14 - బ్రహ్మ స్తుతి

బ్రహ్మోవాచ

నౌమీడ్య తేఽభ్రవపు షే తడిదంబరాయ

గుంజావతంసపరి పిచ్చలసన్ముఖాయ

వన్యస్రజే కవలవేత్రవిషాణవేణు-

లక్ష్మశ్రీయే మృదుపదే పశుపాంగజాయ

ఓ దేవా! కొనియాడదగినవాడవు నీవే. మేఘమువంటి దేహము గల నీవు మెరుపువంటి వస్త్రమును దాల్చీతివి. నీ ముఖము గురివింద గీంజల కర్ణాభరణములతో, చుట్టూ నెమలి పింఛములతో శోభిల్లుచున్నది. అడవి పువ్వుల మాలను వేసుకున్న నీవు చేతిలో అన్నపు ముద్దను, బెత్తమును, కొమ్ము బూరాను, పిల్లన గ్రోవిని పట్టుకున్నావు. నీ వక్షఃస్థలము పుట్టుమచ్చతో ప్రకాశించుచున్నది. గోపాలకుడగు నందుని పుత్రుడవైన నీ పొగము ముగుస గ చము గను

అస్యాపి దేవ వపుషో మదనుగ్రహస్య

స్వేచ్చామయస్య న తు భూతమయస్య కోఽపి

నేశే మహి త్వవసితుం మనసాంఽఽత రేణ

సాక్షాత్త వైవ కిముతాత్మసుఖానుభూతేః

ఓ దేవా! భక్తుల ఇచ్ఛననుసరించి స్వేచ్ఛచే ప్రకటితమైన ఈ నీ ఆవతారము భౌతికము (ప్రాకృతము) కాదు. నన్ను అనుగ్రహించే ఈ నీ దేహముయొక్క మహిమనైననూ బ్రహ్మదేవుడనగు నేనైననూ, లేదా ఎవరైననూ, అంతర్ముఖమగు మనస్సుతోనైననూ తెలియజాలరు. సాక్షాత్తుగా అద్వయపరబ్రహ్మవగు నీయొక్క సచ్చిదానందానుభూతియొక్క మహిమ గురించి చెప్పునదేమున్నది?

జ్ఞానే ప్రయాసముదపాస్య సమంత ఏవ

జీవంతి సన్ముఖరితాం భవదీయవార్తామ్

స్థానే స్థితాశ్స్రుతిగతాం తనువాజ్మనోభిః

యే ప్రాయశోఽజిత జితోఽప్యసి తైస్త్రిలోక్యామ్

ఓ దేవా! నీకు పరాజయము లేదు. ఐననూ, ఎవరైతే తమ స్థానమునందున్నవారై సత్పురుషులచే గానము చేయబడి తమ చెవిన పడిన నీ గాథను మనోవాక్కాయములతో సత్కరిస్తూ జీవించెదరో, వారు ఈ మూడు లోకములలో బహుశః నిన్ను కూడ జయించెదరు (పొందెదరు). వారు జ్ఞానమునందలి ప్రయాసను దూరముగా నుంచెదరు.

శ్రేయస్స్రుతిం భక్తిముదస్య తే విభో క్లిశ్యంతి యే కేవలబోధలబ్ధయే

తేషామసౌ క్లేశల ఏవ శిష్యతే నాన్యద్యథా స్థూలతుషావఘాతీనామ్

ఓ ప్రభూ! దొడ్డుగా ఉన్న ఊకలను దంచువారికి మిగిలేది క్లేశము మాత్రమే. అదే విధముగా శ్రేయస్సులను ప్రవాహముగా ఇచ్చే నీ భక్తిని విడిచి పెట్టి ఎవరైతే కేవల (భక్తి లేని, శుష్క) జ్ఞానముకొరకు కష్టపడెదరో, వారికి మిగిలేది క్లేశమే గాని, మరియొకటి కాదు.

పురేహ భూమన్ బహవోఽపి యోగినః

త్వదర్పితేహా నిజకర్మలబ్ధయా

విబుధ్య భక్త్యైవ కథోపనీతయా

ప్ర పేది రేంఽజోఽచ్యుత తే గతిం పరామ్

ఓ అనంతా! నీవు స్వరూపమునుండి చ్యుతి లేనివాడవు. ఈ లోకములో పూర్వము అనేకయోగులు కూడ తమ కర్మలను నీయందు సమర్పించి తద్ద్వారా చిత్తశుద్ధిని పొందిరి. వారు నీ గాథలను శ్రవణము. చేసి భక్తితో నీకు దగ్గర ఐరి. ఆ భక్తితోనే వారు నీ సర్వోత్కృష్ణమగు తత్త్వమును తేలికగా తెలుసుకొని మోక్షమును పొందిరి.

తథాఽపి భూమన్మహిమాఽగుణస్య తే

విబోద్దుమర్హత్యమలాంతరాత్మభిః

అవిక్రియాత్స్వా నుభవాదరూపతో

హ్యనన్యబోధ్యాత్మతయా న చాన్యథా

ఓ అనంతా! ఐనప్పటికీ నిర్మలమగు అంతఃకరణము గలవారు విర్గుణుడవగు నీ మహిమను ఇంద్రియములు-మనస్సు మొదలగువాటిచే అఖండమే గాని తనకంటె భిన్న మైన ఘటాది రూపము విషయముగా గల జ్ఞానమువంటిది కాదు. మనోవికారము కాని ఆ జ్ఞానము స్వానుభవరూపమే గాని మరియొకటి కాదు.

గుణాత్మనస్తేఽపి గుణాన్ విమాతుం హితావతీర్ణస్య క ఈశిర్వేఽస్య,

కాలేన యైర్వా విమితాస్సుకల్పైర్భూహంసవః ఖే మిహికా ద్యుభాసః

గుణములకు అధిష్టాతవగు నీవు గుణాతీతుడవే అయినా, ఈ లోకముయొక్క హితము కొరకు అవతరించెదవు (గుణములు గలవాడవు అగుదువు). నిపుణులైన వ్యక్తులు చాల కాలము పని చేసి భూమియందలి రేణువులను, ఆకాశమునందలి మంచు కణములను, లేదా ద్యులోకమునందలి నక్షత్రాదులను లెక్కించవచ్చును. కాని, అట్టి నీ గుణములను లెక్కించే సామర్థ్యము ఎవరికి గలదు?(ఎవరికైననూ లేదు).

తత్తేఽనుకంపాం సుసమీక్షమాణో భుంజాన ఏవాత్మకృతం విపాకమ్, హృద్వాగ్వపుర్భిర్విదధన్నమస్తే జీవేత యో ముక్తిపదే స దాయభాక్

అందువలన ఎవడైతే ప్రతిక్షణము నీ కృప కొరకు ఎదురు చూస్తూ పూర్వకర్మార్జితమైన సుఖదుఃఖములను అనుభవిస్తూనే, మనోవాక్కాయములతో నీకు తనను సమర్పించుకొని జీవించునో, అట్టివాడు మోక్షఫలమునందు -- తండ్రి ఆస్తిలో కొడుకు వలే -- వాటా గలవాడగును.

పశ్యేశ మేఽనార్యమనంత ఆద్యే

పరాత్మని త్వయ్యపి మాయిమాయిని

మాయాం వితత్యేక్షితుమాత్మ వైభవం

హ్యహం కియానైచ్ఛమివార్చిరగ్నౌ

ఓ ఈశ్వరా! నా దౌర్జన్యమును చూడుము. నీవు అనంతుడవు, సర్వకారణుడవు, మాయావులకు మాయావివి. పరమాత్మవగు అట్టి నీయందు నేను మాయను ప్రసరింపజేసి నా ప్రభావమును చూడగోరితిని. అగ్నిలో జ్వాల వలె నీయందు నేనెంత?(నీముందు నేనేమీ కాదు).

అతః క్షమస్వాచ్యుత మే రజోభువో హ్యజానతస్త్వత్సృథగీశమానినః

అజావలేపాంధతమోంఽధచక్షుష ఏషోఽనుకంప్యో మయి నాథవానితి

ఓ అచ్యుతా! నేను రజోగుణమునుండి పుట్టినవాడనగుటచే నీ మహిమ తెలియక నీకంటె వేరుగా నేను కూడ ప్రభుడననే ఆహంకారము కలిగి యుంటిని. అనాదియగు మాయతోడి సంబంధము వలన నా అంతః కరణమునందు గాఢమగు అజ్ఞానము కలిగి వివేకజ్ఞానమును కోల్పోతిని. నేను స్వయంభువుడనని గర్వించితిని. నీవు తప్ప నాకు నాథుడు లేడు. నేను దయ చూపదగినవాడను. కావున, నన్ను క్షమించుము.

క్వాహం తమోమహదహంఖచరాగ్నివార్భూ

సంవేష్టితాండఘటసప్తవితస్తికాయః

క్వేదృగ్విధావిగణితాండపరాణుచర్యా-

వాతాధ్వరోమవివరస్య చ తే మహిత్వమ్

ప్రకృతి, మహత్తత్త్వము (సమష్టి బుద్ధిశక్తి), సమష్టి అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివి అనువాటిచే చటునాగబడియునుడనునే సుటము నశించేది. వంగు ఏడు అడుగుల దేహము గల వేనెక్కడ? ఈ విధమైన లెక్కలేనన్ని పరమాణువులవంటి బ్రహ్మాండములు, కిటికీనుండి వచ్చే సూర్యకాంతిలోని ధూళికణములు వలే, నీ రోమకూపములయందు పరిభ్రమించుచుండును. అట్టి నీ మహిమ యెక్కడ? (చాల అంతరము గలదని భావము).

ఉత్క్షేపణం గర్భగతస్య పాదయోః కిం కల్సతే మాతురధోక్షజాగ సే

కీమస్తినాస్తివ్యపదేశభూషితం తవాస్తి కుక్షేః కియదప్యనంతః

ఓ శ్రీహరీ! నీ స్వరూపము ఇంద్రియములకు గోచరమయ్యేది కాదు. గర్భమునందలి శిశువు పాదములతో తన్నుట తల్లి యెడల అపరాధమగునా? (కాదు). ఉంది లేదు అనే శబ్దములచే వ్యవహరించ బడేది కొంచెమైనా నీ ఉదరమునకు లోపల లేనిది గలదా? (లేదు).

జగత్త్రయంతోదధిసంప్లవోదే నారాయణస్యోదరనాభినాలాత్,

వినిర్గత్వోఽజస్త్వితి వాజ్న వై మృషా కిం త్వీశ్వర త్వన్న వినిర్గతోకస్మి

ప్రళయమునందు సముద్రములన్నీ ఏకమై ముల్లోకములు విలీనమైనవి. అప్పుడు ఆ జలములలో నారాయణుని నాభి. సలి పద్మపు తూడునుండి స్వయంభువుడగు బ్రహ్మదేవుడు ప్రకటమయ్యేనని శ్రుతులు చెప్పుచున్నవి. ఆ మాట అసత్యము కాదు. ఇది నిశ్చయము. ఓ ఈశ్వరా! నేను నీనుండి ప్రకటమైనవాడను కానా? (తప్పక అగుదును).

నారాయణస్త్వం న హి సర్వదేహినా

మాత్మాఽస్యధీశోఽఖిలలోకసాక్షీ

నారాయణోఽoగం నరభూజలాయనాత్

తచ్చాపి సత్యం న తవైవ మాయా

సకలప్రాణులకు ఆత్మవగు నీవు నారాయణుడవు (నార-అయన, అనగా జీవులకు అధిష్టానము) కావా? అగుదువు. సకలప్రాణులకు ప్రవర్తకుడవగు నీవు నారాయణుడవే (నార-అయన, అనగా జీవులను ప్రవర్తిల్ల జేయువాడు). సకల ప్రాణులలోని బుద్దిసాక్షి వగు నీవు నారాయణుడవు (నార-అయన, జీవులలో తెలుసుకొనువాడు). నరునినుండి అనగా పరమాత్మనుండి పుట్టినవి నారములు, అనగా జలములు. అవి ఆశ్రయముగా గల నారాయణుడు కూడ నీ అంశయే. అట్టి అంశరూపముగా ప్రకటమగుట కూడ నీ లీలయే గాని పరమార్థము కాదు.

తచ్చేజ్జలస్థం తవ సజ్జగద్వపుః కిం మే న దృష్ణం భగవంస్త వైవ

కిం వా సుదృష్టం హృది మే తదైవ కిం నో సపద్యేవ పునర్వ్యదర్శి

ఓ భగవానుడా! జగత్తునకు ఆశ్రయమైన ఆ నీ దేహము నీటియందున్నచో, నేను ప్రకటమైన వెంటనే ఏల చూడలేకపోతిని? మరల (తపస్సును చేసి) తరువాత మాత్రమే నేను హృదయమునందు ఆ రూపమును బాగుగా చూచుటకు కారణమేమి? అదే రూపము మరల వెనువెంటనే నాకు కనబడకపోవుటకు కారణమేమి?

అత్రైవ మాయాధమనావతారే హ్యస్య ప్రపంచస్య బహిస్స్పుటస్య

కృత్స్నస్య చాంతర్జఠరే జనన్యా మాయాత్వమేవ ప్రకటీకృతం తే

మాయను పోగొట్టే ఓ శ్రీహరీ! ఈ అవతారమునందే నీవు బయట ప్రత్యక్షముగా కనబడే ఈ ప్రపంచమునంతనూ తల్లికి ఉదరము లోపల చూపి, ఈ జగత్తు నీ మాయయేనని నిశ్చయముగా ప్రకటించితివి.

యస్య కుక్షావిదం సర్వం సాత్మం భాతి యథా తథా

తత్త్వయ్య పీహ తత్సర్వం కిమిదం మాయయా వినా

నీతో సహా ఈ సకలజగత్తు ఏ విధముగానైతే నీ ఉదరమునందు ప్రకాశించుచున్నదో అదే విధముగా ఆ సర్వము ఈ బయట కూడ ప్రకాశించుచున్నది. ఇదంతా నీయందు మాయాశక్తి లేకుండానే ఘటిల్లునా యేమి? (ఘటిల్లదు).

అద్యైవ త్వదృతేఽస్య కిం మమ న తే మాయాత్వమాదర్శిత

మేకోఽసి ప్రథమం తతో వ్రజసుహృద్వతాస్సమస్తా అపి

తావంత్వోఽసీ చతుర్భుజాస్తదఖిలైస్సాకం మయోపాసితాః

తావంత్యేవ జగంత్యభూస్తదమితం బ్రహ్మాద్వయం శిష్యతే

ఈ జగత్తు మాయచే కల్పితమనియు, నీవే దాని అధిష్ఠానమనియు నీవీ నాడు నాకు నిరూపించ లేదా? (నిరూపించితివి). మొట్టమొదట (నేను చూసినప్పుడు) నీవు ఒక్కడివే ఉంటివి. తరువాత గోకులమునందలి మిత్రులు, దూడలు, వారి బెత్తములు మొదలైనవన్నీ నీవే అయితివి. అప్పుడు చతుర్భుజరూపములు అదే సంఖ్యలో నీవే అయితివి. నాతో సహా సృష్టిలోని తత్త్వములన్నీ ఆ రూపములను ఉపాసించుచున్నవి.

తరువాత అదే సంఖ్యలో బ్రహ్మాండములు నీవే అయితివి. కావున, పరిచ్ఛేదములు లేనిది, రెండవది లేనిది అగు పరబ్రహ్మయే మిగిలినది.

అజానతాం త్వత్పదవీమనాత్మ

న్యాత్మాఽఽత్మనా భాసి వితత్య మాయామ్

సృష్టావివాహం జగతో విధాన

ఇవ త్వమేషోఽoత ఇవ త్రినేత్రః

నీ స్వరూపమును తెలియనివారలకు నీవు నీచే (స్వతంత్రుడవై మాయాశక్తిని విస్తరింపజేసి, అనాత్మయగు ప్రకృతియందు తాదాత్మ్యమును పొందిన పరిచ్చిన్నజీవుడు వలె భాసించెదవు. జగత్తును సృష్టించే సమయమునందు నీవే బ్రహ్మనగు నేను వలే, పాలించే సమయములో విష్ణువు అగు నీవు వలే, ప్రళయమునందు ముక్కంటియగు రుద్రుడు వలె నీవే భాసించుచున్నావు.

సురేష్వృషి ష్వీశ తథైవ నృష్వపి తిర్యక్షు యాదస్స్వపి తేఽజనస్య

జన్మాసతాం దుర్మదనిగ్రహాయ ప్రభో విధాతస్సదనుగ్రహాయ చ

సర్వసమర్థుడవగు ఓ ఈశ్వరా! ఈ జగత్తును పాలించేది నీవే. నీవు దుష్టుల పొగరును అణచివేసి సత్పురుషులను రక్షించుటకై దేవత (వామనుడు) గా, మహర్షి (పరశురాముడు) గా , మానవుడు (శ్రీరాముడు) గా, పశువై కూడ (వరాహము), ఆఖరికి జలజంతువు (చేప) గానైననూ అవతరించెదవు. కాని, నీకు వాస్తవముగా పుట్టుక లేదు.

కో వేత్తి భూమన్ భగవన్ పరాత్మన్ యోగేశ్వరోతీర్బవతస్త్రిలోక్యామ్

క్వ వా కథం వా కతి వా కదేతి విస్తారయంక్రీడసి యోగమాయామ్

ఓ భగవానుడా! నీవు అనంతుడవు, ప్రకృతికి అతీతమైన ఆత్మవు నీవే. యోగమాయ నీ అధీనములో నుండును. నీవు యోగమాయను విస్తరింప జేసి క్రీడించెదవు. ముల్లోకములలో నీ లీలలు ఎక్కడ, ఏ విధముగా, ఎప్పుడు, ఎన్ని ప్రకటమగునో ఎవడు తెలియగల్గును? (తెలియలేరు).

తస్మాదిదం జగదశేషమసత్స్వరూపం

స్వప్నాభమస్తధిషణం పురుదుఃఖదుఃఖమ్

త్వయ్యేవ నిత్యసుఖబోధతనావనంతే

మాయాత ఉద్యదపి యత్సదివావభాతి

కావున, ఈ జగత్తు అంతా వాస్తవముగా లేకున్ననూ కల వలె ఉన్నట్లు భాసించుచున్నది. దీనియందు అనేకములగు దుఃఖములు పరంపరగా కలుగుచుండును. దీనియందలి సత్తాస్పూర్తులు ఈశ్వరప్రతిఫలనముచే కలిగినవే గాని, జగత్తునకు స్వంతములు కావు. ఇట్టి జగత్తు మాయాశక్తి వలన అనంతజ్ఞానానందస్వరూపుడవగు నీయందు కానవచ్చుచున్నది. అవినాశియగు నీవు మాత్రమే సత్యము కాగా, ఆజ్ఞానము వలన ఈ జగత్తు సత్యమా యన్నట్లు తోచుచున్నది.

ఏకస్త్వమాత్మా పురుషః పురాణః

సత్యస్వయంజ్యోతీరనంత ఆద్యః

నిత్యోఽక్షరోఽజప్రసుఖో నిరంజనః

పూర్ణోఽద్వయో ముక్త ఉపాధితోఽమృతః

సర్వవ్యాపకుడవగు నీవు దేహాదులయందు ఆత్మరూపముగా తెలియబడేదవు. ఆద్యంతములు లేని నీవు పరిచ్చేదములు లేని సత్ (ఉనికి), స్వయంప్రకాశచైతన్యము, కాలపరిచ్చిన్నము కాని ఆనందము స్వరూపముగా గలవాడవు. కాలాతీతుడవు, అవినాశివి అగు నీవు సర్వజగత్తునకు కారణమవు. నీయందు వికారములు గాని, కర్తత్వభోక్తృత్వాదులు గాని లేవు. దేశవస్తుకాలపరిచ్చేదములు లేని నీవు మాయాశక్తి అనే ఉపాధినుండి విముక్తుడవు.

ఏవంవిధం త్వాం సకలాత్మనామపి

స్వాత్మానమాత్మాత్మతయా విచక్షతే

గుర్వర్కలబ్ధోపనిషత్సుచక్షుషా

యే తే తరంతీవ భవానృతాంబుధిమ్ !!

నీవీ విధముగా సకలప్రాణులలో ఆత్మరూపుడవై ఉన్నావు. ఎవరైతే గురువనే సూర్యునినుండి వేదాంతజ్ఞానమనే దివ్యనేత్రమును సంపాదించి నిన్ను తమ ఆత్మరూపునిగా దర్శించెదరో, వారు సంసారమనే మిథ్యాసముద్రమును తరించినట్లు అగుదురు (అనగా బంధము మిథ్యయే, మోక్షము మిథ్యయే).

ఆత్మానమేవాత్మతయాఽవిజానతాం

తేనైవ జాతం నిఖిలం ప్రపంచితమ్

జ్ఞానేన భూయోఽపి చ తత్ప్రలీయతే

రజ్జ్వమ హేర్భోగభవాభవౌ యథా

మానవుడు తన స్వరూపమును యథాతథముగా తెలియకపోవుట చేతనే, త్రాడునందు పాము పడగ కనబడినట్లుగా, ఈ ప్రపంచమంతయు ఉన్నట్లు భాసించును. మానవుడు జ్ఞానమును పొందినచో, త్రాడునందు పాము లేకుండా పోయినట్లు, జగత్తు మరల ఆత్మయందే విలీనమగును.

అజ్ఞానసంజ్ఞౌ భవబంధమోక్షా ద్వౌ నామ నాన్యౌ స్త ఋతజ్ఞభావాత్

అజస్రచిత్యాత్మని కేవలే పరే విచార్యమాణే తరణావివాహనీ

సంసారబంధము, మోక్షము అనే రెండు ప్రసిద్ధము. కాని, ఇవి అజ్ఞానముచే కలిగిన (అజ్ఞానముయొక్క) నామములు మాత్రమే. ఆత్మ నిత్యజ్ఞానస్వరూపము, రెండవది లేనిది, ప్రకృతికీ అతీతము. విచారముచే ఆత్మతత్త్వమునరయగా, సూర్యునియందు రాత్రింబగళ్లు లేనట్లే, ఈ బంధ మోక్షములు బాధించ శక్యము కాని సచ్చిత్తత్త్వమగు ఆత్మకంటె వేరుగా లేనే లేవు.

త్వామాత్మానం పరం మత్వా పరమాత్మానమేవ చ

ఆత్మా పునర్బహిర్మృగ్య అహోఽజ్ఞజనతాఽజ్ఞతా

అజ్ఞానులగు జనులు ఆత్మరూపుడవగు నిన్ను ఇతరునిగను, ఆత్మకాని దేహాదులను ఆత్మగను తలచి, ఆత్మరూపుడవగు నిన్నైతే తమకంటే బయట వెదుకుచుందురు. అయ్యో! వారి అజ్ఞానము ఎంత బలీయమో!

అంతర్బవేఽనంత భవంతమేవ

హ్యతత్త్యజంతో మృగయంతి సంతః

అసంతమప్యంత్యహిమంత రేణ

సంతం గుణం తం కిము యాంతి సంతః

ఓ అనంతా! పుట్టి గిట్టే దేహము మధ్యలో ఇంద్రియములు మొదలగు అనాత్మను అపవాదము చేసి వివేకులు నిన్ను ఆత్మరూపునిగా అన్వేషించి తెలియుదురు. త్రాడునందు పాము లేకున్ననూ, దానిని నిషేధించకుండా వివేకులైనా అక్కడే ఉన్న త్రాడును తెలియగల్గుదురా? (తెలియజాలరు).

అథాఽపి తే దేవ పదాంబుజద్వయప్రసాదలేశానుగృహీత ఏవ హి

జానాతి తత్త్వం భగవన్మహిమ్నో న చాన్య ఏకోఽపి చిరం విచిన్వన్!!

ఓ దేవా! ఆత్మానాత్మవివేకముచే నిన్ను తెలియుదురనేది యథార్థమే. అయిననూ, పద్మములవంటి నీ పాదముల జంటయొక్క అనుగ్రహలేశము చేనైననూ కృతార్థుడు కానివాడు ఆత్మరూపుడగు భగవానుని మహిమను యథాతథముగా తెలియలేడనేది నిశ్చయము. నీ అనుగ్రహము లేనివాడు చాల కాలము ఒంటరియై ఆత్మవిచారము చేసిననూ నిన్ను తెలియలేడు.

తదస్తు మే నాథ స భూరిభాగో భవేఽత్ర వాఽన్యత్ర తు వా తీరశ్చామ్,

యేనాహమేకోఽపి భవజ్జనానాం భూత్వా నిషేవే తవ పాదపల్లవమ్

ఓ ప్రభూ! అందువలన (నీ భక్తి లేనిదే ముక్తి లేదు గనుక), ఈ జన్మలో గాని, లేదా మరియొక పశువు మొదలైన జన్మలోనైనా, నాకు నీ చిగురువంటి పొదమును నిష్ఠతో సేవించే మహాభాగ్యము కలుగు గాక! నేను నీ భక్తులలో ఎవడో ఒక అనామకుడనైనా పరవా లేదు.

అహోఽతిధన్యా వ్రజగోరమణ్యః

స్తన్యామృతం పీతమతీవ తే ముదా

యాసాం విభో వత్సతరాత్మజాత్మనా

యత్తృప్తయేఽద్యాపి న చాలమధ్వరాః

ఓ ప్రభూ! గోకులమునందలి ఆవులు, తల్లులు మిక్కిలి ధన్యులు. ఆహా! ఎందుకంటే, ఈనాటికీ కూడా యజ్ఞములు నీకు కలిగించలేని తృప్తిని వారు నీకు కలిగించిరి. నీవు దూడల రూపములో అమృతము వంటి ఆవుల పాలను, గోపబాలకుల రూపములో తల్లుల పాలను అతిశయించిన ఆనందముతో త్రాగితివి.

అహో భాగ్యమహో భాగ్యం నందగోపవ్రజౌకసామ్

యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనమ్

ఆహా ఏమి భాగ్యము! నందుడనే గోపాలకుని గోకులమునందు నివసించువారలకు, ఆహా! ఏమి భాగ్యము! సర్వాతిశాయి ఆనందమే స్వరూపముగా గల కాలాతీతమైన పూర్ణపరబ్రహ్మ వారికి మిత్రుడైనాడు.

ఏషాం తు భాగ్యమహిమాఽచ్యుత తావదాస్తా

మేకాదశైవ హి వయం బత భూరిభాగాః

ఏతద్దృషీకచష కైరసకృత్పిబామః

శర్వాదయోఽoఘ్ర్యదజమధ్వమృతాసవం తే

ఓ అచ్యుతా! ఈ గోకులవాసులయొక్క మహాభాగ్యమునైతే అట్లుండనిమ్ము, ఆహా! రుద్రుడు (అహంకారము), బ్రహ్మదేవుడు (బుద్ధి), చంద్రుడు (మనస్సు), దిగ్గేవతలు (వినికిడి), వాయువు (స్పర్శ), సూర్యుడు (చూపు), వరుణుడు (రసనేంద్రియము), అశ్వినీ దేవతలు (ఘ్రాణము), అగ్ని (వాక్కు), ఇంద్రుడు (చేతులు), ఉపేంద్రుడు (పాదములు) అనే మేము పదకొండు ఇంద్రియాధిష్ఠానదేవతలము మహాభాగ్యవంతులము. ఎందుకంటే, ఈ గోకులవాసుల ఇంద్రియములనే పాత్రలతో నీ పాదపద్మముల తేనె అనే అమృతరసమును పలుమార్లు పానము చేయుచున్నాము.

తద్భూరిభాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం

యధ్గోకులేఽపి కతమాంఘ్రిరజోఽభి షేకమ్

యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుందః

త్వద్యాపి యత్పదరజశ్శ్రుతిమృగ్యమేవ

ఈ భూలోకములో గోకులములో అడవిలోనైనా ఏదో ఒక జన్మ యేది గలదో అదియే మహాభాగ్యము. ఎందుకంటే, ఎవరో ఒక గోపాలకుని పాదధూళితో నాకు అభిషేకము అగును. ఆ గోపాలకులకైతే జీవితమంతా మోక్ష ప్రదాత, శ్రీహరీ భగవానుడు అగు నీవు మాత్రమే. శ్రుతులు ఈ నాటికి కూడా నీ పాదముల ధూళిని అన్వేషిస్తూనే ఉన్నవి సుమా!

ఏషాం ఘోషనివాసినాముత భవాన్ కీం దేవ రాతేతి నః

చేతో విశ్వఫలాత్పలం త్వదపరం కుర్రాప్యయన్ముహ్యతి

సద్వేషాదివ పూతనాఽపీ సకులా త్వామేవ దేవాషితా

యద్ధామార్థసుహృత్ప్రియాత్మతనయప్రాణాశయాస్త్వత్కృతే

ఓ దేవా! ఇంతేగాక, ఈ గోకులవాసులకు నీవు ఏమి ఫలమునిచ్చెదవా అని ఆలోచించి మా బుద్ధి వ్యామోహమును పొందినది. మాకు ఏ దేశకాలములలోవేవమా నీకంటే మరింక పలము. మిగిడి తోచలేదు. ఓ దేవా! పూతన సజ్జనుల వేషమును వేసుకున్నంత మాత్రాన కులముతో సహా నిన్నే పొందినది. ఈ గోకులవాసుల కైతే ఇల్లు, సంపద, మిత్రులు, ప్రియమైన వ్యక్తి, ప్రియమైన వస్తువు, దేహము, సంతానము, ప్రాణములు, అంతఃకరణము అన్నీ నీ కొరకే.

తావద్రాగాదయః స్తేనాస్తావత్కారాగృహం గృహమ్

తావన్మోహోంఽ ఘ్రినిగడో యావత్కృష్ణ న తే జనాః

ఓ శ్రీకృష్ణా! ఎంతవరకైతే జనులు నీవారు కారో, అంతవరకు మాత్రమే రాగద్వేషములు పరమార్ధమును అపహరించే చోరులు, ఇల్లు కారాగారము, మోహము కాలి సంకెల యగును.(అనగా నీ భక్తులకు ఇవి యేవీ బంధ హేతువులు కావని యర్థము).

ప్రపంచం నిష్ప్రపంచోఽపి విడంబయసి భూతలే

ప్రపన్నజనతాఽఽనందసందోహం ప్రథితుం ప్రభో

ఓ ప్రభూ! నీవు ప్రపంచమునకు అతీతుడవే. అయిననూ, భూలోకమునందు శరణాగతులైన జనుల ఆనందముల సమూహమును విస్తరింప జేయుటకై నీవు ప్రపంచమును అనుకరించుచున్నావు.

జానంత ఏవ జానంతు కిం బహూక్త్యా న మే ప్రభో

మనసో వపుషో వాచో వైభవం తవ గోచరః

ఓ ప్రభూ! నిన్ను తెలియువారే తెలియుదురు గాక! పలు మాటలతో పని యేమి? నీ వైభవము నా మనోవాక్కాయములకు గోచరము కాదు.

అనుజానీహి మాం కృష్ణ సర్వం త్వం వేత్సి సర్వదృక్

త్వమేవ జగతాం నాథో జగదేతత్తవార్పితమ్

ఓ శ్రీకృష్ణా! నాకు అనుమతినిమ్ము. సర్వసాక్షివగు నీకు సర్వము దెలియును. నీవే జగత్తులకు రక్షకుడవు. (నాది అనుకున్న ఈ జగత్తును నేను నీకు సమర్పించుచున్నాను.

శ్రీకృష్ణ వృష్ణి కులపుష్కరజోషదాయిన్

క్ష్మానిర్జరద్విజపశూదధివృద్ధికారిన్

ఉద్ధర్మశార్వహర క్షితిరాక్షసధ్రు-

గాకల్పమాఽర్కమర్హన్ భగవన్నమస్తే

ఓ శ్రీకృష్ణ భగవానుడా! నీవు వృష్టివంశమనే పద్మమును వికసింపజేసిన సూర్యుడవు, భూమి, దేవతలు, వేదవేత్తలు, పశువులు అనే సముద్రమును వర్ధిల్లజేసిన చంద్రుడవు, ధర్మమువలె కనబడే అధర్మమనే రాత్రి చీకటిని పోగొట్టే సూర్యుడవు. నీవు భూలోకమునందలి రాక్షసులను సంహరించెదవు. సూర్యునితో సహా అందరు నిన్ను పూజించెదరు. నీకు కల్పాంతము వరకు నేను నమస్కరించుచున్నాను.

శ్రీశుక ఉవాచ

ఇత్యభిష్టూయ భూమానం త్రిః పరిక్రమ్య పాదయోః

నత్వాఽభీష్టం జగద్ధాతా స్వధామ ప్రత్యపద్యత

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు అనంతుడగు శ్రీకృష్ణుని ఈ విధముగా అభిముఖముగా స్తుతించి, మూడు సార్లు ప్రదక్షిణము చేసి, రెండు పాదములకు నమస్కరించి, తాను ఇష్టపడే తన లోకమును చేరెను.

తతోఽనుజ్ఞాప్య భగవాన్ స్వభువం ప్రాగవస్థితామ్

వత్సాన్ పులినమానిన్యే యథాపూర్వసఖం స్వకమ్

తరువాత శ్రీకృష్ణ భగహనుడు స్వయంభువుడగు బ్రహ్మదేవుని వద్ద సెలవు తీసుకొనెను. సంవత్సరము క్రితంలో వలెనే దూడలు ఎదురుగా నిలిచి యుండెను. వాటిని తీసుకొని ఆయన తాను భోజనము చేసిన ఇసుక తిన్నె వద్దకు రాగా, అచట సంవత్సరం క్రితంలో వలెనే ఆయన మిత్రులు ఉండిరి.

ఏకస్మిన్నపి యాతేఽబ్దే ప్రాణేశం చాంతరాఽఽత్మనః

కృష్ణమాయాహతా రాజన్ క్షణార్ధం మేని రేఽర్బకాః

ఓ పరీక్షిన్మహారాజా! గోపబాలకులు శ్రీకృష్ణుని మాయచే మోహితులైరి. తమ ప్రాణములకు ప్రభువగు శ్రీకృష్ణుడు లేకుండా ఒక ఏడాది గడచిననూ, వారి కాలమును క్షణములో సగముగనే తలపోసిరి.

కిం కిం న విస్మరంతీహ మాయామోహిత చేతసః

యన్మోహితం జగత్సర్వమభీక్ష్ణం విస్మృతాత్మకమ్

ఈ లోకములో మాయచే మోహితమైన బుద్ధి గలవారలు దేనిని దేనిని విస్మరించకుందురు?(సర్వమును విస్మరించెదరు). మాయచే మోహితమైన సకలజగత్తు మరల మరల తన ఆత్మనే విస్మరించినది.

ఊచుశ్చ సుహృదః కృష్ణం స్వాగతం తేఽతీరంహసా

నైకోఽప్యభోజి కవల ఏహితస్సాధు భుజ్యతామ్

పైగా ఆ మిత్రులు శ్రీకృష్ణునితో ఇట్లు పలికిరి --- చాల వేగముగా వచ్చితివే! ఒక్క ముద్దనైనా తింటివి కాదు (మేమింకా ఒక్క ముద్దనైననూ తినలేదు). ఇటు రమ్ము. బాగుగా భుజించుము.

తతో హసన్ హృషీ కేశోఽభ్యవహృత్య సహార్బ కైః

దర్శయంశ్చర్మాజగరం న్యవర్తత వనాద్ర్వజమ్

తరువాత ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణుడు నవ్వుతూ గోపబాలకులతో బాటుగా భోజనము చేసి, వారికి కొండ చిలువ యొక్క చర్మమును చూపిస్తూ, అడవినుండి గోకులమునకు తిరిగి వచ్చెను.

బర్హ ప్రసూననవధాతువిచిత్రితాంగః

ప్రోద్దామవేణుదలశృంగరవోత్సవాడ్యః

వత్సాన్ గృణన్ననుగగీతపవిత్రకీర్తిః

గోపీదృగుత్సవదృశః ప్రవేశ గోష్ఠమ్ !!

శ్రీకృష్ణుడు నెమలి పింఛములను, పువ్వులను, తొమ్మిది రకముల రాతి రంగులను దాల్చుటచే ఆయన అవయవములు రంగు రంగులుగా నుండెను. ఆయన పిల్లన గ్రోవిని, కొమ్ము బూరాను బిగ్గరగా వాయిస్తూ ఆ ధ్వనిచే వర్ధిల్లిన ఉత్సవముతో సంపన్నుడై యుండెను. ఆయన అనుచరులు ఆయన పవిత్రమగు కీర్తిని గానము చేయుచుండిరి. ఆయన మాడలను పేర్లు పెట్టి పిలుస్తూ గోకులములో ప్రవేశించగానే, ఆయన దర్శనము గోపికల నేత్రములకు ఉత్సవమాయెను.

ఆద్యానేన మహావ్యాలో యశోదానందసూనునా

హతోఽవితా వయం చాస్మాదితి బాలా వ్రజే జగుః

ఈనాడు యశోదానందుల పుత్రుడగు శ్రీకృష్ణుడు పెద్ద పామును చంపి, దానినుండి మమ్ములను కూడ కాపాడినాడని గోపబాలకులు గోకులములో చెప్పిరి.

రాజోవాచ

బ్రహ్మన్ పరోద్బవే కృష్ణే ఇయాన్ ప్రేమా కథం భవేత్

యోఽభూతపూర్వస్తోకేషు స్వోద్భవేష్వపి కథ్యతామ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --. ఓ మహర్షీ! తమకు పుట్టిన పిల్లలయందు కూడ ఇదివరలో ఎట్టి ప్రేమ లేదో, ఇంతటి ప్రేమ ఇతరుల పిల్లవాడైన శ్రీకృష్ణునిపై ఎట్లు కలిగినది? చెప్పడు.

శ్రీశుక ఉవాచ

సర్వేషామపి భూతానాం నృప స్వాత్మైవ వల్లభః

ఇతరేఽపత్యవిత్తాద్యాస్తద్వల్లభతయైవ హి

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! సకలప్రాణులకు తమ ఆత్మయే ప్రియమైనది. సంతానము, ధనము, అధికారము మొదలైన ఇతరములు ఆ ఆత్మకు ప్రియములగుటచే మాత్రమే ప్రియములగుచున్నవి. ఇది నిశ్చయము.

తద్రాజేంద్ర యథా స్నేహస్స్వస్వకాత్మని దేహినామ్ !

న తథా మమతాలంబిపుత్రవిత్తగృహాదిషు

ఓ పరీక్షిన్మహారాజా! కావున, దేహధారులకు తమ తమ ఆత్మయందు ఎట్టి ప్రేమ ఉండునో, అట్టి ప్రేమ మమకారమునకు ఆలంబనమైన సంతానము, ధనము, ఇల్లు, ఆస్తి మొదలగువాటియందు ఉండదు.

దేహాత్మవాదినాం పుంసామపి రాజన్యసత్తము

యథా దేహః ప్రియతమస్తథా న హ్యను యే చ తమ్

ఓ పరీక్షిన్మహారాజా! దేహమే ఆత్మ అని వాదించే వ్యక్తులకు కూడ దేహము ఎంత అధికముగా ప్రీతిపాత్రమో, దేహముననుసరించి వచ్చిన ధనధాన్యాదులయందైతే అంత ప్రీతి ఉండదు గదా!

దేహోఽపి మమతాభాక్చేత్తర్హ్యసా నాత్మవత్ప్రియః

యజ్జీర్యత్యపి దేహ్యేఽస్మిన్ జీవితాశా బలీయసీ

కొంత వివేకము గలవారికి దేహమునందు నేను అని కాక, నాది అనే అభిమానము ఉండును. వారికైననూ దేహము ఆత్మవలె ప్రియము కాదు. ఎందుకంటే, ఈ దేహము శిథిలమైనా జీవించాలనే ఆశ బలముగా నుండును.(ఆ ఆశకు ఆస్పదము శిథిలమైన దేహము గాక, దేహవిలక్షణమైన ఆత్మయేనని భావము).

తస్మాత్ప్రియతమస్వాత్మా సర్వేషామపి దేహినామ్

కావున, సకలప్రాణులకు కూడ ఆత్మయే అత్యంతము ప్రియము. కదిలే పుత్రాదులు, కదలని గృహాదులతో కూడిన ఈ జగత్తు ఆ ఆత్మ కొరకు మాత్రమే ప్రియమగుచున్నది.

కృష్ణ మేనమవేహి త్వమాత్మానమఖిలాత్మనామ్

జగద్ధితాయ సోఽప్యత్ర దేహీవాభాతి మాయయా

ఈ శ్రీకృష్ణుడు సకలప్రాణుల ఆత్మయని నీవు దెలియుము. ఈయన జగత్తునకు హితము కొరకే మాయాశక్తిచే దేహధారివలె కన్పట్టుచున్నాడు.

వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్ను చరిష్ణు చ

భగవద్రూపమఖిలం సాన్యద్వస్త్విహ కించన

శ్రీకృష్ణుని పరమార్థస్వరూపము తెలిసినవారలకు ఈ జగత్తులో కదిలేవి, కదలనివి సర్వము భగవానుని రూపమే. భగవానునికంటె వేరుగా కొంచెమైననూ ఏదీ ఈ లోకములో లేదు.

సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః

తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యతామ్

పదార్థములన్నింటికీ కారణమొకటి (ప్రకృతి) స్థిరముగా నుండును. అదియే ఆ వస్తువు యొక్క పరమార్థము. ఆ కారణమునకు కూడ శ్రీకృష్ణ భగవానుడు కారణము. ఆ శ్రీకృష్ణుడు కాని వస్తువును దేనినైననూ చూపించుడు (అట్టిది ఏదీ లేదని భావము).

సమాశ్రితా యే పదపల్లవప్లవం

మహత్పదం పుణ్యయశోమురారేః

భవాంబుధిర్వత్సపదం పరం పదం

పదం పదం యద్విపదాం న తేషామ్

మురుడనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణుని కీర్తి పవిత్రమైనది. మహాత్ములు ఆశ్రయించే ఆయనయొక్క చిగురుటాకువంటి పాదమునెవరైతే గట్టిగా పట్టుకొనెదరో, వారు సముద్రమువంటి సంసారమును దూడ గిట్ల గాడిని దాటినంత తేలికగా తరించేదరు. వారికి సర్వాతి యయు మోక్ష స్థానము లభించును. ఆపదలకు నిలయమగు సంసారo మరల వారికి కలుగదు.

ఏతత్తే సర్వమాఖ్యాతం యత్ప్రష్టోఽహమిహ త్వయా

యత్కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితమ్

శ్రీకృష్ణ భగవానుడు తన ఐదవ యేట చేసిన లీలను ఆయనకు ఆరవ ఏడు వచ్చినప్పుడు అంతటా కీర్తించిరి. ఈ లీల విషయములో నీవు నన్ను అడిగిన ప్రశ్నకు ఈ సమాధానమునంతనూ నేను నీకు చెప్పితిని.

ఏతత్సుహృద్భిశ్చరితం మురారేరఘార్ధనం శాద్వలజేమనం చ

వ్య క్తేతరద్రూపమజోర్వభీష్టవం శృణ్వన్గృణన్నేతి నరోఽఖిలార్థాన్

మురాసురుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు మిత్రులతో కూడి చేసిన లీలలను, అఘాసుర సంహారమును, పచ్చిక బయలునందు భుజించుటను, దూడల రూపముగా పచ్చికను తినుటను; ఇంద్రియగోచరమయ్యే జడజగత్తుకంటే విలక్షణమైన చైతన్యస్వరూపుడై యుండుటను, స్వయంభువుడగు బ్రహ్మదేవుడు చేసిన గొప్ప స్తోత్రమును వినే మరియు కీర్తించే మానవుడు నాలుగు పురుషార్థములను పొందును.

ఏవం విహారైః కౌమారైః కౌమారం జహాతుర్ర్వజే

నిలాయనై స్సేతుబంధైర్మర్కటోత్ప్లవనాదిభిః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్దే చతుర్దశోఽధ్యాయః

ఈ విధముగా దాగుడు మూతలు, ఇసుకలో సేతువును కట్టుట, కోతి కొమ్మచ్చి, గోటీలు మొదలగు ఐదేళ్ల వయస్సులో ఆడే ఆటలతో బలరామకృష్ణులు గోకులములో ఆ వయస్సును గడిపి వేసిరి.

శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో బ్రహ్మస్తుతిని వర్ణించే పదునాల్గవ అధ్యాయము ముగిసినది.