భాగవత మహా పురాణము
79 - బల్వలుని ఉద్ధారము - బలరాముని తీర్థయాత్ర
శ్రీశుక ఉవాచ ।
తతః పర్వణ్యుపావృత్తే ప్రచండః పాంసువర్షణః ।
భీమో వాయురభూద్రాజన్ పూయగంధస్తు సర్వశః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! తరువాత పర్వదినము రాగానే ప్రచండమైన వాయువు వీచి భయమును గోల్పెను. అంతటా దుమ్ము వర్షిస్తూ, దుర్గంధము కూడ నిండెను.
తతోఽమేధ్యమయం వర్షం బల్వలేన వినిర్మితమ్ ।
అభవద్యజ్ఞశాలాయాం సోఽన్వదృశ్యత శూలధృక్ ॥
తరువాత బల్వలుడు యజ్ఞశాలలో మలముతో నిండిన వర్షమును కురిపీంచెను. వెంటనే శూలమును దాల్చి ఆతడు కూడ కానవచ్చెను.
తం విలోక్య బృహత్కాయం భిన్నాంజనచయోపమమ్ ।
తప్తతామ్రశిఖాశ్మశ్రుం దంష్ట్రోగ్రభ్రుకుటీముఖమ్ ॥
ఆ బల్వలుడు దట్టని కాటుక ప్రోగును పోలిన పెద్ద దేహమును కలిగియుండెను. అతని జుట్టు, గెడ్డము, మీసములు పుటము పెట్టిన రాగి వలె నుండెను. ఆతని , ముఖము కోరలతో, కనుబొమలతో భయమును గొల్పెను. బలరాముడాతనిని చూచెను.
సస్మార ముసలం రామః పరసైన్యవిదారణమ్ ।
హలం చ దైత్యదమనం తే తూర్ణముపతస్థతుః ॥
బలరాముడు శత్రు సైన్యమును ఛిన్నాభిన్నము చేసే ముసలమును, రాక్షసులను అదుపులో పెట్టే నాగలిని కూడ స్మరించగానే, అవి రెండు శీఘ్రముగా వచ్చి చేరినవి.
తమకృష్య హలాగ్రేణ బల్వలం గగనేచరమ్ ।
ముసలేనాహనత్క్రుద్ధో మూర్ధ్ని బ్రహ్మద్రుహం బలః ॥
బలరాముడు కోపించి, ఆకసములో సంచరిస్తూ బ్రాహ్మణులకు ద్రోహమును చేసే ఆ బల్వలుని నాగేటి చాలుతో లాగి, రోకలితో తలపై మోదేను.
సోఽపతద్బువి నిర్బిన్నలలాటోఽపసృక్ సముత్సృజన్ ।
ముంచన్నార్తస్వరం శైలో యథా వజ్రహత్వోఽరుణః ॥
ఆ బల్వలుని నుదురు పగిలి రక్తము అధికముగా స్రవించి దేహమంతా ఎర్రనయ్యెను. ఆతడు ఆర్తనాదమును చేస్తూ, వజ్రముచే కొట్టబడిన పర్వతము వలె, నేల పై పడిపోయెను.
సంస్తుత్య మునయో రామం ప్రయుజ్యావితథాశిషః ।
అభ్యషించన్ మహాభాగా వృత్రఘ్నం విబుధా యథా ॥
మహాత్ములగు మహర్షులు బలరాముని బాగా కొనియాడి సఫలములయ్యే ఆశీస్సులనిచ్చి, దేవతలు వృత్రాసురుని సంహరించిన ఇంద్రుని వలే, అభిషేకించిరి.
వైజయంతీం దదుర్మాలాం శ్రీధామామ్లానపంకజామ్ ।
రామాయ వాససీ దివ్యే దివ్యాన్యాభరణాని చ ॥
వారు బలరామునకు శోభకు నిలయమై వాడని పలు రంగుల పద్మములతో చేసిన విజయకరమగు మాలను, ప్రకాశించే జంట వస్త్రములను, ఉజ్జ్వలమైన ఆభరణములను కూడ యిచ్చిరి.
అథ తైరభ్యనుజ్ఞాతః కౌశికీమేత్య బ్రాహ్మణైః ।
స్నాత్వా సరోవరమగాద్యతస్సరయురాస్రవత్ ॥
తరువాత బలరాముడు ఆ బ్రాహ్మణుల అనుజ్ఞను పొంది కౌశికీ నదికి వచ్చి స్నానము చేసి, సరయూనది ఉద్భవించిన సరస్సునకు వెళ్లెను.
అనుగ్రోతేన సరయూం ప్రయాగముపగమ్య సః ।
స్నాత్వా సంతర్ప్య దేవాదీన్ జగామ పులహాశ్రమమ్ ॥
ఆయన సరయూనదీతీరము వెంట ప్రవాహదిశలో పయనించి ప్రయాగ ను చేరెను. అచట ఆయన స్నానము చేసి, దేవతలు, పితృదేవతలు మొదలగువారికి తర్పణములనిచ్చి పులహమహర్షి ఆశ్రమమునకు వెళ్లెను.
గోమతీం గండకీం స్నాత్వా విపాశాం శోణ ఆప్లుతః ।
గయాం గత్వా పితృనిష్ట్వా గంగాసాగరసంగమే ॥
ఉపస్పృశ్య మహేంద్రాదౌ రామం దృష్ట్వాఽభివాద్య చ ।
బలరాముడు గోమతీ గండకీ విపాశానదులలో మరియు శోణనదమునందు స్నానము చేసెను. తరువాత ఆయన గయ వెళ్లి పితృదేవతలనారాధించేను. తరువాత ఆయన గంగాసాగరసంగమమునకు వెళ్లి స్నానము చేసి, పరశురాముని దర్శించి ప్రణమిల్లెను.
సప్తగోదావరీం వేణాం పంపాం భీమరథం తతః ॥
తరువాత ఆయన క్రమముగా సప్తగోదావరి, వేణ, పంప, భీమరథీ నదులలో స్నానమును చేసెను.
స్కందం దృష్ట్వా యయౌ రామశీ శైలం గిరిశాలయమ్ ।
ద్రవిడేషు మహాపుణ్యం దృష్ట్వాఽర్రీం వేంకటం ప్రభుః ॥
సర్వసమర్థుడగు బలరాముడు కుమారస్వామిని దర్శించెను. ద్రవిడదేశములో కైలాసవాసియగు శివుని ధామమైన శ్రీశైలము మిక్కిలి పావనమైనది. ఆయన దానిని, వేంకటాద్రిని దర్శించెను.
కామకోష్టిం పురీం కాంచీం కావేరీం చ సరిద్వరామ్ ।
శ్రీరంగాఖ్యం మహాపుణ్యం యత్ర సన్నిహితో హరిః ॥
ఆయన కామాక్షిని, కాంచీపురమును, నదులలో గొప్పదియగు కావేరిని, శ్రీరంగమనే మహాపుణ్య క్షేత్రమును దర్శించెను. శ్రీరంగములో శ్రీహరి నిత్యసన్నిధియై యుండును.
ఋషభాద్రిం హరేః క్షేత్రం దక్షిణాం మథురాం తథా ।
సాముద్రం సేతుమగమన్మహాపాతకనాశనమ్ ॥
ఆయన శ్రీహరి క్షేత్రమగు ఋషభ పర్వతము, దక్షిణ మథుర, మహా పాపములను నశింపజేసే సముద్రమునందలి రామ సేతువులకు వెళ్లెను.
తత్రాయుతమదాధేనూర్భ్రాహ్మణేభ్యో హలాయుధః ।
కృతమాలాం తామ్రపర్ణీం మలయం చ కులాచలమ్ ॥
అచట నాగలి ఆయుధముగా గల బలరాముడు బ్రాహ్మణులకు పది వేల పాడియావులను దానము చేసెను. ఆయన కృతమాల, తామ్రపర్ణి అనే నదులలో స్నానము చేసి మలయమనే కులపర్వతమునకు వెళ్లాను.
తత్రాగస్త్యం సమాసీనం నమస్కృత్యాభివాద్య చ ।
యోజిత స్తేన చాశీర్బిరనుజ్ఞాతో గతోఽర్ణవమ్ ।
దక్షిణం తత్ర కన్యాఽఽఖ్యాం దుర్గాం దేవీం దదర్శ సః ॥
బలరాముడు ఆ మలయపర్వతముపై నివసించుచున్న అగస్త్యమహర్షికి నమస్కారమును వాచా అభివాదమును కూడ చేసెను. అపుడా మహర్షి ఆయనను ఆశీర్వదించి అనుమతినిచ్చెను. అపుడాయన దక్షిణసముద్రమునకు వెళ్లి, అచట తీరమునందు కన్యాకుమారి అనే పేరు గల దుర్గాదేవిని దర్శించెను.
తతః ఫాల్గునమాసాద్య పంచాప్సరసముత్తమమ్ ।
విష్ణుస్సన్నిహితో యత్ర స్నాత్వాఽస్పర్శద్గవాయుతమ్ ॥
తరువాత ఆయన ఫాల్గున (అనంతశయన) క్షేత్రమును చేరి,పంచాప్సరసతీర్థములో స్నానము చేసి, పది వేల గోవులను దానము చేసెను. అచట శ్రీహరి సర్వదా సన్నిహితుడై యుండును.
తతోఽభివ్రాజ్య భగవాన్ కేరలాంస్తు త్రిగర్తకాన్ ।
గోకర్ణాఖ్యం శివక్షేత్రం సాన్నిధ్యం యత్ర ధూర్జటేః ॥
తరువాత బలరామ భగవానుడు కేరళ త్రిగర్త ప్రాంతములను చూచి, గోకర్ణమనే శివ క్షేత్రమును దర్శించెను. అచట శివుడు సర్వదా సన్నిహితుడై యుండును.
ఆర్యాం ద్వైపాయనీం దృష్ట్వా శూర్పారకమగాద్బలః ।
తాపీం పయోష్ణీం నిర్వింధ్యాముపస్పృశ్యాథ దండకమ్ ॥
ప్రవిశ్య రేవామగమద్యత్ర మాహిష్మతీ పురీ ।
బలరాముడు ద్వీపవాసినియగు దుర్గాదేవిని దర్శించి శూర్వారక క్షేత్రమునకు వెళ్లాను. ఆయన తరువాత తాపీ, పయోషీ, నిర్వింధ్యా నదులలో స్నానము చేసి పిదప దండకారణ్యమును ప్రవేశించెను. అప్పుడాయన నర్మదానదికి వెళ్లి దాని తీరమునందలి మాహిష్మతీ నగరమును చేరెను.
మనుతీర్థముపస్పృశ్య ప్రభాసం పునరాగమత్ ॥
ఆయన మనుతీర్థములో స్నానము చేసి మరల ప్రభాస క్షేత్రమునకు వచ్చేను.
శ్రుత్వా ద్వి జైః కథ్యమానం కురుపాండవసంయుగే ।
సర్వరాజన్యనిధనం భారం మేనే హృతం భువః ॥
కౌరవపాండవయుద్దములో చాలమంది రాజులు మరణించినారని బ్రాహ్మణులు చెప్పగా విని, ఆయన భూభూరము తగ్గినదని తలచెను.
స భీమదుర్యోధనయోర్గదాభ్యాం యుధ్యతోర్మధే ।
వారయిష్యన్ వినశనం జగామ యదునందనః ॥
యుద్ధములో భీముడు, దుర్యోధనుడు గదలతో యుద్ధము చేయుచుండగా యదువంశనందనుడగు బలరాముడు వారిని ఆపబోవువాడై కురుక్షేత్రమునకు వెళ్లెను.
యుధిష్ఠిరస్తు తం దృష్ట్వా యమౌ కృష్ణార్జునావపి ।
అభివాద్యాభవంస్తూష్ణీం కిం వివక్షురిపగతః ॥
ధర్మరాజు, నకులసహదేవులు, శ్రీకృష్ణార్జునులు ఆయనను చూచి నమస్కరించి మిన్నకుండిరి. ఈయన ఇచటకు ఏమి చెప్పగోరి వచ్చియుండును? (ఈ విషయము వారికి అర్థము కాలేదు).
గదాపాణీ ఉభౌ దృష్ట్వా సంరబ్ధౌ విజయైషిణౌ ।
మండలాని విచిత్రాణి చరంతావిదమబ్రవీత్ ॥
విజయమును కోరే భీమార్జునులిద్దరు కోపముతో గదలను చేతులతో పట్టుకొని పలు రకముల విన్యాసములను చేయుచుండిరి. వారిని చూచి బలరాముడిట్లు పలికెను.
యువాం తుల్యబలౌ వీరౌ హే రాజన్ హే వృకోదర ।
ఏకం ప్రాణాధికం మన్య ఉతైకం శిక్షయాఽధికమ్ ॥
ఓ దుర్యోధన మహారాజా! ఓ భీమ సేనా! మీరిద్దరు సమానమైన బలము గల వీరులు. మీలో ఒకరు (భీముడు) ప్రాణశక్తిచే, రెండవవాడు శిక్షణచే అధికుడని నా అభిప్రాయము.
తస్మాదేకతర స్యేహ యువ యోస్సమవీర్యయోః ।
న లక్ష్యతే జయోఽన్యో వా విరమత్వఫలో రణః ॥
కాబట్టి సమ ఉజ్జీలైన మీ యిద్దరిలో ఒకనికి జయము గాని, పరాజయము గాని కలిగే సూచనలు కానరావు. ఫలితము లేని ఈ యుద్ధమును ఆపివేయుడు.
న తద్వాక్యం జగృహతుర్బద్ధవైరా నృపార్థవత్ ।
అనుస్మరంతావన్యోన్యం దురుక్తం దుష్కృతాని చ ॥
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరు పరస్పరము చేసుకున్న దూషణలను, అపకారములను గుర్తు చేసుకుంటూ దృఢమైన వైరము కలవారగుటచే, బలరాముడు చెప్పిన మాట అర్థవంతమే అయినా, వారు స్వీకరించలేదు.
దిష్టం తదనుమన్వానో రామో ద్వారవతీం యయౌ ।
ఉగ్ర సేనాదిభిః ప్రీతైర్ జ్ఞాతిభస్సముపాగతః ॥
ఆ యుద్ధము ప్రారబ్దఫలమని తలపోస్తూ బలరాముడు ద్వారకకు వెళ్లే ను. ఉగ్రసేనుడు సాంబుడు మొదలగువారాయనను ప్రీతితో స్వాగతించిరి.
తం పునర్నైమిషం ప్రాప్తమృషయోఽయాజయన్ముదా ।
క్వత్వంగం క్రతుభిస్సర్వైర్నివృత్తాఖిలవిగ్రహమ్ ॥
యజ్ఞమూర్తియగు బలరాముడు సకలకలహములనుండి నివృత్తుడై మరల నైమిషమును చేరెను. మహర్షులాయనచే ఆనందముగా సకలక్రతువులను చేయించిరి.
తేభ్యో విశుద్ధవిజ్ఞానం భగవన్ వ్యతరద్విభుః ।
యేనైవాత్మన్యదో విశ్వమాత్మానం విశ్వగం విదుః ॥
సర్వసమర్థుడగు బలరామ భగవానుడు వారికి పరిశుద్దమగు ఆత్మజ్ఞాన మునుపదేశించెను. ఆత్మజ్ఞానముచే మాత్రమే వారీ జగత్తంతా తమయం దున్నదని, తాము సకలజగత్తు వ్యాపించి ఉన్నామనియు తెలుసుకొనిరి.
స్వపత్యాఽవభృథస్నాతో జ్ఞాతిబంధుసుహృద్వృతః ।
రేజే స్వజ్యోత్స్నయేవేందుస్సువాసాస్సుష్ణ్వలంకృతః ॥
జ్ఞాతులు, బంధువులు, మిత్రులు చుట్టువారియుండ బలరాముడు తన ధర్మపత్ని (రేవతి) తో గూడి, తన వెన్నెలతో గూడియున్న చంద్రుడు వలె ప్రకాశిస్తూ, అవభృథస్నానమును చేసెను. అపుడాయన మంచి వస్త్రములను దాల్చి చక్కగా అలంకరించుకొనెను.
ఈదృగ్విధాన్యసంఖ్యాని బలస్య బలశాలినః ।
అనంతస్యాప్రమేయస్య మాయామర్త్యస్య సంతి హి ॥
అనంతము, ఇంద్రియగోచరము కానిది అగు పరబ్రహ్మయే మాయాశక్తిచే మానవరూపమును దాల్చి బలశాలియగు బలరాముడైనది. ఆయనయొక్క ఇటువంటి చరితములు లెక్కలేనన్ని గలవు.
యోఽనుస్మరేత రామస్య కర్మాణ్యద్భుతకర్మణః ।
సాయం ప్రాతరనంతస్య విష్ణోస్స దయితో భవేత్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే ఏకోనాశీతితమోఽధ్యాయః ॥
బలరాముడై అచ్చెరువును గొలిపే అనంతుని లీలలను ఎవడైతే ఉదయము, సాయంకాలము స్మరించునో, అట్టివాడు శ్రీహరికి ప్రీతిపాత్రుడగును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో బల్వలుని ఉద్ధారమును, బలరాముని తీర్థయాత్రను వర్ణించే డెబ్బది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (79).
Summary of chapter 79 of the Bhāgavata Mahā Purana is as follows:
Lord Balarāma traveled across India, visiting sacred sites including Gangāsāgara, Kānchī, Śrī Raṅgam, Rāmeśwaram, Madurai, Prabhāsa, and the banks of the Sarasvatī River. Returning to Kurukshetra on the final day of the great war, Balarāma witnessed the decisive mace duel between His two disciples, Bhīma and Duryodhana. When Bhīma struck Duryodhana's thighs down in violation of formal wrestling rules, Balarāma became enraged and raised His plow weapon to punish Bhīma; however, Śrī Kṛshṇa intervened, explaining the subtle workings of destiny and Duryodhana's past sins. Pacified, Balarāma returned to Dvārakā, where He was welcomed by His relatives and lived in peaceful absorption.