భాగవత మహా పురాణము
85 - శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి మృతులైన అన్నలను బ్రదికించుట
శ్రీబాదరాయణిరువాచ ।
అథైకదాఽఽత్మజౌ ప్రాప్తా కృతపాదాభివందనౌ ।
వసుదేవోఽభినంద్యాహ ప్రీత్యా సంకర్షణాచ్యుతౌ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత ఒకనాడు బలరామ శ్రీకృష్ణ భగవానులు వసుదేవుని వద్దకు వచ్చి పాదములకు నమస్కరించిరి. ఆయన పుత్రులనిద్దరిని ప్రేమతో అభినందించి ఇట్లు పలికెను.
మునీనాం స వచశ్శ్రుత్వా పుత్రయోర్దామసూచకమ్ ।
తద్వీర్యైర్జాతవిశ్రాంభః పరిభాష్యాభ్యభాషత ॥
ఆ వసు దేవుడు పుత్రులిద్దరి ప్రభావమును సూచించే మహర్షుల వచనమును వినెను. వారిద్దరి పరాక్రమమును చూచి ఆయనకు నమ్మకము కలిగెను. ఆయన వారిద్దరిని పిలిచి ఇట్లు పలికెను.
కృష్ణ కృష్ణ మహాయోగిన్ సంకర్షణ సనాతన ।
జానే వామస్య యత్సాక్షాత్ప్రధానపురుపౌ పరౌ ॥
ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీవు మహాయోగివి. ఓ బలరామా! నీవు సనాతనుడవగు సంకర్షణుడవు. మీరిద్దరు సాక్షాత్తు ఈ జగత్తునకు కారణరూపులైన మాయాశక్తి, పూర్ణ బ్రహ్మలని నాకు తెలియును.
యత్ర యేన యతో యస్య యస్మై యద్యద్యథా యదా ।
స్యాదిదం భగవాన్ సాక్షాత్ప్రధానపురుషేశ్వరః ॥
ఈ జగత్తు ఏయే రూపములో ఏ ప్రకారముగా ఉన్నదో ఆ సర్వము సాక్షాత్తుగా నీవే. ఈ జగత్తునకు ఆధారము, ఈ జగన్నిర్మాణమునకు కరణము (సాధనము) నీవే. నీకు చెందిన ఈ జగత్తు నీ లీల కొరకే ఉన్నది. ఇది ఉన్న కాలము కూడ నీవే. మాయాశక్తిని, జీవులను శాసించే భగవానుడవీవే.
ఏతన్నానావిధిం విశ్వమాత్మసృష్ట మధోక్షజ ।
ఆత్మనానుప్రవిశ్యాత్మన్ ప్రాణో జీవో బిభర్ఘ్యజః ॥
ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాని ఓ దేవా! పుట్టుక లేని నీవు నీచే సృష్టించబడిన అనేకప్రకారములగు ఈ జగత్తును నీవు నీచే సృష్టించి, దానిలో నీవు క్రియాశక్తిగా, జ్ఞానశక్తిగా ప్రవేశించి నీయందే నిలబెట్టుచున్నావు.
ప్రాణాదీనాం విశ్వసృజాం శక్తయో యాః పరస్య తాః । పారతంత్యాద్వైసాదృశ్యార్ద్వయోశ్చేషైవ చేష్ట తామ్ ॥
సమష్టి ప్రాణతత్త్వము మొదలైన జగత్కారణతత్త్వముల శక్తులేవి గలవో అవి పరమాత్మవే. ఎందుకంటే, ఈ తత్త్వములు పరమాత్మతంత్రములే గాని, స్వతంత్రములు కావు. పైగా, పరమాత్మ చేతనుడు కాగా, ఇవి జడములు. చేష్ట చేసే వాటికి చేష్ట మాత్రమే గలదు గాని, చేష్ట వెనుక ఉండే శక్తి పరమాత్మదే.
కాంతిస్తేజః ప్రభా సత్తా చంద్రాగ్యర్కర్ క్షవిద్యుతామ్ ।
యత్ ఛైర్యం భూభృతాం భూమేర్వృత్తిర్గంధోఽర్థతో భవాన్ ॥
చంద్రుని కాంతి, అగ్నియొక్క తేజస్సు, సూర్యుని ప్రభ, నక్షత్రముల మెరుపుల స్పురణరూపమగు ఉనికి, పర్వతముల స్థిరత్వము, భూమి సర్వాధారమై యుండుట, భూమియొక్క గంధము పరమార్థముగా నీవే.
తర్పణం ప్రాణనముపాం దేవత్వం తాశ్చ తద్రసః ।
ఓజస్సహో బలం చేష్టా గతిర్వాయోస్తవేశ్వర ॥
ఓ ఈశ్వరా! జలములలోని తృప్తినిచ్చే శక్తి, ప్రాణములను నిలబెట్టే శక్తి, పావనము చేసే శక్తి, ఆ జలములు, వాటి రసము నీవే. ఇంద్రియములలో, అంతఃకరణములో, దేహములో ప్రకటమయ్యే ప్రాణవాయువుయొక్క శక్తి, కదిలే శక్తి, నడిచే శక్తి కూడ నీ శక్తులే.
దిశాం త్వమవకాశోఽసి దిశఃఖం స్పోట ఆశ్రయః ।
నాదో వర్ణస్త్వమోంకార ఆకృతీనాం పృథక్కృతిః ॥
దిక్కుల ఖాళీ, దిక్కులు, ఆకాశము, దానికి ఆశ్రయమగు శబ్దతన్మాత్ర (సూక్ష్మాకాశము), నాదము, అక్షరము, ఓంకారము, పదార్థములలో భేదమును కలిగించే నామము నీవే.
ఇంద్రియం త్వింద్రియాణాం త్వం దేవాశ్చ తదనుగ్రహః ।
అవబోధో భవాన్ బుధ్ధర్జీవస్యానుస్మృతిస్సతీ ॥
ఇంద్రియముల విషయప్రకాశనశక్తి, అధిష్ఠానదేవతలు, వారి అను గ్రహము నీవే. బుద్ధియొక్క నిశ్చయశక్తి, జీవుని ఆత్మానుసంధానము నీవే.
భూతానామసీ భూతాదిరింద్రియాణాం చ తైజసః ।
వైకారికో వికల్పానాం ప్రధానమనుశాయినామ్ ॥
పంచభూతములలో వాటి కారణమగు తామసాహంకారము, ఇంద్రియ శక్తులలో వాటి కారణమగు రాజసాహంకారము, వివిధజ్ఞానములకు ఆశ్రయమగు దేవతలలో వారికి కారణమగు సాత్త్వికాహంకారము, కర్మవాసనలతో సంసరించే జీవులకు ఆశ్రయమగు మాయాశక్తి నీవే.
నశ్వరేష్విహ భావేషు తదసి త్వమనశ్వరమ్ ॥
యథా ద్రవ్యవికారేషు ద్రవ్యమాత్రం నిరూపితమ్ ॥
మట్టి మొదలగు ద్రవ్యముతో చేసిన కుండ మొదలగు వికారములలో వాస్తవముగా నశించని తత్త్వము మట్టి మొదలగు ద్రవ్యమే. అదే విధముగా, ఈ లోకములో నశించే స్వభావము గల సకలపదార్థములలో నశించని ఆ కారణసత్త నీవే.
సత్త్వం రజస్తమ ఇతి గుణాస్తద్వృత్తయశ్చ యాః ।
త్వయ్యద్దా బ్రహ్మణి పరే కల్పితా యోగమాయయా ॥
సత్త్వరజస్తమోగుణములు, వాటి వృత్తులగు సుఖదుఃఖమోహములు కూడ (జీవరూపముగా ప్రకటమైన) సాక్షాత్తు పరబ్రహ్మవగు నీయందు యోగమాయచే కల్పించబడినవి.
తస్మాన్న సంత్యమీ భావా యర్షి త్వయి వికల్పితాః ।
త్వం చామీషు వికారేషు హ్యన్యదావ్యావహారికః ॥
ఈ సుఖదుఃఖాది వికారములు జీవరూపుడవగు నీయందు కల్పించబడినవి. కావున, అవి నీయందు యథార్థముగా లేవు. అవి కల్పించబడిన కాలములో, నీవు వాటియందు అనువృత్తుడవై యుండెదవు. జ్ఞానముచే కల్పన అంతమైనప్పుడు నీవు వీటి సంబంధము లేని శుద్ధసచ్చిత్స్వరూపుడవై యుండెదవు.
గుణప్రవాహ ఏతస్మిన్నబుధాస్త్వభిలాత్మనః ।
గతిం సూక్ష్మామబోధేన సంసరంతీహ కర్మభిః ॥
ఈ దేహేంద్రియాదులు సత్త్వరజస్తమోగుణముల ప్రవాహము. సకలప్రాణులకు ఆత్మవగు నీవు వీటియందు, సూక్ష్మమైన సచ్చిద్రూపుడవై ఉన్నావు. కాని, నిన్ను తెలియని వారు అజ్ఞానముచే కర్మల ద్వారా ఈ జననమరణప్రవాహములో పరిభ్రమించుచున్నారు.
యదృచ్ఛయా నృతాం ప్రాప్య సుకల్పామిహ దుర్లభామ్ ।
స్వార్థ ప్రమత్తస్య వయో గతం త్వన్మాయయేశ్వర ॥
ఓ ఈశ్వరా! ఈ . లోకములో మానవజన్మ పురుషార్థమును సాధించుటలో సమర్థ మైనది, దుర్లభము. కాని, నేను అనుకోకుండా ఈశ్వరేచ్చచే దానిని పొందితిని. కాని, నీ మాయచే స్వార్థమునందు తగుల్కొని నేను అసావధానుడనై యుండగనే, వయస్సు వెళ్లిపోయినది.
అసావహం మమైవైతే దే హే చాస్యాన్వయాదిషు ।
స్నేహపాశైర్నిబధ్నాతి భవాన్ సర్వమిదం జగత్ ॥
దేహమునందు ఇది నేను అనే అహంకారము, దేహమును బట్టి వచ్చే భార్యాదులయందు వీరు నావారే అనే మమకారము అనే ఆసక్తిరూపమైన త్రాళ్లతో నీవు సకలజగత్తును గట్టిగా బంధించుచున్నావు.
యువాం న నస్సుతో సాక్షాతధానపురుషేశ్వరౌ ।
భూభారక్షత్రక్షేపణ అవతీర్ణౌ తథాఽఽత్థ హ ॥
మీరిద్దరు మా పుత్రులు కారు. మీరు సాక్షాత్తు ప్రకృతిని జీవులను శాసించే ప్రభువులు. భూమికి బరువైన రాజులను వినాశము చేసే నిమిత్తమై అవతరించినారనీ నీవే చెప్పియుంటివి.
తత్తే గతోఽస్మరణమద్య పదారవింద-
పన్నసంసృతిభయాపహమార్తబంధో।
ఏతావతాకలమలమింద్రియలాల సేన
మర్త్యాత్మదృక్ త్వయి పరే యదపత్యబుద్ధిః ॥
ఆపన్నులను రక్షించే బంధువా! అందువలన నేనీనాడు ఆపద గొన్నవాని సంసారభయమును పోగొట్టే నీ పద్మమువంటి పాదమును శరణు పొందుచున్నాను. ఇంద్రియభోగములయందలి తృష్ణ ఇక చాలును. దీని కారణముగానే నేను మరణించే దేహమునందు ఆత్మ అనే బుద్ధిని, పరబ్రహ్మవగు నీయందు పుత్రుడనే బుద్ధిని కలిగియుంటిని.
సూతీగృహే నను జగాద భవానజో నౌ
సంజజ్ఞ ఇత్యనుయుగం నిజధర్మగుప్యై ।
నానాతనూర్గగనవద్విదధజ్జహాసి
కో వేద భూమ్న ఉరుగాయ విభూతిమాయామ్ ॥
అధికముగా కీర్తించబడే ఓ దేవా! పుట్టుక లేని నేను ప్రతియుగమునందు నా ధర్మమును రక్షించుటకై అవతరించెదనని నీవు మా యిద్దరికి ప్రసవగృహములో నిశ్చయముగా చెప్పితివి. ఆకాశము వలె అసంగుడవగు నీవు అనేకరూపములను దాల్చి విడిచి పెట్టుచుందువు. పరబ్రహ్మవగు నీ విభూతుల మహిమను ఎవడు తెలియగల్గును?
శ్రీశుక ఉవాచ ।
ఆక ర్ణ్యేత్థం పితుర్వాక్యం భగవాన్ సాత్వతర్షభః ।
ప్రత్యాహ ప్రశ్రయానమః ప్రహసన్ శ్లక్ష్ణయా గిరా ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యాదవశ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుడు తండ్రియొక్క ఈ మాటను విని వినయముతో కొంచెము వంగి నమస్కరించెను. ఆయన నవ్వుతూ మధురమైన వాక్కుతో ఇట్లు బదులు చేప్పెను.
శ్రీభగవానువాచ ।
వచో వస్సమవేతార్థం తాతైతదుపమన్మ హే ।
యన్నః పుత్రాన్ సముద్దిశ్య తత్త్వగ్రామ ఉదాహృతః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- తండ్రీ! మీ ఈ వచనము యుక్తియుక్త మైన అర్థము గలదని నేను తలచెదను. మీరు పుత్రులమగు మాకు తత్త్వసమూహమును చక్కగా వివరించి చెప్పితిరి.
అహం యూయమసావార్య ఇమే చ ద్వారకొకసః ।
సర్వేఽ ప్యేవం యదుశ్రేష్ఠ విమృశ్యాస్సచరాచరమ్ ॥
యాదవులలో శ్రేష్ఠుడవైన ఓ తండ్రీ! నేను, మీరు, ఈ అన్నగారు, ఈ ద్వారకానగరవాసులు, అందరు, కదిలే మరియు కదలని ప్రాణులు ఈ విధముగా బ్రహ్మరూపముగనే తెలియబడవలెను.
ఆత్మా హ్యేకస్స్వయంజ్యోతిర్నిత్యోఽన్యో నిర్గుణో గుణైః ।
ఆత్మసృష్టిస్తత్కృతేషు భూతేషు బహుధేయతే ॥
ఏలయనగా, అద్వితీయము, స్వయంప్రకాశము, నిత్యము, నిర్గుణము అగు ఆత్మ దేహాదులకంటే విలక్షణమైనది. ఆత్మ తనచే తననుండి సృష్టించబడిన గుణములు నిమిత్తముగా ఆ గుణములచే చేయబడే ప్రాణులయందు అనేకమా యన్నట్లుగా ప్రతీయమానమగుచున్నది.
ఖం వాయుర్జ్యోతిరాపో భూస్తత్కృతేషు యథాశయమ్ ।
ఆవిస్తీరోఽల్పభూర్యేకో నానాత్వం యాత్యసావపి ॥
ఆకాశము, వాయువు, అగ్ని, జలములు, పృథివి అనే పంచభూతములు, వాటిచే చేయబడే ఘటాదులను బట్టి హెచ్చుతగ్గులు కలవి వలె కన్పట్టును. అదే విధముగా, ఈ అద్వితీయమగు ఆత్మ కూడ ఒక్కటీయే అయిననూ, అది వ్యాపించియుండే ప్రాణుల బహుత్వమును బట్టి అనేకముగను, మనుష్యాదులయందు ఆవిర్భావమును, వృక్షాదులయందు తిరోభావమును, ప్రాణిదేహముయొక్క పరిమాణమునకు తగ్గట్లుగా హెచ్చుతగ్గులను పొందినట్లుగా కన్పట్టును.
శ్రీశుక ఉవాచ ।
ఏవం భగవతా రాజన్ వసుదేవ ఉదాహృతమ్ ।
శ్రుత్వా వినష్టనానాధీస్తూష్ణీం ప్రీతమనా భూత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను - రాజా! శ్రీకృష్ణ భగవానుడీ విధముగా వర్ణించిన తత్త్వమును విని, సత్యము అనేకమనే వసుదేవుని ధారణ పటాపంచలయ్యెను. ప్రీతి జెందిన మనస్సుతో ఆయన మిన్నకుండెను.
అథ తత్ర కురుశ్రేష్ఠ దేవకీ సర్వదేవతా ।
శ్రుత్వాఽఽనీతo గురోః పుత్రమాత్మజాభ్యాం సువిస్మితా ॥
కురువంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ రాజా! తరువాత తన పుత్రులిద్దరు గురువగు సాందీపుని పుత్రుని యమలోకమునుండి తీసుకువచ్చినారని అప్పుడు విని సకలదేవతాస్వరూపురాలగు దేవకి చాల ఆశ్చర్యపడెను.
కృష్ణరామౌ సమాశ్రావ్య పుత్రాన్ కంసవిహింసితాన్ ।
స్మరంతీ కృపణం ప్రాహ వైక్లవ్యాదశ్రులోచనా ॥
కంసునిచే సంహరించబడిన పుత్రులు గుర్తుకు వచ్చి దేవకికి శోకముతో కన్నులలో నీరు నిండెను. ఆమె , శ్రీకృష్ణ బలరాములను సంబోధించి, దీనముగా నిట్లనెను.
దేవక్యువాచ !
రామ రామాప్రమేయాత్మన్ కృష్ణ యోగేశ్వరేశ్వర ।
వేదాహం వాం విశ్వసృజామీశ్వరావాదిపూరుషౌ ॥
దేవకీ ఇట్లు పలికెను --- ఓ బలరామా! రామా! నీ స్వరూపము ప్రమాణ ములకు గోచరము కాదు. ఓ శ్రీకృష్ణా! నీవు యోగేశ్వరులగు సనకాదులకు కూడ ఈశ్వరుడవు. నేను మిమ్ములనిద్దరినీ ఎరుగుదును. మీరు సృష్టిని చేసే ప్రజాపతులకు కూడ ఈశ్వరులు, జగత్కారణమగు పురుషోత్తములు.
కాలవిధ్వస్తసత్త్వానాం రాజ్ఞాముచ్ఛాస్త్రవర్తినామ్ ।
భూమేర్భారాయమాణానామవతీర్ణౌ కిలాద్య మే ॥
కాలప్రభావముచే సాధుత్వము నశించుట వలన కొందరు రాజులు శాస్త్రమునుల్లంఘించి ప్రవర్తిస్తూ భూమికి బరువగుచున్నారు. వారిని మట్టుబెట్టుటకై మీరిద్దరు నాకు పుత్రులై ఈ కాలములో అవతరించినారు.
యస్యాంశాంశాంశభాగేన విశ్వోత్పత్తిలయోదయాః ।
భవంతి కిల విశ్వాత్మంస్తం త్వాఽఽద్యాహం గతిం గతా ॥
ఓ జగత్కారణా! జగద్రూపుడవు నీవే (జగత్తుయొక్క సారతత్త్వము నీవే). మాయాశక్తి నీ అంశ. సత్త్వాదిగుణములు ఆ శక్తియొక్క అంశలు. ఆ గుణముల చిన్న అంశనుండి ఈ జగత్తుయొక్క సృష్టిస్థితిలయములు ఘటిల్లుచున్నవి. అట్టి నిన్ను నేను శరణు పొందుచున్నాను.
చిరాన్మృతసుతాదనే గురుణా కీల చోదితౌ ।
ఆనిన్యథుః పితృస్థానాద్గురవే గురుదక్షిణామ్ ॥
చాల కాలము క్రితం మరణించిన పుత్రుని తీసుకురండని గురువు కోరగా, మీరిద్దరు యముని భవనమునుండి గురువు కొరకు గురుదక్షిణగా ఆ బాలుని తీసుకువచ్చితిరి గదా! .
తథా మే కురుతం కామం యువాం యోగేశ్వరేశ్వరౌ ।
భోజరాజహతాన్ పుత్రాన్ కామయే ద్రష్టుమాహృతాన్ ॥
పుత్రులారా! మీరిద్దరు యోగేశ్వరులకు కూడ ఈశ్వరులు. నా కోరికను కూడ అదే విధముగా నెరవేర్చుడు. భోజరాజగు కంసుడు చంపిన పుత్రులను తీసుకురండు. నాకు వారిని చూడాలని కోరిక గలదు.
ఋషిరువాచ ।
ఏవం సంచోదితౌ మాత్రా రామః కృష్ణశ్చ భారత ।
సుతలం సంవివిశతుర్యోగమాయాముపాశ్రితౌ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! తల్లి ఇట్లు ప్రేరేపించగా, బలరామ శ్రీకృష్ణులు యోగమాయనాశ్రయించి సుతలలోకమును ప్రవేశించిరి.
తస్మిన్ ప్రవిష్టౌవుపలభ్య దైత్యరాడ్
విశ్వాత్మ దైవం సుతరాం తథాఽఽత్మనః ।
తద్దర్శనాహ్లాదపరిప్లుతాశయః
సద్యస్సముత్థాయ ననామ సాన్వయః ॥
సకలప్రాణులకు దైవము, తనకు సుతరాము దైవము అగు బలరామ శ్రీకృష్ణులు ఆ సుతలమునందు ప్రవేశించుటను రాక్షసరాజగు బలి చూచెను. వారిని చూచుటచే కలిగిన ఆనందముతో ఆయన హృదయము నిండిపోయెను. ఆయన పరివారముతో కూడి వెంటనే లేచి నిలబడి నమస్కరించేను.
తయోస్సమానీయ వరాసనం ముదా
నివిష్ట యోస్తత్ర మహఽఽత్మనోస్తయోః ।
దధార పాదావవనిజ్య తజ్జలం
సవృంద ఆబ్రహ్మ పునద్యదంబు హ ॥
ఆయన వారిద్దరికి ఆనందముతో ఆసనమునిచ్చెను. దానియందు వారిద్దరు కూర్చుండగా, ఆయన వారి పాదములను కడిగి ఆ నీటిని పరివారముతో కూడి తలపై దాల్చెను. ఎందుకంటే, ఆ నీరు బ్రహ్మదేవునితో సహా సకలజగత్తును పావనము చేయును.
సమరయామాస స తౌ విభూతిభిర్మహాఽర్షవస్త్రాభరణానులేపనైః । తాంబూలదీపామృతభక్షణాదిభిస్స్వగోత్రవిత్తాత్మసమర్పణేన చ ॥
ఆయన వారిద్దరికీ మిక్కిలి విలువైన వస్త్రములు, ఆభరణములు, అంగరాగములు, తాంబూలము, ధూపదీపములు, అమృతనైవేద్యము మొదలగువాటిని పుష్కలముగా ఇచ్చి బాగుగా పూజించెను. ఆయన పరివారమును, ధనమును, దేహమును కూడ వారికి సమర్పించెను.
స ఇంద్రసేనో భగవత్పదాంబుజం
బిభ్రన్ముహుః ప్రేమవిభిన్నయా ధియా ।
ఉవాచ హానందజలాకులేక్షణః
ప్రహృష్ట రోమా నృప గద్దదాక్షరమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ బలి కళ్లు ఆనందాశ్రువులతో నిండి దేహమంతా రోమాంచము కలిగెను. బుద్ధి ప్రేమతో ఆర్ద్రము కాగా, ఆయన శ్రీకృష్ణ భగవానుని పద్మమువంటి పాదమును పలుమార్లు ధరించెను. ఆయన గద్గదమైన స్వరముతో ఇట్లు పలికెను.
బలిరువాచ –
నమోఽనంతాయ బృహతే నమః కృష్ణాయ వేధసే ।
సాంఖ్యయోగవితానాయ బ్రహ్మణే పరమాత్మనే ॥
బలి ఇట్లు పలికెను --- దేశకాలపరిచ్ఛేదములు లేని పరబ్రహ్మ పరమాత్మ శ్రీకృష్ణుడే. ఆయనయే సృష్టికర్త. సాంఖ్యయోగ కర్మయోగ ములను ప్రవర్తిల్ల జేసినది ఆయనయే. ఆయనకు అనేక నమస్కారములు.
దర్శనం వాం హి భూతానాం దుష్ప్రాపం చాప్యదుర్లభమ్ ।
రజస్తమస్స్వభావానాం యన్నః ప్రాప్తౌ యదృచ్ఛయా ॥
ప్రాణులకు మీ యిద్దరి దర్శనము దుర్లభమే. అయినా, ఈశ్వరకృపచే మీ దర్శనము తేలికగా లభించుననుట నిశ్చయము. ఎందుకంటే, రజోగుణ తమోగుణ స్వభావము గల మాకు మీ యిద్దరి దర్శనమైనది.
దైత్యదానవగంధర్వాస్సిద్దవిద్యాధ్రచారణాః ।
యక్షరక్షఃపిశాచాశ్చ భూతప్రమథనాయకాః ॥
విశుద్ధసత్త్వధామ్న్యద్ధా త్వయి శాస్త్రశరీరిణి ।
నిత్యం నిబద్ధవైరాస్తే వయం చాన్యే చ తాదృశాః ॥
నీ మూర్తి రజస్తమోగుణముల సంసర్గము లేని సత్త్వగుణమయమైనది. వేదమే సాక్షాత్తుగా. నీ శరీరము. దితి పుత్రులు, దను పుత్రులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, చారణులు, యక్షులు, రాక్షసులు, పిశాచములు, భూతములు, ప్రమథగణనాయకులు, మేము, మావంటి మరికొందరు అట్టి నీయందు సర్వదా గట్టి వైరమును పూనియుందురు.
కేచనోద్బద్ధవైరేణ భక్త్యా కేచన కామతః ।
న తథా సత్త్వసంరబ్ధాస్సన్నికృష్ణాస్సురాదయః ॥
కొందరు (కంసాదులు) నీయందు గట్టి వైరముతో, కొందరు (గోపికలు) ప్రేమపూర్వకమగు భక్తితో నిన్ను చేరుకొనిరి. వారు పొందినట్లుగా, సత్త్వగుణప్రధానులగు దేవతలు, మహర్షులు మొదలగువారు నిన్ను పొందలేకపోయిరి.
ఇదమిత్థమితి ప్రాయస్తవ యోగేశ్వరేశ్వర ।
న విదంత్యపి యోగేశా యోగమాయాం కుతో వయమ్ ॥
యోగేశ్వరులకు కూడ ఈశ్వరుడవైన ఓ శ్రీకృష్ణా! (నారదాది) యోగేశ్వరులు కూడ తరుచు నీ యోగమాయ (స్వరూపమహిమ) ను ఇదమిత్తముగా తెలియకున్నారు. ఇక మా గురించి వేరుగా చెప్పవలెనా?
తన్నః ప్రసీద నిరపేక్షవిమృగ్యయుష్మత్-
పాదారవిందధిషణాన్యగృహాంధకూపాత్ ।
నిష్క్రమ్య విశ్వశరణాంఘ్ర్యుపలబ్ధవృత్తిః
శాంతో యథైక ఉత సర్వసఖైశ్చరామి ॥
చీకటి నూతివంటి ఇంటినుండి బయటపడి నేను, నిష్కాములచే (ధ్యానములో) అన్వేషించబడే జగద్రక్షకుడవగు నీ పద్మములవంటి పాదములను ఆశ్రయించవలెను. నేను జగత్తునకు ఆహారమునిచ్చి రక్షించే చెట్ల మొదళ్లయందు కాయ కసరు తిని బ్రదుకవలెను. నేను శాంతుడనై ఏకాంతములో గాని, లేదా అందరికీ మిత్రులైన జ్ఞానులతో గూడి గాని సంచరించవలెను. ఆ విధముగా తమరు నన్ను అనుగ్రహించుడు.
శాధ్యస్మానీశితవ్యేశ నిష్పాపాన్ కురు నః ప్రభో ।
పుమాన్ యచ్ఛ్రద్ధయాఽఽతిష్ఠంశ్చోదనాయ విముచ్యతే ॥
ఓ ప్రభూ! సకలజీవులను నీవు శాసించెదవు. మమ్ములను పాపము లేనివారినిగా చేసి ఆదేశించుము. నీ ఆదేశమును శ్రద్ధతో అనుష్ఠించే వ్యక్తి వేదముయొక్క విధిని షేధములనుండి విముక్తుడగును.
శ్రీభగవానువాచ ।
ఆసన్మరీచేష్షట్ పుత్రా ఊర్ణాయాం ప్రథమేఽoతరే ।
దేవాః కం జహసుర్వీక్ష్య సుతాం యభితుముద్యతమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- స్వాయంభువ మన్వంతరములో మరీచి ప్రజాపతికి ఊర్ణయందు ఆర్గురు పుత్రులు కలిగిరి. వారు దేవతలు. వారు కుమార్తెను కామిస్తున్న బ్రహ్మదేవుని చూచి నవ్విరి.
తేనాసురీమగన్ యోనిమధునాఽవద్యకర్మణా ।
హిరణ్యకశిపోర్జాతా నీతాస్తే యోగమాయయా ॥
దేవక్యా ఉదరే జాతా రాజన్ కంసవిహింసితాః ।
ఓ బలి చక్రవర్తీ! ఆ తప్పు పని కారణముగా వారు వెంటనే రాక్షసజన్మను పొంది హిరణ్యకశిపుని పుత్రులై జన్మించిరి. వారిని యోగమాయ కొనిపోయి దేవకి గర్భములో ప్రవేశ పెట్టగా వారు ఆమె పుత్రులుగా జన్మించి కంసునిచే సంహరించబడిరి.
సా తాఞ్చో చత్యాత్మజాన్ స్వాంస్త ఇమేఽధ్యాసతేఽoతికే ॥
ఇత ఏతాన్ ప్రణేష్యామో మాతృశోకాపనుత్తయే ।
తతశ్శాపాద్వినిర్ముక్తా లోకం యాస్యంతి విజ్వరాః ॥
ఆమె ఆ తన పుత్రులను గురించి శోకించుచున్నది. వారే వీరు నీ వద్ద నివసించుచున్నారు. తల్లి దుఃఖమును పోగొట్టుటకై వీరిని మేము ఇక్కడనుండి తీసుకువెళ్లేదము. తరువాత వీరు శాపవిముక్తిని పొంది దుఃఖము లేనివారై దేవలోకమునకు వెళ్లగలరు.
స్మరోద్గీథః పరిష్వంగః పతంగః క్షుద్రభృద్ఘృణీ ।
షడిమే మత్పృసాదేన పునర్యాస్యంతి సద్గతిమ్ ॥
స్మరుడు, ఉద్గీథుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభృత్తు, ఘృణీ అనే ఈ ఆర్గురు సొ అనుగ్రహముచే మరల సత్పురుషులు పొందే సౌ ధామము (మోక్షము) ను పొందగలరు.
ఇత్యు క్త్వా తాన్ సమాదాయ ఇంద్ర సేనేన పూజితౌ ।
పునర్ద్వరవతీమేత్య మాతుః పుత్రానయచ్ఛతామ్ ॥
శ్రీకృష్ణ బలరాములు ఇట్లు పలికి బలి చక్రవర్తి పూజలనందుకొని వారిని తీసుకొని మరల ద్వారకకు వచ్చి తల్లికి పుత్రులనప్పజెప్పిరి.
తాన్ దృష్ట్వా బాలకాన్ దేవీ పుత్రస్నేహస్నుతస్తనీ ।
పరిష్వజ్యాంకూరోప్య మూర్ధ్య్నజిఘ్రదభీక్ ష్ణశః ॥
ఆ పిల్లలను చూడగానే దేవకీదేవికి పుత్రులయందలి ప్రేమచే స్తనములు పొలను స్రవించెను. ఆమె వారిని ఒడిలో కూర్చుండబెట్టుకొని నుదుటిపై పలుమార్లు ముద్దాడెను.
అపాయయత్ స్తనం ప్రీతా సుతస్పర్శపరిప్లుతా ।
మోహితా మాయయా విష్ణోర్యయా సృష్టి ప్రవర్తతే ॥
దేవకి చాల సంతోషించెను. పుత్రులయందలి ప్రేమచే ఆమె స్తనములు పాలను స్రవించెను. విష్ణుమాయచే మోహితురాలైన ఆమె వారికి పాలను తావించెను. జగత్తు విష్ణుమాయచేతనే ప్రవర్తిల్లుచున్నది.
పీత్వాఽమృతం పయస్తస్యాః పీతశేషం గదాభృతః । నారాయణాంగసంస్పర్శప్రతిలబ్ధాత్మదర్శనాః ॥
వారు గదాధారియగు శ్రీకృష్ణ భగవానుడు త్రోవగా మిగిలిన ఆ దేవకియొక్క పాలను త్రాగిరి. వారికి శ్రీకృష్ణ భగవానుని దేహముయొక్క స్పర్శ వలన స్వరూపజ్ఞానము కలిగెను.
తే నమస్కృత్య గోవిందం దేవకీం పితరం బలమ్ ।
మిషతాం సర్వభూతానాం యయుర్ధామ దివౌకసామ్ ॥
వారు శ్రీకృష్ణ బలరాములకు, దేవకీ వసుదేవులకు నమస్కరించి, సకలప్రాణులు చూచుచుండగా స్వర్గవాసుల సరసన చేరిరి.
తం దృష్ట్వా దేవకీ దేవీ మృతాగమననిర్గమమ్ ।
మేనే సువిస్మితా మాయాం కృష్ణస్య రచితాం నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! మరణించిన పిల్లలు తిరిగి వచ్చుట, స్వర్గమునకు వెళ్లుట అనే ఈ సందర్భమును చూచి దేవకీదేవి చాల ఆశ్చర్యపడెను. ఇది శ్రీకృష్ణుడు రచించిన మాయయని ఆమె తలపోసెను.
ఏవంవిధాన్యద్బుతాని కృష్ణస్య పరమాత్మనః ।
వీర్యాణ్యనంతవీర్యస్య సంత్యనంతాని భారత ॥
భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అనంతమగు శక్తి గల శ్రీకృష్ణ పరమాత్మయొక్క ఇటువంటి అద్భుతములగు పరాక్రమములు అనంతముగా గలవు.
సూత ఉవాచ !
య ఇదమనుశృణోతి శ్రావయేద్వా మురారేః
చరితమమృతకీర్తీర్వర్జితం వ్యాసపుత్రైః ।
జగదఘభిదలం తద్భక్తసత్కర్ణపూరం
భగవతి కృతచిత్తో యాతి తత్ క్షేమధామ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్ధే పంచాశీతితమోఽధ్యాయః ॥
మురాసురుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుని కీర్తి అమృతము. లోకముల పాపములను నిశ్శేషముగా పోగొట్టే ఆ కీర్తిని వ్యాసపుత్రుడగు శుకమహర్షి వర్ణించినాడు. అది భగవద్భక్తు లైన సజ్జనుల చెవులకు పరమానందమునిచ్చును. దానిని ఎవడైతే వినునో, లేదా వినిపించునో, అట్టివాని మనస్సు ఆ భగవానునిపై లగ్నమగును. ఆతడు భగవానుని అభయస్వరూపమును పొందును.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో
శ్రీకృష్ణుడు వసుదేవునకు బ్రహ్మజ్ఞానమునుపదేశించి
మృతులైన అన్నలను బ్రదికించుటను వర్ణించే
ఎనుబది ఐదవ అధ్యాయము ముగిసినది (85).
Summary of chapter 85 of the Bhāgavata Mahā Purana is as follows:
Following the Kurukshetra pilgrimage, Vasudeva and Devakī returned to Dvārakā. Devakī recalled how Kṛshṇa had brought His guru's dead son back from the realm of Yamarāja and tearfully requested Kṛshṇa and Balarāma to bring back her first six infant sons who had been murdered by Kaṁsa. Śrī Kṛshṇa and Balarāma descended to the subterranean realm of Sutala, where King Bali received Them with intense devotion. Kṛshṇa retrieved the six infants, who were formerly the sons of Marīci suffering under a curse, and brought them back to Dvārakā. Devakī wept with joy, nursing her long-lost babies at her breast. Having touched Kṛshṇa's body and drunk Devakī's milk, the six infants were instantly liberated, ascending to the spiritual sky in celestial airplanes before the astonished eyes of all.