భాగవత మహా పురాణము
12 - శ్రీకృష్ణుడు అఘాసురుని ఉద్ధరించుట
శ్రీశుక ఉవాచ ।
క్వచిద్వనాశాయ మనో దధద్వ్రజూత్
ప్రాతస్సముత్థాయ వయస్యవత్సపాన్ ।
ప్రబోధయఞ్చృంగరవేణ చారుణా
వినిర్గతో వత్సపురస్సరో హరిః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఒకనాడు శ్రీకృష్ణునకు అడవియందే జించవలెనని గట్టి ఇచ్చ కలిగెను. ఆయన ఉదయమే నిద్ర లేచి త్రులైన గోపబాలకులకు మనోహరమైన కొమ్ము బూర ధ్వనితో కేతము చేసెను, దూడలు ముందు నడచుచుండగా ఆయన కులమునుండి బయలు దేరెను.
తేనైవ సాకం పృథుకాస్సహస్రశః
స్నిగ్ధాస్సుశిగ్వేత్రవిషాణవేణవః ।
స్వాన్ స్వాన్ సహస్రోపరిసంఖ్యయాఽన్వితాన్
ప్రేమతో నిండిన గోపబాలకులు వేలసంఖ్యలో ఆ శ్రీకృష్ణునితోడనే ఆనందముగా బయల్వెడలిరి. వారి ముందు నడచే దూడల సంఖ్య వేల కంటే అధికముగా నుండెను. వారు మంచి భోజనపు ఉట్టిలను, బెత్తములను, కొమ్ము బూరాలను, పిల్లన గ్రోవులను కలిగియుండిరి. .
కృష్ణవత్సైరసంఖ్యా కైర్యూథీకృత్య స్వవత్సకాన్ ।
చారయంతోఽర్భలీలాభిర్విజహ్రుస్తత్ర తత్ర హ ॥
వారు అసంఖ్యాకముగానున్న శ్రీకృష్ణుని దూడలతో తమ దూడలను కలిపి గుంపుగా చేసి, అక్కడక్కడ పిల్లల ఆటలతో విహరించిరి.
ఫలప్రవాలస్తబకసుమనఃపిచ్చధాతుభిః ।
కాచగుంజామణిస్వర్ణభూషితా అష్యభూషయన్ ॥
గాజు పూసలు, గురివింద పూసలు, మణులు, బంగారములతో చేసిన నగలను ఆ పిల్లలు కలిగియుండిరి. ఐనా వారు పళ్లు, చిగుళ్లు, పూల గుత్తులు, పూలు, నెమలి ఈకలు, రాళ్ల రంగులతో అలంకరించుకొనిరి.
ముష్ణంతోఽన్యోన్యశీక్యాదీన్ జ్ఞాతానారాచ్చ చిక్షిపుః ।
తత్రత్యాశ్చ పునర్దూరాద్ధసంతశ్చ పునర్ధదుః ॥
ఒకరి (అన్నపు గిన్నెను భద్రము చేసే) ఉట్టి, పిల్లన గ్రోవి మొదలగువాటిని మరియొకడు అపహరించును. ఫలానా వాడు అపహరించినాడని తెలుసుకోగానే, ఆ తెలియబడినవాటిని దూరముగా విసి రెదరు. దాని కొరకు ఈతడు పరుగెత్తగా, అక్కడున్న పిల్లలు దానిని మరింత దూరము విసిరేదరు. అంతిమముగా నవ్వుతూ దానిని వానికి తిరిగి యిచ్చెదరు.
యది దూరం గతో కృష్ణో వనశోభేక్షణాయ తమ్ ।
అహం పూర్వమహం పూర్వమితి సంస్పృశ్య రేమిరే ॥
శ్రీకృష్ణుడు అడవి అందమును తిలకించుటకై దూరము వెళ్లగా, నేను ముందు నేను ముందు అంటూ పిల్లలు (పరుగెత్తి) ఆతనిని ముట్టి ఆనందించెడివారు.
కేచిద్వేణూన్ వాదయంతో ధ్మాంతశ్శృంగాణి కేచన ।
కేచీద్బ్రంగె ప్రగాయంతః కూజంతః కోకిలేః పరే ॥
కొందరు పిల్లన గ్రోవులను వాయిస్తూ ఉంటే, మరికొందరు కొమ్ము బూరాలను పూరించుచుండిరి. కొందరు తుమ్మెదలతో బాటు ఝామ్ అని ధ్వనిస్తూ ఉంటే, మరికొందరు కోకిలల కూతలతో కంఠమును కలిపిరి.
విచ్చాయాభిః ప్రధావంతో గచ్ఛంతస్సాధు హంసకైః ।
బకైరుపవిశంతశ్చ నృత్యంతశ్చ కలాపిభిః ॥
కొందరు పక్షుల నీడలతో బాటుగా వేగముగా పరుగెత్తెదరు. కొందరు హంసలతో సరిదూగునట్లుగా నడచెదరు. కొందరు కొంగల ప్రక్కన జేరి కూర్చుందురు. కొందరు పురి విప్పిన నెమళ్లతో కూడి నాట్యమాడెదరు.
వికర్షంతః కీశబాలానారోహంతశ్చ తైర్ద్రుమాన్ ।
వికుర్వంతశ్చ తైస్సాకం ప్లవంతశ్చ పలాశిషు ॥
వారు కోతి పిల్లలను లాగి, వాటితో చెట్లనెక్కెదరు. వాటితో బాటు పళ్లను ఇగిలించి వెక్కిరిస్తూ చెట్ల పై దుముకుచుందురు.
సాకం భేకైర్విలంఘంతస్సరిత్ప్రస్రవసంఫ్లుతాః ।
విహసంతః ప్రతిచ్ఛాయాశ్శపంతశ్చ ప్రతిస్వనాన్ ॥
కొందరు నదిలో కలిసే నీటి పాయలలో దిగి తడిసి ముద్దవుతూ వాటిలోని కప్పలతో బాటు గెంతెడివారు. నీటిలోని తమ ప్రతిబింబములను కొందరు వెక్కిరించెడివారు. కొందరు కేక వేసి ప్రతిధ్వనిని తిట్టెడివారు.
ఇత్థం సతాం బ్రహ్మసుఖానుభూత్యా దాస్యం గతానాం పరదైవతేన,
మాయాశ్రితానాం నరదార కేణ సాకం విజహ్రుః కృతపుణ్యపుంజాః।
జ్ఞానులకు బ్రహ్మానందమై అనుభవమునకు వచ్చేది, శరణాగతులైన భక్తులకు పరదైవతముగా ఆరాధించబడేది, అజ్ఞానబంధములో ఉన్న వారలకు మానవబాలకుడుగా తెలియబడేది ఆ శ్రీకృష్ణుడే. గోపబాలకులు గుట్టలుగా పుణ్యమును చేయబట్టి ఆయనతో ఈ తీరున విహరించిరి.
యత్పాదపాంసుర్బహుజన్మకృచ్చ్రతో
ధృతాత్మభిర్యోగిభిరప్యలభ్యః ।
స ఏవ యద్దృగ్విషయస్స్వయం స్థితః
కిం వర్ణ్యతే దిష్టమతో వ్రజౌకసామ్ ॥
అనేకజన్మలలో తపస్సు చేసి మనస్సును నిగ్రహించిన యోగులకైననూ ఆ శ్రీహరి యొక్క పాదముల ధూళి లభించదు. అట్టి శ్రీహరియే స్వయముగా గోకులవాసుల కళ్లకు కనబడుతూ నిలిచినాడు. వారి భాగ్యమును ఇంతకు మించి ఏమని వర్ణించదగును?
అథాఘనామాఽభ్యపతన్మహాసుర స్తేషాం సుఖక్రీడనవీక్షణాక్షమః।
నిత్యం యదంతర్నిజజీవితేప్సుభిః పీతామృతైరప్యమరైః ప్రతీక్ష్యతే॥
తరువాత అఘుడని ప్రసిద్ధి గాంచిన పెద్ద రాక్షసుడు అకస్మాత్తుగా వచ్చెను. వారు సుఖముగా ఆడుకొనుటను చూచి వాడు ఓర్వలేకపోయేను. దేవతలు అమృతము త్రాగినా లభించని జీవితసాఫల్యమును కోరువారై ఆ శ్రీకృష్ణుని లీలను నిత్యము మనస్సులో స్మరించుచుందురు.(అమృతమును త్రాగినా తమ జీవితములకు అఘాసురుని వలన హాని కలుగుననే భయముతో దేవతలు వాని మృత్యువు కొరకు ఎదురు చూచుచుందురు).
దృష్ట్వాఽర్బకాన్కృష్ణ ముఖానఘాసురః కంసానుశిష్టస్స బకీబకానుజః ।
అయంతు మే సోదరనాశకృత్తయోర్ద్వయోర్మ మైనం సబలం హని ష్యే॥
పూతనకు బకాసురునకు సోదరుడగు అఘాసురుని కంసుడు పంపెను. వాడు కృష్ణుడు ప్రముఖుడుగా గల గోపబాలకులను చూచి. ఇట్లు తలపోసేను -- నా సోదరుడగు బకాసురుని, సోదరియగు పూతనను, చంపినది వీడే. నాకు చెందిన వారిద్దరికి ప్రీతిని కలిగించుటకై నేను వీనిని గోపబాలకులతో సహా చంపెదను.
ఏతే యదా మత్సుహృదోస్తిలాపః కృతాస్తదా నష్టసమా వ్రజౌకసః,
ప్రాణే గతే వర్ష్మసు కా ను చింతా ప్రజాఽసవః ప్రాణభృతో హి యే తే.
నా సోదరీసోదరులకు వీరిని తిలోదకములుగా చేసెదను. అప్పుడు గోకులములోని జనులు చచ్చినవారితో సమానము. ప్రాణమే పోతే దేహముల గురించి చింత యేముండును? ఎందుకంటే, ప్రాణులకు వారి సంతానమే ప్రాణము.
ఇతి వ్యవస్యాజగరం బృహద్వపుః
స యోజనాయామమహాద్రిపీవరమ్ ।
ధృత్వాఽద్బుతం వ్యాత్తగుహాఽఽననం తదా
పథి వ్యశేత గ్రసనాశయా ఖలః ॥
అప్పుడా దుష్టుడు ఈ విధముగా నిశ్చయించుకొని పెద్ద కొండచిలువ దేహమును దాల్చెను. అది రెండు క్రోసుల పొడవు కలిగి పెద్ద పర్వతము వలె బలిసి ఉండెను. ఆశ్చర్యకరమగు దాని నోరు తెరుచుకుని గుహవలె నుండెను. అది గోపబాలకులను మింగాలనే కోరికతో దారిలో పరుండెను.
ధరాఽధరోష్ఠో జలదోత్తరోష్ఠో దర్యాననాంతో గిరీశృంగదంష్ట్రః ।
ధ్వాంతాంతరాస్యో వితతాధ్వజిహ్వః పరుషానిలశ్వాసదవేక్షణోష్ణః ॥
ఆ అఘాసురుని క్రింది పెదవి నేలను, పై పెదవి మేఘములను తాకుచుండెను. వాని నోటి కొనలు గుహలను, కోరలు పర్వతశిఖరములను పోలియుండెను. నోటి లోపలి భాగము చీకటి. నాలుక పరుచుకున్న మార్గమువలె నుండెను. వాని నిట్టూర్పులు వేడి గాడ్పు వలె నుండెను. వాని కన్నులు కార్చిచ్చును పోలియుండెను.
దృష్ట్వా తం తాదృశం సర్వే మత్వా వృందావనశ్రియమ్ ।
వ్యాత్తాజగరతుండేన హ్యుత్ప్రేక్షంతే స్మ లీలయా ॥
అట్టి అఘాసురుని ఆ గోపబాలకులందరు చూచి, అది బృందావనములోని సుందరదృశ్యమనియే తలపోసిరి. పైగా, ఆ దృశ్యము నోరు తెరిచిన కొండచిలువను పోలి యున్నదని విలాసగా వర్ణించిరి.
అహో మిత్రాణి గదత సత్త్వకూటం పురః స్థితమ్ ।
అస్మత్సంగ్రసనవ్యాత్తవ్యాలతుండాయతే న వా ॥
ఆశ్చర్యము! మిత్రులారా! చెప్పడు. మనముందున్న ఈ బండరాయి పెద్ద ప్రాణివలె ఉన్నది గదా? ఇది మనలను మ్రింగుటకై నోరు తెరిచిన కొండ చిలువను పోలియున్నదా? లేదా?
సత్యమర్కకరారక్తముత్తరాహనువద్ఘనమ్ ।
అధరాహనువద్రోధస్తత్ప్రతిచ్ఛాయయాఽరుణమ్ ॥
నిజమే. సూర్యకిరణములచే అంతటా ఎర్రనైన మేఘము పై పెదవిని, ఆ మేఘమే నదియందు ప్రతిఫలించి ఎర్రగా కనబడే నది ఒడ్డు క్రింది పెదవిని పోలియున్నవి.
ప్రతిస్పర్దేతే సృక్కిభ్యాం సవ్యాసవ్యే నగోదరే ।
తుంగశృంగాలయోఽప్యేతాస్తద్దంష్ట్రాభిశ్చ పశ్యత ॥
చూడండి. ఎడమ-కుడివైపులనున్న ఈ రెండు పర్వతగుహలు కొండ చిలువ పెదవి కొనలతో, ఈ ఎత్తైన శిఖరముల వరుసలు దాని కోరలతో పోటీ పడుచున్నవి.
ఆస్తృతాయామమార్గోఽయం రసనాం ప్రతిగర్జతి ।
ఏషామంతర్గతం ధ్వాంతమేతదప్యంతరాననమ్ ॥
ఈ విస్తరించిన పొడవైన దారి కొండచిలువ నాలుకను, ఈ పర్వతశిఖరముల లోపలి చీకటి కూడ కొండ చిలువ నోటి మధ్యభాగమును గట్టిగా పోలియున్నవి.
దావోష్ణ ఖరవాతోఽయం శ్వాసవద్బాతి పశ్యత।
తద్దగ్ధసత్త్వదుర్గంధోఽప్యంతరామిషగంధవత్ ॥
చూడండి. దావాగ్నిచే వేడెక్కిన పరుషమైన గాలి కొండ చిలువ శ్వాసను పోలినది. ఇంతేగాక, ఆ దావాగ్నిలో పడి కాలిపోయిన ప్రాణుల దుర్గంధము దాని కడుపు లోపలి మాంసపు వాసనను పోలియున్నది.
అస్మాన్ కిమత్ర గ్రసీతా నివిష్టానయం తథా చేద్భకవద్వినoక్ష్యతి ।
క్షణాదనేనేతి బకార్యుశన్ముఖం వీక్ష్యోద్ధసంతః కరతాడనైర్యయుః॥
ఇది నిజముగా కొండ చిలువయే అయి, ఇక్కడ కూర్చున్న మనలను మ్రింగి వేయునా యేమీ? నిజముగా కొండ చిలువయే ఐనచో, బకాసురుని సంహరించిన శ్రీకృష్ణుడు దీనిని క్షణములో నశింప జేయగలడు, అని ఆ గోపబాలకులు మాట్లాడుకొనుచుండిరి. వారు బకాసురుని సంహరించిన శ్రీకృష్ణుని అందమగు ముఖమును చూస్తూ, బిగ్గరగా నవ్వుతూ చప్పట్లతో ముందుకు సాగిరి.
ఇత్థం మిథోఽతథ్యమతజ్జ్ఞభాషితం
శ్రుత్వా విచింత్యేత్యమృషా మృషాయతే ।
రక్షో విదిత్వాఽఖిలభూతహృత్స్థితః
స్వానాం నిరోద్ధుం భగవాన్మనో దధే ॥
శ్రీకృష్ణ భగవానుడు సకలప్రాణుల హృదయమునందు (ఆత్మ రూపముగా) ఉన్నాడు. ఆ రాక్షసుని గురించి తెలియని గోపబాలకులు భ్రమతో ఈ తీరున ఒకరితోనొకరు పలికిరి. ఆ మాటలను విని ఆయన, వీరికి సత్యము మిథ్యగా తోచుచున్నది, అని తలచెను. వాడు రాక్షసుడని తెలిసి, ఆయన వారిని (ముందుకు వెళ్లకుండా) ఆపుటకు నిశ్చయించెను.
తావత్ప్రవిష్టాస్త్వసురోదరాంతరం పరం న గీర్ణాశ్శిశవస్సవత్సాః।
ప్రతీక్షమాణేన బకారివేశనం హతస్వకాంతస్మరణేన రక్షసా ॥
అంతలోనే గోపబాలకులు దూడలతో సహా రాక్షసుని ఉదరము మధ్య లోనికి ప్రవేశించినారు. కానైతే, తన ప్రియబంధువులగు పూతనను బకాసురుని గుర్తు చేసుకున్న రాక్షసునిచే వారు మ్రింగబడలేదు. ఎందుకంటే, వాడు బకాసురుని చంపిన శ్రీకృష్ణుడు ప్రవేశించుటకై ఎదురు చూచుచుండెను.
తాన్వీక్ష్య కృష్ణస్సకలాభయప్రదో హ్యనన్యనాథాన్స్వకరాదవచ్యుతాన్।
దీనాంశ్చ మృత్యోర్జఠరాగ్నిఘాసాంఘృణార్దితో దిష్ఠకృతేన విస్మితః ॥
శ్రీకృష్ణుడు సకలప్రాణులకు అభయమునిచ్చువాడు. మరియొక రక్షకుడు లేని దీనులైన ఆ పిల్లలు ఆయన చేతినుండి జారిపోయి మృత్యురూపుడగు అఘాసురుని జఠరాగ్నికి గడ్డిపోచలవంటివారు కాబోతున్నారు. ప్రారబ్దముచే కల్పించబడిన ఆ పరిస్థితిని చూచి ఆయన మనస్సు దయచే పీడను పొందెను. ఆయన ఆశ్చర్యచకితుడయ్యెను.
కృత్యం కిమత్రాస్య ఖలస్య జీవనం
న వా అమీషాం చ సతాం విహింసనమ్ ।
ద్వయం కథం స్యాదితి సంవిచింత్య తత్
జ్ఞాత్వాఽవిశత్తుండమ శేషదృగ్ఘరిః ॥
ఈ విషయములో కర్తవ్యమేమి? ఈ దుష్టుడు బ్రదికి యుండరాదు. అమాయకులైన ఈ పిల్లలకు హాని కలుగరాదు. ఈ రెండు లక్ష్యములు నెరవేరే ఉపాయమేది? అని సర్వసాక్షియగు శ్రీకృష్ణ భగవానుడు లోతుగా ఆలోచించేను. ఆ ఉపాయము తట్టి, ఆయన వాని నోటిలో ప్రవేశించేను.
తదా ఘనచ్చదా దేవా భయాద్దా హేతి చుక్రుశుః ।
జహృషు ర్యే చ కంసాద్యాః కౌణపాస్త్వఘబాంధవాః ॥
అప్పుడు కంసుని భయము వలన మేఘముల మాటున నక్కి చూస్తున్న దేవతలు అయ్యో! అయ్యో! అంటూ ఆక్రోశించిరి. అఘాసురుని బంధువులు కంసుడు మొదలైనవారెవరు గలరో, వారైతే హర్షించిరి.
తచ్చ్రుత్వా భగవాన్ కృష్ణస్త్వవ్యయస్సార్భవత్సకమ్ ।
చూర్ణీచికీర్షోరాత్మానం తరసా వవృధే గలే ॥
వినాశము లేని శ్రీకృష్ణ భగవానుడు ఆ ఆక్రోశమును వినేను. అఘాసురుడు పిల్లలను, దూడలను, శ్రీకృష్ణుని కూడ చూర్ణము చేయ గోరెను. కాని, ఆయన మాత్రము వాని కంఠములో వేగముగా పెరిగెను.
తతోఽతికాయస్య నిరుద్ధమార్గిణో హ్యుధ్గీర్ణదృష్టేర్బ్రమతస్త్వితస్తతః।
పూర్ణోఽoతరం గే పవనో నిరుద్ధో మూర్ధన్వినిష్పాట్య వినిర్గతో బహిః!॥
ఆయన అట్లు పెరుగుట వలన పెద్ద దేహము గల ఆఘాసురుని ప్రాణవాయుమార్గము మూసుకుపోయెను. కళ్లు బయటకు పొడుచుకు రాగా, వాడు ఇటునటు పొర్లాడుచుండెను. దేహమధ్యభాగమునందు అడ్డు కొనబడి నిండిపోయిన వాయువు తలపై పగులగొట్టుకొని బయల్వెడలెను.
తేనైవ సర్వేషు బహిర్గతేషు
ప్రాణేషు వత్సాన్ సుహృదః పరేతాన్ ।
దృష్ట్యా స్వయోత్థాప్య తదన్వితః పునః
వక్త్రాన్ముకుందో భగవాన్ వినిర్యమౌ ॥
ఆ దారిగుండా వాని ప్రాణములన్నీ పైకి పోయెను. దూడలు, గోపబాలకులు మరణించి పడి యుండిరి. మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానుడు వారిని తన చూపుతో పైకి లేచునట్లు చేసెను. ఆయన వారితో గూడి మరల నోటినుండి బయటకు వచ్చెను.
పీనాహిభోగోత్థితమద్భుతం మహజ్జ్యోతిస్స్వధామ్నా జ్వలయద్దిశో దశ
ప్రతీక్ష్య ఖేఽవస్థితమీశనిర్గమం వివేశ తస్మిన్మిషతాం దివౌకసామ్ ॥
బలిసిన ఆ పాము పడగలనుండి అద్భుతమైన పెద్ద జ్యోతి బయటకు వచ్చేను. పది దిక్కులను తన కాంతితో ప్రజ్వరిల్ల జేయుచున్న ఆ జ్యోతి ఆకాశమునందు నిలిచి భగవానుడు బయటకు వచ్చువరకు ప్రతీక్షించేను. దేవతలు విస్తుబోయి చూచు చుండగా, అది ఆయనలో ప్రవేశించెను.
తతోఽతిహృష్టాస్స్వకృతోఽకృతార్హణం
పుష్పైస్సురా అప్సరసశ్చ నర్త నైః ।
గీతైస్సుగా వాద్యధరాశ్చ వాద్య కైః
స్త వైశ్చ విప్రా జయనిస్స్వనైర్గణాః ॥
ఆ అఘాసురవధవలన మిక్కిలి హర్షమును పొందిన దేవతలు పూలతో తమ కార్యము (రాక్షససంహారము) ను చేసిన శ్రీకృష్ణుని సత్కరించిరి. అప్సరసలు నాట్యములతో, బాగా పాడే గంధర్వులు పాటలతో, వాద్యము లను కలిగియుండే విద్యాధరులు వాద్యములతో, మహర్షులు స్తోత్రములతో, పార్షదగణములు కూడ జయజయధ్వానములతో సత్కరించిరి.
తదద్భుతస్తోత్రసువాద్యగీతికా-
జయాదినైకోత్సవమంగలస్వనాన్ ।
శ్రుత్వా స్వధామ్నోఽoత్యజ ఆగతోఽచిరాత్
దృష్ట్వా మహేశస్య జగామ విస్మయమ్ ॥
దేవతలు మొదలగువారి అద్బుతములైన స్తోత్రములు, చక్కని వాద్యములు, పాటలు, జయధ్వానములు మొదలగు, అనేకములైన ఉత్సవముల మంగళధ్వనులు బ్రహ్మదేవునకు ఆయన ధామము దగ్గర వరకు వినిపించెను. ఆయన వెంటనే వచ్చి శ్రీకృష్ణ భగవానుని మహిమను గాంచి ఆశ్చర్యచకితుడాయెను.
రాజన్నాజగరం చర్మ శుష్కం బృందావనేఽద్బుతమ్ ।
ప్రజౌకసాం బహుతిథం బభూవాక్రీడగహ్వరమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! అద్బుతమైన ఆ కొండ చిలువ చర్మము ఎండి పెద్ద బిలము ఆయెను. గోకులవాసులు చాల కాలము బృందావనములో దానియందు ఆటలాడెడివారు.
ఏతత్కౌమారజం కర్మ హరేరాత్మాహీమోక్షణమ్ ।
మృత్యోః పౌగండకే బాలా దృష్ట్వోచుర్విస్మితా వ్రజే ॥
ఈ విధముగా శ్రీకృష్ణ భగవానుడు తన ఐదవ యేట గోపబాలకులను పాము నోటిలో చావునుండి, అఘాసురుని సంసారమునుండి విముక్తులను చేసెను. దీనిని చూచిన గోపబాలకులు ఆశ్చర్యపడి, ఆ వృత్తాంతమును శ్రీకృష్ణుని ఆరవ యేట గోకులమునందు చెప్పిరి.
నైతద్విచిత్రం మనుజార్బమాయినః
పరావరాణాం పరమస్య వేధసః ।
అఘోఽపి యత్స్పర్శనధౌతపాతకః
ప్రాపాత్మసామ్యం త్వసతాం సుదుర్లభమ్ ॥
బ్రహ్మాది దేవతలనుండి చెట్టు చేమలవరకు సర్వమును (కార్యములైన దేహములతో కారణములైన పంచభూతములతో కూడియున్న జగత్తును) సృష్టించిన పరబ్రహ్మయే మాయాశక్తిచే మానవబాలకుడై అవతరించేను. ఆయనకు ఇది విచిత్రమేమీ కాదు. ఏదనగా -- మోక్ష మైతే దుష్టులకు సుతరాము పొంద శక్యము కానిది. కాని, ఆయనను స్పృశించుటచే పాపములన్నీ కడిగివేయబడి అఘాసురుడు కూడ మోక్షమును పొందెను. మోక్షములో జీవుడు ఈశ్వరునిలో విలీనమగును.
సకృద్యదంగప్రతిమాంతరాహితా
మనోమయీ భాగవతీం దదౌ గతిమ్ ।
స ఏవ నిత్యాత్మసుఖానుభూత్యభి-
వ్యుదస్తమాయోఽoతర్గతో హి కిం పునః ॥
ఆ భగవానుని మూర్తి యొక్క ప్రతికృతిని మనోవృత్తిరూపముగా ఎవడైతే ఒక్కసారి హృదయము లోపల ధ్యానముచే స్థాపించుకొనునో, అట్టివానికి భగవానుడు భగవద్బక్తులకు లభించే మోక్షమునిచ్చెను. హృదయములో నిత్యమైన ఆత్మానందానుభవరూపముగా ఆ భగవానుడు సాక్షాత్కరించి అజ్ఞానమును పారద్రోలును. అట్టి భగవానుడే స్వయముగా ఎవని దేహములో ప్రవేశించెనో, అట్టి అఘాసురునకు మోక్షము లభించెనని వేరుగా చెప్పవలయునా?
సూత ఉవాచ ।
ఇత్థం ద్విజా యాదవదేవదత్తశ్శ్రుత్వా స్వరాతుశ్చరితం విచిత్రమ్,
పప్రచ్ఛ భూయోఽపి తదేవ పుణ్యం వైయాసకిం యన్నిగృహీతచేతాః ।
సూతమహర్షి ఇట్లు పలికెను --- ఓ శౌనకాది మహర్షులారా! యాదవప్రభువగు శ్రీకృష్ణుడే పరీక్షిత్తును కాపాడి పాండవులకు అనుగ్రహించెను. తనను కాపాడిన ఆ భగవానుని అద్బుతమగు చరితమును పరీక్షిత్తు వినుచుండెను. ఆయన మనస్సు ఆ చరితమునకు సుతరాము వశమయ్యెను. ఆయన మరల శుకమహర్షిని పవిత్రమగు ఆ చరితమును గురించియే ప్రశ్నించెను.
రాజోవాచ ।
బ్రహ్మన్ కాలాంతరకృతం తత్కాలీనం కథం భవేత్ ।
యత్కౌమారే హరికృతం జగుః పౌగండ కేఽర్భకాః ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! శ్రీకృష్ణ భగవానుడు తన ఐదవ యేట ఏ లీలను చేసెనో, దానిని గోపబాలకులు ఆరవ యేట గానము చేసిరి. ఒక కాలములో చేసిన లీల మరియొక కాలమునకు చెందినది యెట్లు అగును? .
తద్భ్రూహి మే మహాయోగిన్ పరం కౌతూహలం గురో ।
నూనమేతద్ధరేరేవ మాయా భవతి నాన్యథా ॥
ఓ మహాయోగీ! నీవు నాకు గురుడవు. నాకీ విషయమును చెప్పుడు. నాకు కుతూహలము మెండు. ఇది నిశ్చయముగా శ్రీకృష్ణ భగవానుని - మాయాశక్తియే గాని, మరియొకటి కాదు.
వయం ధన్యతమా లోకే గురోఽపి క్షత్రబంధవః ।
యత్పిబామో ముహుస్త్వత్తః పుణ్యం కృష్ణ కథాఽమృతమ్ ॥
ఓ గురుదేవా! మేము క్షత్రియాధులమే. అయినా అందరికంటే ఎక్కువ ధన్యులము. ఎందుకంటే, మేము నీనుండి పవిత్రమైన శ్రీకృష్ణగాథలనే అమృతమును మరల మరల పానము చేయుచున్నాము.
సూత ఉవాచ ।
ఇత్థం స్మ పృష్ణస్స తు బాదరాయణిః
తత్స్మారితానంతహృతాఖిలేంద్రియః ।
కృచ్చ్రాత్పునర్లబ్దబహిర్ధృశిశ్శనైః
ప్రత్యాహ తం భాగవతోత్తమోత్తమ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్దే ద్వాదశోఽధ్యాయః ॥
సూత మహర్షి ఇట్లు పలికెను --- ఓ శౌనకా! నీవు ఉత్తములగు భగవద్బక్తులలో ఉత్తముడవు. ఈ విధముగా రాజు ప్రశ్నించగా, వ్యాసపుత్రుడగు శుకునకు శ్రీకృష్ణ భగవానుడు స్మృతికి దగిలెను. అంతే. వెంటనే ఆయన ఇంద్రియములన్నియు అంతర్ముఖములాయెను. చాల కష్టము మీద ఆయన మరల సమాధినుండి బాహ్యజగత్తులోనికి వచ్చి, మెల్లగా ఆ రాజునకు ఇట్లు బదులు చెప్పెను.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో శ్రీకృష్ణుడు అఘాసురుని ఉద్దరించుటను వర్ణించే పన్నెండవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 12 of the Bhāgavata Mahā Purana is as follows:
On another glorious morning, Śrī Kṛshṇa, Balarāma, and the cowherd boys took their calves deep into the Vṛndāvana forest for a picnic. Observing their joy, the mighty demon Aghāsura—the younger brother of Pūtanā and Bakāsura—assumed the form of a colossal, eight-mile-long python, lying across the forest path with its gaping mouth resembling a mountain cave. Mistaking the python's cavernous mouth for a natural cave, the innocent cowherd boys entered alongside their calves. Śrī Kṛshṇa, knowing the demon's trap, entered the python's throat Himself and expanded His body to immense proportions. Suffocating within, the demon's eyes popped out, his life air burst through the top of his skull, and he died instantly. Kṛshṇa revived the boys and calves with His divine glance, bringing them safely out, while the soul of Aghāsura merged into the luminous effulgence of Bhagavān's body.