భాగవత మహా పురాణము
45 - శ్రీకృష్ణ బలరాముల ఉపనయనము, గురుకుల ప్రవేశము, విద్యాధ్యయనము, గురుదక్షిణ
శ్రీశుక ఉవాచ ।
పీతరావుపలబాఠా విదిత్వా పురుషోత్తమః । మా భూదితి నిజాం మాయాం తతాన జనమోహినీమ్ ॥
శ్రీశుక మహర్షి పలికెను --- తన యథార్థ స్వరూపము తల్లి దండ్రులకు తెలిసినదని శ్రీకృష్ణ భగవానుడు గమనించెను. అట్లు కారాదని తలచి ఆయన జనులను మోహ పెట్టే తన యోగమాయను విస్తరిల్ల జేసెను.
ఉవాచ పీతరావేత్య సాగ్రజస్సాత్వత్నభః । ప్రశ్రయావనతః ప్రీణన్నంబ తాతేతి సాదరమ్ ॥
యదువంశ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణుడు అన్నగారితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చెను. ఆయన వినయముతో నమ్రుడై సాదరముగా అమ్మా! తండ్రీ! అని పిలుస్తూ, వారికి ప్రీతిని కలిగించెను.
నాస్మత్తో యువయోస్తాత నిత్యోత్కంఠితయోరపి । బాల్యపౌగండకైశోరాః పుత్రాభ్యామభవన్ క్వచిత్ ॥
తండ్రీ! పుత్రులమగు మా ఇద్దరి నిమిత్తముగా మీరు చాల ఆదుర్దాను అనుభవించిరి. అయిననూ, ఐదు ఏళ్లు, ఆరు ఏళ్లు, పది యేళ్లు వయస్సులలో పుత్రుల వలన కలిగే సుఖము మీ కేనాడు కలుగలేదు.
న లబ్ధో దైవహతయోర్వాసో నౌ భవదంతికే ! యాం బాలాః పితృగేహస్థా విందంతే లాలితా ముదమ్ ॥
పిల్లలు తల్లిదండ్రుల ఇంటిలో ఉంటూ వారిచే లాలించబడుతూ ఆనందమును పొందెదరు. దైవవంచితులమైన మాకిద్దరికి మీ ఇద్దరి వద్ద నివాసము గాని, ఆ ఆనందము గాని లభించలేదు.
సర్వార్థసంభవో దేహో జనితః పోషితో యతః । న తయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యశ్శతాయుషా ॥
తల్లిదండ్రులు సకలపురుషార్థముల సాధనకు మూలమైన దేహమునకు జన్మనిచ్చి పోషించెదరు. కావున, మానవుడు వంద యేళ్ల జీవితమంతా సేవ చేసినా వారిద్దరి ఋణము తీరదు.
యస్తయోరాత్మజః కల్ప ఆత్మనా చ ధనేన చ । వృత్తిం న దద్యాత్తం ప్రేత్య స్వమాంసం ఖాదయంతి హి ॥
ఏ కొడుకైతే సమర్థుడై అట్టి తల్లిదండ్రులకు ధనమును వెచ్చించి సేవ చేసి జీవనాధారమును కల్పించడో, అట్టివాడు మరణించిన తరువాత నరకములో యమదూతలు వానికి వాని శరీరము యొక్క మాంసమునే తినిపించెదరు.
మాతరం పితరం వృద్ధం భార్యాం సాధ్వీం సుతం శిశుమ్ । గురుం విప్రం ప్రపన్నం చ కల్పోఽబిభ్రచ్ఛ్వసన్మృతః ॥
వృద్ధులైన తల్లిదండ్రులను, పతివ్రతయైన భార్యను, పిల్లవాడైన పుత్రుని, గురువును, వేదవేత్తను, శరణు పొందినవానిని కూడ సమర్థుడై ఉండి ఎవడు పోషించడో, అట్టివాడు గాలిని పీలుస్తున్నా మృతుడే.
తన్నావకల్పయోః కంసాన్నిత్యముద్విగ్నచేతసోః । మోఘమేతే వ్యతిక్రాంతా దివసా వామనర్చతోః ॥
అందువలన, ఎల్లవేళలా కంసుని వలన భయపడిన బుద్ధి గల మేమిద్దరము అసమర్థులమై మిమ్ములనిద్దరినీ పూజించకుండానే ఇంత కాలము వ్యర్థముగా గడిచిపోయినది.
తత్ క్షంతుమర్హథస్తాత మాతర్నౌ పరతంత్రయోః । అకుర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్ట యోర్దుర్ఘృదా భృశమ్ ॥
ఓ తండ్రీ! తల్లీ! అందువలన, దుర్బుద్ధియగు కంసునిచే మిక్కిలి కేశమునకు గురిచేయబడిన మేమిద్దరము అస్వతంత్రులమై మీ ఇద్దరికి సేవను చేయకపోతిమి. మమ్ములను మీరు క్షమించ దగును.
శ్రీశుక ఉవాచ ।
ఇతి మాయామనుష్యస్య హరేర్విశ్వాత్మనో గిరా । మోహితావంకమారోప్య పరిష్వజ్యాపతుర్ముదమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తునకు ఆత్మయైన శ్రీకృష్ణ భగవానుడు యోగమాయచే మానవుడైనాడు. ఆయన పలికిన పలికిన ఈ పలుకులకు తల్లిదండ్రులు మోహితు ఆతనిని ఒడిలో కూర్చుండబెట్టుకొని కౌగిలించుకొని ఆనందమును పొందిరి.
సించంతావశ్రుధారాభి స్స్నేహపాశేన చావృతౌ ! న కించిదూచతూ రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ ॥
ఓ రాజా! వారిద్దరు తమ పుత్రులను కన్నీటి ధారలతో తడిపిరి. వారు అధికమగు మోహమును పొంది ప్రేమ అనే పాశముచే ఆవరించబడిరి. వారి కంఠము కన్నీటి వలన బొంగురుపోయి వారేమీ మాట లేడ లేదు.
ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీసుతః । మాతామహం తూగ్ర సేనం యదూనామకరోన్నృపమ్ ॥
దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా తల్లిదండ్రులనోదార్చి, మాతామహుడగు ఉగ్రసేనుని యాదవులకు రాజునుగా చేసెను.
ఆహ చాస్మాన్మహారాజ ప్రజాశ్చాజ్ఞప్తుమర్హసి । యయాతిశాపాద్యదుభిర్నాసితవ్యం నృపాసనే ॥
ఆయన ఉగ్రసేనునితో ఇట్లు పలికెను - ఓ మమ్ములను, ప్రజలను కూడ శాసించుడు. యయాతి యొక్క శాపము వలన యాదవులు రాజసింహాసనముపై కూర్చుండ రాదు. (కాని నా మాట వలన దోషము ఉండదు).
మయి భృత్య ఉపాసీనే భవతో విబుధాదయః । బలిం హరంత్యవనతాః కిముతాన్యే నరాధిపాః ॥
సేను సేవకుడనై మిమ్ములను సేవించుచుండగా, దేవతలు మొదలగువారు కూడ సత్కారములను తీసుకువచ్చెదరు. ఇతర నరపాలురు అట్లు చేయుదురని వేరుగా చెప్పవలయునా?
సర్వాన్ స్వజ్ఞాతిసంబంధాన్ దిగ్భ్యః కంసభయాకులాన్ । యదువృష్ణ్యంధకమధుదాశార్హకుకు రాదికాన్ ॥ సభాజితాన్ సమాశ్వాస్య విదేశావాసకర్శితాన్ । న్యవాసయత్స్వ గేహేషు విత్తైస్సంతర్ప్య విశ్వకృత్ ॥
కంసునకు భయపడి యదు వృష్టి అంధక మధు దాశార్హ కుకుర సాత్వత ఇత్యాది వంశీయులు నాలుగు దిక్కులకు పారిపోయిరి. జగత్కారణుడగు శ్రీకృష్ణుడు తనకు జ్ఞాతులు, బంధువులు అగు వారినందరినీ రప్పించెను. విదేశములో నివాసముచే కృశించియున్న వారిని ఆయన బాగా సత్కరించి సంపదలతో తృప్తి పరచి వారి వారి గృహములలో నివసింప జేసెను.
కృష్ణ సంకర్షణభుజైర్గుప్తా లబ్ధమనోరథాః । గృహేషు రేమిరే సిద్ధాః కృష్ణ రామగతజ్వరాః ॥
యాదవులు శ్రీకృష్ణ బలరాముల భుజములచే రక్షించబడిరి. వారిద్దరి కారణముగా వారి మనోరథములు సఫలమై దుఃఖములు దూరమయ్యెను. వారు కృతార్థులై తమ గృహములయందు రమించిరి.
వీక్షంతోఽహరహః ప్రీతా ముకుందవదనాంబుజమ్ । నిత్యం ప్రముదితం శ్రీమతృదయస్మితవీక్షణమ్ ॥
మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని పద్మమువలె శోభిల్లే ముఖము ఎల్లవేళలా గొప్ప ఆనందమును కలిగియుండును. ఆయన సదా దయ, చిరునవ్వులతో కూడిన చూపులను బరపును. ఆయన ముఖమును ప్రతి దినము చూచి యాదవులు ప్రీతిని జెందిరి.
తత్ర ప్రపయసోఽకప్యాసన్ యువానోఽతిబలౌజసః । పిబంతోఽక్షైర్ముకుందస్య ముఖాంబుజసుధాం ముహుః ॥
ఆ మథురలో మోక్ష దాతయగు శ్రీకృష్ణుని పద్మమువంటి ముఖము అనే అమృతమును కన్నులతో పానము చేసే వ్యక్తులు వయసు మళ్లినవారు కూడ గొప్ప శరీరబలము, ఇంద్రియపాటవము గల యువకులు అయిరి.
అథ నందం సమాసాద్య భగవాన్ దేవకీసుతః । సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేదమూచతుః ॥
ఓ పరీక్షిన్మహారాజా! దేవకీ పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు, శేషావతారమగు బలరాముడు కూడ తరువాత నందుని వద్దకు వెళ్లి ఆయనను కౌగిలించుకొని ఈ మాటను చెప్పిరి.
పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషి తౌ లాలితౌ భృశమ్ । పిత్రారభ్యధికా ప్రీతిరాత్మజేష్వాత్మన్యోపి హి ॥
ఓ తండ్రీ! ప్రేమ గల మీరిద్దరు మమ్ములనిద్దరినీ అధికముగా పోషించి లాలించితిరి. ఎందుకంటే, తల్లిదండ్రులకు తమ శరీరము కంటే కూడ పుత్రులయందు ప్రేమ చాల ఎక్కువగా నుండును.
స పీతా సా చ జననీ యీ పుష్ణీతాం స్వపుత్రవత్ । శిశూన్ బంధుభిరుత్సృష్టానకల్పైః పోషరక్షణే ॥
బంధువులు పోషించి రక్షించలేక విడిచి పెట్టిన పిల్లలను తమ పిల్లల వలె ఎవరైతే పోషించెదరో, వారే యథార్థమైన తల్లిదండ్రులగుదురు.
యాత యూయం వ్రజం తాత వయం చ స్నేహదుఃఖితాన్ । జ్ఞాతీన్ వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖమ్ ॥
ఓ తండ్రీ! తమరు గోకులమునకు వెళ్లుడు. మేము ఆత్మబంధువులగు వసుదేవాదులకు సుఖమును కలిగించి మిమ్ములను చూచుటకు వచ్చెదము. మీరు ప్రేమచే దుఃఖితులగుదురని నాకు తెలియును.
ఏవం సాంత్వయ్య భగవాన్నందం సవ్రజమచ్యుతః । వాసోకలంకారకుప్యా ద్యైరర్హయామాస సాదరమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడీ విధముగా గోకులవాసులను, నందుని ఒప్పించి, వారిని ఆదరముతో వస్త్రములు, అలంకారములు, (పాలు పితికే) కంచు పాత్రలు, బళ్లు మొదలగు వాటినిచ్చి సత్కరించెను.
ఇత్యు క్తస్తౌ పరిష్వజ్య నందః ప్రణయవిహ్వలః । పూరయన్న శ్రుభిర్నేత్రే సహ గోపైర్వజం యయౌ ।
ప్రేమతో వ్యాకులుడైన నందుడు ఈ మాటలను విని వారిద్దరిని కౌగిలించుకొనెను. ఆయన కన్నులు నీటితో నిండిపోయెను. ఆయన గోపాలకులతో కూడి గోకులమునకు, వెళ్లెను.
అథ శూరసుతో రాజన్ పుత్ర స్సమకారయత్ । పురోధసా బ్రాహ్మణైశ్చ యధావద్ద్విజసంస్కృతిమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత శూరుని పుత్రుడగు వసుదేవుడు పుత్రులిద్దరికి పురోహితునిచే, వేదవేత్తలచే యథావిధిగా ఉపసయన సంస్కారమును బాగుగా చేయించెను.
తేభ్యోదాదాక్షిణా గావో రుక్మమాలాస్స్వలంకృతాః । స్వలంకృతేభ్యస్సంపూజ్య సవత్సాః క్షామమాలినీః ॥
ఆయన వేదవేత్తలను బాగా అలంకారములతో సత్కరించి దక్షిణలను, చూడలతో కూడిన గోవులను ఇచ్చెను. ఆ గోవులు బంగరు మాలలు, పట్టు వస్త్రములు, పుష్పమాలలతో చక్కగా అలంకరించబడెను.
యాః కృష్ణ రామజన్మర్ క్షే మనోదత్తా మహామతిః । తాశ్చాదదాదనుస్మృత్య కం సేనాధర్మతో హృతాః ॥
శ్రీకృష్ణుడు, బలరాముడు పుట్టిన నక్షత్రములయందు వసుదేవుడు మానసికముగా గోవులను దానము చేసెను. గొప్ప ఉదారస్వభావము గల ఆయన ఆ విషయమును తరువాత గుర్తు చేసుకొని వాటిని దానము చేసెను. ఆ గోవులు కంసుడు అధర్మముగా ఆయననుండి లాగుకున్నవి.
తతశ్చ లబసంస్కారౌ ద్విజత్వం ప్రాప్య సువ్రతౌ । గర్గాద్యదుకులాచార్యాద్గాయత్రం వ్రతమాస్థితౌ ॥
ఉపనయన సంస్కారము రెండవ జన్మ. దానిని పొందిన తరువాత మంచి నియమనిష్ఠలు గల వారిద్దరు యాదవవంశమునకు ఆచార్యుడైన గర్గుని వద్ద గాయత్రీ మంత్రోపదేశముతో ఆరంభమయ్యే బ్రహ్మచర్య వ్రతమును స్వీకరించిరి.
ప్రభవౌ సర్వవిద్యానాం సర్వజ్ఞౌ జగదీశ్వరౌ ! నాన్య సిద్ధామలజ్ఞానం గూహమానౌ నరేహితైః ।
వారిద్దరు సకలవిద్యలకు ఉత్పత్తి స్థానములు, సర్వము దెలిసిన జగన్నాథులు. అయిననూ, వారు మానవుల ప్రవృత్తిననుకరిస్తూ తమ స్వతస్సిద్ధమైన శుద్ధజ్ఞానమును దాచియుంచిరి.
అథో గురుకులే వాసమిచ్ఛం తావుపజగ్మతుః । కాశ్యం సాందీపనిం నామ హ్యవంతీపురవాసినమ్ ॥
తరువాత బలరామకృష్ణులు గురుకులవాసమును చేయగోరిరి. కాశ్యపగోత్రోద్భవుడు, (కాశీలో పుట్టినవాడు, కాశీలో చదివినవాడు) సాందీపని అని ప్రసిద్ధి జెంది అవంతీ (ఉజ్జయినీ) నగరమునందు నివసించుచున్న గురువు వద్దకు వారు వెళ్లిరి.
యథోపసాద్య తౌ దాంతౌ గురౌ వృత్తిమనిందితామ్ । గ్రాహయంతావు పేతౌ స్మ భక్త్యా దేవమివాదృతౌ ॥
వారిద్దరు వినయముతో యథావిధిగా గురువు వద్దకు వెళ్లిరి. వారు లోకమునకు దోషములు లేకుండా గురువు వద్ద నడుచుకోవలసిన పద్ధతిని ఆదర్శముగా చూపుతూ ఆవరముతో, భక్తితో గురువును దేవుని వలె సేవించిరి.
తయోర్ద్విజవరస్తుష్టశ్శుద్ధభావానువృత్తిభిః । ప్రోవాచ వేదానఖిలాన్ సాంగోపనిషదో గురుః ॥
వేదవేత్తలలో శ్రేష్ఠుడగు ఆ గురువు వారిద్దరు శుద్ధమైన భావముతో చేసే సేవలకు సంతోషించి, వారికి వేదాంగములు (శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము, నిరుక్తము), ఉపనిషత్తులతో నాల్గు వేదములను బోధించెను.
సరహస్యం ధనుర్వేదం ధర్మాన్న్యాయపంస్తథా । తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్ ॥
మంత్ర దేవతాసహితమైన ధనుర్వేదమును, ధర్మశాస్త్రములను, మీమాంసాది న్యాయమార్గములను, తర్కవిద్యను, సంధి విగ్రహయాన - ఆసనద్వైధీభావసమాశ్రయములనే ఆరు విధముల రాజనీతిని కూడ ఆయన వారికి బోధించెను.
సర్వం నరవరశ్రేష్ఠా సర్వవిద్యాప్రవర్తకౌ । సకృన్నిగదమాత్రేణ తౌ సంజగృహతుర్నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! గొప్ప మానవులలో గొప్పవారగు వారిద్దరు సకలవిద్యలను లోకములో ప్రవర్తిల్లజేసిన భగవానులే. విద్యలనన్నింటినీ ఒక్కసారి చెప్పగానే చక్కగా గ్రహించెడివారు.
అహోరాత్రైశ్చతుష్టష్ట్యా సంయత్తౌ తావతీః కలాః । గురుదక్షిణయాఽఽచార్యం ఛందయామాసతుర్నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! మనోజయము గల వారిద్దరు అరవై నాలుగు దినములలో గానము మొదలైన అరవై నాలుగు కళలను నేర్చిరి. వారు ఆచార్యుని ప్రార్థించి ఆయన గురుదక్షిణను కోరునట్లు చేసిరి.
ద్విజస్తయోసం మహిమానమద్భుతం సంలక్ష్య రాజన్నతిమానుషీం మతిమ్ । సమ్మంత్ర్య పత్న్యా స మహార్ణవే మృతం బాలం ప్రభాసే వరయాంబభూవ హ ॥
ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరి అట్టి ఆశ్చర్యకరమగు మహిమను, మానవులకంటె అతీతమైన బుద్ధిశక్తిని చూచి గురువు తన భార్యతో సంప్రదించెను. వారి పుత్రుడు ప్రభాస క్షేత్రములో మహాసముద్రములో పడి మరణించెను. ఆయన ఆ పుత్రుని తెచ్చి ఇమ్మని వరముగా కోరెను.
తథేత్యథారుహ్య మహారథౌ రథం ప్రభాసమాసాద్య దురంతవిక్రమౌ, వేలాముపవ్రజ్య నిషీదతుః క్షణం సింధుర్విదిత్వాఽర్షణ మాహరత్తయోః ।
బలరామకృష్ణులు మహారథులు. వారి పరాక్రమమునకు అంతము లేదు. వారిద్దరు సరే అని చెప్పి వెంటనే రథమెక్కి ప్రభాస క్షేత్రమును చేరి చెలియలి కట్టకు వెళ్లి క్షణకాలము కూర్చుండిరి. వారి రాక గురించి తెలిసి సముద్రుడు పూజాద్రవ్యములతో వారి వద్దకు వచ్చెను.
తమాహ భగవానాశు గురుపుత్రః ప్రదీయతామ్ । యోఽసావిహ త్వయా గ్రస్తో బాలకో మహతోర్మిణా ॥
శ్రీకృష్ణ భగవానుడు ఆ సముద్రునితో నిట్లనెను – నీవు పెద్ద కెరటముతో ఇక్కడ మా గురువుగారి పుత్రుడగు పిల్లవానిని మ్రింగివేసితివి. ఈ పిల్లవానిని వెంటనే మాకు అప్పజెప్పుము.
సముద్ర ఉవాచ !
నైవాహార్షమహం దేవ దైత్యః పంచజనో మహాన్ । అంతర్జలచరః కృష్ణ శంఖరూపధరోఽసురః ॥ ఆస్తే తేనాహృతో నూసం తచ్ఛ్రుత్వా సత్వరం ప్రభుః । జలమావిశ్య తం హత్వా నాపశ్యదుద రేఽర్భకమ్ ॥
సముద్రుడిట్లు పలికెను --- ఓ దేవా! శ్రీకృష్ణా! ఆ పిల్లవానిని నేను సుతరాము అపహరించ లేదు. పంచజనుడనే దితివంశీయుడగు పెద్ద రాక్షసుడు నీటి లోపల శంఖము రూపు దాల్చి సంచరించును. వాడు పిల్లవానిని అపహరించినాడు. ఇది యథార్థము, అని సముద్రుడు చెప్పెను. ఆ మాటను విని శ్రీకృష్ణ ప్రభుడు వేగముగా నీటిలో ప్రవేశించి, ఆ పంచజనుని సంహరించి చూడగా వాని పొట్టలో పిల్లవాడు కానరాలేదు.
తదంగప్రభవం శంఖమాదాయ రథమాగమత్ ।
తతస్సంయమనీం నామ యమస్య దయితాం పురీమ్ ॥
గత్వా జనార్దనశ్శంఖం ప్రదద్మౌ సహలాయుధః ।
దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు ఆ రాక్షసుని శరీరమునుండి పుట్టిన శంఖము (పాంచజన్యము) ను తీసుకొని రథము వద్దకు వచ్చెను. ఆయన నాగలి యే ఆయుధముగా గల బలరామునితో కూడి యమునకు ప్రియమైన సంయమనీ నగరమునకు వెళ్లి, శంఖమును పూరించెను.
శంఖనిర్హ్రాదమాకర్ణ్య ప్రజాసంయమనో యమః ॥
తయోస్సపర్యాం మహతీం చక్రే భక్త్యుపబృంహితమ్ ।
ప్రాణులను శాసించే యముడు శంఖధ్వనిని విని వారిద్దరికి భక్తి భావముతో నిండిన గొప్ప పూజను చేసెను.
ఉవాచావనతః కృష్ణం సర్వభూతాశయాలయమ్ ।
లీలామనుష్య హే విష్ణో యువయోః కరవామ కిమ్ ॥
యముడు వినమ్రుడై సకల ప్రాణుల హృదయములో నివసించే శ్రీకృష్ణ భగవానునితో నిట్లనెను - - ఓ విష్ణూ! నీవు లీల కొరకై మానవదేహమును దాల్చి యున్నావు. మీకిద్దరికి నేనేమి చేయవలెను?
శ్రీభగవానువాచ ।
గురుపుత్రమిహానీతం నిజకర్మనిబంధనమ్ ।
ఆనయస్వ మహారాజ మచ్ఛాసనపురస్కృతః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ యమరాజా! తన కర్మయే బంధనము కాగా మా గురువుగారి పుత్రుడు ఇచటకు తీసుకు రాబడినాడు. నీవు నా ఆజ్ఞచే ప్రేరితుడవై దానిని తీసుకు రమ్ము.
తథేతి తేనోపానీతం గురుపుత్రం యదూత్తమౌ ।
దత్త్వా స్వగురవే భూయో వృణీ ష్వేతి తమూచతుః ॥
సరే అని చెప్పి బాలకుని తీసుకువచ్చెను. యదు వంశశ్రేష్ఠులగు వారిద్దరు ఆ గురుపుత్రుని తమ గురువునకు అప్పజెప్పి, ఇంకనూ కోరుకొనుడు, అని పలికిరి.
గురురువాచ।
సమ్యక్సంపాదితో వత్స భవద్భ్యాం గురునిష్క్రయః ।
కో ను యుష్మద్విధగురోః కామానామవశిష్యతే ॥
గురువు ఇట్లు పలికెను --- నాయనలారా! మీరిద్దరు గురువు యొక్క ఋణమును పూర్తిగా తీర్చివేసినారు. మీవంటి వారికి గురువైన వానికి ఇంకనూ కోరికలేమి మిగిలియుండును? (ఉండవు).
గచ్ఛతం స్వగృహం వీరౌ కీర్తిర్వామస్తు పావనీ ।
ఛందాంస్యయాతయామాని భవంత్విహ పరత్ర చ ॥
ఓ వీరులారా! మీరిద్దరు మీ ఇంటికి వెళ్లుడు. మీకు జనులను పవిత్రము చేసే కీర్తి కలుగుగాక! మీరు నేర్చిన విద్యలు ఇహపరలోకములయందు నిస్సారములు కాకుండు గాక! (సఫలములగుగాక!)
గురుణైవమనుజ్ఞాతౌ రథేనానిలరంహసా ।
ఆయాత్ స్వపురం తాత పర్జన్యనినదేన వై ॥
నాయనా! పరీక్షిత్తూ! వారిద్దరు గురువు అనుమతి తీసుకొని రథమునెక్కి తమ నగరము (మథుర) నకు తిరిగి వచ్చిరి. వాయువుతో సమానమైన వేగముతో నడిచే ఆ రథము యొక్క ధ్వని మేఘగర్జనను పోలియుండును.
సమనందన్ ప్రజాస్సర్వా దృష్ట్వా రామజనార్దనౌ ।
అపశ్యంత్యో బహ్వహాని నష్ట లబ్ధధనా ఇవ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే పంచచత్వారింశోఽధ్యాయః॥
బలరాముని, దుష్ట జనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుని అచటి జనులు చాల రోజులు చూడలేదు. ఇప్పుడు వారందరు వారిద్దరిని చూచి, పోయిన సంపద మరల దొరికినవారు వలే చాల ఆనందించిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో శ్రీకృష్ణ బలరాముల ఉపనయనము, గురుకుల ప్రవేశము, విద్యాధ్యయనము, గురుదక్షిణలను
వర్ణించే నలుబది ఐదవ అధ్యాయము ముగిసినది (45).
Summary of chapter 45 of the Bhāgavata Mahā Purana is as follows:
Following Kaṁsa's death, Śrī Kṛshṇa and Balarāma freed Their parents, Vasudeva and Devakī, from their prison cells, offering them humble prostrations. Kṛshṇa then reinstated Kaṁsa's saintly father, King Ugrasena, as the sovereign ruler of the Yadu dynasty. To fulfill Vaidika customs, Kṛshṇa and Balarāma traveled to Ujjain to reside as celibate students (*Brahmacārīs*) in the gurukula of Sāndīpani Muni. Within sixty-four days, the brothers mastered all sixty-four traditional arts and Vaidika sciences. When requesting Guru-dakshiṇā, Sāndīpani Muni begged for the recovery of his young son who had drowned in the ocean at Prabhasa. Kṛshṇa and Balarāma traveled to the ocean, vanquished the conch demon Pañcajana, descended to the subterranean realm of Yamarāja, and brought Sāndīpani's deceased son back alive, restoring him to his grateful parents.