భాగవత మహా పురాణము
57 - శతధన్వుడు మణిని అపహరించుట - శతధన్వుని ఉద్ధారము
శ్రీశుక ఉవాచ ।
విజ్ఞానార్ధోఽపి గోవిందో దగ్దానాకర్ణ్య పాండవాన్ ।
కుంతీం చ కుల్యకరణే సహరామో యయౌ కురూన్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- లాక్షాగృహములో పాండవులు దహించబడలేదని శ్రీకృష్ణ భగవానునకు తెలియును. కానీ, వారు కుంతితో సహా దహించబడినారనే జనప్రవాదమును విని ఆయన బలరామునితో సహా వంశోచితమైన పరామర్శను చేయుటకై కురుదేశమునకు వెళ్లాను.
భీష్మం కృపం సవిదురం గాంధారీం ద్రోణమేవ చ ।
తుల్యదుఃఖౌ చ సంగమ్య హా కష్టమితి హోచతుః ॥
బలరామకృష్ణులు భీష్ముని, కృపాచార్యుని, విదురుని, ద్రోణాచార్యుని, గాంధారిని కూడ కలిసి వారితో సమానమైన దుఃఖము గలవారై, అయ్యో! ఎంత కష్టము! అని (లాక్షాగృహదహనమును గురించి) పలికిరి.
లబ్ధ్వైతదంతరం రాజన్ శతధన్వానమూచతుః ।
అక్రూరకృతవర్మాణౌ మణిః కస్మాన్న గృహ్యతే ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఈ సందు చూసుకొని అక్రూరుడు కృతవర్మ శతధన్వునితో, సమంతకమణిని ఏల లాగుకొనవు? అని అడిగిరి.
యోఽస్మభ్యం సంప్రతిశ్రుత్య కన్యారత్నం విగర్హ్య నః ।
కృష్ణాయాదాన్న సత్రాజిత్కస్మాద్భ్రాతరమన్వియాత్ ॥
సత్రాజిత్తు శ్రేష్ఠ కన్యయగు సత్యభామను మనలో ఒకనికిచ్చి వివాహము చేసెదనని మాట యిచ్చి, మనలను అనాదరము చేసి శ్రీకృష్ణునకిచ్చి పెళ్లి చేసినాడు. ఆతడు తమ్ముడగు ప్రసేనుని వెంట (యమపురికి) ఏల వెళ్లరాదు?(వెళ్లకుండుటకు కారణమేమీ లేదు).
ఏవం భిన్నమతిస్తాభ్యాం సత్రాజితమసత్తమః ।
శయానమవధీల్లోభాత్స పాపః క్షీణజీవితః ॥
శతధన్వుడు పరమదుష్టుడు, పాపి. వాని ఆయువు మూడినది. పైగా, వారిద్దరు వాని మనస్సును చెడగొట్టిరి. ఆతడు మణియందలి లోభము వలన నిద్రిస్తున్న సత్రాజిత్తును చం పెను.
స్త్రీణాం విక్రోశమానానాం క్రందంతీనామనాథవత్ ।
హత్వా పశూన్ సౌనికవన్మణిమాదాయ జగ్మివాన్ ॥
స్త్రీలు అనాథలవలె ఆక్రోశిస్తూ రోదిస్తూంటే ఆతడు వారిని లెక్క చేయకుండా, కసాయి పశువులను వలె, సత్రాజిత్తుని చంపి స్యమంతకమణిని తీసుకొని వెళ్లాను.
సత్యభామా చ పితరం హతం వీక్ష్య శుచాఽర్పితా ।
వ్యలపత్తాత తాతేతి హా హతాఽస్మీతి ముహ్యతీ ॥
చంపబడిన తండ్రిని చూచి సత్యభామ మోహమును పొందెను. ఆమె మనస్సు దుఃఖముతో నిండిపోగా, తండ్రీ! తండ్రీ! అయ్యో! నేను చంపబడితిని! అంటూ విలపించెను.
తైలద్రోణ్యాం మృతం పాస్య జగామ గజసాహ్వయమ్ ।
కృష్ణాయ విదితార్థాయ తప్తాఽఽచఖ్యౌ పితుర్వధమ్ ॥
సత్రాజిత్తు దేహమును నూనె దోనియందుంచిరి. దుఃఖితురాలైన సత్యభామ హస్తినాపురమునకు వెళ్లి తండ్రి వధ గురించి శ్రీకృష్ణునకు చెప్పెను. ఆయనకు అన్నీ తెలుసు.
తదాకర్ణ్యేశ్వరౌ రాజన్ననుసృత్య నృలోకతామ్ ।
అహో నః పరమం కష్టమిత్యస్రాక్షౌ విలేపతుః ॥
ఓ పరీక్షిన్మహారాజా! మానవలీలను అనుకరించే సర్వేశ్వరులైన బలరామకృష్ణులు ఆ వార్తను విని కళ్ల నిండా నీరు పెట్టుకొని, అయ్యో! మనకు పెద్ద ఆపద వచ్చినది, అంటూ విలపించిరి.
ఆగత్య భగవాంస్తస్మాత్సభార్యస్సాగ్రజః పురమ్ ।
శతధన్వానమారేభే హంతుం హర్తుం మణిం తతః ॥
శ్రీకృష్ణ భగవానుడు అన్నగారితో, భార్యయగు సత్యభామతో కలిసి ఆ హస్తిననుండి ద్వారకకు వచ్చెను. శతధన్వుని సంహరించి వానినుండి స్యమంతకమణిని లాగుకొనే ఉద్యమమును ఆయన ఆరంభించెను.
సోఽపి కృష్ణోద్యమం జ్ఞాత్వా భీతః ప్రాణపరీప్సయా ।
సాహాయ్యే కృతవర్మాణమయాచత స చాబ్రవీత్ ॥
ఆ శతధన్వునికి శ్రీకృష్ణుని ప్రయత్నము గురించి తెలిసి భయము కలిగెను. ఆతడు ప్రాణములను కాపాడుకునే కోరికతో సహకారము కొరకు కృతవర్మను కోరెను. కృతవర్మ ఇట్లు పలికెను.
నాహమీశ్వరయోః కుర్యాం హేలనం రామకృష్ణ యోః ।
కో ను క్షేమాయ కల్పేత తయోర్వృజినమాచరన్ ॥
సర్వసమర్థులగు బలరామకృష్ణులకు నేను ప్రతికూలమును చేయను. వారిద్దరి యెడల అపరాధమును చేసి ఎవ్వాడు క్షేమముగా ఉండగల్గును?
కంసస్సహానుగోఽపీతో యద్ద్వేషాత్త్యాజితశ్శ్రియా ।
జరాసంధస్సప్తదశ సంయుగాన్ విరథో గతః ॥
వారిద్దరి యందలి ద్వేషము వలన కంసుడు సంపదను పోగొట్టుకొని తన అనుచరులతో సహా వినాశమును పొందినాడు. జరాసంధుడు పది హేడు యుద్దములలో రథమును కూడ కోల్పోయి మరలి వచ్చినాడు.
ప్రత్యాఖ్యాతస్స చక్రూరం పార్ ష్ణి గ్రాహమయాచత ।
సోఽప్యాహ కో విరుధ్యేత విద్వానీశ్వరయోర్బలమ్ ॥
కృతవర్మచే తిరస్కరించబడి ఆ శతధన్వుడు అక్రూరుని తనను వెనుక నుండి రక్షించుమని కోరెను. ఆయన కూడ, సర్వసమర్థులగు వారిద్దరి బలము తెలిసినవాడెవ్వడు వారితో విరోధించును? అని చెప్పెను. .
య ఇదం లీలయా విశ్వం సృజత్యవతి హంతి చ ।
చేష్టాం విశ్వసృజో యస్య న విదుర్మోహితాఽజయా ॥
ఆ శ్రీకృష్ణ భగవానుడు జగత్తును లీలచే సృష్టించి, పాలించి, ఉపసంహారమును కూడ చేయును. ఆయన మాయచే మోహమును పొందినవారలు ఆయన లీలను తెలియజాలరు.
యస్సప్తహాయన శ్శైలముత్పాట్యై కేన పాణినా ।
దధార లీలయా బాల ఉచ్ఛిలీంధ్రమీవార్భకః ॥
ఏడేళ్ల బాలుడుగ నుండగనే శ్రీకృష్ణుడు కొండను అవలీలగా పెకిలించి ఒకే చేతితో పైకెత్తి, పిల్లవాడు కుక్కగొడుగును వలె, పట్టుకొనెను.
నమస్తస్మై భగవతే కృష్ణాయాద్బుతకర్మణే ।
అనంతాయాదిభూతాయ కూటస్థాయాత్మనే నమః ॥
ఆద్యంతములు లేని శ్రీకృష్ణ భగవానుని లీలలు ఆశ్చర్యకరములు. అవికారియగు ఆత్మరూపుడై యున్న ఆయనకు పలు నమస్కారములు.
ప్రత్యాఖ్యాతస్స తేనాపి శతధన్వా మహామణిమ్ ।
తస్మిన్న్యస్యాశ్వమారుహ్య శతయోజనగం యయౌ ॥
ఆ అక్రూరుడు కూడ తిరస్కరించగా శతధన్వుడు ఆ గొప్ప మణిని ఆయన వద్ద ఉంచి వంద యోజనముల దూరము పోగలిగే గుర్రమునెక్కి పారిపోయెను.
గరుడధ్వజమారుహ్య రథం రామజనార్దనౌ ।
అన్వయతాం మహావేగైరశ్వై రాజన్ గురుద్రుహమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! బలరామ కృష్ణులు గొప్ప వేగము గల గుర్రములు లాగే రథము పైనెక్కి తమ మామగారిని చంపిన శతధన్వుని వెంబడి తరిమిరి. ఆ రథము యొక్క జెండా పై గరుడుడు ఉండెను.
మిథిలాయాముపవనే విసృజ్య పతితం హయమ్ ।
పద్భ్యామధావత్సంత్రస్తః కృష్ణోఽప్యత్వద్రవద్రుషా ॥
చాల భయపడిన శతధన్వుడు మిథిలానగరపు బాహోద్యానమునందు పడిపోయిన గుర్రమును విడిచి పెట్టి కాళ్లకు బుద్ధి చెప్పగా, శ్రీకృష్ణుడు కూడ కోపముతో వెనుక తరిమెను.
పదాతేర్భగవాంస్తస్య పదాతిస్తిగ్మ నేమినా ।
చక్రేణ శిర ఉత్కృత్య వాససోర్వ్యచినోన్మణిమ్ ॥
పాదచారియగు శ్రీకృష్ణ భగవానుడు పరుగెత్తుతూ పారిపోతున్న ఆ శతధన్వుని తలను వాడి పదును గల చక్రముతో నరికి, క్రింది మరియు పై వస్త్రములలో మణి కొరకు వెది కెను.
అలబ్దమణిరాగత్య కృష్ణ ఆహాగ్రజాంతికమ్ ।
వృథా హతశ్శతధనుర్మణిస్తత్ర న విద్యతే ॥
శ్రీకృష్ణునకు మణి దొరకలేదు. ఆయన అన్నగారి వద్దకు వచ్చి ఇట్లు పలి కెను -- శతధన్వుని చంపుట వ్యర్థ మైనది. ఆతని వద్ద మణి లేదు.
తత ఆహ బలో నూనం స మణిశ్శతధన్వనా ।
కస్మింశ్చిత్పురుషే న్యస్తస్తమన్వేష పురం ప్రజ । ।
అప్పుడు బలరాముడిట్లు పలికెను -- శతధన్వుడు నిశ్చయముగా మణిని ఎవరో ఒక వ్యక్తి వద్ద దాచియుండును. నీవు నగరమునకు వెళ్లి ఆ వ్యక్తి గురించి అన్వేషించుము.
అహం విదేహమిచ్చామీ ద్రష్టుం ప్రియతమం మమ ।
ఇత్యుక్త్వా మిథిలాం రాజన్ ఏవేశ యదునందనః ॥
ఓ పరీక్షిన్మహారాజా! విదేహరాజు నాకు . మిక్కిలి ప్రియుడు; నేనాయనను చూడగోరుచున్నాను, అని పలికి యాదవవంశనందనుడగు బలరాముడు మిథిలను ప్రవేశించెను.
తం దృష్ట్వా సహసోత్థాయ మైథిలః ప్రీతమానసః ।
అర్హయామాస విధివదర్షణీయం సమర్హణైః ॥
మిథిలాధిపతి ఆ బలరాముని చూచి మనస్సులో చాల సంతోషించెను. ఆయన వెంటనే లేచి నిలబడి పూజకు అర్హుడైన బలరాముని ఉత్తమమగు పూజాద్రవ్యములతో యథావిధిగా పూజించెను.
ఉవాస తస్యాం కతిచిన్మిథిలాయాం సమా విభుః ।
మానీతః ప్రీతియుక్తేన జన కేన మహాత్మనా ।
తతోఽశిక్షద్గదాం కాలే ధార్తరాష్ట్రస్సుయోధనః. ॥
మహాత్ముడగు జనకుడు ప్రేమతో కూడినవాడై బలరామప్రభుని సమ్మానించెను. ఆయన ఆ మిథిలయందు కొన్ని సంవత్సరములు నివసించెను. అదే కాలములో ధృతరాష్ట్రపుత్రుడగు దుర్యోధనుడు ఆయన వద్ద గదాయుద్ధములో శిక్షణ పొందెను.
కేశవో ద్వారకామేత్య నిధనం శతధన్వనః ।
అప్రాప్తిం చ మణేః ప్రాహ ప్రియాయాః ప్రియకృద్విభుః ॥
సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు ప్రియురాలగు సత్యభామకు ప్రియమును చేయును. ఆయన ద్వారకకు వచ్చి శతధన్వుడు మరణించినాడనియు, కాని, ఆతని వద్ద మణి దొరకలేదనియు ఆమెకు చెప్పెను.
తతస్స కారయామాస క్రీయా బంధోర్హతస్య వై ।
సాకం సుహృద్భిర్భగవాన్ యా యాస్స్యుస్సాంపరాయికాః ॥
తరువాత ఆ శ్రీకృష్ణ భగవానుడు బంధువులతో గూడి, సంహరించబడిన సత్రాజిత్తున కైతే, మరణించిన వ్యక్తికి ఏయే కర్మలు పుణ్యలోకములను కలిగించునో, వాటిని చేయించెను.
ఆక్రూరః కృతవర్మా చ శ్రుత్వా శతధనోర్వధమ్ ।
వ్యూష తుర్బయవిత్రస్తౌ ద్వారకాయాః ప్రయోజకౌ ॥
శతధన్వుని పురిగొల్పిన అక్రూరకృతవర్మలు వాని వధను గురించి విని, భయముతో వణికిపోతూ ద్వారకను విడిచి పెట్టి వెళ్లిపోయిరి.
అక్రూరే ప్రేషి తేఽరిష్టాన్యాసన్ వై ద్వారకౌకసామ్ ।
శారీరా మానసాస్తాపా ముహుర్దైవికభౌతికాః ॥
అక్రూరుడు వలస పోగా ద్వారకావాసులకైతే అరిష్టములు ఆధ్యాత్మిక-ఆధిభౌతిక-ఆధిదైవికతాపములు మరల మరల కలిగినవి.
ఇత్యంగోపదిశం త్యేకే విస్మృత్య ప్రాగుదాహృతమ్ ।
మునివాసనివాసే కిం ఘటేతారిష్టదర్శనమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! నేనిదివరలో చెప్పిన శ్రీకృష్ణ మాహాత్మ్యమును విస్మరించి కొందరీ విధముగా (అరిష్టములను గురించి) చెప్పుచున్నారు. మునులు ఏ భగవానునియందు నివసించెదరో, ఆ భగవానుడు నివసించే ద్వారకలో అరిష్టములు కనబడుట సంభవమా?(కాదు).
దేవేఽవర్షతి కాశీశశ్శ్వఫల్కాయాగతాయ వై ।
స్వసుతాం గాందినీం ప్రాదాత్తతోఽవర్షత్స్మ కాశిషు ॥
ఒకప్పుడు కాశీదేశములో వానదేవుడు వర్షించ లేదు. అప్పుడక్కడకు వచ్చిన (అక్రూరుని తండ్రియగు) శ్వఫల్కునకు కాశీరాజు తన కుమార్తెయగు గాందినిని ఇచ్చి వివాహము చేయగా, దేవుడు వర్షించెను.
తత్పుతస్తత్ప్రభావోఽసావక్రూరో యత్ర యత్ర హ ।
దేవోఽభివర్షతే తత్ర నోపతాపా న మారికాః ॥
ఆ శ్వఫలుని పుత్రుడగు ఈ అక్రూరునకు కూడ అటువంటి మహిమ గలదు. ఈతడు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు వర్షించుటయే గాక, తాపములు గాని అంటువ్యాధులు గాని ఉండవు.
ఇతి వృద్ధవచశ్శ్రుత్వా నైతావదిహ కారణమ్ ।
ఇతి మత్వా సమానాయ్య ప్రాహాక్రూరం జనార్దనః ॥
పెద్దలు ఈ రకముగా పలుకటను దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు వినెను. కేవలము అక్రూరుడు మాత్రమే లేకుండుట అరిష్ట హేతువు కాదని (మణి లేకుండుట కూడ హేతువని) ఆయన తలచెను. ఆయన అక్రూరుని రప్పించి ఇట్లు పలికెను.
పూజయిత్వాఽభిభాష్యెనం కథయిత్వా ప్రియాః కథాః ।
విజ్ఞాతాఖిలచిత్తజ్ఞస్స్మయమాన ఉవాచ హ ॥
సకలప్రాణుల అంతఃకరణసాక్షియగు శ్రీకృష్ణునకు సర్వము దెలియును. ఆయన ఈ అక్రూరుని సమ్మానించి ప్రీతికరములగు మాటలను చెప్పి చిరునవ్వుతో సంబోధించి ఇట్లు పలికెను.
నను దానపతే న్యస్తస్త్వయ్యాస్తే శతధన్వనా ।
స్యమంతకో మణిశ్శ్రీమాన్ విదితః పూర్వమేవ నః ॥
ఓ దానప్రభూ! గొప్పగా ప్రకాశించే సమంతకమణిని శతధన్వుడు తమరి వద్ద భద్రపరచినాడు. అది మీ వద్దనే ఉన్నది గదా! ఈ విషయము మాకిదివరకే తెలియును.
సత్రాజితోఽనపత్యత్వాద్గృహ్ణీయుర్దుహితుస్సుతాః।
దాయం నినీయాపః పిండాన్ విముచ్యర్ణం చ శేషితమ్ ॥
సత్రాజిత్తునకు పుత్రసంతానము లేనందువలన, ఆమె కుమార్తెయొక్క పుత్రులే ఆయనకు తర్పణములను పిండములను సమర్పించి, అప్పులను కూడ తీర్చి, మిగిలిన ఆస్తిని పొందెదరు.
తథాఽపి దుర్ధరస్త్వన్యైస్త్వయ్యాస్తాం సువ్రతే మణిః ।
కిం తు మామగ్రజస్సమ్యజ్న ప్రత్యేతి మణిం ప్రతి ॥
అయినప్పటికీ మంచి నియమనిష్ఠలు గల నీ వద్దనే మణిని ఉండనిండు. దానిని ఇతరులు భద్రము చేయలేరు. కానైతే, ఆ మణి విషయములో అన్న బలరామునకు నాపై పూర్తి నమ్మకము కలుగకున్నది.
దర్శయస్వ మహాభాగ బంధూనాం శాంతిమావహ ।
అవ్యుచ్ఛిన్నా మఖా స్తేఽద్య వర్తంతే రుక్మవేదయః ॥
ఓ అక్రూరా! మణిని చూపించి బంధువులకు శాంతిని కలిగించుము. ఈ కాలంలో నీవు బంగరు వేదులు గల యజ్ఞములను నిరంతరముగా చేయుచున్నావు.(మణి బంగారమును పెట్టుచుండును).
ఏవం సామభిరాలబ్దశ్శ్వఫల్కతనయో మణిమ్ ।
ఆదాయ వాససాచ్ఛన్నం దదౌ సూర్యసమప్రభమ్ ॥
ఈ విధముగా శ్రీకృష్ణుడు సాంత్వవచనములతో నచ్చజెప్పగా, శ్వఫలుని పుత్రుడగు అక్రూరుడు సూర్యునితో సమానముగా వెలిగిపోయే స్యమంతకమణిని వస్త్రము చాటునుండి పైకి తీసి యిచ్చెను.
స్యమంతకం దర్శయిత్వా జ్ఞాతిభ్యో రజ ఆత్మనః ।
విమృజ్య మణినా భూ యస్త స్మె ప్రత్యర్పయత్ప్రభుః ॥
శ్రీకృష్ణ ప్రభుడు బంధువులకు స్యమంతకమణిని చూపించి, దాని కారణముగా తనకు కలిగిన అపవాదును తుడిచివేసి, మరల దానిని ఆ అక్రూరునకు సమర్పించెను.
యస్త్వేతద్బగవత ఈశ్వరస్య విష్ణోః
వీర్యాఢ్యం వృజినహరం సుమంగలం చ ।
ఆఖ్యానం పఠతి శృణోత్యనుస్మ రేద్వా
దుష్కీర్తిం దురితమపోహ్య యాతి శాంతిమ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధే సప్తపంచాశత్తమోఽధ్యాయః ॥
సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అగు శ్రీకృష్ణ భగవానుని ఈ పరాక్రమముతో సంపన్నమైన వృత్తాంతము పాపములను పోగొట్టి మంగళములను కలిగించును. ఎవడైతే దీనిని చదువునో, వినునో, లేదా స్మరించునో, అట్టివాడు అపవాదును, పాపమును తుడిచివేసి శాంతిని పొందును.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
శతధన్వుడు మణిని అపహరించుటను, శతధన్వుని ఉద్దారమును వర్ణించే
ఏబది ఏడవ అధ్యాయము ముగిసినది .
Summary of chapter 57 of the Bhāgavata Mahā Purana is as follows:
To clear His name of false rumor, Śrī Kṛshṇa led a party of citizens into the forest, tracked Prasena's body, and discovered Jāmbavān's cave. Entering the dark cave alone, Kṛshṇa encountered Jāmbavān. Unaware of Kṛshṇa's divinity, Jāmbavān engaged Kṛshṇa in a ferocious wrestling match that lasted twenty-eight consecutive days. Gradually feeling His opponent's supernatural strength, Jāmbavān realized that this was none other than Bhagavān Śrī Rāmacandra, whom he had served in a previous era. Jāmbavān surrendered, offered his daughter Jāmbavatī in marriage to Kṛshṇa, and presented the Syamantaka jewel as a gift. Kṛshṇa returned to Dvārakā, summoned Satrājit to the royal assembly, and returned the jewel. Ashamed of his false accusations, Satrājit offered his beautiful daughter Satyabhāmā in marriage to Kṛshṇa, along with the jewel. Kṛshṇa wed Satyabhāmā but returned the jewel to Satrājit.