భాగవత మహా పురాణము
22 - గోపికా వస్త్రాపహరణము
శ్రీశుక ఉవాచ ।
హేమంతే ప్రథమే మాసి నందవ్రజకుమారికాః ।
చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చనవ్రతమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- హేమంత-ఋతువు మార్గశీర్షమాసమునందు నందుని గోకులమునందలి కన్యలు కాత్యాయనీ దేవిని పూజించే వ్రతమును అనుష్ఠించిరి. వారు గోధుమ నూక, బెల్లములతో చేసిన హవిస్సును మాత్రమే భుజించుచుండిరి.
ఆప్లుత్యాంభసి కాలింద్యా జలాంతే చేదితేఽరుణే ।
కృత్వా ప్రతికృతిం దేవీమానర్చురృప సైకతీమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! తెల్లవారుతుండగా వారు యమునానదీజలములలో స్నానము చేసి నీటి ఒడ్డున ఇసుక మట్టితో కాత్యాయనీ దేవియొక్క విగ్రహమును చేసి పూజించిరి.
గంధైర్మా ల్యైసురభిభిర్బలిభిర్దూపదీపకైః ।
ఉచ్చావచైశ్చోపహారైః ప్రవాలఫలతండులైః ॥
వారు గంధములను, పరిమళభరితములైన పూలమాలలను, కొబ్బరి కాయ మొదలగువాటీని సమర్పించి ధూపదీపములతో పూజించిరి. చిగుళ్లతో, అక్షతలతో పూజించి గొప్పవి, మామూలువి అగు పదార్థములను, పళ్లను నైవేద్యము పెట్టిరి. .
కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి ।
నందగోపసుతం దేవి పతిం మే కురు తే నమః ।
ఇతి మంత్రం జపంత్యస్తాః పూజాం చక్రుః కుమారికాః ॥
ఓ దేవీ! నీవు కల్యాణములకు నిధానమవు, మహామాయవు, గొప్ప యోగినివి, సర్వేశ్వరివి. నాకు నందగోపుని పుత్రుడగు శ్రీకృష్ణుని భర్తునుగా చేయుము, నీకు నమస్కారము, అనే మంత్రమును జపిస్తూ ఆ కన్యలు పూజను చేసిరి.
ఏవం మాసం వ్రతం చేరుః కుమార్యః కృష్ణ చేతసః ।
భద్రకాళీం సమానర్చుర్భూయాన్నందసుతః పతిః ॥
శ్రీకృష్ణునియందు మనస్సు గల కన్యలీ విధముగా నెల రోజులు నిరంతరముగా వ్రతముననుష్ఠించిరి. తమకు నందుని పుత్రుడగు శ్రీకృష్ణుడు భర్త కావాలని వారు కల్యాణములనిచ్చే పార్వతీదేవిని యథావిధిగా ఆరాధించిరి.
ఉషస్యుత్థాయ గోత్రైస్వైరన్యోన్యాబద్ధబాహవః ।
కృష్ణ ముచ్చెర్జగుర్యాంత్యః కాలింద్యాం స్నాతుమన్వహమ్ ॥
వారు ప్రతి రోజు తెల్లవారు జామున నిద్ర లేచి తమ తమ పేర్లతో పిలుచుకుంటూ ఒకరి చేతులు మరియొకరు పట్టుకొని యమునానదికి స్నానము చేయుటకు వెళ్లాడివారు. అపుడు వారు శ్రీకృష్ణుని కీర్తిని బిగ్గరగా గానము చేసెడివారు.
నద్యాం కదాచిదగత్య తీరే నిక్షిప్య పూర్వవత్ ।
వాసాంసీ కృష్ణం గాయంత్యో విజహ్రుస్సలిలే ముదా ॥
ఒకనాడు వారు నది వద్దకు వచ్చి మామూలుగానే గట్టు పై బట్టలను పెట్టి, శ్రీకృష్ణుని కీర్తిని ఆనందముగా గానం చేస్తూ, నీటిలో విహరించిరి.
భగవాంస్తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరః ।
వయస్యైరావృతస్తత్ర గతస్తత్కర్మసిద్ధయే ॥
యోగులకు, యోగేశ్వరులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానునకు వారి వ్రతమును గురించి తెలిసెను. వారి వ్రతమును సిద్ధింప జేయుటకై ఆయన, మిత్రులు చుట్టువారి రాగా, అచటకు వెళ్లాను.
తాసాం వాసాంస్యుపాదాయ నీపమారుహ్య సత్వరః ।
హసద్భిః ప్రహసన్ బాలైః పరిహాసమువాచ హ॥
శ్రీకృష్ణుడు విసురుగా వారి వస్త్రములను తీసుకొని కడిమి చెట్టు పైకి ఎక్కెను. నవ్వుచున్న బాలకులతో బాటుగా ఆయన కూడ గట్టిగా నవ్వుతూ ఆ కన్యలను పరిహాసము చేస్తూ ఇట్లు పలికెను.
అత్రాగత్యాబలాః కామం స్వం స్వం వాసః ప్రగృహ్యతామ్ ।
సత్యం బ్రవాణి నో నర్మ యద్యూయం వ్రతకర్శితాః ॥
ఓ అమ్మాయిలూ! మీరీ చెట్టు క్రిందకు వచ్చి మీ మీ వస్త్రములను యథేచ్చగా తీసుకొనుడు. నేను సత్యమును చెప్పుచున్నాను. వేళా కోళము కాదు. ఎందుకంటే, మీరు వ్రతము కారణముగా కృశించినారు.
న మయోదితపూర్వం వా అనృతం తదిమే విదుః ।
ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవోత సుమధ్యమాః ॥
ఓ సుందరులారా! నేనిదివరలో అసత్యమును చెప్పలేదు. ఇది .. నిశ్చయము. ఈ విషయమీ గోపబాలకులకు తెలియును. మీరు ఒక్కొక్క రుగా గాని, లేదా అందరు కలిపి గాని (వస్త్రములను) తీసుకొనుడు,
తస్య తత్ క్ష్వేలితం దృష్ట్వా గోప్యః ప్రేమపరిప్లుతాః ।
వ్రీడితాః ప్రేక్ష్య చాన్యోన్యం జాతరోసా న నిర్యయుః ॥
ప్రేమచే ముంచెత్తబడిన మనస్సులు గల ఆ గోపికలు ఆ శ్రీకృష్ణుని ఆ పరిహాసమును చూచి సిగ్గు పడిరి. వారు ఒకరినొకరు చూచుకుంటూ నవ్వుకొనిరే గాని, నీటినుండి బయటకు రాలేదు.
ఏవం బ్రువతి గోవిందే నర్మణాఽఽక్షిప్తచేతసః ।
ఆకంఠమగ్నాశ్శీతోదే వేపమానాస్తమబ్రువన్ ॥
గోపాలకుడగు శ్రీకృష్ణుడిట్లు పలుకగా, ఆ పరిహాసవాక్యములచే గోపికల చిత్తములాకర్షించబడెను. వారు చల్లని నీటిలో కంఠము వరకు మునిగి వణికిపోతూ ఆయనతోనిట్లనిరి.
మ్యానయం భోః కృథాస్త్వాం తు నందగోపస్తుతం ప్రియమ్ ।
జానీమోనంగ ప్రజశ్లాఘ్యం దేహి వాసాంసి వేపితాః ॥
ఓయీ! అన్యాయ్యమును చేయవద్దు. నీవైతే నందగోపుని ప్రియపుత్రుడవగు శ్రీకృష్ణుడవనియు, గోకులమునకు కొనియాడ దగినవాడవనియు మేము యెరుగుదుము. ఓయీ! వస్త్రములనిమ్ము. చలి మమ్ము వణికించుచున్నది.
శ్యామసుందర తే దాస్యః కరవామ తవోదితమ్ ।
దేహి వాసాంసీ ధర్మజ్ఞ నో చేద్రాజ్ఞే బ్రువామ హే ॥
ఓ నల్లనివాడా! నీవు ధర్మములు తెలిసిన అందగాడవు. నీకు మేము దాసీలము. నీవు చెప్పినట్లు మేము చేసెదము. వస్త్రములనిమ్ము. లేనిచో, నందమహారాజునకు చెప్పేదము.
శ్రీభగవానువాచ ।
భవత్యో యది మే దాస్యో మయోక్తం వా కరిష్యథ ।
అత్రాగత్య స్వవాసాంసి ప్రతీచ్ఛంతు శుచిస్మితాః ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ సుందరులారా! మీ చిరునవ్వు స్వచ్చముగా నున్నది. పూజించదగిన మీరు నాకు దాసీలైనచో, నా మాటను చేయబోయే పక్షములో, ఇచటకు వచ్చి మీ వస్త్రములను స్వీకరించెదరు గాక!
తతో జలాశయాత్సర్వా దారికాశ్శీతవేపితాః ।
పాణిభ్యాం యోనిచ్ఛాద్య ప్రోతేరుశ్శీతకర్శితాః ॥
ఆ కన్యలు బయట చలికి వణుకుతూ లోపల చలిచే కృశించి యుండిరి. వారందరు రెండు చేతులతో జననేంద్రియమును కప్పుకొని నదినుండి బయటకు వచ్చిరి.
భగవానాహతా వీక్ష్య శుద్ధభావప్రసాదితః ।
స్కంధే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితమ్ ॥
వారి పవిత్రమగు అంతఃకరణములచే శ్రీకృష్ణ భగవానుడు ప్రసన్ను డై ప్రీతిని పొందెను. చలిచే పీడించబడుతూ దగ్గరకు వచ్చిన వారిని చూచి ఆయన వస్త్రములను భుజము పై పెట్టుకొని చిరునవ్వుతో నిట్లనెను.
యూయం వివస్త్రా యదపో ధృతవ్రతా
వ్యగాహతైతత్తదు దేవ హేలనమ్ ।
బద్ధ్వాకంజలిం మూర్ధ్యపనుత్తయేకాంహసః
కృత్వా నమోధో వసనం ప్రగృహ్యతామ్ ॥
మీరు ప్రతనియమములో ఉన్నారు. అయినా వస్త్రములు లేకుండా నీటిలో స్నానమును చేసితిరి. ఆ ఈ చర్య ఖచ్చితముగా జలాధిష్ఠానదేవత యెడల అపరాధము. ఆ దోషమును పోగొట్టుటకై మీరు తలపై దోసిలి ఘటించి వంగి నమస్కరించి, వస్త్రమును తీసుకొనుడు.
ఇత్యచ్యుతేనాభిహితం ప్రజాబలా
మత్వా వివస్త్రాప్లవనం ప్రతచ్యుతిమ్ ।
తత్పూర్తికామాస్తదశేషకర్మణాం
సాక్షాత్కృతం నేమురవద్యమృగ్యతః ॥
శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు చెప్పగా ఆ గోపికలు నగ్నముగా స్నానము చేయుట వ్రతమునకు భంగమని తెలుసుకొనిరి. ఆ వ్రతము పూర్తి కావాలనే కోరిక వారికి కలదు. వారు ఆ వ్రతమునకు మరియు సకలకర్మలకు ఫలరూపుడైన కర్మసాక్షి శ్రీకృష్ణునికే నమస్కరించిరి. ఎందుకంటే, అట్టి నమస్కారము సకలదోషములను తుడిచి పెట్టును.
తాస్తథాఽవనతా దృష్ట్వా భగవాన్ దేవకీసుతః ।
వాసాంసి తాభ్యః ప్రాయచ్ఛత్కరుణ స్తేన తోషితః ॥
ఆ విధముగా వారు చేసిన నమస్కారమును చూచి దేవకీపుత్రుడగు శ్రీకృష్ణుడు సంతోషించెను. దయాళువగు ఆయన వారికి వస్త్రములను యిచ్చెను.
దృఢం ప్రలబ్దాస్త్రపయా చ హాపితాః
ప్రస్తోభితాః క్రీడనవచ్చ కారితాః ।
వస్త్రాణి చైవాపృహృతాన్యథాప్యముం
తా నాభ్యసూయనియసంగనిర్వృతాః ॥
శ్రీకృష్ణుడు ఆ గోపికలను గట్టిగా తప్పు పట్టి కపటము చేసి వారు సిగ్గు విడుచునట్లు చేసెను. వారిని పరిహసించి ఆటబొమ్మలవలె చేసి వస్త్రములను కూడ తీసుకుపోయెను. అయిననూ, వారు తమ ప్రియుని కలయికచే ఆనందించిరే గాని, ఈ శ్రీకృష్ణునిపై తప్పు మోపలేదు.
పరిధాయ స్వవాసాంసి ప్రేష్ఠసంగమసజ్జితాః ।
గృహీతచిత్తా నో చేలుస్తస్మింల్లజ్జాయితేక్షణాః ॥
శ్రీకృష్ణునిచే దోచబడిన చిత్తములు గల ఆ గోపికలు తమ ప్రియతముని కలుసుకొనుటచే పరవశులై, వస్త్రములను ధరించిన పిదప కూడ (అక్కడనుండి) వెళ్లకుండిరి. వారు సిగ్గుతో విలాసగా ఆయననే చూచుచుండిరి.
తాసాం విజ్ఞాయ భగవాన్ స్వపాదస్పర్శకామ్యయా ।
ధృతవ్రతానాం సంకల్పమాహ దామోదరాబలాః ॥
వ్రతమును పట్టిన ఆ గోపీకల సంకల్పములో తన పాదములను స్పృశించాలనే కోరిక గలదని భగవాన్ దామోదరుడు (నడుమునకు త్రాడు కట్టబడినవాడు) గమనించాను. ఆయన ఆ యువతులతోనిట్లనెను.
సంకల్పో విదితస్సాధ్వ్యో భవతీనాం మదర్చనమ్ ।
మయాఽనుమోదితస్సోమో సత్యో భవితుమర్హతి ॥
ఓ పుణ్యవతులారా! పూజనీయులగు మీరు నన్ను పూజించాలనే సంకల్పముతోనున్నారని నాకు తెలియును. మీ సంకల్పము నాకు ఆమోదమే. మీ ఈ సంకల్పము సత్యము అగుటకు తగియున్నది.
న మయ్యావేశితధియాం కామః కామాయ కల్పతే ।
భర్జితా క్వథితా ధానా ప్రాయో బీజాయ నేష్యతే ॥
నాయందు లగ్న మైన బుద్ధి గల సాధకుల కామన సంసారభోగముల వైపు తీసుకువెళ్లదు. కాల్చిన మరియు ఉడికించిన గింజ మొల కెత్తుటకు సమర్థము కాదు.
యాతాబలా ప్రజం సిద్దా మయేమా రంధ్యథ క్షపాః ।
యదుద్దిశ్య వ్రతమిదం చేరురార్యాఽర్చనం సతీః ॥
ఓ యువతులారా! మీరు గోకులమునకు వెళ్లుడు. పుణ్యవతులగు మీరు, సిద్ధిని పొందితిరి. మీరు ఈ (రాబోయే) రాత్రులు నాతో రమించగలరు. ఆ సంకల్పముతోనే మీరు పార్వతీదేవిని పూజించే వ్రతమును చేసితిరి గదా!
శ్రీశుక ఉవాచ ।
ఇత్యాదిష్టా భగవతా లబ్ధకామాః కుమారికాః ।
ధ్యాయంతస్తత్పదాంభోజం కృచ్ఛాన్నిర్వివిశుర్వ్రజమ్ ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఆ కన్యల మనోరథము సిద్ధించేను. శ్రీకృష్ణ భగవానుడిట్లు ఆదేశించగా, వారు కష్టము మీద (ఆయనను విడిచి) పద్మములవంటి ఆయన పాదములనే ధ్యానిస్తూ గోకులమును చేరిరి.
అథ గోపైః పరివృతో భగవాన్ దేవకీసుతః ।
బృందావనాధ్గతో దూరం చారయన్ గాస్సహాగ్రజః ॥
తరువాత దేవకి పుత్రుడగు శ్రీకృష్ణ భగవానుడు అన్నగారితో కలిసి గోవులను మేపుతూ బృందావనమునుండి దూరముగా వెళ్లాను. గోప బాలకులు ఆయనను చుట్టువారి యుండిరి.
నిదాఘార్కాత పే తిస్మే ఛాయాభిస్స్వాభిరాత్మనః ।
ఆతపత్రాయిల్తాన్ వీక్ష్య ద్రుమానాహ ప్రజోకసః ॥
సూర్యుని వేడి తీక్ష్ణముగా నుండి చెమట పట్టుచుండెను. చెట్లు తమ నీడలతో శ్రీకృష్ణునకు గొడుగు వలె పని చేయుచుండెను. వాటిని చూచి ఆయన గోకులవాసులగు గోపాలకులతో నిట్లనెను.
హే స్తోకకృష్ణ హే అంశో శ్రీరామన్ సుబలార్జున ।
విశాలర్షభ తేజస్వీన్ దేవప్రస్థ వరూథప ॥
ఓ స్తోకకృష్ణా!, ఓ అంశూ!, ఓ శ్రీదామా!, ఓ సుబలా!, ఓ అర్జునా!, ఓ విశాలా!, ఓ ఋషభా!, ఓ తేజస్వీ!, ఓ దేవప్రస్థా! ఓ వరూథపా!
పశ్య తైతాన్మహాభాగాన్ పరార్థైకాంతజీవితాన్ ।
వాతవర్షాతపహిమాన్ సహంతో వారయంతి నః ॥
గొప్ప భాగ్యము గల ఈ చెట్లను చూడుడు. ఇతరప్రాణుల ప్రయోజనమే వీటి జీవితమునకు ఏకైకలక్ష్యము. ఇవి గాలి, వాన, ఎండ, మంచులను తాము సహిస్తూ మనలను వాటినుండి తప్పించుచున్నవి.
అహో ఏషాం వరం జన్మ సర్వప్రాణ్యుపజీవనమ్ ।
సుజన స్యేవ యేషాం వై విముఖా యాంతి నార్థినః ॥
ఆహా! సకలప్రాణులకు బ్రదుకు దెరువునిచ్చే వీటి జన్మ గొప్పది. ఇవి సత్పురుషుని వంటివి. పళ్లు మొదలగువాటిని కోరి వీటి వద్దకు వచ్చిన జనులు ముఖము త్రిప్పుకొని వెళ్లే పని ఉండదు. (కోరిక తప్పక తీరును).
పత్రపుష్పఫలచ్చాయామూలవల్కలదారుభిః ।
గంధనిర్యాసభస్మా స్థితోక్మైః కామాన్ వితన్వతే ॥
చెట్లు మానవులకు ఆకులు, పువ్వులు, పళ్లు, వేళ్లు, బెరడు, కట్టెలు, జిగురు, భస్మ, బొగ్గులు, చిగుళ్లు అనే ఉపయోగకరమైన వస్తువులను ఇచ్చును. మరియు, అవి మానవులకు నీడను, సుగంధమును ఇచ్చి వారి అవసరములను తీర్చును.
ఏతావజ్జన్మసాఫల్యం దేహినామిహ దేహిషు ।
ప్రాణైరర్థైర్ధియా వాచా శ్రేయ ఏవాచరేత్సదా ॥
ప్రాణములను, సంపదలను, బుద్దిని, వాక్కును వినియోగించి ఎల్లవేళలా ప్రాణులకు హితమును మాత్రమే చేయవలెను. ఇదియే దేహధారులకు ఈ లోకములో జన్మించినందులకు సఫలత.
ఇతి ప్రవాలస్తబకఫలపుష్పదలోత్కరైః ।
తరూణాం నమశాఖానాం మధ్యేన యమునాం గతః ॥
ఇట్లు పలికి శ్రీకృష్ణుడు చెట్ల మధ్యగుండా యమునానదికి వెళ్లాను. చిగుళ్లు, గుత్తులు, పళ్లు, పువ్వులు, ఆకుల సముదాయములతో ఆ చెట్ల - కొమ్మలు వంగి యుండెను.
తత్ర గాః పాదయిత్వాపస్సుమృష్టాశ్శీతలాశ్శివాః।
తతో నృప స్వయం గోపాః కామం స్వాదు పపుర్జలమ్ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ నదియందు వారు గోవులచే నీళ్లను త్రాగించిరి. ఆ నీళ్లు స్వచ్చముగా, చల్లగా, ఆరోగ్యకరముగా నుండెను. తరువాత ఆ గోపాలకులు తాము కూడ తియ్యని ఆ నీటిని కడుపు నిండా త్రాగిరి.
తస్యా ఉపవనే కామం చారయంతః పశూన్నృప ।
కృష్ణ రామావుపాగమ్య క్షుధార్తా ఇదమబ్రువన్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
పూర్వార్ధే ద్వావింశోఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! గోపాలకులు ఆ యమునానదిని ఆనుకుని ఉన్న ఉద్యానమునందు పశువులను యథేచ్చగా మేపుచుండిరి. వారికి ఆకలిచే. పీడ కలిగి బలరామ కృష్ణుల వద్దకు వచ్చి ఇట్లు పలికిరి.
శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్థములో గోపికా వస్త్రాపహరణమును వర్ణించే ఇరువది రెండవ అధ్యాయము ముగిసినది (22).
Summary of chapter 22 of the Bhāgavata Mahā Purana is as follows:
During the month of Mārgaśīrsha (December), the young unmarried gopīs of Vṛndāvana observed the sacred Kātyāyanī-vrata vow. Rising at dawn, they bathed in the cold waters of the Yamunā, worshipped a Deity of Goddess Kātyāyanī made of sand, and prayed with unalloyed hearts to obtain Śrī Kṛshṇa as their husband. Knowing their pure desires, Śrī Kṛshṇa arrived at the riverbank while they were bathing, took their garments left on the shore, and climbed a Kadamba tree. He requested the maidens to step out of the water with folded hands to receive their clothes, teaching them to abandon subtle shyness and body-consciousness before the Supreme Soul. Pleased with their total surrender, Kṛshṇa promised to fulfill their pure desire during the upcoming autumn nights.