భాగవత మహా పురాణము
23 - యజ్ఞపత్నుల ఉద్ధారము
గోపా ఊచుః ।
రామ రామ మహావీర్య కృష్ణ దుష్టనిబర్హణ ।
ఏషా వై బాధతే క్షున్నస్తచ్చాంతిం కర్తుమర్హథః ॥
గోపాలకులిట్లు పలికిరి --- ఓ బలరామా! రామా! నీ పరాక్రమము గొప్పది. ఓ శ్రీకృష్ణా! నీవు దుష్టులను మట్టుబెట్టెదవు. ఈ ఆకలి మమ్ములను నిశ్చితముగా పీడించుచున్నది. మీరిద్దరు దీనికి ఉపశాంతిని కలిగించినచో బాగుండును.
శ్రీశుక ఉవాచ ।
ఇతి విజ్ఞాపితో గో పైర్బగవాన్ దేవకీసుతః ।
భక్తాయా విప్రభార్యాయాః ప్రసీదన్నిదమబ్రవీత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- గోప బాలకులు దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానునకు ఇట్లు విన్నవించిరి. భక్తురాండ్రగు బ్రాహ్మణపత్నుల యెడల ఆయన ప్రసన్నుడై యుండెను. ఆయన ఇట్లు పలికెను.
ప్రయాత దేవయజనం బ్రాహ్మణా బ్రహ్మవాదినః ।
సత్రయాంగిరసం నామ హ్యాసతే స్వర్గకామ్యయా ॥
మీరు యజ్ఞవాటికకు వెళ్లుడు. ఎందుకంటే, అచట వేదవేత్తలగు బ్రాహ్మణులు స్వర్గమును పొందాలనే కోరికతో బృహస్పతిసవమనే యాగమును చేయుచున్నారు.
తత్ర గత్వౌదనం గోపా యాచతాస్మద్విసర్జితాః ।
కీర్తయంతో భగవత ఆర్యస్య మమ చాభిధామ్ ॥
ఓ గోపాలకులారా! మా ఇద్దరిచే పంపబడే మీరు అచటకు వెళ్లుడు. అన్నగారు, పూజనీయుడు అగు బలరాముని పేరు చెప్పుడు. నా పేరును కూడ చెప్పి ఆహారమును కోరుడు.
ఇత్యాదిష్టా భగవతో గత్వాకయాచంత తే తథా ।
కృతాంజలిపుటా విప్రాన్ దండవత్పతితో భువి ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు ఆదేశించగా ఆ గోప బాలకులు వెళ్లి, వేద వేత్తలకు దోసిలి యొగ్గి సాష్టాంగప్రణామము చేసి అదే విధముగా కోరిరి.
హే భూమిదేవాశ్శృణుత కృష్ణస్యాదేశకారిణః ।
ప్రాప్తాఞ్జానీత భద్రం వో గోపాన్నో రామచోదితాన్ ॥
ఓ బ్రాహ్మణోత్తములారా! వినుడు. మేము శ్రీకృష్ణుని ఆజ్ఞను పాలించే గోపాలకులము. బలరాముడు పంపగా మేము వచ్చినామని తెలియుడు. మీకు మంగళమగు గాక!
గాశ్చారయంతావవిదూర ఓదనం రామాచ్యుతా వో లషతోబుభుక్షితా।
తయోర్ద్విజా ఓదనమర్థినోర్యది శ్రద్ధా చ వో యచ్ఛత ధర్మవిత్తమాః ॥
ఓ బ్రాహ్మణులారా! ఇక్కడకు దగ్గరలోనే బలరాముడు, శ్రీకృష్ణ మీరిచ్చిన ఆహారమును భుజించ గోరుచున్నారు. మీరు ధర్మము తెలిసిన వారిలో గొప్పవారు. మీకు శ్రద్ధ ఉన్నట్లైతే, వారిద్దరికి ఆహారమునిండు.
దీక్షాయాః పశుసంస్థాయాస్సొత్రమణ్యాశ్చ సత్తమాః ।
అన్యత్ర దీక్షితస్యాపి నాన్నమశ్నన్ హి దుష్యతి ॥
ఓ గొప్ప పుణ్యాత్ములారా! పశువినియోగము ఉండే దీక్షను, సౌత్రామణిని విడిచి పెట్టి మిగిలిన యజ్ఞములయందు దీక్ష తీసుకున్నవాని ఆహారమును తిన్ననూ నిశ్చయముగా దోషము లేదు.
ఇతి తే భగవద్యాద్దాం శృణ్వంతోఽపి న శుశ్రువుః ।
క్షుద్రాశా భూరికర్మాణో బాలిశా వృద్ధమానినః ॥
ఈ విధముగా భగవానుని కోరికను వారు విని కూడ పట్టించుకోలేదు. వారి కోరికలు స్వర్గము మొదలగు అల్పవిషయములకు చెందినవి. వారి కర్మలు చాల క్లేశముతో కూడినవి. వారు తత్త్వము తెలిసినవారు కారు. కాని, తాము జ్ఞానవృద్ధులమనే గర్వము వారికి గలదు.
దేశః కాలః పృథగ్ ద్రవ్యం మంత్రతంత్రర్వీజోఽగ్నయః ।
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః ॥
యజ్ఞమును చేసే దేశకాలములు, దానిలోని వేర్వేరు ద్రవ్యములు, మంత్రములు, కర్మను చేసే పద్ధతి, ఋత్విక్కులు, గార్హపత్యము మొదలైన అగ్నులు, అగ్ని మొదలగు దేవతలు, యజ్ఞమును చేయువాడు, యజ్ఞము, దాని వలన కలిగే పుణ్యము అనేవి ఆ భగవానుని రూపము లే.
తం బ్రహ్మ పరమం సాక్షాద్భగవంతమధోక్షజమ్ ।
మనుష్యదృష్ట్యా దుషజ్ఞా మర్త్యాత్మానో న మేనిదే ॥
శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మయే. ఆ బ్రాహ్మణులు మరణించే దేహమే ఆత్మ అనే దుష్ఠమగు బుద్ది గలవారు. కావుననే, మానవుడని తలచి వారాయనను ఆదరించలేదు.
న తే యదోమితి ప్రోచుర్న నేతి చ పరంతప ।
గోపా నిరాశాః ప్రత్యేత్య తథోచుః కృష్ణ రామయోః ॥
అంతశ్శత్రువులను నశింపజేసిన ఓ పరీక్షిన్మహారాజా! ఆ బ్రాహ్మణులు అవునని చెప్పలేదు, కాదని చెప్పలేదు. అప్పుడా గోపాలకులు నిరాశ జెంది తిరిగి వచ్చి ఆ విషయమును బలరామకృష్ణులకు చెప్పిరి.
తదుపాకర్ణ్య భగవాన్ ప్రహస్య జగదీశ్వరః ।
వ్యాజహార పునర్గోపాన్ దర్శయంల్లౌకికీం గతిమ్ ॥
జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆ మాటను విని బిగ్గరగా నవ్వెను. అన్నము కావాలంటే అడగాల్సింది గృహిణిని, అనే లోకవ్యవహార శైలిని ప్రదర్శించువాడై ఆయన మరల గోపాలకులతో నిట్లనెను.
మాం జ్ఞాపయత పత్నీభ్యససంకర్షణమాగతమ్ ।
దాస్యంతి కామమన్నం వస్నిగ్ధ మయ్యుషితా ధియా ॥
బలరామునితో గూడి నేను వచ్చియున్నానని ఆ బ్రాహ్మణుల భార్యలకు తెలుపుడు. వారు సహజప్రేమ గలవారు, మనస్సులో నన్నే భావన చేయువారు. వారు మీకు కావలసినంత ఆహారమునీయగలరు.
గత్వాకథ పత్నీశాలాయాం దృష్ట్వాఽఽసీనాస్స్వలంకృతాః ।
నత్వా ద్విజసతీధోపాః ప్రశ్రితా ఇదమబ్రువన్ ॥
అప్పుడు గోపాలకులు వెళ్లి బ్రాహ్మణపత్నుల శాలయందు కూర్చున్న బ్రాహ్మణపత్నులను చూచిరి. వారు చక్కగా అలంకరించుకొని యుండిరి. ఆ బాలకులు వారికి నమస్కరించి వినయముగా నిట్లనిరి.
నమో వో విప్రపత్నీభ్యో నిబోధత వచాంసీ నః ।
ఇతోకవిదూరే చరతా కృష్ణనే పేషీతా వయమ్ ॥
ఓ బ్రాహ్మణపత్నులారా! మీకు నమస్కారము. మా మాటలను దయతో వినుడు. ఇక్కడకు దగ్గరలోనే శ్రీకృష్ణుడు వచ్చియున్నాడు. ఆయన మమ్ములను ఇక్కడకు పంపినాడు.
గాశ్చారయన్ స గోపాలైస్సరామో దూరమాగతః ।
బుభుక్షితస్య తస్యాన్నం సానుగస్య ప్రదీయతామ్ ॥
శ్రీకృష్ణుడు బలరామునితో, గోపాలకులతో కలిసి గోవులను మేపుకుంటూ చాల దూరము వచ్చినాడు. ఆయనకు, ఆయన అనుచరులకు ఆకలి వేయుచున్నది. దయచేసి వారికి ఆహారమునిండు.
శ్రుత్వాఽచ్యుతముపొయాతం నిత్యం తద్దర్శనోత్సుకాః ।
తత్కథాఽఽక్షిప్తమనసో బభూవుర్జాతసంభ్రమాః ॥
ఆ బ్రాహ్మణపత్నులకు శ్రీకృష్ణ భగవానుని చూడాలనే ఉత్కంఠ ఎల్లవేళలా ఉండెను. ఆయన గాథలచే వారి మనస్సులు ఆకర్షితములయ్యెను. ఆయన దగ్గరకు వచ్చియున్నాడని, ఆకలితోనున్నాడని విని వారు చాల కంగారు పడిరి.
చతుర్విధం బహుగుణమన్నమాదాయ భాజనైః ।
అభిసస్రుః ప్రియం సర్వాస్సముద్రమివ నిమ్నగాః ॥
ఆ బ్రాహ్మణపత్నులందరు భక్ష్య (నమిలి తినేది)-భోజ్య (త్రాగిది)-లేహ్య (ఆస్వాదించేది)-చోష్య (చప్పరించేది) ములనే నాలుగు రకముల ఆహారమును పాత్రలతో తీసుకొని తమకు ఇష్టుడగు శ్రీకృష్ణుడు ఉన్న వైపుకు, నదులు సముద్రము వైపుకు వలె, వెళ్లిరి. ఆ ఆహారమునకు రుచి, పుష్టి మొదలగు గుణములనేకము గలవు.
నిషిధ్యమానాః పతిభిర్భ్రాతృభిర్బంధుభిస్సుతైః ।
భగవత్యుత్తమశ్లోకే దీర్ఘశ్రుతధృతాశయాః ॥
భర్తలు, సోదరులు, బంధువులు, పుత్రులు అడ్డుకున్ననూ వారు వెళ్లిరి. వారు ఉత్తమమగు కీర్తి గల శ్రీకృష్ణ భగవానుని గురించి చాల కాలము నుండి వినుచుండిరి. వారి మనస్సు ఆయనయందు లగ్నమయ్యెను.
యమునోపవన్వేశోకనవపల్లవమండితే ।
విచరంతం వృతం గోపైస్సాగ్రజం దదృశుః కి స్త్రీయః ॥
యమునానది ఒడ్డున అశోకవృక్షముల కొత్త చిగుళ్లతో అందముగానున్న ఉద్యానము గలదు. అచట అన్నగారితో, గోపాలకులతో కలిసి విహరిస్తున్న శ్రీకృష్ణుని బ్రాహ్మణపత్నులు చూచిరి.
శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హ-
ధాతుప్రవాలనటవేషమనువ్రతాం సే ।
విన్యస్తహస్తమితరేణ ధునానమజ్జం
కర్ణోత్పలాలకకపోలముఖాబ్జహాసమ్ ॥
బంగరు వన్నె గల వస్త్రమును దాల్చిన ఆ నల్లనయ్య మేడలో అడవి పూల మాలను, తలపై నెమలి పింఛమును చిగుళ్లను, దేహముపై రాతి రంగులను అలంకరించుకొని నటుని వలె నుండెను. ఆయన ఒక చేతిని ప్రక్కనున్న అనుచరుని భుజము పై వేసి, రెండవ చేతితో పద్మమును త్రిప్పుచుండెను. ఆయన చెవులలో కలువలు, చెక్కిళ్లపై ముంగురులు, పద్మమువంటి ముఖమునందు చిరునవ్వు ఉండెను.
ప్రాయశ్శ్రుతప్రియతమోదయకర్ణపూరైః
యస్మీన్నిమగ్నమనసస్తమథాక్షిగంధైః ।
అంతః ప్రవేశ్య సుచిరం పరిరభ్య తాపం
ప్రాజ్ఞం యథాఽభిమతయో విజహుర్నరేంద్ర ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ బ్రాహ్మణపత్నులకు శ్రీకృష్ణునిపై ప్రీతి మెండు. వారు. ఆయన గోపదవములను పలుమార్లు వినుటయే. కరాభరణములు కలిగియుండిరి. అట్లు విని వారి మనస్సు ఆయనయందు లగ్న మైనది. అప్పుడు వారాయనను కళ్లు అనే ద్వారముల గుండా లోపల (అంతఃకరణమునందు) ప్రవేశ పెట్టి, మనస్సులోనే చాల సేపు కౌగిలించుకొనిరి. నిద్రావస్థలో జనుల అహంకారములు ఒకే చిదన-ఆత్మయందు విలీనమై సేద దీరునట్లుగా, అప్పుడు వారు తాపమును విడిచి పెట్టిరి.
తాస్తథా త్యక్తసర్వాశాః ప్రాప్తి ఆత్మదిదృక్షయా ।
విజ్ఞాయాఖిలదృగ్ద్రష్టా ప్రాహ ప్రహసీతాననః ॥
శ్రీకృష్ణుడు సకలప్రాణులలో సకలబుద్ధివృత్తిసాక్షియగు ఆత్మయై ఉన్నాడు. వారు సకలకామనలను విడిచి పెట్టి తనను చూడ కోరికతో వచ్చినారని ఆయనకు తెలియును. ఆయన చిరునవ్వు మోముతోనిట్లనెను.
స్వాగతం వో మహాభాగా ఆస్యతాం కరవామ కిమ్ ।
యన్నో దిదృక్షయా ప్రాప్తి ఉపపన్నమిదం హి వః ॥
ఓ గొప్ప పుణ్యవతులారా! మీకు స్వాగతము. కూర్చుండుడు. నేను మీకు చేయదగినది ఏది గలదు? నన్ను చూచే కోరికతో (అడ్డులను దాటి) వచ్చుట అనే ఈ మీ ప్రవృత్తి మీ (ప్రేమ) కు ఎంతయు తగియున్నది.
నన్వద్ధామయి కుర్వంతి కుశలాస్వార్థదర్శనాః ।
అ హైతుక్యవ్యవహితాం భక్తిమాత్మప్రియే యథా ॥
తమ పురుషార్థమును గురించి స్పష్టమగు కల్పన గల నిపుణులైన (ఆత్మానాత్మవివేకము గల) సాధకులు సాక్షాత్తుగా నాయందు యథార్థముగా భక్తిని చేయుదురు. ఇది నిశ్చయము. వారి భక్తియందు ఫలాసక్తి గాని, అంతరాయములు గాని ఉండవు. నేను సర్వులకు ఆత్మను మరియు ప్రియుడను.
ప్రాణబుద్ధిమనస్స్వాత్మదారాపత్యధనాదయః ।
యత్సంపర్కాత్ప్రియా ఆసంస్తతః కో న్వపరః ప్రియః ॥
ఆత్మతోడి (కల్పిత) సంబంధము వలననే వ్యక్తికి తన ప్రాణములు, బుద్ది, మనస్సు, శరీరము, భార్య, సంతానము, ధనము, కీర్తి మొదలైనవి ప్రియములగుచున్నవి. అట్టి ఆత్మకంటె ప్రియమైనది మరొకటి ఏది గలదు? (లేదు).
తద్యాత దేవయజనం పతయో వో ద్విజాతయః ।
స్వసత్రం పారయిష్యంతి యుష్మాభిర్గృహమేధినః ॥
కావున మీరు యజ్ఞవాటమునకు వెళ్లుడు. మీ వలన గృహస్థులై మీ భర్తులగు బ్రాహ్మణులు తమ సత్రయాగమును సంపన్నము చేసుకొనెదరు.
పత్న్య ఊచుః ।
మైవం విభోఽర్హతి భవాన్ గదితుం నృశంసం
సత్యం కురుష్వ నిగమం తవ పాదమూలమ్ ।
ప్రాప్త వయం తులసీదామ పదావసృష్టం
కేశైర్నివోడుమతిలంఘ్య సమస్తబంధూన్ ॥
బ్రాహ్మణపత్నులిట్లు పలికిరి --- ఓ ప్రభూ! నీవీ విధముగా పరుషముగా పలుక తగదు. ఏకాంతభక్తులకు పునరావృత్తి లేదు, అనే వేదవాక్యము (నీ ఉపదేశము) ను . సత్యము చేయుము. మేము సకలబంధువులను తిరస్కరించి నీ పాదమూలమును చేరినాము. నీవు కాలితో (తిరస్కారపూర్వకముగా) ఇచ్చిన తులసిమాలనైననూ మేము జుట్టుముడియందు దాల్చెదము.
గృహ్ణంతి నో న పతయః పితరౌ సుతా వా
న భ్రాతృబంధుసుహృదః కుత ఏవ చాన్యే ।
తస్మాద్భవతపదయోః పతితాత్మనాం నో
నాన్యా భవేధ్గతిరరిందమ తద్విధేహి ॥
నీవు కామక్రోధములు మొదలైన అంతశ్శత్రువులను పోగొట్టెదవు. మా భర్తలు గాని, తల్లిదండ్రులు గాని, పుత్రులు గాని, సోదరులు గాని, బంధువులు గాని, మిత్రులు గాని మమ్ములను స్వీకరించరు. ఇక ఇతరులు ఏల స్వీకరించేదరు? కాబట్టి నీ పాదాగ్రములపై పడియున్న దేహములు గల మాకు (నీవు తప్ప) మరియొక గతి లేదు. మాకు నీ దాస్యమునిమ్ము.
శ్రీభగవానువాచ ।
పతయో నాభ్యసూయేరన్ పితృభ్రాతృసుతాదయః ।
లో కాశ్చ వో మయో పేతా దేవా అప్యనుమన్వతే ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- భర్తలు, తల్లిదండ్రులు, సోదరులు, కొడుకులు, బంధువులు మొదలగు వారు, జనులు కూడ మీ యెడల తప్పు పట్టరు. మీరు నాచే అనుజ్ఞనీయ బడినవారు. మిమ్ములను దేవతలు కూడ (నిర్దోషులని) స్వీకరించేదరు.
న ప్రీతయేఽనురాగాయ హ్యంగసంగో నృణామిహ ।
తన్మనో మయి యుంజానా అచిరాన్మామవాప్స్యథ ॥
ఈ లోకములో మానవులకు శరీరముతో కలయిక ఆనందమును గాని, అనురాగమును గాని కలిగించదు. కావున, మనస్సును నాయందు లగ్నము చేయుడు. తొందరలో నన్ను పొందెదరు.
శ్రీశుక ఉవాచ ।
ఇత్యుక్తా ద్విజపత్న్యస్తా యజ్ఞవాటం పునర్గతాః ।
తే చానసూయవస్వాభిః స్త్రీభిస్సత్రమపారయన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడిట్లు చెప్పగా, ఆ బ్రాహ్మణపత్నులు తిరిగి యజ్ఞవాటమునకు వెళ్లిరి. వారి భర్తలు వారియెడల దోషారోపణ చేయలేదు. పైగా, ఆ బ్రాహ్మణులు తమ భార్యలతో కలిసి సత్రయాగమును పూర్తి చేసిరి.
తత్రైకా విధృతా భర్త్రా భగవంతం యథాశ్రుతమ్ ।
హృదోపగుహ్య విజహౌ దేహం కర్మానుబంధనమ్ ॥
వారిలో ఒకామెను భర్త వెళ్లకుండా అడ్డుకొనెను. ఆమె శ్రీకృష్ణ భగవానుని రూపమును తాను విన్నట్లుగా మనస్సుతో ఏకాగ్రముగా ధ్యానించి, కర్మఫలరూపముగా నిర్మాణమైన దేహమును విడిచి పెట్టెను.
భగవానపి గోవింద స్తే నైవాన్నేన గోపకాన్ ।
చతుర్విధేనాశయిత్వా స్వయం చ బుభుజే ప్రభుః ॥
సర్వసమర్థుడై గోవులను కాపాడే శ్రీకృష్ణ భగవానుడు కూడ నాలుగు రకముల ఆ అన్నమునే గోపాలకులకు తినిపించి తాను కూడ తినేను.
ఏవం లీలానరవపురృలోకమనుశీలయన్ ।
రేమే గోగోపగోపీనాం రమయన్ రూపవాక్కృతైః ॥
లీలకై మానవ దేహమును దాల్చిన శ్రీకృష్ణ భగవానుడీ విధముగా మనుష్య జీవితముననుకరించుచుండెను. ఆయన తన రూపముతో, మాటలతో, చేష్టలతో గోవులకు, గోపాలకులకు, గోపికలకు ఆనందమును కలిగిస్తూ, తాను కూడ రమించెను.
అథానుస్మృత్య విప్రాస్తే అన్వతప్యన్ కృతాగసః ।
యద్వి శ్వేశ్వరయోర్యాథ్థామహన్మ నృవిడంబయోః ॥
మానవులననుకరించే జగన్నాథులైన బలరామకృష్ణుల కోరికను మనము నిరాకరించితిమి, అని గుర్తు చేసుకొని అపరాధము చేసిన ఆ బ్రాహ్మణులు తరువాత పశ్చాత్తాపపడిరి.
దృష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికీమ్ ।
ఆత్మానం చ తయా హీనమనుతప్తా వ్యగర్ఘయన్ ॥
ఆ బ్రాహ్మణులు తమ భార్యలకు శ్రీకృష్ణ భగవానునియందు గల లోకాతీతమైన భక్తిని చూచిరి. అట్టి భక్తి తమయందు లేకపోవుట కూడ వారికి తెలి సెను. దానికి వారు పశ్చాత్తాపపడి తమను తాము తిట్టుకొనిరి.
ధిగ్టన్మ నస్త్రీవృద్విద్యాం ధిగతం ధిగ్బహుజ్ఞతామ్ ।
ధిక్కులం ధిక్క్రియాదాక్ష్యం విముఖా యే త్వధోక్షజే ॥
మనమైతే ఇంద్రియగోచరుడు కాని శ్రీహరి యెడల పెడమొగము కలిగి యున్నాము. మన మూడు ఆవృత్తుల (తల్లి కడుపున పుట్టుట, ఉపనయనము, యజ్ఞదీక్ష) జన్మ, వేదవిద్య, బ్రహ్మచర్యవ్రతము, గొప్ప పాండిత్యము, కులము, వైదికకర్మలయందలి దక్షత అనువాటి గురించి నిందయగుగాక!
నూనం భగవతో మాయా యోగినామపి మోహినీ ।
యద్వయం గురవో నృణాం స్వార్థే ముహ్యామ హే ద్విజోః ॥
ఓ వేదవేత్తలారా! శ్రీహరి భగవానుని మాయ నిశ్చయముగా యోగులను కూడ ప్యామోహ పెట్టును. ఎందుకంటే, మానవులకు గురువులమైన మనము మన పురుషార్థము విషయములో వ్యామోహము (సత్యమును తెలియ లేకపోవుట) ను పొందుచున్నాము.
అహో పశ్యత నారీణామపి కృష్ణే జగద్గురౌ ।
దురంతభావం యోకవిద్యన్మృత్యుపాశాన్ గృహాభిధాన్ ॥
ఆహా! జగద్గురువగు శ్రీకృష్ణునియందు స్త్రీలు కూడ సర్వమును నిరాకరించి అగాధమగు భక్తిని చేసిరి. అట్టి భక్తి ఇల్లు-వాకిలి అనే పేరు గల మృత్యురూపములైన పాశములను (ఆసక్తులను) తెగగొట్టును.
నాసొం ద్విజాతిసంస్కారో న నివాసో గురావది ।
న తపో నాత్మమీమాంసా న శౌచం న క్రియాశ్శుభిః ॥
వీరికి ఉపనయనసంస్కారము గాని, గురుకులవాసము గాని లేవు. వీరు తపస్సు గాని, ఆత్మవిచారము గాని చేయలేదు. వీరియందు (మంత్రకృతమగు) శౌచము లేదు. వీరు వేదోక్తములగు పుణ్యకర్మలను చేయలేదు.
అథాపి హ్యుత్తమశ్లోకే కృష్ణే యోగేశ్వరేశ్వరే ।
భక్తిర్దృఢ న చాస్మాకం సంస్కారాదిమతామపి ॥
ఐననూ వీరికి పవిత్రకీర్తియగు శ్రీకృష్ణునియందు దృఢమగు భక్తి గలదు. ఇది నిశ్చయము. ఆయన యోగులకు, యోగేశ్వరులకు కూడ ప్రభుడు. ఉపనయనసంస్కారము, గురుకులవాసము మొదలైనవి గలవారమే అయినా, మనకు భక్తి లేనే లేదు.
నను స్వార్థవిమూఢానాం ప్రమత్తానాం గృ హేహయా ।
అహో నస్మారయామాస గోపవాక్యైసతాం గతిః ॥
సత్పురుషులు పొందగోరేది భగవానుని మాత్రమే. మనమైతే గృహస్థకర్మలలో పడి స్వర్గాదికామనలే పరమార్థమనే వ్యామోహములో పడియుంటిమి. ఆహా! ఆయన మన ఆత్మవిస్మృతిని మనకు గోపాలకుల మాటల ద్వారా గుర్తు చేసినాడు. ఇది నిశ్చయము.
అన్యథా పూర్ణకామస్య కైవల్యాద్యాశీషాం పతేః ।
ఈశితవ్యైః కిమస్మాభిరీశ స్యైతద్విడంబనమ్ ॥
అట్లు, గానిచో, శ్రీకృష్ణ భగవానునకు ఆయనచే పాలించబడే మనతో ప్రయోజనమేమి గలదు? (ఏమీ లేదు). ఆయన పూర్ణ మైన కామనలు గలవాడు; మోక్షము, స్వర్గము ఇత్యాదికామనలన్నింటినీ పరిపూర్తి చేసే ప్రభుడు. ఇది (మనలను అన్నము కోరుట) లోకానుకరణము మాత్రమే.
హీత్వాఽన్యాన్ భజతే యం శ్రీః పాదస్పర్శాశయా సకృత్ ।
ఆత్మదోషాపవర్గేణ తద్యాస్థో జనమోహినీ ॥
ఒక్కసారి పాదములను స్పృశించవలెననే కోరికతో లక్ష్మీదేవి ఇంద్రాదులను విడిచి పెట్టి, తనయందలి చాంచల్యము మొదలగు దోషములను ప్రక్కన బెట్టి ఆయనను సేవించుచున్నది. అట్టి శ్రీకృష్ణ భగవానుడు అన్నమును కోరుట (మనవంటి) జనులను మోహ పెట్టును.
దేశః కాలః పృథగ్ద్రవ్యం మంత్రతంత్రర్విజోఽగ్నయః ।
దేవతా యజమానశ్చ క్రతుర్ధర్మశ్చ యన్మయః ॥
యజ్ఞమును చేసే దేశకాలములు, దానిలోని వేర్వేరు ద్రవ్యములు, మంత్రములు, కర్మను చేసే పద్ధతి, ఋత్విక్కులు, గార్హపత్యము మొదలైన అగ్నులు, అగ్ని మొదలగు దేవతలు, యజ్ఞమును చేయువాడు, యజ్ఞము, దాని వలన కలిగే పుణ్యము అనేవి ఆ భగవానుని రూపములే.
స ఏష భగవాన్ సాక్షాద్విష్ఠుర్యోగేశ్వరేశ్వరః ।
జాతో యదుష్విత్యశృణ్మ హ్యపీ మూఢ న విద్మహే ॥
యోగులకు, యోగేశ్వరులకు ప్రభుడగు ఆ (యజ్ఞరూపుడగు) ఈ (శ్రీకృష్ణరూపుడగు) శ్రీహరి భగవానుడే సాక్షాత్తుగా యాదవులలో అవతరించెనని ఏంటిమి గదా! అయినా, మూఢులమగు మనమాయనను గుర్తించలేదు.
అహో వయం ధన్యతమా యేషాం నస్తాదృశీః స్త్రియః ।
భక్త్యా యాసాం మతిర్జాతా అస్మాకం నిశ్చలా హరౌ ॥
ఆహా! అట్టి (గొప్ప భక్తి గల) భార్యలను కలిగియున్న మనము మిక్కిలి ధన్యులము. ఏలయన, వారి భక్తిచే మన బుద్ధి కూడ శ్రీకృష్ణ భగవానునియందు నిశ్చలముగా నిలుచును.
నమస్తుభ్యం భగవతే కృష్ణాయాకుంఠమేధసే ।
యన్మాయామోహితధియో భ్రమామః కర్మవర్త్మసు॥
ఓ శ్రీకృష్ణా! నీవు బాధితము కాని జ్ఞానము గల భగవానుడవు. నీకు నమస్కారము. నీ మాయచే మోహితులమైన మేము (కామ్య)కర్మమార్గములయందు తిరుగాడుచున్నాము.
స వై న ఆద్యః పురుషస్వమాయామోహితాత్మనామ్ ।
అవిజ్ఞానానుభావానాం క్షంతుమర్హత్యతిక్రమమ్ ॥
జగత్కారణుడగు ఆ పూర్ణపరమాత్మయొక్క మాయచే మా బుద్ది నిశ్చయముగా మోహమును చెందినది. కావుననే, మేము ఆయన మహిమ తెలియక అపరాధమును చేసితిమి. ఆయన మా అపరాధమును మన్నించ దగును.
ఇతి స్వాఘమనుస్మృత్య కృష్ణే తే కృత హేలనాః ।
దిదృక్షవోఽవ్యచ్యుతయోః కంసాద్భీతా న చాచలన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
పూర్వార్థే త్రయోవింశోఽధ్యాయః ॥
శ్రీకృష్ణుని అవహేళన చేసిన ఆ బ్రాహ్మణులు ఈ విధముగా తమ తప్పు తెలుసుకొనిరి. స్వరూపచ్యుతీ లేని బలరామకృష్ణులను చూడాలనే కోరిక వారికి కలిగేను. కాని, ఆ విషయము కంసునకు తెలిసి శ్రీకృష్ణునకు హానిని తల పెట్టునేమో అనే భయము వలన వారు వెళ్లలేదు.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధముపూర్వార్ధములో యజ్ఞపత్నుల ఉద్ధారమును వర్ణించే ఇరువది మూడవ అధ్యాయము ముగిసినది (23).
Summary of chapter 23 of the Bhāgavata Mahā Purana is as follows:
While pasturing cows at a distance from Vṛndāvana, the cowherd boys became exhausted with hunger and asked Kṛshṇa for food. Kṛshṇa sent them to a nearby sacrificial arena where learned Angirasa brāhmaṇas were performing a grand Vaidika sacrifice (*Angirasa-satra*). When the boys begged for food in Kṛshṇa's name, the proud ritualistic brāhmaṇas ignored them, considering the cowherd boys impure and prioritizing ritual rules over direct service to the Supreme Being. The boys returned disappointed, but Kṛshṇa sent them back to the brāhmaṇas' wives. Hearing Kṛshṇa's name, the chaste, devoted wives immediately gathered plates of delicious food and rushed to Kṛshṇa in the forest, disregarding the warnings of their husbands. Kṛshṇa accepted their offering, blessed them with devotion, and sent them back to their homes. Humbled by their wives' devotion, the brāhmaṇas repented deeply for their ritualistic arrogance and lack of devotion.