32 - శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై గోపికలనోదార్చుట

శ్రీశుక ఉవాచ

ఇతి గోప్యః ప్రగాయంత్యః ప్రలపంత్యశ్చ చిత్రధా

రుగుదుస్సుస్వరం రాజన్ కృష్ణ దర్శనలాలసాః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని చూడాలనే ఉత్కటమగు ఇచ్ఛ గల గోపికలు విధముగా అనేకప్రకారములుగా గానము చేస్తూ, మాటలాడుచుండిరి. మధురమగు స్వరముతో ఏడ్చిరి.

 తాసామావిరభూచ్ఛౌరిస్స్మయమానముఖాంబుజః

పీతాంబరధరస్స్రగ్వీ సాక్షాన్మన్మథమన్మథః

శూరవంశీయుడగు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో వారికి ప్రత్యక్షమయ్యెను. పద్మమువంటి మోము గల ఆయన పచ్చని వస్త్రమును వనమాలను దాల్చి, సాక్షాత్తుగా మన్మథునకు కూడ మన్మథుడు వలె నుండెను.

తం విలోక్యాగతం ప్రేష్ఠం ప్రీత్యుత్ఫుల్లదృశోఽబలాః

ఉత్తస్థుర్యుగపత్సర్వాస్తన్వః ప్రాణమివాగతమ్

పోయిన ప్రాణము రాగా దేహములోని అవయవములన్నీ ఒక్కసారి జీవంతములగును. అదే విధముగా, వచ్చిన ప్రియతముడగు ఆ శ్రీకృష్ణుని చూచి గోపికల కన్నులు ప్రేమతో వికసించినవి. వారందరు ఒక్కసారిగా లేచి నిలబడిరి.

 కాచిత్కరాంబుజం శౌరేర్జగృహేంఽజలినా ముదా

కాచిద్దధార తద్బాహుమం సే చందనరూషితమ్

శ్రీకృష్ణుని పద్మమువంటి చేతిని ఒక గోపిక ఆనందముతో తన దోసిలితో పట్టుకొనగా, మరియొక గోపిక చందనమలదిన ఆయన చేతిని తన భుజముపై వేసుకొనెను.

కాచిదంజలినాఽగృహ్ణాత్తన్వీ తాంబూలచర్వితమ్

ఏకా తదంఘ్రికమలం సంతప్తా స్తనయోరధాత్

ఒకానొక సుందరి ఆయన నోటిలోని తాంబూలమును దోసిలితో తీసుకొనగా, తాపమును పొందిన మరియొక గోపిక పద్మమువంటి ఆయన పాదమును వక్షఃస్థలము పై నుంచుకొనెను.

ఏకా భ్రుకుటిమాబధ్య ప్రేమసంరంభవిహ్వలా

ఘ్నతీవైక్షత్కటాక్షే పైస్సందష్టదశనచ్ఛదా

ఒక గోపిక ప్రణయకోపముచే స్వాధీనత తప్పి క్రింది పెదవిని ముడివేసి ఓరచూపులను విసురుతూ కొట్టుచున్నదా యన్నట్లు చూచెను.

అపరాఽనిమిషద్దృగ్భ్యాం జుషాణా తన్ముఖాంబుజమ్

ఆపీతమపి నాతృప్యత్సంతస్తచ్చరణం యథా

సత్పురుషులకు ఆయన చరణములను ఎంత 'సేవించినా తనివి దీరదు. అదే తీరున, మరియొకామెకు పద్మమువంటి ఆయన ముఖమును    రెప్పపాటు లేని కళ్లతో చూచి  ఆస్వాదించి మరల చూచినా తనివి దీరలేదు.

తం కాచిన్నేత్రరంధ్రేణ హృది కృత్య నిమీల్య చ

పులకాంగ్యుపగుహ్యాస్తే యోగీవానందసంఫ్లుతా

ఒకామె ఆయనను కళ్లు అనే ద్వారము గుండా హృదయములో ప్రవేశ పెట్టి ఆ ద్వారమును మూసివేసెను. అపుడామె ఆయనను కౌగిలించుకొనగా, ఆమెకు దేహమంతటా గగుర్పాటు కలిగెను. యోగి వలె ఆమె ఆనందసముద్రములో మునిగిపోయెను.

సర్వాసాః కేశవాలోకపరమోత్సవ నిర్వృతాః

జహుర్విరహజం తాపం ప్రాజ్ఞం ప్రాప్య యథా జనాః

శ్రీకృష్ణ భగవానుని దర్శనమే గొప్ప ఉత్సవము కాగా వారందరు ఆనందించిరి. బ్రహ్మజ్ఞానిని పొందిన సంసాగి జనులు పట్టి, వారు విరహము వలన కలిగిన తాపమును విడిచి పెట్టిరి.

 తాభిర్విధూత శోకాభిర్భగవాసచ్యుతో వృతః

వ్యరోచతాధికం తాత పురుషశ్శక్తిభిర్యథా

నాయనా! గోపికల శోకము ఎగిరిపోయెను. వారా శ్రీకృష్ణ భగవానుని చుట్టుముట్టిరి. పూర్ణ పరమాత్మ జ్ఞానక్రియాది శక్తులతో వలె ఆయన వారితో గూడి విశేషముగా ప్రకాశించెను.

తాస్సమాదాయ కాలింద్యా నిర్విశ్య పులినం విభుః

వికసత్కుందమందారసురభ్యనిలషట్పదమ్

 శరచ్చంద్రాంశుసందోహధ్వస్త దోషాతమశ్శివమ్

కృష్ణా, హస్తతరలాచితకోమలవాలుకమ్

సర్వసమర్థుడగు శ్రీకృష్ణ భగవానుడు గోపికలతో యమునానది యొక్క సుఖకరమైన ఇసుకతిన్నెను చేరెను. వికసించుచున్న మల్లెల, మందారముల పరిమళము గల వాయువు అచటకు తుమ్మెదలను కొనివచ్చుచుండెను. శరత్కాలచంద్రుని కిరణముల గుంపులు రాత్రి చీకట్లను తరిమి కొట్టెను. యమునానది యొక్క చేతులవంటి కెరటములు అచటీ మెత్తని ఇసుకను తడుపుచుండెను.

తద్దర్శనాహ్లాద విధూతహృద్రుజో మనోరదాంతం శ్రుతయో యథా యయుః

స్వైరుత్తరీయైః కుచకుంకుమాంకితైః అచీక్లుపన్నాసనమాత్మబంధవే

ఆయన దర్శనముచే వారి హృదయములలోని తాపము తొలగి ఆనందము కలిగెను. పరబ్రహ్మస్వరూపమును వర్ణించిన శ్రుతులు వలె వారు కూడ కోరికల అంతమును (పూర్ణత్వమును) పొందిరి. వారు ఆత్మబంధువగు శ్రీకృష్ణునికి తమ ఉత్తరీయములతో ఆసనమును కల్పించిరి. ఆ ఉత్తరీయములపై వారి వక్షఃస్థలమునందలి కుంకుమ చిహ్నములు ఉండెను.

తత్రోపవిష్టో భగవాన్ స ఈశ్వరో యోగేశ్వరాంతర్హృది కల్పితాసనః

చకాస గోపీ పరిషద్గతోఽర్చిత స్త్రైలోక్యలక్ష్మ్యేకపదం వపుర్దధత్

యోగిరాజుల హృదయము లోపల స్థిరనివాసముండే ఆ జగన్నాథుడు కొంగుపై కూర్చుండెను. ముల్లోకముల శోభకు ఒకే ఒక ఆశ్రయమైన దేహమును దాల్చి గోపికల సభయందున్న ఆయనను వారు పూజించిరి. అపుడాయన గొప్పగా శోభిల్లెను.

సభాజయిత్వా తమనంగదీపనం సహాసలీ లేక్షణవిభ్రమభ్రువా సంస్పర్శనేనాంకకృతాంఘ్రిహస్తయోః సంస్తుత్య ఈషత్కుపితా బభాషి రే

అనుగాగమును వర్ధిల్లజేసే ఆయనను గోపికలు నవ్వుతో కూడిన విలాసపు చూపులతో మరియు కనుబొమల విరుపులతో సత్కరించిరి. ఒకామె. ఆయన చేతిని, మరియు కామ ఆయన కాలిని తమ వక్షఃస్థలము పై నుంచుకొనిరి. వారా స్పర్శను నిమిత్తముగా చేసుకొని ఆయనను గొప్పగా కొనియాడిరి. అప్పుడు గోపికలు కొ కోపించి ఆయనతో నిట్టనిరి.

గోప్య ఊచుః

భజతోఽను భజంత్యేక ఏక ఏతద్విపర్యయమ్

నోభయాంశ్చ భజంత్యేక ఏతన్నో బ్రూహి సాధు భోః

గోపికలిట్లు --- పలికిరి కొందరు. తమను ప్రేమించే ఇతరులను ఆ తరువాత ప్రేమించెదరు. కొందరు దీనికి తల్లక్రిందులు, అనగా ఇతరులు    ప్రేమించకున్ననూ వారిని ప్రేమించెదరు. ప్రేమించువారిని, ప్రేమించనివారిని కూడ ప్రేమించరు. ఓయీ! ఓయీ! ఈ ప్రవృత్తులలో ఏది యోగ్యమైనదో మాకు చెప్పుము.

శ్రీభగవానువాచ

మిథో భజంతి యే సఖ్యస్స్వార్థైకాంతోద్యమా హి తే

న తత్ర సౌహృదం ధర్మస్స్వార్థార్థం తద్ధి నాన్యథా

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- చెలులారా! ఇతరులు ప్రేమిస్తేనే వారిని ప్రేమించువారు తమ ప్రయోజనమునందు మాత్రమే నిశ్చితమైన ఉద్యమము గలవారు. వారి ఆ ప్రవృత్తిలో యథార్థమగు ప్రేమ గాని, ధర్మము గాని లేవు. ఆ ప్రేమ కేవలము స్వంత ప్రయోజనము కొరకే గాని, వేరు కాదు.

భజంత్యభజతో యే వై కరుణాః పితరో యథా

ధర్మో నిరపవాదోఽత్ర సౌహృదం చ సుమధ్యమాః

ఓ సుందరులారా! దయామయులు తల్లిదండ్రులవలె ప్రేమించనివారిని కూడ ప్రేమించెదరు. వారి ఈ ప్రేమలో నిశ్చలపూర్ణధర్మము మరియు సాధుత్వము కూడ గలవు.

భజతోఽపి న వైకేచిద్భజంత్యభజతః కుతః  

ఆత్మారాచూ హ్యాప్తకామా అకృతజ్ఞా గురుద్రుహః

కొందరు ప్రేమించేవారిని కూడ నిశ్చయముగా ప్రేమించరు. వారు ప్రేమించనివారిని ఏల ప్రేమించెదరు? (ప్రేమించరు). (ప్రేమించరు). అట్టివారు ఆత్మనిష్ఠులు, పూర్ణకాములు అగు మహాత్ములు కావచ్చును; లేదా, చేసిన ఉపకారమును మరిచినవారు కావచ్చును; లేదా, గుర్తున్నా గురువువంటి ఉపకారము చేసిన వ్యక్తి యెడల ద్రోహబుద్ధి గలవారు కావచ్చును.

నాహం తు సఖ్యో భజతోఽపి జంతూన్భజామ్యమీషామనువృత్తివృత్తయే,

యథాఽధనో లబ్ధధనే వినష్టే తచ్చింతయాఽన్యన్నిభృతో న వేద

ఓ చెలియలారా! ధనము లేనివానికి ధనము లభించి అది నష్టమైనచో, ఆతడు నిరంతరముగా దానినే చింతిస్తూ ఇతరమును విస్మరించును. అదే విధముగా, నన్ను ప్రేమించే భక్తులకు నా ధ్యానము నిరంతరముగా కొనసాగుటకై, నేను కనబడి అంతర్ధానమగుచుందును. అంతేగాని, నేను వారికి నిరంతరముగా కనిపిస్తూ ఉండను.

ఏవం మదర్థో జ్ఘితలోకవేద -  

స్వానాం హి వో మయ్యనువృత్తయోఽబలాః

మయా పరోక్షం భజతా తిరోహితం

మాఽసూయితుం మాఽర్హథ తత్ప్రియం ప్రియాః

ఓ అబలలారా! మీపై నాకు ప్రీతి మెండు. మీరీ విధముగా నా కొరకై లోకములోని మర్యాదను, వేదములచే విధించబడిన గృహస్థాశ్రమనియమములను, బంధువులను విడిచి పెట్టితిరి. మీకు నాపై ధ్యానము కొనసాగుట కొరకు మాత్రమే నేను అంతర్షితుడనైతిని. నేను కనబడకపోయినా మిమ్ములను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇది నిశ్చయము. కాబట్టి, మీ ప్రియుడనగు నాయందు మీరు తప్పులనెన్నుట తగదు.

న పారయేఽహం నిరవద్యసంయుజాం

స్వసాధుకృత్యం విబుధాయుషాఽపి వః

యా మాఽభజన్ దుర్జరగేహశృంఖలాః

సంవృశ్చ్య తద్వః ప్రతియాతు సాధునా

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్ధే ద్వాత్రింశోఽధ్యాయః

మీ ప్రేమ నిష్కపటమైనది. మీరు నాపై చూపిన ఈ ప్రేమకు ప్రత్యుపకారమును నేను దేవతల ఆయుర్దాయమును పొందినా చేయజాలను. ఇల్లు - వాకిలి అనే సంకెళ్లు మిక్కిలి దృఢమైనవి. కాని, మీరు వాటిని కూడ పూర్తిగా తెగగొట్టి నన్ను ప్రేమించినారు. మీ ప్రేమకు ప్రత్యుపకారము మీ ప్రేమయే యగుగాక!

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో

శ్రీకృష్ణుడు ప్రత్యక్ష మై గోపికలనోదార్చుటను వర్ణించే

ముప్పది రెండవ అధ్యాయము ముగిసినది (32).