51 - కాలయవనుడు భస్మమగుట - ముచుకుంద స్తుతి

శ్రీశుక ఉవాచ

తం విలోక్య వినిష్క్రాంతముజ్జహానమివోడుపమ్

దర్శనీయతమం శ్యామం పీతకౌశేయవాససమ్

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఉదయించుచున్న చంద్రుడు వలె నగరము బయటకు వచ్చిన ఆ నల్లనయ్యను కాలయవనుడు చూచెను. మిక్కిలి అందగాడగు ఆయన పచ్చని పట్టు వస్త్రమును ధరించెను.

శ్రీవత్సవక్షసం భ్రాజత్కౌస్తుభాముక్తకంధరమ్

పృథుదీర్ఘచతుర్బాహుం నవకంజారుణేక్షణమ్

శ్రీకృష్ణుని వక్షఃస్థలము పై లక్ష్మీదేవి పుట్టుమచ్చయై ఉన్నది. ఆయన మెడకు ప్రకాశించే కౌస్తుభ మాణిక్యము అలంకారము. ఆయన బలిసిన పొడవాటి నాల్గు చేతులను, కొత్త పద్మము వంటి లేత యెరుపు కన్నులను కలిగియుండెను. (కాలయవనుడు చూచిన రూపమిది).

 నిత్యప్రముదితం శ్రీమత్సుకపోలం శుచిస్మితమ్

ముఖారవిందం బిభ్రాణం స్ఫురన్మకరకుండలమ్

శోభాయుక్త మైన చక్కని చెక్కిళ్లు గల ఆయన ముఖము పై సర్వకాలములలో ఆనందము తాండవించును. స్వచ్చమైన చిరునగవు గల ఆయన పద్మమువంటి ముఖముపై మెరిసిపోయే మొసలి ఆకారపు కుండలములను ధరించియుండెను.

వాసుదేవో హ్యయమితి పుమాఞ్చ్ఛ్రీవత్సలాఞ్చనః

చతుర్భుజోఽరవిందాక్షో వనమాల్యతిసుందరః

ఈ పురుషుడు శ్రీహరియే. ఎందుకంటే, ఈయన శ్రీవత్సమనే పుట్టు మచ్చ, నాల్గు చేతులు, పద్మములవంటి కన్నులు, అడవి పూల మాల ఉన్న గొప్ప అందగాడు (అని కాలయవనుడు నిశ్చయించుకొనెను).

లక్షణైర్నారదప్రోకైర్నాన్యో భవితుమర్హతి

నిరాయుధశ్చలన్ పద్భ్యాం యోత్స్యేఽనేన నిరాయుధః

నారద మహర్షి చెప్పిన లక్షణములను బట్టి ఈతడు మరియొకడు కాజాలడు. ఈయన ఆయుధములు లేకుండా కాలి నడకన పోవుచున్నాడు. నేను కూడ ఆయుధముల లేకుండా ఈతనితో యుద్ధము చేసెదను.

ఇతి నిశ్చిత్య యవనః ప్రాద్రవంతం పరాజ్ముఖమ్

అన్వధావజ్జఘృక్షుస్తం దురాపమపి యోగినామ్

ఆయన ముఖము త్రిప్పుకోని పరుగెత్తుచుండెను. కాలయవనుడీ విధముగా నిశ్చయించి యోగులకైననూ కష్టముతో పొందబడే ఆయనను పట్టుకొనగోరి వెనుక పరుగెత్తాను.

హస్తప్రాప్తమివాత్మానం హరిణా స పదే పదే

నీతో దర్శయతా దూరం యవనేశోఽద్రికందరమ్

ఆయన యవనప్రభుడగు కాలయవనునికి ప్రతి అడుగుకీ చేతికి చిక్కినట్లే కన్పట్టెను. ఈ విధముగా ఆయన వానిని చాల దూరమందలి పర్వత గుహవద్దకు తీసుకొని పోయెను.

పలాయనం యదుకులే జాతస్య తవ నోచితమ్

ఇతి క్షిపన్ననుగతో నైనం ప్రాపాహతాశుభః

యదువుయొక్క వంశములో పుట్టిన నీకు పారిపోవుట తగదు, అని నిందిస్తూ ఆతడు వెంట పడెను. కాని, ఆతని మనోమాలిన్యములింకనూ నశించకపోవుటచే ఈ శ్రీకృష్ణుని ఆతడు చేరుకో (స్పృశించ) లేదు.

ఏవం క్షిప్తోఽపి భగవాన్ ప్రావిశద్గారికందరమ్

సోఽపీ ప్రవిష్టస్తత్రాన్యం శయానం దదృశే నరమ్

ఈ విధంగా కాలయవనుడు నిందిస్తున్నా, శ్రీకృష్ణ భగవానుడు కొండ గుహలో ప్రవేశించేను. కాలయవనుడు కూడ ప్రవేశించి ఆ గుహలో నిద్రిస్తున్న మరియొక మనిషిని చూచెను.

నన్వసౌ దూరమనీయ శేతే మామిహ సాధువత్

ఇతి మత్వాఽచ్యుతం మూఢస్తం పదా సమతాడయత్

అరే! ఈతడు దూరముగా - ఇక్కడికి నన్ను తీసుకువచ్చి తాను సజ్జనుడు వలె నిద్రిస్తున్నాడు, అని ఆ మూర్ఖుడు తలపోసెను. ఆ వ్యక్తి శ్రీకృష్ణుడేనని తలచి వాడు ఆతనిని కాలితో గట్టిగా తన్నెను.

స ఉత్థాయ చిరం సుప్తశ్శ నైరున్మీల్య లోచనే

 దిశో విలోకయన్ పార్శ్వే తమద్రాక్షీదవస్థితమ్

చాల కాలము నిద్రించిన ఆయన నిద్ర లేచి మెల్లగా కన్నులను తెరచి నలువైపులా చూస్తూ, ప్రక్కనే నిలబడియున్న ఆ కాలయవనుని చూచెను.

స తావత్తస్య రుష్ఠస్య దృష్టిపాతేన భారత

దేహనాగ్నినా దగ్ధో భస్మసాదభవత్ క్షణాత్

భరతవంశీయుడవగు ఓ రాజా! అంతలో (నిద్ర చెడగొట్టినందులకు) కోపించిన ఆయన చూపు ఆ కాలయవనునిపై పడెను. ఆతని దేహమునుండి అగ్ని పుట్టి క్షణములో ఆతనిని కాల్చి బూడిద చేసెను.

రాజోవాచ

కో నామ స పుమాన్ బ్రహ్మన్ కస్య కింవీర్య ఏవ చ

కస్మాద్గుహాం గతశ్శి శ్యే కింతేజో యవనార్దనః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! కాలయవనుని మట్టుబెట్టిన ఆ పురుషుడెవరు? ఏ వంశము వాడు? ఆయన పరాక్రమమెట్టిది? ఆయన గుహను చేరి నిద్రించుటకు కారణమేమి? ఆయన ఎవని పుత్రుడు?

శ్రీశుక ఉవాచ

 స ఇక్ష్వాకుకులే జాతో మాంధాతృతనయో మహాన్

ముచుకుంద ఇతి ఖ్యాతో బ్రహ్మణ్యస్సత్యసంగరః

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ గొప్ప వ్యక్తి ఇక్ష్వాకువంశములో మాంధాతకు పుత్రుడై జన్మించి ముచుకుందుడని ప్రసిద్ధి గాంచినవాడు. ఆయన బ్రాహ్మణభక్తుడు, సత్యమైన ప్రతిజ్ఞ గలవాడు.

స యాచితస్సురగడైరింద్రాద్యైరాత్మరక్షణే

అసు రేభ్యః పరిత్ర సైస్తద్రక్షాం సోఽకరోచ్చిరమ్

రాక్షసుల వలన భయపడిన ఇంద్రుడు మొదలైన దేవతలు తమను రక్షించుమని ఆయనను కోరిరి. ఆయన వారిని చాల కాలము రక్షించెను.

లబ్ధ్వా గుహం తే స్వఃపాలం ముచుకుందమథాబ్రువన్

రాజన్ విరమతాం కృచ్ఛ్రాద్భవాన్నః పరిపాలనాత్

వారికి స్వర్గలోకరక్షకునిగా కుమారస్వామి లభించెను. అప్పుడు వారు ముచుకుందునితో నిట్లనిరి -- ఓ రాజా! మమ్ములను రక్షించుట అనే కష్టమును నీవు విరమించుము.

నరలో కే పరిత్యజ్య రాజ్యం నిహతకంటకమ్

అస్మాన్ పాలయతో వీర కామాస్తే సర్వ ఉజ్జితాః

ఓ వీరుడా! నీవు మానవలోకమునందు నిష్కంటకమైన రాజ్యమును విడిచి పెట్టి మమ్ములను రక్షించుటకై సకలకామనలను విడిచి పెట్టినావు.

సుతా మహిష్యో భవతో జ్ఞాతయోఽమాత్యమంత్రిణః

ప్రజాశ్చ తుల్యకాలీయా నాధునా సంతి కాలితాః

నీ సమకాలీనులగు పుత్రులు, భార్యలు, బందుగులు, కార్యదర్శులు, సలహాదారులు, ప్రజలు కూడ కాలము చేసినారు. వారిప్పుడు లేరు.

కాలో బలీయాన్ బలినాం భగవానీశ్వరోఽవ్యయః

ప్రజాః కలయతే క్రీడన్ పశుపాలో యథా పశూన్

సర్వసమర్థమగు కాలము బలవంతులలో కెల్లా బలమైనది. వినాశము లేని కాలము సర్వమును శాసించును. భగవత్స్వరూపమగు కాలము క్రీడిస్తూ, పశుల కాపరి పశువులను వలే, ప్రాణులను వశములోనుంచును.

వరం వృణీష్వ భద్రం తే ఋతే కైవల్యమద్య నః

ఏక ఏవేశ్వరస్తస్య భగవాన్ విష్ణురవ్యయః

నీవు ఇప్పుడు మానుండి మోక్షమును మినహాయించి ఏదేని వరమును కోరుకొనుము. నీకు మంగళమగు గాక! ఆ మోక్షమునిచ్చే సమర్థుడు కాలాతీతుడగు శ్రీహరి భగవానుడొక్కడు మాత్రమే.

ఏవముక్తస్స వై దేవానభివంద్య మహాయశాః

అశయిష్ట గుహాఽఽవిష్ణో నిద్రయా దేవదత్తయా

గొప్ప కీర్తి గల ఆ ముచుకుందునితో దేవతలిట్లు పలికి నిద్రను వరముగానిచ్చిరి. ఆయన వారికి ప్రణమిల్లి గుహను ప్రవేశించి నిద్రించెను.

స్వాపం యాతం యస్తు మధ్యే బోధయేత్త్వామచేతనః

స త్వయా దృష్టమాత్రస్తు భస్మీభవతు తత్క్షణాత్

నీవు నిద్ర పోతూండగా మధ్యలో ఏ మూర్ఖుడైతే నిద్ర లేపునో, వాడు నీవు కేవలము చూచినంత మాత్రాన ఆ క్షణమే బూడిద యగుగాక! (అని దేవతలు వరమునిచ్చిరి).

యవనే భస్మసాన్నీతే భగవాన్ సొత్వతర్షభః

ఆత్మానం దర్శయామాస ముచుకుందాయ ధీమతే

కాలయవనుడు బూడిద కాగానే బుద్ధిశాలియగు ముచుకుందునకు యాదవ శ్రేష్ఠుడగు శ్రీకృష్ణ భగవానుడు తన దర్శనమునిచ్చెను.

తమాలోక్య ఘనశ్యామం పీతకౌశేయవాససమ్

శ్రీవత్సవక్షసం భాజత్కౌస్తుభేన విరాజితమ్

ముచుకుందుడు మేఘము వలె నల్లనైన శ్రీకృష్ణుని చూచెను. పచ్చని పట్టు వస్త్రములను దాల్చిన ఆయన వక్షఃస్థలము పై రేఖారూపిణియగు శ్రీతో, మెడలో కౌస్తుభమాణిక్యముతో విరాజిల్లెను.

చతుర్బుజం రోచమానం వైజయంత్యా చ మాలయా

చారుప్రసన్నవదనం స్ఫురన్మకరకుండలమ్

నాలు చేతులు గల ఆ శ్రీహరి వైజయంతి అనే పంచరత్నమాలతో ప్రకాశించుచుండెను. ఆయన ప్రసన్నమగు ముఖము మెరిసిపోయే మకరకుండలములతో అందముగా నుండెను.

ప్రేక్షణీయం నృలోకస్య సానురాగసితేక్షణమ్

అపీచ్యవయసం మత్తమృగేంద్రోదారవిక్రమమ్

మానవలోకమునకు దర్శించదగిన శ్రీకృష్ణుడు ప్రేమతో, చిరునవ్వుతో చూచుచుండెను. సుందరయువకుడగు ఆయన మదించిన సింహము వలే గంభీరముగా నడచును.

పర్యపృచ్ఛన్మహాబుద్ధి స్తేజసా తస్య ధర్షితః

శంకితశ్శనకై రాజా దుర్ధర్షమివ తేజసా

శ్రీకృష్ణుని తేజస్సుచే ముచుకుందుడు పరాభూతుడయ్యెనే గాని, శ్రీకృష్ణుని ఎవ్వరైననూ తమ తేజస్సుచే చకితుని చేయలేరు. గొప్ప బుద్ధిశాలియగు ముచుకుందునకు సందేహము కలిగి కృష్ణుని ప్రశ్నించెను.

ముచుకుంద ఉవాచ

కో భవానిహ సంప్రాప్తో విపినే ఘోరగహ్వరే

పద్భ్యాం పద్మపలాశాభ్యాం విచరస్యురుకంటకే

ముచుకుందుడిట్లు పలికెను --- ఈ నిర్జనమగు అడవి భయంకరమైనది, ప్రవేశించ శక్యము కానిది. దీనిలో ప్రవేశించి, పద్మములవలె కోమలములైన పాదములతో నీవు అధికమగు ముళ్లు గల స్థానమునందు సంచరించుచున్నావు. నీవెవరివి?

కిం స్వీతేజస్వినాం తేజో భగవాన్ వా విభావసుః

 సూర్యస్సోమో మహేంద్రో వా లోకపాలోకపరోఽపి వా

తేజశ్శాలురలో కెల్లా మూర్తీభవించిన తేజస్సు, పూజనీయుడు అగు అగ్నివా? సూర్యుడవా? చంద్రుడవా? లేక, మరియొక లోకపాలకుడవా?

మన్యే త్వాం దేవదేవానాం త్రయాణాం పురుషర్షభమ్

యద్బాధ సే గుహాధ్వాంతం ప్రదీపః ప్రభయా యథా

బ్రహ్మవిష్ణుమహేశ్వరులు దేవతలకు కూడ దేవులు. నీవు వారిలో పురుషోత్తముడగు శ్రీహరివని తలంచుచున్నాను. ఏలయన, నీవు కాంతిచే గుహయందలి చీకటిని పరాస్తము చేయుచున్నావు.

శుశ్రూష తామవ్యలీకమస్మాకం నరపుంగవ

స్వజన్మ కర్మ గోత్రం వా కథ్యతాం యది రోచతే

ఓ పురుషోత్తమా! మీకిష్టమైనచో వినగోరే మాకు మీ పుట్టుక, చేసే పని, పేరు, మీ వంశప్రవర్తకుల గురించి దాచి పెట్టకుండా చెప్పుడు.

వయం తు పురుషవ్యాఘ్ర ఇక్ష్వాకాః క్షత్రబంధవః

ముచుకుంద ఇతి ప్రోక్తో యౌవనాశ్వాత్మజః ప్రభో

ఓ పురుషోత్తమా! నేనైతే ఇక్ష్వాకు వంశమునకు చెందిన క్షత్రియుడను. ఓ ప్రభూ! నన్ను ముచుకుందుడంటారు. నేను యువనాశ్వుని పుత్రుడగు మాంధాత యొక్క పుత్రుడను.

చిరప్రజాగరశ్రాంతో నిద్రయోపహతేంద్రియః

శయేఽస్మిన్ విజనే కామం కేనాప్యుత్థాపితోఽధునా

నేను చాల కాలము తెలివిగా ఉండి, అలసిపోతిని, నా ఇంద్రియములు స్వాధీనత తప్పినవి. నేనీ నిర్జనప్రదేశమునందు యథేచ్చగా నిద్రించగా, ఎవడో ఒకడు నన్ను నిద్ర లేపినాడు.

సోఽపి భస్మీకృతో నూనూత్మీయేనైవ పాప్మనా

అనంతరం భవాఞ్చ్రీమాన్ లక్షితోఽమిత్రశాతనః

ఆతడైతే తన పాపము చేతనే నిశ్చయముగా బూడిద చేయబడినాడు. వెనువెంటనే శోభాయుక్తులగు తమరు నాకు కనబడిరి. తమరు శత్రుసంహారకులు.

తేజసా తేకవిష హ్యేణ భూరి ద్రష్టుం న శక్నుమః

హతౌజసో మహాభాగ మాననీయోఽసి దేహినామ్

ఓ మహాతేజశ్శాలీ! సహించ శక్యము కాని నీ తేజస్సుచే నా దర్శనశక్తి విహతమై నేను చాల సేపు చూడ లేకున్నాను. కాని, నీవు ప్రాణులకు పూజనీయుడవని మాత్రము తెలియుదును.

ఏవం సంభాషితో రాజ్ఞా భగవాన్ భూతభావనః

ప్రత్యాహ ప్రహసన్ వాణ్యా మేఘనాదగభీరయా

ప్రాణులకు రక్షకుడగు శ్రీకృష్ణ భగవానునితో ముచుకుంద మహారాజు ఈ విధముగా సంభాషించెను. ఆపుడాయన నవ్వుతూ మేఘగర్జన వలె గంభీరమైన వాక్కుతో ఇట్లు బదులు చెప్పెను.

శ్రీభగవానువాచ

జన్మకర్మాభిధానాని సంతి మేరంగ సహస్రశః

న శక్యం తేఽనుసంఖ్యాతుమనంతత్వాన్మయాఽపి హి

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓయీ! నాకు జన్మలు, క్రియలు, పేర్లు వేలకొలదీ ఉన్నవి. అవి అనంతములగుట వలన, నేను కూడా వాటిని లెక్కించలేననేది నిశ్చయము.

క్వచిద్రజాంసి విమమే పార్థివాన్యురుజన్మభిః

గుణకర్మాభిధానాని న మే జన్మాని కర్హిచిత్

ఎవడైననూ ఒకప్పుడు భూగోళము యొక్క ధూళికణములను బహుజన్మలచే లెక్కించవచ్చునేమో గాని, నా జన్మలను, గుణములను, కర్మలను, పేర్లను మాత్రము ఏనాడైననూ లెక్కించలేడు.

కాలత్రయోపపన్నాని జన్మకర్మాణి మే నృప

అనుక్రమంతో నైవాంతం గచ్ఛంతి పరమర్షయః

ఓ మహారాజా! భూతవర్తమానభవిష్యత్కాలములలో సిద్ధములైన నా అవతారములను, లీలలను మహర్షులు వరుసగా వర్ణించియు అంతము చేరలేకున్నారు.

తథాఽప్యద్యతనాన్యంగ శృణుష్వ గదతో మమ

విజ్ఞాపితో విరించేన పుర్వాహం ధర్మగుప్తయే

భూమేర్భారాయమాణానామసురాణాం క్షయాయ చ

ఓయీ! అయినప్పటికీ నా వర్తమానములోని జన్మకర్మలను గురించి చెప్పెదను, వినుము. పూర్వము బ్రహ్మదేవుడు భూమికి బరువగుచున్న అసురులను సంహరించి ధర్మమును రక్షింపుమని నాకు విన్నవించెను.

అవతీర్ణో యదుకులే గృహ ఆనకదుందుభేః

వదంతి వాసుదేవేతి వసుదేవసుతం హి మామ్

యదువు వంశమునందు దేవకీవసుదేవులకు పుత్రుడనై నేను అవతరించితిని. వసుదేవుని పుత్రుడనగు నన్ను వాసుదేవుడని పిలిచెదరు.

కాలనేమిర్హతః కంసః ప్రలంబోద్యాశ్చ సద్ద్విషః

అయం చ యవనో దగ్ధ రాజం స్తే తిగ్మచక్షుషా

ఓ పరీక్షిన్మహారాజా! కంసుని రూపములోనున్న కాలనేమి, సత్పురుషు లను ద్వేషించే ప్రలంబుడు, అఘుడు మొదలగు రాక్షసులు సంహరించ బడినారు. నీవీ కాలయవనుని నీ తీక్ష్ణమగు చూపుతో దహించితివి.

సోఽహం తవానుగ్రహార్థం గుహా మేతాముపాగతః

ప్రార్థితః ప్రచురం పూర్వం త్వయావహం భక్తవత్సలః

 అట్టి నేను నిన్ను అనుగ్రహించుటకై ఈ గుహకు వచ్చితిని. పూర్వజన్మలో నీవు భక్తవత్సలుడనగు నన్ను అధికముగా ఆరాధించితివి.

వరాన్ వృణీష్వ రాజర్షే సర్వాన్ కామాన్ దదామి తే

మాం ప్రపన్నో జనః కశ్చిన్న భూయోకర్షతి శోచితుమ్

ఓ రాజర్షీ! వరములను కోరుము. నీ కోరికలనన్నింటినీ తీర్చెదను. నన్ను శరణు పొందినవాడే జనుడైననూ మరల దుఃఖించుటకు తగడు.

శ్రీశుక ఉవాచ

ఇత్యుక్తస్తం ప్రణమ్యాహ ముచుకుందో ముదాఽన్వీతః

జ్ఞాత్వా నారాయణం దేవం గర్గవాక్యమనుస్మరన్

శ్రీశుకమహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణుడిట్లు పలుకగా ముచుకుందుడు ఆనందమును పొంది ప్రణమిల్లెను. ఆతనికి గర్గాచార్యుని మాట గుర్తుకు వచ్చి శ్రీకృష్ణుడు నారాయణదేవుడేనని గుర్తించేను.

ముచుకుంద ఉవాచ

విమోహితోఽయం జన ఈశ మాయయా

త్వదీయయా త్వాం న భజత్యనర్థదృక్

సుఖాయ దుఃఖప్రభవేషు సజ్జతే

గృహేషు యోషిత్పురుషశ్చ వంచితః

ముచుకుందుడిట్లు పలికెను --- స్త్రీలు గాని, పురుషులు గాని ఈ మానవులు నీ మాయచే వ్యామోహమును పొందినారు. వారు అనర్థమగు సంసారమునందు దృష్టి గలవారై నిన్ను ఆరాధించుట లేదు. వారు మోసపోయి సుఖము కొరకు - దుఃఖనిలయములగు గృహవ్యవహారములయందు ఆసక్తులగుచున్నారు.

లబ్ధ్వా జనో దుర్లభమత్ర మానుషం కథంచిదవ్యంగమయత్నతోఽనఘ

 పాదారవిందం న భజత్యసన్మతిర్గృహాంధకూ పే పతితో యథా పశుః

పాపసంబంధము లేని ఓ దేవా! మానవుడీ లోకము (కర్మభూమి) లో అంగవైకల్యము లేని మానవజన్మను ఏదో విధముగా ప్రయత్నము లేకుండానే పొందినాడు. ఇట్టి జన్మ దుర్లభము. అయిననూ, దుష్టమగు (భోగములయందు తగుల్కున్న) బుద్ధి గల మానవుడు సంసారమనే చీకటి నూతిలో పడినవాడై పశువు వలె నీ పాదపద్మమును సేవించుట లేదు.

మమైష కాలోఽజిత నిష్పలో గతో రాజ్యశ్రీయోన్నద్ధమద్య భూపతేః మర్త్యాత్మబుధ్ధస్సుతదార కోశభూష్వాసజ్జమానస్య దురంతచింతయా

ఓ అపరాజితా! రాజునై రాజ్యముయొక్క సంపద చే బాగా గర్వించితిని. దేహమే ఆత్మ అనే అభిమానముతో సంతానము, భార్య, సంపద, భూమి అనువాటియందు ఆసక్తిని పెంచుకొని అంతు లేని చింతనతో నా ఈ కాలము వ్యర్థముగా వెళ్లిపోయినది.

కలేవ రేఽస్మిన్ ఘటకుడ్యసన్నిభే నిరూఢమానో నరదేవ ఇత్యహమ్,

వృతో రథేభాశ్వపదాత్యనీక పైర్గాం పర్యటంస్త్వాంగణయన్ సుదుర్మదః

కుండ, గోడల వలె దృశ్యమగు ఈ దేహమునందు రాజునని పాదుకున్న అభిమానము కలిగి. నేను బాగా గర్వించితిని. రథములు, ఏనుగులు, గుర్రములు, పదాతుల సైన్యములు చుట్టువారి రాగా భూమిని పర్యటిస్తూ (కాలరూపుడవగు) నిన్ను లెక్క చేయకుంటిని.

ప్రమత్తముచ్చేరితికృత్యచింతయా ప్రవృద్దలోభం విష యేషు లాలసమ్ త్వమప్రమత్తస్సహస్వాభిపద్య సే క్షుల్లేలిహనోఽహిరివాఖుమంతకః

చేయవలసిన పనుల గురించి చింతతో మానవుడు భగవద్భజనము విషయములో అసావధానుడై యుండును. బాగా పెరిగిన లోభము గలవాడై మానవుడు ఇంద్రియభోగములయందు అధికమగు స్పృహతో నుండును. కాని, కాలరూపుడవగు నీకు మరుపు తెలియదు. ఆకలిచే నాలుకలతో పెదవులను ఆస్వాదించే పాము ఎలుకను వలె, నీవు వానిని వేగముగా సమీపించి మ్రింగి వేసెదవు.

పురా రథైరేమపరిష్కృతైశ్చరన్మతంగజైర్వా నరదేవసంజ్ఞితః

స ఏవ కాలేన దురత్యయేన తే కలేవరో విటమిభస్మసంజ్ఞితః

ఒకప్పుడీ దేహము రాజు అనే పేరుతో బంగారముతో అలంకరించబడిన రథములపై, ఏనుగులపై సంచరించెడిది. నీ స్వరూపమైన కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరు. అదే దేహము కాలప్రభావముచే (బయట పారవేసినచో) పక్షుల రెట్ట, (నేలలో పాతినచో) క్రిములు, (కాల్చినచో) బూడిద అనే పేర్లు గలది యగును.

నిర్జిత్య దిక్చక్రమభూతవిగ్రహో

                            వరాసనస్థస్సమరాజవందితః                    

గృహేషు మైథున్యసుఖేషు యోషితాం

క్రీడామృగః పూరుష ఈశ నీయతే

ఓ ఈశ్వరా! ఒక వ్యక్తి నాల్గు దిక్కులను జయించి ఊహకైననూ విరోధులు లేనివాడై సౌర్వభామసింహాసనమునధిష్ఠించి సమానులైన రాజులచే సమ్మానించబడినవాడు కావచ్చును. అదే వ్యక్తి సంభోగసుఖములు విశేషముగా గల గృహమునందు యువతులచే ఆటబొమ్మ (కోతి) వలె ఆడించబడును.

కరోతి కర్మాణి తపస్సు నిష్టితో నివృత్తభోగస్తద పేక్షయా దదత్,

పునశ్చ భూయేయమహం స్వరాడితీ ప్రవృద్ధతర్షో న సుఖాయ కల్పతే,

మానవుడు భోగములయందలి అపేక్ష చేతనే భోగములనుండి నివృత్తుడై దానధర్మములను, ప్రతనియమములను, వైదికకర్మలను అను ష్ఠించును. మరల తాను చక్రవర్తి కావాలని ఈ పుణ్యములనాచరించును. అట్టి పెచ్చు మీరిన తృష్ణ గలవాడు సుఖమునకు అర్హుడు కాజాలడు.

భవాపవర్గో భ్రమతో యదా భవేజ్జనస్య తర్హ్యచ్యుత సత్సమాగమః

సత్సంగమో యర్హి తదైవ సద్దతో పరావరేశే త్వయి జాయతే మతిః

ఓ శ్రీహరీ! సంసారములో పరిభ్రమించే మానవునకు ఎప్పుడైతే సంసారమునుండి మోక్షమునకు సమయము వచ్చునో, అప్పుడే సత్సంగము లభించును. ఏ కాలమునందైతే సత్సంగము కలుగునో, అప్పుడే మానవునకు నీయందు భక్తి కలుగును. మాయాశక్తికి, జగత్తునకు ప్రభుడవగు నీవే సత్పురుషులకు శరణము.

మన్యే మమానుగ్రహ ఈశ తే కృతో

రాజ్యానుబంధాపగమో యదృచ్ఛయా

యః ప్రార్థ్యతే సాధుభిరేకచర్యయా

వనం వివిక్షద్భిరఖండభూమి పైః

ఓ ఈశ్వరా! నాకు అనుకోకుండా రాజ్యమనే పాశమునుండి విముక్తి కలిగినది. ఇది నీచే చేయబడిన అనుగ్రహమేనని తల చేదను. సాధు స్వభావులగు సార్వభౌములు కూడ ఏకాంతములో నిన్ను భజించుటకై అడవిని ప్రవేశించగోరి ఇట్టి రాజ్యాధికారనివృత్తినే ప్రార్థించెదరు.

న కామయేఽన్యం తవ పాద సేవనా -

దకించనప్రార్థ్యతమాద్వరం విభో

ఆరాధ్య కస్త్వాం హ్యపవర్గదం హరే 

వృణీత ఆర్యో వరమాత్మబంధనమ్

ఓ ప్రభూ! ఏమీ లేనివారు కూడ కోరదగినవాటిలో శ్రేష్టమైనది నీ పాదముల సేవ. అది తక్క మరియొక వరమును నేను కోరను. ఓ శ్రీహరీ! ఎందుకంటే, వివేకియగు ఎవ్వాడు తనను సంసారములో బంధించే వరములను కోరును? (ఎవడైననూ కోరడు).

తస్మాద్విసృజ్యాశిష ఈశ సర్వతో

రజస్తమస్సత్త్వగుణానుబంధనాః

నిరంజనం నిర్గుణమద్వయం పరం

త్వాం జ్ఞప్తిమాత్రం పురుషం ప్రజామ్యహమ్

ఓ ఈశ్వరా! కావున (కామనలు బంధిస్తాయి గనుక), నేను సత్త్వరజస్తమోగుణముల సంసర్గము గల సాంసారికకామనలను పూర్తిగా విడిచి పెట్టెదను. నేను పూర్ణుడవగు నిన్ను శరణు వేడుచున్నాను. సంసారసంబంధము లేశమైననూ లేని నీయందు గుణములు లేవు. రెండవది లేని నీవు ప్రకృతికి అతీతమైన అఖండ చైతన్యస్వరూపుడవు.

చిరమిహ వృజినార్తస్తప్యమానోకనుతా పైః

అవితృషషడమిత్రోక్లబ్దశాంతిః కథంచిత్

శరణద సము పేతస్త్వత్పదాబ్దం పరాత్మన్ ,

అభయమృతమశోకం పాహి మాఽఽపన్నమీశ

శరణునిచ్చే ఓ పరమాత్మా! నేనీ లోకములో చిరకాలమునుండి కర్మఫలములచే పీడించబడి, వాటి వాసనలచే తపింపజేయబడుచున్నాను. నాలోని కామక్రోధములు మొదలైన అంతశ్శత్రువులకు ఇంకనూ తృష్ణ తీరలేదు. నాకే విధముగానైననూ శాంతి లభించలేదు. ఓ ఈశ్వరా! పద్మమువంటి నీ పాదము వద్ద భయమునకు, శోకమునకు తావు లేదు. సత్యమైన నీ పాదమును నేను చేరితిని. ఆపదలతో సతమతమయ్యే నన్ను కాపాడుము.

శ్రీభగవానువాచ

సార్వభౌమ మహారాజ మతిస్తే విమలోర్జితా

వరైః ప్రలోభితస్యాపి న కామైర్విహతా యతః

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- సార్వభౌముడవైన ఓ మహారాజా! నీ బుద్ది నిర్మలము, ఉన్నతకోటికి చెందినది. ఎందుకంటే, నేను వరములతో ప్రలోభ పెట్టితిని. ఐనా నీ బుద్ధి కామనలచే కుంఠితమవలేదు.

ప్రలోభితో వరైర్యత్త్వమప్రమాదాయ విద్ధి తత్

న ధీర్మయ్యేకభక్తానామాశ్రిర్భిద్యతే క్వచిత్

భక్తులను సావధానులను చేయుట కొరకు (నీ సావధానతను పరీక్షించుట కొరకు) మాత్రమే నేను నిన్ను వరములతో ప్రలోభ పెట్టితినని తెలియుము. నాయందు అనన్యమగు భక్తి గలవారల బుద్ది ఏ నాడైననూ కామనలచే భేదమును పొందదు.

యుంజానానామభక్తానాం ప్రాణాయామాదిభిర్మనః

అక్షీణవాసనం రాజన్ దృశ్యతే పునరుత్థితమ్

ఓ రాజా! భక్తి లేకుండా కొందరు ప్రాణాయామము-ధారణ మొదలగువాటిచే మనస్సును ఏకాగ్రము చేసెదరు. కాని, వారి మనస్సులోని వాసనలు క్షయము కాకుండుటచే, అది మరల విషయభోగములవైపు పరుగెత్తుట అనుభవములోనున్న విషయమే.

విచరస్వ మహీం కామం మయ్యావేశితమానసః

అస్త్వేవ నిత్యదా తుభ్యం భక్తిర్మయ్యనపాయినీ

నీవు నాయందు మనస్సు నిలిపి భూలోకములో యథేచ్చగా సంచరించుము. నీకు నాయందు ఏనాడైననూ తొలగిపోని భక్తి నిశ్చయముగా కలుగుగాక!

క్షాత్రధర్మస్థితో జంతూన్ న్యవధోర్మృగయాదిభిః

సమాహితస్తత్తపసా జహ్యఘం మదుపాశ్రితః

క్షత్రియధర్మమును పాలించిన నీవు వేట-ఆహారము మొదలగు సంద ర్భములలో ప్రాణులను నిశ్చయముగా చంపితివి. నన్ను శరణు పొంది ఏకాగ్రమగు చిత్తముతో తపస్సు చేసి ఆ పాపమును పోగొట్టుకొనుము.

జన్మన్యనంతరే రాజన్ సర్వభూతసుహృత్తమః

భూత్వా ద్విజవరస్త్వం వై మము పైష్యసి కేవలమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్ధే ఏకపంచాశత్తమోఽధ్యాయః

ఓ రాజా! నీవు వెంటనే రాబోయే జన్మలో సకలప్రాణులయందు అతిశయించిన ప్రేమ గల బ్రాహ్మణ శ్రేష్ఠుడవు కాగలవు. అప్పుడు నీవు అద్వితీయుడనగు నన్ను నిశ్చయముగా పొందగలవు.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములోకాలయవనుడు భస్మమగుటను, ముచుకుందస్తుతిని వర్ణించే ఏబది, ఒకటవ అధ్యాయము ముగిసినది (51).