64 - నృగ మహారాజు వృత్తాంతము

శ్రీశుక ఉవాచ

ఏకదోపవనం రాజన్ జగ్ముర్యదుకుమారకాః

విహర్తుం సాంబప్రద్యుమ్నచారుభానుగదాదయః

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు సాంబుడు, ప్రద్యుమ్నుడు, చారుభానుడు, గదుడు, అనిరుద్దుడు మొదలైన యాదవ యువకులు విహరించుటకై ఉద్యానవనమునకు వెళ్లిరి.

క్రీడిత్వా సుచిరం తత్ర విచిన్వంతః పిపాసితాః

జలం నిరుద కే కూపే దదృశుస్సత్త్వమద్భుతమ్

వారచట చాల సేపు ఆటలాడి దప్పిక గొన్నవారై నీటి కొరకు వెదుకు చుండగా, వారికి నీరు లేని నూతిలో అద్భుతమైన ప్రాణి ఒకటి కనబడెను.

కృకలాసం గిరినిభం వీక్ష్య విస్మితమానసాః

తస్య చోద్ధరణే యత్నం చక్రుస్తే కృపయాఽన్వితాః

కొండను పోలిన ఆ ఊసరవెల్లిని చూచి వారి మనస్సులు ఆశ్చర్యముతో నిండెను. వారికి దానిపై దయ కలిగి, దానిని పైకి తీసే ప్రయత్నమును కూడ చేసిరి.

చర్మ జైస్తాంతవైః పాశైర్బద్ధ్వా పతితమర్భకాః

నాశక్నువన్ సముద్ధర్తుం కృష్ణాయాచఖ్యురుత్సుకాః

ఆ యువకులు చర్మమయములైనట్టియు, పేనబడిన త్రాళ్లతో నూతిలో పడ్డ ఆ ఊసరవెల్లిని పైకి తీసే ప్రయత్నము చేసి విఫలమైరి. అపుడు వారా విషయమును ఉత్కంఠతో శ్రీకృష్ణునకు వివరించి చెప్పిరి.

తత్రాగత్యారవిందాక్షో భగవాన్ విశ్వభావనః

వీక్ష్యోజ్జహార వామేన తం కరేణ స లీలయా

పద్మములవంటి కన్నులు గల శ్రీకృష్ణ భగవానుడు జగత్తునకు రక్షకుడు. ఆయనకు అచటకు వచ్చి దానిని చూచి అవలీలగా ఎడమ చేతితో పైకి తీసెను.

స ఉత్తమశ్లోకకరాభిమృష్టో విహాయ సద్యః కృకలాసరూపమ్

సంతప్తచామీకరచారువర్ణస్స్వర్గ్యద్భుతాలంకరణాంబరస్రక్

పవిత్రకీర్తియగు శ్రీకృష్ణ భగవానుడు చేతితో స్పృశించిన వెంటనే ఆ ఊసరవెల్లి ఆ రూపమును విడిచి పెట్టి, పుటము పెట్టిన బంగారము వలె అందమైన కాంతి గల దేవత ఆయెను. ఆ దేవతయొక్క ఆభరణములు, వస్త్రములు, మాలలు అచ్చెరువు గొలుపుచుండెను.

పప్రచ్చ విద్వానపి తన్నిదానం

జనేషు విఖ్యాపయితుం ముకుందః

కస్త్వం మహాభాగ వరేణ్యరూపో

దేవోత్తమం త్వాం గణయామి నూనమ్

ఊసరవెల్లికి ఆ జన్మ వచ్చుటకు గల కారణము మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణునకు తెలిసినదే. అయినా, జనులలో ప్రసిద్ధమగుటకై ఆయన ఇట్లు ప్రశ్నించెను -- ఓయీ! చాల శ్రేష్ఠమగు రూపము గల నీవు గొప్ప భాగ్య వంతుడవు. నీవు నిశ్చయముగా దేవతోత్తముడవని నా అభిప్రాయము.

దశామిమాం వా కతమేన కర్మణా సంప్రాపీతోఽస్యతదర్షస్సుభద్ర,

ఆత్మానమాఖ్యాహి వివిత్సతాం నో యన్మన్యసే నః క్షమమత్ర వక్తుమ్.

ఓ మంగళమూర్తీ! నీవు ఏ కర్మను చేసీ ఈ (ఊసరవెల్లి) స్థితిని పొందితివి? ఇది నీకు తగి లేదు. నీ గురించి తెలియాలని మా కోరిక. మేము చెప్పదగ్గవారమని నీకనిపిస్తే ఇప్పుడు నీ గురించి చెప్పుము.

శ్రీశుక ఉవాచ

ఇతి స్మ రాజా సంపృష్టః కృష్ణేనానంతమూర్తినా

 మాధవం ప్రణిపత్యాహ కిరీ టేనార్కవర్చసా

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- అనంతమైన రూపములు గల శ్రీకృష్ణ భగవానుడీ తీరున మంచిగా ప్రశ్నించెను. ఆయన పూర్వజన్మలో నృగమహారాజు. ఆయన సూర్యుడు వలె వెలిగిపోయే కిరీటమును నేలకు ఆన్చి ఆ లక్ష్మీపతికి ప్రణమిల్లి ఇట్లు పలికెను.

నృగ ఉవాచ

నృగో నామ నరేంద్రోఽహమిక్ష్వాకుతనయః ప్రభో

దానిష్వాఖ్యాయమానేషు యది తే కర్ణమస్పృశమ్

నృగుడిట్లు పలికేను --- ఓ ప్రభూ! నేను నృగుడని ప్రసిద్ది గాంచిన మహారాజును, ఇక్ష్వాకువు యొక్క పుత్రుడను. దాతల గురించి పొగిడే సందర్భములో నేను నీ చెవిన పడినానా యేమి? (నీవు వినే ఉంటావు).

కిం ను తేఽవిదితం నాథ సర్వభూతాత్మసాక్షిణః

కాలేనావ్యాహతదృశో వక్ష్యేఽథాపి తవాజ్ఞయా

ఓ ప్రభూ! సకలప్రాణులలో బుద్దివృత్తులకు సాక్షిగా ఉండే నీ జ్ఞానము ఏ కాలమునందైననూ మొక్కవోదు. నీకు తెలియనిది ఏమి ఉండును? అయినప్పటికీ, నీ ఆదేశానుసారముగా చెప్పెదను.

యావత్యస్సికతా భూమేర్యావత్యో దివి తారకాః

యావత్యో వర్షధారాశ్చ తావతీరదదాం స్మ గాః

భూమిపై ఇసుక రేణువులు ఎన్నో, దివిలో తారకలెన్నో, వర్షధారలు ఎన్ని పడునో, అన్ని గోవులను నేను దానము చేసితిని.

పయస్వీనిస్తరుణీశ్శీలరూప

గుణోపపన్నాః కపిలా హేమశృంగీః

 న్యాయార్జితా రూప్యఖురాస్సవత్సా

 దుకూలమాలాఽఽభరణా దదావహమ్

నేను వయస్సులో ఉండి పాలిచ్చే కపిలగోవులను దూడలతో సహా దానము చేసితిని. నేను న్యాయముగా సంపాదించిన ఆ గోవులు మంచి జాతికి చెందినవి. అందమైన ఆ గోవులు మంచి నడవడి గలవి. వాటి కొమ్ములకు బంగారముతో, డెక్కలకు వెండితో తొడుగులను వేసి, వస్త్ర ములను కప్పి, మాలలను ఆభరణములను అలంకరించి దానము చేసితిని.

స్వలంకృతేభ్యో గుణశీలవద్భ్యస్సీదత్కుటుం బేభ్య ఋతవ్ర తేభ్యః, తపశ్శ్రుతబ్రహ్మవదాన్యసద్భ్యః ప్రాదాం యువభ్యో ద్విజపుంగవేభ్యః.

నేను యువకులైన శ్రేష్ఠ బ్రాహ్మణులకు అలంకారములనిచ్చి గోవులను దానము చేసితిని. వారి కుటుంబములు దారిద్యముచే కష్టపడుచున్ననూ, వారు సద్గుణములు శీలము గలవారు. కపటము లేని నియమనిష్ఠలు గల ఆ బ్రాహ్మణులు తపస్సునకు పెట్టిన పేరు. వారు సమచిత్తులై దాచుకోకుండా వేదమును బోధించెడివారు.

గోభూహిరణ్యాయతనాశ్వహస్తినః కన్యాస్సదాసీస్తిలరూప్యశయ్యాః

 వాసాంసి రత్నాని పరిచ్ఛదాస్రథానిష్టం చ యజ్ఞైశ్చరితం చ పూర్తమ్

నేను ఎద్దులను, భూమిని, బంగారమును, ఇళ్లను, గుర్రములను, ఏనుగులను, దాసీలతో కూడిన కన్యలను, నువ్వులను, వెండిని, శయ్యలను, వస్త్రములను, రత్నములను, ఇంటి సామగ్రిని, రథములను దానము చేసితిని. యజ్ఞములను చేసి ఈశ్వరుని ఆరాధించితిని. నూతులను త్రవ్వించుట మొదలైన పూర్తకర్మలను కూడ అనుష్ఠించితిని.

కస్యచిద్ద్విజముఖ్యస్య భ్రష్టా గౌర్మమ గోధనే

సంపృక్తాఽవిదుషా సా చ మయా దత్తా ద్విజాతయే

ఒక శ్రేష్ట బ్రాహ్మణుని గోవు దారితప్పి నా గోవుల మందలో కలిసినది. ఆ విషయము తెలియని నేను దానిని బ్రాహ్మణునకు దానము చేసితిని.

తాం నీయమానాం తత్స్వామీ దృష్ట్వోవాచ మమేతి తమ్

మమేతి ప్రతిగ్రాహ్యాహ నృగో మే దత్తవానితి

దానమును తీసుకున్న బ్రాహ్మణుడు ఆ గోవును తోలుకొనిపోవు చుండగా దాని స్వామియగు బ్రాహ్మణుడు చూచి, ఈ గోవు నాది అని చెప్పెను. ఆ బ్రాహ్మణుడు, ఇది నాది, నాకు నృగమహారాజు ఇచ్చినాడు, అని బదులు చెప్పెను.

విప్రౌ వివదమానౌ మామూచతుస్స్వార్థసాధకౌ

భవాన్ దాతాఽపహర్తీతి తచ్ఛ్రుత్వా మేఽభవద్భ్రమః

తమ పనిని చక్కబెట్టుకొనే ఆ బ్రాహ్మణులిద్దరు దెబ్బలాడుకుంటూ నాతో " -- నీవు చోరీ చేసి దానము చేసితివి -- అని పలికిరి. వారి ఆ మాటను విని నాకు తల తిరిగిపోయెను.

అనునీతావుభౌ విప్రౌ ధర్మకృచ్ఛ్రగతేన వై

గవాం లక్షం ప్రకృష్టానాం దాస్యామ్యేషా ప్రదీయతామ్

ధర్మసంకటములో పడిన నేను ఆ బ్రాహ్మణులిద్దరినీ జాగ్రత్తగా అనునయించే యత్నమును చేసితిని. లక్ష గొప్ప గోవులనిచ్చెదను, ఈ గోవును నాకిమ్ము, అని వారిని కోరితిని.

భవంతావనుగృహ్ణీతాం కింకరస్యావిజానతః

 సముద్ధరత మాం కృచ్ఛ్రాత్పతంతం నిరయేఽశుచౌ

నేను మీ సేవకుడను. తెలియక తప్పు చేసితిని. మీరిద్దరు నన్ను అనుగ్రహించుడు. అమంగళకరమగు నరకములో పడిపోవుచున్న నన్ను మీరు ఆపదనుండి గట్టెక్కించుడు.

నాహం ప్రతీచ్చే వై రాజన్నిత్యు క్త్వా స్వామ్యపాక్రమత్

నాన్యద్గవామప్యయుతమిచ్ఛామీత్యపరో యయౌ

ఓ రాజా! నేను ' నిశ్చయముగా ఈ గోవుకు బదులుగా లక్ష గోవులనైననూ తీసుకోను, అని చెప్పి ఆ గోవుయొక్క యజమాని వెడలిపోయెను. లక్ష కంటే అధికముగా మరో పది వేల గోవులనిచ్చినా నాకు అక్కర లేదు, అంటూ రెండవ బ్రాహ్మణుడు నిషమించెను.

ఏతస్మిన్నంతరే యామ్యైర్దూతైర్నీతో యమక్షయమ్

యమేన పృష్టస్తత్రాహం దేవదేవ జగత్పతే

ఓ దేవాధిదేవా! నీవు జగన్నాథుడవు. ఇంతలో నా జీవితము సమాప్తమైనది. నన్ను యముని కింకరులు యమలోకమునకు కోనిపోయిరి. అచట యముడు నన్నిట్లు ప్రశ్నించెను.

పూర్వం త్వమశుభం భుం క్షే ఉతాహో నృపతే శుభమ్

నాంతం దానస్య ధర్మస్య పశ్యే లోకస్య భాస్వతః

ఓ రాజా! నీవు ముందుగా పాపముననుభవించేదవా? లేక, పుణ్యమునా? నీవు చేసిన దానధర్మములకు, నీకు లభించే ప్రకాశవంతమైన లోకములకు అంతము నాకు కనబడుట లేదు.

పూర్వం దేవాశుభం భుంజ ఇతి ప్రాహ పతేతి సః

తావదద్రాక్షమాత్మానం కృకలాసం పతన్ ప్రభో

ఓ దేవా! ముందుగా నేను పాపముననుభవించెదనని నేను చెప్పగా, పడిపో! అని యముడు పలికెను. ఓ శ్రీకృష్ణ ప్రభూ! అంతలో నేను పడిపోతూ, ఊసరవెల్లి రూపమును పొందితినని గుర్తించితిని.

బ్రహ్మణ్యస్య వదాన్యస్య తవ దాసస్య కేశవ

స్మృతిర్నాద్యాపి విధ్వస్తా భవత్సందర్శనార్థినః

శ్రీకృష్ణా! నేను బ్రాహ్మణభక్తుడనైన దాతను. నీ సేవకుడనగు నేను నీ దర్శనమును కోరుచుంటిని. నాకిప్పటికీ పూర్వజన్మస్మృతి నశించలేదు.

స త్వం కథం మమ విభోఽక్ధిపథః పరాత్మా

యోగేశ్వ రైశ్శ్రుతిదృశాఽమలహృద్విభావ్యః

సాక్షాదధోక్షజ ఉరువ్యసనాంధబుద్ధేః

స్యాన్మేఽనుదృశ్య ఇహ యస్య భవాపవర్గః

ఓ ప్రభూ! గొప్ప యోగులు ఉపనిషత్తు (అభేదదృష్టి) అనే దృష్టితో పవిత్రమైన అంతఃకరణమునందు పరమాత్మవగు నిన్ను భావన చేసెదరు.

అట్టి నీవు పెద్ద ఆపదచే వివేకమును కోల్పోయి ఉన్న నా కంట ఎట్లు బడితివి? ఇంద్రియగోచరము కాని దేముడు నాకు ప్రత్యక్ష మైనాడు. ఎవని కైతే సంసారబంధమునుండి విముక్తి కలిగే వేళ వచ్చునో, వానికి నీవు దర్శనమిచ్చెదవు.

దేవ దేవ జగన్నాథ గోవింద పురుషోత్తమ

నారాయణ హృషీ కేశ పుణ్యశ్లోకాచ్యుతావ్యయ

ఓ దేవాధిదేవా! నీవు జగన్నాథుడవు. ఓ గోవిందా! పురుషోత్తమా! నారాయణా! ఇంద్రియములను ప్రవర్తిల్లజే సేది నీవే. నీ కీర్తి పావనము చేయును. నీకు స్వరూపచ్యుతి గాని, నాశము గాని లేవు. .

అనుజానీహి మాం కృష్ణ యాంతం దేవగతిం ప్రభో

యత్ర క్వాపి సతశ్చేతో భూయాన్మే త్వత్పదాస్పదమ్

ఓ శ్రీకృష్ణా! నేను స్వర్గలోకమునకు వెళ్లుచున్నాను. ఓ ప్రభూ! నాకు అనుమతినిమ్ము, నేను ఎక్కడ ఉన్నా, నా మనస్సు నీ పాదములనే ఆశ్రయించుగాక!

నమస్తే సర్వభావాయ బ్రహ్మణేఽనంతశక్తయే

కృష్ణాయ వాసుదేవాయ యోగానాం పతయే నమః

సర్వమునకు ఉపాదానమైన అనంతశక్తి గల పరబ్రహ్మ నీవే. నీవు వసుదేవుని పుత్రుడగు శ్రీకృష్ణుడవై అవతరించి యోగులను కాపాడు చున్నావు. నీకు అనేక నమస్కారములు.

ఇత్యు క్త్వా తం పరిక్రమ్య పాదౌ స్పృష్ట్వా స్వమౌలినా

 అనుజ్ఞాతో విమానాగ్ర్యమారుహత్పశ్యతాం నృణామ్

నృగుడిట్లు పలికి ఆ శ్రీకృష్ణునకు ప్రదక్షిణము చేసి, ఆయన పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించి, అనుమతి తీసుకొనెను. జనులు చూచుచుండగనే ఆయన గొప్ప విమానమునధిష్ఠించెను.

కృష్ణః పరిజనం ప్రాహ భగవాన్ దేవకీసుతః

బ్రహ్మణ్య దేవో ధర్మాత్మా రాజన్యాననుశిక్షయన్

దేవకి పుత్రుడగు శ్రీకృష్ణ భగవానునకు బ్రాహ్మణుల యెడల ప్రేమ మెండు. ఆ ధర్మాత్ముడు క్షత్రియులకు శిక్షణనిచ్చుటకై చుట్టూ ఉన్న జనమునుద్దేశించి ఇట్లు పలికేను.

దుర్జరం బత బ్రహ్మస్వం భుక్తమగ్నేర్మనాగపి

తేజీయసోఽపి కిముత రాజ్ఞామీశ్వరమానినామ్

బ్రాహ్మణుల సొత్తును కొంచెము అనుభవించినా, అది అగ్ని కైననూ, అగ్నివంటి తేజశ్శాలురకైననూ, జీర్ణము చేసుకొనుట చాల కష్టము. మేము ప్రభువులమని విర్రవీగే రాజులకు మరింత కష్టమని వేరుగా చెప్పవలెనా?

నాహం హాలాహలం మన్యే విషం యస్య ప్రతిక్రియా

బ్రహ్మస్వం హి విషం ప్రోక్తం నాస్య ప్రతినిధిర్భువి

హాలాహలమునకు విరుగుడు కలదు. కావున, అది విషమని నేను అనుకోను. కాని, ఈ భూలోకములో బ్రాహ్మణుని సొత్తు అనేది నిశ్చయముగా విషము. దానికి విరుగుడు లేదు.

హినస్తి విషమత్తారం వహ్నిరద్భిః ప్రశామ్యతి

 కులం సమూలం దహతి బ్రహ్మస్వారణిపావకః

విషము భక్షించినవానిని మాత్రమే హింసించును. నీళ్లు చల్లితే నిప్పు చల్లారును. కాని, బ్రాహ్మణుని సొత్తు అనే అరణినుండి పుట్టే అగ్ని సమూలముగా వంశమును నశింపజేయును.

బ్రహ్మస్వం దురనుజ్ఞాతం భుక్తం హంతి త్రిపూరుషమ్

ప్రసహ్య తు బలాద్భుక్తం దశ పూర్వాన్ దశాపరాన్

ఎవడైతే బ్రాహ్మణుని పూర్తి అనుమతి లేకుండా ఆయన సొత్తును - అనుభవించునో, ఆతడు, వానీ సంతానము, వారి సంతానము అనే మూడు తరములు నశించును. బ్రాహ్మణుని సొత్తును హఠము. చేసి బలప్రయోగముతో అనుభవించినచో, పది గడచిన తరములు, పది రాబోవు తరములు వినాశమును పొందును.

రాజానో రాజలక్ష్మ్యాఽoధా నాత్మపాతం విచక్షతే

నిరయం యేఽభిమన్యంతే బ్రహ్మస్వం సాధు బాలిశాః

కొందరు మూర్ఖులైన రాజులు రాజసంపదచే వివేకమును కోల్పోయి నరకమునకు హేతువైన బ్రాహ్మణుని సొత్తును మంచిదని తలపోయుదురు. వారు తాము నరకములో పడుతున్నామని తెలుసుకోరు.

గృహ్ణంతి యావతః పాంసూన్ క్రందతామశ్రుబిందవః

విప్రాణాం హృతవృత్తీనాం వదాన్యానాం కుటుంబినామ్

రాజానో రాజకుల్యాశ్చ తావతోఽబ్దాన్నిరంకుశాః

కుంభీపాకేషు పచ్యంతే బ్రహ్మదాయాపహారిణః

రాజులు ధర్మమునుల్లంఘించి కుటుంబీకులైన బ్రాహ్మణుల వాటాను అపహరించి వారి జీవికకు విఘాతమును కలిగించినచో, ఉదారస్వభావు లగు ఆ బ్రాహ్మణులు దుఃఖించెదరు. పోరీ కన్నీళ్లకు ఎన్ని ధూళి కణములు తడి యగునో అన్ని సంవత్సరముల కాలము ఆ రాజులు, వారి వంశీయులు కూడ నిరంతరముగా కుంభీపాకము (బానలలోని మరిగే నూనెలో పారవేసే) లనే నరకములయందు యాతనలననుభవించెదరు.

స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేచ్చ యః

షష్టివర్షసహస్రాణి విష్ఠాయాం జాయతే కృమః

ఎవడైతే తాను ఇచ్చినది గాని, ఇతరులు ఇచ్చినది గాని, బ్రాహ్మణుని జీవికను అపహరించునో, అట్టివాడు అరవై వేల సంవత్సరములు మలమునందు క్రిమియై పుట్టును.

న మే బ్రహ్మధనం భూయాద్యద్గృద్ధ్వాఽల్పాయుషో నరాః

పరాజితాశ్చ్యుతా రాజ్యాద్భవంత్యుద్వేజినోఽహయః

బ్రాహ్మణుని సొత్తు నా సొత్తులోనికి రాకుండు గాక! బ్రాహ్మణుని సొత్తుకు ఆశపడే మానవులు అల్పాయుష్కులై పరాజయములను పొందెదరు. రాజులైతే రాజ్యమును కోల్పోయెదరు. మరణించి వారు ఇతరులకు భయమును కలిగించే విషసర్పములై పుట్టెదరు.

విప్రం కృతాగసమపి నైవ ద్రుహ్యత మామకాః

ఘ్నంతం బహు శపంతం వా నమస్కురుత నిత్యశః

ఓ ఆత్మీయులారా! వేదవేత్త యైన బ్రాహ్మణుడు అపరాధమునే చేసినా, ఒకచో కొట్టినా, లేదా అధికముగా తిట్టినా, మీరాయనకు ద్రోహమును చేయనే వద్దు. పైగా, ఆయనకు సర్వదా నమస్కరించుడు.

యథాఽహం ప్రణమే విప్రాననుకాలం సమాహితః

తథా నమత యూయం చ ఽయోన్యథా మే స దండభాక్

నేను మూడు పూటలా ఏకాగ్రమగు చిత్తముతో వేదవేత్తలగు బ్రాహ్మణు లకు నమస్కరించెదను. అదే విధముగా, మీరు కూడ నమస్కరించుడు. దీనికి విరుద్దముగా నమస్కరించనివానిని నేను శిక్షించెదను.

బ్రాహ్మణార్థో హ్యపహృతో హర్తారం పాతయత్యధః

అజానంతమపి హ్యేనం నృగం బ్రాహ్మణగౌరివ

గోవు బ్రాహ్మణునిది అని తెలియక దానము చేసి ఈ నృగమహారాజు పతితుడైనాడు. అదే విధముగా, బ్రాహ్మణుని సొత్తు తనను అపహరించువానిని నిశ్చయముగా అధఃపతితుని చేయును.

ఏవం విశ్రావ్య భగవాన్ ముకుందో ద్వారకౌకసః

పావనస్సర్వలోకానాం వివేశ నిజమందిరమ్

ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే చతుష్షష్టితమోఽధ్యాయః

సకలలోకములను పావనము చేసి మోక్షమునిచ్చే శ్రీకృష్ణ భగవానుడు ద్వారకావాసులకీ విధముగా ఉపదేశించి, తన మందిరములో ప్రవేశించెను.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో నృగమహారాజు వృత్తాంతమును వర్ణించే అరువది నాల్గవ అధ్యాయము ముగిసినది.