34 - శ్రీకృష్ణుడు సుదర్శనుని శంఖచూడుని ఊద్ధరించుట  

శ్రీ శుక ఉవాచ ।

ఏకదా దేవయాత్రాయాం గోపాలా జాతకౌతుకాః

అనోభిరనడుద్యుక్తైః ప్రయయుస్తేంఽబికావనమ్

శ్రీశుక మహర్షి ఇట్లు చెప్పెను --- ఒకప్పుడు (శివరాత్రి) మహాదేవుని పూజకై యాత్రను చేయాలనే ఉత్సాహము ఆ గోపాలకులకు కలిగెను. వారు బళ్లకు ఎద్దులను పూన్చి అంబికావసము అనే క్షేత్రమునకు వెళ్లిరి.

తత్ర స్నాత్వా సరస్వత్యాం దేవం పశుపతిం విభుమ్

ఆనర్చురర్హ ణైర్భ క్త్యా దేవీం చ నృపతేంఽబికామ్

ఓ పరీక్షిన్మహారాజా! అచట వారు సరస్వతీనదిలో స్నానము చేసిరి. వారు సర్వవ్యాపకుడు, జీవులకు అధీశ్వరుడు అగు మహాదేవునకు, జగన్మాతయగు పార్వతీదేవికి భక్తితో ఉపహారములనర్పించి పూజించిరి.

గావో హిరణ్యం వాసాంసి మధు మధ్వన్నమాదృతాః

బ్రాహ్మణేభ్యో దదుస్సర్వే దేవో నః ప్రీయతామితి

వారందరికి మహాదేవుడు తమ యెడల ప్రీతిని జెందుటయే లక్ష్యము దాని కొరకై వారందరు గోవులను, బంగారమును, వస్త్రములను, తేనెను, మధురమైన ఆహారమును శ్రద్ధతో బ్రాహ్మణులకు దానము చేసిరి.

ఊషుస్సరస్వతీతీరే జలం ప్రాశ్య ధృతవ్రతాః

రజనీం తాం మహాభాగా నందసునందకాదయః

నందుడు, సునందుడు (నందుని తమ్ముడు) మొదలగు గోపాలకులు గొప్ప పుణ్యాత్ములు. వారు శివరాత్రి వ్రతదీక్షను పూని నీటిని మాత్రమే ఆహారముగా తీసుకొని, సరస్వతి నది ఒడ్డున ఆ రాత్రి నివసించిరి.

కశ్చిన్మహానహిస్తస్మిన్ విపినేఽతిబుభుక్షితః

యదృచ్ఛయాఽఽగతో నందం శయానమురగోఽగ్రసీత్

ఆ అంబికావనములో ఒక పెద్ద కొండ చిలువ ఉండెను. అది ఆకలి గొని అనుకోకుండా (ఈశ్వరేచ్ఛచే) పాకుతూ (కనబడకుండా) వచ్చి (శివరాత్రి మరునాడు) నిద్రిస్తున్న నందుని పట్టుకొనెను.

స చుక్రోశాహినా గ్రస్తః కృష్ణ కృష్ణ మహానయమ్

సర్పో మాం గ్రసతే తాత ప్రపన్నం పరిమోచయ

కొండ చిలువ పట్టుకొనగా ఆ నందుడిట్లు ఆక్రోశించెను --  ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! ఈ పెద్ద పాము నన్ను మ్రింగుచున్నది. అబ్బాయీ! ఆపదలో పడి శరణు వేడిన నన్ను విడిపించుము.

తస్య చాక్రందితం శ్రుత్వా గోపాలాస్సహససోత్థితాః

గ్రస్తం చ దృష్ట్వా విభ్రాంతాస్సర్పం వివ్యధురుల్ము కైః

ఆయన ఆక్రందనమును విన్న గోపాలకులు కూడ వెంటనే నిద్ర లేచి పాము చే పట్టుకొనబడిన నందుని చూచి కంగారు పడిరి. వారా పామును కాగడా కర్రలతో కొట్టిరి.

అలాతైర్ద హ్యమానోఽపి నాముంచత్తమురంగమః

తమస్పృశత్పదాఽభ్యేత్య భగవాన్ సాత్వతాం పతిః

కాగడాలతో ఒళ్లు కొలుచున్నా పాము ఆ నందుని విడిచి పెట్టలేదు. అప్పుడు యాదవులకు (సత్త్వగుణప్రధానులగు భక్తులకు, పాలకుడగు శ్రీకృష్ణ భగవానుడు ఎదురుగా వచ్చి దానిని కాలితో తాకెను.

స వై భగవతశ్శ్రీమత్పాదస్పర్శహతాశుభః

భేజే సర్పవపుర్షిత్వా రూపం విద్యాధరార్చితమ్

శ్రీకృష్ణ భగవానుని శోభాయుక్తమగు పాదము తాకుటచే ఆ సర్పము యొక్క పాపములు పూర్ణముగా నశించెను. అది పాము దేహమును విడిచి విద్యాధరులయందు పూజించబడే అందమగు రూపమును పొందెను.

తమపృచ్ఛదృషీ కేశః ప్రణతం సముపస్థితమ్

దీప్యమానేన వపుషా పురుషం హేమమాలినమ్

బంగరు మాల గల ఆ విద్యాధరుడు వెలిగిపోవుచున్న దేహముతో నమస్కరించి దగ్గరకు వచ్చి నిలబెడను. ఇంద్రియాంతర్యామియగు శ్రీకృష్ణ భగవానుడు ఆతనిని ఇట్లు ప్రశ్నించెను.

 కో భవాన్ పరయా లక్ష్మ్యా రోచతేఽద్భుతదర్శనః

కథం జుగుప్సితామేతాం గతిం వా ప్రాపీతోఽవశః

నిన్ను చూస్తే ఆశ్చర్యము కలుగుచున్నది. నీవు సర్వోత్కృష్టమగు శోభతో ప్రకాశించుచున్నావు. నీవెవరు? ఈ పాము జన్మ జుగుప్సను కలిగించేది. పర (కర్మ) వశుడవై నీవీ జన్మను పొందుటకు కారణమేమి ?

సర్ప ఉవాచ

అహం విద్యాధరః కశ్చిత్సుదర్సన ఇతి శ్రుతః

శ్రియా స్వరూపసంపత్త్యా విమానేనాచరం దిశః

సర్పమై ఉండిన విద్యాధరుడిట్లు పలికెను --  నేను ఒక విద్యాధరుడను. సుదర్శనుడని నాకు ప్రసిద్ధి. సంపద, సౌందర్యసమృద్ధి గలవాడనై నేను విమానము పై దిక్కులలో సంచరించితిని.

 ఋషీన్ విరూపానంగిరసః ప్రాహసం రూపదర్పితః

తైరిమాం ప్రాప్తితో యోనిం ప్రలబ్ధైస్స్వేన పోప్మనా

అందముతో గర్వించిన నేను అందము లేని అంగిరసగోత్రీయులగు మహర్షులను పరిహాసము చేసితిని. నాచే పరిహసించబడిన ఆ ఋషులు నా పాపమునకు ఫలముగా ఈ జన్మను కలిగించిరి.

శాపో మేఽనుగ్రహాయైవ కృత స్తైః కరుణాత్మభిః

యదహం లోకగురుణా పదా స్పృష్టో హతాశుభః

దయామయులగు ఆ మహర్షులు ఆ మహర్షులు నన్ను అనుగ్రహించుటకే నాకు శాపమునిచ్చిరి. ఎందుకంటే, జగత్తునకు తండ్రివగు నీవు నన్ను కాలితో తాకగా నా పాపములు నశించినవి.

తం త్వాఽహం భవభీతానాం ప్రపన్నానాం భయాపహమ్

ఆపృచ్ఛే శాపనిర్ముక్తః పాదస్పర్శాదమీవహన్

పాపములను, దుఃఖములను పారద్రోలే ఓ శ్రీకృష్ణా! సంసారమునకు భయపడి శరణు జొచ్చినవారి భయమును నీవు పారద్రోలెదను. నీ పాదము తాకుటచే నాకు శాపమునుండి విముక్తి కలిగినది. నేను వెళ్లుటకు అనుమతిని అడుగుచున్నాను.

ప్రపన్నోఽస్మి మహాయోగిన్ మహాపురుష సత్పతే

అనుజానీహి మాం దేవ సర్వలోకేశ్వరేశ్వర

ఓ దేవా! నీవు యోగీశ్వరుడవు, పురుషోత్తముడవు. సజ్జనులను పాలించే నీవే సకలలోకములకు, లోకపాలకులకు ప్రభుడవు. నేను నిన్ను శరణు పొందుచున్నాను. నాకు అనుమతి నిమ్ము.

బ్రహ్మదండాద్విముక్తోఽహం సద్యస్తేఽచ్యుత దర్శనాత్

యన్నామ గృహ్ణన్నఖిలాన్ శ్రోతౄనాత్మానమేవ చ

సద్యః పునాతి కిం భూయస్తస్య స్పృష్టః పదా హి తే

ఓ అచ్యుతా! నీ దర్శనము వలన నేను వెంటనే మహర్షుల శాపమునుండి విముక్తుడనైతిని. నామమునుచ్చరించువాడు శ్రోతలనందరినీ తనను కూడ వెంటనే పావనము చేయును. అట్టి నీ కాలితో నేను స్పృశించబడితిని. ఇంతకంటె గొప్ప భాగ్యమేమి గలదు? (లేదు).

ఇత్యనుజ్ఞాప్య దాశార్హం పరిక్రమ్యాభివంద్య చ

సుదర్శనో దివం యాతః కృచ్ఛ్రాన్నందశ్చ మోచితః

సుదర్శనుడు విధముగా దశార్హవంశీయుడగు శ్రీకృష్ణుని అనుమతిని పొంది ఆయనకు ప్రదక్షిణమును, నమస్కారమును కూడ చేసి స్వర్గమునకు వెళ్లెను. నందుడు కూడ ఆపదనుండి విముక్తుడాయెను.

నిశామ్య కృష్ణస్య తదాత్మవైభవం వ్రజౌకసో విస్మితచేతనస్తతః

సమాప్య తస్మిన్నియమం పునర్వ్రజం  నృపాయయుస్తత్కథయంత ఆదృతాః

ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుని ఆ అసాధారమగు మహిమను చూచి గోకులవాసులు మనస్సులో ఆశ్చర్యమును పొందిరి. వారు ఆ అంబికా వనమునందు శివరాత్రి వ్రతమును ముగించుకొని అచటనుండి మరల గోకులమునకు వచ్చిరి. వారు ఆదరముగా ఆ వృత్తాంతమునే చెప్పుకొనిరి.

కదాచిదథ గోవిందో రామశ్చాద్భుత విక్రమః

విజహ్రతుర్వనే రాత్ర్యాం మధ్యగౌ వ్రజయోషితామ్

ఒకనాడు గోవిందుడు మరియు బలరాముడు కూడ బృందావనములో రాత్రియందు గోపికల మధ్యలో ఉండి విహరించిరి. శ్రీకృష్ణుని (రాబోవు) పరాక్రమము అచ్చెరువును గొలుపును.

ఉపగీయమానౌ లలితం స్త్రీజనైర్బద్ధసౌహృదైః

స్వలంకృతానులిప్తాంగౌ స్రగ్విణౌ విరజోంఽబరౌ

దృఢమైన ప్రేమ గల గోపికలు బలరామకృష్ణుల కీర్తిని మనోహరముగా గానము చేయుచుండిరి. వారిద్దరు స్వచ్ఛమగు వస్త్రములను దాల్చి, బాగా అలంకరించుకొని, చందనాదులనలదుకొని వనమాలలను ధరించిరి.

నిశాముఖం మానయంతావుదితోడుపతారకమ్

మల్లికాగంధమత్తాలి జుష్టం కుముదవాయునా

రాత్రి ఆరంభమయ్యెను. నక్షత్రరాజగు చంద్రుడు నక్షత్రములతో కూడి ఉదయించెను. మల్లెల పరిమళముచే తుమ్మెదలు మత్తెక్కి యుండెను. కలువల మీదనుండి గాలి వీచుచుండెను. ఆ రాత్రి యొక్క శోభను బలరామకృష్ణులిద్దరు కొనియాడిరి.

జగతుస్సర్వభూతానాం మనశ్శ్రవణమంగలమ్

తౌ కల్పయంతౌ యుగపత్స్వరమండలమూర్చ్ఛితమ్

వారిద్దరు స్వరసమూహము యొక్క సంగతులను (ఆరోహ - అవరోహణములను) ఒకేసారి కల్పిస్తూ సకల ప్రాణులకు మనస్సునకు, చెవులకు సుఖము కలిగే విధముగా పాడిరి.

గోప్యస్తద్గీతమాకర్ణ్య మూర్చ్ఛితా నావిదన్నృప

సంసద్దుకూలమాత్మానం స్రస్త కేశస్రజం తతః

ఓ మహారాజా! వారిద్దరి పాటను విన్న గోపికలకు మోహము కలిగెను. దానిచే వారికి తమ దేహము తమకే తెలియలేదు. జారిపోవుచున్న పై కొంగును, జారిన జుట్టుముడిలోని మాలను వారు గుర్తించలేదు.

ఏవం విక్రీడతో స్స్వైరం గాయతోస్సంప్రమత్తవత్

శంఖచూడ ఇతి ఖ్యాతో ధనదానుచరోఽభ్యగాత్

వారిద్దరు ఈ విధముగా పిచ్చివారు వలె యథేచ్ఛగా విహరిస్తూ పొడుచుండిరి. అప్పుడు శంఖచూడుడని ప్రసిద్ధి గాంచిన కుబేరుని అనుచరుడు అచటకు వెళ్లెను.

తయోర్నిరీక్షతో రాజంస్తన్నాథం ప్రమదాజనమ్

క్రోశంతం కాలయామాస దిశ్యుదీచ్యామశంకితః

ఓ పరీక్షిన్మహారాజా! వారిద్దరు చూచుచుండగనే భయము లేని ఆతడు ఆక్రోశిస్తున్న గోపికల సముదాయమును ఉత్తరదిక్కు వైపు తరిమెను. ఆ గోపికలకు బలరామకృష్ణులు మాత్రమే రక్షకులు.

క్రోశంతం కృష్ణ రామేతి విలోక్య స్వపరిగ్రహమ్

యథా గా దస్యునా గ్రస్తా భ్రాతరావన్వధావతామ్

తమ వారైన గోపికలు ఓ శ్రీకృష్ణా! ఓ బలరామా! అని ఆక్రోశించిరి. చోరుడు (పెద్దపులి) గోవులను తీసుకొని పోవుచుండగా వెంట పరుగెత్తే విధముగా, వారిని చూచి అన్నదమ్ములిద్దరు వెంబడి పరుగెత్తిరి.

మా భైష్టే త్యభయారావౌ శాలహస్తౌ తరస్వినౌ

ఆ సేదతుస్తం తరసా త్వరితం గుహ్యకాధమమ్

రామకృష్ణులిద్దరు భయపడకుడని శబ్దము చేస్తూ వేగముగా పరుగెత్తిరి. వారు చేతులలో మద్ది చెట్లు పట్టుకొనిరి. వారు వేగముగా పరుగెత్తి శీఘ్రముగా యక్షులలో అధముడగు ఆ శంఖచూడుని సమీపించిరి.

 స వీక్ష్య తావనుప్రాప్తౌ కాలమృత్యూ ఇవోద్విజన్

విసృజ్య స్త్రీజనం మూఢః ప్రాద్రవజ్జీవితేచ్ఛయా

కాలుడు, యముడు వలె వెంటబడిన వారిద్దరిని దగ్గరలో చూచి మూర్ఖుడైన ఆ శంఖచూడుడు భయపడెను. వాడు గోపికల సమూహమును విడిచి పెట్టి బ్రదుకుమీది తీపితో పరుగెత్తెను.

తమన్వధావద్గోవిందో యత్ర యత్ర స ధావతి

జిహీర్షుస్తచ్ఛిరోరత్నం తస్థౌ రక్షన్ స్త్రియో బలః

ఆ శంఖచూడుడు ఎక్కడెక్కడికి పరుగెడితే శ్రీకృష్ణుడు అక్కడక్కడికి వాని వెనుకనే పరుగెత్తెను. వాని తల మీది రత్నమును లాగవలెనని ఆయన కోరిక. బలరాముడు స్త్రీలకు రక్షకుడుగా ఆగిపోయెను.

అవిదూర ఇవాభ్యేత్య శిరస్తస్య దురాత్మనః

జహార ముష్టినైవాంగ సహ చూడామణిం విభుః

ఓ పరీక్షిన్మహారాజా! సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు వానిని సమీపించి ఎదురుగా పచ్చి పిడికిలితో గుద్ది దుర్బుద్ధియగు వాని వాని తలను, చూడామణిని ఒకే సారి ఊడబెరకెను.

శంఖచూడం నిహత్యైవం మణిమాదాయ భాస్వరమ్

అగ్రజాయాదదాత్ప్రీత్యా పశ్యంతీనాం చ యోషితామ్

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే చతుస్త్రింశోఽధ్యాయః.

ఈ విధముగా శ్రీకృష్ణుడు శంఖచూడుని సంహరించి ప్రకాశించే చూడామణిని తెచ్చెను. దానినాతడు గోపికలు చూచుచుండగనే ప్రేమతో అన్నగారికి ఇచ్చెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము పూర్వార్ధములో

శ్రీకృష్ణుడు సుదర్శనుని, శంఖచూడుని ఉద్ధరించుటను వర్ణించే

ముప్పది నాల్గవ అధ్యాయము ముగిసినది (34).