భాగవత మహా పురాణము
87 - వేదస్తుతి
పరీక్షిదువాచ।
బ్రహ్మన్ బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణే గుణవృత్తయః ।
కథం చరంతి శ్రుతయస్సాక్షాత్సదసతః పరే ॥
పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! పరబ్రహ్మను పదములతో ఇదమిత్థముగా నిర్దేశించుట సంభవము కాదు. పరబ్రహ్మ నిర్గుణము, కార్యకారణములకు అతీతమైనది. అట్టి పరబ్రహ్మను గుణములను బట్టి ప్రవర్తిల్లే శ్రుతులు సాక్షాత్తుగా ఎట్లు బోధించగల్గును?
శ్రీశుక ఉవాచ ।
బుద్ధీంద్రియమనఃప్రాణాన్ జనానామసృజత్ప్రభుః ।
మాత్రాఽర్థం చ భవార్థం చ ఆత్మనేఽల్పనాయ చ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- సర్వశక్తిమంతుడగు భగవానుడు జీవుల విషయభోగముల (అర్థము) కొరకు, జన్మకు కారణమైన కర్మ (ధర్మము) కొరకు, తనకు ఆయా లోకముల భోగము (కామము) కొరకు, కల్పనల నివృత్తి అనే మోక్షము కొరకు కూడ బుద్ధి, ఇంద్రియములు, మనస్సు, ప్రాణములను సృష్టించెను.
సైషా హ్యుపనిషద్బ్రాహ్మీ పూర్వేషాం పూర్వ జైర్ధ్రృతా ।
శ్రద్ధయా ధారయేద్యస్తాం క్షేమం గచ్ఛేదకించనః ॥
బ్రహ్మను ప్రతిపాదించే ఆ ఈ ఉపనిషత్తును పూర్వీకులకు పూర్వమునందు పుట్టిన సనకాదులు ధరించిరి. ఎవడైతే దానిని శ్రద్దగా ధరించునో, అట్టివాడు దేహాభిమానము లేనివాడై మోక్షమును పొందును.
అత్ర తే వర్ణయిష్యామి గాథాం నారాయణాన్వితామ్ ।
నారదస్య చ సంవాదమృ షేర్నారాయణస్య చ ॥
ఈ విషయములో నీకు నారాయణునితో కూడిన వృత్తాంతమును, నారాయణ మహర్షితో నారదుని సంవాదమును వర్ణించి చెప్పెదను.
ఏకదా నారదో లోకాన్ పర్యటన్ భగవత్ప్రియః ।
సనాతనమృషిం ద్రష్టుం యయౌ నారాయణాశ్రమమ్ ॥
ఒకనాడు భగవానునకు ప్రియుడగు నారదుడు లోకములను పర్యటిస్తూ సనాతనుడగు నారాయణ మహర్షిని చూచుటకై నారాయణాశ్రమమునకు వెళ్లాను.
యో వై భారతవర్షేఽస్మిన్ క్షేమాయ స్వస్తయే నృణామ్ ।
ధర్మజ్ఞానశమోపేతమాకల్పాదస్థితస్తపః ॥
ఆ నారాయణ మహర్షి ఈ భారతదేశమునందలి జనుల ఐహిక-ఆముష్మికశుభముల కొరకై కల్పాదినుండి, ధర్మము జ్ఞానము ఇంద్రియనిగ్రహములతో కూడిన తపస్సును చేసెను.
తత్రోపవిష్టమృషిభిః కలాపగ్రామవాసిభిః ।
పరీతం ప్రణతోఽపృచ్చదిదమేవ కురూద్వహ ॥
కురువంశములో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నారాయణ మహర్షి ఆ ఆశ్రమములో కూర్చునియుండెను. కలాపగ్రామమునందు నివసించే మహర్షులు ఆయన చుట్టూ చేరిరి. నారద మహర్షి ఆయనకు ప్రణమిల్లి ఇదే విషయము (శ్రుతులు బ్రహ్మను ప్రతిపాదించుట) ను ప్రశ్నించెను.
తస్మై హ్యవోచద్భగవానృషీణాం శృణ్వతామిదమ్ ।
యో బ్రహ్మవాదః పూర్వేషాం జనలోకనివాసినామ్ ॥
నారాయణ మహర్షి నారదుని కొరకు మహర్షులు వినుచుండగా దీనిని చెప్పెను. పూర్వము జనలోకవాసులు బ్రహ్మను గురించి చేసిన ప్రసంగమే యిది.
శ్రీభగవానువాచ ।
స్వాయంభువ బ్రహ్మసత్రం జనలోకేఽభవత్పురా ।
తత్రస్థానాం మానసానాం మునీనామూర్ధ్వరేతసామ్ ॥
నారాయణ భగవానుడిట్లు పలికెను --- బ్రహ్మదేవుని పుత్రుడవగు ఓ నారదా! పూర్వము జనలోకములో అక్కడ ఉండే బ్రహ్మమానసపుత్రులగు సనకాది మహర్షుల మధ్య బ్రహ్మసత్రము (అందరు కలిసి చేసే బ్రహ్మవిచారము) జరిగెను. ఆ మహర్షులు నైష్ఠిక బ్రహ్మచారులు.
శ్వేతద్వీపం గతవతి త్వయి ద్రష్టుం తదీశ్వరమ్ ।
బ్రహ్మవాదస్సుసంవృత్తశ్శ్రుతయో యత్ర శేరతే ।
తత్ర హాయమభూత్ప్రశ్నస్త్వం మాం యమనుపృచ్ఛసి ॥
నీవు శ్వేతద్వీపాధిపతియగు అనిరుద్ధుని చూచుటకై అచటకు వెళ్లిన సమయములో బ్రహ్మవాదము చక్కగా జరిగెను. బ్రహ్మ విషయములో శ్రుతులు మౌనము దాల్చును. దానియందు నీవు ఇప్పుడు నన్ను అడిగిన ఈ ప్రశ్న వచ్చెను.
తుల్యశ్రుతతవశ్శీలాస్తుల్యస్వీయారిమధ్యమాః ।
అపి చక్రుః ప్రవచనమేకం శుశ్రూషవోఽపరే ॥
వారందరు సమానమైన అధ్యయనము, తపస్సు, శీలము గలవారే. వారి దృష్టిలో తనవారు, శత్రువులు, ఉదాసీనులు అందరు సమానమే. అయినప్పటికీ, వారిలో ఒకనిని ప్రవక్తనుగా చేసి, మిగిలినవారు వినగోరిరి.
సనందన ఉవాచ !
స్వసృష్టమిదమాపీయ శయానం సహ శక్తిభిః ।
తదంతే బోధయాంచక్రుసల్లింగైశ్శ్రుతయః పరమ్ ॥
సనందునుడిట్లు పలికెను --- పరమాత్మ. తనచే సృష్టించబడిన ఈ జగత్తును కారణశక్తులగు మహత్తత్త్వము మొదలగువాటితో సహా ఉపసంహారము చేసి యోగనిద్రను పొందెను. ఆ ప్రళయము అంతమైన తరువాత (ఆయన నిశ్శ్వాసనుండి పుట్టిన) వేదాధిష్ఠానదేవతలు ఆ పరమాత్మను ప్రతిపాదించే వాక్యములతో ఆయనను నిద్ర లేపినవి.
యథా శయానం సమ్రాజం వందినస్తత్పరాక్రమైః ।
ప్రత్యూషేఽభ్యేత్య సుశ్లో కైర్బోధయంత్యనుజీవినః ॥
చక్రవర్తిని ఆశ్రయించి బ్రదికే స్తోత్రపాఠకులు తెల్లవారు జామున వచ్చి ఆయన పరాక్రమమును చెప్పే మంచి శ్లోకములతో, నిద్రిస్తున్న ఆయనను నిద్ర లేపెదరు. అదే విధముగా శ్రుతులు చేసినవి.
శ్రుతయ ఊచుః ।
జయ జయ జహ్యజామజిత దోషగృభీతగుణాం ।
త్వమసి యదాత్మనా సమవరుద్ధసమస్తభగః ।
అగజగదోకసామఖిలశక్త్యవబోధక తే
క్వచిదజయాఽఽత్మనా చ చరతోఽనుచరేన్నిగమః ॥
పరాజయమునెరుగని ఓ దేవా! నీవు సర్వోత్కృష్టుడవు కమ్ము. నీకు జయమగుగాక! స్థావరజంగమములైన ప్రాణులయొక్క అనాదిమాయను నశింప జేయుము. జీవుని స్వరూపమును కప్పివేయుటకే ఈ మాయ సత్త్వాదిగుణములను స్వీకరించినది. ఎందుకంటే, నీవు స్వరూపముచేతనే సకలైశ్వర్యములను పొందియున్నావు. చరాచరప్రాణులలోని క్రియాజ్ఞాన శక్తులను ఉద్బుద్ధము చేసేది నీవే. లేదా, నీ స్వరూపమునందే ఉండే నీవు ఒకప్పుడు (సృష్ట్యాదియందు) మాయచే అవచ్చిన్నుడవై యుందువు. అప్పుడు నిన్ను వేదము ప్రతిపాదించును.
బృహదుపలబ్ధమేతదవయంత్యవ శేషతయా
యత ఉదయాస్తమయౌ వికృతేర్మృది వాఽవికృతాత్ ।
అత ఋషయో దధుస్త్వయి మనోవచనాచరితం
కథమయథా భవంతి భువి దత్తపదాని నృణామ్ ॥
ఈ తెలియబడే జగత్తు నిరంతరపరిణామశీలి (వికారము). ఇది వికారములు లేని పరబ్రహ్మనుండి పుట్టి, పరబ్రహ్మయందే విలీనమగును. మట్టినుండి పుట్టిన కుండ మట్టిలో కలిసిపోయి మట్టియే మిగులును. అదే విధముగా జగత్తు విలీనము కాగా మిగిలేది బ్రహ్మయే. కావున, ఈ సర్వము బ్రహ్మయేనని మంత్రములు, మహర్షులు నిర్ధారించుచున్నారు. కావుననే మంత్రములు, మహర్షులు మనస్సుచే సంకల్పించబడేది (రూపము), వాక్కుచే వర్ణించబడేది (నామము) సర్వము నీయందే పర్యవసించునని నిశ్చయించిరి. మానవులు ఎక్కడ కాళ్లను పెట్టినా, అవి భూమిపై మోపినట్లే యగును గాని, మరియొకచోట కాదు గదా!
ఇతి తవ సూరయస్త్ర్యధిపతేఽఖిలలోకమల-
క్షపణకథాఽమృతాబ్ధిమవగాహ్య తపాంసి జహుః ।
కిముత పునస్స్వధామవిధుతాశయకాలగుణాః
పరమ భజంతి యే పదమజస్రసుఖానుభవమ్ ॥
ముల్లోకములను మూడు గుణములను శాసించే ఓ దేవా! ఈ కారణము (నామరూపముల సారము పరబ్రహ్మ) చేతనే మహాత్ములు సకలజనుల పాపములను పోగొట్టే నీ గాథలనే అమృతసముద్రమును సేవిస్తూ దుఃఖ(పాప)ములను తప్పించుకొనెదరు. ఓ పరమాత్మా! జ్ఞానులు తమ స్వరూపమును సాక్షాత్కరించుకొని అంతఃకరణధర్మములగు సుఖదుఃఖములను, కాలధర్మములగు జరామృత్యువులను విడిచి పెట్టేదరు. వారు సర్వకాలము ఆనందచిదనమగు స్వరూపమును సేవించెదరు. వారు దుఃఖములను తప్పించుకొనెదరని వేరుగా చెప్పవలయునా?
దృతయ ఇవ శ్వసంత్యసుభృతో యది తేఽనువిధా
మహదహమాదయోఽoడమసృజన్ యదనుగ్రహతః ।
పురుషవీధేఽన్వయోఽత్ర చరమోఽన్నమయాదిషు యః
సదసతః పరం త్వమథ యదేష్వవ శేషమృతమ్ ॥
మానవులు నీ భక్తు లైనచో శ్వాసక్రియను చేసే జీవులు. అట్లు కానిచో, మానవులు కేవలము తోలుతిత్తులవంటి వారు మాత్రమే (వారి జీవితము వ్యర్థము). మహత్తు, అహంకారము, సూక్ష్మభూతములు మొదలైనవి నీవు వాటియందు ప్రవేశించి అనుగ్రహించుటవలననే సామర్థ్యమును పొంది ఈ బ్రహ్మాండమును సృష్టించగల్గినవి. నీవు అన్నమయ-ప్రాణమయ-మనో మయ-విజ్ఞానమయ-ఆనందమయకోశములలో మనుష్యాకారము కలిగి నేను-రూపములో ప్రకటమవుతూ వాటికి సత్తాస్ఫూర్తులనిచ్చుచున్నావు. కాని, స్థూలసూక్ష్మములకు, కార్యకారణములకు అతీతమైన నీవు ఐదు కోశములకు ఆంతరమగు ఆఖరి ఆనందబ్రహ్మవు. ఈ అనాత్మలనన్నింటినీ నిషేధించగా మిగిలియుండే బ్రహ్మవు నీవే. కాబట్టి సత్యవస్తువు నీవు మాత్రమే (ఈ అన్నమయాది సర్వము మిథ్యయే).
ఉదరముపాసతే య ఋషివర్త్మసు కూర్పదృశః
పరిసరపద్దతిం హృదయమారుణయో దహరమ్ ।
తత ఉదసాదనంత తవ ధామ శిరః పరమం
పునరిహ యత్సమేత్య న పతంతి కృతాంతముఖే ॥
మహర్షుల సంప్రదాయములనేకములు. వారిలో శర్కరాక్షవంశీయులు (ఇసుక కళ్లలో పడినవారు, అనగా స్థూలదృష్టి గలవారు) మణిపూరక చక్రమునందు నిన్ను అగ్నిరూపముగా ఉపాసించెదరు. అరుణవంశీయు లగు మహర్షులు (కొంచెము వెలుతురు, అనగా కొంత సూక్ష్మదృష్టి గలవారు) నిన్ను నాడుల ప్రసార కేంద్రమైన హృదయములో సూక్ష్మమగు ఆకాశము (చైతన్యము) గా ఉపాసించెదరు. ఆ హృదయమునుండియే సహస్రారమును చేరే సుషుమ్నానాడి పైకి వచ్చినది. ఓ అనంతా! శిరస్సు నందలి సహస్రారచక్రమే నీ సర్వోత్కృష్టమైన ధామము (స్వరూపము). ఎవరైతే ఆ బ్రహ్మస్థానమును (ఉపాసన, జ్ఞానముల ద్వారా) చేరెదరో, వారు మరల ఈ లోకములో పుట్టి మృత్యువు వాత బడుట ఉండదు.
స్వకృతవిచిత్రయోనిషు విశన్నివ హేతుతయా
తరతమతశ్చకాస్స్యనలవత్స్వకృతానుకృతిః ।
అథ వితథాస్వమూష్వవితథం తవ ధామ సమం
విరజధియోఽన్వయంత్యభివిపణ్యవ ఏకరసమ్ ॥
నీవు నీనుండియే (నీవే ఉపాదానముగా) రకరకముల ప్రాణిదేహములను సృష్టించి వాటిలో సచ్చిద్రూపుడవై ప్రవేశించుచున్నావా యన్నట్లున్నావు (కార్యములగు దేహములు కారణమగు సచ్చిదాత్మ లేకుండా లేవు గనుక, ప్రవేశము కల్పితమే గాని యథార్థము కాదు). నీచే రచించబడిన ఆ దేహములలో నీవు దేవత పశువు మొదలైన హెచ్చుతగ్గులననుకరిస్తూ ప్రకాశించుచున్నావు. తరతమ భావముతో విభిన్నరూపములు గల ఈ దేహములు మిథ్య. కాని, వాటిలో ప్రకాశించే సచ్చిదాత్మ సత్యము, సమము, ఏకరూపము. అదియే నీ స్వరూపము. సకలవ్యవహారములనుండి నివృత్తు లై శుద్ధమగు అంతఃకరణము గల మహాత్ములు నిన్ను ఆత్మరూపముగా తెలియుదురు.
స్వకృతపు రేష్వమీష్వబహిరంతరసంవరణం
తవ పురుషం వదంత్యఖిలశక్తిధృతోఽoశకృతమ్ ।
ఇతి నృగతిం వివిచ్య కవయో నిగమావపనం ।
భవత ఉపాసతేఽoఘ్రిమభవం భువి విశ్వసితాః ॥
జీవుల తమ కర్మల ద్వారా తమకై ఈ దేహములను తయారు చేసుకొనెదరు. ఆ దేహముల వలన వచ్చే బయట-లోపల అనే విభాగము గాని, కార్యకారణవిభాగము గాని జీవునకు కల్పితములే గాని యథార్థములు కావు. వాస్తవములో జీవుడు సకలశక్తులను కలిగియుండే నీ స్వరూపమే. కాని దేహాధ్యాసను బట్టి నీ అంశ అనియు, కర్మలచే చేయబడినవాడనియు చెప్పెదరు. ఈ లోకములో మహాత్ములు జీవునియొక్క ఈ యథార్థ స్థితిని వివేచించి విశ్వాసముతో నీ పాదమును ఉపాసించెదరు. వేదవిహితములైన సకలకర్మలను సమర్పించవల సినది నీ పాదముల వ్రాలనే. నీ పాదమే మోక్షస్వరూపము.
దురవగమాత్మతత్త్వనిగమాయ తవాత్తతనోః
చరితమహాఽమృతాబ్దిపరివర్తపరిశ్రమణాః ।
న పరిలషంతి కేచిదపవర్గమపీశ్వర తే
చరణసరోజహంసకులసంగవిసృష్టగృహాః ॥
ఓ ఈశ్వరా! ఆత్మతత్త్వమును తెలియుట చాల కష్టము. దానిని తెలుపుటకై నీవు అవతరించితివి. నీ చరితము గొప్ప అమృత సముద్రము. దానిలో మునకలు వేయుటలో పరిశ్రమ చేసిన భక్తులకు క్లేశములు తోలగిపోవును. అరుదైన అట్టి భక్తులు నీ పాదపద్మములయందు హంసల వలే రమించే భక్తుల సమూహముతో సంగమును నెరపి విరక్తులై సన్న్యసించెదరు. అట్టి మహాభక్తులు మోక్షమును కూడ కోరరు.
త్వదనుపథం కులాయమిదమాత్మసుహృత్ప్రియవత్
చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ ।
న బత రమంత్యహో అసదుపాసనయాఽఽత్మహనో
యదనుశయా భ్రమంత్యురుభయే కుశరీరభృతః ॥
ఈ గూడువంటి దేహము ఆత్మరూపుడవగు నీతో సంబంధమును కలిగి ఉన్న కారణము చేతనే తానే ఆత్మయా అన్నట్లు, హితకారి యన్నట్లు, ప్రియమన్నట్లు ఆచరించుచున్నది. ఆత్మరూపుడవగు నీవైతే నిత్య సిద్దమై హితమును చేస్తూ ప్రియుడవై ఉన్నావు. కాని, అయ్యో! ఎంత కష్టము! జనులు మిథ్యయగు దేహాదులనుపాసిస్తూ నిన్ను తెలియ లేకున్నారు. ఆ కారణముగా పశ్వాదిజన్మలను పొందుతూ. ఆత్మహత్యయే చేసుకొనుచున్నారా యన్నట్లున్నారు. వారు అధికమగు భయము గల ఈ సంసారములో పరిభ్రమించుచున్నారు.
నిభృతమరున్మనోఽక్షదృఢయోగయుజో హృదియ
న్మునయ ఉపాసతే తదరయోఽపి యయుస్స్మరణాత్ ।
స్త్రీయ ఉరగేంద్రభోగభుజదండవిషక్తధియో
వయమపి తే సమాస్సమదృశోఽoఘిసరోజసుధాః ॥
శ్వాస, మనస్సు, ఇంద్రియములను నియమించి దృఢముగా యోగము నభ్యసించే మహర్షులు ఏ తత్త్వమును హృదయములో ధ్యానించెదరో, అదే తత్త్వమును నీ శత్రువులు కూడ నిన్ను స్మరించి పొందిరి, శేషనాగునీ దేహమును పోలి దండమువంటి నీ భుజములపై తగుల్కొన్న చిత్తము గల గోపికలు, నీ పద్మమువంటి పాదములను బాగా ధారణ చేసే మేము (శ్రుతిదేవతలు) కూడ సమదర్శనము గల నీకు సమానులమే.
క ఇహ ను వేద బతావరజన్మలయోఽగ్రసరం.
యత ఉదగాదృషీర్యమను దేవగణా ఉభయే ।
తర్హి న సన్న చాసదుభయం న చ కాలజవః
కిమపి న తత్ర శాస్త్రమవకృష్య శయీత యదా ॥
ఆహా! జగత్తు (సృష్టి) నకు పూర్వమే నీవు సిద్ధించి యున్నావు. సృష్టి తరువాత ఈ జగత్తులో పుట్టి గిట్టే ఎవడు నిన్ను తెలియగల్గును? నీనుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. ఆయననుండి నివృత్తిప్రధానులగు సనకా దులు, ప్రవృత్తి ప్రధానులగు మరీచ్యాదులు అనే రెండు దేవగణములు ఆవిర్భవించినవి. ఎప్పుడైతే నీవు సర్వమును ఉపసంహరించి నిద్రించెద వో, అప్పుడు స్థూల పంచభూతములు గాని, సూక్ష్మములగు మహదాది తత్త్వములు గాని, ఆ రెండింటి కలయికయగు దేహము గాని, కాలము యొక్క వేగము గాని, ఏదీ లేదు. అప్పుడు వేదము కూడ ఉండదు.
జనిమసతస్సతో మృతిముతాత్మని యే చ భిదాం
విపణమృతం స్మరంత్యుపదిశంతి త ఆరుపితైః ।
త్రిగుణమయః పుమానితి భిదా యదబోధకృతా
త్వయి న తతః పరత్ర స భవేదవబోధర సే ॥
ఎవరైతే సృష్టికి ముందు లేని జగత్తునకు పుట్టుకను (వైశేషికులు), ఉన్న. జగత్తుయొక్క వినాశమును (నైయాయికులు), ఆత్మయందు భేదమును (సాంఖ్యులు), వ్యవహారమునందు సత్యత్వమును (కర్మ వాదులు) బోధించెదరో, వారు భ్రమలచే మాత్రమే ఉపదేశించుచున్నారు. జీవుడు సత్త్వరజస్తమోగుణాత్మకుడు గావున ఆత్మయందు భేదము గలదు అనే కల్పన అజ్ఞానమునుండి పుట్టినది. నీవు అజ్ఞానమునకు అతీతమైన చిదానందఘనుడవు. నీయందు ఆ అజ్ఞానమునకు ఉనికి లేదు.
సదివ మనస్త్రీవృత్త్వయి విభాత్యసదామనుజాత్ । సదభిమృశంత్యశేషమీదమాత్మతయాఽఽత్మవిదః ।
న హి వికృతిం త్యజంతి కనకస్య తదాత్మతయా ।
స్వకృతమనుప్రవిష్టమిదమాత్మతయాఽవ సితమ్ ॥
సత్త్వరజస్తమోగుణాత్మకమగు ఈ జగత్తు (దృశ్యము), మానవుని వరకు దీనిని తెలుసుకొనే జీవుడు (అహంకారము, ద్రష్ట) అనే భేదము కేవలము మనోవిలాసము మాత్రమే. ఈ భేదము వాస్తవముగా లేకున్ననూ, (అధిష్టానమైన) సదనుడవగు నీయందు ఉన్నది వలె భాసించుచున్నది. ఆత్మజ్ఞానులు ఈ సర్వము (ద్రష్ణ-దృశ్యము) ను ఆత్మరూపముగా తెలి యుదురు. జనులు బంగరు నగను అది వాస్తవములో బంగారము కనుకనే విడిచి పెట్టరు. నీచే చేయబడిన దృశ్యజగత్తు, దానిలో జీవరూపముగా ప్రవే శించి భాసించే ద్రష్ట అనే సర్వము ఆత్మయేనని జ్ఞానులు నిశ్చయించిరి.
తవ పరి యే చరంత్యఖిలసత్త్వని కేతతయా ।
త ఉత పదాఽఽక్రమంత్యవిగణయ్య శిరో నిరృతేః ।
పరివయసే పశూనివ గిరా విబుధానపి తాన్ ।
త్వయి కృతసౌహృదాః ఖలు పునంతి న యే విముఖాః ॥
సకలప్రాణులు (పదార్థములు) నీయందే మనుగడను కలిగియున్నవి. అట్టి నిన్ను ఎవరైతే (సర్వాత్మభావముతో) సేవించెదరో, వారు లెక్క లేకుండా మృత్యువు యొక్క తల పై పాదమును పెట్టెదరు (మృత్యువును జయించెదరు). నిన్ను ప్రేమించని వారు విద్వాంసులే కావచ్చును. నీవు వారిని విధివాక్యములతో పశువులను వలె (కర్మసూత్రముచే) బంధించే దవు. కాని, నిన్ను ప్రేమించువారు ఇతరులను కూడ పావనము చేయు దురు. నీయందు ప్రేమ లేనివారు పావనము చేయుట అసంభవము.
త్వమకరణస్స్వరాడఖిలకారకశక్తిధరః
తవ బలిముద్వహంతి సమదంత్యజయాఽనిమిషాః ।
వర్షభుజోఽఖిలక్షీతిపతేరివ విశ్వసృజో
విదధతి యత్ర యే త్వధికృతా భవతశ్చకితాః ॥
స్వయంప్రకాశుడవగు నీకు ఇంద్రియములు లేకున్ననూ, సకలప్రాణుల ఇంద్రియశక్తులను నిలబెట్టేది నీవే. మాయాశక్తికి వశులైయుండే ప్రజా పతులు, దేవతలు, మహామండలేశ్వరునకు మండలాధిపతులు వలె, నీకు పూజను సమర్పించెదరు. మానవులు అర్పించే హవ్యాదులను వారు తాము కూడ భోగించెదరు. ఆయా జగత్కార్యములయందు నియోగించ బడిన సూర్యాదులు నీకు భయపడి తమ కార్యములను అనుష్టించెదరు.
స్థిరచరజాతయస్స్యురజయోత్థనిమిత్తయుజో
విహర ఉదీక్షయా యది పరస్య విముక్త తతః ।
న హి పరమస్య కశ్చిదపరో న పరశ్చ భవేద్
వియత ఇవాపదస్య తవ శూన్యతులాం దధతః ॥
ఓ దేవా! నీవు నిత్యముక్తుడవు, మాయాశక్తికి ఆతీతుడవు. మాయాశక్తి తోడి సంసర్గముచే నీకు విహరించే యిచ్చ కలిగినప్పుడు, సంకల్ప మాత్రముచే లింగశరీరములు (సుప్తములైన కర్మవాసనలు) ఉద్బుద్ధములై, చరాచరప్రాణులు ఉత్పన్నమగును. ఆకాశము వలె నీవు వాక్కునకు, మనస్సునకు గోచరము కావు గనుక, నీకు శూన్యముతో పోలిక మాత్రము గలదు. పరమాత్మవగు నీకు తనవాడు గాని, పరాయివాడు గాని లేడు..
అపరిమితా ధ్రువాస్తనుభృతో యది సర్వగతాః
తర్హి న శాస్యతేతి నియమో ధ్రువ నేతరథా ।
అజని చ యన్మయం తదవిముచ్య నియంతృ భవేత్
సమమనుజానతాం యదమతం మతదుష్టతయా ॥
ఓ దేవా! నీవు నిత్యుడవు. అసంఖ్యాకులగు జీవులు సర్వవ్యాపకులు, నిత్యులు అయ్యే పక్షములో, వారిని ఈశ్వరుడు శాసించుననే నియమము పొసగదు. జీవులు పరిచ్చిన్నులు, పుట్టి గిట్టువారు అనే పక్షములో మాత్రమే వారు ఈశ్వరునిచే శాసించబడెదరు. కార్యము కారణముతో నిండియే పుట్టును. కారణము కార్యములో అనువృత్త మై కార్యమును శాసించును. అదే విధముగా, పరబ్రహ్మ జగత్తులో అనుస్యూతమై జగత్తును నియమించును. ఈ విధముగా సర్వజగత్తునందు సమమై యున్న పరబ్రహ్మ బుద్దిగోచరము కాదు. ఏది బుద్దిగోచరమో అది సత్యవస్తువు కాదు. కావున, మేము బ్రహ్మను తెలిసితిమని తలపోయువారు తెలిసినవారు కారు.
న ఘటత ఉద్భవః ప్రకృతిపూరుష యోరజయోః
ఉభయయుజా భవంత్యసుభృతో జలబుద్బుదవత్ ।
త్వయి త ఇమే తతో వివిధనామగుణైః పరమే
సరిత ఇవార్ణవే మధుని లిల్యుర శేషరసాః ॥
ప్రకృతికి పుట్టుక లేదు, పురుషునకు పుట్టుక లేదు. కాని, ఆ రెండింటి కలయిక (అన్యోన్యాధ్యాస) చే ప్రాణులు, నీరు గాలితో కలిసి బుడగలు పుట్టినట్లుగా, వివిధములైన పేర్లతో గుణములతో పుట్టుచున్నవి. అందు వలన ఆ ఈ ప్రాణులు, పరమకారణమగు నీయందు, నదులు సముద్రము నందు వలె, సకలపుష్పరసములు తేనెయందు వలె, విలీనమగును.
నృషు తవ మాయయా భ్రమమమీష్వవగత్య భృశం
త్వయి సుధియోఽభవే దధతి భావమనుప్రభవమ్ ।
కథమనువర్తతాం భవభయం తవ యద్భ్రుకుటిః ।
సృజతి ముహుస్త్రిణేమిరభవచ్ఛరణేషు భయమ్ ॥
ఈ మానవులలో నీ మాయ చే అధికమైన భ్రమ ఉన్నది. ఆ భ్రమ నిరంతరముగా పెరుగుచుండును. మంచి వివేకము . గలవారు ఈ విషయమును గుర్తించి, పుట్టుక లేని నీయందు ప్రతి క్షణము వర్ధిల్లే ప్రేమను చేసెదరు. నిన్ను శరణు జొచ్చువారలకు సంసారభయమెట్లు ఉండును? (ఉండదు). ఏలయన, చలి, వేడి, వర్షము అనే మూడు భాగములు గల సంవత్సరరూపియగు కాలము నీ కనుబొమల విలాస మాత్రమే. అట్టి కాలము నిన్ను శరణాగతి చేయనివారికి మాత్రమే మరల మరల భయమును కలిగించును.
విజితహృషీ కవాయుభిరదాంతమనస్తురగం
య ఇహ యతంతి యంతుమతిలోలముపాయఖిదః ।
వ్యసనశతాన్వితాస్సమవహాయ గురోశ్చరణం
వణిజ ఇవాజ సంత్యకృతకర్ణధరా జలధౌ ॥
మనస్సనే గుర్రము చాల చంచలమైనది. ఇంద్రియములను, శ్వాసను జయించిన యోగులు కూడ దానిని నిగ్రహించుట కష్టము. ఎవరైతే గురువును ఆశ్రయించకుండా, అట్టి మనస్సును నిగ్రహించుటకు ప్రయత్నిస్తారో, అట్టివారు సాధనలయందు ఖేదమునే పొందేదరు. వారీ సంసారములో, నావికుని స్వీకరించని వర్తకులు సముద్రమునందు వలే, వందలాది దుఃఖములను పొందుచుందురు.
స్వజనసుతాత్మదారధనధామధరాఽసురథైః.
త్వయి సతి కిం నృణాం శ్రయత ఆత్మని సర్వర సే ।
ఇతి సదజానతాం మిథునతో రతయే చరతాం
సుఖయతి కో న్విహ స్వవిహితే స్వనిరస్తభ గే ॥
నీవు సకలసుఖముల నిధియగు ఆత్మవు. మానవులలో ఎవరైతే నిన్ను ఆశ్రయించెదరో, వారికి నీవే తోడై ఉండగా, తన వారు, సంతానము, దేహము, భార్య, ధనము, ఇల్లు, భూమి, ప్రాణములు, భోగసాధనములు అనువాటితో పని యేమి గలదు? (ఏమీ లేదు). జనులీ సత్యమును తెలియలేక స్త్రీపురుషుల జతగట్టుటలో సుఖము గలదని భావించి భోగలాలసులై ప్రవర్తిల్లెదరు. ఈ సంసారము తనంత తానే నశించును. దానిలో స్వతహాగానే భాగ్యము లేదు. అట్టి సంసారములో ఎయ్యది వారికి సుఖమునీయగల్గును? (ఏదీ ఈయలేదు).
భువి పురుపుణ్యతీర్థసదనాన్యృషయో విమదాః
త ఉత భవత్పదాంబుజహృదోఽఘభిదంఘ్రిజలాః ।
దధతి సకృన్మనస్త్వయి య ఆత్మని నిత్యసుఖే
న పునరుపాసతే పురుషసారహరావసథాన్ ॥
గర్వము తొలగిన మహర్షులు నీ పద్మములవంటి పాదములనే హృదయములో ధ్యానించెదరు. వారి పాదముల నీరు పాపములను పోగొట్టును. భూలోకములో వారు కూడ గొప్ప పవిత్రమైన తీర్థములు, క్షేత్రములు వంటివారే. నీవు నిత్యానందమగు ఆత్మవు. ఎవరైతే ఒక్కసారి మనస్సును నీపై నిలి పెదరో వారు మరల గృహములయందలి (దేహము వలని) భోగములను సేవించరు. ఆ భోగములు వ్యక్తియొక్క సారము (వివేకము) ను హరించి వేయును.
సత ఇదముత్థితం సదితి చేన్నను తర్కహతం
వ్యభిచరతి క్వ చ క్వ చ మృషా న తథోభయయుక్ ।
వ్యవహృతయే వికల్ప ఇషితోఽoధపరంపరయా
భ్రమయతి భారతీ త ఉరువృత్తిభిరుక్థజడాన్ ॥
జగత్కారణమగు బ్రహ్మ సత్ (ఉన్నది). బంగారమునుండి పుట్టిన నగ బంగరుదే. అదే విధముగా, సదహ్మనుండి పుట్టిన జగత్తు కూడ సత్. ఈ జగత్సత్యత్వవాదము విచారము ముందు నిలబడదు. ఈ వాదమునకు విరోధములు అనేకము గలవు. ఉదాహరణకు, తండ్రినుండి పుట్టినవాడు తండ్రికంటే భిన్నుడు. ఇంతేగాక, త్రాడును - చూచి పొము అని భ్రమపడిన సందర్బములో పాము త్రాడునుండి ఆవిర్భవించినా, పాము అసత్ (మిథ్య), త్రాడు సత్యము. మరియు, జగత్తు సద్-అసత్ అని చెప్పుట పొసగదు. ఎందుకంటే, సత్, అసత్ లు పరస్పరవిరుద్ధములు ఒకే చోట సమావేశమగుట అసంభవము. వ్యవహారము సిద్ధించుచున్నది గనుక జగత్తు సత్యమని చెప్పుటయు పొసగదు. ఎందుకంటే, వ్యవహారము భ్రమ వలన కూడ సిద్దించును. సత్యము కాని సినిమా వినోదమునిచ్చుచున్నది గదా! పూర్వపూర్వమగు అజ్ఞానము (భ్రమ) ఉత్తరోత్తర భ్రమకు హేతువగుచుండును. ఈ విధముగా అజ్ఞానపరంపరచే భ్రమ సిద్దించును. కాబట్టి, ఇవి జగత్తునకు సత్యత్వమునీయగలిగే హేతువులు కాదు. ఓ ఈశ్వరా! నీ వేదరూపమగు వాక్కు ముఖ్యార్థము-అముఖ్యార్థము మొదలగు విభిన్నములైన అర్థనిర్ణయప్రక్రియలతో జనులను భ్రమింప జేయుచున్నది. స్వర్గాదిఫలములనిచ్చే కర్మల బరువు క్రింద నలిగే జనులు జడులై ఆత్మతత్త్వమును తెలియకున్నారు.
న యదిదమగ్ర ఆస న భవిష్యదతో నిధనాత్ ।
అను మితమంతరా త్వయి విభాతి మృషైకర సే ।
అత ఉపమీయతే ద్రవిణజాతివికల్పపథేః
వితథమనోవిలాసమృతమిత్యవయంత్యబుధాః ॥
ఈ జగత్తు సృష్టికి పూర్వమునందు లేధు, ప్రళయము తరువాత ఉండదు. కాబట్టి, స్థితికాలమునందు కూడ ఇది అద్వితీయుడవగు నీయందు లేకున్ననూ ఉన్నట్లు భాసించుచున్నదనేది నిశ్చితము. ఇందువలననే, మట్టియందు కుండ, బంగారమునందు ఆభరణము, లోహమునందు పనిముట్టు మొదలగునవి ఆయా ద్రవ్యములయందు కల్పించబడిన నామరూపములు మాత్రమేనని వాటిని జగన్మిథ్యాత్వమునకు దృష్టాంతములుగా శ్రుతులు నిరూపించుచున్నవి. మిథ్య, మనస్సు యొక్క కల్పన అగు ఈ జగత్తును అజ్ఞానులు సత్యమని తలపోయుదురు.
స యదజయా త్వజామనుశయీత గుణాంశ్చ జుషన్
భజతి సరూపతాం తదను మృత్యుమ పేతభగః ।
త్వముత జహాసి తామహిరివ త్వచమత్తభగో
మహసి మహీయ సేఽష్టగుణి తేఽపరి మేయభగః ॥
ఆ జీవుడైతే అజ్ఞానముచే (మాయచే మోహితుడై) అవిద్యా కార్యములగు దేహాదులతో తాదాత్మ్యమును పొంది, గుణకార్యములగు దేహాదులయందు రమించును. అందువలన, జీవుడు జ్ఞానానందములను కోల్పోయి దేహాదుల ధర్మములైన జన్మమరణములను పొంది సంసారమును పొందును. కాని, నీవు నిత్యసిద్ధమైన జ్ఞానానందములు, అనంతమైన ఐశ్వర్య-వీర్య-యశః-శ్రీ-జ్ఞాన-వైరాగ్యములు • గలవాడవు. పాము కుబుసమును వలె నీవు మాయను విడిచి పెట్టి అణిమ మొదలైన అష్టసిద్ధులతో కూడిన ఆనందస్వరూపమునందు విరాజిల్లుచున్నావు.
యది న సముద్ధరంతి యతయో హృది కామజటా
దురధిగమోఽసతాం హృది గతోఽస్మృతకంఠమణిః ।
అసుతృపయోగినాముభయతోఽప్యసుఖం భగవన్
అనపగతాంతకాదనధిరూఢపదాద్భవతః ॥
ఓ భగవానుడా! సాధకులు హృదయమునందలి కామవాసనల గుట్టలను పెకిలించి పారవేయవలెను. వారు అట్లు చేయనిచో, నీవు హృదయమునందే ఉన్ననూ, విస్మరించబడిన మెడయందలి మణి వలె, పొంద శక్యము కానివాడవగుదువు. ఇంద్రియభోగములయందు రమించే సాధకులకు ఒకవైపు మృత్యుభయము తొలగిపోకుండుటయే గాక, రెండవ వైపు నీ స్వరూపమును తెలియకుండుటచే, నీనుండి కూడ పాపములకు శిక్ష అనే భయము (దుఃఖము) నిలిచియే యుండును.
త్వదవగమీ న వేత్తి భవదుత్థశుభాశుభయోః
గుణవిగుణాన్వయాంస్తర్హి దేహభృతాం చ గిరః ।
అనుయుగమన్వహం సగుణ గీతపరంపరయా
శ్రవణభృతో యతస్త్వమపవర్గగతిర్మనుజైః ॥
ఓ కల్యాణగుణాకరా! నిన్ను తెలుసుకున్న జ్ఞాని నీవు కర్మఫలరూప ముగా ఇచ్చే సుఖదుఃఖముల భోగమును గాని, దేహాభిమానము గలవారికి ఉద్దేశించిన విధిని షేధములను గాని పట్టించుకోడు. అజ్ఞానుల నిందాస్తుతు లతో ఆతనికి సంబంధము లేదు. ప్రతియుగమునందు నీ (జ్ఞానుల) ఉపదే శముల పరంపరను ప్రతిదినము శ్రవణము చేస్తూ నిన్ను హృదయము నందు నిలుపుకునే మానవులు మోక్ష రూపముగా నిన్నే పొందెదరు.
ద్యుపతయ ఏవ తే న యయురంతమనంతతయా ।
త్వమపి యదంతరాండనిచయా నను సావరణాః ।
ఖ ఇవ రజాంసి వాంతి వయసా సహ యచ్ఛ్రుతయః
త్వయి హి ఫలంత్యతన్నిరసనేన భవన్నిధనాః ॥
స్వర్గాధిపతులు కూడ వీ అంతమును తెలియలేరు. అనంతుడవగుటచే నీవు కూడ నీ అంతమును తెలియలేవు. ఆహా! నీ మధ్యయందు పృథివీజలాది ఆవరణలతో కూడిన బ్రహ్మాండముల సమూహములు, ఆకాశములో ధూళికణములు వలె, కాలవేగముచే కలిసియే పరిభ్రమించుచున్నవి. నీవు - అనంతుడవగుట వలననే, నీవే పర్యవసానముగా గల శ్రుతులు సాక్షాత్తుగా కాకుండా, అనాత్మలను నిషేధించి, నీయందు సఫలములగుచున్నవి.
శ్రీభగవానువాచ ।
ఇత్యేతద్బ్రహ్మణః పుత్రా ఆశ్రుత్యాత్మానుశాసనమ్ !
సనందనమథానర్చుస్సిద్ధా జ్ఞాత్వాఽఽత్మనో గతిమ్ ॥
శ్రీ నారాయణ మహర్షి ఇట్లు పలి కెను --- బ్రహ్మదేవుని పుత్రులగు సనకాదులు ఈ విధముగా ఈ ఆత్మతత్త్వోపదేశమును వినిరి. వారు ఆత్మతత్త్వమునెరింగి కృతార్థులై, అప్పుడు సనందనుని పూజించిరి.
ఇత్య శేషసమామ్నాయపురాణోపనిషద్రసః ।
సముద్ధృతః పూర్వజాతైర్వ్యోమయానైర్మహాత్మభిః ॥
ఈ విధముగా సృష్టికి ఆరంభములో పుట్టిన ఆకాశసంచారము చేసే సనకాది మహాత్ములు సకలవేదముల, పురాణముల, ఉపనిషత్తుల సారమును పైకి తీసి ఈ స్తుతిని అందించిరి.
త్వం చైతద్బ్రహ్మదాయాద శ్రద్దయాఽఽత్మానుశాసనమ్ ।
ధారయంశ్చర గాం కామం కామానాం భర్జనం నృణామ్ ॥
బ్రహ్మపుత్రుడవగు ఓ నారదా! ఈ ఆత్మతత్త్వోపదేశము మానవుల కామవాసనలను దహించివేయును. నీవు దీనిని బుద్ధియందు ధారణ చేసి యథేచ్చగా భూలోకమునందు సంచరించుము.
శ్రీశుక ఉవాచ ।
ఏవం స ఋషిణాఽఽదిష్టం గృహీత్వా శ్రద్ధయాఽఽత్మవాన్ ।
పూర్ణశ్శ్రుతధరో రాజన్నాహ వీరవ్రతో మునిః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! నారద మహర్షి ఆత్మనిష్ఠ గలవాడగుటచే ఆప్తకాముడు. దృఢమైన నియమనిష్ఠలు గల ఆ మహర్షి విన్నదానిని మరువడు. ఆయన నారాయణ మహర్షియొక్క ఈ ఉపదేశమును శ్రద్దతో స్వీకరించి, ఇట్లు పలికెను.
నారద ఉవాచ ।
నమస్తస్మై భగవతే కృష్ణాయామలకీర్తయే ।
యో ధత్తే సర్వభూతానామభవాయోశతీః కలాః ॥
నారదుడిట్లు పలికెను --- స్వచ్చమైన కీర్తి గల ఆ శ్రీకృష్ణ భగవానునకు నమస్కారము. ఆయన సకలప్రాణులకు సంసారదుఃఖము ఉపశమించుటకై మనోహరమైన మూర్తులను స్వీకరించుచుండును.
ఇత్యాద్యమృషి మానమ్య తచ్చిష్యాంశ్చ మహాత్మనః ।
తతోఽగాదాశ్రమం సాక్షాత్పితుర్ద్వైపాయనస్య మే ॥
ఈ విధముగా ఆయన సనాతనుడగు నారాయణ మహర్షికి, ఆయన శిష్యులకు నమస్కరించేను. నారదుడు అక్కడనుండి తాను (సాక్షాత్తు) నా తండ్రియగు వ్యాసమహర్షి ఆశ్రమమునకు వెళ్లాను.
సభాజితో భగవతా కృతాసనపరిగ్రహః ।
తస్మై తద్వర్ణయామాస నారాయణముఖాచ్ఛ్రుతమ్ ॥
పూజనీయుడగు వ్యాసుడు నారదుని సత్కరించేను. నారదుడు ఆసనమును స్వీకరించి, తాను నారాయణ మహర్షి నోటినుండి విన్న వేదస్తుతిని ఆయనకు వివరించి చెప్పెను.
ఇత్యేతద్వర్ణితం రాజన్ యన్నః ప్రశ్నః కృతస్త్వయా ।
యథా బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణేఽపి మనశ్చరేత్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! పరబ్రహ్మ నిర్గుణుడు గాన, పరబ్రహ్మను వాక్కుచే నిర్దేశించ శక్యము కాదు, మనస్సుచే ఊహించ శక్యము కాదు. అట్టి పరబ్రహ్మయందు మనస్సు ఎట్లు ప్రసరించునో, శ్రుతులు ఎట్లు వర్ణించునో, ఆ విషయమై. నీవు వేసిన ప్రశ్నకు నేనీ విధముగా వర్ణించి చెప్పితిని.
యోఽస్యోత్ప్రేక్షక ఆదిమధ్యనిధనే యోఽవ్యక్తజీవేశ్వరో
యస్సృష్ట్వేదమనుప్రవిశ్య ఋషిణా చక్రే పురశ్శాస్తి తాః,
యం సంపద్య జహాత్యజామనుశయీ సుప్తః కులాయం యథా
తం కైవల్యనిరస్తయోనిమభయం ధ్యాయేదజస్రం హరిమ్॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
ఉత్తరార్దే సప్తాశీవితమోఽధ్యాయః ॥
శ్రీహరి ఈ జగత్తును సృష్టించవలెనని సంకల్పించి జగత్తు యొక్క సృష్టి స్థితిలయములు తానే అయినాడు. మాయాశక్తిని, జీవులను శాసించే ఆ శ్రీహరి ఈ జగత్తును సృష్టించి, తరువాత దానిలో ద్రష్ణయగు జీవుని రూపముగా ప్రవేశించినాడు. ఆయనయే ఈ దేహములను నిర్మించి వాటిని పాలించుచున్నాడు. కర్మఫలభోక్తయగు జీవుడు ఆయనను ఉపాసించి పొంది, నిద్రించినవాడు దేహమును వలె, అవిద్యను విడిచి పెట్టును. ఆయన తన అద్వితీయస్వరూపస్థితిచే మాయను అధిగమించినవాడు. భయమును పోగొట్టే అట్టి శ్రీహరిని నిరంతరము ధ్యానము చేయవలెను.
శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో వేదస్తుతిని వర్ణించే
ఎనుబది ఏడవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 87 of the Bhāgavata Mahā Purana is as follows:
In response to Emperor Parīkshit's inquiry regarding how the Vaidika mantras can describe the Supreme Unmanifest Being who transcends material qualities (*Nirguṇa*), Śrī Śukadeva Gosvāmī recited the profound Veda-stuti (*SB 10.87.1–44*). This highly philosophical chapter presents the prayers offered by the personified Vedas (*Śrutis*) to Bhagavān Vishṇu at the dawn of creation. The Vedas declare that the Supreme Being is the ultimate goal of all Vedic mantras, the singular source of all cosmic energies, and the inner indwelling Supersoul (*Paramātmā*). The Veda-stuti establishes that intellectual speculation and ritualistic work fail to reach Him, and that absolute liberation is attained solely through surrendering to His divine lotus feet.