13 - బ్రహ్మదేవుడు వ్యామోహితుడగుట

శ్రీశుక ఉవాచ

సాధు పృష్టం మహాభాగ త్వయా భాగవతోత్తమ

యన్నూతనయసీశస్య శృణ్వన్నపి కథాం ముహుః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! నీవు గొప్ప భాగ్యము గలవాడవు, భగవద్భక్తులలో శ్రేష్ఠుడవు. నీవు బాగుగా ప్రశ్నించితివి. ఎందుకంటే, నీవు పలుమార్లు విన్ననూ, శ్రీకృష్ణ భగవానుని గాథకు నీ ప్రశ్నల ద్వారా ఒక కొత్తదనమును కలిగించుచున్నావు.

సతామయం సారభృతాం నిసర్గో యదర్ధవాణీశ్రుతిచేతసామపి,

ప్రతిక్షణం నవ్యవదచ్యుతస్య యత్ స్త్రీయా విటానామివ సాధు వార్తా

సత్పురుషుల వాక్కు శ్రీహరినే కీర్తించును, చెవులు శ్రీహరి గాథనే వినును, మనస్సు ఆ శ్రీహరినే ధ్యానించును. సారమును గ్రహించే అట్టి సత్పురుషుల స్వభావము ఇదియే. ఏదనగా, విటులకు యువతుల వార్త వలె, వారికి శ్రీకృష్ణ భగవానుని ప్రసంగము ప్రతిక్షణము బాగా కొత్తదివలె నుండును.

శృణుష్వావహితో రాజన్నపి గుహ్యం వదామి తే

బ్రూయుస్స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత

ఓ పరీక్షిన్మహారాజా! సావధానుడవై వినుము. అది రహస్యమే ఐననూ, నీకు చెప్పెదను. ఎందుకంటే, గురువులు ప్రేమ గల శిష్యునకు రహస్యమునైననూ చెప్పెదరు.

తథాఽఘవదనాన్మృత్యో రక్షిత్వా వత్సపాలకాన్

సరిత్పులినమానీయ భగవానిదమబ్రవీత్

ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుడు దూడలను, గోపబాలకులను మృత్యురూపమైన అఘాసురుని నోటినుండి రక్షించి యమునానదియొక్క ఇసుకతిన్నె వద్దకు తీసుకువచ్చి ఇట్లు పలికెను.

అహోఽతిరమ్యం పులినం వయస్యాః

స్వకేలిసంపన్మృదులాచ్ఛవాలుకమ్

స్ఫుటత్సరోగంధహృతాలిపత్రిక

ధ్వనిప్రతిధ్వనలసద్ద్రుమాకులమ్

ఆహా! మిత్రులారా! ఇసుకతిన్నె చాల అందముగా నున్నది. మెత్తని స్వచ్చమగు ఇసుక గల ఇది మన ఆటపాటలకు అన్ని విధముల సామగ్రిని కలిగియున్నది (విశాలమైనది). సరస్సులోని పద్మములు వికసించి సర స్సే వికసించినట్లున్నది. వాటి పరిమళముచే ఆకర్షితములైన తుమ్మెదలు, పక్షులు నీటిలో చేసే ధ్వనులను ప్రతిధ్వనిస్తూ ప్రకాశించే చెట్లతో వ్యాపించబడి యున్నది.

అత్ర భోక్తవ్యమస్మాభిర్దివాఽఽరూఢం క్షుధాఽర్ధితాః

వత్సాస్సమీపేఽపః పీత్వా చరంతు శన కైస్తృణమ్

మనము ఇక్కడనే భుజించెదము. బాగా పొద్దెక్కినది. ఆకలి ఇబ్బంది పెట్టుచున్నది. దూడలు నీళ్లను త్రాగి, దగ్గరలో మెల్లగా గడ్డిని మేయుగాక!

తథేతి పాయయిత్వాఽర్భా వత్సానారుధ్య శాద్వలే

ముక్త్వా శిక్యాని బుభుజుస్సమం భగవతా ముదా

గోపబాలకులు సరేనని దూడలకు నీరు త్రాగించి వాటిని పచ్చిక బయలునందు కట్టివేసి, ఉట్టిల ముడులను విప్పి, శ్రీకృష్ణ భగవానునితో బాటుగా భోజనము చేసిరి.

కృష్ణస్య విష్వక్పురురాజిమండలైరభ్యాననాః ఫుల్లదృశో వ్రజార్భకాః

సహోపవిష్టా విపినే విరేజుశ్ఛదా యథాంఽభోరుహకర్ణికాయాః

అడవిలో గోకుల బాలకులు శ్రీకృష్ణునకు అభిముఖముగా ఆయన చుట్టూ గుండ్రని వరుసలలో దగ్గరగా కలిసి కూర్చుండిరి. వికసించిన కన్నులు గల వారు పద్మపు దుద్దు చుట్టూ ఉండే రేకలవలె ప్రకాశించిరి.

కేచిత్పుష్పైర్ధలైః కేచిత్పల్లవైరంకురైః ఫలైః

 శిగ్బిస్త్వగ్భిర్థృషద్భిశ్చ బుభుజుః కృతభాజనాః

కొందరికి పువ్వులు, కొందరికి ఆకులు, మరికొందరికి చిగుళ్లు, ఇంకొందరికి మొలకలు భోజనపాత్రలైనవి. కొందరు పళ్లను, కొందరు ఉట్టీలను, కొందరు చర్మములను, మరికొందరు చెట్టు బెరడులను, ఇంకొందరు రాళ్లను పాత్రలుగా చేసుకొని భుజించిరి.

సర్వే మిథో దర్శయంతస్స్వస్వభోజ్యరుచిం పృథక్

 హసంతో హాసయంతశ్చాభ్యవజహ్రుస్స హేశ్వరాః

వారందరు తమ తమ తినుబండారముల రుచిని వేర్వేరుగా ఒకరికొకరు చూపించుచుండిరి. వారు నవ్వుతూ నవ్విస్తూ, శ్రీకృష్ణ భగవానునితో కలిసి భుజించిరి.

బిభ్రద్వేణుం జఠరపటయోశ్శృంగవేత్రే చ కక్షే

వామే పాణౌ మసృణకవలం తత్పలాన్యంగులీషు

తిష్ఠన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్స్వైః

స్వర్గే లోకే మిషతి బుభుజే యజ్ఞభుగ్బాల కేళిః

శ్రీకృష్ణుడు నడుము కట్టిన జంట వస్త్రములయందు పిల్లన గ్రోవిని, ఎడమ కచ్చయందు కొమ్ముబూరాను బెత్తమును పెట్టుకొనెను. ఆయన చేతిలో పెరుగు అన్నపు ముద్దను, వ్రేళ్ల సందులయందు ఊరగాయ ముక్కలను పట్టుకొనెను. మిత్రుల మధ్యలో ఉన్న ఆయన తన చుట్టూ ఉన్న మిత్రులను తన పరిహాసోక్తులతో నవ్వించుచుండెను. యజ్ఞభాగములను స్వీకరించే భగవానుడు పిల్లలతో ఆడుతూ తింటూ ఉంటే స్వర్గములోని దేవతలు కళ్లప్పగించి చూచుచుండిరి.

భారతైవం వత్స పేషు భుంజానేష్వచ్యుతాత్మసు

వత్సాస్త్వంతర్వనే దూరం వివిశుస్తృణలోభితాః

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! దూడలను, కాసే ఆ బాలకులీ విధముగా శ్రీకృష్ణ భగవానునియందు లగ్నమైన మనస్సులు గలవారై భోజనము చేయుచుండిరి. ఇంతలో దూడలు గడ్డి మీది ఆశతో అడవి మధ్యలోనికి దూరముగా వెళ్లినవి.

తాన్ దృష్ట్వా భయసంత్రస్తానూచే కృష్ణోఽస్య భీభయమ్

మిత్రాణ్యాశాన్మా విరమతేహానే ష్యే వత్సకానహమ్

ఈ జగత్తులోని భయములకు శ్రీకృష్ణుడంటే భయము. ఆ గోపబాలకులు భయముతో కంగారు పడుటను ఆయన చూచెను. దూడలు ఏమైనవో అనే ఆశంక వలన కలిగిన వారి భయమును పోగొడుతూ, ఆయన వారితో నిట్లనెను -- ఓ మిత్రులారా! మీరు భోజనమును మానకుడు. నేను దూడలను ఇక్కడకు తీసుకువచ్చెదను.

ఇత్యు క్త్వాద్రిదరీకుంజగహ్వరేష్వాత్మవత్సకాన్

విచిన్వన్ భగవాన్ కృష్ణస్సపాణికబలో యయౌ

శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికి తమ దూడలను వెదుకుటకు వెళ్లాను. ఆయన చేతిలో అన్నపు ముద్ద అటులనే యుండెను. పర్వతములు, గుహలు, పొదరిళ్లలో మరియు దాగే స్థానములయందు ఆయన వెదికేను.

అంభోజన్మజనిస్తదంతరగతో మాయార్భక స్యేశితుః

ద్రష్టుం మంజు మహిత్వమన్యదపి తద్వత్సానితో వత్సపాన్,

నీత్వాఽన్యత్ర కురూద్వహాంతరదధాత్ఖేఽవస్థితో యః పురా

దృష్ట్వాఽఘాసురమోక్షణం ప్రభవతః ప్రాప్తః పరం విస్మయమ్

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! పద్మసంభవుడగు బ్రహ్మ దేవుడు ముందు ఆకాశములోనున్నవాడై సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణుడు అఘాసురునకు విముక్తినిచ్చుటను గాంచి చాల ఆశ్చర్యమును పొందెను. ఆయన అదే సమయములో శ్రీకృష్ణుని ఆ ఇబ్బందిలో అచటకు వెళ్లాను. మాయాశక్తిచే మానవబాలకుడై అవతరించిన పరమేశ్వరుని మరియొక ఆహ్లాదకరమైన మహిమను. చూడాలని ఆయన కోరిక. ఆయన దూడలను కాసే పిల్లలను, వారి దూడలను అక్కడనుండి ఇంకో చోటకు తీసుకుపోయి తాను అంతర్ధానము చెందెను.

తతో వత్సానదృష్టైవ పులినేఽపి చ వత్సపాన్

ఉభావపి వనే కృష్ణో విచికాయ సమంతతః

అప్పుడు శ్రీకృష్ణునకు అడవిలో దూడల జాడ తెలియలేదు. ఇసుకతిన్నెకు తిరిగి వస్తే ఆక్కడ గోపబాలకుల జాడ కూడ లేదు. ఆయన ఇటు దూడలను, అటు గోపబాలకులను, ఇద్దరినీ కూడ అంతటా వెదికెను.

క్వాప్యదృష్ట్వాంఽతర్విపి వత్సాన్ పాలాంశ్చ విశ్వవిత్

సర్వం విధికృతం కృష్ణస్సహసాఽవజగామ హ

అడవి మధ్యలో దూడలు కానరాలేదు. గోపబాలకులు కూడ ఎక్కడనైననూ కనబడలేదు. వెంటనే సర్వజ్ఞుడైన శ్రీకృష్ణునకు అదంతా బ్రహ్మదేవుడు చేసిన పనియేనని తెలిసి పోయెను.

తతః కృష్ణో ముదం కర్తుం తన్మాతృణాం' చ కస్య చ

ఉభయాయితమాత్మానం చక్రీ విశ్వకృదీశ్వరః

అప్పుడు జగత్కారణుడైన శ్రీకృష్ణ భగవానుడు ఇటు ఆ గోపబాలకుల తల్లులను, అటు బ్రహ్మదేవుని కూడ ఆనందింప జేయగోరెను. ఆయన తానే దూడలు, గోపబాలురు అనే రెండు రూపములుగా ప్రకటమయ్యెను.

యావద్వత్సంవత్సకాల్పకవపుర్యావత్కరాంఘ్ర్యాదికం

యావద్యష్టి విషాణవేణుదలశిగావద్విభూషాంబరమ్

 యావచ్చీలగుణాభిధాఽఽకృతివయో యావద్విహారాదికం

సర్వం విష్ణుమయం గిరేఽoగవదజస్సర్వస్వరూపో బభౌ

ఎన్ని దూడల మరియు దూడలను కాసే బాలుర చిన్ని దేహములు గలవో, ఏ ప్రమాణములో వారి చేతులు కాళ్లు ముక్కు మొదలైనవి గలవో, ఎన్నైతే బెత్తములు కొమ్ము బూరెలు పిల్లన గ్రోవులు అలంకరించుకునే ఆకులు ఉట్టిలు గలవో, ఏయే ఆభరణములు వస్త్రములు గలవో అవన్నీ ఆ శ్రీకృష్ణుడే ఆయెను. ఇంతే గాదు. ఆ దూడలకు, బాలురకు ఏయే స్వభావము, గుణములు, పేర్లు, మాట తీరులు, ఆకారములు, వయస్సులు, విహారములు, పెంకి తనములు మొదలైనవి గలవో వాటినన్నింటినీ పుట్టుక లేని ఆయన యథాతథముగా ప్రకటించెను. సర్వము విష్ణుమయమనే శ్రుతివచనమునకు ఆ స్థితి అద్దము పట్టెను.

స్వయమాత్మాఽఽత్మగోవత్సాన్ ప్రతివార్యాత్మవత్స పైః

క్రీడన్నాత్మవిహారైశ్చ సర్వాత్మా ప్రావిశద్ర్వజమ్

శ్రీకృష్ణుడు స్వయముగా తానే ఆవుదూడలై, తానే వాటిని కాసే గోప బాలకులై, తానే తనతో విహరించి క్రీడిస్తూ, తానే పోటీని వెనుకకు దోలి, సర్వము (క్రియలు, కారకములు) తానే అయి గోకులములో ప్రవేశించెను.

తత్తద్వత్సాన్ పృథజ్ఞీత్వా తత్తద్గోష్టే నీవేశ్య సః

తత్తదాత్మా భవదాజంస్తత్తత్సద్మ ప్రవిష్టవాన్

ఓ పరీక్షిన్మహారాజా! ఆయన ఆయా దూడలను వేరుగా తోలుకు వెళ్లి ఆయా ఆవుల కొట్టములయందు కట్టివేసెను. తరువాత ఆయా గోపబాలకులై వారి వారి ఇళ్లలోనికి ప్రవేశించెను.

తన్మాతరో వేణురవత్వరోత్థితా

ఉత్థాప్య దోర్భిః పరిరభ్య నిర్భరమ్

స్నేహస్నుతస్తన్యపయస్సుధాఽఽసవం

మత్వా పరం బ్రహ్మ సుతానపాయయన్

పిల్లన గ్రోవి ధ్వని వినగానే పరబ్రహ్మయగు శ్రీకృష్ణుని తమ తమ పుత్రులుగా భావించిన ఆ బాలుర తల్లులు వేగముగా లేచి పుత్రులను చేతులతో ఎత్తుకొనెడివారు. వారిని ప్రేమతో నిండుగా ఆలింగనము చేసి, ప్రేమతో స్రవించే పౌలు అనే అమృతమువంటి ఆసవమును ఆ పిల్లలచే త్రాగించెడివారు.

తతో నృపోన్మర్దనమజ్జలేపనా-

లంకారరక్షాతిలకాశనాదిభిః

సంలాలితస్స్వాచరితైః ప్రహర్షయన్

సాయం గతో యామయమేన మాధవః

ఓ పరీక్షిన్మహారాజా! ఆఖరి జామున ఇంటికి చేరాలనే నియమం ప్రకారముగా శ్రీకృష్ణ భగవానుడు సాయంకాలము ఇంటికి చేరి తన చేష్టలతో తల్లులకు ఆనందమును కలిగించెడివాడు. అప్పుడు తల్లులు తమ పుత్రులకు. అభ్యంగనస్నానము చేయించి, చందనమునలది, భూషణములనలంకరించి, దిష్టి తీసి, తిలకము దిద్ది, ఆహారము పెట్టి, నిద్ర పుచ్చి ఈ విధమైన పనులతో లాలించెడివారు.

 గావస్తతో గోష్ఠముపేత్య సత్వరం

హుంకార ఘోషైః పరిహూతసంగతాన్

స్వకాన్ స్వకాన్ వత్సరానపాయయన్

ముహుర్లిహంత్యస్స్రవదౌధసం పయః

ఆవులు ఆ అడవినుండి తొందరగా కొట్టమును చేరి హుంకారములతో లేగదూడలను పిలువగా అవి దగ్గరకు వచ్చెడివి. అపుడా ఆవులు తమ తమ లేగలను మాటి మాటికీ నాలుకతో ఆస్వాదిస్తూ పొదుగునుండి స్రవించే పాలను త్రాగించెడివి.

గోగోపీనాం మాతృతాఽస్మిన్ సర్వా స్నేహర్ధికం వినా

పురోవదాస్వపీ హరేస్తోకతా మాయయా వినా

ఆవులకు దూడల రూపములోనున్నట్టియు, గోపికలకు పుత్రుల రూపమునందున్న శ్రీకృష్ణునియందు తల్లుల వ్యవహారమంతా పూర్వమునందు వలెనే ఉండెను. కాని, ప్రేమయందు మాత్రము ఆధిక్యము ఉండెను. ఆయా రూపములయందున్న ఆయనకు కూడ వారియందు తల్లుల యెడల ప్రేమ పూర్వము వలెనే ఉండెను. కాని, అజ్ఞానముచే కలిగే ఆసక్తి మాత్రము లేకుండుటయే తేడా.

వ్రజౌకసాం స్వతోకేషు స్నేహవల్ల్యాబ్దమన్వహమ్

శనైర్నిస్సీమ వవృధే యథా కృష్ణే త్వపూర్వవత్

గోకులవాసులకు తమ పిల్లలయందు శ్రీకృష్ణునియందు వలే ప్రేవు ఉండెడిది. కాని, ఆ ప్రేమప్రవాహము ఇదివరలో లేని విధముగా హద్దులు లేకుండా మేలగా సంవత్సర పగంతము ప్రతి దినము పెరిగెను

ఇత్థమాత్మాఽఽత్మనాఽఽత్మానం వత్సపాలమీ షేణ సః

పాలయన్ వత్సపో వర్షం చిక్రీడే వనగోష్ఠయోః

గోపాలకుడగు ఆ శ్రీకృష్ణుడీ వీధముగా దూడల మరియు గోపబాలుర వేషముతో తాను తనను తనచే అడవిలో మరియు ఆవుల కొట్టములో పాలించుచుండెను. ఆ విధముగా ఆయన సంవత్సరము క్రీడించేను.

ఏకదా చారయన్ వత్సాన్ సరామో వనమావిశత్

పంచషాసు త్రియామాసు హాయనాపూరణీష్వజః

సంవత్సరము పూర్తి యగుటకు ఇంకనూ ఐదారు రోజులు మాత్రమే మిగిలేను. ఒకనాడు పుట్టుక లేని శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో గూడి దూడలను మేపుతూ అడవిని ప్రవేశించెను.

తతో విదూరాచ్చరతో గావో వత్సానుపవ్రజమ్

గోవర్ధనాద్రీశిరసి చరంత్యో దదృశుస్తృణమ్

గోవర్ధనపర్వతశిఖరముపై గడ్డి మేయుచున్న ఆవులు అక్కడనుండి చాల దూరముగా గొల్లపల్లెకు దగ్గరలో మేయుచున్న దూడలను చూచినవి.

దృష్ట్వాఽథ తత్స్నేహవశోఽస్మృతాత్మా స గోవ్రజోఽత్యాత్మపదుర్గమార్గః,

ద్విపాతకుధ్గ్రీవ ఉదాస్యపుచ్ఛోఽగాద్ధుంకృతైరాస్నుపయా జవేన

దూడలను చూచిన వెంటనే ఆ ఆవులు దూడలయందలి ప్రేమకు వశమై ఒళ్లు మరచి తమను పాలించే గోపబాలకులను, వేళ్ల శక్యము కాని దారిని కూడ లెక్క చేయకుండా వేగముగా పరుగెత్తినవి. అవి పరుగెత్తే వేగమునకు చూపరులకు రెండే కాళ్లు ఉన్నవా యనిపించును. అవి అంతటా పొలను స్రవిస్తూ హుంకరిస్తూ తోకలను తలలను పైకెత్తి పరుగెడుతూ ఉంటే మెడలు మూపురములోనికి సంకోచమును పొందినవి.

సమేత్య గావోఽధో వత్సాన్ వత్సవత్యోఽప్యపాయయన్

గిలంత్య ఇవ చాంగాని లిహంత్యస్స్వౌధసం పయః

అవి పర్వతమునకు క్రిందనున్న దూడలను - చేరినవి. కోట్టములో లేగలున్న ఆవులు కూడ వాటికి తమ పొదుగులలోని పాలను త్రాగించినవి. అవి దూడలను మ్రింగివేయుచున్నవా యన్నట్లు ఆస్వాదించుచుండెను.

గోపాస్త ద్రోధనాయాసమౌఘ్యలజ్జోరుమన్యునా

దుర్గాధ్వకృచ్చ్రతోఽభ్యేత్య గోవత్సైర్దదృశుస్సుతాన్

గోపాలకులు వాటిని ఆపే ప్రయత్నమును చేసి విఫలమైరి. దానితో వారికి సిగ్గుతో బాటు పెద్ద కోపము కలిగినది. పైగా, వారు నడువ శక్యము. కాని మార్గమును కష్టముతో దాటి వచ్చిరి. వారికి ఆవులు, దూడలతో బాటు తమ పుత్రులు కూడ కనబడిరి.

తదీక్షణోత్ప్రేమరసాప్లుతాశయా

జాతానురాగా గతమన్యవోఽర్భకాస్

ఉదుహ్య దోర్బి: పరిరభ్య మూర్దని

ఘ్రాణైరవాపుః పరమాం ముదం తే

తమ పుత్రులను చూచుటతోడనే ఆ గోపాలకుల హృదయములలో ప్రేమరసము ఉద్బుద్ధమై నింపివేసెను. వారి కోపము పోయి దాని స్థానములో అనురాగము ఉదయించెను. వారు పిల్లలను పైకెత్తుకోని చేతులతో - కౌగిలించుకొని పలుమార్లు నుదుటిపై ముద్దాడి సర్వోత్కృష్టమైన ఆనందముననుభవించిరి.

తతః ప్రవయసో గోపాస్తోకాశ్లేష సునిర్వృతాః

కృచ్చ్రాచ్ఛ నైరపగతాస్తదనుస్మృత్యుదశ్రవః

పెద్ద వయస్సు గల ఆ గోపాలకులకు పిల్లలను ఆలింగనము చేయుటచే మంచి సంతోషము కలిగినది. వారు కష్టము మీద మెల్లగా అక్కడనుండి నిష్క్రమించిరి. వారికి పిల్లలు గుర్తు వచ్చినప్పుడు కన్నీరు పెల్లుబుకుచుండెను.

వ్రజస్య రామః ప్రేమర్ర్ధేర్వీక్ష్యౌత్కంఠ్యమనుక్షణమ్

ముక్తస్తనేష్వపత్యేష్వప్య హేతువిదచింతయత్

గోకులములోని తల్లులకు, ఆవులకు స్తనపానమును విడిచి పెట్టిన సంతానముపై కూడ ప్రతిక్షణము ప్రేమ వర్ధిల్లెను. దాని వలన వారిలో పిల్లల గురించి ఉత్కంఠ పెరిగెను. దీనికి కారణము తెలియక బలరాముడిట్లు తలపోసెను.

కిమేతదద్భుతమివ వాసుదేవేఽఖిలాత్మని

వ్రజస్య పాతుమనతోకేషుపూర్వమ్ ప్రేమ వర్ధతే

సకలప్రాణులకు ఆత్మరూపుడైన వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణునియందు వలె, నాతో సహా గోకులమునకు పిల్లలపై, దూడల పై ప్రేమ పెరుగుచున్నది. ఇట్టి ప్రేమ ఇదివరలో లేదు. ఈ అద్భుతమేమి?

కేయం వా కుత ఆయాతో దైవీ వా నార్యుతాసురీ

 ప్రాయో మాయాఽస్తు మే భర్తుర్నాన్యా మేఽపి విమోహినీ

ఈ మాయ ఎట్టిది? ఎక్కడనుండి వచ్చినది? దీనిని ప్రయోగించినది దేవతలా? మానవులా? లేక రాక్షసులా? నన్ను కూడ వ్యామోహ పెట్టే ఈ మాయ బహుశః నా ప్రభువగు శ్రీహరిది కావచ్చును. ఇతరము కాజాలదు.

ఇతి సంచింత్య దాశార్హో వత్సాన్ సవయసానపి

సర్వానాచష్ట వైకుంఠం చక్షుషా వయుసేన సః

యాదవవంశీయుడగు బలరాముడు ఈ విధముగా బాగా ఆలోచించి జ్ఞానమయమగు చూపుతో చూచెను. ఆయనకు దూడలయందు, తన వయస్సువారైన బాలకులయందు కూడ శ్రీకృష్ణ భగవానుడే గోచరించెను.

నైతే సురేశా ఋషయో న చైతే

త్వమేవ భాసీశ భిదాశ్రయేఽపి

సర్వం పృథక్త్వం నిగమాత్కథం వదే-

త్యుక్తేన వృత్తం ప్రభుణా బలోఽవైత్

ఓ ప్రభూ! వీరు లోకపాలకులు కారు, మహర్షులు కూడ కారు. భేదమునకు ఆశ్రయమైన గోపాలకుల మరియు దూడల దేహమునందు , కూడ నీవు ప్రకాశించుచున్నావు. సర్వము నీవే ఎట్లు అయితివి? ఈ విషయములో గల వివేకమును చెప్పుము, అని బలరాముడు పలుకగా శ్రీకృష్ణుడు జరిగిన వృత్తాంతమును సంక్షేపముగా చెప్పెను. అప్పుడు బలరామునకు తెలిసెను.

తావదేత్యాత్మభూరాత్మమానేన త్రుట్యనేహసా

పురోవదబ్దం క్రీడంతం దదృశే సకలం హరిమ్

అంతలో స్వయంభువుడగు బ్రహ్మదేవుడు వచ్చెను. ఆయనకు తన కాలమానముచే ఒక్క క్షణము మాత్రమే గడచెను. ఆ సంవత్సరకాలము నిరంతరముగా తానే సర్వము అయి ఇదివరలో వలెనే క్రీడించుచున్న శ్రీకృష్ణ భగవానుని ఆయన చూచెను.

యావంతో గోకులే బాలాసవత్సాస్సర్వ ఏవ హి

 మాయాశయే శయానా మే నాద్యాపి పునరుత్థితాః

గోకులమునందు దూడలు, బాలురు ఎందరు గలరో వారందరు నేను మాయాశక్తితో నిర్మించిన శయ్య పై నిద్రిస్తూనే ఉన్నారు. ఈ నాటికీ వారు నిద్ర లేవలేదు. ఇది నిశ్చయము.

ఇత ఏతేఽత్ర కుత్రత్యా మన్మాయామోహితేతరే

తావంత ఏవ తత్రాబ్దం క్రీడంతో విష్ణునా సమమ్

నా మాయచే స్పృహ తప్పి ఉన్న వారు వేరు. ఇక్కడ వీరు వేరు. అక్కడ ఇక్కడ సమానముగా ఉన్నారు. వీరు ఎక్కడనుండి 1వచ్చిరి? అంతే మంది ఇచట శ్రీకృష్ణ భగవానునితో బాటు క్రీడించుచున్నారే!

ఏవ మేతేషు భయేషు చిరం ధ్యాత్వా స ఆత్మభూః

సత్యాః కే కతరే నేతి జ్ఞాతుం నేషే కథంచన

ఈ విధముగా వేర్వేరుగా కనబడే దూడలు మొదలగువాటి గురించి స్వయంభువుడగు ఆ బ్రహ్మదేవుడు చాల సేపు ఆలోచించెను. కాని, ఆ ఇద్దరిలో ఎవరు- అసలైనవారు? ఎవరు కారు? అనే విషయమును ఆయన ఏ విధముగానైననూ తెలియలేకపోయెను.

ఏవం సంమోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనమ్

స్వయైవ మాయయాఽజోఽపి స్వయమేవ విమోహితః

మోహము లేని శ్రీకృష్ణ భగవానుని మాయ జగత్తును మోహ పెట్టును. ఆయనను తన మాయచే మోహ పెట్టబోయి బ్రహ్మదేవుడు పుట్టుక లేనివాడై కూడ తానే విశేషముగా మోహమును పొందెను.

తమ్యాం తమోవన్నైహారం ఖద్యోతార్చిరివాహని

 మహతీతరమాయైశ్యం నిహంత్యాత్మని యుంజతః

రాత్రియందలి చీకటిని మంచు వలన కలిగిన చీకటి ఏమీ చేయలేదు. పైగా దానిలో విలీనమగును. పగలు సూర్యకాంతిలో మిణుగురు పురుగుయొక్క ప్రకాశము ఉన్నట్లే తెలియదు. అదే విధముగా, మహాపురుషునియందు మాయను ప్రయోగించినచో, ఆ తక్కువ స్థాయికి చెందిన మాయ ప్రయోగించినవాని సామర్థ్యమునే మట్టుబెట్టును.

తావత్సర్వే వత్సపాలాః పశ్యతోఽజస్య తత్క్షణాత్

వ్యదృశ్యంత ఘనశ్యామాః పీతకౌశేయవాససః

అంతలో బ్రహ్మదేవుడు చూచుచుండగనే వెనువెంటనే దూడలు, గోపబాలురు అందరు మేఘమువంటి శ్యామవర్ణముతో పచ్చని పట్టు వస్త్రములతో కానవచ్చిరి.

చతుర్బుజాశ్శంఖచక్రగదారాజీవపాణయః

కిరీటినః కుండలినో హారిణో వనమాలినః

వారు నాలుగు చేతులయందు శంఖము, చక్రము, గద, పద్మములను దాల్చి, కిరీటములను కుండలములను హారములను అడవి పూల మాలను ధరించియుండిరి.

శ్రీవత్సాంగదదోరత్నకంబుకంకణపాణయః

నూపురైః కటకైర్భాతాః కటిసూత్రాంగులీయకైః

వారు వక్షఃస్థలము పై శ్రీవత్సమనే పుట్టుమచ్చను, చేతులయందు బాహుపురులను, చేతులకు రత్నములు పొదిగి శంఖము వలె మూడు ధారలు గల కంకణములను, కాలియందెలను, కడియములను, నడుము త్రాళ్లను, ఉంగరములను ధరించి ప్రకాశించిరి.

ఆంఘ్రిమస్తకమాపూర్ణాస్తులసీనవదామభిః

కోమలైస్సర్వగాత్రేషు భూరిపుణ్యవదర్పితైః

గొప్ప పుణ్యాత్ములు కోమలమైన కొత్త తులసియొక్క మాలలను సమర్పించగా, వారా మాలలను కాళ్లనుండీ తలదాకా అంతటా అవయవములన్నింటియందు దాల్చిరి.

చంద్రికావిశద స్మే రైస్సారుణాపాంగవీక్షితైః

స్వకార్థానామివ రజస్సత్త్వాభ్యాం స్రష్టృపాలకాః

వారు రజోగుణము వంటి ఎర్రని ఓరచూపులు గల చూపులతో తమ భక్తుల ప్రయోజనములకు సృష్టికర్తలు వలె, సత్త్వగుణమువంటి వెన్నెల వలె స్వచ్చమైన చిరునగవులతో వాటిని పాలించువారు వలె నుండిరి.

ఆత్మాదిస్తంబపర్యంతైర్మూర్తిమద్భిశ్చరాచరైః

నృత్యగీతాద్యనేకార్హైః పృథక్ పృథగుపాసితాః

బ్రహ్మదేవునితో మొదలిడి గడ్డిపోచవరకు ఉండే కదిలే మరియు కదలని దేహధారులందరు నాట్యము, గానము మొదలైన పూజావిధులతో వారిని వేర్వేరుగా ఉపాసించుచున్నారు.

అణిమాద్యైర్మ హిమభిరజాద్యాభిర్విభూతిభిః

చతుర్వింశతిభిస్తత్వైః పరీతా మహదాదిభిః

అణిమ (సూక్ష్మరూపమును పొందుట), లఘిమ (తేలిక యగుట), ప్రాప్తి (దేనినైననూ పొందగల్గుట), ప్రాకామ్యము (మొక్కవోని ఇచ్చాశక్తి), మహిమ (పెద్ద రూపమును పొందే శక్తి), ఈశిత్వము (శాసించే శక్తి), వశిత్వము (ఇంద్రియనిగ్రహము), కామావసాయిత (నిష్కామత్వము) అనే ఎనిమిది సిద్దులు; మాయాశక్తి, క్రియాశక్తి మొదలైన శక్తులు; మహత్తు (సమష్టి బుద్ది), సూత్రము (సమష్టి ప్రాణము), సమష్టి అహంకారము, మనస్సు, కన్ను ముక్కు చెవి నాలుక చర్మము అనే ఐదు జ్ఞానేంద్రియములు, కాలు చేయి మాట విసర్జనేంద్రియము జననేంద్రియము అనే ఐదు కర్మేంద్రియములు, పృథివి జలములు అగ్ని వాయువు ఆకాశము అనే పంచభూతములు, శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనే తన్మాత్రలు, వెరసి ఇరవై నాలుగు తత్త్వములు మూర్తులను దాల్చి వారిని చుట్టుపారి యున్నవి.

కాలస్వభావసంస్కారకామకర్మగుణాదిభిః

స్వమహిధ్వస్తమహిభిర్మూర్తిమద్భిరుపాసితాః

కాలము, స్వభావము (పదార్థముల సహజధర్మము), (వాసనలకు మూలమునందుండే) సంస్కారము, కామనలు, కర్మలు (అదృష్టము), సత్త్వరజస్తమోగుణములు, పదార్థముల జాతి మొదలైనవి రూపు దాల్చి వారిని ఉపాసించెను. వారి ముందు వాటి మహిమ వెలవెల బోయెసు.

సత్యజ్ఞానానంతానందమాత్రైకరసమూర్తయః

అస్పృష్ఠ భూరిమాహాత్మ్యా అపి హ్యుపనిషద్దృశామ్

వారు పరిచ్ఛేదములు లేని సత్య-జ్ఞాన-ఆనందస్వరూపమనే ఒకే ఒక (చేతనజడవిభాగము లేని) తత్త్వముయొక్క మూర్తులు. ఉపనిషత్తుల విద్వాంసులు కూడ వారి గొప్ప మహిమను తెలియజాలరు. ఇది నిశ్చితము.

ఏవం సకృద్దదర్శాజః పరబ్రహ్మాత్మనోఽఖిలాన్

యస్య భాసా సర్వమిదం విభాతి సచరాచరమ్

ఈ విధముగా స్వయంభువుడగు బ్రహ్మదేవునకు గోపబాలకులు, గోవులు అన్నీ ఏకకాలమునందు పరబ్రహ్మ (శ్రీకృష్ణ) రూపులుగా కనబడిరి. కదిలే మరియు కదలని ప్రాణులతో నిండియున్న ఈ జగత్తంతా ఆ పరబ్రహ్మయొక్క చైతన్యప్రకాశము చేతనే ప్రకాశించుచున్నది.

తతోఽతికుతుకోద్వృత్తస్తిమితైకాదశేంద్రియః

తద్ధామ్నాఽభూదజస్తూష్ణీం పూర్దేవ్యంతీవ పుత్తికా

అప్పుడు వారి తేజస్సుచే స్వయంభువుడగు బ్రహ్మదేవుని పదకొండు ఇంద్రియములు (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు) అతిశయించిన ఆశ్చర్యముచే అలజడి పొంది స్తబ్దములైనవి. గోకులాధిష్ఠాత్రియగు దేవత వద్దనుండే బొమ్మవలే ఆయన మిన్నకుండెను.

ఇతీరే శేఽతర్క్యే నిజమహిమని స్వప్రమితికే

పరత్రాజాతోఽతన్నిరసనముఖబ్రహ్మకమీతౌ

అనీశేఽపి ద్రష్టుం కిమిదమితి వా ముహ్యతి సతి

చఛాదాజో జ్ఞాత్వా సపది పరమోఽజాజవనికామ్

అసాధారణమగు మహిమ గల పరబ్రహ్మ తర్కమునకు గోచరము కాదు. స్వప్రకాశానందస్వరూపమైన పరబ్రహ్మ పుట్టుక లేని మాయాశక్తికంటె అతీతమైనది. ఉపనిషత్తులు పరబ్రహ్మకంటే విలక్షణమైన అసత్ ను నిషేధించుట ద్వారా పరబ్రహ్మను ప్రతిపాదించును. అట్టి పరబ్రహ్మను తెలియుట సరస్వతీనాథుడగు బ్రహ్మదేవునకు కూడ చేత కాలేదు. ఇది యేమి? అని ఆయన మోహితుడు' కాగా, పుట్టుక లేని శ్రీకృష్ణ పరబ్రహ్మ వెంటనే పుట్టుక లేని మాయ అనే తెరను తప్పించెను.

తతోఽర్వాక్ప్రతిలబ్ధాక్షః కః పరేతవదుత్థితః

కృచ్చ్రాదున్మీల్య వై దృష్టి రాచష్టేదం సహాత్మనా

మాయను తొలగించుట వలన బాహ్యదృష్టి తిరిగి కలిగినది. ఆయన శవము వలె లేచి నిలబడి కష్టముగా కన్నులను తెరచి తనను, ఈ జగత్తును కూడ చూచెను.

సపద్యేవాభితః పశ్యన్ దిశోఽపశ్యత్పురః స్థితమ్

బృందావనం జనాజీవద్రుమాకీర్ణం సమాప్రియమ్

వెనువెంటనే చుట్టూ దిక్కులను చూచుచున్న బ్రహ్మదేవునకు ఎదురుగానున్న బృందావనము కనబడెను. జనులకు బ్రదుకు దెరువును కల్పించే చెట్లతో దట్టముగానున్న ఆ బృందావనము లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుని నివాసస్థానము.

యత్ర నైసర్గదుర్వైరాస్సహాసన్నృమృగాదయః

మిత్రాణీవాజితావాసద్రుతరుట్తర్షకాదికమ్

సహజసిద్ధమైన నివారించ శక్యము కాని వైరము గల మానవులు, పెద్దపులి మొదలగు కూరజంతువులు కూడ బృందావనమునందు కలిసి మిత్రులు వలే జీవించును. అది శ్రీకృష్ణ భగవానుని నివాసస్థానమగుటచే అచటనుండి క్రోధము, లోభము, భయము మొదలైనవి పారిపోయినవి.

తత్రోద్వహత్పశుపవంశశిశుత్వనాట్యం

బ్రహ్మాద్వయం పరమనంతమగాధబోధమ్

వత్సాన్ సఖీనివ పురా పరితో విచిన్వ-

దేకం సపాణికవలం పరమేష్ఠ్యచష్ట

ఆ బృందావనమునందు సకలజగన్నాథుడగు బ్రహ్మదేవుడు ఇదివరలో వలెనే గోపాలకుల వంశములోని పిల్లవానివలె నటించుచున్న అవినాశి పరబ్రహ్మను చూచెను. రెండవది లేనిది, సర్వజ్ఞము అగు ఆ పరబ్రహ్మ శ్రీకృష్ణ రూపములో ఒంటరిగా ఇదివరలో వలెనే చేతిలో అన్నపు ముద్దను కలిగియుండెను. ప్రకృతికి అతీతమైన ఆ పరబ్రహ్మ దూడలను, మిత్రులైన గోపబాలకులను చుట్టూ వెదుకుచుండెను.

దృష్ట్వా త్వరేణ నిజధోరణతోఽవతీర్య

పృథ్య్వాం వపుః కనకదండమివాభిపాత్య

స్పృష్ట్వా చతుర్ముకుటకోటిభిరంఘ్రియుగ్మం

నత్వా ముదశ్రుసుజలైరకృతాభిషేకమ్

బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని చూచి వెంటనే తన హంసవాహనమునుండి దిగి, బంగరు దండమువంటి దేహము నేలపై పడునట్లుగా సాష్టాంగనమస్కారమును చేసెను. ఆయన శ్రీకృష్ణుని రెండు పాదములకు తన నాలుగు కిరీటముల కొనలు తగులునట్లుగా నమస్కరించి, ఆనందముతో స్రవించే కన్నీరే దివ్యజలములు కాగా అభిషేకించెను.

ఉత్థాయోత్థాయ కృష్ణస్య చిరస్య పాదయోః పతన్

ఆస్తే మహిత్వం ప్రాగ్దృష్టం స్మృత్వా స్మృత్వా పునః పునః

ఇదివరలో తాను చూచిన శ్రీకృష్ణుని మహిమను బ్రహ్మదేవుడు పలుమార్లు తలచుకొనుచుండెను. ఆయన చాల సేపు మరల మరల లేచి లేచి ఆయన రెండు కాళ్లపై పడుతూ ఉండెను.

శనైరథోత్థాయ విమృజ్య లోచనే ముకుందముద్వ్యీక్ష్య వినమ్రకంధరః

కృతాంజలిః ప్రశ్రయవాన్సమాహితస్సవేపథుర్గద్గదయైల తేలయా

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వాధే త్రయోదశోఽధ్యాయః

తరువాత బ్రహ్మదేవుడు మెల్లగా పైకి లేచి కళ్లను తుడుచుకొని మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని తల పైకెత్తి చూచెను. ఆ బ్రహ్మదేవుడు వినయముతో తలను వంచి దోసిలి యొగ్గి కొద్దిగా వణుకుతూ ఏకాగ్రచిత్తము గలవాడై బొంగురువోయిన కంఠముతో స్తుతించెను.

శ్రీమద్భాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో బ్రహ్మదేవుడు వ్యామోహమును పొందుటను వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది.