భాగవత మహా పురాణము
43 - శ్రీకృష్ణుడు కువలయాపీడమునుద్ధరించి మల్లరంగములో ప్రవేశించుట
శ్రీశుక ఉవాచ ।
ఆఢ కృష్ణశ్చ రామశ్చ కృతశౌచౌ పరంతప । మల్లదుందుభినిర్ఘోషం శ్రుత్వా ద్రష్టుము పేయతుః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- శత్రువులను తపింపజేసే ఓ రాజా! తరువాత బలరాముడు శ్రీకృష్ణుడు స్నానాదికమును ముగించిరి. వారు మల్లుల ధ్వనులను, దుందుభుల ధ్వనులను విని, చూచుటకై విచ్చేసిరి.
రంగద్వారం సమాసాద్య తస్మిన్నాగమవ స్థితమ్ । అపశ్యత్కువలయాపీడం కృష్ణోంఽబష్ఠప్రచోదితమ్ ॥
శ్రీకృష్ణుడు మల్లరంగము యొక్క ద్వారమును సమీపించి అక్కడ కువ లయాపీడమనే ఏనుగును చూచెను. అది మావటీనిచే నియంత్రించబడెను.
బద్ధ్వా పరికరం శౌరిస్సముహ్య కుటిలాలకాన్ । ఉవాచ హస్తిపం వాచా మేఘనాదగభీరయా ॥
శూరవంశోద్భవుడగు శ్రీకృష్ణుడు నడుము కట్టును బిగించి గిరజాల ముంగురులను కలిపి కట్టెను. ఆయన మేఘగర్జన వలె గంభీరమైన వాక్కుతో మావటీనితో నిట్లనెను.
అంబద్ధాంబష్ఠ మార్గం నౌ దేహ్యపక్రమ్య మా చిరమ్ । నో చేత్సకుంజరం త్వాఽద్య నయామి యమసాదనమ్ ॥
ఓ మావటీ! ఓ మావటీ! విలంబము లేకుండా ప్రక్కకు జరిగి మా ఇద్దరికీ దారిమ్ము. లేనిచో, నిన్నీ నాడు ఏనుగుతో సహా యమపురికి పంపెదను.
ఏవం నిర్భర్త్సితోంఽబష్ఠః కుపితః కోపితం గజమ్. । చోదయామాస కృష్ణాయ కాలాంతకయమోపమమ్ ॥
ఈ విధముగా శ్రీకృష్ణుడు అదలించగా, మావటివానికి కోపము వచ్చెను. ఆతడు (అంకుశముతో పొడిచి) ఏనుగునకు కోపము వచ్చునట్లు చేసెను. అడి. కాలముచే ప్రాణుల ఆయుర్దాయమును హరించే యముని పోలియుండెను. దానిని ఆతడు కృష్ణుని పైకి తోలెను.
కరీంద్రస్తమభిద్రుత్య కరేణ తరసాఽగ్రహీత్ । కరాద్విగలితస్సోఽముం నిహత్యాంఘ్రిష్వలీయత ॥
ఆ గజేంద్రము ఆ శ్రీకృష్ణునకు అభిముఖముగా పరుగెత్తి తొండముతో వేగముగా ఆయనను పట్టుకొనెను. ఆయన దానిని పిడికిలితో కొట్టి తొండమునుండి విడిపించుకొని, కాళ్ల మధ్య దూరి దానికి కానరాకుండెను.
సంక్రుద్ధస్తమచక్షాణో ఘ్రాణ దృష్టిస్స కేశవమ్ । పరామృశత్పుష్కరేణ స ప్రసహ్య వినిర్గతః ॥
బాగా కోపించిన ఆ ఏనుగు ఆ ఏనుగు ఆ శ్రీకృష్ణ భగవానుని కంటితో చూడలేకపోయినా, ముక్కుతో పసిగట్టి తొండముతో వెదికి పట్టుకొనెను. ఆయన బలముగా దాని పట్టునుండి తప్పించుకొనెను.
పుచ్చే ప్రగృహ్యాతిబలం ధనుషః పంచవింశతిమ్ । విచకర్ష యథా నాగం సుపర్ణ ఇవ లీలయా ॥
మహాబలశాలియగు ఆ ఏనుగును శ్రీకృష్ణుడు తోక పట్టుకొని, గరుడుడు సర్పమును వలె, అవలీలగా ఉన్నదానిని ఉన్నట్లుగా ఇరవై ఐదు ధనుస్సుల (వంద బారల) దూరమును లాగివేసెను.
స పర్యావర్తమానేన సవ్యదక్షిణతోఽచ్యుతః । బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః ॥
ఆ ఏనుగు కుడి యెడమలకు తిరుగుచుండగా ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడ, చుట్టూ తిరుగుచున్న దూడ తోక పట్టుకున్న పిల్లవాడు (ఒకప్పటి బాలకృష్ణుడు) వలె, ఎడమ కుడివైపులకు తిరిగెను.
తతోఽభిముఖమభ్యేత్య పాణినాఽఽహత్య వారణమ్ । ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే ॥
తరువాత ఆయన ఆ ఏనుగునకు ఎదురుగా వచ్చి చేతితో కొట్టి చుట్టూ గట్టిగా పరుగెత్తుతూ, అది వేసే ప్రతి అడుగునందు తాను దానికి దొరికిపోయినాడా యన్నట్లు కనబడుతూ, దానినే పడగొట్టెను.
స ధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః । తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోఽహనత్ క్షితిమ్ ॥
ఆయన పరుగెత్తుతూ నేలపై పడెను. కోపించియున్న ఆ ఏనుగు ఆయన పడి ఉన్నాడనే తలచి రెండు దంతములతో పొడిచెను. కాని, ఆయన ముందు క్షణమే లేచి క్షణమే లేచి తప్పించుకొనుటచే దెబ్బ నేలకు తగిలెను.
స్వవిక్రమే ప్రతిహతే కుంజ రేంద్రోఽత్యమర్షితః ! చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవద్రుషా ॥
ఆ గజేంద్రము యొక్క పరాక్రమము వ్యర్థము కాగా, దానికి చాల కోపము వచ్చెను. పైగా, మావటీండ్రు దానిని రెచ్చగొట్టుచుండిరి. అప్పుడది కోపముతో శ్రీకృష్ణునకభిముఖముగా పరుగెత్తెను.
తమాపతంతమాసాద్య భగవాన్మధుసూదనః । నిగృహ్య పొణినా హస్తం పాతయామాస భూతలే ॥
మధువు అనే రాక్షసుని సంహరించిన శ్రీకృష్ణ భగవానుడు మీదకు ఉరుకుచున్న ఆ ఏనుగును సమీపించి, దాని తొండమును చేతితో గట్టిగా పట్టుకొని నేలపై పడవేసెను.
పతితస్య పదాఽఽక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా ! దంతముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః ॥
శ్రీకృష్ణ భగవానుడు సింహము వలె అవలీలగా, క్రింద పడిన ఆ ఏనుగు యొక్క దంతమునూడబెరకి దానితో ఏనుగును, మావటీండ్రను కూడ సంహరించెను.
మృతకం ద్విపముత్సృజ్య దంతపాణి స్సమావిశత్ ! అంసన్యస్తవిషాణోఽసృఙ్మదబిందుభిరంకితః । విరూఢ స్వేదకణి కావదనాంబురుహో బభౌ ॥
శ్రీకృష్ణుడు మరణించిన ఏనుగును విడిచి పెట్టి చేతిలో దంతముతో మల్లరంగమును ప్రవేశించి దంతమును భుజముపై నుంచెను. ఆయన శరీరముపై ఏనుగు మదము, రక్తము డాగులు పడెను. పద్మమువంటి ముఖము పై మొలకెత్తుచున్న చెమట బిందువులతో ఆయన శోభిల్లెను.
వృతౌ గో పైః కతిపయెర్బల దేవజనార్దనౌ । రంగం వివిశతూ రాజన్ గజదంతవరాయుధౌ ॥
ఓ సరీక్షిన్మహారాజా! బలదేవుడు, దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు శ్రేష్ఠమగు ఏనుగు దంతమే ఆయుధము కాగా, మల్లరంగ మును ప్రవేశించిరి. కొద్దిమంది గోపాలకులు వారిని చుట్టువారి యుండిరి.
మల్లా నామశనిర్నృణాం సరవరః స్త్రీణాం స్మరో మూర్తిమాన్ గోపానాం స్వజనోఽసతాం క్షితిభుజాం శాస్తా స్వపిత్రోశ్శిశుః । మృత్యుర్భోజపతేర్విరాడవిదుషాం తత్త్వం పరం యోగినాం వృష్ణీనాం పరదేవతేతి విచితో రంగం గతస్సాగ్రజః ॥
శ్రీ కృష్ణుని మల్లులు పిడుగని, సామూన్యజసులు గొప్ప మనిషియని, యువతులు రూపు, దాల్చిన మన్మథుడని, గోపాలకులు తమ వాడని, దుష్టులైన రాజులు తమను శిక్షించువాడని, తల్లిదండ్రులు పిల్లవాడని, భోజరాజగు కంసుడు మృత్యువని, అజ్ఞానులు ప్రాకృతమానవుడని, యోగులు పరమాత్మతత్త్వమని భావించెడివారు. ఆయన అన్నగారితో కలిసి మల్లరంగమును ప్రవేశించెను.
హతం కువలయాపీడం దృష్ట్వా తావపి దుర్జయౌ । కంసో మనస్వ్యపి తదా భృశముద్వివిజే నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! ధైర్యశాలియే. కువలయాపీడమును సంహరించి జయింప శక్యము కాకుండా నిలబడి యున్న వారిద్దరిని చూచి ఆతడు అధికమైన ఉద్వేగమును పొందెను.
తా రేజతూ రంగగతౌ మహాభుజౌ విచిత్రవేషాభరణ స్రగంబరౌ । యథా నటావుత్తమవేషధారిణౌ మనః క్షిపంతౌ ప్రభయా నిరీక్షతామ్ ॥
గొప్ప భుజశక్తి గల వారిద్దరు మల్లరంగమును చేరి గొప్ప వేషము వేసుకున్న నటులు వలె ప్రకాశించిరి. వారు రంగు రంగుల వేషములను, ఆభరణములను, పుష్పమాలలను, వస్త్రములను ధరించిరి. వారు తమ కాంతిచే చూచువారల మనస్సును దోచివేయుచుండిరి.
నిరీక్ష్య తావుత్తమపూరుషా జనా మంచస్థితా నాగరరాష్ట్రకా నృప ! ప్రహర్షవేగోత్కలితేక్షణాననాః పపుర్న తృప్తా నయనైస్త దాననమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! నగరమునుండి పల్లెలనుండి వచ్చి ఆసనములపై కూర్చున్న జనులు ఆ పురుషోత్తములిద్దరిని చూచి మహానందమును పొందిరి. వారి కన్నులు, ముఖములు విప్పారెను. వారు వారిద్దరి ముఖమును కళ్లతోనే పానము చేసిరి. అయిననూ, వారికి తృప్తి కాలేదు.
పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా । జిఘ్రంత ఇవ నాసాభ్యాం శ్లేష్యంత ఇవ బాహుభిః ॥
జనులు వారిద్దరిని కళ్లతో త్రాగుచున్నారా యన్నట్లు, నాలుకతో ఆస్వాదించుచున్నారా యన్నట్లు, ముక్కు పుటములతో ఆఘ్రాణించుచున్నారా యన్నట్లు, చేతులతో కౌగిలించుచున్నారా యన్నట్లు చూచిరి.
ఊచుః పరస్పరం తే వై యథాదృష్టం యథాశ్రుతమ్ । తద్రూపగుణ మాధుర్యప్రాగల్భ్యస్మారితా ఇవ ॥
వారిద్దరి రూపమును, సద్గుణములను, మాధుర్యమును, నిర్భయత్వమును, నైపుణ్యమును చూచి జనులకు వారి లీలలు గుర్తుకు వచ్చినట్లుండెను. జనులు వారిద్దరి గురించి తాము చూచిన (ధను ర్భంగాది) దానిని, విన్న (గోవర్ధనోద్ధరణాది) దానిని ఒకరితోనొకరు చెప్పిరి.
ఏతౌ భగవతస్సాక్షాద్ధరేర్నారాయణస్య హి । అవతీర్ణావిహాం శేన వసుదేవస్య వేశ్మని ॥
దుఃఖములను పోగొట్టే నారాయణ భగవానుడే సాక్షాత్తుగా ఈ లోకములో వీరిద్దరి రూపములో వసుదేవుని ఇంటియందు తన అంశ (స్వరూపము) చే అవతరించెను సుమా!
ఏష వై కిల దేవక్యాం జాతో నీతశ్చ గోకులమ్ । కాలమేతం వసన్ గూఢో వవృధే నందవేశ్మని ॥
ఈ శ్రీకృష్ణుడైతే దేవకికి పుట్టినవాడు. ఈతనిని వసుదేవుడు గోకులమునకు కొనిపోయెను. అచట నందుని ఇంట్లో ఈతడు ఇంత కాలము రహస్యముగా ఉంటూ పెరిగి పెద్దవాడాయెను.
పూతనాఽనేన నీతాంఽతం చక్రవాతశ్చ దానవః । అర్జునౌ గుహ్యకః కేశీ ధేనుకోఽన్యే చ తద్విధాః ॥
పూతన, సుడిగాలి రూపము గల తృణావర్తుడు, శంఖచూడుడు, కేశి, ధేనుకుడు, ఇంకా ఇట్టి రాక్షసప్రవృత్తి గల ఇతరులు (అఘాసురుడు ఇత్యా దులు, ఈతనిచే వధించబడిరి. ఈతడు జంట మద్ది చెట్లను నేల గూల్చెను.
గావస్సపాలా ఏతేన దావాగ్నేః పరిమోచితాః । కాలియో దమితస్సర ఇంద్రశ్చ విమదః కృతః ॥
ఈతడు గోవులకు రక్షకుడు. ఈతడు వాటిని కార్చిచ్చునుండి కాపాడినాడు. ఈతడు కాలియసర్పము యొక్క పొగరును అణచినాడు. ఈతడు ఇంజునకు కూడ గర్వభంగమును చేసినాడు.
సప్తాహమేకహస్తేన ధృతోఽప్రపరోఽమునా ! వర్షవాతాశనిభ్యశ్చ పరిత్రాతం చ గోకులమ్ ॥
ఈతడు పెద్ద కొండను ఏడు రోజులు నిరంతరముగా ఒక్క చేతితో ఎత్తి పట్టుకొని గోకులమును వర్షము, సుడిగాలి, పీడుగులనుండి కాపాడెను.
గోప్యోఽస్య నిత్యముదితహసిత ప్రేక్షణం ముఖమ్ । పశ్యంత్యో వివిధాంస్తాపాంస్తరంతి స్మాశ్రమం ముదా ॥
ఈతని ముఖము పై ఆనందము, చిరునవ్వుతో కూడిన చూపులు ఎల్లవేళలా ఉండును. గోపికలు ఈతని ముఖమును చూస్తూ పలు రకముల దుఃఖములను శ్రమ లేకుండా ఆనందముతో అధిగమించిరి.
వదంత్యనేన వంశోఽక్యం యదోస్సుబహువిశ్రుతః ! శ్రియం యశో మహత్త్వం చ లప్ప్యతే పరిరక్షితః ॥
ఈతడు యదువంశమును అన్ని విధములుగా రక్షించుననియు, వీని చాల గొప్ప ప్రసిద్ధి గల వంశము సంపదను, కీర్తిని, గొప్పదనమును కూడ పొందగలదని పెద్దలు చెప్పుచున్నారు.
అయం చాస్యాగ్రజశ్శ్రీమాన్ రామః కమలలోచనః । ప్రలంబో నిహతో యేన వత్సకో యే బకాదయః ॥
పద్మమువంటి కన్నులతో శోభిల్లే ఈతడు ఈ శ్రీకృష్ణుని అన్నయగు బలరాముడు. ప్రలంబుడు, వత్సాసురుడు, బకుడు, ధేనుకుడు మొదలైన రాక్షసులను ఈతడు సంహరించెను.
జనే ష్వేవం బ్రువాణేషు తూర్యేషు నినదత్సు చ । కృష్ణ రామౌ సమాభాష్య చాణూరో వాక్యమబ్రవీత్ ॥
జనులు ఇట్లు చెప్పుకొనుచుండిరి. వాద్యములు మ్రోగుచుండెను. అప్పుడు శ్రీకృష్ణ బలరాములను సంబోధించి చాణూరుడిట్లు పలికెను.
హే నందసూనో హే రామ భవంతౌ వీరసంమతౌ । నియుద్ధకుశలౌ శ్రుత్వా రాజ్ఞాఽఽహూతౌ దిదృక్షుణా ॥
నందుని పుత్రుడవగు ఓ శ్రీకృష్ణా! ఓ బలరామా! మీరిద్దరు వీరులని పేరు వడసినవారు, వీరులచే సమ్మానించబడువారు. మీరు మల్ల యుద్ధములో నిపుణులని విని కంసప్రభుడు చూడ గోరి ఆహ్వానించినాడు.
ప్రియం రాజ్ఞః ప్రకుర్వంత్యశ్శ్రేయో విందంతి వై ప్రజాః ! మనసా కర్మణా వాచా విపరీతమతోఽన్యథా ।
రాజునకు మనోవాక్కాయములతో ప్రీతిని కలిగించే నిశ్చయముగా శ్రేయస్సును పొందెదరు. దీనికి విరుద్ధముగా ఆచరించువారు హానిని పొందెదరు.
నిత్యం ప్రముదితా గోపా వత్సపాలా యథా స్ఫుటమ్ । వనేషు మల్లయుద్ధేన క్రీడంతశ్చారయంతి గాః ॥
గోపాలకులు దూడలను కాయుదురు. ఆనందముగా జీవించెదరు. వారు అడవులలో ప్రతిదినము గోవులను మేపుతూ మల్లయుద్ధమును ఆటగా ఆడెదరు. ఈ విషయము అందరికీ తెలిసినదే.
తస్మాద్రాజ్ఞః ప్రియం యూయం వయం చ కరవామ హే । భూతాని నః ప్రసీదంతి సర్వభూతమయో నృపః ॥
ఓయీ! కాబట్టి మీరు మేము కూడ రాజునకు ప్రీతిని కలిగించెదము. అట్లు చేసినచో, రాజు (సకలప్రాణిరక్షకుడు) సకల ప్రాణి రూపుడు గనుక, సకల ప్రాణులు మన యెడల ప్రసన్నములగును.
తన్నిశమ్యాబ్రవీత్కృష్ణో దేశకాలోచితం వచః ! నియుద్ధమాత్మనోఽభీష్టం మన్యమానోఽభినంద్య చ ॥
ఆ మాటను విని శ్రీకృష్ణుడు మల్లయుద్ధము తమకు కూడ అభీష్టమేనని తలపోసెను. ఆయన వానికి తన అనుమోదమును తెలిపి దేశకాలములకు తగిన మాటను ఇట్లు పలికెను.
ప్రజా భోజప తేరస్య వయం చాపి వనేచరాః । కరవామ ప్రియం నిత్యం తన్నః పరమనుగ్రహః ॥
అడవులలో తిరిగే మేము కూడ భోజదేశప్రభువగు ఈ కంసుని ప్రజలమే. కావున, మేము ఎల్లవేళలా వీనికి ప్రియమును చేసెదము. పైగా, అట్లు రాజునకు ప్రీతిని కలిగించుట మాకు గొప్ప అనుగ్రహము. (మేము రాజునకు ప్రియమగు మల్లయుద్ధమును నిత్యము అడవిలో చేయుట మాపై ఈశ్వరుని గొప్ప అనుగ్రహమే).
బాలా వయం తుల్యబలైః క్రీడిష్యామో యథోచితమ్ । భవెన్నియుద్ధం మాఽధర్మస్స్పృశేన్మల్ల సభాసదః ॥
ఓ మల్లా! మేము పిల్లలము. కాబట్టి ఔచిత్యమునతిక్రమించకుండా మాతో సమానమైన బలము గలవారితో మేము మల్లయుద్ధక్రీడను చేయగలము. సభాసదులకు అధర్మము (అన్యాయమును చూచుట) అంటుకోనివిధముగా మల్లయుద్ధము జరుగవలెను.
చాణూర ఉవాచ ।
న బాలో న కిశోరస్త్వం బలశ్చ బలినాం వరః । లీలయేభో హతో యేన సహస్రద్విపసత్త్వభృత్ ॥
చాణూరుడిట్లు పలికెను --- నీవు, బలరాముడు పాలు త్రాగే పిల్లలు కాదు, వీధిలో ఆటలాడే పిల్లలు కాదు. మీరిద్దరు బలవంతులలో శ్రేష్ఠులు. వేయి ఏనుగుల బలము గల కువలయాపీడమును నీవు అవలీలగా చంపితివి.
తస్మాద్భవద్భ్యాం బలిభిర్యోద్ధవ్యం నానయోఽత్ర వై మయి విక్రమ వార్ ష్ణేయ బలేన సహ ముష్టికః ।
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే త్రిచత్వారింశోఽధ్యాయః ॥
కావున, బలశాలురగు మీరిద్దరు మల్లయుద్ధమును చేయవలెను. దీనిలో నిశ్చయముగా అన్యాయము లేదు. వృష్ఠి వంశీయుడవగు ఓ కృష్ణా! నీ పరాక్రమమును నాపై చూపుము. ముష్టికుడు బలరామునితో యుద్ధమును చేయగలడు.
శ్రీ మద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు కువలయాపీడము నుద్ధరించి మల్లరంగములో ప్రవేశించుటను వర్ణించే
నలుబది మూడవ అధ్యాయము ముగిసినది (43).
Summary of chapter 43 of the Bhāgavata Mahā Purana is as follows:
On the morning of the royal wrestling tournament, Kaṁsa stationed his mad royal elephant Kuvalayāpīḍa at the arena entrance with orders from the mahout to trample Kṛshṇa and Balarāma. As the brothers approached, the mahout drove the enraged elephant toward Kṛshṇa. Kṛshṇa playfully dodged the beast, grabbed its tail, dragged it backward, and tripped it to the ground. When the elephant charged again, Kṛshṇa pulled out its massive tusks and used them to strike down both the elephant and its mahout. Carrying the blood-stained tusks over Their shoulders, Kṛshṇa and Balarāma entered the wrestling arena, appearing differently to every spectator: as thunderbolts to the wrestlers, as the supreme truth to the rishis, as a loving relative to the Yadus, and as death personified to King Kaṁsa.