41 - శ్రీకృష్ణుడు మథురలో ప్రవేశించి మాలాకారుని అనుగ్రహించుట

శ్రీశుక ఉవాచ

స్తువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః భూయస్సమాహరత్కృష్ణో నటో నాట్యమివాత్మనః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను  ---  శ్రీకృష్ణ భగవానుడు తన రూపమును నీటియందు చూపించి, ఆ అక్రూరుడు స్తుతించుచుండగా, తరువాత నటుడు తన నటనను వలె ఉపసంహరించెను.

సోఽపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్జ్య సత్వరః కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్

విస్మయమును పొందిన ఆ అక్రూరుడున్నూ శ్రీహరి అంతర్దానమైన సంగతిని గుర్తించి వేగముగా నీటి బయటకు వచ్చి నిత్యకర్మనంతనూ పూర్తి చేసుకొని రథము వద్దకు పచ్చెను.

తమపృచ్ఛద్ధృషీ కేశః కిం తే దృష్టమివాద్భుతమ్ భూమౌ వియతి తోయే వా తథా త్వాం లక్షయామహే

ఆ అక్రూరుని ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణ భగవానుడిట్లు ప్రశ్నించెను --- నీ ముఖము చూస్తే నీవు నేలపై గాని, ఆకసములో గాని, నీటిలో గాని ఏదో ఒక వింతను చూచినావా అని తోచుచున్నది. ఏమది?

అక్రూర ఉవాచ

అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే ! త్వయి విశ్వాత్మకే తాని కిం మేఽదృష్టం విపశ్యతః

అక్రూరుడిట్లు పలికెను --- నేలపై గాని, ఆకాశమునందు గాని, నీటియందు గాని ఈ లోకములో ఎన్ని వింతలు గలవో, అవి అన్నీ జగద్రూపుడవగు నీయందే ఉన్నవి. నిన్ను విశేషముగా చూచుచున్న నేను చూడని వింత ఏమి ఉండును? (ఏదీ ఉండదు).

యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే ! తం త్వాఽనుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమిహాద్భుతమ్

ఓ పరబ్రహ్మా! వింతలన్నీ నీయందే ఉన్నవి. అట్టి నిన్ను నేను చూస్తూనే ఉన్నాను. ఇంక నేను ఈ లోకములో నేలపై గాని, నీటిలో గాని, ఆకాశములో గాని చూచే వింత ఏమి ఉండును? (ఏదీ ఉండదు).

ఇత్యు క్త్వా చోదయామాస స్యందనం గాందినీసుతః మథురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే

ఇట్లు పలికి గాందినీదేవి పుత్రుడగు అక్రూరుడు రథమును నడిపి, సాయంకాలమగుసరికి బలరామకృష్ణులను మథురకు తీసుకువచ్చెను.

మార్గే గ్రామజనా రాజంస్తత్ర తత్రోపసంగతాః వసుదేవసుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం న చాదదుః

ఓ పరీక్షిన్మహారాజా! మార్గములో అక్కడక్కడ గుమిగూడిన గ్రామములలోని జనులు వసుదేవుని పుత్రులిద్దరినీ చూచి సంతోషించిరి.పొరు తమ చూపును వారిద్దరి మీదనుండి మరల్చనే లేదు.

తావద్వజౌకసస్తత్ర నందగోపాదయోఽగ్రతః పురోపవనమాసాద్య ప్రతీక్షంతోఽవత స్థిరే

అంతలో నందగోపుడు మొదలైన గోకుల వాసులు వారికంటే ముందే అచటకు చేరి ఉద్యానవనమునందు ఉండి వారి కొరకు ఎదురు చూచిరి.

తాన్ సమేత్యాహ భగవాన క్రూరం జగదీశ్వరః గృహీత్వా పాణినా పొణిం ప్రశితం ప్రహసన్నివ

జగన్నాథుడగు శ్రీకృష్ణ భగవానుడు వారిని కలుసుకొనెను. అక్రూరుడు వినీతుడై నిలబడియుండెను. శ్రీకృష్ణుడు ఆయన చేతిని తన చేతితో పట్టుకొని చిరునవ్వుతో నిట్లనెను.

భవాన్ ప్రవిశతామగ్రే సహయానః పురీం గృహమ్ !

వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీమ్

నీవు రథముపై ముందు నగరమునకు వెళ్లి ఇంటికి చేరుకొనుము. మేమైతే బండ్ల నిక్కడ దించి తరువాత వెంటనే నగరమును చూచెదము.

అక్రూర ఉవాచ

నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల

అక్రూరుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! నీకు భక్తులపై ప్రేమ మెండు. నాకు రక్షకుడవు నీవే. మీరిద్దరు లేకుండా నేను మథురా నగరమును ప్రవేశించను. నేను నీ భక్తుడను. నన్ను విడిచి పెట్టుట నీకు తగదు.

ఆగచ్ఛ యామ గేహాన్నస్సనాథాస్ కుర్వధోక్షజ సహాగ్రజస్సగోపాలైస్సుహృద్భిశ్చ సుహృత్తమ

శ్రీకృష్ణా! నీ స్వరూపము ఇంద్రియగోచరము సర్వాతిశాయియగు హితము (మోక్షము) ను నీవు చేసెదవు. నీవు అన్నగారితో కూడి రమ్ము. గోపాలకులతో, మిత్రులతో కలిసి మా ఇంటికి వచ్చి మమ్ములను నాథుడు గలవారినిగా చేయుము.

పునీ హి పాదరజసా గృహాన్నో గృహమేధినామ్ యచ్ఛౌచే నానుతృప్యంతి పితరస్సాగ్నయస్సురాః

గృహస్థులమగు మా ఇంటిని నీ పాదధూళితో పవిత్రము చేయుము. నీ పాదములను కడిగిన నీటితో నీటితో పితృదేవతలు, అగ్నులు, దేవతలు అనుక్షణము తృప్తిని జెందెదరు.

అవనిజ్యాంఘ్రియుగలమాసీచ్ చ్లోక్యో బలిర్మహాన్ ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతినాం తు యా

మహాబలి నీ రెండు పాదములను కడిగి కీర్తించదగినవాడాయెను. అంతేగాక, ఆతడు సాటి లేని ఐశ్వర్యమును, నిష్కామభక్తులు పొందే సాయుజ్యమును కూడ పొందెను.

అపస్తేంఘ్ర్యవనేజన్య స్త్రీంల్లోకాఞ్ఛుచయోఽపునన్ ! శిరసాఽధత్త యాశ్శర్వస్స్వర్యాతాస్సగరాత్మజాః

నీ పాదములను కడిగిన జలములు పవిత్రములు. అవి ముల్లోకములను పావనము చేసినవి. వాటిని (గంగను) శివుడు తలపై దాల్చెను. వాటిచే సగరుని పుత్రులు స్వర్గమును పొందిరి.

దేవ దేవ జగన్నాథ పుణ్య శ్రవణ కీర్తన యదూత్తమోత్తమశ్లోక నారాయణ నమోఽస్తు తే

ఓ నారాయణా! దేవదేవుడవగు నీవే జగత్తును కాపాడెదవు. నీ లీలలను విని కీర్తించుటచే మానవుడు పవిత్రుడగును. యాదవశ్రేష్ఠుడవగు నీ కీర్తి ఉత్తమమైనది. నీకు నమస్కారమగుగాక

శ్రీభగవానువాచ

ఆయా స్యే భవతో గేహమహమార్యసమన్వితః యదుచక్రద్రుహం హత్వా వితరిష్యే సుహృత్ప్రియమ్

శ్రీ కృష్ణ భగవానుడిట్లు పలికెను --- నేను అన్నగారితో కలిసి మీ ఇంటికి వచ్చెదను. యదువంశీయులకు ద్రోహమును చేయుచున్న కంసుని వధించి మిత్రులకు ప్రీతిని కలిగించెదను.

శ్రీశుక ఉవాచ

ఏవముక్తో భగవతా సోఽక్రూరో విమనా ఇవ పురీం ప్రవిష్టః కంసాయ కర్మా వేద్య గృహం యయౌ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుడిట్లు చెప్పగా అక్రూరుని మనస్సు చెడిపోయినదా అన్నట్లు ఆయెను. ఆయన మథురా నగరమును ప్రవేశించి, కంసునకు కార్యమును విన్నవించి ఇంటికి వెళ్లెను.

అథాపరాహ్ణే భగవాన్ కృష్ణస్సంకర్షణాన్వితః మథురాం ప్రావిశద్గోపైర్దిదృక్షుః పరివారితః

తరువాత సాయంకాలము శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరమును చూడగోరి ఆ నగరములో ప్రవేశించెను. ఆయన వెంట బలరాముడు కూడ ఉండెను. గోపాలకులు ఆయనను చుట్టువారి యుండిరి.

దదర్శ తాం స్ఫాటికతుంగగోపురద్వారాం బృహద్ధేమకపాటతోరణామ్! తామ్రరకోష్ఠాం పరిఖాదురాసదాముద్యానరమ్యోపవనోపశోభితామ్

శ్రీకృష్ణుడు స్ఫటికములు పొదిగిన ఎత్తైన గోపురములు ద్వారములు కల ఆ నగరమును చూచెను. దాని బహిర్ద్వారమునకు పెద్ద బంగరు తలుపులు ఉండెను. రాగి, ఇత్తడిలతో చేసిన శాలలు గల ఆ నగరము చుట్టూ అగడ్త ఉండుటచే దానిని (అనుమతి లేకుండా) ప్రవేశించుట దుర్ఘటము. వెలుపల అడవులు, లోపల అందమైన ఉద్యానములు నగరమునకు శోభను చేకూర్చుచుండెను.

సౌవర్ణశృంగాటకహర్మ్యనిష్కు టైశ్శ్రేణీ సభాభిర్భవనైరుపస్కృతామ్ ! వైదూర్యవజ్రామలనీల విద్రుమైర్ముక్తాహరిద్భిర లభీషు వేదిషు

జుష్టేషు జాలాముఖరంధ్రకుట్టిమే - ష్వావిష్ట పారావతబర్హి నాదితామ్ సంసిక్తరథ్యాఽఽపణమార్గచత్వరాం ప్రకీర్ణచూల్యాంకురలాజతండులామ్

ఆ నగరములోని కూడళ్లు, ప్రాసాదములు, వాటి చుట్టూ ఉండే తోటలు, శిల్పకారులు కూర్చుండే సభలు, ఇతర భవనములు బంగరు వస్తువులతో అలంకారములాయెను. చంద్రశాలలు, అరుగులు, కిటికీలు, రాతి కట్టడపు నేలలయందు వైడూర్యములు, వజ్రములు, స్పటికములు, నీలమణులు, పగడములు, ముత్యములు, పచ్చలు పొదగబడెను. పావురములు, నెమళ్లు కిటికీ సందులలో, అరుగులపై కూర్చుని కూయుచుండెను. రథమార్గములు, బజారులు, నగరమునకు  కూడళ్లలో నీళ్లను చల్లి, పుష్పమాలలతో చిగుళ్లతో అలంకరించి, పేలాలను బియ్యమును మాంగళ్యము కొరకై చల్లిరి.

ఆపూర్ణకుంభైర్దధిచందనోక్షితైః ప్రసూనదీపావలిభిస్సపల్లవైః, సవృందరంభాక్రముకైస్సకేతుభిస్స్వలంకృత ద్వారగృహాం సపట్టికైః

ఆ నగరములోని ఇళ్ల ద్వారములకు రెండు వైపులా నిండా నీరు నింపిన కడవలనుంచి వాటిపై పెరుగును, చందనమును చల్లి చుట్టూ పుష్పమాలలతో, దీపముల వరుసలతో అలంకరించిరి. వాటి అంచులకు పట్టు వస్త్రములను చుట్టి పైన చిగుళ్లతో, పళ్ల గుత్తులు గల అరటి పోక మొక్కలతో కూడ అలంకరించిరి. వాటికి ప్రక్కన జెండాలనలంకరించిరి.

తాం సంప్రవిష్టౌ వసుదేవనందనౌ వృతౌ వయస్యైర్నర దేవవర్త్మనా ద్రష్టుం సమీయుస్త్వరితాః పురస్త్రియో హర్మ్యాణి చైవారురుహుర్నృపోత్సుకాః

ఓ పరీక్షిన్మహారాజా! మిత్రులు చుట్టువారి రాగా వసుదేవుని పుత్రులగు బలరాసుకృష్ణులు రాజమార్గము గుండా ఆ నగరమును ప్రవేశించిరి.

నగర స్త్రీలు వారిని చూడాలనే ఉత్సాహముతో గుమిగూడి వేగముగా ప్రాసాదముల పైకి ఎక్కిరి.

కాశ్చీద్విపర్యగ్ధృతవస్త్రభూషణా విస్మృత్య చైకం యుగలేష్వథాపరాః, కృతైకపత్రశ్రవణైకనూపురా నాంక్త్వా ద్వితీయం త్వపరాశ్చ లోచనమ్

కొందరు స్త్రీలు (శ్రీకృష్ణుని చూడాలనే కంగారులో) వస్త్రములను (క్రిందిది పైన, పైది క్రింద), ఆభరణములను (కాలిది చేతికి, చేతిది కాలికి) తల్లక్రిందులుగా ధరించిరి. కొందరు జంట నగలలో ఒక్కొక్క దానిని మాత్రమే, అనగా ఒకే చెవికి ఆభరణమును, ఒకే కాలికి అందెను ధరించి వచ్చిరి. మరికొందరైతే ఒకే కంటికి కాటుకను పెట్టుకొనిరి.

అశ్నంత్య ఏకాస్తదపాస్య సోత్సవా అభ్యజ్యమానా అకృతోపమజ్జనాః స్వపంత్య ఉత్థాయ నిశమ్య నిస్స్వనం ప్రపాయయంత్యోఽర్భమపోహ్య మాతరః

అన్నము తినుచున్నవారు కోలాహలమును విని శ్రీకృష్ణుని చూడాలనే ఉత్సాహముతో విడిచి పెట్టి వచ్చిరి. అభ్యంగనము చేయుచున్నవారు పూర్తిగా స్నానము చేయకుండా, నిద్రిస్తున్నవారు నిద్ర లేచి, పిల్లలకు పాలిచ్చుచున్న తల్లులు పిల్లలను విడిచి పెట్టి వచ్చిరి.

మనాంసి తాసామరవిందలోచనః ప్రగల్భలీలాహసితావలోకనైః,

జహార మత్తద్విరదేంద్రవిక్రమో దృశాం దదచ్ఛ్రీరమణాత్మనోత్సవమ్

పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణుడు మదించిన గజేంద్రుని వలె ఠీవిగా నడచును. ఆయన చతురమగు విలాసతో, నవ్వుతో, చూపులతో, లక్ష్మీదేవిని సైతము రమింపజేసే దేహముతో ఆ యువతుల కన్నులకు పండుగను చేస్తూ వారి మనస్సులను దోచివేసెను.

దృష్ట్వా ముహుశ్శ్రుతమనుద్రుతచేతసస్తం తత్ప్రేక్షణోత్స్మి తసుధోక్షణ లబ్ధమానాః ఆనందమూర్తిముపగుహ్య దృశ్వాఽఽత్మలబ్ధం హృష్యత్త్వచో జహురనంతమరిందమాధిమ్

శత్రువులను నిగ్రహించిన ఓ పరీక్షిన్మహారాజా! ఆ పలుమార్లు శ్రీకృష్ణుని గురించి వినియుండుటచే, వారి మనస్సు ఆయనయందు లగ్నమై యుండెను. ఇపుడాయనను వారు చూచిరి.ఆయన గొప్ప చూపుతో కూడిన నవ్వు అనే అమృతమును వారిపై కురిపించి వారిని సత్కరించెను. వారు చూపుతో ఆ ఆనందమూర్తిని అంతఃకరణములో స్థాపించి కౌగిలించిరి. దానితో వారికి దేహమంతా గగుర్పాటు కలిగినది. వారు ఆయనను చూడలేకపోతిమనే అంతు లేని మనోవ్యాధిని విడిచి పెట్టిరి.

ప్రాసాదశిఖరారూఢాః ప్రీత్యుత్ఫుల్లముఖాంబుజాః అభ్యవర్షన్ సౌమనస్యైః ప్రమదా బల కేశవౌ

ప్రేమతో వికసించిన పద్మమువంటి ముఖములు సుందరయుపతులు ప్రాసాదముల పైకి ఎక్కి బలరాముని, శ్రీకృష్ణ భగవానుని బుట్టెడేసి పువ్వులను చల్లి ముంచెత్తిరి.

 దద్యక్ష తైస్సోదపాత్రై స్స్రగ్గం ధైరభ్యుపాయనైః తావానర్చుః ప్రముదితాస్తత్ర తత్ర ద్విజాతయః

చాల ఆనందపడిన వేదవేత్తలు అక్కడక్కడ పెరుగును, అక్షతలను, పూర్ణకుంభములను, పూల మాలలను, చందనమును, బహుమతులను (పళ్లను) సమర్పించి వారిద్దరిని పూజించిరి.

ఊచుః పౌరా అహో గోప్యస్తపః కిమచరన్మహత్ ! యా హ్యేతావను పశ్యంతి నరలోకమహోత్సవౌ

ఆహా! గోపికలేమి తపస్సును చేసిరో? ఎందుకంటే, మానవలోకమునకే కన్నులకు పండువయైన వీరిద్దరిని వారు ప్రతి క్షణము చూచుచుందురు,,అని నగరమునందలి యువతులు చెప్పుకొనిరి.

రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజః దృష్ట్వాఽయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ

బట్టలకు రంగులను వేసే ఒక చాకలి వచ్చుచుండెను. గదుని (వసుదేవుని పుత్రులలో ఒకడు) తమ్ముడగు శ్రీ కృష్ణుడు వానిని చూచి ఉతికిన మిక్కిలి శ్రేష్ఠమగు వస్త్రములను కోరెను.

 దేహ్యావయోస్సముచితాన్యంగ వాసాంసి చార్హతోః భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయః

ఓయీ! మేమిద్దరము చక్కని వస్త్రములకు తగ్గవారము. మాకట్టి వస్త్రములనిమ్ము. మాకిచ్చినచో నీకు గొప్ప శ్రేయస్సు కలుగగలదు. ఈ విషయములో సందేహము వలదు.

స యాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః సాక్షేపం రుషితః ప్రాహ భృత్యో రాజ్ఞస్సుదుర్మదః

ఆతడు కంసరాజునకు సేవకుడు, బాగా గర్వించి యున్నవాడు. అన్ని విధములుగా పరిపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుడీ విధముగా కోరగా, ఆతడు కోపించి నిందాపూర్వకముగా ఇట్లు పలికెను.

ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనే చరాః పరిధత్త కిముద్వృత్తా రాజద్రవ్యాణ్య భీప్సథ

ఓయీ! మీరు సదాచారమును విడిచి పెట్టి రాజు యొక్క వస్తువులను కోరుచున్నారు. నిత్యము కొండలపై అడవులలో తిరిగే మీరు ఇట్టి వస్త్రములనే ధరించెదరా?

యాతాశు బాలిశా మైవం ప్రార్థ్యం యది జిజీవిషా ! బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై

ఓ అజ్ఞానులారా! తొందరగా వెళ్లుడు. మీకు బ్రతకాలని ఉంటే ఇట్టి కోరికలు కోరకుడు. గర్వించిన వ్యక్తిని రాజభటులు రాజభటులు నిశ్చితముగా బంధించి, కొట్టి, వాని సంపదను లాగుకొనెదరు.

ఏవం వికత్థమానస్య కుపితో దేవకీసుతః రజకస్య కరాగ్రేణ శిరః కాయాదపాతయత్

శ్రీకృష్ణుడు కోపించినవాడై ఈ విధముగా బీరములు పలుకుచున్న ఆ చాకలివాని తలను చేతి గోటితో మొండెమునుండి వేరు చేసి పడవేసెను.

తస్యానుజీవినస్సర్వే వాసఃకోశాస్ విసృజ్య వై దుదువుస్సర్వతో మార్గం వాసాంసి జగృహేఽచ్యుతః

వాని జీతగాళ్లందరు వస్త్రముల మూటలను విడిచి పెట్టి దారికి అన్ని వైపులా పరుగెత్తిరి. శ్రీకృష్ణ భగవానుడు వస్త్రములను తీసుకొనెను.

వసిత్వాఽఽత్మప్రియే వస్త్రే కృష్ణస్సంకర్షణస్తథా శేషాణ్యాదత్త గో పేభ్యో విసృజ్య భువి కానిచిత్

శ్రీకృష్ణుడు మరియు బలరామదేవుడు తమకు నచ్చిన వస్త్రముల జతలను కట్టుకొని, మిగిలిన వాటిని గోపాలకులకు ఇచ్చిరి. కొన్నింటిని నేలపై విడిచి పెట్టి వెళ్లిరి.

తతస్తు వాయకః ప్రీతస్తయోర్వేషమకల్పయత్ !

ఏచిత్రషర్ణై శ్చైలేయైరాక ల్పైరనురూపతః

తరువాత ఒక బట్టలను వేయువాడు. వారిద్దరినీ చూచి సంతోషించి నంగు రంగుల వస్త్రములతో కుట్టిన అలంకారములతో నార రూపుకు తగ్గట్లుగా వేషమును ఏర్పాటు చేసెను.

నానాలక్షణ వేషాభ్యాం కృష్ణ రామౌ విరేజతుః స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ

శ్రీకృష్ణ బలరాములు అనేక విధముల వేషములతో అలంకరించబడినవారై, ఉత్సవమునందలి నలుపు - తెలుపు జంట ఏనుగు గున్నలవలె విశేషముగా ప్రకాశించిరి.

తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్సారూప్యమాత్మనః శ్రియం చ పరమాం లోకే బలైశ్వర్యస్మృతీంద్రియమ్

ప్రసన్నుడైన భగవానుడు వానికి ఇహలోకమునందు సర్వోత్తమమైన సంపదను,ఈశ్వరభావమును, జన్మయొక్క స్మరణమును, ఇంద్రియశక్తిని, మరణించిన తరువాత తనతో సషూనమైన రూపమును కూడ అనుగ్రహించెను.

తతస్సుదామ్నే భవనం మూలాకారస్య జగ్మతుః తౌ దృష్ట్వా స సముత్థాయ ననామ శిరసా భువి

తరువాత వారిద్దరు మాలలను తయారు చేసే సుదాముని ఇంటికి వెళ్లిరి. వారిని చూసి ఆతడు నిలబడి తరువాత సాష్టాంగ ప్రణామమును చేసెను.

తయోరాసనమానీయ పాద్యం చార్ఘ్యార్హణాదిభిః పూజాం సానుగయోశ్చక్రే స్రక్తాంబూలానులేపనైః

ఆతడు వారిద్దరికి వారి అనుచరులకు కూడ కాళ్లను కడుగుకొనే నీటిని, త్రాగే నీటిని తెచ్చి ఇచ్చెను. తరువాత ఆసనము, పూల మాలలు, తాంబూలము, చందన లేపనము, ఆహారము మొదలగు ద్రవ్యములతో వారికి పూజను చేసెను.

ప్రాహ నస్సార్ధకం జన్మ పావితం చ కులం ప్రభో పితృదేవర్షయో మహ్యం తుష్టా హ్యాగమనేన వామ్

ఆతడిట్లు పలికెను  -  ఓ ప్రభూ! మీ యిద్దరి రాకచే మా జన్మ, కులము        కూడ పవిత్రమైనవి. పితృదేవతలు, దేవతలు, మహర్షులు నా యెడల నిశ్చయముగా సంతుష్టులైనారు.

భపంతౌ కిల విశ్వస్య జగతః కారణం పరమ్ అవతీర్ణానిహాం తేన క్షేమాయ చ భవాయ చ

మీరిద్దరు సకలజగత్తునకు పరమకారణము గదా! మీరు జనుల క్షేమము కొరకు, అభ్యుదయము లోకమునందు పూర్ణరూపముతో అవతరించినారు.

న హి వాం విషమా దృష్టిస్సుహృదోర్జగదాత్మనోః సమయోస్సర్వభూతేషు భజంతం భజతోరపి

మీరు ప్రేమించువానిని ప్రేమించెదరు. కాని, మీయందు విషమదృష్టి లేదు. మీరు జగత్తునకు ఆత్మరూపులు, హితకారులు. మీరు సకలప్రాణులయందు సమచిత్తమును కలిగియుందురు.

తావాజ్ఞాపయతం భృత్యం కీమహం కరవాణి వామ్ పుంసోఽత్యసుగ్రహో హ్యేష భవద్భిర్యన్నియుజ్యతే

అట్టి (ఆత్మరూపులైన) మీ ఇద్దరు సేవకుడనగు నన్ను ఆదేశించుడు. నేను మీకు చేయదగినది ఏమున్నది? మీచే నియోగించబడుట మానవునకు అతిశయించిన అనుగ్రహమే.

ఇత్యభిప్రేత్య రాజేంద్ర సుదామా ప్రీతమానసః శస్తైస్సుగంధైః కుసుమైర్మాలా విరచితా దదౌ

ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా వారి అభిప్రాయమును తెలుసుకొని సుదాముని మనస్సు ప్రీతిని జెందెను. ఆతడు వారికి ప్రశస్తమైన పూలతో తయారైన పరిమళభరితమగు మాలలను ఇచ్చెను.

తాభిస్స్వలంకృతౌ ప్రీత్ కృష్ణ రామౌ సహానుగౌ ప్రణతాయ ప్రపన్నాయ దదతుర్వరదౌ వరాన్

ఆ బలరామకృష్ణులు అనుచరులతో కుడి వాటితో చక్కగా  అలంకరించుకొని సంతోషించిరి. ప్రణమిల్లి శరణు వేడిన సుదాముని కొరకు వరప్రదాతలగు వారిద్దరు వరములనిచ్చిరి.

సోఽపి వవ్రేఽచలాం భక్తిం తస్మిన్నేవాఖిలాత్మని తద్బ క్తేషు చ సౌహార్దం భూతేషు చ దయాం పరామ్

ఆ సుదాముడున్నూ సకల ప్రాణులలో ఆత్మరూపుడుగానుండే ఆ శ్రీకృష్ణునియందే దృఢమగు భక్తిని, ఆయనయొక్క భక్తులయందు మైత్రిని, ప్రాణులపై నిష్కారణమైన దయను కూడ వరములుగా కోరెను.

ఇతి తస్మై వరం దత్త్వా శ్రియం చాన్వయవర్ధినీమ్ బలమాయుర్యశః కాంతిం నిర్జగామ సహాగ్రజః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే ఏకచత్వారింశోకధ్యాయః

ఈ విధముగా శ్రీకృష్ణుడు వానికి వంశపరంపరతో బాటు వర్ధిల్లే ఆయుర్దాయమును, కీర్తిని, తేజస్సును వరములుగా నిచ్చి, అన్నగారితో కలిసి అక్కడనుండి నిష్క్రమించెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో శ్రీకృష్ణుడు

మథురలో ప్రవేశించి మాలాకారుని అనుగ్రహించుటను వర్ణించే

నలుబది ఒకటవ అధ్యాయము ముగిసినది (41).