24 - శ్రీకృష్ణుడు ఇంద్రయాగమునాపుట

శ్రీశుక ఉవాచ

 భగవానపి తత్రైవ బలదేవేన సంయుతః

 అపశ్యన్నివసన్ గోపానింద్రాయాగకృతోద్యమాన్

 శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో గూడీ ఆ బృందావనమునందే నివసించుచుండెను. గోపాలకులు ఇంద్రయాగమునకు ఉద్యమించుచుండుటను ఆయన చూచెను.

తదభిజ్ఞోఽపి భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః

 ప్రశ్రయావనతోపృచ్చద్వృద్దాన్నందపురోగమాన్

సకలప్రాణులకు ఆత్మ యై సర్వమునకు సాక్షి యగు శ్రీకృష్ణ భగవానునకు వారి అభిప్రాయము తెలియును. ఐననూ, ఆయన నందుడు మొదలుగా గల పేదలకు వినయముగా మనుసు గించి స్పంచేము

కథ్యతాం మే పీతః కోఽయం సంభ్రమో వ ఉపాగతః

కిం ఫలం కస్య చోద్దేశః కేన వా సాధ్యతే మఖః

ఓ తండ్రీ! నాకు చెప్పడు. మీరు ఉత్సాహముగా చేయదల పెట్టిన ఈ కార్యమేమి? ఈ యజ్ఞమునకు ఫలమేమి? దేవత యెవరు ? సాధనమేది? యజమానుడెవరు?

ఏతద్భ్రూహి మహాన్ కామో మహ్యం శుశ్రూష వే పితః

నహి గోప్యం హి సాధూనాం కృత్యం సర్వాత్మనామిహ

 అస్త్యస్వపరదృష్టీ నామమిత్రోదాస్తవిద్విషామ్

ఓ తండ్రీ! నాకు వినాలని చాల కోరిక గలదు. (మీరు పెద్ద కోరికతో చేయుచున్నారు). కావున, నాకీ విషయమును చెప్పడు. ఏలయన, ఈ లోకములో సర్వమును ఆత్మరూపముగా చూసే సజ్జనులకు తనవారు, పరాయివారు అనే తేడాలు ఉండవు. వారికి మిత్రులు, ఉదాసీనులు, శత్రువులు అనే విభాగములు ఉండవు. అట్టివారికి దాచి పెట్టదగిన కార్యమేదియు ఉండనే ఉండదు.

శత్రువునకు వలే ఉదాసీనునకు కూడ రహస్యకార్యమును చెప్పరాదు. కాని, మిత్రుడు ఆత్మవంటివాడని పెద్దలు చెప్పెదరు (కాన, మిత్రునకు రహస్యమును చెప్పదగును).

జ్ఞాత్వాఽజ్ఞాత్వా చ కర్మాణి జనోయమనుతిష్ఠతి

 విదుషః కర్మసిద్ధిస్స్యాత్తథా నావిదుషో భవేత్

మానవుడు తెలిసి మరియు తెలియకుండా కూడ కర్మలను చేయును. తెలిసి చేసినవానికి కర్మ సిద్దించును. కాని, తెలియకుండా చేయువానికి కర్మ అదే స్థాయిలో ఫలమునీయదు.

తత్ర తావత్క్రియాయోగో భవతాం కిం విచారితః

 అథవా లౌకికస్తన్మే పృచ్ఛతస్సాధు భణ్యతామ్

అది యట్లుండ, ఈ వైదికకర్మ అనే ఉపాయమును గురించి మీరు ముందుగా విచారము చేసినారా? లేక, ఇరీ, లౌకికమైన కర్మయేనా? ప్రశ్నించుచున్న నాకు సరిగ్గా చెప్పుడు.

నంద ఉవాచ

 పర్జన్యో భగవానీంద్రో మేఘాస్తస్యాత్మమూర్తయః

తేఽభివర్షంతి భూతానాం ప్రీణనం జీవనం పయః

నందుడిట్లు పలికెను --- ఇంద్రభగవానుడు వర్షాధిపతి. మేఘములు ఆయనకు తన రూపములే. అవి అంతటా వర్షించి ప్రాణులకు ప్రీతిని కలిగించి, ప్రాణములను నిలబెట్టును.

తం తాత వయమన్యే చ వార్ముచాం పతిమీశ్వరమ్

ద్రవ్యైస్తవ్రేతసా సిద్దైర్యజంతే క్రతుభిర్నరాః

అబ్బాయీ! మనమే కాకుండా ఇతరమానవులు కూడ నీటిని వర్షించే మేఘములకు ప్రభుడగు దేవేంద్రుని ద్రవ్యములతో పూజించెదరు. ఆ ద్రవ్యములు ఆయన అనుగ్రహించిన వర్షము వలన ఉత్పన్నమైనవే.

తచ్చే షేణోపజీవంతి త్రివర్గఫల హేతవే

 పుంసాం పురుషకారాణాం పర్జన్యః ఫలభావనః

ఆ యాగము చేయగా మిగిలిన ద్రవ్యములతో జనులు జీవిస్తూ ధర్మార్థ కామములను సాధించుకొనెదరు. మానవుల కృష్యాది వ్యాపారములకు ఫలమును ఉత్పన్నము చేసేది వర్షాధిపతియగు ఇంద్రుడే.

య ఏవం విసృజేద్దర్మం పారంపర్యాగతం నరః

కామాల్లోభాద్భయాద్ద్వేషాత్స వై నాప్నోతి శోభనమ్

ఈ విధముగా ఈ ధర్మము. పరంపరగా వచ్చుచున్నది. దీనిని ఏ వ్యక్తి యైతే భోగాసక్తి వలన, ధనలోభము వలన, దానిని వ్యతిరేకించువారి భయము వలన, లేదా దేవతాద్వేషము వలన విడిచి పెట్టునో, అట్టి వానికి, శుభము కలుగదు.

శ్రీశుక ఉవాచ

 వచో నిశమ్య నందస్య తథా న్యేషాం ప్రజౌకసామ్

ఇంద్రాయ మన్యుం జనయన్ పితరం ప్రాహ కేశవః

 శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- నందుడు మరియు గోకులములో నివసించే ఇతరులు చెప్పిన ఆ మాటను విని, శ్రీకృష్ణ భగవానుడు తండ్రితో నిట్లనెను. ఆయన పలుకులు ఇంద్రునకు కోపము తెప్పించెను.

శ్రీభగవానువాచ

కర్మణా జాయతే జంతుః కర్మణైవ విలీయతే

 సుఖం దుఃఖం భయం క్షేమం కర్మణైవాభిపద్యతే

 శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- జీవుడు కర్మ చేతనే పుట్టి కర్మ చేతనే మరణించును. జీవుడు కర్మ చేతనే సుఖదుఃఖభయ క్షేమములను పొందుచున్నాడు.

అస్తి చేదీశ్వరః కశ్చిత్పలరూప్యన్యకర్మణామ్

 కర్తారం భజతే సోఽపీ న హ్యకర్తుః ప్రభుర్హి సః

జీవుల కర్మలకు ఫలమునిచ్చే ఈశ్వరుడొకడు ఉన్నట్లైతే, ఆ ఈశ్వరుడు కూడ కర్మలను చేసినవానికే ఫలమునిచ్చును. కర్మను. చేయనివానికి ఆయన కూడ ఫలమునీయలేడు గదా!

కిమింద్రేణేహ భూతానాం స్వస్వకర్మానువర్తనామ్

అనీ శేనాన్యథా కర్తుం స్వభావవిహితం నృణామ్

మానవులకు పూర్వసంస్కారములచే కలిగించబడే సుఖదుఃఖములను మార్చే శక్తి ఇంద్రునికి లేదు. ఈ లోకములో తమ తమ కర్మల ఫలములననుభవించే ప్రాణులకు అట్టి ఇంద్రునితో పని యేమున్నది?

స్వభావతంత్రోహి జనస్వభావమనువర్తతే

 స్వభావస్థమిదం సర్వం సదేవాసురమానుషమ్

జీవుడు స్వభావము (ఆజ్ఞానము) నకు వశుడై స్వభావమునే అనుసరించును. దేవతలు, రాక్షసులు, మానవులతో సహా సకలజగత్తు స్వభావమునందే నిలిచి యున్నది.

దేహానుచ్చావచాఞ్జంతుః ప్రాప్యోత్సృజతి కర్మణా

 శత్రుర్మిత్రముదాసీనః కర్మైవ గురురీశ్వరః

జీవుడు కర్మచే ఉత్కృష్టనికృష్ణములగు దేహములను పొంది విడిచి పెట్టుచుండును. శత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు, గురువు కర్మఫలముగనే లభించెదరు. ఈశ్వరకృప కూడ పుణ్యకర్మాధీనమే.

తస్మాత్సంపూజయేత్కర్మ స్వభావస్థస్స్వకర్మకృత్

అంజసా యేన వర్తేత తదేవాస్య హి దైవతమ్

 కావున, మానవుడు కర్మను బాగుగా పూజించవలెను. వ్యక్తి స్వభావమునకు వశుడైయున్నంతవరకు స్వధర్మమునాచరించవలెను. వ్యక్తి దేనిచే సుఖముగా మనగల్గునో, అదియే వానికి దైవము.

ఆజీవ్యైకతరం భావం యస్త్వన్యముపజీవతి

 న తస్మాద్విందతే క్షేమం జారం నార్యసతీ యథా  

అయోగ్యురాలగు యువతి విటుని ఆశ్రయించినట్లుగా, ఎవడైతే ఒకదానిని బ్రదుకు దెరువుగా చేసుకొని జీవించి మరియొకదానిని జీవికకై ఆశ్రయించునో (సేవించునో), అట్టివాడు దాని వలన క్షేమమును పొందడు.

వర్తేత బ్రహ్మణా విప్రో రాజన్యో రక్షసా భువః

వైశ్యస్తు వార్తయా జీవేచ్ఛూద్రస్తు ద్విజ సేవయా

 బ్రాహ్మణునకు వేదము, క్షత్రియునకు భూపాలనము, వైశ్యునకు వార్త, శూద్రునకు వారికి సేవలనందించుట అనునవి జీవిక కాదగును.

కృషి వాణిజ్యగోరక్షా కుసీదం తుర్యముచ్యతే

 వార్తా చతుర్విధా తత్ర వయం గోవృత్తయోఽనిశమ్

వ్యవసాయము, వర్తకము, గోవులను పాలించుట, ధర్మవడ్డీ వ్యాపారము అని వార్త నాల్గు రకములుగా నున్నది. మన కైతే ఎల్లవేళలా గోపాలనమే జీవిక.

సత్త్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంత హేతవః

రజసోత్పద్యతే విశ్వమన్యోన్యం వివిధం జగత్

 సత్త్వగుణము స్థితికి, రజోగుణము సృష్టికి, తమోగుణము ప్రళయమునకు హేతువులు. స్త్రీపురుష సంయోగముచే పలు రకముల ప్రాణులతో విరాజిల్లే జగత్తు రజోగుణము కారణముగా పుట్టుచున్నది.

రజసా చోదితా మేఘా వర్షంత్యంబూని సర్వతః

 ప్రజాస్తైరేవ సిద్ధ్యంతి మహేంద్రః కిం కరిష్యతి

రజోగుణముచే ప్రేరితములై మేఘములు అంతటా జలములను వర్షించును. ప్రాణులు ఆ జలములతోనే జీవించును. దేవేంద్రుడు చేసేదేమున్నది? (ఏమీ లేదు).

న నః పురో జనపదా న గ్రామా న గృహా వయమ్

 నిత్యం వనౌకసస్తాత వన శైలనివాసినః

ఓ తండ్రీ! మనకు దేశములు గాని, నగరములు గాని, గ్రామములు గాని, గృహములు గాని లేవు. మనము ఎల్లవేళలా అడవులయందు పర్వతములపై నివసించువారము.

తస్మాద్గవాం బ్రాహ్మణానామద్రేశ్చారభ్యతాం మఖః

 య ఇంద్రయాగసంభారా స్తైరయం సాధ్యతాం మఖః

కావున, గోవులను, వేదవేత్తలను, పర్వతమును ఆరాధించే యజ్ఞమును ఆరంభించుడు. ఇంద్రయాగముయొక్క సామగ్రి యేది గలదో, దానితో ఈ యాగమును నిర్వర్తించుడు.

 పచ్యంతాం వివిధాః పాకాస్సూపాంతాః పాయసాదయః

 సంయాదాపూపశష్కుల్యస్సర్వదోహశ్చ గృహ్యతామ్

  పాయసము, పప్పు, గోధుమ రవ్వ ఉప్మా, అప్పములు, చేగోడీలు మొదలైన పలు రకముల వంటలను చేయుడు. అందరి ఇళ్లలోని పొలను, పెరుగును కూడ తీసుకురండు.

హూయంతామగ్నయస్సమ్యగాహ్మణైర్బ్రహ్మ వాదిభిః

అన్నం బహువిధం తేభ్యో దేయం వో ధేనుదక్షిణాః

వేదవేత్తలగు బ్రాహ్మణులు యథావిధిగా అగ్నులయందు హోమమును చేయవలెను. మీరు వారికి పలు రకముల ఆహారమునిచ్చి, పాలిచ్చే ఆవులను దక్షిణగా ఈయవలెను.

అనేభ్యశ్చాశ్వచాండాలపతితేభ్యో యథాఽర్హతః

యవసం చ గవాం దత్త్వా గిరయే ధీయతాం బలిః

పశుహింసకులు, నేరస్థులు మొదలైన పతీతుల వరకు, అంతిమముగా వీధి కుక్కలకు కూడ అర్హతకు తగ్గట్లుగా వస్తువులనిండు. గోవులకు గడ్డిని పెట్టుడు. పర్వతమునకు నైవేద్యమును పెట్టుడు.

స్వలంకృతా భుక్తవంతస్స్వనులిప్తాసువాససః

ప్రదక్షిణం చ కురుత గోవిప్రానలపర్వతాన్

 భుజించి సుగంధములనలదుకోని మంచి వస్త్రములను దాల్చి మంచి సొమ్ములను పెట్టుకొని, గోవులకు, వేదవేత్తలకు, అగ్నులకు, గోవర్ధన పర్వతమునకు కూడ ప్రదక్షిణములను చేయుడు.

ఏతన్మమ మతం తాత క్రియతాం యది రోచతే

 అయం గోబ్రాహ్మణాద్రీణాం మహ్యం చ దయితో మఖః

 ఓ తండ్రీ! ఇది నా అభిప్రాయము. నచ్చినచో ఆచరించుడు. ఈ యాగము గోవులకు, వేదవేత్తలకు, గోవర్ధన పర్వతమునకు, నాకు కూడ ప్రీతికరమైనది.

శ్రీశుక ఉవాచ

కాలాత్మనా భగవతా శక్రదర్పం జిఘాంసతా

ప్రోక్తం నిశమ్య నందాద్యాస్సాధ్వగృహ్ణంత తద్వచః  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- కాలస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుని గర్వమునడంచ గోరి ఇట్లు చెప్పెను. నందుడు, సునందుడు మొదలుగా గలవారు ఆ మాటను బాగున్నది అంటూ స్వీకరించిరి.

తథా చ వ్యదధుస్సర్వం యథావహ మధుసూదనః

 వాచయిత్వా స్వస్త్యయనం తధ్ధవ్యేణ గిరిద్విజాన్

 ఉపహృత్య బలీన్ సర్వానాదృతా యవసం గవామ్

గోధనాని పురస్కృత్య గిరిం చక్రుః ప్రదక్షిణమ్

మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడెట్లు చేప్పెనో, వారదే విధముగా సర్వమును చేసిరి. వారు వేదవేత్తలచే స్వస్తివాచనమును చేయించిరి. ఆ ఇంద్రయాగసంభారములతో గోవర్ధన పర్వతమునకు, వేదవేత్తలకు, గోవులకు సకలములైన ధూపదీపనైవేద్యాదులను, గోవులకు గడ్డిని వారు. ఆదరముగా  సమర్పించిరి. తరువాత వారు గోసంపదలు ముందు నడువగా పర్వతమునకు ప్రదక్షిణమును చేసిరి.

అనాంస్యనడుద్యుక్తాని తే చారుహ్య స్వలంకృతాః

గోప్యశ్చ కృష్ణ వీర్యాణి గాయంతస్సద్విజాశీషః

 ఆ గోపాలకులు వేదవేత్తల ఆశీర్వచనములను తీసుకొనిరి. గోపికలు కూడ బాగుగా అలంకరించుకొని ఎద్దులను కట్టిన బళ్లనెక్కి శ్రీకృష్ణుని పరాక్రమ గాథలను గానము చేసిరి.

కృష్ణస్తన్యతమం రూపం గోపవిశ్రాంభణం గతః

 శైలోఽస్మీతి బ్రువన్ భూరి బలిమాదద్బృహద్వపుః

శ్రీకృష్ణుడైతే గోపాలకులకు విశ్వాసమును కలిగించుటకై పర్వతము పైన మరియొక పెద్ద శరీరము గల రూపమును దాల్చెను. పర్వతమును నేనే అని చెప్పి, ఆయన అధికమగు నైవేద్యమును భక్షించెను.

తస్మై నమో వ్రజజనైస్సహ చక్రేఽత్మనాఽఽత్మనే

అహో పశ్యత శైలోఽసౌ రూపీ నోఽనుగ్రహం వ్యధాత్  

ఆ శ్రీకృష్ణుడు గోకులవాసులతో కూడి స్వయముగా ఆ తన రూపము కొరకు నమస్కారము చేసెను. ఆశ్చర్యము! చూడుడు. ఈ పర్వతము రూపు దాల్చి మనలననుగ్రహించినది, (అని వారు పలికిరీ).

ఏషోఽవజానతో మర్త్యాన్ కామరూపీ వనౌకసః

 హంతి హ్య స్మై నమస్యామశ్శర్మణే ఆత్మనో గవామ్

 కోరుకున్న రూపమును దాల్చే ఈ పర్వతము అడవిలో ఉంటూ అవమానించే జనులను హింసించును. కావున, మనల మరియు గోవుల క్షేమము కొరకై దీనికి నమస్కరించెదము.

ఇత్యద్రిగోద్విజమఖం వాసుదేవప్రణోదితాః

యథా విధాయ తే గోపాస్సహకృష్ణా ప్రజం యయుః  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్థే చతుర్వింశోఽధ్యాయః

ఈ విధముగా ఆ గోపాలకులు వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణునిచే ప్రేరితులై గోవర్ధనపర్వతమును, గోవులను, వేదవేత్తలను ఆరాధించిరి. తరువాత వారు శ్రీకృష్ణునితో గూడి గోకులమునకు వెళ్లిరి.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో శ్రీకృష్ణుడు ఇంద్రయాగమునాపుటను వర్ణించే ఇరువది నాల్గవ అధ్యాయము ముగిసినది (24).