72 - ధర్మరాజు రాజసూయము -  జరాసంధుని ఉద్దారము

 శ్రీశుక ఉవాచ

 ఏకదా తు సభామధ్యే ఆస్థితో మునిభిర్వృతః

 బ్రాహ్మణేః క్షత్రియైర్వైశ్యైరాతృభిశ్చ యుధిష్ఠిరః

 ఆచార్యైః కులవృద్దాశ్చ జ్ఞాతిసంబంధిబాంధవైః

 శృణ్వతా మేవ చైతేషామాభా ష్యేదమువాచ హ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఒకనాడు ధర్మరాజు సభామధ్యమునందు ఆసనమునధిష్టించి యుండెను. ఆయన చుట్టూ మహర్షులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, సోదరులు, ఆచార్యులు, కుల పెద్దలు, జ్ఞాతులు, సంబంధీకులు, బంధువులు ఉండిరి. వారు వినుచుండగా ఆయన శ్రీకృష్ణుని సంబోధించి ఇట్లు పలికెను.

యుధిష్ఠిర ఉవాచ

క్రతురాజేన గోవింద రాజసూయేన పావనీః

యక్ష్యే విభూతీర్భవతస్తత్సంపాదయ నః ప్రభో

ధర్మరాజు ఇట్లు పలి కెను --- ఓ గోవిందా! నేను యజ్ఞములలో రాజైన రాజసూయముచే పొవనము చేసే నీ విభూతులగు దేవతల నారాధించెదను. ఓ ప్రభూ! నీవు మాకు దానిని సంపన్నము చేయుము.

త్వత్పాదుకే అవిరతం పరి యే చరంతి

ధ్యాయంత్యభద్రనశనే శుచయో గృణంతీ

 విందంతి తే కమలనాభ భవాపవర్గం

 ఆశాసతే యది త ఆశిష ఈశ నాన్యే

ఓ పద్మనాభా! ఎవరైతే అమంగళములను నాశము చేసే నీ పాదములను శుద్ధాంతఃకరణముతో నిరంతరముగా కొలిచెదరో, ధ్యానించెదరో, కీర్తించెదరో, వారు సంసారనుంముడి విముక్తిని పొందెదరు. ఓ ఈశ్వరా! వారు కామనలను కోరినచో, వాటిని కూడ పొందెదరు. ఇతరులు దేనినీ పొందరు.

తద్దేవ దేవ భవతశ్చరణారవింద

సేవాఽనుభావమీహ పశ్యతు లోక ఏషః

యే త్వాం భజంతి న భజంత్యుత వోభయేషాం.

నిష్ఠాం ప్రదర్శయ విభో కురుసృంజయానామ్

ఓ దేవదేవా! కావున, ఈ లోకమునందు నీ పాద సేవ యొక్క మహిమనీ మానవుడు తెలియవలెను. ఓ విభూ! కురుసృంజయవంశీయులలో ఎవరైతే నిన్ను సేవిస్తారో, లేదా నిన్ను సేవించరో, వారిద్దరికి కలిగే ఫలమును నీవు నిరూపించుము..

న బ్రహ్మణస్స్వపరభేదమతిస్తవ స్యాత్

సర్వాత్మనస్సమదృశస్స్వసుఖానుభూతేః

 సం సేవతాం సురతరోరివ తే ప్రసాదః

సేవాఽనురూపముదయో న విపర్యయ్వోత్ర

పరబ్రహ్మవగు నీవు సర్వమునందు ఆత్మరూపుడవై ఉన్నావు. ఆత్మా నందానుభవమే స్వరూపముగా గల నీకు సమదృష్టియే గాని, తనవారు పరాయివారు అనే భేదబుద్ది ఉండదు. కాని, కల్పవృక్షమును వలె నిన్ను బాగుగా సేవించువారలకు నీ అనుగ్రహము కలుగును. వారికి కలిగే ఫలము కూడ వారి సేవకు తగ్గట్లుగనే ఉండును. దీని విషయములో నీయందు పక్షపాతబుద్ధి, కఠారత మొదలగు దోషములకు తావు లేదు.

శ్రీభగవానువాచ

సమ్యగ్వ్యవసితం రాజన్ భవతా శత్రుకర్శన

 కల్యాణీ యేన తే కీర్తిర్లోకానను భవిష్యతి

  శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను. --- శత్రువులను కృశింపజేసే ఓ ధర్మరాజా! నీవు చాల చక్కని నిశ్చయమును చేసితివి. దానిచే నీ కీర్తి లోకములలో వ్యాపించగలదు.

ఋషీణాం పితృదేవానాం సుహృదామపి నః ప్రభో

సర్వేషామపి భూతానామీప్సితః క్రతుండయమ్

ఓ ధర్మరాజా! యజ్ఞములలో రాజగు ఈ రాజసూయము మహర్షులకు, పితృదేవతలకు, బంధువులకు, మాకు, సకలప్రాణులకు కూడ అభీష్టము.

వీజిత్య నృపతీన్ సర్వాన్ కృత్వా చ జగతీం వ

 సంభృత్య సర్వసంభారానాహరస్వ మహాక్రతుమ్

రాజులనందరిని జయించి పృథివిని వశములోకి తెచ్చుకొని, సకల సామగ్రిని సంపాదించి గొప్ప యజ్ఞమైన రాజసూయమును చేయుము.

ఏతే తే భ్రాతరో రాజన్ లోకపాలాంశసంభవాః

 జితోఽస్మాత్మవతా తేహం దుర్జయో యోకకృతాత్మభిః

ఓ రాజా! ఈ నీ సోదరులు ఇంద్రాదిలోకపాలకుల అంశలచే జన్మించినవారు. జితేంద్రియులు కానివారిచే పొందబడని నేను జితేంద్రియుడవగు నీచే వశము చేసుకొనబడితిని.

న కశ్చిన్మత్సరం లోకే తేజసా యశసా శ్రియా

 విభూతిభిర్వాభీభవేద్దేవోఐపీ కిము పార్థివః

లోకములో ఎవడైనా దేవతయే అయినా నన్ను శరణు జొచ్చిన భక్తుని తేజస్సుచే గాని, కీర్తిచే గాని, సంపదచే గాని, ప్రభావములచే గాని తిరస్కరించలేడు. రాజు ఎవడైనా తిరస్కరించలేడని వేరుగా చెప్పవలెనా?

శ్రీశుక ఉవాచ

 నిశమ్య భగవద్గీతం ప్రీతః పుల్లముఖాంబుజః

తృన్ దిగ్విజయేఽయుంక్త విష్ణుతేజోపబృంహితాన్

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన మాటను విని ధర్మరాజు చాల సంతోషించెను. పద్మమువంటి ఆయన ముఖము వికసించెను. విష్ణువుయొక్క తేజస్సుచే వర్ధిల్లజేయబడిన తమ్ములనాయన దిక్కులను జయించుడని నియోగించెను.

సహదేవం దక్షిణస్యామాదిశత్సహ సృంజయైః

దిశి ప్రతీచ్యాం నకులముదీచ్యాం సవ్యసాచినమ్

 ప్రాచ్యాం వృకోదరం మత్యైః కేకయెస్సహ మద్రకైః

ధర్మరాజు దక్షిణదిక్కునందు సృంజయదేశవీరులతో బాటు సహదేవుని, పడమర దిక్కునందు మత్స్యవీరులతో బాటు నకులుని, ఉత్తరమునందు కేకయులతో బాటు అర్జునుని, తూర్పునందు మద్రవీరులతో బాటు భీమ సేనుని నియోగించెను.

తే విజిత్య నృపాన్ వీరా ఆజహ్రుర్థిగ్భ్య ఓజసా

అజాతశత్రవే భూరి ద్రవిణం నృప యక్ష్యతే

ఓ రాజా! ఆ వీరులు బలముతో రాజులను జయించి దిక్కులనుండి చాల ధనమును యాగము చేయబోయే ధర్మరాజు కొరకు తీసుకువచ్చిరి.

శ్రుత్వాఽజితం జరాసంధం నృపతేర్ద్యాయతో హరిః

ఆహోపాయం తమేవాద్య ఉద్దవో యమువాచ హ

జరాసంధుడింకనూ జయించబడ లేదని విని చింతిల్లుచున్న ధర్మరాజునకు సర్వజగత్కారణుడగు శ్రీకృష్ణభగవానుడు, ఇదివరలో ఉద్ధవుడు చెప్పిన ఉపాయమునే చెప్పెను.

భీమసేనోఽర్జునః కృష్ణో బ్రహ్మలింగధరాస్త్రయః

జగ్ముగ్గిరివ్రజం తాత బృహద్రథసుతో యతః

నాయనా! పరీక్షిత్తూ! భీమ సేనుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ముగ్గురు బ్రాహ్మణ వేషములను దాల్చి, బృహద్రథుని పుత్రుడగు జరాసంధుడు ఉండే గిరివ్రజమునకు వెళ్లిరి.

తే గత్వాఽఽతిథ్యవేలాయాం గృహేషు గృహమేధినమ్

 బ్రహ్మణ్యం సమయాచేరన్ రాజన్యా బ్రహ్మలింగినః

గృహస్థులు అతిథులకు భోజనము పెట్టే మధ్యాహ్నవేళయందు ఆ ముగ్గురు క్షత్రియులు బ్రాహ్మణవేషముతో బ్రాహ్మణభక్తుడగు జరాసంధుని ఇంటికి వెళ్లి, యోగ్యమగు రీతిలో ఇట్లు యాచించిరి.

రాజన్ విద్ధ్యతిథీన్ ప్రాప్తానర్థినో దూరమాగతాన్

తన్నః ప్రయచ్ఛ భద్రం తే యద్వయం కామయామ హే

రాజా! మేము దూరము పయనించి వచ్చిన అతిథులమని తెలియుము. మేము దేనిని కోరెదమో, దానిని మాకిమ్ము. నీకు మంగళమగు గాక!

కిం దుర్మర్షం తితిక్షూణాం కిమకార్యమసాధుభిః

కిం న దేయం వదాన్యానాం కః పరస్సమదర్శినామ్

 సహనశక్తి గలవారికి సహింప శక్యము కానిది ఏది?(ఏదీ లేదు). దుష్టులు చేయలేనిది ఏది?(ఏదీ లేదు). దాతలు ఈయలేనిది ఏది?(ఏదీ లేదు). సమదృష్టి గలవారికి పరుడెవరు? (ఎవరూ లేరు).

యోఽనిత్యేన శరీ రేణ సతాం గేయం యశో ధ్రువమ్

 నాచినోతి స్వయం కల్పస్స వాచ్యశోచ్య ఏవ సః

  ఎవడైతే తాను సమర్ధుడై యుండి అనిత్యమగు శరీరముతో సత్పురుషులచే గానము చేయబడే నిత్యమైన కీర్తిని సంపాదించడో, అట్టివాడు నిందించదగినవాడు. ఆతడు నిశ్చయముగా శోచనీయుడు.

హరిశ్చంద్రో రంతిదేవ ఉంఛవృత్తిశ్శబీర్బలిః

 వ్యాధః కపోతో బహవో హ్యధ్రువేణ ధ్రువం గతాః

ఏలయన, హరిశ్చంద్రుడు, రంతిదేవుడు, ముద్దలుడు, శిబి, బలి, కిరాతుడు, పావురము మొదలైన అనేకులు అనిత్యమగు జీవితమును త్యాగము చేసి నిత్యమగు మోక్షమును పొందిరి. (ముద్గలుడు కళ్లములో ఏరి సంపాదించిన గింజలతో వచ్చిన ఆహారమును దానము చేసెను. పావురము అతిథియగు కిరాతునకు తన మాంసమునీయగా, ఆ కిరాతుడు విరక్తుడై మహాప్రస్థానముచే జీవితమును త్యాగము చేసెను).

శ్రీశుక ఉవాచ

స్వ రైరాకృతిభిస్తాంస్తు ప్రకో ఫైర్ఘ్యాహతైరపి

 రాజన్యబంధూన్ విజ్ఞాయ దృష్ఠపూర్వానచింతయత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వారి కంఠస్వరములు, ఆకారములు, నారిత్రాడు తగిలి కాయలు కాచిన ముంజేతులు అనువాటిని బట్టి వారు క్షత్రియులనియు, యాచనను బట్టి నికృష్టులనియు, తాను ఇదివరలో . చూచినవారేననియు జరాసంధుడు గుర్తు పట్టి ఇట్లు తలపోసెను.

రాజన్యబంధవో హ్యేతే బ్రహ్మలింగాని బిభ్రతి

దదామి భిక్షితం తేభ్య ఆత్మానమపి దుస్త్యజమ్

వీరు నిశ్చయముగా నికృష్ణ క్షత్రియులే. కాని, బ్రాహ్మణవేషములను వేసుకున్నారు. దేహమును విడిచి పెట్టుట చాల కష్టము. అయినా, వీరు కోరితే దేహమును కూడ ఇచ్చివేసెదను.

బలేర్ను శ్రూయతే కీర్తిర్వితతా దిక్ష్వకల్మషా

ఐశ్వర్యాదంశితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా

 శ్రీయం జహీర్షతేంద్రస్య విష్ణవే ద్విజరూపిణే

 జానన్నపి మహీం ప్రాదాద్వర్యమాణోఽపి దైత్యరాట్

ఇంద్రుని కొరకై సంపదను లాగుకొనగోరి విష్ణువు బ్రహ్మచారి వేషముతో బలిచక్రవర్తిని రాజ్యాధికారమునుండి, సంపదలనుండి జారిపోవునట్లు చేసెను. ఆ బలియొక్క స్వచ్చమైన కీర్తి దిక్కులలో నిశ్చయముగా వ్యాపించి ఈనాటికి వినవచ్చుచునే యున్నది. ఆ చక్రవర్తి ఈతడు విష్ణువు అని తెలిసినా, వద్దని శుక్రుడు వారించుచున్నా, భూమిని బ్రాహ్మణరూపధారియగు విష్ణువునకు దానము చేసెను.

జీవతా బ్రాహ్మణార్థాయ కో న్వర్థః క్షత్రబంధునా

 దే హేన పతమానేన నేహతా విపులం యశః

 ఈ దేహము ప్రతిక్షణము నశిస్తూనే ఉంది. దీనితో జీవించినందులకు వేదవేత్తలకు సేవ చేసి గొప్ప కీర్తిని సంపాదించవలెను. అట్లు చేయగోరని నికృష్ట క్షత్రియుడు జీవించి యేమి లాభము?

ఇత్యుదారమతిః ప్రాహ కృష్ణార్జునవృకోదరాన్

హే విప్రా ప్రియతాం కామో దదామ్యాత్మశిరోపి వః

 ఈ విధమగు ఔదార్యముతో నిండిన బుద్ధి గల జరాసంధుడు శ్రీకృష్ణార్జునభీములతోనిట్లనెను -- ఓ వేద వేత్తలారా! కోరికను కోరుడు. నేను నా తలనైననూ మీకు ఇచ్చెదను.

 శ్రీభగవానువాచ

 యుద్దం నో దేహి రాజేంద్ర ద్వంద్వశో యది మన్య సే

యుద్ధార్థినో వయం ప్రాప్తి రాజన్యా నాన్నకాంక్షిణః

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ మహారాజా! నీకిష్ట మైనచో మాకు ద్వంద్వయుద్ధమునిమ్ము. మేము యుద్ధమును కోరే క్షత్రియులమే కాని, ఆహారమును కోరువారము కాము..

అసౌ వృకోదరః పార్థస్తస్య భ్రాతార్జునో హ్యయమ్

 అనయోర్మాతులేయం మాం కృష్ణం జానీ హి తే రిపుమ్

ఈతడు కుంతీపుత్రుడు భీముడు. ఈతడైతే భీముని తమ్ముడు అర్జునుడు. నేను వీరిద్దరి మేనమామ పుత్రుడను, నీ శత్రువును, కృష్ణుడనని తెలియుము.

ఏవమావేదితో రాజా జహాసోచ్చేస్స్మ మాగధః

ఆహ చామర్షితో మందా యుద్ధం తర్షి దదామి వః

ఈ విధముగా విన్నవించబడిన మగధరాజగు జరాసంధుడు బిగ్గరగా నవ్వెను. అప్పుడాతడు కోపముతో నిట్లనెను - మూర్ఖులారా! అటైనచో, మీకు యుద్ధమునిచ్చెదను.

న త్వయా భీరుణా యోత్స్యే యుధి విక్లవచేతసా

మథురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణం గతః  

నీవు భయస్వభావుడవు. యుద్దములో అస్థిరమైన మనస్సు గలవాడవు. నీవు నీ నగరమైన మథురను విడిచి సముద్రములో తల దాచుకొంటివి. నేను నీతో యుద్దము చేయను.

అయం తు వయస్యాతుల్యో తీసత్త్వా న మే సమః

 అర్జునో న భవేద్యోధా భీమస్తుల్యబలో మమ

ఈ అర్జునుడైతే వయస్సులో నాతో సమానుడు కాదు. ఈతడు అధికబలము లేనివాడు. కావున, ఈతడు నాకు యుద్ధములో సమమైన ఉజ్జీ కాలేడు. భీముడు నాతో సమానమైన బలము గలవాడు.

ఇత్యుక్త్వా భీమ సేనాయ ప్రాదాయ మహతీం గదామ్

ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాద్బహిః  

జరాసంధుడిట్లు పలికి పెద్ద గదనొకదానిని భీమునకిచ్చి, తాను మరో గదను తీసుకొని నగరము బయటకు వెళ్లాను.

తతస్సమే ఖలే వీరో సంయుక్తావితరేతరౌ

జఘ్నతుర్వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ

తరువాత యుద్దగర్వము గల ఆ వీరులిద్దరు చదునైన యుద్ధరంగము నందు కలుసుకొని ఒకరినొకరు వజ్రములవంటి గదలతో కొట్టుకొనిరి.

మండలాని విచిత్రాణి సవ్యం దక్షిణ మేవ చ

 చరతోశ్శుశుభే యుద్ధం నటయోరివ రంగిణోః

రంగస్థలమునందలి నటులు వలే కుడి యెడమలయందు పలురకముల గదాయుద్ధగతులను చేస్తున్న వారిద్దరి ద్వంద్వయుద్ధము శోభిల్లెను.

తతశ్చటచటాశబ్లో వజ్రని ష్పేషసన్నిభః

గదయోః క్షిప్తయో రాజన్ దంతయోరివ దంతినో:

ఓ పరీక్షిన్మహారాజా! అప్పుడు ఏనుగులు దంతములతో ఢీకొన్నట్లుగా వారు విసరుచున్న గదల చటచట ధ్వని పిడుగుపాటును పోలియుండెను.

తే వై గదే భుజజవేన నిపాత్యమానే

 అన్యోన్యతోఽoసకటిపాదకరోరుబత్రూన్

 చూర్ణీబభూవతురు పేత్య యథార్కశాఖే.  

సంయుద్యతోర్ద్విరదయోరివ దీప్తమన్వోః

రెండు యేనుగులు రెట్టించిన కోపముతో జిల్లేడు కొమ్మలతో పోట్లాడినప్పుడు అవి ముక్కముక్కలగును. అదే విధముగా, వారిద్దరు ఒకరిపై నొకరు గదలను గట్టిగా విసరుచుండగా, అవి వారి భుజస్కంధములు, పార్శ్వములు, కాళ్లు, చేతులు, తొడలు, కొంకులకు తగిలి నుగ్గు నుగ్గైనవి

ఇత్తం తయోః ప్రహృతయోర్గదయోర్నృవీరో

క్రుద్ధా స్వముష్టిభిరయస్సర్శైర పిష్టామ్

శబ్దస్తయోః ప్రహరతోరిభయోరివాసీత్

నిర్జాతవజ్రపరుషస్తలతాడనోతః

ఈ విధముగా గదలు రెండు విరిగిపోగా, మానవులలోనే వీరులగు ఆ జరాసంధభీములు కోపముతో ఇనుముయొక్క తాకిడి గల తమ పిడికిళ్లతో కొట్టుకొనిరి. వారిద్దరు ఏనుగులవలె కొట్టుకుంటూ ఒకరినొకరు చరుపు వేసి కొట్టుట వలన పుట్టిన శబ్దము వర్షము లేని మేఘగర్జన, పిడుగుపాటుల వలె కఠోరముగా నుండెను.

తయోరేవం ప్రహరతోసమశిక్షాబలౌజసోః నిర్విశేషమభూద్యుద్ధమణజవయోర్నృప

ఓ పరీక్షిన్మహారాజా! సమానమైన శిక్షణ, శరీరపాటవము, మనశ్శక్తి గల వారిద్దరు ఈ విధముగా కొట్టుకొనుచుండిరి. వారి వేగము క్షీణించలేదు. సాటి లేని ఆ యుద్ధములో గెలుపు-ఓటములు తేలకుండెను.

ఏవం తయోర్మహారా యుధ్యతోస్సప్తవింశతిః

 దినాని నిరగంస్తత్ర సుహృద్వన్నిశి తిష్ఠతోః

ఓ పరీక్షిన్మహారాజా! అక్కడ వారిద్దరు రాత్రి మిత్రుల వలె ఉంటూ ఈ తీరున యుద్ధము చేయుచుండగా, ఇరవై ఏడు దినములు గడచినవి.

ఏకదా మాతులేయం వై ప్రాహ రాజన్ వృకోదరః

 న శక్తాఽహం జరాసంధం నిర్ణేతుం యుధి మాధవ

ఓ పరీక్షిన్మహారాజా! ఒకనాడు భీముడు మేనమామ కొడుకైన శ్రీకృష్ణునితో నిట్లనెను -- ఓ భగవానుడా! యుద్దములో జరాసంధుని జయించే శక్తి నాకు లేదు.

శత్రర్జన్మమృతీ విద్వాన్ జీవితం చ జరాకృతమ్

 పార్థమాప్యాయయన్ స్వేన తేజసాఽచింతయద్ధరిః

శత్రువగు జరాసంధుని జన్మమరణములు, జర అనే రాక్షసి వానికి జీవితమునిచ్చిన విధి శ్రీకృష్ణ భగవానునకు తెలియును. ఆయన కుంతీపుత్రుడగు భీముని తన తేజస్సుతో వర్ధిల్లజేస్తూ ఆలోచించెను.

సంచింత్యారివధోపాయం భీమస్యామోఘదర్శనః

దర్శయామాస విటపం పాటన్నివ సంజ్ఞయా

శత్రువును వధించే ఉపాయమును గురించి లోతుగా ఆలోచించి, శ్రీకృష్ణుడు కొమ్మను చీలుస్తున్నాడా యన్నట్లు భీమునకు సైగ చేసెను.

తద్విజ్ఞాయ మహాసత్వో భీమః ప్రహరతాం వరః

 గృహీత్వా పాదయోశ్శత్రుం పాతయామాస భూతలే  

మహాబలశాలియగు భీముడు శత్రువిజేతలలో దిట్ట. ఆయన ఆ సైగను అర్థము చేసుకొని శత్రువును రెండు కాళ్లతో పట్టుకొని నేలపై పడవైచెను.

ఏకం పాదం పదాఽఽర్క్రమ్య దోర్బ్యామన్యం ప్రగృహ్య సః

 గుదతః పాటయామాస శాఖామివ మహాగజః

ఆ భీముడు జరాసంధుని ఒక కాలిని తన కాలితో తొక్కిపట్టి, రెండో కాలిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని, పెద్ద యేనుగు కొమ్మను చీల్చినట్లుగా, గుదమునుండి చీల్చివేసెను.

ఏకపాదోరువృషణకటీపృష్ణస్తనాంస కే

ఏకబాహ్వక్షిభ్రూకర్ణ శకలే దదృశుః ప్రజాః

ఒకే కాలు, తోడ, వృషణము, పార్శ్వము, స్తనము, భుజము, చేయి, కన్ను, కనుబొమ, చెవి కల రెండు ముక్కలను జనులు చూచిరి.

హాహాకారో మహానాసీన్నిహతే మగధేశ్వరే

 పూజయామాసతుర్భీమం పరిరభ్య జయాచ్యుతే

మగధప్రభుడగు జరాసంధుడు సంహరించబడగా జనులు పెద్ద హాహాకారమును చేసిరి. శ్రీకృష్ణార్జునులు భీముని కౌగిలించి ప్రశంసించిరి.

సహదేవం తత్తనయం భగవాన్ భూతభావనః

 అభ్యషించదమేయాత్మా మగధానాం పతిం ప్రభుః

మోచయామాస రాజన్యాన్ సంరుద్దా మాగధేన యే

శ్రీమద్భాగవతమహాపురాణే దశమస్కంధౌ ద్విసప్తతితమోఽధ్యాయః

సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణ భగవానుడు ప్రాణులను కాపాడును. ఆయన స్వరూపము ఇంద్రియగోచరము కాదు. ఆయన ఆ జరాసంధుని పుత్రుడగు సహదేవుని మగధదేశమునకు రాజుగా అభిషేకించెను. మగధ రాజగు జరాసంధునిచే బంధించబడిన రాజులను ఆయన విడిపించెను.

శ్రీమద్భాగవతము పదవ స్కంధములో జరాసంధుని ఉద్దారమును

వర్ణించే డెబ్బది రెండవ అధ్యాయము ముగిసినది (72).

* * * * *