59 - భౌమాసురుని ఉద్దరించుట

రాజోవాచ

యథా హతో భగవతా భౌమో యేన చ తాః స్త్రియః

నిరుద్ధా ఏతదాచక్ష్వ విక్రమం శార్జ్గధన్వనః

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఆ స్త్రీలను బందీ చేసిన భౌమాసురుని శార్ జ్ఞమనే ధనుస్సు గల శ్రీహరి భగవానుడు సంహరించిన విధమెట్టిది ? ఆ శ్రీకృష్ణుని ఈ చరితమును వివరించి చెప్పుడు.

శ్రీశుక ఉవాచ

ఇంద్రేణ హృతఛత్రేణ హృతకుండలబంధునా

హృతామరాద్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితమ్

సభార్యో గరుడారూఢః ప్రొగ్జ్యోతిషపురం యణా

భౌమాసురుడు వరుణుని ఛత్రమును, ఇంద్రుని తల్లియగు అదితి కుండలములను, దేవతల స్థానమగు మణిపర్వతమును అపహరించెను. ఇంద్రుడు శ్రీకృష్ణునకు భౌమాసురుని చేష్టలను విన్నవించెను. ఆయన సత్యభామతో గూడి గరుడుని అధిష్ఠించి ప్రార్ణ్యోతిషపురమునకు వెళ్లాను.

గిరిదుర్గైశ్శస్త్రదుర్గైర్జలాగ్న్యనిలదుర్గమమ్

మురపాశాయుతైర్ఘో రైర్దృడైస్సర్వత ఆవృతమ్

ఆ నగరమునకు చుట్టూ దాటి వెళ్లలేని పర్వతములు, ఆయుధముల ఆటంకములు, నీటి అగర్త, అగ్ని వలయము, వాయువలయము ఉన్న కారణముగా ,దానిలో ప్రవేశించుట దుర్ఘటము. పైగా, మురాసురుడు దాని చుట్టూ దృఢములై భయమును గోలే పదివేల పాశములను అమర్చెను.

గదయా నిర్బిభేదాద్రీన్ శస్త్రదుర్గాణి సాయకైః

చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాంస్తథాఽసీనా

ఆయన పర్వతములను గదతో పగులగొట్టి, దారికి ఆటంకములైన ఆయుధములను బాణములతో ఛిన్నాభిన్నము చేసెను. చక్రముతో అగ్ని వాయువలయములను, నీటి అగడ్డను ఛేదించి, కత్తితో మురాసురుని త్రాళ్లను తెగగొట్టెను.

శంఖనాదేన యంత్రాణి హృదయాని మనస్వినామ్

ప్రాకారం గదయా గుర్వ్యా నిర్బిభేద గదాధరః

గదాధారియగు శ్రీకృష్ణుడు శంఖము యొక్క నాదముతో వీరులమనే అభిమానము గలవారి హృదయములను, పెద్ద గదతో నగరముయొక్క ప్రాకారమును, దాని మీదనుండే యంత్రములను పగులగొట్టెను.

పాంచజన్యధ్వనిం శ్రుత్వా యుగాంతాశనిభీషణమ్

మురశ్శయాన ఉత్తస్థౌ దైత్యః పంచశిరా జలాత్

పాంచజన్యమనే శంఖముయొక్క ధ్వని ప్రళయకాలమునందలి పిడుగును పోలి యుండెను. దానిని విని (అగడ్తలోని) నీటియందు నిద్రిస్తున్న ఐదు తలల మురాసురుడు లేచి నిలబడెను.

త్రిశూలముద్యమ్య సుదుర్నిరీక్షణో యుగాంతసూర్యానలరోచిరుల్బణః,

గ్రసంస్త్రీలోకీమివ పంచభిర్ముఖైరభ్యద్రవత్తార్ క్ష్యసుతం యథోరగః

మురుడు ప్రళయకాలమునందలి సూర్యుడు వలె అగ్ని వలె ప్రకాశిస్తూ కన్నెత్తి చూడరాకుండ నుండెను. ఆతడు త్రిశూలమును పైకెత్తి భయమును గొల్పుతూ ఐదు నోళ్లతో ముల్లోకములను మ్రింగివేయుచున్నాడా యన్నట్లు, పాము గరుడుని పైకి వలె, శ్రీకృష్ణుని వైపు పరుగెత్తుకు వచ్చెను.

ఆవిధ్య శూలం తరసా గరుత్మతే నిరస్య వక్త్రైర్వ్యనదత్స పంచభిః,

స రోదసీ సర్వదిశోఽoతరం మహానాపూరయన్నండకటాహమావృణోత్.

ఆతడు వేగముగా శూలమును త్రిప్పి గరుత్మంతుని కొట్టి ఐదు నోళ్లతో నాదము చేసెను. ఆ పెద్ద నాదము స్వర్గభూపాతాళములను సకలదిక్కులను నింపి గంగాళమువంటి బ్రహ్మాండమునావరించెను.

తదాపతద్వై త్రిశిఖం గరుత్మతే

హరిశ్శరాభ్యామభినత్త్రిధేజసా

ముఖేషు తం చాపి శరైరతాడయత్

తస్మై గదాం సోఽపి రుషా వ్యముంచత

గరుత్మంతుని మీదకు వచ్చుచున్న ఆ త్రిశూలమును శ్రీకృష్ణ భగవానుడు వేగముగా రెండు బాణములతో కొట్టి మూడు ముక్కలు చేసెను. పైగా, ఆయన ఆ మురుని అయిదు ముఖములను బాణములతో కొట్టెను, వాడు కూడ కోపముతో శ్రీకృష్ణునిపై గదను ప్రయోగించెను.

తామాపతంతీం గదయా గదాం మృదే గదాగ్రజో నిర్భిభిదే సహస్రధా  

ఉద్యమ్య బాహూనభిధావతోఽజితశ్శిరాంసి చక్రేణ జహార లీలయా  

గదుని అన్నగారగు శ్రీకృష్ణుడు యుద్ధములో పరాజయమునేరుగడు. ఆయన మీదకు వచ్చుచున్న ఆ గదను తన గదతో వేయి ముక్కలుగా పగుల గొట్టెను. చేతులను పైకెత్తి మీదకు పరుగుతో వచ్చుచున్న మురుని తలలను ఆయన చక్రముతో సుసోయాసముగా ఊడగొట్టెను.

వ్యసుః పపొతాంభసి కృత్తశీర్షో నికృత్తశృంగోఽద్రిరివేంద్రతేజసా,

తస్యాత్మజాస్సప్త పితుర్వధాతురాః ప్రతిక్రీయాఽమర్షజుషస్సముద్యతాః.

తల నరుకబడిన మురుడు ప్రాణములను కోల్పోయి, ఇంద్రుని వజ్రముచే తెగగొట్టబడిన శిఖరము గల పర్వతము వలె, నీటియందు పడెను. వాని ఏడురు పుత్రులు తండ్రి వధ చే దుఃఖితులై ప్రతీకారము చేయాలనే కోపముతో ఆవేశించబడి యుద్ధమునకు సంసిద్దులైరి.

తామ్రోంఽతరిక్షశ్శ్రవణో విభావసుః 

వసుర్నభస్వానరుణశ్చ సప్తమః

పీఠం పురస్కృత్య చమూపతిం మృధే

భౌమప్రయుక్తా నీరగన్ ధృతాయుధాః

తాముడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసువు, వసువు, నభస్వంతుడు, అరుణుడు అనే ఏడురు మురుని పుత్రులను భౌమాసురుడు ఆదేశించెను. వారు ఆయుధములను ధరించి పీఠుడనే సేనాపతిని ముందడుకొని యుద్ధము కొరకై బయటకు వచ్చిరి.

ప్రాయుంజతాసాద్య శరానసీంగదాశ్శక్యృష్టి శూలాన్యజితే రుషోల్బణాః

తచ్ఛస్త్రకూటం భగవాన్ స్వమార్గణైరమోఘవీర్యస్తిలశశ్చకర్త హ

ఆ ఏడ్గురు కోపముతో అపరాజితుడగు శ్రీకృష్ణ భగవానుని సమీపించి ఆయనపై బాణములను, కత్తులను, గదలను, చిల్లకోలలను, ఈటెలను, శూలములను ప్రయోగించిరి. మొక్కవోని పరాక్రమము గల ఆయన తన బాణములతో ఆ ఆయుధసముదాయమును నుగ్గు నుగ్గుగా తెగగొట్టెను.

తాన్ పీఠముఖ్యాననయద్యమక్షయం నికృత్తశీర్షోరుభుజాంఘ్రివర్మణః

శ్రీకృష్ణుడు ఆ పీఠుడు మొదలగువారి తలలను, తొడలను, చేతులను, కోళ్లను, కవచములను తెగగొట్టి యమపురికి పంపించెను.

స్వానీకపానచ్యుతచక్రసాయక్రైస్తథా నిరస్తాన్నరకో ధరాసుతః

నిరీక్ష్య దుర్మర్షణ ఆస్రవన్మ దైర్గ జైః పయోధిప్రభవైర్నిరాక్రమత్

భూదేవి పుత్రుడగు నరకుడు తన సేనాపతులు ఆ విధముగా శ్రీకృష్ణ భగవానుని చక్రముచే మరియు బాణములచే సంహరించబడుటను చూచి సహించలేకపోయేను. ఆతడు సముద్రతీరమున పుట్టి అంతటా మదమును స్రవించుచున్న ఏనుగులతో కూడి బయటకు వచ్చెను.

దృష్ట్వా సభార్యం గరుడోపరి స్థితం

సూర్యోపరిష్టాత్సతడిద్ఘనం యథా

కృష్ణం స తస్మై వ్యసృజచ్చతఘ్నీం

యోధాశ్చ సర్వే యుగపత్మ వివ్యధుః

గరుత్మంతునిపై భార్యయగు సత్యభామతో గూడి కూర్చున్న శ్రీకృష్ణుడు సూర్యునిపై మెరుపుతో కూడిన మేఘమువలె నుండెను. ఆయనను చూచి ఆ నరకుడు ఆయనపై ఫిరంగిని ప్రయోగించెను. ఆతని సైనికులందరు కూడ ఒక్కసారిగా ఆయుధములతో కొట్టిరి.

తద్బౌమ సైన్యం భగవాన్ గదాగ్రజో విచిత్రవాజైర్నిశితైశ్శిలీముఖైః, నికృత్తబాహూరుశిరోధ్రవిగ్రహం చకార తర్హ్యేవ హతాశ్వకుంజరమ్ 

అదే సమయములో గదుని అన్నయగు శ్రీకృష్ణ భగవానుడు రంగు రంగుల రెక్కలు గల వాడి బాణములతో ఆ నరకాసురుని సైన్యములోని సైనికుల చేతులను, తొడలను, మెడలను, దేహములను నరికి, గుర్రములను, ఏనుగులను సంహరించెను.

యాని యోధైః ప్రయుక్తాని శస్త్రాస్త్రాణి కురూద్వహ

హరిస్తాననిచ్ఛినత్తీక్ ష్ణైశ్శ రైరే కైకశస్త్రిభిః

కురువంశశ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! నరకుని యోధులు ఏ ఆయుధములను, అస్త్రములను ప్రయోగించిరో, వాటిని శ్రీకృష్ణ భగవానుడు ఒక్కొక్కదానిని మూడేసి వాడి బాణములతో ఛేదించేను.

ఉహ్యమానస్సుపర్ణేన పక్షాభ్యాం నిఘ్నతా గజాన్

గరుత్మతా హన్యమానాస్తుండపక్షన ఖైర్గజాః

శ్రీకృష్ణుని తనపై మోస్తూనే గరుత్మంతుడు రెక్కలతో ఏనుగులను కొట్టెను. ముక్కు, రెక్కలు, గోళ్లతో గరుత్మంతుడు ఏనుగులను చంపెను.

పురమేవావిశన్నార్తా నరకో యుధ్యయుధ్యత

దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడేనార్దితం స్వకమ్

యుద్దములో గరుత్మంతునిచే పీడించబడిన నరకుని సైనికులు నగరములోనికే పారిపోయిరి. ఆ దృశ్యమును చూచి నరకుడు యుద్ధమును కొనసాగించెను.

తం భౌమః ప్రాహరచ్చ క్త్యా వజ్రః ప్రతిహతో యతః

నాకం పత తయా విద్ధో మాలాహత ఇవ ద్విపః

నరకుడు ఆ గరుడుని శక్తితో కొట్టెను. ఆ శక్తి ఒకప్పుడు వజ్రమును కూడ విఫలము చేసెను. కాని, దానిచే కొట్టబడిన గరుత్మంతుడు, మాలచే కొట్టబడిన ఏనుగు వలె, చలించలేదు.

శూలం భౌమోఽచ్యుతం హంతుమాదదే వితథోద్యమః

తద్విసర్గాత్పూర్వమేవ నరకస్య శిరో హరిః

 ఆపాహరద్గజస్థస్య చక్రేణ క్షురనేమినా

గరుత్మంతుని కొట్టాలనే నరకుని ప్రయత్నము వ్యర్థమాయెను. అపుడాతడు శ్రీకృష్ణ భగవానుని కొట్టుటకై శూలమును తీసుకొనెను. ఆతడు దానిని విడుచుటకు ముందే శ్రీకృష్ణ భగవానుడు ఏనుగు పైనున్న వాని తలను చురకత్తివలే వాడియైన ధార గల చక్రముతో ఊడగొట్టెను.

సకుండలం చారుకిరీటభూషణం

బభౌ పృథివ్యాం పతితం సముజ్జ్వలత్

హా హేతి సాధ్విత్కృషయస్సురేశ్వరా

మాల్యైర్ముకుందం వికిరంత ఈడిరే

కుండలములు,. అందమైన కిరీటము, అలంకారములతో గొప్పగా ప్రకాశించే ఆ తల నేలపై పడి భాసించేను. నరకుని అనుయాయులు అయ్యో! అయ్యో! అని వాపోయిరి. మహర్షులు, దేవనాయకులు బాగు! అంటూ మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణ భగవానునిపై పూలను చల్లుతూ స్తుతించిరి.

తతశ్చ భూః కృష్ణము పేత్య కుండలే

ప్రతప్తజాంబూనదరత్నభాస్వరే

సవైజయంత్యా వనమాలయాఽర్పయత్ 

ప్రాచేతసం ఛత్రమథో మహామణీమ్

తరువాత భూదేవి శ్రీకృష్ణుని వద్దకు వచ్చి పుటము పెట్టిన బంగారమునందు పొదిగిన రత్నములు గల కుండలముల జత (అదితివి) ను, ఎనిమిది రకముల రత్నముల మాలయగు వైజయంతిని, అడవి పూల మాలను, వరుణుని ఛత్రమును, పెద్ద మణిని సమర్పించెను.

అస్తౌషీదథ విశ్వేశం దేవీ దేవవరార్చితమ్

ప్రాంజలిః ప్రణతా రాజన్ భక్తిప్రవణయా ధియా  

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత భూదేవి దేవనాయకులచే పూజించబడిన జగన్నాథుడగు శ్రీకృష్ణునకు దోసిలి యొగ్గి నమస్కరించి, భక్తిభావముతో నిండిన హృదయముతో స్తుతించెను.

భూమిరువాచ

నమస్తే దేవదేవేశ శంఖచక్రగదాధర

భక్తేచ్ఛోపాత్తరూపాయ పరమాత్మన్నమోఽస్తు తే

భూదేవి ఇట్లు పలికెను --- ఓ పరమాత్మా! దేవతలకు ప్రభువులగు బ్రహ్మాదులకు కూడ నీవు శాసకుడవు. శంఖమును, చక్రమును, గదను ధరించే నీవు భక్తుల ఇచ్చచే అవతారములను స్వీకరించెదవు. నీకు నమస్కారమగు గాక!

నమః పంకజనాభాయ నమః పంకజమాలినే

నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే

పద్మముల మాల గల నీయొక్క నాభినుండి పద్మము పుట్టినది. నీ కన్నులు, పాదములు పద్మములను పోలియుండును. నీ పాదములలో పద్మపు గుర్తులు ఉండును. నీకు అనేక నమస్కారములు.

నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే

పురుషాయాదిబీజాయ పూర్ణబోధాయ తే నమః

విష్ణుభగవానుడవగు నీవు వసుదేవపుత్రుడవై అవతరించితివి. పూర్ణ బ్రహ్మ వైన నీవే జగత్కారణము. దేశకాలపరిచ్ఛేదములు లేని చైతన్యమే నీ స్వరూపము. నీకు అనేక నమస్కారములు.

అజాయ జనయిత్రేఽస్య బ్రహ్మణేఽనంతశక్తయే

పరావరాత్మన్ భూతాత్మన్ పరమాత్మన్ నమోఽస్తు తే

ఓ పరమాత్మా! కారణకార్యముల సొరము నీవే. పంచభూతముల రూపముగా ప్రకటమైనది నీవే. పుట్టుక లేని నీవీ జగత్తును సృష్టించినావు. అనంతశక్తి గల పరబ్రహ్మవు నీవే. నీకు నమస్కారము.

త్వం వై సీసృక్షూ రజ ఉత్కటం ప్రభో

తమో నిరోధాయ బిభర్ష్యసంవృతః

స్థానాయ సత్త్వం జగతో జగత్పతే

కాలః ప్రధానం పురుషో భవాన్ పరః

ఓ ప్రభూ! సృష్టి చేయగోరిన నీవు కార్యోన్ముఖమగు రజోగుణమును, ప్రళయమునకై తమోగుణమును, జగత్తు యొక్క స్థితి కొరకు సత్త్వగుణమును ఉపాధిగా స్వీకరించేదవు. కాని, గుణాతీతుడవగు నీవు స్వతంత్రుడవే. ఓ జగన్నాథా! కాలము, ప్రకృతి, జీవుడు నీవే.

అహం పయో జ్యోతిరథానిలో నభో

మాత్రాణి దేవా మన ఇంద్రియాణి

కర్తా మహానిత్యభిలం చరాచరం

త్వయ్యద్వితీయే భగవన్నయం భ్రమః  

ఓ భగవానుడా! పృథివ్య పేజోవాయ్వాకాశములనే పంచభూతములు, శబ్దస్పర్శరూపరసగంధములనే సూక్ష్మభూతములు, సూర్యుడు మొదలైన ఇంద్రియాధిష్ఠానదేవతలు, సమష్టి మనస్సు, అహంకారము, మహత్తత్త్వ ము అనే ఈ స్థావరజంగమాత్మకమగు జగత్తు సర్వము రెండవది లేని నీయందు వేరుగా యథార్థముగా ఉన్నట్లు ఇది భ్రమ మాత్రమే.

తస్యాత్మజోఽయం తవ పాదపంకజం భీతః ప్రపన్నార్తిహరోపసాదితః

తత్వాలయైనం కురు హస్తపంకజం శిరస్యముష్యాఖిలకల్మషాపహమ్

శరణు జొచ్చినవారి దుఃఖములను బాపే ఓ శ్రీకృష్ణా! భయపడిన ఈ పిల్లవాడు ఆ నరకాసురుని కొడుకు. నేను వీనిని పద్మమువంటి నీ పాదము పై పడవేసినాను. కాబట్టి నీవు వీనిని కాపాడుము. సకలపాపములను పోగొట్టే నీ చేతిని వీని తల పైనుంచుము.

శ్రీశుక ఉవాచ

ఇతి భూమ్యాఽర్థితో వాగ్భిర్బగవాన్ భక్తినమ్రయా

దత్త్వాఽభయం భౌమగృహం ప్రావిశత్సకలర్ద్ధిమత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- భక్తిచే వినమ్రురాలైన భూదేవి ఈ విధముగా వాక్కులతో ప్రార్థించగా, శ్రీకృష్ణ భగవానుడు ఆ పిల్లవానికి అభయమునిచ్చి, సకలసంపదలతో నిండిన నరకుని ఇంటిని ప్రవేశించేను.

తత్ర రాజన్యకన్యానాం షట్సహస్రాధికాయుతమ్

భౌమాహృతానాం విక్రమ్య రాజభ్యో దదృశే హరిః

నరకాసురుడు పరాక్రమించి రాజులనుండి ఎత్తుకు వచ్చిన పదహారు వేల రాజపుత్రికలు అచట శ్రీకృష్ణ భగవానునకు కనబడిరి.

తం ప్రవిష్టం స్త్రియో వీక్ష్య నరవీరం విమోహితాః

మనసా వవ్రిరేఽభీష్టం పతిం దైవోపసాదితమ్

రాజప్రాసాదములో ప్రవేశించిన శ్రీకృష్ణుడు మానవులలో వీరుడు. ఆ యువతులు ఆయనను చూచి మోహమును పొందిరి. ఆయనను దైవము సమకూర్చిన ప్రియతముడగు భర్తగా వారు మనస్సులో వరించిరి.

భూయాత్పతిరయం మహ్యం ధాతా తదనుమోదతామ్

ఇతి సర్వాః పృథక్ కృష్ణే భావేన హృదయం దధుః

ఈయన నాకు భర్త యగుగాక! ఈశ్వరుడు నా అభిలాషను అనుమోదించుగాక! అని ఆ యువతులందరు ఎవరికి వారే శ్రీకృష్ణునియందు ప్రేమతో హృదయమును నిలిపిరి.

తాః ప్రొహిణోద్ద్వారవతీం సువృష్టవిరజోఽoబరాః

నరయానైర్మహాకోశాన్ రథాశ్వాన్ ద్రవిణం మహత్

శ్రీకృష్ణుడా యువతులకు అందమైన స్వచ్చమైన వస్త్రములనేర్పాటు చేసి పల్లకీల పై ద్వారకకు పం పేను. ఆయన గొప్ప ఖజానాలను, రథములను, గుర్రములను, గొప్ప సంపదను కూడ పం పెను.

ఐరావతకులేభాంశ్చ చతుర్దంతాంస్తరస్వినః

పాండురాంశ్చ చతుష్టష్టిం ప్రేషయామాస కేశవః  

నాలుగు దంతములు కలిగి తెల్లని వేగవంతములైన అరవై నాలుగు ఏనుగులను కూడ ఆ శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు పం పెను. ఆ ఏనుగులు ఐరావతము యొక్క వంశములో పుట్టినవి.

గత్వా సురేంద్రభవనం దత్త్వాఽధిత్యై చ కుండలే

పూజితస్త్రీదశేంద్రేణ స హేంద్రాణ్యా చ సప్రియః

ప్రియురాలగు సత్యభామతో గూడి శ్రీకృష్ణ భగవానుడు దేవేంద్రుని భవనమునకు వెళ్లి అదితికి కుండలముల జతను ఇచ్చెను. మహేంద్రుడు శచీదేవితో గూడి ఆయనను పూజించెను.

చోదితో భార్యయోత్పాట్య పారిజాతం గరుత్మతి

ఆరోప్య సేంద్రాన్ విబుధాన్నిర్జిత్యోపానయత్పురమ్

సత్యభామ ప్రేరేపించగా శ్రీకృష్ణుడు ఇంద్రునితో సహా దేవతలను జయించి, పారిజాత వృక్షమునూడబెరకి, గరుత్మంతునిపై ఎక్కించి ద్వారకకు కొని తెచ్చెను.

స్థాపితస్సత్యభామాయా గృహోద్యానోపశోభనః అన్వగుర్ర్భమరాస్స్వర్గాత్తద్గంధాసవలంపటాః

ఆ చెట్టు సత్యభామ ఇంటిని ఆనుకొని ఉన్న ఉద్యానమునందు పాతబడి దానికి శోభను తెచ్చినది. దాని పరిమళముతో కూడిన తేనెయందలి లోభముచే స్వర్గమునుండి తుమ్మెదలు వెంట వచ్చినవి.

యయాచ ఆనమ్య కిరీటకోటిభిః

పాదౌ స్పృశన్నచ్యుతమర్థసాధనమ్

సిద్దార్థ ఏతేన విగృహ్యతే మహాన్

అహో సురాణాం చ తమో ధిగాడ్యతామ్

ఇంద్రుడు తలవంచి కిరీటముయొక్క కొనలతో శ్రీకృష్ణుని రెండు పాదములను తాకి నరకుని వధను గురించి ప్రార్థించెను. ఆయన ఆ పనిని చేసి పెట్టెను. ఇంద్రుడు గొప్పవాడే అయినా, తన పని అయిన పిదప ఈ శ్రీకృష్ణునితో (చెట్టు గురించి) విరోధము పెట్టుకొనెను. దేవతలయొక్క ఈ అజ్ఞానము, తాము సంపన్నులమనే గర్వము నిందార్దములు.

అథో ముహూర్త ఏకస్మీన్నానాగారేషు తాః స్త్రియః

యథోపయేమే భగవాంస్తావద్రూపధరోఽవ్యయః

తరువాత ఒకానొక ముహూర్తమునందు అవినాశియగు శ్రీకృష్ణ భగవానుడు ఆ యువతులను అన్ని రూపములను దాల్చి వివిధభవనములయందు యథావిధిగా వివాహమాడెను.

గృహేషు తాసామనపాయ్యతర్క్యకృన్నిరస్తసామ్యాతిశ యేష్వవస్థితః

రేమే రమాభిర్నిజకామసంఫ్లుతో యథేతరో గార్హకమేధికాంశ్చరన్  

ఆ యువతుల భవనములతో సమానమైనవి గాని, గొప్పవి గాని భవనములు లేవు. శ్రీకృష్ణుడు ఆ భవనములలో నిరంతరముగా ఉంటూ సామాన్యజనుల వలె గృహస్థధర్మములను పాటిస్తూ ఆ యువతులతో రమించెను. ఊహకు అందని లీలలను చేసే ఆ శ్రీకృష్ణుడు తన భక్తుల ఇచ్చకు వశుడై యుండును. ఆ యువతులు లక్ష్మీదేవియొక్క అంశలు.

ఇత్థం రమాపతిమవాప్య పతిం స్త్రీయస్తా 

బ్రహ్మాదయోఽపీ న విదుః పదవీం యదీయామ్

భేజుర్ముదాఽవీరతమేధితయాఽనురాగ-

హాసావలోకనవసంగమజల్పలజ్జాః

శ్రీకృష్ణుని స్వరూపమును బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలగువారు కూడ తెలియలేకున్నారు. కానీ, ఈ విధముగా ఆ యువతులు లక్ష్మీపతి యగు ఆ శ్రీకృష్ణుని భర్తగా పొందిరి. వారి ఆనందము నిరంతరముగా వర్ధిల్లుచుండెను. వారు ప్రేమతో కూడిన చిరునవ్వులతో, చూపులతో, కొత్త " కలయికయందలి ప్రేమ ఊసుల సిగ్గులతో ఆయనను సేవించిరి.

ప్రత్యుద్గమాసనవరార్హణపాదశౌచ-

తాంబూలవిశ్రమణవీజనగంధమాల్యైః

కేశప్రసారశయనస్నపనోపహార్యైః

దాసీశతా అపీ విభోర్విదధుస్స్మ దాస్యమ్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్దే ఏకోనషష్టితమోఽధ్యాయః

ఆ శ్రీకృష్ణ భార్యల వద్ద వందలాది దాసీలు ఉండిరి. అయినా, ఆ ప్రభునకు ఎదురేగుట, ఆసనమునిచ్చుట, త్రాగే నీరు మొదలగు శ్రేష్ఠమగు ఉపచారములను చేయుట, కాళ్లను కడుగుట, తాంబూలమునిచ్చుట, కాళ్లను నొక్కి శ్రమను తొలగించుట, వీచుట, గంధమునలదుట, పుష్పములనిచ్చుట, జుట్టు దువ్వుట, ప్రక్కనమర్చుట, స్నానమునకు - వ్యవస్థ చేయుట, భోజనమును ఫలహారమును ఇచ్చుట మొదలగు

పరిచర్యలతో వారే సేవ చేసిరి.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో శ్రీకృష్ణుడు భౌమాసురుని ఉద్దరించుటను వర్ణించే ఏబది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (59).