భాగవత మహా పురాణము
60 - రుక్మిణీ శ్రీకృష్ణ సంవాదము
శ్రీశుక ఉవాచ ।
కర్హిచిత్సుఖమాసీనం స్వతల్పస్థం జగద్గురుమ్ ।
పతిం పర్యచరద్బైష్మీ వ్యజనేన సఖీజనైః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- ఒకనాడు జగత్తునకు గురువు, తండ్రి అగు శ్రీకృష్ణుడు తన తల్పముపై సుఖముగా కూర్చుని యుండెను. అపుడు భీష్మకుని పుత్రియగు రుక్మిణి చెలికత్తెలతో గూడి ఆయనకు గాలి విసురుతూ సేవ చేసేను.
యస్త్వేతల్లీలయా విశ్వం సృజత్యత్త్యవతీశ్వరః ।
స హి జాతస్స్వ సేతూనాం గోపీథాయ యదుష్వజః ॥
పుట్టుక లేని ఏ ఈశ్వరుడీ జగత్తును అవలీలగా సృష్టించి పాలించి ఉపసంహరించునో, ఆయనయే తాను సృష్టించిన ధర్మమర్యాదల రక్షణకై యాదవవంశమునందు అవతరించినాడు.
తస్మిన్నంతర్గృహే భ్రాజన్ముక్తదామవిలంబినా ।
విరాజితే వితానేన దీ పైర్మణిమయైరపి ॥
రుక్మిణీదేవి అంతఃపురము యొక్క మధ్యగృహము ప్రకాశించే ముత్యాల త్రాళ్ల గుత్తులు గల మేలుకట్టుతో, మణులతో నిండిన దీపములతో విరాజిల్లుచుండెను.
మల్లికాదామభిః పుష్పైర్ద్విరేఫకులనాదితైః ।
జాలరంధ్రప్రవిష్టైశ్చ గోభిశ్చంద్రమసోఽమలైః ॥
ఆ మధ్యగృహము తుమ్మెదల గుంపులతో ధ్వనించే (ద్వారములకు కట్టిన మల్లెల హారములతో మరియు పూలతో, కిటికీ సందులగుండా ప్రవేశించిన చంద్రుని స్వచ్ఛమైన వెన్నెలలతో విరాజిల్లెను.
పారిజాతవనామోదవాయునోద్యానశాలినా ।
ధూ పైరగురుజై రాజన్ జాలరంధ్రవినిర్గ తైః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఉద్యానమునందు శోభిల్లే పారిజాతముల గుంపు (స్వర్గమునుండి తెచ్చినది మాత్రమే గాక ఇతరపారిజాతములు కూడ గలవు) యొక్క పరిమళమును తెచ్చే వాయువు లోపలికి వీచుచుండెను. లోపలి అగురు ధూపము కిటికీ చిల్లులనుండి బయటకు వచ్చుచుండెను.
పయః ఫేననిభే శుభ్ర పర్యంకే కశిపూత్తమే ।
ఉపతస్థే సుఖాసీనం జగతామీశ్వరం పతిమ్ ॥
పాల నురుగు వంటి స్వచ్చమగు మంచముమీద శ్రేష్ఠమగు పరుపుపై సుఖముగా కూర్చున్న జగన్నాథుడగు తన భర్తను రుక్మిణి సేవించెను.
వాలవ్యజనమాదాయ రత్నదండం సఖీకరాత్ ।
తేన వీజయతీ దేవీ ఉపాసాంచక్ర ఈశ్వరమ్ ॥
రుక్మిణీదేవి రత్నములు పొదిగిన కర్ర గల వింజామరను చెలికత్తె చేతినుండి తీసుకొని దానితో వీచుతూ శ్రీకృష్ణ భగవానుని సేవించెను.
సోపాచ్యుతం క్వణయతీ మణినూపురాభ్యాం
రేజేంఽగులీయవలయవ్యజనాగ్రహస్తా ।
వస్త్రాంతగూడకుచకుంకుమశోణహార-
భాసా నితంబధృతయా చ పరార్ఘ్యకాంచ్యా ॥
రుక్మిణీ శ్రీకృష్ణ భగవానునకు దగ్గరగా ఉంగరములు, కంకణములు గల చేతితో వింజామర వీస్తూంటే మణులు పొదిగిన కాలియందేలు గలగలలాడు చుండెను. ఆమె కోక కొంగు కప్పిన వక్షఃస్థలమునందలి కుంకుమచే ఎర్రనైన హారములతో, నడుమునందు దాల్చబడిన మిక్కిలి విలువైన మొలనూలుతో ప్రకాశించెను.
తాం రూపిణీం శ్రియమనన్యగతిం నిరీక్ష్య
యా లీలయా ధృతతనోరనురూపరూపా ।
ప్రీతస్స్మయన్నలకకుండలనిష్కకంఠ-
వక్త్రోల్లసత్స్మితసుధాం హరిరాబభాషే ॥
శ్రీహరి లీలచే శ్రీకృష్ణుడై అవతరించగా, ఇతరులకు పొంద శక్యము కాని లక్ష్మీదేవియే ఆయనకు తగ్గ రూపముతో రుక్మిణియై అవతరించెను. ముంగురులు, కుండలములు, మెడలో హారములతో వెలిగిపోయే ఆమె ముఖము పై చిరునవ్వు అనే అమృతమును చూచి ప్రీతి జెందిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇట్లు పలికెను.
శ్రీభగవానువాచ ।
రాజపుత్రీప్సితా భూపైర్లోకపాలవిభూతిభిః ।
మహానుభావైశ్ర్శీమద్భీ రూపౌదర్యబలోర్జితైః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ రాజకుమారీ! లోకపాలకుల సంపదలు, గొప్ప ప్రభావము, శోభ, అందము, పెద్ద మనస్సు, బలము గల గొప్ప రాజులు నిన్ను వివాహమాడవలెనని కోరిరి.
తాన్ ప్రాప్తానర్థినో హిత్వా చైద్యాదీన్ స్మరదుర్మదాన్ ।
దత్తా భ్రాత్రా స్వపిత్రా చ కస్మాన్నో వవృషేఽసమాన్ ॥
నీ సోదరుడు, తండ్రి కూడ నిన్ను ఆ చేదిరాజగు శిశుపాలుడు మొదలగువారిలో ఒకరికి ఈయవలెనని సంకల్పించినారు. నీయందలి కామనచే గర్వించిన ఆ రాజులు నిన్ను కోరి వచ్చినారు. నీవు వారితో సరి దూగని మమ్ములను ఏల వరించితివి?
రాజభ్యో బిభ్యతస్సుభ్రూస్సముద్రం శరణం గతాన్ ।
బలవద్భిః కృతద్వేషాన్ ప్రాయస్త్యక్తనృపాసనాన్ ॥
ఓ సుందరీ! రాజులకు భయపడే నేను సముద్రమునాశ్రయించితిని. బలవంతులతో వైరము గల నేను రాజ్యాధికారమును ఇంచుమించుగా విడిచి పెట్టితిని. నన్నేల వరించితివి?
అస్పష్టవర్త్మనాం పుంసామలోకపథమీయుషామ్ ।
ఆస్థితాః పదవీం సుభ్రూః ప్రాయస్సీదంతి యోషితః ॥
ఓ సుందరీ! లోకమునకు అతీతముగా నేను అనుసరించే మార్గము అందరికీ తెలిసినది కాదు. నావంటి (స్త్రీకి వశవర్తులు కాని వారిని అనుసరించే యువతులు తరుచుగా ఇడుముల పాల బడెదరు.
నిష్కించనా వయం శశ్వన్నిష్కించనజనప్రియాః ।
తస్మాత్ప్రాయేణ న హ్యాఢ్య మాం భజంతి సుమధ్యమే ॥
ఓ సుందరీ! మేము సర్వకాలములలో ఏమీ లేనివారము. మాకు ఏమీ లేనివారియందు ప్రీతి. ఏమీ లేనివారు కూడ మమ్ములను ప్రేమించెదరు. కాబట్టి, సంపన్నులు తరుచుగా నన్ను అనుసరించరు. ఇది నిశ్చయము.
యయోరాత్మసమం విత్తం జన్మైశ్వర్యాకృతిర్భవః ।
తయోర్వివాహో మైత్రీ చ నోత్తమాధమయోః క్వచిత్ ॥
ఏ యువతీయువకులిద్దరికీ సంపద, పుట్టిన వంశము, ఐశ్వర్యము, రూపము, వయస్సు పరస్పరము అనురూపముగనుండునో, వారిద్దరికి పెళ్లి, మైత్రి శోభిల్లును. వారిలో ఒకరు గొప్ప, మరియొకరు తక్కువ అయినచో, అవి ఏనాటికీ శోభిల్లవు.
వైదర్భ్యేతదవిజ్ఞాయ త్వయాఽధీర్ఘసమీక్షయా ।
వృతా వయం గుణైర్హినా భిక్షుభిః శ్లాఘితా ముధా ॥
విదర్భరాజపుత్రివగు. ఓ రుక్మిణీ! మాయందు గుణములు లేవు. యాచకులు ధనలోభముచే మమ్ములను వ్యర్థముగా కొనియాడెదరు. దూరదృష్టి లేకుండుటచే నీవీ విషయమును తెలుసుకోకుండా - మమ్ములను వరించితివి.
అథాత్మనోఽనురూపం వై భజస్వ క్షత్రియర్షభమ్ ।
యేన త్వమాశిషస్సత్యా ఇహాముత్ర చ లప్స్యసే ॥
ఇప్పుడైనా నీకు తగిన శ్రేష్ఠుడైన రాజును నిశ్చయముగా సేవించుము. ఆతని ద్వారా ఇహపరలోకములలో నీ కామనలు పూర్ణము కాగలవు.
చైద్యశాల్వజరాసంధదంతవక్త్రాదయో నృపాః ।
మమ ద్విషంతి వామోరు రుక్మీ చాపి తవాగ్రజః ॥
ఓ సుందరీ! చేదిదేశరాజగు శిశుపాలుడు, శాల్వుడు, జరాసంధుడు, దంతవక్తడు, పౌండ్రకుడు మొదలగు రాజులు మాత్రమే గాక, నీ అన్న యైన రుక్మి కూడా నన్ను ద్వేషించును.
తేషాం వీర్యమదాంధానాం దృప్తానాం స్మయనుత్తయే ।
ఆనీతాఽసి మయా భద్రే తేజోఽవపహరతాఽసతామ్ ॥
ఓ కల్యాణీ! తాము పరాక్రమవంతులమనే గర్వముచే అంధులై ఆ శిశుపాలాదులు పొగరెక్కి యుండిరి. దుష్టుల గర్వమునడంచే నేను వారి గర్వమునడంచుటకై నిన్ను తీసుకువచ్చితిని.
ఉదాసీనా వయం నూనం న స్త్ర్యపత్యార్థకాముకాః ।
ఆత్మలబ్ధ్యాఽఽస్మ హే పూర్ణా గేహయోర్జ్యోతిరక్రియాః ॥
మేము నిశ్చయముగా ఆసక్తి లేనివారము. స్త్రీ, సంతానము, ధనములయందు మాకు కోరిక లేదు. మేము ఇంటియందు, దేహము నందు దీపము వలె కేవలసాక్షియై ఆత్మనిష్ఠతో పూర్ణులమై ఉండేదము.
శ్రీశుక ఉవాచ ।
ఏతావదుక్త్వా భగవానాత్మానం వల్లభామివ ।
మన్యమానామవిశ్లేషాత్తద్దర్పఘ్న ఉపాహరత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణునితో క్షణమైనా ఎడబాటు లేనందువలన తానే ఆయనకు అందరిలో అతిశయించి ప్రియురాలనని రుక్మిణీ భావించెను. ఆమె గర్వమును పోగొట్టుటకై శ్రీకృష్ణ భగవానుడు ఇంత మాత్రమే పలికి మిన్నకుండెను.
ఇతి త్రిలోకేశపతేస్తదాఽఽత్మనః
ప్రియస్య దేవ్యశ్రుతపూర్వమప్రియమ్ ।
ఆశ్రుత్య భీతా హృది జాతవేపథుః
చింతాం దురంతాం రుదతీ జగామ హ ॥
శ్రీకృష్ణుడు ముల్లోకములను శాసించే ఇంద్రాదులకు కూడ శాసకుడే అయినా రుక్మిణీదేవికి ప్రియుడే. కానీ, ఆయన ఇదివరలో ఎన్నడూ లేని విధముగా అప్పుడు పలికిన పరుషవాక్యములను విని ఆమె హృదయ ములో భయముతో వణికిపోతూ హద్దు లేని దుఃఖముతో విలపించెను.
పదా సుజాతేన నఖారుణశ్రియా భువం లిఖంత్యశ్రుభిరంజనాసితైః,
ఆసించతీ కుంకుమరూషితో స్తనౌ తస్థావధోముఖ్యతిదుఃఖరుద్ధవాక్।
రుక్మిణి కోమలమై గోళ్ల కాంతితో శోభిల్లే కాలి బొటనవేలితో నేలపై వ్రాయుచుండెను. కాటుకతో నల్లనైన కన్నీళ్లు కుంకుమ అలదిన ఆమె స్తనములను తడుపుచుండెను. ఆమె తల వంచుకోని అధికమగు దుఃఖముతో నోట మాట రాక నిలబడి యుండెను.
తస్యాస్సుదుఃఖభయశోకవినష్టబుద్దేః
హస్తాచ్ఛథద్వలయతో వ్యజనం పపాత ।
దేహశ్చ విక్షవధియస్సహసైవ ముహ్యన్
రంభేవ వాయువిహతా ప్రవికీర్య కేశాన్ ॥
అధికమగు దుఃఖము, భయము, తాపములచే ఆమె బుద్ధి విచారశక్తిని కోల్పోయేను. దుఃఖముచే కృశించి పోవుటచే ఆమె చేతినుండి కంకణ ములు జారిపోయెను. ఆమె చేతిలోని వింజామర క్రింద బడెను. వ్యాకుల మైన బుద్ధి గల ఆమె దేహము కూడ వెనువెంటనే మూర్చిల్లెను. జుట్టు ముడి విడిపోగా ఆమె, గాలిచే కూల్చబడిన అరటి చెట్టు వలె, పడిపోయెను.
తద్దృష్ట్వా భగవాన్ కృష్ణ: ప్రియాయాః ప్రేమబంధనమ్ ।
హాస్యప్రౌఢిమజానంత్యాః కరుణస్సోఽన్వకంపత ॥
రుక్మిణి హాస్యము యొక్క గాంభీర్యమునెరుంగని ప్రియురాలు. ఆమెయొక్క ఆ అవస్థను చూచి దయాళువగు ఆ శ్రీకృష్ణ భగవానుడు కృపను చూపెను.
పర్యంకాదవరుహ్యాశు తాముత్థాప్య చతుర్భుజః ।
కేశాన్ సముహ్య త ద్వక్త్రం ప్రామృజత్పద్మపాణినా ॥
వెంటనే శ్రీహరి నాల్గు చేతులతో ప్రకటమై మంచమునుండి క్రిందకు దిగి ఆమెను లేవదీసి జుట్టు ముడి వేసి పద్మమువంటి చేతితో ఆమె ముఖమును తుడిచేను.
ప్రమృజ్యాశ్రుకలే నేత్రే స్తనౌ చోపహతౌ శుచా ।
ఆశ్లిష్య బాహునా రాజన్ననన్యవిషయాం సతీమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! శ్రీహరి నాల్గు చేతులతో ప్రకటమై రుక్మిణి రెండు కళ్లను ఒత్తి, కన్నీటితో తడిసిన స్తనములను తుడిచి ఆమెను చేతితో కౌగిలించెను. ఆమె మరియొక ఆశ్రయమునెరుగని పతివ్రత.
సాంత్వయామాస సాంత్వజ్ఞః కృపయా కృపణాం ప్రభుః ।
హాస్యప్రౌఢి భ్రమచ్చిత్తామతదర్హాం సతాం గతిః ॥
సజ్జనరక్షకుడగు శ్రీకృష్ణ ప్రభుడు అనునయించుటలో దిట్ట. అట్టి హాస్యమును తట్టుకోలేని రుక్మిణి గంభీరమగు హాస్యముచే చిత్తము భ్రమించి దీనురాలై యుండగా, ఆయన దయతో అనునయించెను.
శ్రీభగవానువాచ ।
మా మా వైదర్భ్యసూయేథా జానే త్వాం మత్పరాయణామ్ ।
త్వద్వచశ్ర్శోతుకామేన క్ష్వేల్యాఽఽచరితమంగనే ॥
ఓ విదర్భరాజపుత్రీ! నన్ను తప్పుగా భావించవద్దు. నీవు సర్వాతిశాయిగా నన్నే ఆశ్రయించెదవని నేనెరుగుదును. ఓ సుందరీ! నీ సమాధానమును వినగోరి నేను పరిహాసముగా పలికితిని.
ముఖం చ ప్రేమసంరంభస్పురితాధరమీక్షితుమ్ ।
కటాక్షేపారుణాపాంగం సుందరభ్రుకుటీతటమ్ ॥
ప్రణయకోపముతో క్రింది పెదవి వణుకుచుండగా, వాలు చూపులయందలి తిరస్కారముచే ఎర్రనైన కనుకోలుకులు గల నీ ముఖము కనుబొమలు ముడివడుటచే అందమైన ఫాలభాగమును కలిగియున్నది. ఇట్టి నీ ముఖమును చూచుటకే నేను హాస్యమాడితిని.
అయం హి పరమో లాభో గృ హేషు గృహమేధినామ్ ।
యన్నర్మైర్నీయతే యామః యయా భీరు భామిని ॥
ఓ సుందరీ! నీకు భయముతో బాటు కోపము కూడ ఎక్కువే. గృహస్థుడు ఇంటిలో ప్రియురాలితో హాస్యమాడుతూ జాము గడుపవచ్చును. ఇదియే గృహస్థులకు ఇంటిలో లభించే గొప్ప ఫలము.
శ్రీశుక ఉవాచ ।
సైవం భగవతా రాజన్ వైదర్భీ పరిసాంత్వితా ।
జ్ఞాత్వా తత్పరిహాసోక్తిం ప్రియత్యాగభయం జహౌ ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణ భగవానుడీ విధముగా అనునయించగా, ఆ విదర్భరాజపుత్రి ఆయన పరిహాసము కొరకే మాటలాడినాడని తెలిసి, ప్రియుడు తనను విడిచి పెట్టునేమో అనే భయమును విడనాడెను.
బభాష ఋషభం పుంసాం వీక్షంతీ భగవన్ముఖమ్ ।
సవ్రీడహాసరుచిరస్నిగ్ధపాంగేన భారత ॥
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆమె సిగ్గుతో కూడిన చిరునవ్వుతో, అందమైన ప్రేమ నిండిన వాలు చూపుతో పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుని చూస్తూ ఇట్లు పలికెను.
రుక్మిణ్యువాచ ।
నన్వేవమేతదరవిందవిలోచనాహ
యద్వై భవాన్ భగవతోఽసదృశీ విభూమ్నః ।
క్వ స్వే మహిమ్న్యభిరతో భగవాంస్త్ర్యధీశః
క్వాహం గుణప్రకృతిరజ్ఞగృహీతపాదా ॥
రుక్మిణి ఇట్లు పలి కెను --- పద్మములువంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నీవు పరబ్రహ్మవు, భగవానుడవు. నీకు నేను తగినదానను కానని నీవు చెప్పిన మాట యేది గలదో, అది నిశ్చయముగా యథార్థము. నీవు నీ ఆనందస్వరూపము నందు రమించే భగవానుడవు, సత్త్వరజస్తమోగుణములను నియంత్రించువాడవు. గుణములే స్వరూపముగా గల నా పాదములను అజ్ఞానులు మాత్రమే పట్టుకొనెదరు. నీవెక్కడ? నేనెక్కడ?
సత్యం భయాదివ గుణేభ్య ఉరుక్రమాంతః
శేతే సముద్ర ఉపలంభనమాత్ర ఆత్మా ।
నిత్యం కదింద్రియగణైః కృతవిగ్రహస్త్వం
త్వత్సేవకైర్నృపపదం విధుతం తమోంఽధమ్ ॥
మూడడుగులతో జగత్తును కొలిచిన - ఓ దేవా! నీవు సత్త్వరజస్తమోగుణముల కార్యములగు శబ్దాదులకు భయపడినావా యన్నట్లు అంతఃకరణమనే సముద్రములో చైతన్యఘనమగు ఆత్మ వై నిలిచియుందువు (రాజులకు భయపడి సముద్రములో తల దాచుకున్నాను అనే శ్రీకృష్ణుని మాటకు సమాధానము). నీకు దుష్టములగు ఇంద్రియముల గణములతో ఎల్లవేళలా విరోధమే (బలవంతులతో నాకు విరోధము అన్న మాటకు ఉత్తరము). గాఢమగు అజ్ఞానమునకు నిలయమైన రాజపదవిని నీ భక్తులే తిరస్కరించినారు (రాజపదవిని విడిచినవాడననే మాటకు ఉత్తరము).
త్వత్పాదపద్మమకరందజుషాం మునీనాం
వర్త్మాస్ఫుటం నృపశుభిర్నను దుర్విభావ్యమ్ ।
యస్మాదలౌకికమీవే హితమీశ్వరస్య
భూమంస్తవేహితమథో అను యే భవంతమ్ ॥
ఓ పరబ్రహ్మా! నిన్నే అనుసరిస్తూ పద్మమువంటి నీ పాదముల ధ్యానము యొక్క ఆనందముననుభవించే ధ్యానయోగుల మార్గము కూడ అస్పష్టముగనే యుండును. వారి చేష్ట లోకాతీతముగనుండును. వారి మార్గమును, చేష్టను పశువులవంటి మానవులు ఊహ కూడ చేయలేరనేది నిశ్చయము. అట్టిచో సర్వేశ్వరుడవగు నీ స్వరూపము గాని, చేష్ట గాని ఊహకందనిదని వేరుగా చెప్పవలయునా? (13 వ శ్లోకమునకు ఉత్తరము)
నిష్కించనో నను భవాన్న యతోఽస్తి కించిత్
యస్మై బలిం బలిభుజోఽపి హరంత్యజాద్యాః ।
న త్వా వీదంత్యసుతృపోంఽతకమాడ్యతాంఽధాః
ప్రేష్ఠో భవాన్ బలిభుజామపి తేఽపి తుభ్యమ్ ॥
నీవు నిశ్చయముగా ఏమీ లేనివాడవే. ఎందుకంటే, నీ కంటే భిన్నముగా ఏదీ లేనే లేదు. పూజలనందుకునే స్వయంభువుడగు బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగువారు కూడ నీకు పూజను సమర్పించేదరు. ఇంద్రియభోగలోలురు, సంపన్నులమనే అభిమానముచే వివేకమును కోల్పోయినవారు సర్వసంహారక కాలరూపుడవగు నిన్ను తెలియజాలరు. పూజలనందుకునే బ్రహ్మాదులకు కూడ నీవు ప్రియతముడవు (ఆత్మవు). వారు కూడ నీకు ప్రియతములు. (14 వ శ్లోకమునకు సమాధానము).
త్వం వై సమస్తపురుషార్థమయః ఫలాత్మా
యద్వాంఛయా సుమతయో విసృజంతి కృత్స్నమ్ ।
తేషాం విభో సముచితో భవతస్సమాజః
పుంసః స్త్రీయాశ్చ రతస్సుఖదుఃఖినోర్నః ॥
ధర్మార్థకామమోక్షములనే పురుషార్థరూపములో ఉన్నది నిశ్చయముగా నీవే. వాటి ఫలము కూడ నీవే. నిన్ను గోరి వివేకవంతులు సర్వమును త్యజించెదరు. ఓ ప్రభూ! అట్టి వివేకులకు నీతోడి (స్వస్వామి) సంబంధమే తగియున్నది. పరస్పరాసక్తితో సుఖదుఃఖములననుభవిస్తూ ఉండే స్త్రీపురుషులతోడి సంగము వారికి సముచితము కాదు. (15 కి ఉత్తరము).
త్వం న్యస్తదండమునిభిర్గదితానుభావ
ఆత్మాఽఽత్మదశ్చ జగతామితి మే వృతోఽసీ ।
హిత్వా భవద్భ్రువ ఉదీరితకాలవేగ-
ధ్వస్తాశిషోఽబ్జభవనాకపతీన్ కుతోఽన్యే ॥
ప్రాణిహింసను విడిచి పెట్టిన మహర్షులు నీ మహిమను కొనియాడుచుందురు. నీవు ప్రాణులకు ఆత్మవు. నీవు నీ భక్తులకు నిన్నే సమర్పించుకొనెదవు. ఈ సంగతి తెలిసియే నేను నిన్ను వరించినాను. నీ కనుబొమల సైగచే ప్రవర్తిల్లే కాలము మహావేగముతో బ్రహ్మదేవుని మరియు లోకపాలకుల భోగములను ఖండించును. నేను వారిని కూడ విడిచి పెట్టి నిన్ను వరించగా, శిశుపాలాదుల గురించి చెప్పేదేమున్నది? (16, 17 శ్లోకములకు ఉత్తరము).
జాడ్యం వచస్తవ గదాగ్రజ యస్తు భూపాన్
విద్రావ్య శార్ జ్గనీనదేన జహర్థ మాం త్వమ్ ।
సింహో యథా స్వబలిమీశ పశూన్ స్వభాగం
తేభ్యో భయాద్యదుదధిం శరణం ప్రపన్నః ॥
గదుని అన్నయగు ఓ శ్రీకృష్ణా! ఈశ్వరుడవగు నీవు, సింహము పశువులను తరిమి తన భాగమును తీసుకున్నట్లుగా, శిశుపాలాదులను శార్జమనే ధనుస్సుయొక్క ధ్వనిచేతనే తరిమికొట్టి నన్ను తీసుకు వచ్చితివి. నీవా రాజులకు భయపడి సముద్రమును శరణు జొచ్చితివని నీవు చెప్పిన మాట యుక్తియుక్తముగా లేదు.
యద్వాంఛయా నృపశిఖామణయోంఽగవైన్య
జాయంతనాహుషగయాదయ ఐకపత్యమ్ ।
రాజ్యం విసృజ్య వివిశుర్వనమంబుజాక్ష
సీదంతి తేఽనుపదవీం త ఇహాస్థితాః కిమ్ ॥
పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! అంగుడు (వేనుని తండ్రి), వేనుని పుత్రుడగు పృథువు, జయంతుని పుత్రుడగు భరతుడు, నహుషుని పుత్రుడగు యయాతి, గయుడు, సగరుడు మొదలైన గొప్ప రాజులు నిన్ను పొందగోరి , ఏకచ్ఛత్రాధిపత్యమగు సామ్రాజ్యమును విడిచి పెట్టి అడవికి వెళ్లి నీ మార్గమునే అనుసరించిరి. వారీ సంసారములో ఇడుముల పాలైనారా యేమి? (లేదు).
కాఽన్యం శ్రయేత తవ పాదసరోజగంధం
ఆఘ్రాయ సన్ముఖరితం జనతాఽపవర్గమ్ ।
లక్ష్మ్యాలయం త్వవిగణయ్య గుణాలయస్య
మర్త్యాసదోరుభయమర్థవివిక్తదృష్టిః ॥
కల్యాణగుణనిధానమగు నీ పద్మములవంటి పాదముల పరిమళము (పాదముల మహిమ) ను మహాత్ములు కీర్తించుచుందురు. మానవులకు మోక్షమునిచ్చే నీ పాదపద్మములు లక్ష్మీదేవికి కూడ నివాసస్థానము. వాటి మహిమ తెలిసి కూడా వాటిని కాదని, తత్త్వవివేచనము చేయగల బుద్ది గల ఏ స్త్రీ ఇతరవ్యక్తిని ఆశ్రయించును? (ఎవరైననూ ఆశ్రయించరు). ఇతరమానవులు మరణించే స్వభావము గలవారై, ఎల్లవేళలా అధికమగు భయమును కలిగియుందురు గదా!(17 వ శ్లోకమునకు ఉత్తరము).
తం త్వాఽనురూపమభజం జగతామధీశం
ఆత్మానమత్ర చ పఠత్ర చ కామపూరమ్ ।
స్యాన్మే తవాంఘ్రిరరణం సృతిభిర్ర్భమంత్యా
యో వై భజంతముపయాత్యనృతాపవర్గః ॥
నీవు జగత్తులకు అధీశ్వరుడవే గాక, ఆత్మ స్వరూపుడవు కూడా. ఇహపర లోకములలో కామనలను పూర్ణము చేసే నిన్ను నేను వరునిగా సేవించి మంచి పనే చేసితిని. నీవు నిన్ను సేవించువారలకు నీ స్వరూపమునే యిచ్చి మిథ్యా సంసారమునుండి మోక్షమును కలిగించెదవు. అట్టి నీ పాదము జననమరణ ప్రవాహములో పరిభ్రమిస్తున్న నాకు శరణము అగు గాక!
తస్యాస్స్యురచ్యుత నృపా భవతోపదిష్టాః
స్త్రీణాం గృహేషు ఖరగోశ్వబిడాలభృత్యాః ।
యత్కర్ణమూలమరికర్షణ నొపయాయాద్
యుష్మత్కథా మృడవిరించసభాసు గీతా ॥
ఓ అచ్యుతా! నీవు శత్రువులను కృశింపజేసెదవు. నీవు గొప్పవారని పొగిడిన శిశుపాలాదులు స్త్రీల ముంగిట, తిరస్కరించినా వెనుకపడే గాడిదలను, బరువులను మోసే ఎద్దులను, కాపలా కుక్కలను, ఉచ్చిష్ట మును తినే పిల్లులను పోలెదరు. నీ గాథను శంకరబ్రహ్మదేవుల సభలలో గానము చేసెదరు. అట్టి నీ గాథ ఏ స్త్రీయొక్క చెవుల మార్గమును ప్రవేశించలేదో, అట్టి స్త్రీకి ఆ రాజులు భర్తలు అగుదురు గాక!
త్వక్శ్మశ్రురోమనఖకేశపినద్దమంతః
మాంసాస్థిరక్తకృమివిట్కఫపిత్తవాతమ్ ।
జీవచ్చవం భజతి కాంతమతిర్విమూఢా
యా తే పదాబ్జమకరందమజిఘ్రతీ స్త్రీ ॥
నీ పాదపద్మముల తేనెను ఆఘ్రాణించని (నీ పాదముల మహిమను వినని) స్త్రీ పరమమూర్ఖురాలు. అట్టి స్త్రీ చర్మము, మీసములు, గెడ్డము,రోమములు, గోళ్లు, జుట్టులచే కప్పబడి, మాంసము, ఎముకలు, రక్తము, క్రీములు, మాలిన్యములు, కఫము, పిత్తము, వాతములను కలిగి జీవిస్తున్న శవమును ప్రియుడనే భావనతో సేవించును.(నేనైతే విమూఢను కాను).
అస్త్వంబుజాక్షమమ తే చరణానురాగ
ఆత్మన్ రతస్య మయి చానతిరిక్తదృష్టేః ।
యర్హ్యస్య వృద్ధయ ఉపాత్తరజ్యోఽతిమాత్రో
మామీక్ష సే తదుహ నః పరమానుకంపా ॥
పద్మములవంటి కన్నులు గల ఓ శ్రీకృష్ణా! నీవు ఆత్మారాముడవు గనుక నాయందు నీకు అతిశయమగు దృష్టి ఉండదు. కాని, నాకు మాత్రము నీ పాదములయందు ప్రేమ కలుగుగాక! సృష్టికాలమునందు ఈ జగత్తు యొక్క అభివృద్ధి కొరకై నీవు ఉత్కటమగు రజోగుణమును స్వీకరించి నా (ప్రకృతి) వైపు చూచెదవు. అదియే మాకు గొప్ప అనుగ్రహము. (20 వ శ్లోకమునకు ఉత్తరము).
నైవాలీకమహం మన్యే వచస్తే మధుసూదన ।
అంబాయా ఇవ హి ప్రాయః కన్యాయాస్స్యాద్రతిః క్వచిత్ ॥
మధువు అనే రాక్షసుని సంహరించిన ఓ శ్రీకృష్ణా! నీ మాట అసత్యమని నేను సుతరాము తలచుట లేదు. ఎందుకంటే, కాశిరాజపుత్రికయగు అంబను తీసుకువెళ్లినది భీష్ముడే అయినా, ఆమె మనస్సు శాల్వునిపై నుండెను. కన్యకు తరుచుగా ఏదో , ఒక పురుషునియందు ప్రేమ కలుగుచుండును.(కాని నేను అట్లు కాదు).
వ్యూఢయాశ్చాపి పుంశ్చల్యా మనోఽభ్యేతి నవం నవమ్ ।
బుధోఽసతీం న బిభృయాత్తాం బిభ్రదుభయచ్యుతః ॥
పెళ్లి అయిన తరువాత కూడా కులట మనస్సు కొత్త కొత్త పురుషుల పైకి ప్రసరించును. వివేకి అట్టి దుష్టురాలిని వివాహమాడరాదు. వివాహమాడినవాడు ఇహపరముల రెండింటికీ భ్రష్టుడగును.
శ్రీభగవానువాచ ।
సాధ్వ్యీతచ్చ్రోతుకామైస్త్వం రాజపుత్రి ప్రలంభితా ।
మయోదితం యదన్వాత్థ సర్వం తత్సత్యమేవ హి ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ రాజకుమారీ! నీవు పతివ్రతవు. నీ నోటి నుండి ఈ మాటలను వినుటకే మేము నిన్ను పరిహాసము చేసితిమి. ఎందుకంటే, నేను చెప్పిన మాటకు బదులుగా నీవు చెప్పిన ప్రతి మాట యథార్థమే.
యాన్ యాన్ కామయ సే కామాన్మయ్యకామాయ భామిని ।
సంతి హ్యేకాంతభక్తాయాస్తవ కల్యాణి నిత్యదా ॥
ప్రణయకోపము గల ఓ కల్యాణీ! నాయందు చేయబడిన కామనలు మోక్షమునిచ్చేవే గాని సంసారబంధమును కలిగించేవి కావు. నీకు నాయందు పరమభక్తి గలదు. నీవు ఏయే కామనలను కోరెదవో అవి నీకు ఎల్లవేళలా ప్రాప్తములే.(నీవు కోరనక్కరయే లేదు).
ఉపలబ్దం పతిప్రేమ పాతివ్రత్యం చ తేఽనఘే ।
యద్వాక్యైశ్చాల్యమానియా న ధీర్మయ్యపకర్షితా ॥
ఓ పుణ్యాత్మురాలా! నీకు భర్తనగు నాయందుండే ప్రేమ, నీ పాతివ్రత్యము కూడ నిరూపితమైనవి. ఎందుకంటే, నిన్ను విచలితము చేసినా, నాయందలి నీ మనస్సు మరో వైపు లాగబడలేదు.
యే మాం భజంతి దాంపత్యే తపసా వ్రతచర్యయా ।
కామాత్మానోఽపవర్గేశం మోహితా మమ మాయయా ॥
నేను మోక్షమునిచ్చే ప్రభుడను. కాని, ఎవరైతే కామనతో నిండిన అంతఃకరణము గలవారై తపస్సును, వ్రతములను చేసి దాంపత్యసుఖము కొరకై నన్ను సేవింతురో, వారు నా మాయచే మోహితులైనారు.
మాం ప్రాప్య మానిన్యపవర్గసంపదం
వాంఛంతి యే సంపద ఏవ తత్పతిమ్ ।
తే మందభాగ్యా నిరయేఽపి యే నృణాం
మాత్రాత్మకత్వాన్నిరయస్సుసంగమః । ।
అభిమానవతియగు ఓ రుక్మిణీ! మోక్షమునకు, సంపదలకు కూడ నేనే ప్రభుడను. కాని, నన్ను చేరుకొని ఎవరైతే సంపదలను మాత్రమే కోరెదరో, వారి భాగ్యము అల్పము మాత్రమే. ఎందుకంటే, భోగములు నరకమువంటి నికృష్టజన్మలో కూడ ఉండును. మానవులకు శబ్దాది విషయములే ప్రధానమైనచో, అవి నరకములో కూడ ఉండును గనుక, నరకము కూడ మంచిది, పొందదగినదియే అగును.
దిష్ట్యా గృహేశ్వర్యసకృన్మయి త్వయా
కృతాఽనువృత్తీర్భవమోచనీ ఖలైః ।
సుదుష్కరాఽసౌ సుతరాం దురాశిషో'
హ్యసుంభరాయా నికృతింజుషః స్త్రియాః ॥
ఓ రుక్మిణీ! నీవు ఇంటికి రాణివై నిరంతరముగా నాకు సేవను చేసితివి. ఇది మంగళము. ఇట్టి నా సేవ సంసారబంధమునుండి విముక్తినిచ్చును. దుష్టులు ఇట్టి సేవను చేయలేరు. దురభిప్రాయము కలిగి ఇంద్రియ భోగపరాయణురాలై వంచనాపరురాలగు స్త్రీ ఇట్టి సేవను చేయుట నిశ్చయముగా సుతరాము దుష్కరము.
న త్వాదృశీం ప్రణయినీం గృహిణీం గృహేషు
పశ్యామి మానిని యయా స్వవివాహకాలే ।
ప్రాప్తాన్ నృపానవగణయ్య రహోహరో మే
ప్రస్థాపితో ద్విజ ఉపశ్రుతసత్కథస్య ॥
ఓ అభిమానవతీ! గృహములలో నీవంటి ప్రేమ గల గృహిణి నాకు కానరాదు. నాగురించి మంచి సమాచారమును విన్న నీవు స్వయంవరమునకు వచ్చియున్న రాజులను తిరస్కరించి, రహస్యమగు ప్రేమసందేశముతో బ్రాహ్మణుని నావద్దకు పంపితివి.
భ్రాతుర్విరూపకరణం యుధి నిర్జితస్య
ప్రోద్వాహపర్వణి చ తద్వధమక్షగో ష్ఠ్యామ్ ।
దుఃఖం సముత్థమసహోఽస్మదయోగభీత్యా
నైవాబ్రవీః కిమపి తేన వయం జితాస్తే ॥
యుద్దములో జయించబడిన నీ సోదరుడగు రుక్మిని నేను విరూపునిగా చేయుట, అనిరుద్ధుని వివాహమహోత్సవములో జూదపు సమావేశములో రుక్మిని బలరాముడు వధించుట, ఈ విషయములు గుర్తుకు వచ్చినప్పుడు దుఃఖము పెల్లుబుకుట అనే ఈ సందర్భములను నీవు సహించితివి. నాతో వియోగము వచ్చునేమో అనే భయముతో నీవా సందర్బములలో ఒక్క మాటనైననూ నాతో అనలేదు. నీ ఆ ప్రేమచే నేను జయించబడితిని.
దూతస్త్వయాఽఽత్మలభనే సువివిక్తమంత్రః
ప్రస్థాపితో మయి చిరాయతి శూన్యమేతత్ ।
మత్వా జిహాస ఇదమంగమనన్యయోగ్యం
తిష్ఠేత తత్త్వయి వయం ప్రతినందయామః ॥
నన్ను పొందుటకై నీవు రహస్యసందేశమును బాగా వివేచించి చెప్పి దూతను పంపితివి. నేను వచ్చుటలో కొంత విలంబము కాగా, నీకీ జగత్తు శూన్యముగా భాసించినది. నీ దేహము మరియొకనికి తగినది కాదని నీవు తలచి, ప్రాణత్యాగమునకు సిద్ధపడితివి. ఆ నిశ్చయము నీయందే ఉండుగాక! నిన్ను అభినందించుట తప్ప మేము ప్రతికృతిని చేయలేము.
శ్రీశుక ఉవాచ ।
ఏవం సౌరతసంలాపైర్బగవాఞ్జగదీశ్వరః ।
స్వరతో రమయా రేమే నరలోకం విడంబయన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తును శాసించువాడు, ఆత్మా రాముడు అగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా మానవలోకముననుకరిస్తూ, లక్ష్మి అవతారమగు రుక్మిణీ దేవితో ప్రేమ కబుర్లను చెబుతూ రమించేను.
తథాఽన్యాసామపి విభుర్గృహేషు గృహవానివ ।
ఆస్థితో గృహమేధీయాన్ ధర్మాంల్లోకగురుర్హరిః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్దే షష్టితమోఽధ్యాయః ॥
సర్వసమర్థుడు, జగద్గురువు అగు శ్రీకృష్ణ భగవానుడు గృహస్థు వలే ఇతరభార్యల ఇళ్లలో కూడ అదే విధముగా గృహస్థాశ్రమధర్మములననుష్ఠించెను.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో రుక్మిణీ శ్రీకృష్ణ సంవాదమును వర్ణించే అరువదియవ అధ్యాయము ముగిసినది (60).
Summary of chapter 60 of the Bhāgavata Mahā Purana is as follows:
One afternoon in Dvārakā, Svayam Bhagavān Śrī Kṛshṇa sat upon Rukmiṇī-devī's opulent bed while she served Him with a jewel-handled whisk. Desiring to experience the sweetness of her unalloyed love, Kṛshṇa playfully teased Rukmiṇī, asking why an exalted princess like her had chosen a penniless mendicant like Him who had abandoned His kingdom out of fear of kings. Kṛshṇa suggested that she should have married a wealthy, powerful monarch like Śiśupāla or Jarāsandha. Hearing Kṛshṇa's words and fearing that He intended to abandon her, Rukmiṇī became paralyzed with grief; her golden whisk slipped from her hand, and she collapsed unconscious to the floor. Deeply moved by her distress, Kṛshṇa leaped from the bed, lifted her up, and comforted her with tender words, revealing that He had spoken only in jest to hear her loving responses, confirming that her pure devotion was unrivaled.