భాగవత మహా పురాణము
26 - నందునితో గోపాలకులు శ్రీకృష్ణుని గురించి చర్చించుట
శ్రీశుక ఉవాచ ।
ఏవంవిధావి కర్మాణి గోపాః కృష్ణస్య వీక్ష్య తే ।
ఆతద్వీర్యవిదః ప్రోచుస్సమభ్యేత్య సువిస్మితాః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధములైన శ్రీకృష్ణుని లీలలను చూచి ఆ గోసాలకులు మిక్కిలి ఆశ్చర్యమును పొందిరి. వారికి ఆయన పరాక్రమము గురించి తెలియదు. వారు ఒకచో గుమిగూడి ఇట్లు పలికిరి.
బాలకస్య యదేతాని కర్మాణ్యత్యద్భుతాని వై ।
కథ మర్హత్యసౌ జన్మ గ్రామ్యేష్వాత్మజుగుప్సితమ్ ।
ఈ బాలకృష్ణుని లీలలు నిశ్చయముగా అత్యద్భుతములు. ఈతడు పల్లెటూరివారమగు మనలో జన్మించుట ఈతనికి అయోగ్యమైన పుట్టుక. ఇది యెట్లు తగియున్నది?
యస్సప్తహాయనో బాలః కరేణైకేన లీలయా ।
కథం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివ ॥
ఈతడు ఏడేళ్ల బుడతడు. ఒకే చేతితో పెద్ద పర్వతమును, గొప్ప యేనుగు పద్మమును వలె, అవలీలగా ఎట్లు మోసినాడు?
తోకేనామీలితా క్షేణ పూతనాయా మహౌజసః ।
పీతః స్తనస్సహ ప్రాణైః కాలేనేవ వయస్తనోః ॥
ఈతడు చిన్నపిల్లవాడుగ నుండగనే గట్టిగా కళ్లను మూసుకొని గొప్ప బలము గల పూతనయొక్క చనుబాలను ఆమె ప్రాణములతో సహా, కాలము దేహము యొక్క వయస్సును వలె, త్రాగివేసెను.
హిన్వతోఽధశ్శయానస్య మాస్యస్య చరణావుదక్ ।
అనోఽపతద్విపర్యస్తం రుదతః ప్రపదా హతమ్ ॥
ఈతడు మూడు నెలల పిల్లవాడుగా నున్నప్పుడు బండి క్రింద (చిక్కములో) పరుండి కాళ్లను రెండింటినీ పైకి ఊపుచుండెను. ఈతడు ఏడుస్తూ కాలి కొనతో తన్నగా బండి తల్లక్రిందులై పడిపోయెను.
ఏకహాయన ఆసీనో ప్రియమాణో విహాయసా ।
దైత్యేన యస్తృణావర్త మహన్ కంఠగ్రహాతురమ్ ॥
ఒక ఏడు వయస్సు గల బాలకృష్ణుడు కూర్చుని యుండగా తృణావర్తుడనే రాక్షసుడు ఆకాశమార్గము గుండా ఎత్తుకుపోయెను. అపుడాతడు వాని కంఠమును పట్టి నొక్కి వానిని సంహరించెను.
క్వచిద్ధైయంగవ స్తైన్యే మా బద్ధ ఉలూఖలే ।
గచ్ఛన్నర్జునయోర్మధ్యే బాహుభ్యాం తాపపాతయత్ ॥
అప్పుడే చిలికిన వెన్ననీతడు అపహరించగా తల్లి రోలునందు ఈతనిని కట్టివేసెను. అపుడీతడు జంట మద్ది చెట్ల మధ్య గుండా వెళ్తూ రెండు చేతులతో వాటిని పడగొట్టెను.
వనే సంచారయన్ వత్సాన్ సరామో బాల కైర్వృతః ।
హంతుకామం బకం దోర్భ్యాం ముఖతోఽరిమపాటయత్ ॥
ఈతడు అడవిలో బలరామునితో గూడి గోప చుట్టువారియుండ దూడలను చక్కగా మేపుచుండెను. ఈతనిని చంపగోరి బకాసురుడనే శత్రువు రాగా, ఈతడు వాని ముక్కులను చీల్చి చంపెను.
వత్సేషు వత్సరూపేణ ప్రవిశంతం జిఘాంసయా ।
హత్వా న్యపాతయత్తేన కపిత్థాని చ లీలయా ॥
ఈతనిని చంపాలనే కోరికతో ఒక రాక్షసుడు దూడ రూపముతో దూడలలో ప్రవేశించెను. ఈతడు వానిని చంపి ఆ దేహమును విసరగా అది తగిలి వెలగ చెట్ల పళ్లు రాలెను.
హత్వా రాసభదైతేయం తద్బంధూంశ్చ బలాన్వితః ।
చక్రే తాలవనం క్షేమం పరిపక్వఫలాన్వితమ్ ॥
ఈతడు బలరామునితో కలిసి గాడిద రూపములోనున్న ధేనుకాసురుని, వాని బంధువులను కూడ సంహరించి, తాటి చెట్ల వనమునందు భద్రతను నెలకొల్పెను. దానియందు బాగా ముగ్గిన పళ్లు గలవు.
ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేన బలశాలినా ।
అమోచయద్వ్రజపశూన్ గోపాంశ్చారణ్యవహ్నితః ॥
ఈతడు, బలశాలియగు బలరామునిచే భయంకరుడగు ప్రలంబాసురుని సంహరిపజేసెను. గోకులము యొక్క పశువులను, గోప బాలకులను అడవిలో దావాగ్నినుండి విడిపించెను.
ఆశీవిష తమాహేంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ।
ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రేఽసౌ నిర్విషోదకామ్ ॥
ఈతకు మిక్కిలి భయంకరమగు విషము గల సర్పరాజగు కాలియుని పడగల పై బలముగా తొక్కి వాని గర్వమునడంచెను. వానికి యమునా నది లోని సరస్సునుండి ఉద్వాసన చెప్పి ఆ నీటికి విషము పోవునట్లు చేసెను.
దుస్త్యజుశ్చాసురాగోఽస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసామ్ ।
నంద తే తనయేఽస్మాసు తస్యాప్యౌత్పత్తికః కథమ్ ॥
ఓ నంద మహారాజా! గోకులమునందు నివసించే మాకందరికీ నీ పుత్రుడగు ఈతనిపై విడువ శక్యము కాని ప్రేమ. ఆతనికి కూడ మాపై సహజసిద్ధమైన ప్రేమ గలదు. దీనికి కారణమేమై యుండును?
క్వ సప్తహాయనో బాలః క్వ మహాద్రివిధారణమ్ ।
తతో నో జాయతే శంకా వ్రజనాథ తవాత్మజే ॥
గోకులప్రభువగు ఓ నందా! ఏడేళ్ల పిల్లవాడెక్కడ? పెద్ద పర్వతమును మోయుట యెక్కడ? అందువలన, మాకు నీ పుత్రునిపై అనుమానము కలుగుచున్నది.
నంద ఉవాచ।
శ్రూయతాం మే వచో గోపా వ్యేతు శంకా చ వోఽర్బకే ।
ఏనం కుమార ముద్దిశ్య గోర్గో మే యదువాచ హ ॥
నందుడు ఇట్లు పలికెను --- ఈ పిలవానిని గురించి ఒకనాడు గరాచార్యుడు నాకు చెప్పిన మాటను చెప్పెదను. మీరు నా మాటను విని వీనిపై గల అనుమానమును తొలగించుకొనుడు.
వర్ణాస్త్రయః కిలాస్యాసన్ గృహ్లాతోఽసుయుగం తనూః ।
శుక్లో రక్తస్తథా పీత ఇదానీం కృష్ణ తాం గతః ॥
ఈయన ప్రతియుగమునందు అవతారములనెత్తును. తెలుపు, ఎరుపు, పచ్చన అనే మూడు రంగులుండెనట. ఇప్పుడీతడు నల్లనివాడైనాడు.
ప్రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః ।
వాసుదేవ ఇతి శ్రీమానభిజ్ఞాస్సంప్రచక్షతే ॥
ఈ నీ పుత్రుడు పూర్వము ఒకప్పుడు ఎక్కడనో వసుదేవునకు పుట్టినాడు. ఆ రహస్యము తెలిసినవారు ఈతడు శ్రీమాన్ వాసుదేవుడని చెప్పెదరు.
బహూసి సంతి నామాని రూపాణి చ సుతస్య తే ।
గుణకర్మాసురూపొణి తాస్యహం వేచ నో జనాః ॥
నీ పుత్రునకు గుణములు లీలలను బట్టి అనేకములగు పేర్లు, రూపములు కూడా కలవు. అవి నాకు తెలియనే గాని, జనులకు తెలియవు.
ఏష వశ్శేయ ఆధాస్యద్గోపగోకులనందనః ।
అనేన సర్వదుర్గాణి యూయమంజస్తరిష్యథ ॥
ఈతడు గోపాలకులను, గోవులను ఆనందింప జేసి, మీకు గొప్ప హితమును చేయును. మీరు ఈతని ద్వారా ఆపదలనన్నింటినీ తేలికగా దాటి వేయగలరు.
పురాఽనేన వ్రజపతే సాధవో దస్యు పీడితాః ।
అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యూన్ సమేధితాః ॥
గోకులమునకు ప్రభువగు ఓ నందా! పూర్వము అరాచకమేర్పడినప్పుడు చోరులు సత్పురుషులసు దోచుకొనుచుండిరి. అప్పుడు ఈతడు వారిని రక్షించి వారికి బలమును కలుగజేసెను.
య ఏతస్మిన్మహాభాగాః ప్రీతిం కుర్వంతి మానాబాః ।
నారయెఽభిభవంత్యేతాన్ విష్ణు పక్షావివాసురాః॥
విష్ణుపక్షీయులైన దేవతలను రాక్షసులు ఏమీ చేయలేరు. అదే విధముగా, ఏ మానవులైతే ఈతనియందు ప్రేమను కలిగియుండురో, వారు గొప్ప భాగ్యవంతులు. వీరిని శత్రువులు పరాభవించలేరు.
తస్మాన్నంద కుమారోఽయం నారాయణసమో గుణైః ।
శ్రియా కీర్త్యాఽనుభావేన తత్కర్మసు న విస్మయః ॥
ఓ నందా! కాబట్టి, ఈ పిల్లవాడు గుణములు, శోభ, కీర్తి, మహిమలలో నారాయణునితో సమానమైనవాడు. ఆతని లీలలలో ఆశ్చర్యము లేదు.
ఇత్యద్ధా మాం సమాదిశ్య గర్గేచ స్వగృహం గతే ।
మన్యే నారాయణస్యాంశం కృష్ణమక్లిష్ట కారిణమ్ ॥
సాక్షాత్తు గర్గాచార్యుడు ఈ విధముగా నాకు ఉపదేశించి తన యింటికి వెళ్లెను. తన లీలలచే మన కష్టములను పోగొట్టే ఈ శ్రీకృష్ణుడు నారాయణుని అవతారమని నేను తలంచుచున్నాను.
ఇతి నందవచశ్శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః ।
దృష్టశ్రుతానుభావాస్తే కృష్ణ స్యామితతేజసః ।
ముదితా నందమానర్చుః కృష్ణం చ గతవిస్మయాః ॥
ఈ విధముగా గర్గుని ఉపదేశమును నందుని మాటల ద్వారా విన్న గోకులవాసులకు ఆశ్చర్యము తొలగిపోయినది. వారు అనంతశక్తియగు శ్రీకృష్ణుని మహిమలను చూచినవారు, విన్నవారే. వారు ఆనందముతో నందుని, శ్రీకృష్ణుని కూడ పూజించిరి.
దేవే వర్షతి యజ్ఞవిప్లవరుషా వజ్రాశ్మవర్షానిలైః
సీదత్పాలపశుస్త్రి ఆత్మశరణం దృష్ట్వాఽనుకంప్యుత్స్మయన్ ।
ఉత్పాట్యైకక రేణ శైలమబలో లీలోచ్ఛిలీంధ్రం యథా
బిభ్రద్గోష్ఠ మపాన్మ హేంద్రమదభిత్ ప్రీయాన్న ఇంద్రో గవామ్ ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
పూర్వార్ధే షడ్వింశోఽధ్యాయః ॥
ఇంద్రునకు తనను ఆరాధించే యజ్ఞమును ఆపివేయుట వలన కోపము వచ్చి సుడిగాలితో పాటుగా పిడుగులను, వడగళ్లను, వర్షధారలను వర్షించెను. అప్పుడు గోకులములోని గోపాలకులు, పశువులు, స్త్రీలు పీడను పొందిరి. వారికి శ్రీకృష్ణుడే రక్షకుడు. ఆయన వారిని చూచి దయ గలవాడై చిరునవ్వుతో, బలము లేని పిల్లవాడు కుక్క గొడుగును అవలీలగా పట్టుకున్న విధముగా, పర్వతమును ఒకే చేతితో ఊడబెరకి పట్టుకొని గోకులమును కాపాడెను. ఆ విధముగా ఆయన ఇంద్రునకు గర్వభంగమును చేసెను. అట్టి గోవిందుడు మన యెడల ప్రీతిని జెందు గాక!
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో గోపాలకులు నందునితో శ్రీకృష్ణుని గురించి
చర్చించుటను వర్ణించే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).
Summary of chapter 26 of the Bhāgavata Mahā Purana is as follows:
Astonished by the lifting of Govardhana Hill and the destruction of giant demons, Nanda Mahārāja and the cowherds met to discuss Kṛshṇa's true nature. They marveled how a seven-year-old boy could lift a mountain and defeat monsters that terrified devatās. Nanda Mahārāja recalled the confidential prophecy delivered by Garga Muni during the naming ceremony: that this child possesses divine opulences equal to Bhagavān Nārāyaṇa and would save Gokula from all perils. Reassured by Garga Muni's words, the cowherds abandoned all doubt, embracing Kṛshṇa with deepened love and affection as their supreme protector.