67- ద్వివిదుని ఉద్ధరించుట

రాజోవాచ

భూయోఽహం శ్రోతుమిచ్ఛామి రామస్యాద్భుతకర్మణః

అనంతస్యా ప్రమేయస్య యదన్యత్కృతవాన్ ప్రభుః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- అవినాశియగు బలరాముడు ఇంద్రియగోచరము కాని స్వరూపము గలవాడు. సర్వసమర్థుడగు ఆయన ఆశ్చర్యకరములగు చేష్టలను చేయును. ఆయన ఇంకా ఏమి చేసినాడో, వాటిని వినగోరుచున్నాను. .

శ్రీశుక ఉవాచ

నరకస్య సఖా కశ్చిద్ద్వివిదో నామ వానరః

సుగ్రీవసచివస్సోఽథ భ్రాతా మైందస్య వీర్యవాన్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ద్వివిదుడని ప్రసిద్ధి గాంచిన వానరుడొకడు గలడు. పరాక్రమశాలియగు ఆతడు: నరకుని మిత్రుడు, సుగ్రీవుని మంత్రి, మైందుని సోదరుడు.

సఖ్యుస్సోఽపచితిం కుర్వన్ వానరో రాష్ట్రవిప్లవమ్

పురగ్రామాకరాన్ ఘోషానదహద్వహ్నిముత్సృజన్

ఆ వానరుడు మిత్రుడగు నరకుని ఋణమును తీర్చుకొనుటకై దేశమునకు ఉపద్రవమును కలిగించెను. ఆతడు నగరములకు, గ్రామములకు, గనులకు, గొల్లపల్లెలకు నిప్పు పెట్టి తగులబెట్టేను.

క్వచిత్స శైలానుత్పాట్య తైర్దేశాన్ సమచూర్ణయత్

ఆనర్తాన్ సుతరామేవ యత్రాస్తే మిత్రహా హరిః

ఒకప్పుడు 'ఆతడు పర్వతశిఖరములను పెల్లగించి వాటితో జనావాసములను నుగ్గు నుగ్గు చే సెను. ఆతడు తన మిత్రుడగు నరకుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు ఉన్న కారణంగా ఆనర్త దేశమునకు మరింత ఉపద్రవమును చేసెను.

క్వచిత్సముద్రమధ్యస్థో దోర్భ్యాముత్ క్షిప్య తజ్జలమ్

దేశాన్నాగాయుతప్రాణో వేలకూలానమజ్జయత్

పది వేల ఏనుగుల బలము గల ఆ ద్వివిదుడు ఒకప్పుడు సముద్రము మధ్యలో నిలబడి రెండు చేతులతో నీటిని పైకి లేపి, సముద్రతీరమునందలి జనావాసములను ముంచెడివాడు.

ఆశ్రమానృషి ముఖ్యానాం కృత్వా భగ్నవనస్పతీన్

అదూషయచ్ఛకృన్మూత్రైరగ్నీన్ వైతానికాన్ ఖలః

దుష్టుడగు ద్వివిదుడు మహర్షుల ఆశ్రమములలోని చెట్లను విరుగకొట్టి, యజ్ఞమునకు చెందిన అగ్నులను మలమూత్రాలతో కలుషితము చేసెను. .

పురుషాన్ యోషీతో దృప్తః క్ష్మాభృద్ద్రోణీగుహాసు సః

నిక్షిప్య చాప్యధాచ్ఛైలైః పేశస్కారీవ కీటకమ్

పొగ రెక్కిన ఆ ద్వివిదుడు స్త్రీపురుషులను పర్వతముల లోయలలోని గుహలలో బంధించి వాటి ముఖములను బండరాళ్లతో మూసివేసి, భ్రమరము పురుగును గూడులో వలె, బంధించెడివాడు.

ఏవం దేశాన్ విప్రకుర్వన్ దూషయంశ్చ కులస్త్రియః

శ్రుత్వా సులలితం గీతం గిరిం రైవతకం యయౌ

ఈ విధముగా ఆతడు జనావాసములకు ఉపద్రవమును చేస్తూ, కులస్త్రీలను కూడ చెడగొట్టుచుండెను. ఆతడు మిక్కిలి శ్రావ్యమగు పాటను విని రైవతకపర్వతము పైకి వెళ్లాను.

తత్రాపశ్యద్యదుపతిం రామం పుష్కరమాలినమ్

సుదర్శనీయసర్వాంగం లలనాయూథమధ్యగమ్

అచట ఆతనికి యాదవప్రభుడగు బలరాముడు కనబడెను. మిక్కిలి అందమైన అన్ని అవయవములు గల బలరాముడు పద్మముల మాలను దాల్చి యువతుల సమూహము మధ్యలోనుండెను.

గాయంతం వారుణీం పీత్వా మదవిహ్వలలోచనమ్

విభ్రాజమానం వపుషా ప్రభిన్నమివ వారణమ్

మదిరను త్రాగి పాడుచున్న ఆయన కన్నులు మత్తుచే స్వాధీనత తప్పెను. ఆయన దేహముచే మదించిన ఏనుగు వలె ప్రకాశించుచుండెను.

దుష్ట శ్శాఖామృగశ్శాఖామారూఢః కంపయన్ ద్రుమాన్

చక్రే కిలకిలాశబ్దమాత్మానం సంప్రదర్శయన్

ద్వివిదుడు దుష్టవానరుడు. ఆతడు చెట్టెక్కి చెట్లను ఊపుతూ తాను అందరికీ కనబడునట్లు కిలకిలధ్వనిని చే సెను.

తస్య ధార్ ష్ట్యం కపేర్వీక్ష్య తరుణ్యో జాతిచాపలాః

హాస్యప్రియా విజహసుర్బలదేవపరిగ్రహాః

బలరాముని భార్యలు చపలస్వభావము, పరిహాసము నందు ప్రీతి గల యువతులు. వారా వానరముయొక్క పొగరు చూచి ఎక్కువగా నవ్విరి.

తా హేలయామాస కపీర్భ్రూ క్షే పైస్సమ్ముఖాదిభిః

దర్శయన్ స్వగుదం తాసాం రామస్య చ నిరీక్షతః

బలరాముడు చూస్తున్నా లెక్క చేయకుండా ఆ వానరుడు ఆ స్త్రీలకు యెదురుగా వచ్చి కనుబొమలను విరుచుట, పళ్లను ఇకిలించుట మొదలగు చేష్టలను చేసెను. వారికి తన గుదమును చూపి అవ హేళనము చేసెను.

తం గ్రావ్ణా ప్రాహరత్క్రుద్ధో బలః ప్రహరతాం వరః

స వంచయిత్వా గ్రావణం మదిరాకలశం కపిః

గృహీత్వా హేలయామాస ధూర్తస్తం కోపయన్ హసన్

నిర్ఛిద్య కలశం దుష్టో వాసాంస్యాస్ఫాలయద్బలమ్

కదర్థీ కృత్య బలవాన్ విప్రచక్రే మదోద్ధతః

యుద్ధవీరులలో శ్రేష్ఠుడగు బలరాముడు కోపించి ఆ ద్వివిదుని రాతితో కొట్టగా, ధూర్తుడైన ఆ వానరుడు నవ్వుతూ రాతిని తప్పించుకొని మద్యపాత్రను తీసుకొని పగులగొట్టెను. బలరామునకు కోపము వచ్చెను. ద్వివిదుడు బలవంతుడైన దుష్టుడు. బలముచే గర్వించియున్న ఆతడు వస్త్రములను లాగి చింపివేసెను. ఈ విధముగా ఆతడు బలరాముని తిరస్కరించి అపకారము చేసెను.

తం తస్యావినయం దృష్ట్వా దేశాంశ్చ తదుపద్రుతాన్

క్రుద్ధో ముసలమాదత్త హలం చారిజిఘాంసయా

ద్వివిదుని ఆ పొగరును, వాడు జనావాసములకు కలిగించిన ఉపద్రవమును చూచి బలరాముడు మండిపడెను. ఆ శత్రువును చంపగోరి ఆయన రోకలిని, నాగలిని కూడ తీసుకొనెను.

ద్వివిదోఽపి మహావీర్యశ్శాలముద్యమ్య పాణినా

అభ్యేత్య తరసా తేన బలం మూర్ధన్యతాడయత్

గొప్ప పరాక్రమము గల ద్వివిదుడు కూడ చేతితో చెట్టును పెకిలించి వేగముతో ఎదురుగా వచ్చి, దానితో బలరాముని తలపై కొట్టెను.

తం తు సంకర్షణో మూర్ధ్ని పతంతమచలో యథా

ప్రతిజగ్రాహ బలవాన్ సునందేనాహనచ్చ తమ్

బలశాలియగు బలరాముడు పర్వతము వలె అవిచలితుడై, తలపై పడుచున్న ఆ చెట్టును పట్టుకొని, సునందమనే రోకలితో వానిని కొట్టెను.

ముసలాహతమస్తిష్కో విరేజే రక్తధారయా

గిరిర్యథా గైరీకయా ప్రహారం నానుచింతయన్

పునరన్యం సముత్ క్షిప్య కృత్వా నిష్పత్రమోజసా

తేనాహనత్సుసంక్రుద్దస్తం బలశ్శతధాఽచ్చినత్

తతోఽన్యేన రుషా జఘ్నే తం చాపి శతధాఽచ్ఛినత్

రోకలితో తలపై కొట్టబడిన ద్వివిదుడు జేగురుతో కూడిన పర్వతము వలే విరాజిల్లేను. ఆతడా దెబ్బను సరుకు చేయకుండా, బలముగా మరల ఇంకో చెట్టును ఊడబెరికి దాని ఆకులను దూసివేసి దానితో బలరాముని కొట్టెను. మిక్కిలి కోపించిన బలరాముడు ఆ చెట్టును వంద ముక్కలు చేసెను. ద్వివిదుడు తరువాత కోపముతో ఇంకో చెట్టుతో కొట్టెను. బలరాముడు దానిని కూడ వంద ముక్కలు చేసెను.

ఏవం యుధ్యన్ భగవతా భగ్నే భగ్నే పునః పునః

ఆకృష్య సర్వతో వృక్షాన్ నిర్వృక్షమకరోద్వనమ్

ఈ విధముగా ద్వివిదుడు బలరామ భగవానునితో యుద్ధము చేయుచుండెను. ఆతడు చెట్టుతో కొట్టుట, బలరాముడు దానిని ముక్కలు చేయుట, ఈ తీరున మరల మరల యుద్ధము జరిగెను. ఆతడు అడవిలో అన్ని వైపులనుండీ చెట్లను ఊడలాగి ఆ అడవిలో చెట్లు లేకుండా చేసెను.

తతోఽముంచచ్ఛిలావర్షం బలస్యోపర్యమర్షితః

తత్సర్వం చూర్ణయామాస లీలయా ముసలాయుధః

తరువాత ద్వివిదుడు కోపించి బలరామునిపై రాళ్లవానను కురిపిం చెను. ఆయన రోకలి అనే ఆయుధముతో రాళ్లనన్నింటినీ పిండిగా చేసెను.

స బాహూ తాలసంకాశౌ ముష్టి కృత్య కపీశ్వరః

ఆసాద్య రోహిణీపుత్రం తాభ్యాం వక్షస్యరూరుజత్

వానరశ్రేష్ఠుడగు ఆ ద్వివిదుడు రెండు చేతులను పిడికిలిగా చేసి, రోహిణి పుత్రుడగు బలరాముని సమీపించి, ఆ రెండు చేతుల పిడికిలితో వక్షఃస్థలము పై కొట్టెను.

యాదవేంద్రోఽపీ తం దోర్బ్యాం త్యక్త్వా ముసలలాంగలే

జత్రావభ్యర్దయత్క్రుద్ధస్సోఽపతద్రుధిరం వమన్

యాదవశ్రేష్ఠుడగు బలరాముడు కూడ రోకలిని, నాగలిని విడిచి పెట్టెను. ఆయన కోపముగా వానిని రెండు చేతులతో కొంకులయందు కొట్టగా, వాడు రక్తమును గ్రక్కుతూ నేల గూలెను.

చకం పే తేన పతతా సటంకస్సవనస్పతిః

పర్వతః కురుశార్దూల వాయునా నౌరివాంభసి

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! ఆతడు నేల గూలుచుండగా, రాళ్ల పలకలతో చెట్లతో సహా ఆ పర్వతము, గాలికి సరస్సులోని పడవవలె, కంపించెను.

జయశబ్దో నమశ్శబ్దస్సాధు సాధ్వితి చాంబరే

సురసిద్ధమునీంద్రాణామాసీత్కుసుమవర్షిణామ్

ఆకాశమునందు దేవతలు, సిద్దులు, మహర్షులు పూల వానను కురిపిస్తూ జయము, నమస్కారము, బాగు బాగు అనే శబ్దములను చేసిరి.

ఏవం నిహత్య ద్వీవిదం జగద్వ్యతికరావహమ్

సంస్తూయమానో భగవాన్ జనైస్స్వపురమావిశత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే సప్తషష్టితమోఽధ్యాయః

లోకమునకు ఉపద్రవమును కలిగించే ద్వివిదుని బలరామ భగవానుడీ విధముగా సంహరించెను. జనులు కొనియాడుచుండగా ఆయన ద్వారకా నగరమునకు తిరిగి వచ్చెను.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో ద్వివిదుని ఉద్దారమును వర్ణించే అరువది ఏడవ అధ్యాయము ముగిసినది.