74 - శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజ - శిశుపాలుని ఉద్దారము

శ్రీశుక ఉవాచ

ఏవం యుధిష్ఠిరో రాజా జరాసంధవధం విభోః

 కృష్ణస్య చానుభావం తం శ్రుత్వా ప్రీతస్తమబ్రవీత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ధర్మరాజు జరాసంధుని వధను గురించి, సర్వసమర్థుడగు శ్రీకృష్ణుని మహిమను గురించి కూడ విని సంతోషించి ఆయనతో నిట్లనెను.

 యుధిష్ఠిర ఉవాచ

 యే స్యు స్ట్రైలోక్యగురవస్సర్వే లోకమ హేశ్వరాః

వహంతి దుర్లభం లబ్ధ్వ శిరసైవానుశాసనమ్

ధర్మరాజిట్లు పలికెను -- నీనుండి ఆదేశమును పొందుటయే దుర్లభము. ముల్లోకములకు పూజనీయులగు బ్రహ్మాదులు, లోకపాలకులగు ఇంద్రాదులు అందరు నీ ఆదేశమును నిశ్చయముగా శిరసా వహించెదరు.

స భవానరవిందాక్షో దీనానామీశమానినామ్

 ధత్తేకనుశాసనం భూమంస్తదత్యంతవిడంబనమ్

ఓ పరబ్రహ్మా! మేము దీనులము, పాలకులమని విర్రవీగువారము. కాని, పద్మములవంటి కన్నులు గల అట్టి నీవు మా ఆదేశమును పాలిస్తున్నావు. ఇది సుతరాము మానవుల చేష్టకు అనుకరణము మాత్రమే.

న హ్యేకస్యాద్వితీయస్య బ్రహ్మణః పరమాత్మనః

కర్మభిర్వర్ధతే తేజో హౌసతే చ యథా రవేః

ఏలయన, పరబ్రహ్మ ఒక్కడు, రెండవది లేనివాడు, వ్యక్తియొక్క అంతరతమమగు ఆత్మస్వరూపుడు. ఆ పరబ్రహ్మకు సూర్యునకు వలె కర్మలచే తేజస్సులో వృద్ధి గాని, తగ్గుదల గాని లేవు.

న వై తేఽజిత భక్తానాం మమాహమితి మాధవ

 త్వం తవేతి చ నానాధీః పశూనామివ వైకృతా

పరాజయము లేని ఓ లక్ష్మీపతీ! నేను, నాది, నీవు, నీది అనే బుద్ది వికారమును చెందే దేహముతోడి తాదాత్మ్యము వలన కలుగును. పశువులకుండే అట్టి భేదబుద్ధి నీ భక్తులకు నిశ్చయముగా లేదు.

శ్రీశుక ఉవాచ

 ఇత్యుక్త్వా యజ్ఞయే కాలే వవై యుక్తాన్ స ఋత్విజః

 కృష్ణానుమోదితః పార్థో బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః  

శ్రీశుక మహర్షి పలి కెను -- ఇట్లు పలికి కుంతీపుత్రుడగు ఆ ధర్మరాజు యజ్ఞమునకు యోగ్యమగు సమయమునందు యోగ్యులైన వేద వేత్తలగు బ్రాహ్మణులను శ్రీకృష్ణుని అనుజ్ఞతో ఋత్విక్కులనుగా వరణము చేసెను.

ద్వైపాయనో భరద్వాజస్సుమంతురౌతమోఽ సితః

వసిష్ఠశ్చ్యవనః కణ్వో మైత్రేయః కవషస్త్రీతః

విశ్వామిత్రో వామదేవస్సుమర్జెమినిః క్రతుః

పైలః పరాశరో గర్గో వైశంపాయన ఏవ చ

అథర్వా కశ్యపో ధౌమ్యో రామో భార్గవ ఆసురిః

వీతిహోత్ర మధుచ్ఛందా వీర సేనోఽకృతవ్రణః

వేదవ్యాసుడు, భరద్వాజుడు, సుమంతుడు, గౌతముడు, అసితుడు, వసిష్ఠుడు, చ్యవనుడు, కణ్వుడు, మైత్రేయుడు, కవషుడు, త్రితుడు, విశ్వామిత్రుడు, వామదేవుడు, సుమతి, జైమిని, క్రతువు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, వైశంపాయనుడు, అథర్వణుడు, కశ్యపుడు, ధౌమ్యుడు, పరశురాముడు, శుక్రాచార్యుడు, ఆసురీ, వీతిహోత్రుడు, మధు చ్ఛందసుడు, వీరసేనుడు, అకృతవ్రణుడు అనువారలు ఋత్విక్కులు.

ఉపహూతాస్తథా చాన్యే ద్రోణభీష్మకృపాదయః

ధృతరాష్ట్రస్సహసుతో విదురశ్చ మహామతిః

ఇంతేగాక, ద్రోణుడు, భీష్ముడు, కృపాచార్యుడు, బాహ్లికుడు మొదలగు ఇతరులను, ధృతరాష్ట్రుని, ఆతని పుత్రులను, గొప్ప బుద్ధిశాలియగు విదురుని కూడ ధర్మరాజు యజ్ఞమునకు ఆహ్వానించెను.

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రా యజ్ఞదిదృక్షవః

 తత్రేయుస్సర్వరాజానో రాజ్ఞాం ప్రకృతయో నృప

తతస్తే దేవయజనం బ్రాహ్మణాస్స్వర్ణలాంగలైః

 కృష్ణ్వా తత్ర యథ్యాఽఽమ్నాయం దీక్షలోంచిరే నృపమ్

 హైమాః కిలోపకరణా వరుణస్య యథా పురా

తరువాత ఆ ఋత్విక్కులు బంగరు నాగళ్లతో యజ్ఞభూమిని దున్నీ, అచట ధర్మరాజునకు యథావిధిగా యజ్ఞదీక్షను ఇచ్చిరి. పూర్వము వరుణుని యజ్ఞములో వలె ఆ యజ్ఞములో సామగ్రులు బంగారముతో చేసినవి.

ఇంద్రాదయో లోకపాలా విరించభవసంయుతాః

 సగణాస్సిద్ధగంధర్వా విద్యాధరమహోరగాః

 మునయో యక్షరక్షాంసి ఖగకిన్నర చారణాః

 రాజానశ్చ సమాహూతా రాజపత్న్యశ్చ సర్వశః

 రాజసూయం సమీయుస్స్మ రాజ్ఞః పాండుసుతస్య వై

మేనిరే కృష్ణభక్తస్య సూపపన్నమవిస్మితాః

ఇంద్రవరుణాదిలోకపాలకులు, బ్రహ్మదేవుడు, శివుడు, మహర్షులు, యక్షులు, రాక్షసులు, గరుడాది పక్షులు, కిన్నరులు, చారణులు పాండుమహారాజుయొక్క పుత్రుడగు  ధర్మరాజుయొక్క రాజసూయమునకు విచ్చేసిరి. ఆయన ఆహ్వానమునందుకొని రాజులు, రాజపత్నులు కూడ అందరు విచ్చేసిరి. శ్రీకృష్ణ భక్తుడగు. ధర్మరాజునకు రాజసూయము సుసంపన్నమగుటలో ఆశ్చర్యము లేదని వారు తలపోసిరి.

అయాజయన్ మహారాజం యాజకా దేవవర్చసః

 రాజసూయేన విధివత్ప్రాచేతసమివామరాః

దేవతలు వరుణుని వలె, దేవతల తేజస్సు గల ఋత్విక్కులు యథావిధిగా ధర్మరాజుచే రాజసూయయాగమును చేయించిరి.

సౌత్యేఽహన్యవనీపాలో యాజకాన్ సదసస్పతీన్

అపూజయన్మహాభాగాన్ యథావత్సుసమాహితః

సోమరసమును దంచే దినమునందు ధర్మరాజు మిక్కిలి ఏకాగ్రమగు చిత్తము గలవాడైఋత్విక్కులను, యజ్ఞమును పర్యవేక్షించే మహాత్ములను యథావిధిగా పూజించేను.

సదస్యా(గ్యార్హణార్హం వై విమృశంతస్సభాసదః

 నాధగచ్ఛన్న నైకాంత్యాత్సహదేవస్తదాఽబ్రవీత్  

సభాసదులలో అగ్రపూజకు అర్హుడెవరు? అని సభాసదులు చర్చించి కూడ, చాల అభిప్రాయములుండుటచే ఒక నిర్ణయమునకు రాలేకపోయిరి. అప్పుడు సహదేవుడిట్లు పలికెను.

అర్హతి హ్యచ్యుత (శ్శ్రైష్ణ్యం భగవాన్ సాత్వతాం పతిః

 ఏష వై దేవతాస్సర్వా దేశకాలధనాదయః

యాదవప్రభుడగు శ్రీకృష్ణ భగవానుడు సత్త్వగుణప్రధానులగు భక్తులకు పాలకుడు, స్వరూపచ్యుత లేనివాడు. అగ్రపూజకు ఆయనే అర్హుడు. సకల దేవతలు, దేశకాలములు, ధనధాన్యములు ఇత్యాది సర్వము ఈయన రూపములే.

యదాత్మకమిదం విశ్వం క్రతవశ్చ యదాత్మకాః

 అగ్నిరాహుతయో మంత్రస్సాంఖ్యం యోగశ్చ యత్పరః

ఈ జగత్తుక్క మరియు యజ్ఞముల యొక్క సారతత్త్వము ఈయనయే. అగ్నులలో మంత్రపూర్వకముగా ఆహుతులనిచ్చేది (కర్మమార్గము), యోగమార్గము, జ్ఞానమార్గము కూడ ఈయనను చేరుటకే ఉద్దేశించబడినవి.

ఏక ఏవాద్వితీయోఽసావైతదాత్మ్యమిదం జగత్

ఆత్మనాఽఽత్మాశ్రయస్సభ్యాసృజత్యవతి హంత్యజః

రెండవది లేని ఒకే పరబ్రహ్మ, ఈ జగత్తుయొక్క సార తత్త్వము ఈయనయే. ఓ సభ్యులారా! పుట్టుక లేని ఈయన తానే ఆశ్రయముగా గల వాడై తనచే ఈ జగత్తును సృష్టించి పాలించి ఉపసంహరించుచున్నాడు.

వివిధానీహ కర్మాణి జనయన్ యదవేక్షయా

ఈహతే యదయం సర్వశ్శ్రేయో ధర్మాదిలక్షణమ్

ఈ లోకములో సకలమానవులు ఈ భగవానుని ప్రేరణచే వివిధకర్మ లను చేస్తూ, ఈయననుండియే ధర్మార్థకామములనే పురుషార్థములను పొందగోరుచున్నారు.

తస్మాత్కృష్ణాయ మహతే దీయతాం పరమార్షణమ్

 ఏవం చేత్సర్వభూతానామాత్మనశ్చార్హణం భవేత్

అందువలన, మహాత్ముడగు శ్రీకృష్ణునకు అగ్రపూజను చేయుడు. అట్లు చేసినచో, సకలప్రాణులకు తనకు కూడ పూజ చేసినట్లే యగును.

సర్వభూతాత్మభూతాయ కృష్ణాయానన్యదర్శినే

 దేయం శాంతాయ పూర్ణాయ దత్తస్యానంత్యమిచ్ఛతా

తాను చేసిన దానము అనంతఫలమునీయవలెనని కోరువాడు ఆ దానమును పూర్ణుడగు శ్రీకృష్ణునకీయవలెను. సకలప్రాణుల ఆత్మయగు ఆయనయందు భేదభావము, రాగద్వేషములు లేవు.

ఇత్యు క్త్వా సహదేవోభూతూప్లీం కృష్ణానుభావవిత్

 తచ్చ్రుత్వా తుష్టువుస్సర్వే సాధు సాధ్వితి సత్తమాః

సహదేవుడు శ్రీకృష్ణుని మహిమ తెలిసినవాడు. ఆతడిట్లు పలికి మిన్నకుండెను. అచటి సత్పురుషులందరు ఆ వచనమును విని, బాగు బాగు అని ప్రశంసించిరి.

శ్రుత్వా ద్విజేరితం రాజా జ్ఞాత్వా హార్దం సభాసదామ్

సమర్షయద్ధృషీ కేశం ప్రీతః ప్రణయవిహ్వలః  

ధర్మరాజు మహర్షుల ఆ అనుమోదనమును విని ప్రీతుడాయెను. ఆయన సభౌసదుల అభిప్రాయమునెరింగి, ప్రేమతో విహ్వలుడై ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణ భగవానుని బాగుగా పూజించెను.

తత్పాదావవనిజ్యాపశ్శిరసా లోకపావనీః సభార్యస్సానుజామాత్యస్సకుటుంబోఽవహన్ముదా

ధర్మరాజు భార్య, తమ్ములు, అమాత్యులతో గూడి ఆయన పాదము లను కడిగి, లోకములను పావనము చేసే ఆ నీటిని తలపై దాల్చెను.

వాసోభిః పీతకౌశేయైర్భూష జైశ్చ మహాధనైః

అర్జయిత్వాఽశ్రుపూర్ణాక్ష నాశకత్సమవేక్షితుమ్

ధర్మరాజు శ్రీకృష్ణునకు పట్టుతో చేసిన పచ్చని వస్త్రములను, మిక్కిలి విలువైన ఆభరణములను కూడ యిచ్చి సమ్మానము చేసెను. కన్నులు ఆనందాశ్రువులతో నిండుటచే ఆయన సరిగ్గా చూడలేకపోయెను.

ఇత్థం సభాజితం వీక్ష్య సర్వే ప్రాంజలయో జనాః

 నమో జయేతి నేముస్తం నీ పేతుః పుష్పవృష్ణయః

ఈ విధముగా సత్కరించబడిన ఆ శ్రీకృష్ణుని చూచి జనులందరు దోసిలి యొగ్గి, నమస్కారము, సర్వోత్కర్షగా నుండుము, అని నమస్కరించిరి. పూల వర్షము కురి సెను.

ఇత్థం నిశమ్య దమ ఘోషసుతస్స్వపీఠాత్

 ఉత్థాయ కృష్ణ గుణవర్ణనజాతమన్యుః

 ఉత్క్షిప్య బాహుమిదమాహ సదస్యమర్షి

సంశ్రావయన్ భగవతే పరుషాణ్యభీతః

దమ ఘోషసుతుడగు శిశుపాలునకు సహనము లేదు. జనుల వచనము లను, శ్రీకృష్ణుని గుణముల వర్ణనను విని ఆతనికి కోపము పుట్టెను. ఆతడు సభలో భయము లేకుండా తన ఆసనమునుండి పైకి లేచి చేతిని విసు రుతూ, శ్రీకృష్ణ భగవానుని ఉద్దేశించి పరుషవచనములనిట్లు పలికెను.

ఈశో దురత్యయః కాల ఇతి సత్యవతీ శ్రుతిః

వృద్ధానామపి యద్బుద్ధిర్బాలవాక్యైర్విభిద్యతే

 సర్వమును శాసించే కాలమును ఎవ్వరూ అతిక్రమించలేరనే శ్రుతివచనము యథార్థము. ఎందుకంటే, పెద్దల బుద్ధి కూడ కుర్రవాని మాటలను విని పెడదోవ పట్టినది.

యూయం పాత్రవిదాం శ్రేష్టా మా మంధ్వం బాలభాషితమ్

 సదసస్పతయస్సర్వే కృష్ణో యత్సమ్మతోఽర్హణే

 ఓ యజ్ఞపర్యవేక్షకులారా! మీరందరు పాత్ర (దానమునకు యోగ్యుడు) తెలిసినవారిలో శ్రేష్ఠులు. కృష్ణుడు అగ్రపూజకు యోగ్యుడని కుర్రవాడు చెప్పిన మాటను స్వీకరించవద్దు.

తపోవిద్యావ్రతధరాన్ జ్ఞానవిధ్వస్తకల్మషాన్

 పరమగ్జిన్ బ్రహ్మనిష్ణాన్ లోకపాలైశ్చ పూజితాన్

 సదసస్పతీనతిక్రమ్య గోపాలః కులపాంసనః

 యథా కాకః పురోడాశం సపర్యాం కథమర్హతి

 యజ్ఞమును పర్యవేక్షిస్తున్న మహర్షులు తపస్సు, విద్య, నియమనిష్టలు గలవారు. వారు ఉపాసనచే మనోమాలిన్యములను నశింపజేసి పరబ్రహ్మయందు నిలిచియుందురు. వారిని ఇంద్రాది లోకపాలకులు కూడ పూజింతురు. వారిని కాదని క్షత్రియవంశమునకు కళంకము తెచ్చిన ఈ పశుల కాపరి, కాకి పురోడాశమునకు వలే, అగ్రపూజకు ఎట్లు అర్హుడగును?

వర్ణాశ్రమకులా పేతస్సర్వధర్మబహిష్కృతః

 స్వైరవర్తీ గుణైర్హీనస్సపర్యాం కథమర్హతి  

 ఈతనికి వర్ణము కాని, ఆశ్రమము కాని, కులము గాని, సద్గుణములు గాని లేవు. సకలధర్మములకు బయట స్వైరముగా తిరిగే ఈతడు అగ్రపూజకు ఎట్లు అర్హుడగును?

యయాతినైషాం హి కులం శక్తం సద్భిర్బహిష్కృతమ్

వృథా పానరతం శశ్వత్సపర్యాం కథమర్హతి

 ఎందుకంటే, వీరి కులమును యయాతి శపించినాడు. వీరి కులమువారు సర్వదా మద్యపానమునందు రమించెదరు గనుక ఆ కులమును సత్పురుషులు బహిష్కరించినారు. ఆ కులము వాడు అగ్రపూజకు అర్హుడెట్లగును?

బ్రహ్మర్షి సేవితాన్ దేశాన్ హిత్వైతేఽబ్రహ్మవర్చసమ్

సముద్రం దుర్గమాశ్రిత్య బాధంతే దస్యవః ప్రజాః  

వీరు బందిపోట్లు. బ్రహ్మర్షులు సేవించే మథురదేశమును విడిచి పెట్టి వీరు బ్రహ్మవర్చస్సును నశింపజేసే (వేదసంబంధం లేని) సముద్రములో దుర్గము కట్టుకొని దానిని ఆశ్రయించి ప్రజలను పీడించుచున్నారు.

ఏవమాదీన్యభద్రాణి బభాషే నష్టమంగలః

నోవాచ కించిద్భగవాన్ యథా సింహశ్శివారుతమ్

శిశుపాలుని కల్యాణములు నశించెను. ఆతడీ విధమైన అమంగళములను పలికెను. కాని, నక్క కూతను సింహము లక్ష్య పెట్టనట్లుగా, శ్రీకృష్ణ భగవానుడేమీ మాటలాడలేదు.

భగవన్నిందనం శ్రుత్వా దుస్సహం తత్సభాసదః

కర్ణౌ పీధాయ నిర్జగ్ముశ్శపంతశ్చేదిపం రుషా

చేదిరాజగు శిశుపాలుడు చేసిన ఆ భగవానుని నిందను విన్న సభాస దులు చెవులను మూసుకొని, కోపముతో వానిని తిడుతూ నిషమించిరి.

నిందాం భగవతశ్శృణ్వంస్తత్పరస్య జనస్య వా

తతో నా పైతి యస్సోఽపీ యాత్యధస్సుకృతాచ్చ్యుతః  

భగవంతుని గాని, భగవంతుని నమ్ముకున్న భక్తజనుని గాని తిడుతూ ఉంటే ఎవడేని అక్కడనుండి దూరంగా పోకుండా నిలబడి వినుచుండునో, ఆ వినేవాడు కూడ పుణ్యమునుండి భ్రష్టుడై నరకమును పొందును.

తతః పాండుసుతాః క్రుద్దా మత్స్య కైకయసృంజయాః ఉదాయుధాస్సముత్తస్థుశ్శిశుపాలజిఘాంసవః

పొండవులు, మత్స్యకేకయసృంజయవంశీయులు ఆ నిందలకు కోపించి శిశుపాలుని వధించగోరి ఆయుధములను పైకెత్తి లేచి నిలబడిరి.

తతశ్చైద్యస్త్వసంభ్రంతో జగృహే ఖడ్గచర్మణీ

భర్తయన్ కృష్ణ పక్షీయాన్ రాజ్ఞస్సదసి భారత

భరతవంశీయుడవగు ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు చేదిరాజగు శిశుపాలుడైతే భయము లేకుండా శ్రీకృష్ణుని పక్షమునకు చెందిన రాజులను తిరస్కరించి, కత్తిని డాలును చేతిలోనికి తీసుకొనెను.

తావదుత్థాయ భగవాన్ స్వాన్నివార్య స్వయం రుషా

శిరః క్షురాంతచక్రేణ జహారాపతతో రిపోః

అంతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా లేచి తన వారిని ఆపి, కోపముతో మీదకు వస్తున్న శత్రువు తలను చురకత్తి పదును గల చక్రముతో నరికేను.

శబ్దః కోలాహలోఽప్యాసిచ్చిశుపాలే హతే మహాన్

తస్యానుయాయినో భూపా దుద్రువుర్జీవితైషిణః

శిశుపాలుడు సంహరించబడగానే పెద్ద కోలాహలశబ్దము కలిగెను. ఆతని అనుచరులగు రాజులు బ్రదుకునందు తీపి గలవారై పారిపోయిరి.

చైద్యదేహోత్థితం జ్యోతిర్వాసుదేవముపావిశత్

పశ్యతాం సర్వభూతానాముల్కేవ భువి ఖాచ్చ్యుతా  

చేదిరాజగు శిశుపాలుని దేహమునుండి పైకి లేచిన జ్యోతి ఒకటి ఆకాశమునుండి రాలిపడిన ఉల్కను పోలియుండెను. సకలప్రాణులు చూచుచుండగా ఆ జ్యోతి శ్రీకృష్ణ భగవానునియందు ప్రవేశించెను.

జన్మత్రయానుగుణితవైరసంరబ్ధయా ధియా

ధ్యాయంస్తన్మయతాం యాతో భావో హి భవకారణమ్

ఆతడు మూడు జన్మలలో వైరము చేసి దానిచే ద్వేషముతో నిండిన బుద్దితో ఆ భగవానుని గురించి మాత్రమే ధ్యానిస్తూ ఆయనయందు విలీన మయ్యెను. ఏలయన, జీవునకు భావన వలననే ఉత్తరగతి లభించును.

ఋత్విగ్బ్యస్ససద స్యేభ్యో దక్షిణాం విపులామదాత్

సర్వాన్ సంపూజ్య విధివచ్చక్రేఽస్వభృథమేకరాట్

చక్రవర్తియగు ధర్మరాజు ఋత్విక్కులకు, సదస్యులకు అధికమగు దక్షిణలనిచ్చెను. ఆయన అందరిని చక్కగా సమ్మానించి యథావిధిగా అవభృథ స్నానమును చేసెను.

సాధయిత్వా క్రతుం రాజ్ఞః కృష్ణో యోగేశ్వరేశ్వరః

ఉవాస కతిచిన్మాసాన్ సుహృద్బిరభియాచితః

యోగేశ్వరులగు సనకాదులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా ధర్మరాజునకు రాజసూయయాగమును సంపన్నము చేసెను. బంధువుల కోరికపై ఆయన కొన్ని మాసములు అచటనే నివసించెను.

తతోఽనుజ్ఞాప్య రాజానమనిచ్ఛంతమపీశ్వరః

యయౌ సభార్యసామాత్యస్స్వపురం దేవకీసుతః

తరువాత దేవకీపుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజు ఒప్పుకోకపోయినా ఒప్పించి, భార్యలతో అమాత్యులతో గూడి తన ద్వారకానగరమునకు వెళ్లాను.

వర్జితం తదుపాఖ్యానం మయా తే బహువిస్తరమ్

వైకుంఠవాసినోర్జన్మ విప్రశాపాత్పునః పునః

వైకుంఠవాసులగు జయవిజయులకు సనకాది మహర్షులు మరల మరల జన్మించుడని శాపమునిచ్చిరి. ఆ వృత్తాంతమును నేను నీకు చాల విస్తారముగా వర్ణించి యుంటిని.

రాజసూయావభృథ్యేన స్నాతో రాజా యుధిష్ఠిరః

బ్రహ్మక్షత్రసభామధ్యే శుశుభే సురరాడివ

ధర్మరాజు రాజసూయయాగమునకు చెందిన అవభృథస్నానమును చేసి బ్రాహ్మణుల, రాజుల సభ మధ్యలో దేవేంద్రుడు వలె శోభిల్లెను.

రాజ్ఞా సభాజితాస్సర్వే సురమానవ ఖేచరాః

కృష్ణం క్రతుం చ శంసంతస్స్వధామాని యయుర్ముదా

దుర్యోధనమృతే పాపం కలిం కురుకులామయమ్

ధర్మరాజు దేవతలను, మానవులను, ఆకాశసంచారులగు గంధర్వాదులను సమ్మానించెను. దుర్యోధనుడు తప్ప వారందరు శ్రీకృష్ణుని, యాగమును కూడ కొనియాడుతూ ఆనందముగా తమ నివాసములకు వెళ్లిరి. దుర్యోధనుడు పాపి, కలహస్వభావుడు, కురువంశమునకు వ్యాధి వంటివాడు.

యో న సే హే శ్రియం స్ఫీతాం దృష్ట్వా పాండుసుతస్య తామ్

ఆ దుర్యోధనుడు పాండుపుత్రుడగు ధర్మరాజుయొక్క ఆ ఉజ్జ్వలమగు సంపదను చూచి సహించలేకపోయేను.

య ఇదం కీర్తయేద్విష్ణోః కర్మ చైద్యవధాదికమ్

రాజమోక్షం వితానం చ సర్వపాపైః ప్రముచ్యతే  

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే చతుస్సప్తతీతమోఽధ్యాయః

ఎవడైతే రాజుల బంధవిముక్తి, రాజసూయమును చేయించుట, చేదిరాజగు శిశుపాలుని వధ, అగ్రపూజ మొదలగు శ్రీకృష్ణ భగవానుని ఈ లీలలను కీర్తించునో, అట్టివాడు సకలపాపములనుండి విముక్తుడగును.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్దములో శ్రీకృష్ణ భగవానుని అగ్రపూజ, శిశుపాలుని ఉద్ధారములను వర్ణించే డెబ్బది నాల్గవ అధ్యాయము ముగిసినది (74).