70 - జరాసంధుని బందీలు శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపుట

 శ్రీశుక ఉవాచ

 అథోషస్యుపవృత్తాయాం కుక్కుటాన్ కూజతోఽశపన్

 గృహీతకంఠ్యః పతిభిర్మాధవ్యో విరహాతురాః

 శ్రీశుక  మహర్షి  పలికెను --- తెల్లవారబోవుచుండగా  శ్రీకృష్ణ  మూర్తులచే కంఠమునందు  కౌగిలించబడిన  శ్రీకృష్ణపత్నులు  కూయుచున్న  కోళ్లను  నిందించిరి. వారు  విరహము  కలుగుచున్నదనే  ఆదుర్దాను  కలిగియుండిరి.

వయాంస్యరూరువన్ కృష్ణం బోధయంతీవ వందినః

 గాయత్స్వలిష్వనిద్రాణి మందారవనవాయుభిః

మందారవృక్షముల  గాలి  తగిలి  తుమ్మెదలు  గానము  చేయుచుండ,  పక్షులు నిద్ర  చెడి  శ్రీకృష్ణుని  స్తోత్రపాఠకులు  వలె  నిద్ర  లేపుచున్నవాయన్నట్లు  కూసినవి.

ముహూర్తం తం తు వైదర్భీ నామృష్యదతిశోభనమ్

 పరిరంభణవిశ్లేషాత్ప్రియబాహ్వంతరం గతా

ప్రియుడగు  శ్రీకృష్ణుని  వక్షఃస్థలమును  కౌగిలించిన  విదర్భరాజకుమార్తెయగు రుక్మిణికి  ఆ  బ్రాహ్మముహూర్తము  నచ్చలేదు.  ఎందుకంటే,  అప్పుడు కౌగిలికి వియోగము కలుగును.

బ్రాహ్మే ముహూర్త ఉత్థాయ వార్యుపస్పృశ్య మాధవః

 దధ్యౌ  ప్రసన్నకరణ ఆత్మానం తమసః పరమ్

 శ్రీకృష్ణ  భగవానుడు  తెల్లవారు  జామున  లేచి  నీటితో  పాదములను  కడుగుకొని  ఆచమనము  చేసి  ప్రసన్నమగు  ఇంద్రియములు  గలవాడై  ప్రకృతి  

(దేహేంద్రియములు) కి  అతీతమైన  ప్రత్యగాత్మను  ధ్యానించెను.

ఏకం స్వయంజ్యోతిరనన్యమవ్యయం

స్వసంస్థయా నిత్యనిరస్తకల్మషమ్

బ్రహ్మాఖ్యమస్యోద్భవనాశహేతుభిః

స్వశక్తిభిర్లక్షితభావనిర్వృతిమ్

ప్రత్యగాత్మకు  బ్రహ్మ  అనే  పేరున్నా  ధ్యాతకంటే  వేరుగా  లేదు. రెండవది  లేని ఆత్మ  వినాశము  లేనిది.  సాధకుని  స్వరూపమైన  ఆత్మ  యందు  ఏ  కాలమునందైననూ అవిద్యాదిదోషములు  లేవు.  ఈ జగత్తు  యొక్క  సృష్టిస్థితిలయములకు  హేతువులైన సత్త్వరజస్తమోగుణాత్మకమైన  మాయాశక్తిచే ఉపలక్షితమయ్యే ఆత్మ సచ్చిదానందఘనము.

 అథాప్లుతోఽoభస్యమలే యథావిధి క్రియాకలాపం పరిధాయ వాససీ,

చకార సంధ్యోపగమాది సత్తమో హుతానలో బ్రహ్మ జజాప వాగ్యతః

తరువాత  శ్రీకృష్ణ  భగవానుడు  స్వచ్ఛమగు  నీటిలో  స్నానము  చేసి జంట వస్త్రములను  ధరించి  సంధ్యావందనము  మొదలైన  కర్మసమూహమును  యథావిధిగా చేసి,  అగ్నియందు  హోమము  చేసి,  మౌనియై గాయత్రిని జపించెను.

ఉపస్థాయార్కముద్యంతం తర్పయిత్వాఽఽత్మనః కలాః

 దేవానృషీన్ పితౄన్ వృద్ధాన్ విప్రానభ్యర్చ్య చాత్మవాన్

ఆయన  సావధానుడై  ఉదయిస్తున్న  సూర్యుని  యెదుట  నిలబడి  ప్రార్థించి,  తన అంశలైన  దేవతలకు,  మహర్షులకు,  పితృదేవతలకు  తర్పణములనిచ్చి,  పెద్దలను, వేదవేత్తలను  పూజించెను.

ధేనూనాం రుక్మశృంగీణాం సాధ్వీనాం మౌక్తికస్రజామ్

 పయస్వినీనాం గృష్టీనాం సవత్సానాం సువాససామ్

 దదౌ రూప్యఖురాగ్రాణాం క్షౌమాజినతిలైస్సహ

 అలంకృతేభ్యో విప్రేభ్యో బద్వం బద్వం దినే దినే

ఆయన  ప్రతిదినము  వేదవేత్తలనలంకరించి  వారికి  మంద (సుమారు 13 వేలు) మొదటి  కాన్పు  గంగిగోవులను  దూడలతో  సహా  ఇచ్చెను. ఎక్కువ  పాలనిచ్చే  ఆ గోవులకు  కొమ్ములపై  బంగారముతో,  గిట్టల  కొనలకు  వెండితో  తొడుగు వేయబడెను. వాటిపై  మంచి  వస్త్రములను  కప్పి  మెడలో  ముత్యాల  హారములు  వేయబడెను. వీటికి తోడుగా  ఆయన  వారికి  పట్టు వస్త్రములను, కృష్ణమగృచర్మలను, నువ్వులను కూడ యిచ్చెను.

గోవిప్రదేవతావృద్ధగురూన్ భూతాని సర్వశః

నమస్కృత్యాత్మసంభూతీర్మంగలాని సమస్పృశత్

ఆయన  తన  విభూతులే  అయిన  గోవులను,  వేదవేత్తలను,  పెద్దలను, తల్లిదండ్రులను  నమస్కరించి,  ఆవు  పాలు  మొదలైన  మంగళద్రవ్యములను స్పృశించెను.

ఆత్మానం భూషయామాస నరలోకవిభూషణమ్

వాసోభిర్భూషణైస్స్వీయైర్దివ్యస్రగనులేపనైః

శ్రీకృష్ణుడు తానే మానవలోకమునకు అలంకారము. ఆయన తనవైన (విలక్షణమైన) పీతాంబరములు, అలంకారములు, ప్రకాశించే మాలలు, చందనము మొదలైనవాటితో తనను తాను అలంకరించుకొనెను.

అవేక్ష్యాజ్యం తథాఽఽదర్శం గోవృషద్విజదేవతాః

 కామాంశ్చ సర్వవర్ణానాం పౌరాంతఃపురచారిణామ్

ప్రదాప్య ప్రకృతీః కామైః ప్రతోష్య ప్రత్యనందత

ఆయన  కరిగిన  నేతిలో  మరియు  అద్దములో  ముఖము  చూసుకొని, ఆవు, ఎద్దు, బ్రాహ్మణుడు, దేవత  అనువాటిని  మంగళము కొరకు చూచెను. ఆయన అంతఃపురములో  పని చేయువారికి, పౌరులకు  కూడ  అన్ని  వర్ణముల  వారికి భోగ్యములగు  వస్తువులనిప్పించి,  అమాత్యులు  మొదలైన  రాజప్రకృతులను  కూడ సంతోష పెట్టి తాను ఆనందించెను.

సంవిభజ్యాగ్రతో విప్రాన్ స్రక్తాంబూలానులేపనైః

 సుహృదః ప్రకృతీర్దారానుపాయుంక్త తతస్స్వయమ్

ఆయన మాలలు,  తాంబూలము,  చందనము  మొదలైన  వాటిని  ముందుగా వేదవేత్తలకు,  మిత్రులకు,  అమాత్యులు  మొదలైన  రాజప్రకృతులకు,  భార్యలకు  ఇచ్చి, తరువాత తాను వినియోగించెను.

తావత్సూత ఉపానీయ స్యందనం పరమాద్భుతమ్

సుగ్రీవాద్యైర్హయైర్యుక్తం ప్రణమ్యావస్థితోఽగ్రతః

అంతలో  రథసారథి  సుగ్రీవము,  మణిపుష్పకము  మొదలైన  గుర్రములతో కూడిన  రథమును  ఎదురుగా  దగ్గరకు  తీసుకువచ్చి  నమస్కరించి  నిలబడెను. ఆ రథము చాల అచ్చెరువు గొలుపుచుండును.

గృహీత్వా పాణినా పాణీ సారథేస్తమథారుహత్

 సాత్యక్యుద్ధవసంయుక్తః పూర్వాద్రిమివ భాస్కరః

తరువాత శ్రీకృష్ణుడు సారథి  చేతులను  చేతితో  పట్టుకొని,  తూర్పు  పర్వతమును సూర్యుడు వలె, ఆ రథమునెక్కెను. సాత్యకి, ఉద్ధవులు  ఆయన వెంట ఉండిరి.

ఈక్షితోఽoతఃపురస్త్రీణాం సవ్రీడప్రేమవీక్షితైః

కృచ్ఛ్రాద్విసృష్టో నిరగాజ్జాతహాసో హరన్మనః

అంతఃపురమునందలి  యువతులు  సిగ్గు  ప్రేమలను  కలబోసిన  చూపులతో ఆయనను చూస్తూ  విడిచిపెట్టకుండిరి. అయినా, ఆయన  కష్టముతో  వారిని  విడిచి నవ్వుకుంటూ  మనస్సును  దోచి  నిష్క్రమించెను.

సుధర్మాఖ్యాం సభాం సర్వైర్వృష్ణిభిః పరివారితః

 ప్రావిశద్యన్నివిష్టానాం న సంత్యంగ షడూర్మయః

ఓ పరీక్షిన్మహారాజా!  యాదవులందరు  చుట్టుపారియుండ  శ్రీకృష్ణుడు  సుధర్మ అనే  సభయందు  ప్రవేశించెను.  ఆ సభలో  కూర్చున్నవారికి  శరీరమును  వృద్ధాప్య మరణములు, ప్రాణశక్తిని  ఆకలి  దప్పికలు,  మనస్సును  సుఖదుఃఖములు  అనే  ఆరు జీవనతరంగములు  బాధించవు.

తత్రోపవిష్టః పరమాసనే విభుర్బభౌ స్వభాసా కకుభోఽవభాసయన్,

వృతో నృసింహైర్యదుభిర్యదూత్తమో యథోడురాజో దివి తారకాగణైః

ఆ సభలో  శ్రీకృష్ణ  ప్రభుడు  సింహాసనముపై  కూర్చుని  తన  కాంతిచే  దిక్కులను ప్రకాశింపజేస్తూ  ప్రకాశించెను. యాదవశ్రేష్ఠుడగు  ఆయన  పురుషశ్రేష్ఠులగు యాదవులచే,  ద్యులోకమునందు  చంద్రుడు  నక్షత్రగణములచేతను  వలె, చుట్టువారబడియుండెను.

తత్రోపమంత్రిణో రాజన్ నానాహాస్యరసైర్విభుమ్

 ఉపతస్థుర్నటాచార్యా నర్తక్యస్తాండవైః పృథక్

ఓ పరీక్షిన్మహారాజా!  ఆ  సభలో  విదూషకులు  పలువిధముల హాస్యవినోదములతో,  నాట్యాచార్యులు  మరియు  నాట్యభామలు  వేర్వేరుగా నాట్యములతో  శ్రీకృష్ణ  ప్రభుని  సేవించిరి.

మృదంగవీణామురజవేణుతాలదరస్వనైః

 ననృతుర్జగుస్తుష్టువుశ్చ సూతమాగధవందినః

మద్దెళ్లు,  వీణలు,  డోళ్లు,  పిల్లనగ్రోవులు,  తాళములు  మరియు  శంఖముల ధ్వనులతో  సూతులు, మాగధులు, వందులు  పాడి, నాట్యమాడి, స్తోత్రములను కూడ చేసిరి.

తత్రాహుర్బ్రాహ్మణాః కేచిదాసీనా బ్రహ్మ వాదినః

 పూర్వేషాం పుణ్యయశసాం రాజ్ఞాం చాకథయన్ కథాః

ఆ  సభయందు  కూర్చున్న  కొందరు  వ్యాఖ్యానకుశలురగు  బ్రాహ్మణులు వేదమంత్రములను  వ్యాఖ్యానించిరి.  కొందరు  పవిత్రమగు  కీర్తి  గల  పూర్వమహారాజుల కథలను కూడ చెప్పిరి.

తత్రైకః పురుషో రాజన్నాగతోఽపూర్వదర్శనః

 విజ్ఞాపితో భగవతే ప్రతీహారైః ప్రవేశితః

ఓ పరీక్షిన్మహారాజా! ఆ  సభకు  ఇదివరలో  చూడబడని  ఒక  వ్యక్తి  వచ్చెను. ద్వారపాలకులు  ఆతనిని  గురించి  శ్రీకృష్ణ  భగవానునకు  విన్నవించి  ప్రవేశ పెట్టిరి.

స నమస్కృత్య కృష్ణాయ పరేశాయ కృతాంజలిః

 రాజ్ఞామవేదయద్దుఃఖం జరాసంధనిరోధజమ్

ఆతడు  శ్రీకృష్ణ  భగవానునకు  చేతులు  జోడించి  నమస్కరించి,  జరాసంధుడు బంధించుట  వలన  రాజులకు  కలిగిన  దుఃఖమును  గురించి  విన్నవించెను.

యే చ దిగ్విజయే తస్య సన్నతిం న యయుర్నృపాః

 ప్రసహ్య రుద్ధాస్తేనాసన్నయుతే ద్వే గిరివ్రజే

జరాసంధుని  దిగ్విజయయాత్రలో  ఏ  రాజులైతే  తమ  వినయమును ప్రకటించలేదో,  వారిని  ఇరవై  వేలమందిని  ఆతడు  బలాత్కారముగా  గిరివ్రజమునందు బంధించినాడు.

 కృష్ణ కృష్ణాప్రమేయాత్మన్ ప్రపన్నభయభంజన

వయం త్వాం శరణం యామో భవభీతాః పృథగ్ధియః

ఓ శ్రీకృష్ణా! శ్రీకృష్ణా! నీ స్వరూపము ఇంద్రియములకు, మనస్సునకు గోచరము కాదు.  నీవు శరణు జొచ్చినవారి భయములను బాపెదవు. భేదబుద్ధి  గల  మేము సంసారమునకు  భయపడి  నిన్నే  శరణు  వేడినాము.

లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః

కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే

యస్తావదస్య బలవానిహ జీవితాశాం

సద్యశ్ఛినత్త్యనిమిషాయ నమోఽస్తు తస్మై

ఈ లోకములో ఈ మానవుడు నిషిద్ధకర్మలపై ప్రీతి గలవాడై, నీవు బోధించిన నీ అర్చన అనే తనను ఉద్ధరించే  ధర్మము  విషయములో  అజాగ్రత్తగా నుండును. అంతలోనే బలవంతమైన  కాలము  వేంటనే వీని జీవితాశను  వమ్ముచేయును. కాలమునకు అజాగ్రత్త లేదు. ఆ కాలము నీ రూపమే. నీకు నమస్కారమగుగాక!

లోకే భవాఞ్జ్గదినః కలయాఽవతీర్ణః

సద్రక్షణాయ ఖలనిగ్రహణాయ చాన్యః

కశ్చిత్త్వదీయమతియాతి విదేశమీశ

కిం వా జనస్స్వకృతమృచ్ఛతి తన్న విద్మః

జగన్నాథుడవగు  నీవు  దుష్టులను  శిక్షించి  సత్పురుషులను  రక్షించుటకై  నీ అంశయగు  బలరామునితో  కూడి  లోకమునందవతరించితిని.  కాని,  మరియొక  రాజు ఒకడు (జరాసంధుడు)  నీ  ఆదేశమునుల్లంఘించి  మమ్ములను  బంధించినాడా?  లేక, మేము  మా  కర్మఫలముననుభవించుచున్నామా?  ఈ  సంగతి  మాకు  తెలియకున్నది.

స్వప్నాయితం నృపసుఖం పరతంత్రమీశ

శశ్వద్భయేన మృతకేన ధురం వహామః

హిత్వా తదాత్మని సుఖం త్వదనీహలభ్యం

క్లిశ్యామ హ్యేఽతికృపణాస్తవ మాయయేహ

ఓ ఈశ్వరా!  రాజ్యాధికారమునందలి  సుఖము  కల వంటిది,  పరాధీనమైనది. ఆత్మానందము  నిష్కాములచే  నీనుండి  పొందబడును.  కాని,  నీ  మాయచే మోహితులమై  మిక్కిలి  దీనులమగు  మేము  దానిని  విడిచి,  నిత్యభయనిధానమగు శవమువంటి  దేహముతో  సంసారభారమును  మోస్తూ  ఈ  లోకములో కష్టపడుచున్నాము.

తన్నో భవాన్ ప్రణతశోకహరాంఘ్రియుగ్మో

బద్ధాన్ వియుంక్ష్వ మగధాహ్వయకర్మపాశాత్

 యో భూభుజోఽకయుతమతంగజవీర్యమేకో

బిభ్రద్రురోధ భవనే మృగరాడివావీః

నీ  పాదములకు  ప్రణమిల్లినవారి  దుఃఖములు  దూరమగును.  కావున,  నీవు బంధించబడిన  మమ్ములను  మగధరాజనే  పేరు గల కర్మబంధమునుండి  విడిపించుము. పదివేల యేనుగుల బలము గల ఒక్క మగధరాజు రాజులను భవనమునందు,  సింహము  గొర్రెలను  వలె,  బంధించినాడు.

యో వై త్వయా ద్వినవకృత్వ ఉదాత్తచక్ర

భగ్నో మృధే ఖలు భవంతమనంతవీర్యమ్

జిత్వా నృలోకనిరతం సకృదూఢదర్పో

యుష్మత్ప్రజా రుజతి నోఽజిత తద్విధేహి

ఓ శ్రీకృష్ణా!  సంసిద్ధముగా  నుండే  సుదర్శనచక్రము  గల  నీకు  పరాజయము లేదు.  అనంతశక్తిమంతుడవగు  నీవు  జరాసంధుని  యుద్ధములో  పద్ధెనిమిది  సార్లు పరాజితుని  చేసితివి.  కాని,  మానవుల  చేష్టననుకరించే  నిన్ను  ఆతడు  ఒక్కసారి జయించి  గర్వమును  పొంది  నీ  సంతానమగు  మమ్ములను  పీడించుచున్నాడు.  ఆ విషయమై యోగ్యమగు చర్యను చేపట్టుము.

దూత ఉవాచ

 ఇతి మాగధసంరుద్ధా భవద్దర్శనకాంక్షిణః

ప్రపన్నాః పాదమూలం తే దీనానాం శం విధీయతామ్  

దూత ఇట్లు పలికేను ---  మగధదేశరాజగు  జరాసంధునిచే  బంధించబడిన  ఆ రాజులు  దర్శనమును  కోరి  తమరి  పాదములమూలమును  శరణు  జొచ్చినారు. వారికి సుఖమును కలిగించుడు.

శ్రీశుక ఉవాచ

 రాజదూతే బ్రువత్యేవం దేవర్షిః పరమద్యుతిః

 బిభ్రత్పింగజటాభారం ప్రాదురాసీద్యథా రవిః  

రాజుల  దూత  ఈ  విధముగా  చెప్పుచుండగనే,  నారదమహర్షి  ఆవిర్భవించెను. ఆయన  బంగరు  వన్నె  గల  జటల  ముడితో  సూర్యుడు  వలె  గొప్పగా  ప్రకాశించెను.

తం దృష్ట్వా భగవాన్ కృష్ణస్సర్వలోకేశ్వరేశ్వరః

 వవంద ఉత్థితశ్శీర్ ష్ణా  ససభ్యస్సానుగో ముదా  

సకలలోకపాలకులకు  పాలకుడైన  శ్రీకృష్ణ  భగవానుడా  నారదుని  చూచి, సభ్యులతో  మరియు  అనుచరులతో  బాటుగా  ఆనందముతో  లేచి  నిలబడి  తల  వంచి నమస్కరించెను.

సభాజయిత్వా విధివత్కృతాసనపరిగ్రహమ్

బభాషే సూనృతైర్వాక్యైశ్శ్రద్ధయా తర్పయన్మునిమ్

  మహర్షి  ఆసనమును  స్వీకరించిన  పిదప,  శ్రీకృష్ణుడు  శ్రద్ధతో  యథావిధిగా పూజించి, మధురములైన మాటలతో  ప్రీతిని  కలిగిస్తూ  ఇట్లు  పలికెను.

అపి స్విదద్య లోకానాం త్రయాణామకుతోభయమ్

 నను భూయాన్ భగవతో లోకాన్ పర్యటతో గుణః

ఇప్పుడు  ముల్లోకములు  అభయముగానున్నవా?  లోకములను  పర్యటించే తమరి  వలన  చాల  లాభము (సంగతి తెలియుట) కలదు  సుండీ!

న హి త్వేఽవిదితం కించిల్లోకేష్వీశ్వరకర్తృషు

అథ పృచ్ఛామహే యుష్మాన్ పాండవానాం చికీర్షితమ్

ఎందుకంటే,  ఈశ్వరునిచే  రచించబడిన  ఈ  ముల్లోకములలో  మీకు  తెలియనిది  ఏదీ  లేదు.  కాబట్టి,  పాండవులు  ఏమి  చేయగోరుచున్నారు?  అని  మేము తమరిని ప్రశ్నించుచున్నాము.

శ్రీనారద ఉవాచ

 దృష్టా మయా తే బహుశో దురత్యయా

మాయా విభో విశ్వసృజశ్చ మాయినః

 భూతేషు భూమంశ్చరతస్స్వశక్తిభిః

 వహ్నేరివ చ్ఛన్నరుచో న మేఽద్భుతమ్

శ్రీనారద  మహర్షి  ఇట్లు  పలికెను --- ఓ ప్రభూ!  నీ  మాయ  జగత్తును  సృష్టించిన  బ్రహ్మదేవుని  కూడ  మోహపెట్టును.  నీవు  ప్రాణులలో  వ్యాపించియున్ననూ  నీ శక్తులగు  సత్త్వరజస్తమోగుణములు,  బూడిదనిప్పును  వలె,  నీ ప్రకాశమును కప్పివేయును.  నీ  మాయను  అతిక్రమించుట  శక్యము  కాదు.  అట్టి  నీ  మాయను  నేను  పలుమార్లు  చూచితిని.  కావున,  నాకు  నీ  ప్రశ్నలు  వింత  కాదు.

తవేహితం కోఽర్హత సాధు వేదితుం

స్వమాయయేదం సృజతో నియచ్ఛతః

 యద్విద్యమానాత్మతయాఽవభాసతే

తస్మై నమస్తే స్వవిలక్షణాత్మనే

నీవు  నీ  మాయాశక్తిచే  ఈ  జగత్తును  సృష్టించి  ఉపసంహరించెదవు.  నీ  చేష్టను బాగుగా  ఎవడు  తెలియదగును?  ఈ  జగత్తు  మిథ్యయే  అయిననూ,  యథార్థమా యన్నట్లు  ప్రకాశించుచున్నది.  కాని,  నీ  స్వరూపము  కనబడే  ఈ  జగత్తుకంటె విలక్షణమైనది.  అట్టి  నీ  కొరకు  నమస్కారము.

 జీవస్య యస్సంసరతో విమోక్షణం న జానతోఽనర్థవహాచ్ఛరీరతః,

 లీలాఽవతారైస్స్వయశఃప్రదీపకం ప్రాజ్వాలయత్త్వా తమహం ప్రపద్యే

జీవుడు  స్థూలసూక్ష్మశరీరములతో  తాదాత్మ్యము  వలన  సంసారములో  పడి దుఃఖములననుభవిస్తూ  విముక్తిని  పొందే  ఉపాయమును  తెలియకున్నాడు.  నీవు  లీల కొరకై  అవతారములనెత్తి,  అట్టి  జీవునికొరకు  నీ  కీర్తి  అనే  దీపమును వెలిగించినావు. అట్టి నిన్ను నేను శరణు వేడుచున్నాను.

అథాప్యాశ్రావయే బ్రహ్మ నరలోకవిడంబనమ్

 రాజ్ఞః పైతృష్వసేయస్య భక్తస్య చ చికీర్షితమ్

పరబ్రహ్మవగు  నీకు  తెలియనిదేదీ  లేనప్పటికీ,  మానవజీవితము  ననుకరిస్తున్న నీకు  ధర్మరాజు  చేయగోరినదానిని  గురించి  వినిపించెదను.  ఆయన  నీ  తండ్రి  సోదరి పుత్రుడు  మాత్రమే  గాక,  భక్తుడు  కూడా.

యక్ష్యతి త్వాం మఖేంద్రేణ రాజసూయేన పాండవః

పారమేష్ఠ్యకామో నృపతిస్తద్భవాననుమోదతామ్

పాండుపుత్రుడగు  ధర్మరాజు  బ్రహ్మపదము (సామ్రాజ్యము, సర్వులప్రశంస) ను కోరి  నిన్ను  యజ్ఞములలో  శ్రేష్ఠమైన  రాజసూయముతో  ఆరాధించగలడు.  ఆయన ఆకాంక్షను  తమరు  అనుమోదించుడు.

తస్మిన్ దేవ క్రతువరే భవంతం వై సురాదయః

దిదృక్షవస్సమేష్యంతి రాజానశ్చ యశస్వినః

ఓ దేవా!  నిన్ను  చూడగోరి  దేవతలు,  సిద్ధులు  మొదలగువారు,  కీర్తిమంతులగు రాజులు  కూడ  నిశ్చయముగా  ఆ  యజ్ఞమునకు  విచ్చేయగలరు.

శ్రవణాత్కీ ర్తనాద్ధ్యానాత్పూయంతేఽoతేవసాయినః

తవ బ్రహ్మమయస్యేశ కిముతేక్షాఽభిమర్శినః

ఓ ఈశ్వరా!  నీవు  పరబ్రహ్మ స్వరూపుడవు.  నీ కీర్తిని  విని, కీర్తించి, ధ్యానించి పతితులు  కూడ  పవిత్రులగుదురు.  నిన్ను  చూచి,  స్పృశించువారు  పవిత్రులగుదురని వేరుగా  చెప్పవలయునా?

యస్యామలం దివి యశః ప్రథితం రసాయాం

 భూమౌ చ తే భువనమంగల దిగ్వితానమ్

మందాకినీతి దివి భోగవతీతి చాధో

గంగేతి చేహ చరణాంబు పునాతి విశ్వమ్

లోకములకు  మంగళములనిచ్చే  ఓ  దేవా!  నీ  స్వచ్ఛమగు  కీర్తి  దిక్కులకు మేలుకట్టు  వలె  వ్యాపించి,  స్వర్గపాతాళభూలోకములయందు  వినుతికెక్కినది.  నీ పాదములనుండి  పుట్టిన  నీరు  స్వర్గమునందు  మందాకిని,  పాతాళమునందు  భోగవతి, ఈ భూలోకమునందు  గంగ  అనే  రూపములతో  జగత్తును  పావనము చేయుచున్నది.

శ్రీశుక ఉవాచ

తత్ర తేష్వాత్మపక్షేష్వగృహ్ణత్సు విజిగీషయా

 వాచః పేశైస్స్మయన్ భృత్యముద్ధవం ప్రాహ కేశవః

శ్రీశుక  మహర్షి  ఇట్లు  పలికెను  ---  జరాసంధుని  జయించగోరే స్వపక్షీయులగు యాదవులు  ఆ  సభలో  శ్రీకృష్ణుడు  యజ్ఞమునకు వెళ్లుటను అంగీకరించలేదు.  అపుడు  శ్రీకృష్ణ  భగవానుడు  నవ్వుతూ  మధురవచనములతో భక్తుడగు  ఉద్ధవునితో  నిట్లనెను.

శ్రీభగవానువాచ

 త్వం హి నః పరమం చక్షుస్సుహృన్మంత్రార్థతత్త్వవిత్

 తథాఽత్ర బ్రూహ్యనుష్ఠేయం శ్రద్దధ్మః కరవామ తత్

శ్రీకృష్ణ  భగవానుడిట్లు  పలికెను ---  నీవు  నిశ్చయముగా  మాకు  గొప్ప చూపు (జ్ఞాననేత్రము).  నీవు  హితకారివి.  రాజనీతి,  దానిచే  సాధించదగిన  లక్ష్యములు అనువాటి  తత్త్వము  నీకు  తెలియును.  ఈ  విషయములో  మా  కర్తవ్యమును  గురించి చెప్పుము.  మేము  శ్రద్ధతో  దానిని  చేసెదము.

ఇత్యుపామంత్రితో భర్త్రా సర్వజ్ఞేనాపి ముగ్ధవత్

 నిదేశం శిరసాఽఽధాయ ఉద్ధవః ప్రత్యభాషత

 ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

ఉత్తరార్ధే సప్తతితమోఽధ్యాయః

శ్రీకృష్ణ ప్రభుడు  సర్వము  తెలిసినవాడే  అయినా  తెలియనివాడు  వలె  ఈ విధముగా  అడిగెను.  ఉద్ధవుడు  ఆయన  ఆదేశమును  తల  వంచి  స్వీకరించి  ఇట్లు బదులు చెప్పెను.

శ్రీమద్భాగవతము  పదవ  స్కంధము ఉత్తరార్ధములో

జరాసంధుని బందీలు శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపుటను వర్ణించే

డెబ్బదియవ అధ్యాయము ముగిసినది.