84 - వసుదేవుని యజ్జోత్సవము

శ్రీశుక ఉవాచ

 శ్రుత్వా పృథా సుబలపుత్యథ యాజ్ఞసేనీ

మాధవ్యథ క్షితిపపత్న్య ఉత స్వగోప్యః

 కృష్ణే ఖిలాత్మని హరౌ ప్రణయానుబంధం

సర్వా విసిస్మ్యురలమశ్రుకలాఽఽకులాక్ష్యః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సకలప్రాణులలో ఆత్మరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు దుఃఖములను పోగొట్టును. ఆయనయందు ఆయన భార్యలకు ఉన్న సర్వస్వార్పణరూపమగు ప్రేమను గురించి విని కుంతి, సుబలపుత్రియగు గాంధారి, ద్రౌపది, ఇతరరాజుల భార్యలు, శ్రీకృష్ణుని భక్తురాండ్రగు గోపీకలు కూడ మిక్కిలి విస్మయమును చెందిరి. వారి కన్నులు నీటితో నిండెను.

ఇతి సంభాషమాణాసు స్త్రీభిః స్త్రీషు నృభిర్నృషు

 ఆయయుర్మునయస్తత్ర కృష్ణ రామదిదృక్షయా

ఈ విధముగా పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో సంభాషించు చుండగా, బలరామ శ్రీకృష్ణులను చూచుటకు మహర్షులు అచటకు వచ్చిరి.

ద్వైపాయనో నారదశ్చ చ్యవనో దేవలోకసితః

 విశ్వామిత్రశ్శతానంద్ భరద్వాజోఽథ గౌతమః

  రామస్సశిష్యో భగవాన్ వశిష్ఠో గాలవో భృగుః

 పులస్త్యః కశ్యపోఽత్రిశ్చ మార్కండేయో బృహస్పతిః

 ద్వితస్త్రీతశ్చైకతశ్చ బ్రహ్మపుత్రాస్తథాంగిరాః

 అగస్త్యో యాజ్ఞవల్క్యశ్చ వామదేవాదయోఃపరే

వ్యాసుడు, నారదుడు, చ్యవనుడు, దేవలుడు, అసితుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు, గౌతముడు, శిష్యులతో కూడిన పరశు రాముడు, పూజనీయుడగు వశిష్ఠుడు, గాలవుడు, భృగువు, పులస్త్యుడు, కశ్యపుడు, అత్రి, మార్కండేయుడు, బృహస్పతి, ద్వితుడు, త్రితుడు, ఏకతుడు, బ్రహ్మదేవుని పుత్రులగు సనక సనందన సనాతన సనత్కుమారులు, అంగీరసుడు, అగస్త్యుడు, యాజ్ఞవల్క్యుడు, వామదేవుడు, ధౌమ్యుడు మొదలుగా గల ఇతర మహర్షులు విచ్చేసిరి.

తాన్ దృష్ట్వా సహసోత్థాయ గాసీనా నృపాదయః

పాండవాః కృష్ణరామౌ చ ప్రణేముర్విశ్వవందితాన్

అంతవరకు కూర్చున్న పాండవులు, బలరామ శ్రీకృష్ణులు, రాజులు మొదలగువారు జగత్తునకంతకూ వందనీయులైన ఆ మహర్షులను చూచి వెంటనే లేచి నిలబడి నమస్కరించిరి.

తానానర్చుర్యథా సర్వే సహరామోవచ్యుతోఽర్చయత్ స్వాగతాసనపాద్యార్ఘ్యమాల్యధూపానులేపనైః

అందరు జనులు ఆ మహర్షులను పూజించిరి. బలరాముడు, శ్రీకృష్ణ భగవానుడు వారిని స్వాగతవచనములు, ఆసనము, కాళ్లు కడుగుకోనే నీరు, త్రాగే నీరు, పుష్పమాలలు, ధూపము, అంగరాగములతో యథావిధిగా పూజించిరి.

ఉవాచ సుఖమాసీనాన్ భగవాన్ ధర్మగుప్తనుః

 సదసస్తస్య మహతో యతవాచోకనుశృణ్వతః

ఆ మహర్షులందరు మౌనముగా సభలో కూర్చుని వినుచుండగా, శ్రీకృష్ణ భగవానుడు వారినుద్దేశించి ఇట్లు పలికెను. ఆయన అవతరించినది ధర్మపరిరక్షణకే కదా!

శ్రీభగవానువాచ

 అహో వయం జన్మభృతో లబ్ధం కార్త్స్న్యేన తత్ఫలమ్

 దేవానామపి దుష్ప్రాపం యద్యోగేశ్వరదర్శనమ్

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలి కెను --- ఆహా! మా జన్మ ధన్యమైనది. మాకు ఆ జన్మయొక్క ఫలము పూర్తిగా లభించినది. దేవతలకు కూడ పొంద శక్యము కాని యోగిపుంగవులను మేము దర్శించినాము.

కిం స్వల్పతపసాం నృణామర్చాయాం దేవ చక్షుషామ్

 దర్శనస్పర్శనప్రశ్న ప్రహ్వపాదార్చనాదికమ్

కొంచెము తపస్సు చేసి దేవుని అర్చామూర్తియందు మాత్రమే దర్శించే మానవులకు మిమ్ములను చూచి స్పృశించి ప్రశ్నించుట, ప్రణమిల్లుట, పాదములను పూజించుట, అర్ఘ్యాదులనిచ్చుట సంభవమేనా?

న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్చిలామయాః

 తే పునంతురుకాలేన దర్శనాదేవ సాధవః

కేవలము జలాశయములు మాత్రమే తీర్థములనియు, మట్టితో రాళ్లతో చేసిన విగ్రహములు మాత్రమే దేవతలనియు అనుకోరాదు. అవి చాల కాలము సేవించినప్పుడు మాత్రమే పావనము చేయగా, సజ్జనులు దర్శనము వలననే పావనము చేయుదురు.

నాగ్నిర్న సూర్యో న చ చంద్రతారకా

న భూర్జలం ఖం శ్వసనోఽథ వాజ్మనః

 ఉపాసీతా భేదకృతో హరంత్యఘం

విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా

భేదబుద్దితో ఉపాసించినవాని పాపమును అగ్ని, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, పృథివి-జలము-వాయువు-ఆకాశముల అధిష్టానదేవతలు, వాగ్దేవి, మనస్సు అధిష్టాన దేవత పోగొట్టరు. కాని, గంట సేపు మహాత్ముల (అద్వయ-ఆత్మనిష్ఠుల) కు సేవ చేసినచో, పాపము నశించును.

యస్యాత్మబుద్దిః కుణ పే త్రిధాతుకే స్వధీః కలత్రాదిషు భౌమ ఇజ్యధీః,

 యత్తీర్థబుద్ధిస్సలిలే న కర్షితిజ్ఞనేష్వభిజ్ఞేషు స ఏవ గోఖరః

ఎవడైతే వాతపిత్త శ్లేష్మములతో నిర్మాణమైన శవప్రాయమగు దేహము ఆత్మయని, భార్య-పుత్రుడు మొదలగువారు తనవారని, మట్టితో చేసిన ప్రతిమ మాత్రమే దేవతయని, జలాశయము మాత్రమే తీర్థము (పావనము) అని తలపోయునో, అట్టివాడు ఏనాడైననూ ఆత్మతత్త్వనిష్ణులగు మహాత్ములయందు ఆత్మ-స్వీయ-పూజనీయ-పావనబుద్దిని చేయడు. అట్టి వాడు ఎద్దు, గాడిదలవంటి వాడు మాత్రమే.

శ్రీశుక ఉవాచ

 నిశమ్యేత్తం భగవతః కృష్ణస్యాకుంఠమేధసః

 వచో దురన్వయం విప్రాస్తూష్ణీ మాసన్ భ్రమద్ధియః

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- మొక్కవోని బుద్దిశక్తి గల శ్రీకృష్ణ భగవానుని ఈ వచనములను వేదవేత్తలగు మహర్షులు కూడ తెలియలేక పోయిరి. వారి మాటను విని బుద్ధి భ్రమించుట వలన మిన్నకుండిరి.

చిరం విమృశ్య మునయ ఈశ్వర స్యేశితవ్యతామ్

 జనసంగ్రహ ఇత్యూచుస్స్మయంతస్తం జగద్గురుమ్

సర్వేశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుడు తాను మహర్షులకు విధేయుడై ఉండుటను గురించి మహర్షులు చాల సేపు విచారించి, జనులకు ఆదర్శము కొరకు ఆయన అట్లు చేయుచున్నాడని నిశ్చయించిరి. జగత్తునకు తండ్రియగు ఆయనతో వారిట్లనిరి.

మునయ ఊచుః

యన్మాయయా తత్త్వవిదుత్తమా వయం

విమోహితా విశ్వసృజామధేశ్వరాః

యదీశితవ్యాయతి గూడ ఈహయా

అహో విచిత్రం భగవద్విచేష్టితమ్  

మహర్షులు ఇట్లు పలికిరి --- తత్త్వవేత్తలలో శ్రేష్ఠులమై దక్షాది. ప్రజాపతులను శాసించే మేము కూడ ఆ భగవానుని మాయచే మోహితులమగుచున్నాము. ఆ భగవానుడు మానవరూపములో గూఢముగా నుండి మానవుల చేష్టలననుకరిస్తూ మనకు సేవ చేయుచున్నాడు. ఆహా! ఆయన లీల చాల చిత్రమైనది.

అనీహ ఏతద్బహుధైక ఆత్మనా

 సృజత్యవత్యత్తి న బధ్యతే యథా

 భౌమైర్షి భూమిర్బహుమానరూపిణీ

అహో విభూమ్నశ్చరితం విడంబనమ్

పరబ్రహ్మ నిష్కాముడు, అద్వితీయుడు. ఆ బ్రహ్మ తానే ఉపాదానమై అనేకప్రకారములుగా ఈ జగత్తును సృష్టించి, పాలించి, ఉపసంహరించుచున్నాడు. అయిననూ, జగత్తు బ్రహ్మను బంధించుట లేదు. కుండ, బాన మొదలైన మట్టి యొక్క వికారములచే ఒకే పృథివి అనేకనామరూపములను కలిగియుండుట దీనికి దృష్టాంతము. ఆహా! పరబ్రహ్మ అవతరించి చేసిన సాధు సేవాది కృత్యములు. కేవలము అనుకరణము మాత్రమే.

 అథాపి కాలే స్వజనాభిగుప్తయే బిభర్షి సత్త్వం ఖలనిగ్రహాయ చ,

స్వలీలయా వేదపథం సనాతనం వర్ణాశ్రమాత్మా పురుషః పరో భవాన్

నీవు ప్రకృతికి అతీతమైన పరబ్రహ్మవు. అయినప్పటికీ, నీవు దుష్టులను శిక్షించి నీ భక్తులను రక్షించుటకై సమయము వచ్చినప్పుడు సత్త్వగుణప్రధానమగు రూపమును దాల్చెదవు. నీవు వర్ణాశ్రమముల అభి మానముతో నీ లీల ద్వారా పురాతనమగు వేదధర్మమును నిలబెట్టెదవు.

బ్రహ్మ తే హృదయం శుక్లం తపస్వాధ్యాయసంయమైః

 యత్రోపలబ్ధం సద్వ్యక్తమవ్యక్తం చ తతః పరమ్

వేదము నీ శుద్ధమైన హృదయము. సాధకుడు తపస్సు, స్వాధ్యాయము, ఇంద్రియనిగ్రహముల ద్వారా ఆ వేదమునందు కారణ కార్యములను, వాటికి అతీతమైన సదన బ్రహ్మను సాక్షాత్కరించుకొనును.

తస్మాద్భ్రహ్మకులం బ్రహ్మన్ శాస్త్రయోనేస్తమాత్మనః

 సభాజయసి సద్ధామ తద్భ్రహ్మణ్యాగ్రణీర్భవాన్

ఓ పరబ్రహ్మా! కావున, శాస్త్రమే ప్రమాణముగా గల పరమాత్మకు శ్రేష్ఠమైన ఉపలబ్ధస్థానమగు బ్రాహ్మణత్వమును నీవు పూజించుచున్నావు. కావుననే, నీవు బ్రాహ్మణభక్తులలో అగ్రేసరుడవు.

అద్య నో జన్మసాఫల్యం విద్యాయాస్తపసో దృశః

త్వయా సంగమ్య సద్దత్యా యదంతశ్శ్రేయసాం పరః  

సత్పురుషులు పొందేది నిన్నే. ఈ నాడు నిన్ను కలుసుకొనుటచే మా పుట్టుక, విద్య, తపస్సు, చూపు కూడ సఫలములైనవి. ఎందుకంటే, నీవు కల్యాణములకు పరమావధివి.

నమస్తస్మై భగవతే కృష్ణాయాకుంఠమేధసే

 స్వయోగమాయాచ్ఛన్నమహిమ్నే పరమాత్మనే  

మొక్కవోని విజ్ఞానశక్తి గల శ్రీకృష్ణ భగవానుని మహిమ (స్వరూపము) ఆయన యోగమాయచే కప్పివేయబడినది. వ్యక్తియొక్క అంతరతమ చైతన్యస్వరూపుడైన ఆ శ్రీకృష్ణ భగవానుని కొరకు నమస్కారము.

 నయం విదంత్యమీ భూపా ఏరామాశ్చ వృష్ణయః

మాయాజవనికాచ్ఛన్నమాత్మానం కాలమీశ్వరమ్

శ్రీకృష్ణ భగవానుడు (లోపల) ఆత్మస్వరూపుడు, (బయట) కాలస్వరూపుడు. కాని, ఈ రాజులు గాని, ఆయనతో కలిసి ఒకే చోట నివసించే యాదవులు గాని, ఆయన స్వరూపమునెరుగరు.

యథా శయానః పురుష ఆత్మానం గుణతత్త్వదృక్

 నామమాత్రేంద్రియాభాతం న వేద రహితం పరమ్

నిద్రించే వ్యక్తి స్వప్నములో గుణకార్యములగు పదార్థములను సత్యములని దర్శించును. ఆతడు పేరు మాత్రమే అయి (మిథ్యా భూతము) మనస్సుచే తెలియబడే రూపము తానే యని భ్రమ పడును. తాను ఆ రూపముకంటె అతీతమైన జాగ్రద్వ్యక్తినని ఆతడు తెలియడు.

ఏవం త్వా నామమాత్రేషు విష యేష్వింద్రియేహయా

మాయయా విభ్రమచ్చిత్తో న వేద స్మృత్యుపప్లవాత్

ఇదే ప్రకారముగా, భోగ్యములయందు ఇంద్రియముల ప్రవృత్తిచే మనిషి చిత్తము వ్యాకులమై వివేకము నష్టమగును. అట్టివాడు కేవలము నామరూపాత్మకమగు జగత్తునందు సదనమైన నిన్ను తెలియలేడు.

తస్యాద్య తే దదృశిమాంఘీమఘోఘమర్ష-

తీర్థాస్పదం హృది కృతం సువిపక్వయోగైః

ఉతి క్తభక్త్యుపహతాశయజీవకోశా

ఆపుర్భవధతిమథోఽనుగృహాణ భక్తాన్

నీ పాదము పాపముల గుట్టలను నశింపజేసే గంగాతీర్థమునకు పుట్టినిల్లు. పరిపక్వ మైన చిత్తేకాగ్రత గల యోగులు నీ పాదమును హృదయములో నిలి పెదరు. మేము అట్టి నీ పాదమును దర్శించితిమి. వర్ధిల్లిన భక్తిచే సాధకుని అంతఃకరణ (లింగశరీర) రూపమైన పరిచ్చిన్నజీవభావము నశించి నీయందు ఐక్యమై జీవన్ముక్తి లభించును. కావున, మమ్ములను భక్తులను చేసి అనుగ్రహించుము.

శ్రీశుక ఉవాచ

 ఇత్యనుజ్ఞాప్య దాశార్హం ధృతరాష్ట్రం యుధిష్ఠిరమ్

 రాజరే స్వాశ్రమాన్ గంతుం మునయో దధిరే మనః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! నీవు రాజువైనా ఋషివి. మహర్షులీ విధముగా శ్రీకృష్ణుడు, ధృతరాష్ట్రుడు, ధర్మరాజుల వద్ద సెలవు తీసుకొని, తమ ఆశ్రమములకు వెళ్లుటకు నిశ్చయించుకొనిరి.

తద్వీక్ష్య తానుపమ్రాజ్య వసుదేవో మహాయశాః

ప్రణమ్య చోపసంగృహ్య బభా షేదం సుయంత్రితః

ఆ మహర్షుల ప్రయాణసన్నాహమును చూచి గొప్ప కీర్తిమంతుడగు వసుదేవుడు వారి వద్దకు వెళ్లి పాదములను పట్టుకొని ప్రణమిల్లి ఏకాగ్రమగు చిత్తముతో నిట్లు పలికెను.

వసుదేవ ఉవాచ

నమో వస్సర్వదేవేభ్య ఋషయశోతుమర్హథ

 కర్మణా కర్మనిర్హరో యథా స్యాన్నస్తదుచ్యతామ్

వసుదేవుడిట్లు పలికెను --- ఓ మహర్షులారా! సకల దేవతలు మీయందే గలరు. నా మాట వినుడు. కర్మచే కర్మవాసనల పూర్తి నాశము ఎట్లు కలుగును? ఆ విషయమును మాకు చెప్పడు.

నారద ఉవాచ

 నాతిచిత్రమిదం విప్రా వసుదేవో బుభుత్సయా

కృష్ణం మత్వాఽర్భకం యన్నః పృచ్ఛతి శ్రేయ ఆత్మనః

నారద మహర్షి ఇట్లు పలికెను --- ఓ వేదవేత్తలారా! శ్రీకృష్ణుడు బుడతడని తలచిన వసుదేవుడు తనకు శ్రేయస్సును గురించి తెలియగోరి మనలను ప్రశ్నించుట అనే ఈ సందర్భము పెద్ద విడ్డూరము కాదు.

సన్నికర్షో హి మర్త్యానామనాదరణకారణమ్

 గాంగం హిత్వా యథాఽన్యాంభస్తత్రత్యో యాతి శుద్ధయే

ఏలయనగా, దగ్గరగానున్నదానిని మానవులు అనాదరము చేసెదరు. ఉదాహరణకు, గంగ ఒడ్డున ఉన్నవాడు శుద్ధి కొరకు ఇంకో నదికి వెళ్లును.

యస్యానుభూతిః కాలేన లయోత్పత్త్యాదినాకస్య వై

 స్వత్వోఽన్యస్మాచ్చ గుణతో న కుతశ్చన రిష్యతి

ఆ ఈ ఈశ్వరుని స్వరూపచైతన్యము కాలముచే గాని, జగత్తుయొక్క సృష్టి స్థితిలయములచే గాని, తనంత తానుగా గాని, ఇతరము వలన గాని, సత్త్వాదిగుణముల వలన గాని, దేనివలనైనా నశించదు. ఇది నిశ్చయము.

తం క్లేశకర్మపరిపాకగుణప్రవా హైః

అవ్యాహతానుభవమీశ్వరమద్వితీయమ్

 ప్రాణాదిభిస్స్వవిభవైరుపగూడమన్యో

మన్యేత సూర్యమివ మేఘహిమోపరాగైః

అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము (మృత్యుభయము) అనే చిత్తమలములు గాని, పుణ్యపాపకర్మలు గాని, సుఖదుఃఖరూపమైన కర్మఫలములు గాని, సత్త్వరజస్తమోగుణముల ప్రవాహములైన దేహాదులు గాని, రెండవది లేని ఈశ్వరుని జ్ఞానమును ఖండించలేవు. మేఘములు, మంచు, గ్రహణము సూర్యుని కప్పివేయునని అజ్ఞాని తలచును. అదే విధముగా, ఈశ్వరునినుండియే ప్రకటమైన ప్రాణము, బుద్ధి మొదలగునవి ఈశ్వరుని కప్పివేయునని అజ్ఞాని తలపోయును. వాస్తవముగా సూర్యుడు గాని, ఆత్మ గాని దేనినైననూ కప్పివేయబడదు).

అథోచుర్మునయో రాజన్నాభాష్యానకదుందుభిమ్

 సర్వేషాం శృణ్వతాం రాజ్ఞాం తథైవాచ్యుతరామయోః

పరీక్షిన్మహారాజా! తరువాత, సకలరాజులు, శ్రీకృష్ణ భగవానుడు, బల రాముడు వినుచుండగా, మహర్షులు వసుదేవుని సంబోధించి ఇట్లు పలికిరి.

కర్మణా కర్మనిర్హార ఏష సాధు నిరూపితః

యచ్ఛయా యజ్ఞేద్విష్ణుం సర్వయజేశ్వరం మఖైః

సకలయజ్ఞములకు పాలకుడగు శ్రీహరిని శ్రద్దతో యజ్ఞములను చేసి ఆరాధించవలెను. కర్మచే కర్మవాసనల వినాశమునకు ఇదియే చక్కని ఉపాయమని నిర్ధారించబడినది.

చిత్తస్యోపశమోక్యం వై కవిభిశ్శాస్త్రచక్షుషా

 దర్శితస్సుగమో యోగో ధర్మశ్చాత్మముదావహః

ఇదియే అంతఃకరణమునకు సుఖశాంతులనిచ్చే తేలికయైన ఉపా యము, ధర్మము అని జ్ఞానమే చూపుగా గల మహాత్ములు నిరూపించిరి.

అయం స్వస్త్యయనః పంథా ద్విజాతేర్గృహమేధినః

 యచ్ఛ్రద్ధయాఽఽప్తవిత్తేన శుక్లేనేజ్యేత పూరుషః

ఉపనయనసంస్కారము గల గృహస్థుడు న్యాయార్జితమైన తెల్ల (శుద్ధ) ధనముతో పూర్ఖుడగు శ్రీహరిని శ్రద్ధతో యజ్ఞము చేసి ఆరాధించవలెను. ఇదియే శ్రేయస్సును పొందించే ఉపాయము.

విత్తేషణాం యజ్ఞదానైర్గృహైర్దారసుతైషణామ్

ఆత్మలో కైషణాం దేవ కాలేన విసృజేద్బుధః

గ్రామే త్యక్తైషణాస్సర్వే యయుర్ధిరాస్తపోవనమ్

ఓ వసుదేవా! వివేకి యజ్ఞదానముల ద్వారా ధనమునందలి ఇచ్చను, ఇంటియందలి భోగముల ద్వారా భార్య, సంతానము అనువాటియందలి ఇచ్చను, కాలముచే సర్వము నశించునని భావించుటచే స్వర్గాది లోకములయందలి తన కామనను విడిచి పెట్టవలెను. వివేకులందరు గృహ స్థులుగా ఉండి ఈ కామనలను విడిచి తపస్సుకై అడవికి వెళ్లాడివారు.

ఋణైస్తిభిర్ద్విజో జాతో దేవర్షిపితృణాం ప్రభో

యజ్ఞాధ్యయనపుత్రోస్తాన్యనిస్తీర్య త్యజన్ పతేత్

ఓ ప్రభూ! బ్రాహ్మణుడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ఋణ ముతో పుట్టును. ఈ మూడు ఋణములను క్రమముగా యజ్ఞము, అధ్య యనము, సంతానములచే తీర్చకుండా సన్న్యసించువాడు పతితుడగును.

త్వం త్వద్య ముక్తో ద్వాభ్యాం వై ఋషి పిత్రార్మహామతే

యజ్ఞైర్దేవర్ణమున్ముచ్య నిరృణ్వఽశరణో భవ

గొప్ప బుద్ధి గల ఓ వసుదేవా! నీవైతే ఇప్పటికి పితృదేవతల, మహర్షుల ఋణములు రెండింటినుండి విముక్తిని పొందితివి. యజ్ఞముల ద్వారా దేవతల ఋణమును కూడ తీర్చి సన్న్యసించుము.

వసుదేవ భవాన్నూనం భక్త్యా పరమయా హరిమ్

 జగతామీశ్వరం ప్రార్చస్స యద్వాం పుత్రతాం గతః

ఓ వసుదేవా! నీవు నిశ్చయముగా ప్రేమభక్తితో బ్రహ్మాండములకు అంతర్యామియగు శ్రీహరిని అర్చించితివి. కావుననే, ఆయన మీ దంపతులకు పుత్రుడై జన్మించినాడు.

శ్రీశుక ఉవాచ

 ఇతి తద్వచనం శ్రుత్వా వసుదేవో మహామనాః

 తానృషీనృత్విజో వవ్ర మూర్ధ్నాఽఽనమ్య ప్రసాద్య చ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను - పెద్ద మనసు గల వసుదేవుడు ఆ మహర్షుల వచనమును విని, వారికి తల వంచి నమస్కరించి, ప్రసన్నులను చేసుకొని, వారినే ఋత్విక్కులుగా వరించెను.

త ఏమృష యో రాజన్ వృతా ధర్మేణ ధార్మికమ్

తస్మిన్నయాజయన్ క్షేత్రే మఖైరుత్తమకల్ప కైః

ఓ పరీక్షిన్మహారాజా! ధర్మపూర్వకముగా వరించబడిన ఆ మహర్షులు ధర్మాత్ముడగు ఈ వసుదేవునిచే ఆ సమంతపంచక క్షేత్రమునందు ఉత్తమమైన మంత్రద్రవ్యాదులు గల యజ్ఞములను చేయించిరి.

తద్దీక్షాయాం ప్రవృత్తాయాం వృష్ణయః పుష్కరస్రజః

 స్నాతాసువాససో రాజన్ రాజానస్సుష్ణ్వలంకృతాః

ఓ పరీక్షిన్మహారాజా! ఆ వసుదేవుని యజ్ఞదీక్ష సాగుచుండెను. యాదవులు స్నానము చేసి పద్మ(బీజముల)మాలలను, మంచి వస్త్రములను ధరించిరి. రాజులు బాగుగా అలంకరించుకొనిరి.

తన్మహిష్యశ్చ ముదితా నిషకంఠ్యస్సువాససః

 దీక్షా శాలాముపాజగ్మురాలిప్తా వస్తుపాణయః

ఆ వసుదేవుని భార్యలు కూడ మంచి వస్త్రములను దాల్చి, మెడలో హారములను వేసుకొని, చందనాదులనందుకొని, మంగళద్రవ్యములను పట్టుకొని ఆనందముతో యజ్ఞశాలకు విచ్చేసిరి.

నేదుర్మృదంగపటహశంఖభేర్యానకాదయః

ననృతుర్నటనర్తక్యస్తుష్టువుస్సూతమాగధాః

 జగుస్సుకంర్యో గంధర్వ్యస్సంగీతం సహభర్తృకాః

మద్దెళ్లు, డోళ్లు, శంఖములు, భేరీలు, తప్పెటలు, కొమ్ము బూరాలు మొదలైనవి మ్రోగినవి. నటులు, నాట్యకత్తెలు నాట్యమాడిరి. సూతులు, మాగధులు స్తుతించిరి. గంధర్వులు, మంచి కంఠము గల వారి భార్యలు కలిసి పాడిరి.

తమభ్యషించన్ విధివదత్తమభ్య క్తమృత్విజః

పత్నీభిరష్టాదశభిస్సోమరాజమీవోడుభిః

  దీక్షితుడైన వసుదేవుడు కాటుక పెట్టుకొని, దేహమునకు వెన్న రాసు కొనెను (దీక్షా నియమములు). ఆయన పదునెనిమిది భార్యలతో, నక్షత్రములతో కూడిన చంద్రుని పోలియుండెను. ఋత్విక్కులాయనను యథావిధిగా అభిషేకించిరి.

తాభిర్దుకూలవలయైర్చారనూపురకుండలైః

స్వలంకృతాభిర్విబభౌ దీక్షితోఽజినసంవృతః

యజ్ఞదీక్షయందున్న వసుదేవుడు మృగచర్మను కప్పుకొనెను. వస్త్రములు, కంకణములు, హారములు, కాలియందెలు, కుండలములతో బాగా అలంకరించుకున్న ఆ భార్యలతో గూడి ఆయన గొప్పగా రాజిల్లెను.

తస్యర్విజో మహారాజ రత్నకౌశేయవాససః

 ససదస్యా విరోజుస్తే యథా వృత్రహణోఽధ్వరే

ఓ పరీక్షిన్మహారాజా! ఆ వసుదేవుని ఆ ఋత్విక్కులు రత్నములు పొదిగిన పట్టు వస్త్రములను దాల్చి సభాసదులతో గూడి, వృత్రాసురుని వధించిన ఇంద్రుని యజ్ఞమునందు వలె, విశేషముగా ప్రకాశించిరి.

తదా రామశ్చ కృష్ణశ్చ స్వైస్వైర్బంధుభిరన్వితా

 రేజతుస్స్వసుతైర్దా రైర్జీవేశే స్వవిభూతిభిః

జీవులకు ప్రభువులగు బలరామ శ్రీకృష్ణులు అప్పుడు తమ తమ బంధువులతో, తమ విభూతులు (అంశలు) అయిన పుత్రులతో, భార్యలతో కూడి ప్రకాశించిరి.

ఈజేఽనుయజ్ఞం విధినా అగ్నిహోత్రాదిలక్ష ణైః

 ప్రాకృతైర్వైకృతైర్యజ్ఞైర్ద్రవ్యజ్ఞానక్రియేశ్వరమ్

పురోడాశాది ద్రవ్యములు, మంత్రములు, కర్మలకు ప్రభువు శ్రీహరియే. జ్యోతిష్ణోమము మొదలైన ప్రకృతియాగములచే, సౌరము మొదలైన వికృతియాగములచే, అగ్నిహోత్రము మొదలైన పేర్లు గల యాగములచే వసుదేవుడు ఆయనను ప్రతియజ్ఞమునందు యథావిధిగా ఆరాధించెను.

అథర్త్విగ్యోదదాత్కాలే యథాఽఽమ్నాతం స దక్షిణాః

 స్వలంకృతేభ్యోఽలంకృత్య గోభూకన్యా మహాధనాః

తరువాత ఆ - వసుదేవుడు తగిన సమయములో బాగుగా అలంకరించుకున్న ఋత్విక్కులకు తాను కూడ అలంకరించి యథావిధి దక్షిణలనిచ్చెను. మరియు, అలంకరించిన గోవులను, భూమిని, కన్యలను చాల ధనముతో బాటు యిచ్చెను.

పత్నీసంయాజావభృథ్యైశ్చరిత్వా తే మహర్షయః

 సస్నూ రామప్రదే విప్రా యజమానపురస్సరాః

వేదవేత్త లైన ఆ మహర్షులు పత్నీసంయాజయాగమును, అవభృథ స్నానమునకు చెందిన కర్మలను అనుష్టించిరి. అపుడు వారు యజమాను డగు వసుదేవుని ముందడుకొని పరశురామకుండములో స్నానము చేసిరి.

స్నాతోఽలంకారవాసాంసి వందిభ్యోఽదాత్తథా స్త్రీయః

 తతస్స్వలంకృతో వర్ణానాశ్వభ్యోఽన్నేన పూజయత్

వసుదేవుడు, ఆతని భార్యలు స్నానము చేసి వస్త్రములను, భూషణములను స్తోత్రపాఠకులకు ఇచ్చిరి. తరువాత వసుదేవుడు బాగుగా అలంకరించుకొని, సకలవర్ణముల వారికి, కుక్కలవరకు ప్రాణులకు ఆహారమును సమర్పించెను.

బంధూన్ సదారాన్ ససుతాన్ పార్బరేణ భూయసో

 విదర్భకోసలకురూన్ కాశికేకయసృంజయాన్

ఆయన బంధువులను, వారి భార్యలను, పిల్లలను, విదర్భ కోసల కురు కాశి కేకయ సృంజయదేశముల రాజులను, అధికమగు పూజాసామగ్రిని సమర్పించి, పూజించేను.

సదస్య్వి క్సురగణాన్ నృభూతపితృచారణాన్

శ్రీనికేతమనుజ్ఞాప్య శంసంతః ప్రయయుః క్రతుమ్

వసుదేవుడు సభాసదులను, ఋత్విక్కులను, దేవతల గణములను, మానవులను, ఇతరప్రాణులను, పితృదేవతలను, చారణులను పూజించెను. వారు శ్రీనివాసుడగు శ్రీకృష్ణ భగవానుని అనుమతి తీసుకొని, యజ్ఞమును కొనియాడుతూ వెళ్లిరి.

ధృతరాష్ట్రానుజః పార్థా భీష్మో ద్రోణః పృథా యమౌ

నారదో భగవాన్ వ్యాసస్సుహృత్సంబంధబాంధవాః

 బంధూన్ పరిష్వజ్య యదూన్ సౌహృదాత్ క్లిన్నచేతసః

యయుర్విరహకృచ్ఛ్రేణ స్వదేశాంశ్చాపరే జనాః

ధృతరాష్ట్రుడు, ఆయన తమ్ముడు విదురుడు, కుంతీపుత్రులగు ధర్మరాజభీమార్జునులు, భీష్ముడు, ద్రోణుడు, కుంతి, కవలలు నకులసహ దేవులు, పూజనీయులగు నారద వ్యాసులు, మిత్రులు, సంబంధీకులు, బంధువులు తమ బంధువులైన యాదవులను కౌగిలించుకొనిరి. ప్రేమ వలన యాదవుల మనస్సులు ఆర్గములాయెను. వారందరు విరహము వలన కష్టముగా వెళ్లిరి. ఇతరజనులు కూడ తమ దేశములకు వెళ్లిరి.

నందస్తు సహ గోపాలైర్బృహత్యా పూజయాఽర్చితః

 కృష్ణరామోగ్ర సేనాద్యైర్యవాత్సీద్బంధువత్సలః

శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉగ్రసేనుడు, వసుదేవుడు మొదలగు వారు నందుని పెద్ద సత్కారముతో పూజించిరి. బంధువులయందు మిక్కుటమైన ప్రేమ గల ఆయన గోపాలకులతో గూడీ అక్కడ కొంత కాలము ఉండెను.

వసుదేవోఽoజసోత్తీర్య మనోరథమహార్ణవమ్

 సుహృద్వృతః ప్రీతమనా నందమాహ కరే స్పృశన్

వసుదేవుడు యజ్ఞమును చేయాలనే కోరిక అనే పెద్ద సముద్రమును తేలికగా దాటివేసెను. ఆయన ప్రీతి జెందిన మనస్సుతో బంధువులతో కూడియుండెను. ఆయన నందుని చేయి పట్టుకొని ఇట్లు పలికెను.

వసుదేవ ఉవాచ

 భ్రాతరీశకృతః పాశో నృణాం య స్నేహసంజ్ఞితః

 తం దుస్త్యజమహం మన్యే శూరాణామపి యోగినామ్

వసుదేవుడిట్లు పలికెను --- అన్నా! దేవుడు మానవులకు ఆసక్తి అనే పేరుతో బంధమును పెట్టినాడు. దానిని విడిచి పెట్టుట శూరులకు, యోగులకు కూడ చాల కష్టమని నేను తలచుచున్నాను.

అస్మాస్వప్రతికల్పేయం యత్కృతాజ్ఞేషు సత్త మైః

 మైత్య్రరీతాఫలా వ్యాపి న నివర్తేత కర్హిచిత్

మీరు ఉత్తమోత్తములు. చేసిన ఉపకారమును మరచే మాయందు మీరు సాటి లేని ఈ ప్రేమను చేసినారు. ఆ ప్రేమకు ప్రత్యుపకారము లేదు. అయినా, అది ఎన్నటికీ నివృత్తము కాదు.

ప్రాగకల్పాచ్చ కుశలం భ్రాతర్వో నాచరామ హి

 అధునా శ్రీమదాంధాక్షా న పశ్యామః పురస్సతః

అన్నా! ఇదివరలోనైతే శక్తి లేక మీకు ప్రియమును చేయలేదు. ఇప్పుడు ధనగర్వముచే గ్రుడ్డివారమై ఎదురుగా ఉన్న మిమ్ములను చూచుట లేదు.

మా రాజ్యశ్రీరభూత్పుంసశేయస్కామస్య మానద

 స్వజనానుత బంధూన్ వా న పశ్యతి యయాఽoధదృక్

మర్యాదనిచ్చే ఓ నందా! శ్రేయస్సును కోరే వ్యక్తికి రాజ్యసంపద కలుగరాదు. ఎందుకంటే, దానిచే వ్యక్తి గ్రుడ్డివాడై తన వారిని, బంధువులను కన్నెత్తి చూడడు.

శ్రీశుక ఉవాచ

ఏవం సౌహృదశైథిల్యచిత్త ఆనకదుందుభిః

 రురోద తత్కృతాం మైత్రీం స్మరన్నశ్రువిలోచనః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ప్రేమచే శిథిలమైన మనస్సు గల వసుదేవుడీ విధముగా ఆ నందుని ప్రేమను గుర్తు చేసుకొని కళ్ల నీళ్లు పెట్టుకొని యేడ్చెను.

నందస్తు సఖ్యుః ప్రియకృత్ప్రేమ్ణా గోవిందరామయోః

 అద్య శ్వ ఇతి మాసాంస్త్రీన్ యదుభిర్మానితోఽవసత్

యాదవులు నందుని సమ్మానించిరి. ఆయన మిత్రుడగు వసుదేవునకు ప్రీతిని కలిగించువాడై, బలరామ శ్రీకృష్ణుల ప్రేమకు కట్టుబడి, ఈ వేళ రేపు అంటూ మూడు నెలలు నివసించెను.

తతః కామైః పూర్యమాణస్సవ్రజస్సహబాంధవః

పరార్ఘ్యాభరణక్షేమనానాకనర్ఘ్యపరిచ్ఛ దైః

తరువాత గోకులవాసులకు, నందునకు, ఆయన బంధువులకు యాదవులు చాల విలువైన ఆభరణములను, పట్టు వస్త్రములను, పలు రకముల వెల కట్టలేని సామగ్రిని ఇచ్చి సకలకామనలనీడేర్చిరి.

వసుదేవోగ్ర సేనాభ్యాం కృష్ణోద్దవబలాదిభిః

 దత్తమాదాయ పారిబర్హం యాపీతో యదుభిర్యమౌ

వసుదేవుడు, ఉగ్ర సేనుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు, సాత్యకి మొదలగువారిచ్చిన బహుమతులను తీసుకొని నందుడు వెళ్లాను. యాదవులాయనను సాగనంపిరి.

నందో గోపాశ్చ గోప్యశ్చ గోవిందచరణాంబుజే

 మనః క్షిప్తం పునర్హర్తుమనీశా మథురాం యయుః

నందుడు, గోపాలకులు, గోపికలు కూడ శ్రీకృష్ణుని పద్మమువంటి పాదము పై తగుల్కొన్న మనస్సును వెనుకకు తీసుకొనలేకపోయిరి. వారు మథురామండలమునందలి గోకులమునకు వెళ్లిరి.

బంధుషు ప్రతియాతేషు వృష్ణయః కృష్ణ దేవతాః

 వీక్ష్య ప్రావృషమాసన్నాం యయుర్ద్వారవతీం పునః  

బంధువులు తిరిగి వెళ్లిరి. వర్షకాలము దగ్గర పడిన సంగతిని గమనించిన యాదవులు తిరిగి ద్వారకకు వెళ్లిరి. వారికి శ్రీకృష్ణుడే దైవము.

జనేభ్యః కథయాంచక్రుర్యదుదేవమహోత్సవమ్

 యదాసీత్తీర్థయాత్రాయాం సుహృత్సందర్శనాదికమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్దే చతురశీతితమోఽధ్యాయః

యాదవప్రభుడగు వసుదేవుని యజ్ఞమహోత్సవము, బంధువులను దర్శించుట మొదలగు తీర్థయాత్రా విశేషములను వారు ద్వారకలోని జనులకు చెప్పిరి.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో వసుదేవుని యజ్ఞోత్సవమును వర్ణించే ఎనుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (84).