68 - సాంబుని వివాహము

శ్రీశుక ఉవాచ

దుర్యోధనసుతాం రాజన్ లక్ష్మణాం సమితింజయః

స్వయంవరస్థామహరత్సాంబో జాంబవతీసుతః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! జాంబవతి పుత్రుడగు సాంబుడు యుద్ధములో జయించే స్వభావము గలవాడు. దుర్యోధనుని కుమార్తెయగు లక్ష్మణ స్వయంవరమునందుండగా, ఆయన ఆమెను తీసుకుపోయెను.

కౌరవాః కుపితా ఊచుర్దుర్వినీతోఽయమర్భకః

కదర్థీకృత్య నః కన్యామకామామహరద్బలాత్

కౌరవులు కోపించి ఇట్లనిరి --- ఈ బుడతడు పొగరుమోతు. మనలను తిరస్కరించి తనను ప్రేమించని కన్యను బలాత్కారముగా తీసుకు వెళ్లినాడు.

బధ్నీతేమం దుర్వినీతం కిం కరిష్యంతి వృష్ణయః

 యేఽస్మత్ప్రసాదోపచితాం దత్తాం నో భుంజతే మహీమ్

ఈ పొగరుమోతును బంధించుడు. యాదవులేమీ చేయగలరు? వారు మన ఈయబడి మన అనుగ్రహముచే వర్ధిల్లజేయబడిన రాజ్యముననుభవించుచున్నారు.

నిగృహీతం సుతం శ్రుత్వా యద్యేష్యంతీహ వృష్ణయః

భగ్నదర్పాశ్శతం యాంతి ప్రాణా ఇవ సుసంయతాః

తమ కొడుకు బంధించబడినాడని విని యాదవులు ఇక్కడకు వచ్చే పక్షములో మనము వారి గర్వమునడంచెదము. అప్పుడు వారు ప్రాణా యామాదులచే నియంత్రించబడిన ఇంద్రియములు వలె చల్లబడెదరు.

ఇతి కర్ణశ్శలో భూరిర్యజ్ఞకేతుస్సుయోధనః

సాంబమారేభిరే బద్ధుం కురువృద్ధానుమోదితాః

ఈ విధముగా తలచి కురువృద్ధుల అనుమతిని పొంది కర్ణుడు, శలుడు, భూరిశ్రవసుడు, యజ్ఞకేతువు, దుర్యోధనుడు సాంబుని బంధించే ప్రయత్నమునారంభించిరి.

దృష్ట్వాఽనుధావతస్సాంబో ధార్తరాష్ట్రాన్మహారథః

ప్రగృహ్య రుచిరం చాపం తస్థౌ సింహ ఇవైకలః

ధృతరాష్ట్రుని పుత్రులు తన వెంట తరుముటను చూచి మహారథియగు సాంబుడొక్కడే అందమైన ధనుస్సును పట్టుకొని సింహము వలె నిలిచెను.

తం తే జీఘృక్షవః క్రుద్ధాస్తిష్ఠ తిష్ఠేతి భాషిణః

ఆసాద్య ధన్వినో బాణైః కర్ణాగ్రణ్యస్సమాకిరన్

కోపించిన ఆ ధనుర్దారులకు కర్ణుడు నాయకుడు. వారాతనిని బంధించ గోరి, నిలు నిలు అంటూ దగ్గరకు వచ్చి బాణములతో ముంచెత్తిరి.

సోఽపవిద్ధః కురుశ్రేష్ఠ కురుభిర్యదునందనః

నామృష్యత్తదచింత్యార్భస్సింహః క్షుద్రమృగైరీవ

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అల్పమృగములు సింహమును వలె, కౌరవులు ఆతనిని అన్యాయముగా కొట్టిరి. యాదవవం శమునానందింపజేసే ఆ సాంబుడు ఇంద్రియగోచరము కాని స్వరూపము గల శ్రీకృష్ణుని పుత్రుడు. ఆతడు వారి ఆ చేష్టను సహించి ఊరుకోలేదు.

విస్ఫూర్ట్య రుచిరం చాపం సర్వాన్ వివ్యాధ సాయ కైః

కర్ణాదీన్ షడ్రథాన్ వీరాంస్తావద్భిర్యుగపత్పృథక్

ఆతడు అందమైన ధనుస్సును టంకారము చేసి కర్ణుడు, భీష్ముడు మొదలైన వీరులందరిని, వారి ఆరు రథములను ఒకేసారి వేర్వేరుగా అంతే సంఖ్యలో బాణములతో కొట్టెను.

చతుర్భిశ్చతురో వాహానే కైకేన చ సారథీన్

 రథినశ్చ మ హేష్వాసాంస్తస్య తత్తేఽభ్యపూజయన్

ఆతడు గొప్ప ధనుస్సు గల రథికులను, ఒక్కొక్క బాణముతో వారి సారథులను, నాలుగు బాణములతో నాలుగు గుర్రములను కొట్టెను. ఆతని ఆ చాతుర్యమును వారు కొనియాడిరి.

తం తు తే విరథం చక్రుశ్చత్వారశ్చతురో హయాన్

ఏకస్తు సారథిం జఘ్నే చిచ్ఛేదాన్యశ్శరాసనమ్

వారందరు కలిసి సాంబుని రథము లేనివానినిగా చేసిరి. వారిలో నలుగురు నాలుగు గుర్రములను, ఒకడు సారథిని కొట్టిరి. ఆరో వాడు ధనుస్సును విరుగకొట్టెను.

తం బద్ద్వా వీరథీకృత్య కృచ్ఛ్రేణ కురవో యుధి

కుమారం స్వస్య కన్యాం చ స్వపురం జయినోఽవిశన్

యుద్దములో కౌరవులు ఆ సాంబుని కష్టముతో రథహీనుని చేసి విజయమును పొందిరి. అప్పుడు దుర్యోధనుడు సాంబకుమారుని, తన కుమార్తెను కూడ తీసుకొని తన నగరమును ప్రవేశించెను.

తచ్ఛ్రుత్వా నారదోక్తేన రాజన్ సంజాతమన్యవః

కురూన్ ప్రత్యుద్యమం చక్రురుగ్ర సేనప్రచోదితాః

ఓ పరీక్షిన్మహారాజా! నారదుడు చెప్పగా సాంబుని ఆ వృత్తాంతమును విని యాదవులు చాల కోపించిరి. ఉగ్ర సేనమహారాజుచే ప్రేరితులై వారు కౌరవుల పై యుద్ధమునకు సన్నద్ధులైరి.

సాంత్వయిత్వా తు తాన్ రామస్సన్నద్ధాన్ వృష్టి పుంగవాన్

నైచ్ఛత్కురూణాం వృష్టీనాం కలిం కలిమలాపహః

కలిదోషమును పోగొట్టే బలరాముడైతే కౌరవయాదవకలహమును ఇష్ట పడలేదు. ఆయన యుద్ధసంసిద్ధులైన ఆ యాదవశ్రేష్ఠులకు నచ్చజెప్పెను.

జగామ హాస్తినపురం రథేనాదిత్యవర్చసా

 బ్రాహ్మణైః కులవృద్ధైశ్చ వృతశ్చంద్ర ఇవ గ్రహైః

చంద్రుని గ్రహములు వలే, బ్రాహ్మణులు వంశములోని పెద్దలు చుట్టువారి రాగా, బలరాముడు సూర్యుడు వలే వెలిగిపోయే రథము పై హస్తినాపురమునకు వెళ్లాను.

గత్వా గజాహ్వయం రామో బాహ్యోపవనమాస్థితః

ఉద్ధవం ప్రెషయామాస ధృతరాష్ట్రం బుభుత్సయా

బలరాముడు హస్తినాపురమునకు వెళ్లి నగరమునకు బయట ఉద్యానములో నుండెను. కౌరవుల అభిప్రాయమును తెలియగోరి ఆయన ఉద్ధవుని ధృతరాష్ట్రుని వద్దకు దూతగా పం పెను.

సోఽభివంద్యాంబికాపుత్రం భీష్మం ద్రోణం చ బాహ్లికమ్

దుర్యోధనం చ విధివద్రామమాగతమబ్రవీత్

ఆ ఉద్దవుడు అంబిక పుత్రుడగు ధృతరాష్ట్రునకు, భీష్ణద్రోణబాహ్లికులకు, దుర్యోధనునకు కూడ యథావిధిగా నమస్కరించి, బలరాముడు వచ్చియున్నాడని చెప్పెను.

తేఽతీప్రీతాస్తమాకర్ణ్య ప్రాప్తం రామం సుహృత్తమమ్

తమర్చయిత్వాఽభియయుస్సర్వే మంగలపాణయః

అతీశయించి హీతకారియగు బలరాముడు వచ్చినాడని విని ఆ కౌరవులందరు గొప్ప ప్రీతిని పొందిరి. వారు ఆ ఉద్ధవుని సత్కరించి, మంగళద్రవ్యములను చేతబట్టుకొని బలరామునకు ఎదు రేగిరి.

తం సంగమ్య యథాన్యాయం గామర్ఘ్యం చ న్యవేదయస్

తేషాం యే తత్ప్రభావజ్ఞాః ప్రణేముశ్శిరసా బలమ్

వారు బలరాముని వయస్సు మొదలైన సందర్భములకు తగ్గట్లుగా కలుసుకొని సత్కారముగా గోవును, స్వచ్చమగు జలమును నివేదించిరి. వారిలో ఆయన మహిమ తెలిసినవారు తల వంచి నమస్కరించిరి..

బంధూన్ కుశలినశ్శ్రుత్వా పృష్ట్వా శివమనామయమ్

పరస్పరమథో రామో బభాషేఽవిక్లవం వచః

బంధువులు క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని విని, ఒకరినొకరు మంగళకుశలప్రశ్నలను వేసిరి. తరువాత బలరాముడు దైన్యము లేని వచనమునిట్లు పలికెను.

ఉగ్ర సేనః క్షితీ శేశో యద్వ ఆజ్ఞాపయత్ప్రభుః

 తదవ్యగ్రధియశ్శ్రుత్వా కురుధ్వం మా విలంబితమ్

సర్వసమర్థుడగు ఉగ్ర సేనుడు రాజాధిరాజు. ఆయన మీకు దేనిని ఆజ్ఞాపించెనో దానిని ఏకాగ్రచిత్తులై విని శీఘ్రముగా అమలు చేయుడు.

యద్యూయం బహవస్త్వేంకం జిత్వాఽధర్మేణ ధార్మికమ్

అబధ్నీతాథ తన్మృష్యే బంధూనా మైక్యకామ్యయా

మీరు చాలమంది ఒంటరియగు సాంబుని అధర్మముగా జయించి బంధించినారు. ఆతడు . కన్యను తీసుకువెళ్లుట క్షత్రీయోచితధర్మమే. అయినప్పటికీ, బంధువులు కలిసి మెలిసి ఉండాలనే కోరికచే మీరు చేసిన ఆ పనిని సహించుచున్నాను.

వీర్యశౌర్యబలోన్నద్ధమాత్మశక్తిసమం వచః

కురవో బలదేవస్య నిశమ్యాచుః ప్రకోపితాః

బలదేవుని వచనము పరాక్రమము, ఉత్సాహము, బలములచే నిరంకుశమై తన శక్తికి తగ్గట్లుగానుండెను. దానిని విని కౌరవులు చాల కోపించి ఇట్లు పలికిరి.

అహో మహచ్చిత్రమిదం కాలగత్యా దురత్యయా

ఆరురుక్షత్యుపాన ద్వై శిరో ముకుట సేవితమ్

ఆహా! ఎంత పెద్ద చిత్రమో! కాలముయొక్క గతిని అతిక్రమించుట శక్యము కాదు. కిరీటముచే సేవించబడే తలను నిశ్చయముగా పాదరక్ష అధిష్టించ గోరు చున్నది.

ఏతే యౌనేన సంబద్దాస్సహశయ్యాఽఽసనాశనాః

వృష్ణయస్తుల్యతాం నీతా అస్మద్దత్తనృపాసనాః

కుంతీవివాహముతో మాకీ యాదవులతో సంబంధమేర్పడినది. మేము వారితో కలిసి భుజించి కూర్చుని నిద్రించితిమి. వీరికి రాజసింహాసనమును మేమే ఇచ్చితిమి. ఈనాడు వీరు మాతో సమానస్థాయిని పొందించబడిరి.

చామరవ్యజనే శంఖమాతపత్రం చ పాండురమ్

కిరీటమాసనం శయ్యాం భుంజంత్యస్మదు పేక్షయా

మనము పట్టించుకోకపోవుట చేతనే వీరు వింజామరల జంట, శంఖము, తెల్లని గొడుగు, కిరీటము అనే రాజచిహ్నములను, మహారాజుకు తగ్గ ఆసనమును, శయ్యను ఉపభోగించుచున్నారు.

అలం యదూనాం నర దేవలాంఛనైః

దాతుః ప్రతీ పైః ఫణినామీవామృతమ్

యేఽస్మత్ప్రసాదోపచితా హి యాదవా

ఆజ్ఞాపయంత్యద్య గతత్రపా బత

పాములకు పాలు పోస్తే అవి పోసేవానిపై పగ పట్టును. అదే విధముగా, రాజచిహ్నములనిచ్చిన మనకు యాదవులు శత్రువులైనారు. మన అనుగ్రహముచే పైకి వచ్చిన యాదవులీ నాడు సిగ్గు విడిచి మనలనాజ్ఞాపించుచున్నారు. ఏమి దురదృష్టము!

కథమింద్రోఽపి కురుభిర్భీష్మద్రోణార్జునాదిభిః

అదత్తమవరుంధీత సింహగ్రస్తమివోరణః

సింహము వేటాడినదానిని పొట్టేలు ఎట్లు తినగలదు? అదే విధముగా, భీష్ణుడు, ద్రోణుడు, అర్జునుడు, కర్ణుడు మొదలైన కౌరవులు ఈయకుండా ఇంద్రుడైనా దేనినైననూ ఎట్లు ఉపభోగించగల్గును? (ఉపభోగించలేడు).

శ్రీశుక ఉవాచ

జన్మబంధుశ్రియోన్నద్ధమదాస్తే భరతర్షభ

ఆశ్రావ్య రామం దుర్వాచ్యమసభ్యాః పురమావిశన్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ దుష్టకౌరవులు తమది గొప్ప వంశమని, తమకు భీష్ముడు మొదలగు గొప్పవారు బంధువులని, తమకు సంపద గలదని ఉత్కటమైన గర్వము కలిగియుండిరి. వారు పలుకకూడని పలుకులను బలరామునకు వినిపించి తమ నగరమునకు తిరిగి వెళ్లిరి.

దృష్ట్వా కురూణాం దౌశ్శీల్యం శ్రుత్వాఽవాచ్యాని చాచ్యుతః

అవోచత్కోపసంరబ్ధో దుష్ప్రేక్ష్యః ప్రహసన్ముహుః

బలరామ భగవానునకు కౌరవుల దుష్టత్వమును చూచి, పలుకరాని పలుకులను కూడ విని నిండా కోపము వచ్చెను. ఆయనను చూడ శక్యము కాకుండెను. ఆయన పలుమార్లు గట్టిగా నవ్వుతూ ఇట్లు పలికెను.

నూనం నానామదోన్నద్ధాశ్శాంతిం నేచ్చంత్యసాధవః

తేషాం హి ప్రశమో దండః పశూనాం లగుడో యథా

పలురకముల గర్వముతో పొగ రెక్కిన దుష్టులు శాంతిని కోరరు. ఇది నిశ్చయము. పశువులకు కట్టె వలె, శిక్షయే వారి పొగరును శాంతింప జేయును.

అహో యదూన్ సుసంరబ్ధాన్ కృష్ణం చ కుపితం శనైః

సాంత్వయిత్వాఽహమేతేషాం శమమిచ్ఛన్నిహాగతః

ఆహా! చాల కోపించిన యాదవులకు, కోపించిన కృష్ణునకు కూడ మెల్లగా నచ్చజెప్పి నేను వీరికి సుఖశాంతులను కోరి ఇక్కడకు వచ్చితిని.

త ఇమే మందమతయః కలహాభిరతాః ఖలాః

తం మామవజ్ఞాయ ముహుర్దుర్భాషాన్మానినోఽబ్రువన్

అట్టి వీరు మందబుద్దులు, కలహప్రియులైన దుష్టులు. అట్టి (శాంతి కోరే) నన్నీ దురహంకారులు తిరస్కరించి పలుమార్లు దుర్భాషలాడిరి.

నోగ్ర సేనః కిల విభుర్బోజవృష్ణ్యంధకేశ్వరః

 శక్రాదయో లోకపాలా యస్యా దేశానువర్తినః

భోజవృష్టి-అంధకవంశీయులగు యాదవులకు శాసకుడగు ఉగ్రసేనుడు రాజాధిరాజు కాడా? (అవును). ఇంద్రుడు, అగ్ని మొదలైన లోకపాలకులు ఆయన ఆదేశమును పాలించెదరు.

సుధర్మాఽఽక్రమ్యతే యేన పారిజాతోఽమరాంఘ్రిపః

ఆనీయ భుజ్యతే సోఽసౌ న కీలాధ్యాసనార్హణః

శ్రీకృష్ణుడు సుధర్మ అనే దేవసభను స్వాధీనము చేసుకొని, పారిజాతమనే స్వర్గమునందలి వృక్షమును తెచ్చి భోగించుచున్నాడు. ఆతడు రాజసింహాసనమునకు అర్హుడు కాడా? (అర్హుడే).

యస్య పాదయుగం సాక్షాచ్ఛ్రీరుపాస్తేఽఖిలేశ్వరీ

స నార్హతి కిల శ్రీశో నర దేవపరిచ్చదాన్

శ్రీకృష్ణ భగవానుని పాదముల జంటను సాక్షాత్తు సర్వేశ్వరియగు లక్ష్మీదేవి ఉపాసించును. ఆ లక్ష్మీపతి ఛత్రచామరాది రాజమర్యాదలకు తగడా? (అర్హుడే).

యస్యాంఘ్రిపంకజరజోఽఖిలలోకపాలైః

మౌల్యుత్తమైర్ధృతముపాసితతీర్థతీర్థమ్

బ్రహ్మా భవోఽహమపి యస్య కలాః కలాయాః

శ్రీశ్చోద్వ హేమ చిరమస్య నృపాసనం క్వ

శ్రీకృష్ణ భగవానుని పద్మములవంటి పాదముల ధూళిని సకలలోకపాలకులు కిరీటములతో కూడిన శిరస్సులపై ధరించెదరు. బ్రహ్మదేవుడు, శివుడు, నేను కూడ ఆయన అంశయగు హిరణ్యగర్బుని అంశలము. భక్తులచే సేవించబడే గంగాదితీర్థములను కూడ పావనము చేసే ఆ ధూళిని మేము, లక్ష్మీదేవి కూడ చిరకాలము ధరించెదము. అట్టి ఆయనకు తగిన రాజసింహాసనము ఎక్కడనున్నది? (లేనే లేదు).

భుంజతే కురుభిర్దత్తం భూఖండం వృష్ణయః కిల

 ఉపానహః కిల వయం స్వయం తు కురవశ్శిరః

యాదవులు కౌరవులిచ్చిన చిన్న రాజ్యమునుపభోగించుచున్నారా ? మేము పాదరక్షలమా? కౌరవులు స్వయముగా (మేము ఎక్కిన) శిరసా ?

అహో ఐశ్వర్యమత్తానాం మత్తానామివ మానినామ్

 అసంబద్ధా గిరో రూక్షాః కస్స హేతానుశాసితా

ఆశ్చర్యము! సంపదచే గర్వించిన దురభిమానులు నిషాలో ఉన్నవారు వలె, సందర్భశుద్ధి లేని పరుషవచనములను పలి కెదరు. శిక్షించే సామర్థ్యము గల ఎవడు అట్టి మాటలను సహించును? (సహించడు),

అద్య నిష్కౌరవీం పృథ్వీం కరిష్యామీత్యమర్షితః

గృహీత్వా హలముత్తస్థౌ దహన్నివ జగత్త్రయమ్

ఈనాడీ భూమిపై కౌరవులు లేకుండా చేస్తాను, అంటూ బలరాముడు కోపముతో నాగలి పట్టి, ముల్లోకములను దహిస్తాడా యన్నట్లు లేచి నీలబడెను.

లాంగలాగ్రేణ నగరముద్విదార్య గజాహ్వయమ్

విచకర్ష స గంగాయాం ప్రహరీష్యన్నమర్షితః

కోపించిన ఆ బలరాముడు నాగేటి చాలు కొనతో హస్తినాపురమనే నగరమును గంగలో పారవేయబోవువాడై ఊడబెరకి లాగేను.

జలయానమివాఘూర్ణం గంగాయాం నగరం పతత్

ఆకృష్యమాణమాలోక్య కౌరవా జాతసంభ్రమాః

బలరాముడు లాగుచుండగా ఆ నగరము పడవవలె అల్లల్లాడుతూ గంగలో పడుచుండెను. దానిని చూచి కౌరవులు కంగారుతో భయపడిరి.

తమేవ శరణం జగ్ముస్సకుటుంబా జిజీవిషవః

సలక్ష్మణం పురస్కృత్య సాంబం ప్రాంజలయః ప్రభుమ్

వారు జీవించగోరి లక్ష్మణను, సాంబుని ఎదురుగా నిడుకొని కుటుంబములతో సహా సర్వసమర్థుడగు ఆ బలరామునే శరణు వేడిరి.

రామ రామాఖిలాధార ప్రభావం న విదామ తే

మూఢనాం నః కుబుద్ధీనాం క్షంతుమర్హస్యతిక్రమమ్

ఓ బలరామా! రామా! సర్వమునకు ఆధారము నీవే. మేము మోహము ను పొందిన దుర్బుద్ధులము, నీ మహిమను తెలియలేకపోతిమి. మా అపరాధమును నీవు క్షమించ తగుదువు.

స్థిత్యుత్పత్త్యవ్యయానాం త్వమేకో హేతుర్నిరాశ్రయః

లోకాన్ క్రీడనకానీశ క్రీడతస్తే వదంతి హి

ఓ ఈశ్వరా! జగత్తుయొక్క సృష్టి స్థితిలయములకు ఏకైక హేతువు నీవే. కాని, నీకు వేరే ఆధారము లేదు. ఏలయన, క్రీడాపరుడవైన నీకు ఈ లోకములే ఆట వస్తువులని మహాత్ములు చెప్పెదరు.

త్వమేవ మూర్ధ్నిదమనంత లీలయా

భూమండలం బిభర్షి సహస్రమూర్ధన్

అంతే చ యస్స్వాత్మని రుద్ధవిశ్వః

శే షఽద్వితీయః పరిశిష్యమాణః

ఓ అనంతా! అనంతప్రాణుల రూపములోనున్న నీకు అనంతశిరస్సులు గలవు. ఈ భూమండలమును నీవే తలపై అవలీలగా మోయుచున్నావు. ప్రళయమునందు కూడ నీవు విశ్వమును నీ స్వరూపమునందు విలీనము చేసుకొని, రెండవది లేని పరబ్రహ్మగా మిగిలియుండి శయనించెదవు.

కోప స్తేఽఖిలశిక్షాఽర్థం న ద్వేషాన్న చ మత్సరాత్

బిభ్రతో భగవన్ సత్త్వం స్థితిపాలనతత్పరః

ఓ భగవానుడా! నీ కోపము సకలప్రాణులకు శిక్షణను గరపుట కే గాని, ద్వేషము వలన గాని, ఈర్ష్య వలన గాని కలిగేది కాదు. ఎందుకంటే, సత్త్వగుణప్రధానుడవగు నీవు జగత్తునకు మనుగడనిచ్చి పాలించుటయందు తత్పరుడవై యున్నావు.

నమస్తే సర్వభూతాత్మన్ సర్వశక్తిధరావ్యయ

విశ్వకర్మన్నమస్తేఽస్తు త్వాం వయం శరణం గతాః

ఓ దేవా! నీవే సకలప్రాణులలో ప్రత్యగాత్మరూపుడవై సకలశక్తులను నిలబెట్టుచున్నావు. వినాశము లేని నీవు జగత్తును సృష్టించినావు. నీకు నమస్కారమగుగాక! మేము నిన్ను శరణు జొచ్చినాము.

శ్రీశుక ఉవాచ !

ఏవం ప్రపన్నైస్సంవిగ్నైర్వేపమానాయనైర్బలః

ప్రసాదితస్సుప్రసన్నో మా భైష్టేత్యభయం దదౌ

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- నగరము కంపించుచుండుటచే భయపడీ శరణు జొచ్చిన ఆ జనులు బలరాముని ఈ విధముగా ప్రసన్నుని చేసిరి. ఆయన చాల ప్రసన్నుడై, భయపడకుడని అభయమునిచ్చెను.

దుర్యోధనః పారిబర్హం కుంజరాన్ షష్టిహాయనాన్

దదౌ చ ద్వాదశశతాన్యయుతాని తురంగమాన్

దుర్యోధనుడు అరవై యేళ్ల వయస్సు గల పన్నెండు వందల ఏనుగులను, పది వేల గుర్రములను కూడ కట్నముగా ఇచ్చెను.

రథానాం షట్సహస్రాణి రౌక్మాణాం సూర్యవర్చసామ్

దాసీనాం నిష్కకంఠీనాం సహస్రం దుహితృవత్సలః

కుమార్తెయందు మిక్కుటమగు ప్రేమ గల దుర్యోధనుడు సూర్యుడు వలె వెలిగిపోయే ఆరు వేల బంగరు రథములను, మెడలో బంగరు హారములు గల వెయ్యి దాసీలను కూడ కట్నముగా ఇచ్చెను.

ప్రతిగృహ్య తు తత్సర్వం భగవాన్ సాత్వతరభః

ససుతస్సస్నుషః ప్రాగాత్సుహృద్భిరభినందితః

యాదవశ్రేష్ఠుడగు బలరామ భగవానుడా సర్వమును స్వీకరించి, పుత్రునితో కోడలితో గూడి వెళ్లాను. ఆయనను బంధువులైన కౌరవులు అభినందించిరి.

తతః ప్రవిష్టస్స్వపురం హలాయుధః

సమేత్య బంధూననురక్తచేతసః

శశంస సర్వం యదుపుంగవానాం

మధ్యే సభాయాం కురుషు స్వచేష్టితమ్

తరువాత నాగలియే ఆయుధముగా గల బలరాముడు తన ద్వారకా నగరమును చేరెను. ఆయనపై బంధువులకు అనురాగము మెండు. ఆయన వారిని కలుసుకొనెను. యాదవశ్రేష్ఠుల మధ్యలో సభలో ఆయన కురుదేశములో తాను చేసిన కార్యములనన్నింటినీ వివరించి చెప్పెను.

అద్యాపి చ పురం హ్యేతత్సూచయద్రామవిక్రమమ్

సమున్నతం దక్షిణతో గంగాయామనుదృశ్యతే

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే అష్టషష్టితమోఽధ్యాయః

ఈనాటికీ ఈ హస్తినాపురము బలరాముని పరాక్రమానికి నిశ్చితమైన నిదర్శనంగా గంగానదీతీరమున ఎడమవైపు బాగా ఎత్తుగా గంగ వైపు వాలినట్లుగా కానవచ్చును.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో సాంబుని వివాహమును వర్ణించే అరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది.