69 - నారదుడు శ్రీకృష్ణుని గార్హస్థ్యమును దర్శించుట

శ్రీశుక ఉవాచ

నరకం నిహతం శ్రుత్వా తథోద్వాహం చ యోషితామ్

కృష్ణే నైకేన బహ్వీనాం తద్దిదృక్షుస్స్మ నారదః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికేను --- నరకుడు సంహరించబడినాడనియు, శ్రీకృష్ణుడొక్కడే చాలమంది రాజకుమార్తెలను వివాహమాడినాడనియు నారదుడు వినెను. ఆయన ఆ సందర్భమును చూడగోరెను.

చిత్రం బతైతదేకేన వపుషా యుగపత్పృథక్

గృహేషు ద్వ్యష్ట సాహస్రం స్త్రీయ ఏక ఉదావహత్

ఇది అత్యాశ్చర్యము! ఒక్క శ్రీకృష్ణుడు ఒకే దేహముతో ఒకేసారి వేర్వేరు ఇళ్లయందు పదునారు వేల యువతులను వివాహమాడెను.

ఇత్యుత్సుకో ద్వారవతీం దేవర్షిర్ద్రష్టుమాగమత్

పుష్పితోపవనారామద్విజాలికులనాదితామ్

ఈ విధమైన ఉత్కంఠ గల నారదుడు (శ్రీకృష్ణుని గార్హ స్థ్యమును) చూచుటకై ద్వారకకు వచ్చెను, అచట ఉపవనములయందు, ఉద్యానముల యందు పక్షుల మరియు తుమ్మెదల గుంపులు నినదించుచుండెను.

ఉత్ఫుల్లేందీవరాంబోజకహ్లరకుముదోత్పలైః

 చురితేషు సరస్సూచ్చైః కూజితాం హంససార సైః

ద్వారకలో నల్ల కలువలు, కమలములు, చెంగలువలు, ఎర్రదామరలు, కలువలతో నిండిన సరస్సులలో రాజహంసలు, బెగ్గురు పక్షులు బిగ్గరగా కూయుచుండెను.

ప్రాసాదలక్షైర్నవభీర్జుష్టాం స్ఫాటీకరాజతైః

మహామరకతప్రఖ్యైస్స్వర్ణరత్నపరిచ్ఛదైః

ఆ ద్వారకలో స్పటికముతో వెండితో నిర్మించిన తొమ్మిది లక్షల ప్రాసాదములు ఉండెను. అవి గొప్ప పచ్చలతో, రత్నములు పొదిగిన బంగరు సామగ్రితో ప్రకాశించెను.

విభక్తరథ్యాపథచత్వరాపణైశ్శాలాసభాభీ రుచిరాం సురాలయైః

 సంసిక్తమార్గాంగణవీథిదేహలీం పతత్పతాకాధ్వజపారితాతపామ్

ఆ నగరమునందు రథమార్గములు, ఇతర మార్గములు, కూడళ్లు, అంగళ్లు విభాగముగా నిర్మించబడెను. సత్రములు, గుర్రాల శాలలు, సభలు, దేవతామందిరములతో ఆ నగరము అందముగా నుండెను. అక్కడి మార్గములు, అంగళ్లు, చిన్న వీథులు, ఇళ్ల ద్వారములయందు నీరు చల్లబ డెను. రెప రెపలాడే పతాకలు, టెక్కెములు ఎండను వారించెను.

తస్యామంతఃపురం శ్రీమదర్చితం సర్వధిష్ణ్య పైః

హరేస్స్వకౌశలం యత్ర త్వష్ట్రా కార్ త్స్న్యేన దర్శితమ్

ఆ ద్వారకలో శోభాయుక్త మైన శ్రీకృష్ణ భగవానుని అంతః (లోపలి) పురము గలదు. దానిని లోకపాలకులందరు ఆదరించెదరు. విశ్వకర్మ తన నేర్పును పూర్తిగా దానియందు ప్రదర్శించినాడు.

తత్ర షోడశభిస్సద్మసహస్రైస్సమలంకృతమ్

వివేశైకతమం శౌరేః పత్నీనాం భవనం మహత్

ఆ అంతఃపురమునకు పదహారు వేల భవనములే అలంకారము. అవి శ్రీకృష్ణుని భార్యల భవనములు. నారదుడు వాటిలో ఒక గొప్ప భవనమును ప్రవేశించెను.

విష్టబ్దం విద్రుమస్తం భైర్వైదూర్యఫలకోత్తమైః

ఇంద్రనీలమయైః కుడ్యైర్జగత్యా చాహతత్విషా

ఆ భవనముయొక్క ఆధారస్తంభముల పై పగడాలను, స్తంభములపై నుండే సెజ్జలకు వైడూర్యములను, గోడలకు ఇంద్రనీలములను పొదిగిరి. ఆ భవనములోని నేల కూడ సాటిలేని కాంతితో ప్రకాశించేను.

వితానైర్నిర్మి తైస్త్వష్ట్రా ముక్తదామవిలంబిభిః

దాంతైరాసనపర్యం కైర్మణ్యుత్తమపరిష్కృతైః

ఆ భవనమునందు విశ్వకర్మ ముత్యాల సరులు వ్రేలాడే మేలుకట్టులను నిర్మించెను. దానియందు ఏనుగు దంతములతో చేసి శ్రేష్ఠమగు మణులచే అలంకరించబడిన ఆసనములు, శయ్యలు గలవు.

దాసీభిర్నిష్కకంఠభిస్సువాసోభిరలంకృతమ్

పుంభిస్సకంచుకోష్టీషసువస్త్రమణికుండలైః

ఆ భవనమునందలి పరిచారికలు మెడలో హారమును, మంచి వస్త్రములను ధరించిరి. పరిచారకులు చొక్కా, తలపాగ, మంచి వస్త్రములు, మణుల కుండలములను ధరించిరి. .

రత్నప్రదీపనికరద్యుతిభిర్నిరస్త

ధ్వాంతం విచిత్రవలభీషు శిఖండినోఽoగ

నృత్యంతో యత్ర విహితాగురుధూపమక్షైః

నిర్యాంతమీక్ష్య ఘనబుద్ధయ ఉన్నదంతః

ఓ పరీక్షిన్మహారాజా! ఆ భవనమునందు రత్నదీపముల వరుసలు చీకట్లను పారద్రోలుచుండెను. కిటికీలయందు అగరుబత్తుల ధూపమునేర్పాటు చేసిరి. బయటకు వచ్చే ఆ ధూపమును చూచి రంగు రంగుల చంద్రశాలలలోని నెమళ్లు మేఘములనే భావనతో బిగ్గరగా నాదము చేస్తూ నాట్యమాడుచుండెను.

తస్మిన్ సమానగుణరూపవయస్సువేష

దాసీసహస్రయుతయాఽనుసవం గృహిణ్యా

విప్రో దదర్శ చమరవ్యజనేన రుక్మ

దండేన సాత్వతపతిం పరివీజయంత్యా

ఆ భవనమునందు నారదమహర్షి బంగరు దండము గల వింజామరతో ఎల్లవేళలా వీచుచున్న భార్యతో గూడియున్న యాదవప్రభుడగు శ్రీకృష్ణుని చూచెను. ఆమె వద్ద తనతో సమానమైన రూపము, వయస్సు, మంచి వస్త్రములు గల దాసీలు వేయిమంది ఉండిరి.

తం సన్నిరీక్ష్య భగవాన్ సహసోత్థితశ్శ్రీ

పర్యంకతస్సకలధర్మభృతాం వరిష్ఠః

ఆచమ్య పాదయుగలం శిరసా కిరీట  

జుష్టేన సాంజలిరవీవిశదాసనే స్వే

ధర్మాత్ములందరిలో శ్రేష్ఠుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆ నారదుని చూచి గుర్తు పట్టి వెంటనే రుక్మిణీ దేవి శయ్యనుండి లేచి నిలబడెను. ఆయన కిరీటముతో అలంకరించబడిన తలను వంచి ఆయన రెండు పాదములకు దోసిలి యొగ్గి నమస్కరించి తన ఆసనముపై కూర్చుండ బెట్టెను.

తస్యావనిజ్య చరణౌ తదపస్స్వమూర్ధ్నా

బిభ్రజ్జగద్గురుతరోఽపి సతాం పతిర్హి

బ్రహ్మణ్యదేవ ఇతి యద్గుణనామ యుక్తం

తస్యైవ యచ్చరణశౌచమ శేషతీర్థమ్

శ్రీకృష్ణుడా నారదుని కాళ్లను కడిగి ఆ నీటిని తన శిరస్సు పై ధరించెను. ఎందుకంటే, ఆయన జగత్తులోని పూజనీయులలో ఉత్తముడే అయినా, సజ్జనులను పాలించేది ఆయనయే. ఆయనకు మాత్రమే బ్రహ్మ ణ్యదేవుడు (బ్రాహ్మణుడు దైవముగా గలవాడు) అనేది సార్థక నామము. ఆయన పాదములనుండి పుట్టిన గంగ సర్వమును పావనము చేయును.

సంపూజ్య దేవఋషివర్యమృషిః పురాణో

నారాయణో నరసఖో విధినోదితేన

వాణ్యాఽభిభాష్య మితయాఽమృతమిష్టయా తం

ప్రాహ ప్రభో భగవతే కరవామ హే కిమ్

పురాణపురుషుడగు  శ్రీహరి  నారాయణుడనే  మహర్షిగా అవతరించి నరమహర్షికి సఖుడై   ఇప్పుడు  శ్రీకృష్ణుడై  అవతరించెను.  ఆయన  దేవర్షి శ్రేష్ఠుడగు  నారదుని  శాస్త్రోక్తవిధానముచే  చక్కగా  పూజించెను. అప్పుడాయన  మితమైన, అమృతమువలె మధురమైన  వాక్కుతో  సంబోధించి  ఇట్లు  పలికెను -- ఓ ప్రభూ! పూజనీయుడవగు  నీకు  నేనేమి  చేయవలెను?

నారద ఉవాచ

నైవాద్భుతం త్వయి విభోఽఖిలలోకనాథే

మైత్రీ జనేషు సకలేషు దమః ఖలానామ్

నిశ్శ్రేయసాయ హి జగత్స్థితిరక్షణాభ్యాం

స్వైరావతార ఉరుగాయ విదామ సుష్ఠు

నారద మహర్షి ఇట్లు  పలికెను --- ఓ ప్రభూ!  నిన్ను  భక్తులు  అధికముగా కీర్తించెదరు.  సకలలోకములకు  నాథుడవగు  నీవు సకలసజ్జనులయెడల మైత్రిని చూపి, దుష్టులను  శిక్షించుట  విడ్డూరము  కానే  కాదు.  ఎందుకంటే,  నీవు నీ ఇచ్ఛచే స్వీకరించిన  ఈ  అవతారమునకు  ప్రయోజనములు  జగత్తుయొక్క మనుగడ,  రక్షణ మాత్రమే గాక,  సజ్జనులకు  పరమకల్యాణమును కలిగించుట  అని మేము బాగా యెరుగుదుము.

దృష్టం తవాంఘ్రియుగలం జనతాఽపవర్గం

 బ్రహ్మాదిభిర్హృది విచింత్యమగాధబోధైః

సంసారకూపపతితోత్తరణావలంబం

ధ్యాయంశ్చరామ్యనుగృహాణ యథా స్మృతిస్స్యాత్

            సర్వజ్ఞులైన బ్రహ్మదేవుడు,  ఇంద్రుడు  మొదలగువారిచే  హృదయమునందు ధ్యానించబడే  నీ  పాదముల  జంట  జనులకు  విముక్తిని  ఇచ్చును.  సంసారమనే నూతిలో  పడినవారు  పైకి  వచ్చుటకు  ఆలంబనమయ్యే నీ  పాదములను  నేను కనుగొంటిని.  నేను  నీ  పాదములనే  ధ్యానిస్తూ  సంచరించెదను. నాకు నీ స్మృతి ఉండేట్లు అనుగ్రహించుము.

తతోఽన్యదావిశద్గేహం కృష్ణపత్న్యాస నారదః

 యోగేశ్వరేశ్వరస్యాంగ యోగమాయావివిత్సయా

            ఓ పరీక్షిన్మహారాజా!  తరువాత  ఆ  నారదుడు  యోగేశ్వరులకు  కూడ  ప్రభుడగు శ్రీకృష్ణ  భగవానుని  యోగమాయను  తెలియగోరి,  శ్రీకృష్ణుని  మరియొక  భార్యయొక్క ఇంటిని  ప్రవేశించెను.

దీవ్యంతమక్షైస్తత్రాపి ప్రియయా చోద్ధవేన చ

 పూజితః పరయా భక్త్యా ప్రత్యుత్థానాసనాదిభిః

            నారదునకు  అక్కడ  కూడ  ప్రియురాలితో,  ఉద్ధవునితో  పాచికల జూదమునాడుచున్న   శ్రీకృష్ణుడు  కనబడెను.  వారు  అతిశయించిన  భక్తితో  ఆయనకు ఎదురేగి  ఆసనము,  అర్ఘ్యము  మొదలగువాటినిచ్చి  పూజించిరి.

పృష్టశ్చావిదుషేవాసౌ కదాఽఽయాతో భవానితి

 క్రియతే కిం ను పూర్ణానామపూర్ణైరస్మదాదిభిః

                 అథాపి  బ్రూహి  నో  బ్రహ్మన్  జన్మెతచ్ఛోభనం  కురు

             శ్రీకృష్ణుడు  తెలియనివాడు  వలె  ఈ నారదుని ఇట్లు ప్రశ్నించెను -- తమరు ఎప్పుడు వచ్చితిరి? పూర్ణులు (విరక్తులు)  అగు  తమకు  అపూర్ణులమగు నావంటివారితో  పని  యేమి  ఉండును? ఓ మహర్షీ! అయినప్పటికీ  మా  వలన  కాదగిన  పనిని  చెప్పడు.  తద్ద్వారా ఈ  జన్మ  కల్యాణకరమగునట్లు చేయుడు.

స తు విస్మిత ఉత్థాయ తూష్ణీమన్యదగాద్గృహమ్

 తత్రాప్యచష్ట గోవిందం లాలయంతం సుతాన్ శిశూన్

తతోఽన్యస్మిన్ గృహేఽపశ్యన్మజ్జనాయ కృతోద్యమమ్

ఆ  నారదుడైతే  మాటలాడకుండా  లేచి  మరియొక  భవనమునకు  వెళ్లెను. అక్కడ  కూడ  చిన్న  పిల్లలైన  పుత్రులను  ముద్దాడుచున్న  శ్రీకృష్ణుడు  కనబడెను. అక్కడనుండి  ఇంకో  గృహమునకు  వెళ్లగా,  స్నానమునకు  సంసిద్ధుడగుచున్న శ్రీకృష్ణుడు  కనబడెను.

జుహ్వంతం చ వితానాగ్నీన్ యజంతం పంచభిర్మ ఖైః

 భోజయంతం ద్విజాన్ క్వాపి భుంజానమవశేషితమ్

ఆయన  ఒక  గృహములో  ఆహవనీయము  మొదలైన  యజ్ఞాగ్నులను  హోమము  చేయుచుండెను.  మరియొక  గృహములో  దేవపిత్రాది  పంచయజ్ఞములతో దేవాదులను ఆరాధించుచుండెను.  ఇంకో  గృహములో  బ్రాహ్మణసంతర్పణ చేయుచుండెను.  మరో  గృహములో  బ్రాహ్మణభోజనమైన  పిదప  తాను ప్రసాదమును భుజించుచుండెను.

క్వాపి సంధ్యాముపాసీనం జపంతం బ్రహ్మ వాగ్యతమ్

ఏకత్ర చాసిచర్మభ్యాం చరంతమసివర్త్మసు  

ఆయన  ఒక  గృహములో  సంధ్య  వార్చుచుండెను.  ఇంకో  గృహములో గాయత్రిని  జపించుచుండెను.  మరో  గృహములో  మౌనియై  ఉండెను.  ఇంకొకచోట కత్తిని, డాలును  పట్టి  కత్తిని  త్రిప్పుతూ  గెంతుచుండెను.

అశ్వైర్గజై రథైః క్వాపి విచరంతం గదాగ్రజమ్

క్వచిచ్ఛయానం పర్యంకే స్తూయమానం చ వందిభిః

గదుని  సోదరుడగు  శ్రీకృష్ణుడు  ఒక చోట  గుర్రములను,  ఇంకో  చోట ఏనుగులను  స్వారీ  చేయుచుండెను.  ఇంకో  చోట  రథముపై  తిరుగుచుండెను.  ఒక గృహములో  ఆయన  శయ్యపై  పరుండెను.  మరో  గృహములో  స్తోత్రపాఠకులాయనను స్తుతించుచుండిరి.

మంత్రయంతం చ కస్మింశ్చిన్మంత్రిభిశ్చోద్ధవాదిభిః

జలక్రీడారతం క్వాపి వారముఖ్యాబలావృతమ్

  శ్రీకృష్ణుడు  ఒక  గృహమునందు  ఉద్ధవుడు,  సాత్యకి  మొదలగు  మంత్రులతో కలిసి  సంప్రదించుచుండెను.  ఇంకోచోట  ఆయన  వేశ్యాయువతులు  చుట్టువారియుండ  జలక్రీడలాడుచుండెను.

కుత్రచిద్ద్విజముఖ్యేభ్యో దదతం గాస్స్వలంకృతాః

 ఇతిహాసపురాణాని శృణ్వంతం మంగలాని చ

            ఒక  చోట  శ్రీకృష్ణుడు  గోవులను  చక్కగా  అలంకరించి  శ్రేష్ఠులైన  బ్రాహ్మణులకు దానము  చేయుచుండెను.  ఇంకోచోట  ఆయన  మంగళకరములైన  ఇతిహాసములను, పురాణములను  వినుచుండెను.

హసంతం హాస్యకథయా కదాచిత్ప్రియయా గృహే

క్వాపి ధర్మం సేవమానమర్థకామౌ చ కుత్రచిత్

            శ్రీకృష్ణుడు  ఒకప్పుడు  ఒక  భవనములో  ప్రియురాలితో  గూడి  హాస్యప్రసంగము చేసి  నవ్వుచుండెను.  ఆయన  ఒకచోట  ధర్మమును,  ఇంకో  గృహములో (ధర్మసమ్మతములైన)  అర్థకామములను  సేవించుచుండెను.

ధ్యాయంతమేకమాసీనం పురుషం ప్రకృతేః పరమ్

 శుశ్రూషంతం గురూన్ క్వాపి కామైర్భోగైస్సపర్యయా  

ఒకచోట ఆయన ఏకాంతములో కూర్చుండి  ప్రకృతికి  అతీతుడగు  పరమాత్మను ధ్యానించుచుండెను.  మరియొకచోట  ఆయన  పెద్దలకు  అభీష్టములైన  భోగములనిచ్చి పరిచర్యలను చేస్తూ సేవ చేయుచుండెను.

కుర్వంతం విగ్రహం కైశ్చిత్సంధిం చిన్యత్ర కేశవమ్

 కుత్రాపి సహ రామేణ చింతయంతం సతాం శివమ్

శ్రీకృష్ణుడు ఒకచోట  కొందరితో  విభేదించుచూ,  మరియొకచోట  మరికొందరితో సంధిని చేయుచుండెను. ఇంకోచోట ఆయన బలరామునితో సత్పురుషుల యోగ క్షేమముల గురించి సంప్రదించుచుండెను.

పుత్రాణాం దుహితౄణాం చ కాలే విధ్యుపయాపనమ్

 దారైర్వరైస్తత్సదృశైః కల్పయంతం విభూతిభిః

శ్రీకృష్ణుడు  తగిన  సమయములో  పుత్రులకు  వారికి  తగ్గ  భార్యలతో, కుమార్తెలకు  కూడ  వరులతో,  యథావిధిగా  వివాహమును  వైభవోపేతముగా చేయుచుండెను.

ప్రస్థాపనోపానయనైరపత్యానాం మహోత్సవాన్

 వీక్ష్య యోగేశ్వరేశస్య యేషాం లోకా విసిస్మిరే  

యోగేశ్వరులగు  సనకాదులకు  ప్రభుడగు  శ్రీకృష్ణుడు  తన  పుత్రులను,  పుత్రికలను  పంపుట,  తీసుకువచ్చుట  అనే  సందర్భములలో  గొప్ప - ఉత్సవములను చేయుచుండెను.  వాటిని  చూచి  జనులు  విస్మితులైరి.

యజంతం సకలాన్ దేవాన్ క్వాపి క్రతుభిరూర్జి తైః

 పూర్తయంతం క్వచిద్ధర్మం కూపారామమఠాదిభిః

            ఒకచోట  ఆయన  గొప్ప  దక్షిణలు  గల  యజ్ఞములతో  సకలదేవతల నారాధించు చుండెను. ఇంకోచోట  ఆయన  నూతులు, సత్రములు,  మఠములు,  ఆలయములు ఇత్యాది  పూర్తధర్మముల  ననుష్ఠించుచుండెను.

చరంతం మృగయాం క్వాపి హయమారుహ్య సైంధవమ్

ఘ్నంతం తతః పశూన్మేధ్యాన్ పరీతం యదుపుంగవైః

            ఒకచోట  ఆయన  యాదవశ్రేష్ఠులు  చుట్టువారి  రాగా  సింధుదేశీయమగు గుర్రమునెక్కి  వేటాడుతూ,  దానిలో  యోగ్యములైన  పశువులను  వధించెను.

అవ్య క్తలింగం ప్రకృతిష్వంతఃపురగృహాదిషు

 క్వచిచ్చరంతం యోగేశం తత్తద్భావబుభుత్సయా

            యోగమాయను  శాసించే  శ్రీకృష్ణుడు  ఒకచోట  అమాత్యులు,  సేనానాయకులు మొదలగు  ప్రకృతులయందు,  అంతఃపురములోని  గృహములు  ఇత్యాదులయందు జనుల  ఆయా  మనోభావములను  అరయుటకై  తన  అసలు రూపము  కనబడకుండా సంచరించుండగా  నారదుడు  కనుగొనెను.

అథోవాచ హృషీ కేశం నారదః ప్రహసన్నివ

యోగమాయోదయం వీక్ష్య మానుషీమీయుషో గతిమ్

            మానవదేహమును  పొంది  మానవచేష్టలను  చేయుచున్న ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణ  భగవానుని  యోగమాయయొక్క  వైభవమును  నారదుడు  కళ్లారా  చూచెను. తరువాత  ఆయన  నవ్వుతున్నాడా  అన్నట్లు  శ్రీకృష్ణునితో  నిట్లనెను.

విదామ యోగమాయాస్తే దుర్దర్షా అపి మాయినామ్

 యోగేశ్వరాత్మన్ నిర్భతా భవత్పాదనిషేవయా

            ఓ యోగేశ్వరా! నీ  యోగమాయలు  మాయావులగు బ్రహ్మాదులకు కూడ దర్శించుట  శక్యము  కాదు. కాని,  నీ  పొదములను  సేవించుటచే  నాకు  నీ యోగమాయలు  హృదయములో  ప్రకాశించి  తెలిసినవి.

అనుజానీహి మాం దేవ లోకాంస్తే యశసొఽఽప్లుతాన్

పర్యటామి తవోద్గాయన్ లీలాం భువనపావనీమ్

దేవ - దేవా! నీ  కీర్తి  లోకములయందు  వ్యాపించినది. లోకములను  పావనము  చేసే నీ లీలను  బిగ్గరగా  కీర్తిస్తూ  లోకములను  పర్యటించటకు  నాకు  అనుజ్ఞనిమ్ము.

శ్రీభగవానువాచ

బ్రహ్మన్ ధర్మస్య వక్తాఽహం కర్తా తదనుమోదితా

 తచ్ఛిక్షయంల్లోకమిమమాస్థితః పుత్ర మా ఖిదః

శ్రీకృష్ణ  భగవానుడిట్లు  పలికెను --- ఓ మహర్షీ!  నేను  ధర్మమును  ఉపదేశించి, స్వయముగా  ఆచరించి,  ప్రోత్సహించెదను.  ఈ  మానవలోకమునకు  ఆ  ధర్మములో శిక్షణనిచ్చుటకై  నేను  దానిని  అనుష్ఠించుచున్నాను.  ఓ పుత్రా!  నా  మాయచే  నీవు మోహపడవద్దు.

శ్రీశుక ఉవాచ

 ఇత్యాచరంతం సద్ధర్మాన్ పావనాన్ గృహమేధినామ్

 తమేవ సర్వగేహేషు సంతమేకం దదర్శ హ

శ్రీశుక  మహర్షి  ఇట్లు పలికెను --- ఈ  విధముగా  ఒకే  శ్రీకృష్ణుడు  ఒకే కాలములో  సకలభవనములయందు  ఉంటూ  గృహస్థులు  ఆచరించే  పవిత్రమైన

శాస్త్రోక్త  కర్మలను  చేస్తూండగా,  నారదుడు  చూచెను.

కృష్ణస్యానంతవీర్యస్య యోగమాయామహోదయమ్

ముహుర్దృష్ట్వా ఋషిరభూద్విస్మితో జాతకౌతుకః  

ఈ  విధముగా  ఉత్కంఠ  కలిగిన  నారద  మహర్షి  అనంతశక్తియగు  శ్రీకృష్ణ భగవానుని  యోగమాయయొక్క  గొప్ప  మహిమను  పలుమార్లు  చూచి  ఆశ్చర్యపడెను.

ఇత్యర్థకామధర్మేషు కృష్ణేన శ్రద్ధితాత్మనా

సమ్యక్ సభాజితః  ప్రీతస్తమేవానుస్మరన్ యయౌ

ఈ  తీరున  ధర్మార్థకామములయందు  శ్రద్ధ  గల  శ్రీకృష్ణుడు  నారదుని  బాగుగా సత్కరించెను. ఆయన  ప్రీతి  జెంది  శ్రీకృష్ణుడినే  స్మరిస్తూ  వెళ్లెను.

ఏవం మనుష్యపదవీమనువర్తమానో

 నారాయణోఽఖిలభవాయ గృహీతశక్తిః

రేమేఽoగ షోడశసహస్రవరాంగనానాం

 సవ్రీడసౌహృదనిరీక్షణహాసజుష్టః

ఓ  పరీక్షిన్మహారాజా!  నారాయణుడీ  విధముగా  సకలప్రాణుల అభ్యుదయము  కొరకై  యోగమాయను  స్వీకరించి  మానవుల  రీతిని అనుకరించుచుండెను.  పదునార  వేల  గొప్ప యువతులు  సిగ్గుతో  కూడిన ప్రేమతో  చూస్తూ  నవ్వుతూ  సేవించగా, ఆయన విహరించెను.

యానీహ విశ్వవిలయోద్భవవృత్తిహేతుః

కర్మాణ్యనన్యవిషయాణి హరిశ్చకార

యస్త్వంగ గాయతి శృణోత్యనుమోదతే వా

భక్తిద్భవేద్భగవతి హ్యపవర్గమార్గే

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

 ఉత్తరార్ధే ఏకోనసప్తతితమోఽధ్యాయః

 ఓ  పరీక్షిన్మహారాజా!  ఈ  జగత్తుయొక్క  సృష్టిస్థితిలయములకు  కారణము  శ్రీహరి.  ఆయన  ఈ  శ్రీకృష్ణావతారములో  చేసిన  లీలలు  ఇతరులకు  శక్యమైనవి  కావు. వాటిని  ఎవడైతే  గానము  చేయునో,  లేదా  వినునో,  లేదా  ప్రశంసించునో,  అట్టివానికి భగవానునియందు  మోక్షమునిచ్చే  భక్తి  కలుగును.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో

నారదుడు శ్రీకృష్ణుని గార్హస్థ్యమును దర్శించుటను వర్ణించే

అరువది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది.