భాగవత మహా పురాణము
37 - శ్రీకృష్ణుడు కేశిని, వ్యోమాసురుని ఉద్ధరించుట - నారద స్తుతి
శ్రీశుక ఉవాచ ।
కేశీ తు కంసప్రహితః ఖురైర్మహీం మహాహయో నిర్జరయన్మనోజవః ।
సటావధూతాభ్రవిమానసంకులం కుర్వస్నభో హేషితభీషి తాఖిలః ।
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కంసుడు పంపిన కేశి (జూలు గలవాడు) పెద్ద గుర్రమై మనోవేగముతో బృందావనమునకు వచ్చెను. ఆతడు డెక్కలతో నేలను చీల్చివేయుచుండెను. ఆతడు జూలును విదల్చగా ఆకాశములోని మేఘములు, దేవతలు విమానములు చెల్లాచెదరగుచుండెను. ఆతని సకిలింపునకు అందరు భయపడిరి.
విశాల నేత్రో వికటాస్యకోటరో బృహద్గలో నీలమహాంబుదోపమః,
దురాశయః కంసహితం చికీర్షుర్వ్రజం స నందస్య జగామ కంపయన్
నిడివి కన్నులు, చెట్టు తొర్రవంటి వంకర మూతి, పెద్ద కంఠము కలిగిన ఆ కేశి నల్లని పెద్ద మేఘమును పోలియుండెను. ఆ దుర్బుద్ధి కంసుని హీతమును చేయగోరి నందుని గోకులమునకు రాగా భూమి కంపించెను.
తం త్రాసయంతం భగవాన్స్వగోకులం తద్ధేషి తైర్వాల విఘూర్ణితాంబుదమ్ ।
ఆత్మానమాజౌ మృగయంతమగ్రణీః ఉపాహ్వయత్స వ్యనదస్మృగేంద్రవత్ ॥
అట్టి (కర్కశమైన) సకిలింపులతో కేశి శ్రీకృష్ణ భగవానుని గోకులమును భయ పెట్టుచుండెను. ఆతడు తోకతో మేఘములను త్రిప్పుచుండెను. ఆతడు యుద్ధము చేయుటకు శ్రీకృష్ణుని కొరకై వెదుకుచుండెను. అపుడు గోకులనాయకుడగు శ్రీకృష్ణుడు వానిని రమ్మని సవాలు చేసి, సింహము వలె నాదము చేసెను.
స తం నిశామ్యాభిముఖో ముఖేన ఖం పిబన్నివాభ్యద్రవదత్యమర్షణః,
జఘాన పద్భ్యామరవిందలోచనం దురాసదశ్చండజవో దురత్యయః।
ఆ కేశి సమీపించుట కానీ, అతిక్రమించుట కాని శక్యము కాని భయంకరమగు వేగము గలవాడు. ఆతడు పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుని చూచి పెద్ద కోపముతో ఆయనకు ఎదురుగా వచ్చెను. నోటితో ఆకాశమును త్రాగుచున్నాడా యన్నట్లు ఆతడు యన్నట్లు ఆతడు ఆయనకు ఎదురుగా పరు గెత్తి వెనుక కాళ్లతో తన్నెను.
తద్వంచయిత్వా తమధోక్షజో రుషా ప్రగృహ్య దోర్భ్యాం పరివిధ్య పాదయోః ।
సావజ్ఞముత్సృజ్య ధనుశ్శతాంత రే యథోరగం తార్ క్ష్యసుతో వ్యవస్థితః ॥
ఇంద్రియగోచరము కాని స్వరూపము గల శ్రీకృష్ణుడు ఆ దెబ్బను తప్పించుకొనెను, ఆయన కోపముతో వానిని, కశ్యప ప్రజాపతి పుత్రుడగు గరుడుడు పామును వలె, రెండు చేతులతో రెండు వెనుక కాళ్లను పట్టుకొని గిర గిర త్రిప్పి, తిరస్కార పూర్వకముగా వంద ధనుస్సుల దూరమునకు విసిరి వైచి నిలబడెను.
స లబ్ధసంజ్ఞః పునరుత్తితో రుషా వ్యాదాయ కేశీ తరసాఽఽపతద్ధరిమ్ ।
సోఽప్యస్య వక్త్రే భుజముత్తరం స్మయన్ ప్రవేశయామాస యథోరగం బిలే ॥
ఆ కేశి స్పృహ వచ్చి మరల లేచి నిలబడి కోపముతో నోరు తెరిచి వేగముగా శ్రీకృష్ణుని మీదకు వచ్చెను. ఆయన కూడ నవ్వుతూ వాని నోటిలో ఎడమ చేతిని, కలుగులో పామును వలె, ప్రవేశ పెట్టెను.
దంతా నిపేతుర్భగవద్భుజస్పృశః తే కేశినస్తప్తమయస్స్పృశో యథా ।
బాహుశ్చ తద్దేహగతో మహాత్మనో యథాఽఽమయస్సంవవృధే ఉ పేక్షితః ॥
శ్రీకృష్ణ భగవానుని చేతిని కేశి దంతములతో కొరకబోగా, అవి లోహపు ముద్దను కొరికినవా యన్నట్లు రాలినవి. సర్వమునకు ఆత్మయగు భగవానుని చేయి కూడ వాని దేహము లోపల, ఉపేక్ష చేయబడిన జలోదర రోగము వలె, బాగా పెరిగి పెద్దదాయెను.
సమేధమానేన స కృష్ణ బాహునా నిరుద్ధవాయుశ్చరణాంశ్చ విక్షిపన్,
ప్రస్విన్నగాత్రః పరివృత్తలోచనః పపాత లేండం విసృజన్ క్షితౌ ప్యసుః.
శ్రీకృష్ణుని చేయి బాగా పెద్దది కాగా, ఆ కేశికి ఊపిరి అడ్డుకొనబడెను. వాని దేహము చెమటతో తడిసి ముద్దయై కళ్లు బయటకు పొడుచుకు పచ్చెను. వాడు కాళ్లను కొట్టుకుంటూ పేడను వేస్తూ ప్రాణములు పోయి నేల గూలను.
తద్దేహతః కర్కటికాఫలోపమాద్వ్యసోరపాకృష్య భుజం మహాభుజః ।
అవిస్మితోఽయత్నహతారిరుత్స్మయైః ప్రసూనవర్షైర్దివిషద్భిరీడితః ॥
శ్రీకృష్ణుడు గొప్ప భుజశక్తి గలవాడు. ఆయన ప్రయత్నము లేకుండగనే శత్రువులను సంహరించును. కేశి మరణించినందులకు ఆయనకు గర్వము గాని, ఆశ్చర్యము గాని లేవు. కాని, దేవతలు చాల ఆశ్చర్యపడిరి. ఆయన తన చేతిని వాని దేహమునుండి బయటకు తీసుకోగానే, వారు పూల వానలను కురిపిస్తూ స్తుతించిరి.
దేవర్షిరుపసంగమ్య భాగవత ప్రవరో నృప ।
కృష్ణ మక్లిష్ట కర్మాణం రహస్యేతదభాషత ॥
ఓ పరీక్షిన్మహారాజా! దేవర్షియగు నారదుడు భగవానుని భక్తులలో అగ్రగణ్యుడు. ఆయన సునాయాసముగా గొప్ప పనులను చేసే శ్రీకృష్ణుడు ఏకాంతముగానున్నప్పుడు దగ్గరకు వచ్చి ఇట్లు పలికెను.
కృష్ణ కృష్ణా ప్రమేయాత్మస్ యోగేశ జగదీశ్వర !
వాసుదేవాఖిలావాస సాత్వతాం ప్రవర ప్రభో ॥
ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీ స్వరూపము ఊహకు గాని, ఇంద్రియములకు గాని అందేది కాదు. వసుదేవుని పుత్రుడవగు నీవు యోగులకు ప్రభుడవు, జగత్తును శాసించువాడవు. సకలజగత్తునకు అధిష్ఠానము నీవే. యాదవులలో శ్రేష్ఠుడవగు ఓ ప్రభూ!
త్వమాత్మా సర్వభూతానామేకో జ్యోతిరి వైధసామ్ ।
గూఢో గుహాశయస్సాక్షీ మహాపురుష ఈశ్వరః ॥
కట్టెలు వేరైనా వాటియందలి అగ్ని ఒక్కటే. అదే విధముగా, సకల ప్రాణుల హృదయగుహయందు సకలబుద్ధివృత్తులకు సాక్షియగు నిగూఢ - ఆత్మ చైతన్యము నీవే. సర్వాంతర్యామివగు పురుషోత్తముడవీవే.
ఆత్మనాఽఽత్మాశ్రయః పూర్వం మాయయా ససృజే గుణాన్ ।
తైరిదం సత్యసంకల్పస్సృజస్యత్స్యవసీశ్వరః ॥
స్వతంత్రుడవగు నీ సంకల్పము అమోఘము. సర్వనియామకుడవగు నీవు నీవే ఉన్న మాయాశక్తిచే మున్ముందుగా సత్త్వరజస్తమోగుణములను సృష్టించితివి. వాటితో ఈ జగత్తును నీవు సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నావు.
స త్వం భూధర భూతానాం దైత్యప్రమథరక్షసామ్ ।
అవతీర్ణో వినాశాయ సేతూనాం రక్షణాయ చ ॥
దితిపుత్రులు, బాణుడు మొదలగు ప్రమథులు, రాక్షసులు రాజుల రూపములోనున్నారు. వారిని నశింపజేసి ధర్మమర్యాదలను నిలబెట్టుటకై నీవు అవతరించితివి.
దిష్ట్యా తే నిహతో దైత్యో లీలయాఽయం హయాకృతిః ।
యస్య హేషితసంత్రస్తాస్త్యజంత్య నిమిషా దివమ్ ॥
ఈ గుర్రము రూపములోనున్న రాక్షసుని నీవు అవలీలగా సంహరించితివి. మంగళము. వీడు స్వర్గము వద్దకు వచ్చి సకిలించినచో, దేవతలు స్వర్గమును వీడి పరుగెత్తెదరు.
చాణూరం ముష్టికం చైవ మల్లానన్యాంశ్చ హస్తినమ్ ।
కంసం చ నిహతం ద్రక్ష్యే పరశ్వోపహని తే విభో ॥
ఓ ప్రభూ! ఎల్లుండి పగలు నీవు చాణూరుని, ముష్టికుని, శలుడు మొదలైన ఇతరమల్లులను, కువలయాపీడమనే ఏనుగును, కంసుని కూడ సంహరించగలవు. నేను చూచెదను.
తస్యాను శంఖయవనమురాణాం నరకస్య చ ।
పారిజాతాపహరణమింద్రస్య చ పరాజయమ్॥
ఆ కంసుని తరువాత నీవు శంఖుని, కాలయవనుని, మురుని, నరకుని కూడ సంహరించెదవు. తరువాత నీవు ఇంద్రుని పరాభవించి కల్పవృక్షమును లాగుకొని వచ్చెదవు.
ఉద్వాహం వీరకన్యానాం వీర్యశుల్కాదిలక్షణమ్ ।
నృగస్య మోక్షణం పొపొద్ద్వారకాయాం జగత్పతే ॥
ఓ జగన్నాథా! నీవు నీ పరాక్రమము, సౌందర్యము మొదలగు గుణములే కట్నము కాగా క్షత్రియకన్యలను వివాహమాడెదవు. నీవు ద్వారకలో నృగుని పాపమునుండి విముక్తుని చేసెదవు.
స్యమంతకస్య చ మణేరాదానం సహ భార్యయా ।
మృతపుత్ర ప్రదానం చ బ్రాహ్మణస్య స్వథామతః ॥
నీవు భార్యతో బాటుగా స్యమంతకమణిని కూడ పొందెదవు. నీవు మరణించిన బ్రాహ్మణపుత్రులను వారి స్థానమునుండి తెచ్చి యిచ్చెదవు.
పౌండ్రకస్య వధం పశ్చాత్కాశిపుర్యాశ్చ దీపనమ్ ।
దంతవక్త్రస్య నిధనం చైద్యస్య చ మహాక్రతౌ ॥
నీవు పౌండ్రకుని సంహరించి తరువాత కాశీనగరమును తగులబెట్టెదవు. దంతవక్తుని, గొప్ప యజ్ఞమునందు చేది రాజగు శిశుపాలుని కూడ సంహరించెదవు.
యాని చాన్యాని వీర్యాణి ద్వారకామావసన్ భవాన్ ।
కర్తా ద్రక్ష్యామ్యహం తాని గేయాని కవిభిర్భువి ॥
ద్వారకానగరమునధిష్ఠించి నీవు ఇంకా ఏ పరాక్రమములను చేసెదవో, వాటిని కూడ నేను చూడగలను. భూలోకమునందు కవులు వర్ణించదగ్గవి ఈ లీలలే.
అథ తే కాలరూపస్య క్షపయిష్ణోరముష్య వై ।
అక్షౌహిణీనాం నిధనం ద్రక్ష్యామ్యర్జునసారథేః ॥
తరువాత మృత్యురూపుడవగు నీవు ఈ భూమియొక్క భారమును తగ్గించగోరి అర్జునునకు సారథివి కాగలవు. అపుడు సైన్యముల అకౌహిణులు నాశమును పొందును. దానిని నేను చూడగలను.
విశుద్ధ విజ్ఞానఘనం స్వసంస్థయా సమాప్తసర్వార్థమమోఘవాంఛితమ్ ।
స్వతేజసా నిత్యనివృత్తమాయాగుణ ప్రవాహం భగవంతమీమహి ॥
నీవు ధర్మాధర్మములకు అతీతమైన జ్ఞానఘనుడవు. ఆనందఘసమగు నీ సన్నిధి మాత్రముచే సకలకామనలు పూర్ణముగా సిద్ధించును. సంకల్పములు అమోఘములు. మాయాశక్తి యొక్క సత్త్వరజస్తమో గుణముల ప్రవాహము (సంసారము) చైతన్యఘనుడవగు నీయందే కాలమునందైనా లేదు. షడ్గుణ సంపన్నుడవగు నిన్ను శరణు జొచ్చెదము.
త్వామీశ్వరం స్వాశ్రయమాత్మ మాయయా వినిర్మితా శేషవిశేష కల్పనమ్ ।
క్రీడార్థమద్యాత్తమనుష్యవిగ్రహం నతోఽస్మి ధుర్యం యదువృృష్ణిసాత్వతామ్ ॥
నీవు స్వతంత్రుడవై జగత్తును నియమించెదవు. నీవు నీ మాయాశక్తిచే సకలవిశేషముల (నామరూపముల) సమాహారమగు జగత్తును కల్పించినావు. ఈ కాలములో నీవు లీల కొరకై మానవ దేహమును స్వీకరించి యున్నావు. యాదవ వృష్టి సాత్వత వంశీయులలో అగ్రేసరుడవగు నీకు నేను నమస్కరించుచున్నాను.
శ్రీశుక ఉవాచ ।
ఏవం యదుపతిం కృష్ణం భాగవత ప్రవరో మునిః ।
ప్రణిపత్యాభ్యనుజ్ఞాతో యయౌ తద్దర్శనోత్సవః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భగవద్భక్తులలో అగ్రేసరుడగు నారదమహర్షికి ఆ శ్రీకృష్ణుని దర్శనమే పండుగ. ఆయనీ విధముగా ఆ యాదవప్రభుని ప్రణమిల్లి ఆయన సెలవు తీసుకొని వెళ్లెను.
భగవానపి గోవిందో హత్వా కేశినమాహవే ।
పశూనపాలయత్పాలైః ప్రీతైర్వ్రజసుఖావహః ॥
గోకులమునకు సుఖమును కలిగించే గోవింద భగవానుడు యుద్ధములో కేశిని కూడ సంహరించగా గోపాలకులు సంతోషించిరి. ఆయన వారితో కలిసి పశువులను పాలించెను.
ఏకదా తే పశూన్ పాలాశ్చారయంతోఽద్రిసానుషు ।
చక్రుర్నిలాయన క్రీడాశ్చోరపాలాపదేశతః ॥
ఒకనాడు గోపాలకులు గోవర్ధన పర్వతము యొక్క సమతలప్రదేశములయందు పశువులను మేపుచుండిరి. వారిలో కొందరు చోరులని, ఇంకొందరు రక్షకులని కల్పించుకొని వారు దాగుడు మూతల ఆటలను ఆడిరి.
తత్రాసన్ కలిచిచ్చోరాః పాలాశ్చ కతిచిన్నృప ।
మేషాయితాశ్చ తత్రైకే విజహ్రురకుతోభయాః ॥
ఓ పరీక్షిన్మహారాజా! వారిలో కొందరు మేకలు వలె నటించగా, కొందరు చోరులుగను, కొందరు రక్షకులుగను అయి, భయమంటే ఏమిటో తెలియకుండా విహరిస్తూ ఆడుకొనుచుండిరి.
మయపుత్రో మహామాయో వ్యోమో గోపాల వేషధృక్ ।
మేషాయితానపోవాహ ప్రాయశ్చోరాయితో బహూన్ ॥
ముయుని పుత్రుడగు వ్యోముడు పెద్ద మాయావి. వాడు గోపాలకుని వేషముతో వారిలో చేరి ఆటలో పలుమార్లు చోరుడుగా ఉండెను. ఈ తీరున వాడు మేకలవలె ఆచరించే చాలమంది గోపబాలకుల నెత్తుకుపోయెను.
గిరిదర్యాం వినిక్షిప్య నీతం నీతం మహాసురః ।
శిలయా పిదధే ద్వారం చతుఃపంచావ శేషితాః ॥
ఆ బలశాలియగు రాక్షసుడు ఎత్తుకుపోయిన ప్రతి గోపబాలకుని ఒక పర్వతగుహలో దాచి దాని ద్వారమును రాతితో మూసివేసెను. గోపబాలకులు నలుగురైదుగురు మాత్రమే బయట మిగిలియుండిరి.
తస్య తత్కర్మ విజ్ఞాయ కృష్ణశ్శరణదస్సతామ్ ।
గోపాన్నయంతం జగ్రాహ వృకం హరిరిహౌజసా ॥
శ్రీకృష్ణుడు సత్పురుషులకు రక్షకుడు. ఆ వ్యోమాసురుడు చేస్తున్న పని తెలిసిపోయెను. గోపబాలకులను ఎత్తుకుపోవుచున్న ఆ రాక్షసుని ఆయన, సింహము తోడేలును వలె, బలముగా పట్టుకొనెను.
స నిజం రూపమాస్థాయ గిరీంద్రసదృశం బలీ ।
ఇచ్ఛన్ విమోక్తుమాత్మానం నాశక్నోద్గ్రహణాతురః ॥
ఆ రాక్షసుడు బలశాలియే అయినా, శ్రీకృష్ణుడు పట్టుకొనుటచే పీడను పొందెను. వాడు తనను విడిపించుకొనగోరి పెద్ద పర్వతమును పోలిన తన యథార్థరూపమును పొందెను. ఐననూ వాడు విడిపించుకొనలేకపోయెను.
తం నిగృహ్యాచ్యుతో దోర్భ్యాం పాతయిత్వా మహీతలే ।
పశ్యతాం దివి దేవానాం పశుమారమమారయత్ ॥
శ్రీకృష్ణ భగవానుడు వానిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నేలపై పడవైచెను. అపుడాయన వానికి పశువును చంపునట్లుగా గాలి ఆడకుండా చేసి సంహరించెను.
గుహాపిధానం నిర్భిధ్య గోపాన్నిస్సార్య కృచ్ఛ్రతః ।
స్తూయమానస్సు రైర్గో పైః ప్రవివేశ స్వగోకులమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే సప్తత్రింశోఽధ్యాయః ॥
ఆయన గుహను మూసీ ఉంచిన రాతిని పగులగొట్టి గోపబాలకులను ఆపదనుండి బయటకు తెచ్చెను. దేవతలు, గోపాలకులు స్తుతించుచుండగా, ఆయన తన గోకులమును ప్రవేశించెను.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో
శ్రీకృష్ణుడు కేశిని, వ్యోమాసురుని ఉద్ధరించుటను, నారద స్తుతిని వర్ణించే
ముప్పది ఏడవ అధ్యాయము ముగిసినది (37).
Summary of chapter 37 of the Bhāgavata Mahā Purana is as follows:
Kaṁsa dispatched the fierce horse demon Keśī to Vṛndāvana. Keśī roared like a lion, galloping through pastures and kicking his hooves into the sky. Śrī Kṛshṇa stepped forward and challenged the demon. When Keśī opened his cavernous mouth to bite Him, Kṛshṇa thrust His left arm deep into the horse's throat. Kṛshṇa's arm expanded within Keśī's mouth, becoming red-hot like molten iron, suffocating and tearing the demon apart from within. Devarshi Nārada appeared in the sky, offering exalted prayers glorifying Kṛshṇa's upcoming victories over Kaṁsa, Jarāsandha, and the Kurukshetra war. Later, while playing a game of "cops and robbers" with the cowherd boys, Kṛshṇa killed the demon Vyomāsura (son of Maya Dānava), who was disguised as a boy and hiding the cowherd children in mountain caves.