఆటలాడుచుండిరి. బాలకృష్ణుడు మట్టిని తిన్నాడని బలరాముడు మొదలైన ఆ పిల్లలు తల్లి యశోదకు విన్నవించిరి.

సా గృహీత్వా కరే కృష్ణ ముపాలభ్య హితైషిణీ

యశోదా భయసంభ్రాంతప్రేక్షణాక్షమభాషత

శ్రీకృష్ణుని హితము (అనారోగ్యము కలుగకూడదనీ) కోరే ఆ యశోద ఆతని చేతిని పట్టుకొనెను. ఆతడు భయముతో కంగారుపడుచున్న కన్నులతో చూచుచుండెను. ఆమె ఆతనిని కూకలేసి ఇట్లనెను.

కస్మాన్మృదమదాంతాత్మన్ భవాన్ భక్షితవాన్ రహః

వదంతి తావకా హ్యేతే కుమారాస్తేఽగ్రజోఽప్యయమ్

ఓ కృష్ణా! నీ నోరు నీకు వశములో లేదు సుమా! నీవు రహస్యముగా మట్టిని యేల తింటివి? నీ మంచిని కోరే ఈ పిల్లలు, ఈ, నీ అన్న కూడ (నీవు మట్టిని తిన్నావని) చెప్పుచున్నారు.

శ్రీకృష్ణ ఉవాచ

నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః

యది సత్యగిరస్తరి సమక్షం పశ్య మే ముఖమ్

అమ్మా! నేను మట్టిని తినలేదు. అందరు చెప్పే నేరములు అబద్ధము. వారు సత్యమునే చెప్పుచున్నారని నీవు తలచే పక్షములో, నా నోటిని నీవే ప్రత్యక్షముగా చూడుము.

యద్యేవం తర్హి వ్యాదేహీత్యు క్తస్స భగవాన్ హరిః

వాదతావాహతేశ్వర క్రీడామనుజబాలకః

వారు చెప్పే మాట అసత్యమైనచో నోటిని తెరువుము, అని ఆమె పలికెను. మొక్కవోని ఈశ్వరీయశక్తి గల శ్రీహరి లీల కొరకే మానవబాలుడై అవతరించెను. అట్టి శ్రీకృష్ణుడు నోటిని తెరిచెను.

సా తత్ర దదృశే విశ్వం జగత్ స్థాస్ను చ ఖం దిశః

సాద్రిద్వీపాబ్ధిభూగోలం సవాయ్వగ్నీందుతారకమ్  

ఆమెకు ఆ నోటియందు చరాచరమగు జగత్తు, భూగోళము చుట్టూ ఉండే వాయువు, విద్యుత్తు, చంద్రుడు, నక్షత్రములు, ద్యులోకము, దిక్కులు, పర్వతములతో ద్వీపములతో సముద్రములతో కూడిన భూగోళము కనబడెను.

జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్ వియదేవ చ

వైకారికోణీంద్రియాణి మనో మాత్రా గుణాస్త్రయః

నక్షత్రమండలము, నీరు, తేజస్సు, (నక్షత్రమండలమధ్యమునందలి) వాయువు, ఆకాశము, (హిరణ్యగర్భుని) సాత్త్వికాహంకారమునుండి పుట్టి ఇంద్రియములకు అభిమానులై ఉండే ఇంద్రాది దేవతలు, సమష్టి చిట్టాభి మానియగు హిరణ్యగర్భుడు, శబ్దస్పర్శరూపరసగంధములనే సూక్ష్మ భూతములు, సత్త్వరజస్తమస్సులనే మూడు గుణములు కనబడెను.

ఏతద్విచిత్రం సహ జీవకాలస్వభావకర్మాశయలింగభేదమ్

సూనోస్తనౌ వీక్ష్య విదారితస్యే ప్రజం సహాత్మానమవాప శంకామ్

నోరు తెరిచిన పుత్రుని శరీరమునందు యశోద ఒకే సారి వివిధప్రాణులతో గూడిన ఈ జగత్తును, తనతో సహా గోకులమును కూడ చూచెను. ఈ జగత్తులోని ప్రాణులలోని విభిన్నరూపములకు మూలమునందు జీవుడు, వాని అజ్ఞానము, కాలము, కర్మలు, కర్మవాసనలు గలవు. అపుడామెకు సందేహము కలిగెను.

కిం స్వప్న ఏతదుత దేవమాయా కిం వా మదీయో బత బుద్ది మోహః,

అథో అముష్యైవ మమార్భకస్య యః కశ్చనౌత్పత్తిక ఆత్మయోగః

ఇది కలా? లేక వైష్ణవమాయయా? లేక నా బుద్ది వ్యామోహపడుచున్నదా? ఆశ్చర్యము! లేక, ఈ నా పిల్లవానికే ఏదో ఒక పుట్టుకతో వచ్చిన తనదైన యోగసిద్ధి గలదా? (అని యశోద తలపో సెను).

అథో యథావన్న వితర్కగోచరం

చేతోమనఃకర్మవచోభిరంజసా

యదాశ్రయం యేన యతః ప్రతీయతే

సుదుర్విభావ్యం ప్రణతోఽస్మి తత్పదమ్

ఆ పరమాత్మయొక్క స్వరూపము యథాతథముగా బుద్దిచే నిశ్చయించుటకు, మనస్సుతో భావన చేయుటకు, కర్మతో చేరుకోనుటకు, పోక్కుతో వర్ణించుటకు గోచరము కాదు. ఊహాపోహలకు అతీతమైన ఆ పరమాత్మయే జగత్తునకు అధిష్ఠానము. ఆ పరమాత్మనుండి ఆవిర్భవించిన ఈ జగత్తు చైతన్యరూపుడగు ఆ పరమాత్మ ద్వారానే ప్రతీతమగుచున్నది. అందువలన, సుతరాము బుద్దిగోచరము కాని ఆ పరమాత్మస్వరూపమును నేను ప్రణమిల్లుచున్నాను.

అహం మమాసొ పతిరేష మే సుతో

ప్రజేశ్వరస్యాఖిలవిత్తపా సతీ

గోప్యశ్చ గోపాస్సహగోధనాశ్చ మే

యన్మాయయేత్థం కుమతిస్స మే గతిః

నేను గోకులనాథుడగు నందుని భార్యను, ఆతని సకలసంపదకు రాణిని, ఈ నందుడు నా భర్త. ఈ కృష్ణుడు నా కొడుకు. గోవులే సంపదగా గల గోపాలకులు గోపికలు కూడ నావారు, అంటూ నేను ఎవని మాయచే మిథ్యాసంకల్పములను కలిగియున్నానో, ఆ శ్రీహరి నాకు శరణు.

ఇత్థం విదితతత్త్వాయాం గోపికాయాం స ఈశ్వరః

వైష్ణవీం వ్యతనోన్మాయాం పుత్ర స్నేహమయీం విభుః

ఈ విధముగా గోపికయగు యశోదకు ఆత్మతత్త్వము తెలిసిపోయెను. అప్పుడు  సర్వాంతర్యామి, జగన్నాథుడు అగు ఆవిష్ణువు పుత్రునియందలి ఆసక్తి అనే రూపములోనుండే తనదైన మాయను ఆమెయందు విస్తరింప జేసెను.

సద్యో నష్టస్మృతిక్టోపీ సాఽఽరోప్యారోహమాత్మజమ్

ప్రవృద్ధ స్నేహకలిలహృదయాఽఽసీద్యథా పురా

వెంటనే గోపికయగు ఆ యశోదకు తత్త్వజ్ఞానము కనుమరుగై పుత్రుని ఒడిలో కూర్చుండబెట్టుకొనెను. ఆమె హృదయములో పూర్వమునందు వలెనే పుత్రునియందలి ఆసక్తి వ్యాపించెను.

త్రయ్యా చోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః

ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామన్యతాత్మజమ్

శ్రీహరి మహిమను వేదములు, ఉపనిషత్తులు, ఆత్మనిష్ఠులు, కర్మయోగపరులు, భక్తులు కూడ కీర్తించెదరు. అట్టి శ్రీహరిని ఆమె తన పుత్రుడని తలపోయుచుండెను.

రాజోవాచ

నందః కిమకరోద్బ్రహ్మన్ శ్రేయ ఏవం మహోదయమ్

యశోదా చ మహాభాగా పపౌ యస్యాః స్తనం హరిః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలి కెను --- ఓ శుకమహర్షీ! శ్రీహరి యశోద పాలను త్రావెను. మహాపుణ్యాత్మురాలగు యశోద మరియు నందుడు (ఇంతటి గొప్ప ఫలమునిచ్చే ఏ పుణ్యముననుష్ఠించిరి?

పితరౌ నాన్వవిందేతాం కృష్ణోదారార్భకేహితమ్

గాయంత్యద్యాపి కవయో యల్లోకశమలాపహమ్

శ్రీకృష్ణుని అద్భుతమైన బాల్యలీలలు జనుల మనోమాలిన్యములను పోగొట్టును. వాటిని ఈ నాటికీ కవులు కీర్తిస్తూనే ఉన్నారు. కాని, తల్లిదండ్రులైన దేవకీవసుదేవులు ఆ లీలలను అనుభవించనే లేదు.

శ్రీశుక ఉవాచ

ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా

కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ హ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వసువులలో ముఖ్యుడగు ద్రోణుడు భార్యయగు ధరతో గూడి బ్రహ్మదేవుని ఆదేశములను చేయబోవువాడై ఆయనతో నిట్లనెను.

జాతయోర్నౌ మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ

భక్తిస్స్యాత్పరమా లోకే యయాంజో దుర్గతిం తరేత్

మేము భూలోకమునందు పుట్టినప్పుడు, దేవదేవుడు జగన్నాథుడు అగు శ్రీహరియందు సర్వాతిశాయియగు భక్తి కలుగుగాక! అట్టి భక్తిచేతనే లోకములో మానవుడు దుర్గతిని తేలికగా అతిక్రమించును.

అస్తిత్యుక్తస్స భగవాన్ ప్రజే ద్రోణో మహాయశాః

జజ్ఞే నంద ఇతి ఖ్యాతో యశోదా సా ధరాఽభవత్

అటులనే యగుగాక! అని బ్రహ్మదేవుడు చేప్పెను. పూజనీయుడు, గొప్ప కీర్తి గలవాడు అగు ఆ ద్రోణుడు భూలోకమునందు పుట్టి నందుడని ప్రసిద్ధి వడ సెను. ఆ ధరయే యశోద ఆయెను.

తతో భక్తిర్బగవతి పుత్రీభూతే జనార్ధనే

దంపత్యోర్నితరామాసీద్గో పగోపీషు భారత

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆ వరము కారణముగా, దుష్టజనశిక్షకుడగు శ్రీహరి భగవానుడు గోపాలకులు గోపికల మధ్యలో ఆ దంపతులకు పుత్రుడై జన్మించెను. వారికి నిష్కామభక్తి కలిగెను.

కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం ప్రజే విభుః

సహరామో వసంశ్చక్రే తేషాం ప్రీతిం స్వలీలయా  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్థే అష్టమోఽధ్యాయః

సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని వరమును సత్యము చేయుటకై బలరామునితో గూడి గోకులమునందు నివసించువాడై, తన లీలచే వారికి ప్రీతిని కలుగజేసెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణ బలరాముల బాల్యలీలలను వర్ణించే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).