భాగవత మహా పురాణము
4- యోగమాయ కంసునినుండి తప్పించుకొనుట
శ్రీశుక ఉవాచ ।
బహిరంతఃపురద్వారాస్సర్వాః పూర్వవదావృతాః ।
తతో బాలధ్వనిం శ్రుత్వా గృహపాలాస్సముత్తితాః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నగరమునకు లోపల, బయట కూడ ద్వారములన్నీ ముందులో వలెనే మూయబడి యుండెను. ఇంతలో (కుక్కల వంటి) కారాగార రక్షకులు శిశువు ఏడ్చిన ధ్వని విని నిద్ర లేచిరి.
తే తు తూర్ణముపప్రజ్య దేవక్యా గర్బజన్మ తత్ ।
ఆచఖ్యుర్భోజరాజాయ యదుద్విగ్నః ప్రతీక్షతే ॥
ఆ రక్షకభటులైతే వెంటనే భోజప్రభువగు కంసుని వద్దకు వెళ్లి ఆ (ఎనిమిదవ పర్యాయము) గర్భవతియగు దేవకి ప్రసవించిన విషయమును విన్నవించిరి. ఆతడు ఆ క్షణము కొరకే ఆదుర్దాతో వేచి చూచుచుండెను.
స తల్పాత్తూర్ణముత్థాయ కాలోఽయమితి విహ్వలః ।
సూతీగృహమగాత్తూర్ణం ప్రస్థలన్ముక్తమూర్ధజః ॥
ఈ శిశువు నాకు మృత్యువు (ఈ శిశువును మట్టు పెట్టే సమయమిదియే) అని కంగారు పడుతూ ఆ కంసుడు ప్రక్కమీదనుండి పైకి లేచి తూలుతూ (అపశకునము) వేంటనే పురిటి గదికి వెళ్లాను. ఆతని జుట్టు రేగిపోయి ఉండెను.
తమాహ భ్రాతరం దేవీ కృపణా కరుణం సతీ ।
స్ను షేయం తవ కల్యాణ స్త్రీయం మా హంతుమర్హసి ॥
పతివ్రతయగు దేవకీదేవి దీనురాలై యుండెను. ఆమె అన్నగారగు కంసునితో జాలి కలిగే విధముగా ఇట్లు పలికెను -- ఓయీ మంగళకరుడా! ఈ అమ్మాయి నీ (మేనకోడలు. ఆడపిల్లను చంపుట నీకు తగదు.
బహవో హింసితా భ్రాతశ్శిశవః పావకోసమాః ।
త్వయా దైవనిసృష్టేన పుత్రికైకా ప్రదీయతామ్ ॥
అన్నా! (మా) ప్రారబ్ధము ప్రేరేపించగా నీవు నిప్పులాంటి పిల్లలను
నన్వహం తే హ్యవరజా దీనా హతసుతో ప్రభో ।
దాతుమర్హసి మందాయా అంగేమాం చరమాం ప్రజామ్ ॥
ఓ రాజా! నా పుత్రులు చంపబడిరి. దీనురాలనగు నేను నీకు చెల్లెలిని గదా! అన్నా! అభాగ్యురాలగు నాకు ఈ ఆఖరి సంతానమైన అమ్మాయిని విడిచి పెట్టుట నీకు యోగ్యముగా నుండును.
శ్రీశుక ఉవాచ ।
ఉపగుహ్యాత్మజాయేవం రుదత్యా దీనదీనవత్ ।
యాచితస్తాం వినిర్భర్త్య హస్తాదాచిచ్ఛిదే ఖలః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఆమె ఈ విధముగా ఏడుస్తూ పిల్లను దగ్గరగా పమిటలో దాచుకొని దీనాతిదీనముగా కోరెను. ఆ దుష్టుడు బలముగా త్రోసి చేతినుండీ ఆ శిశువును లాగివేసెను.
తాం గృహీత్వా చరణయోర్జాతమాత్రాం స్వసుసుతామ్ ।
అపోథయచ్ఛిలాపృష్ఠే స్వార్థోన్మూలితసౌహృదః ॥
స్వార్థముచే కంసుని హృదయములోని ప్రేమ నిర్మూలితమయ్యెను. ఆతడు చెల్లెలికి అప్పుడే పుట్టిన ఆ అమ్మాయిని రెండు కాళ్లను పట్టుకొని రాతి పైభాగముపై వేసి కొట్టెను.
సా తద్దస్తాత్సముత్పత్య సద్యో దేవ్యంబరం గతా ।
అదృశ్యతాఽనుజా విష్ణోస్సాయుధాకష్టమహాభుజా ॥
శ్రీహరి తరువాత జన్మించిన ఆ అమ్మాయి వెంటనే దేవియే. వాని చేతినుండి బాగా పైకి యెగిరి ఆకసమును చేరెను. ఆమె ఎనిమిది గొప్ప భుజములు, ఆయుధములు గలదియే కానవచ్చెను.
దివ్యసగంబరాలేపరత్నాభరణభూషితా ।
ధనుశ్శూలేషుచర్మాసిశంఖచక్రగదాధరా ॥
ఆ దేవి దివ్యమైన వస్త్రములను దాల్చి, మాలలను, రత్నములు పొదిగిన ఆభరణములను అలంకరించుకొనెను. ఆమె చందనము మొదలైన ఆలేపములను వినియోగించెను. ధనుస్సు, బాణములు, శూలము, కవచము, కత్తి, శంఖము, చక్రము, గదలను ఆమె (ఎనిమిది చేతులలో) ధరించెను.
సిద్దచారణగంధర్వైరప్సరఃకిన్నరోరగైః ।
ఉపాహృతోరుబలిభిః స్తూయమానేదమబ్రవీత్ ॥
సిద్ధులు, చారణులు, గంధర్వులు, అప్సరసలు, కిన్నరులు, నాగులు గొప్ప ఉపహారములను తీసుకువచ్చి ఆమెను స్తుతించుచుండిరి. ఆమే (కంసునితో) ఇట్లు పలికెను.
కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్ ।
యత్ర క్వ వా పూర్వశత్రుర్మా హింసీః కృపణాన్ వృథా ॥
ఓరీ మూర్ఖా! నన్ను చంపి యేమి లాభము? నిన్ను మట్టుబెట్టే నీ పూర్వశత్రువు ఎక్కడో ఒకచోట జన్మించియే యున్నాడు. నీవు వ్యర్థముగా దీనులను హింసించకుము.
ఇతి ప్రభాష్య తం దేవీ మాయా భగవతీ భువి ।
బహునామని కేతేషు బహునామా బభూవ హ ॥ ।
భగవానుని యోగమాయయగు ఆ దేవి కంసునితో ఈ విధముగా గంభీరముగా పలికెను. ఆమె భూలోకములో (కాశీ మొదలైన) వేర్వేరు స్థానములయందు (విశాలాక్షి మొదలైన) వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి గాంచెను.
తయాఽభిహితమాకర్ణ్య కంసః పరమస్మితః ।
దేవకీం వసుదేవం చ విముచ్య ప్రశ్రితోఽబ్రవీత్ ॥
ఆ దేవి చెప్పిన మాటను విన్న కంసుడు మిక్కుటమగు అచ్చెరువును పొందెను. ఆతడు దేవకీవసుదేవులను విడిచి పెట్టి వినయముతో నిట్లనెను.
అహో భగిన్యహో భామ మయా వాం బత పాప్మనా ।
పురుషాద ఇవాపత్యం బహవో హింసీతాస్సుతాః ॥
అయ్యో! అయ్యో! కష్టము! ఓ చెల్లీ! బావా! పాపినగు నేను మీ ఇద్దరి సంతానమైన చాలమంది కొడుకులను నరమాసంభక్షకుని వలే చంపితిని.
స త్వహం త్యక్తకారుణ్యస్త్యక్తజ్ఞాతిసుహృజ్జలః ।
కాంల్లోకాన్ వై గమిష్యామి బ్రహ్మ హేవ మృతశ్శ్వసన్ ॥
దయను త్రోసిపుచ్చి బంధువులను మిత్రులను విడిచి పెట్టిన దుష్టుడను నేను. అట్టి నేను ఏ నరకలోకములను పొందేదనో! బ్రహ్మహత్య చేసినవాడు వలె నేను గాలిని పీల్చుచున్ననూ చచ్చినవానితో సమానమే.
దైవమప్యనృతం వక్తి న మర్త్యా ఏవ కేవలమ్ ।
యద్విశ్రంభాదహం పాపస్స్వసుర్నిహతవాష్ఛశూన్ ॥
కేవలము మనుష్యులే కాదు, దైవము కూడ అసత్యమును చెప్పును. ఆ దైవము యొక్క మాటను నమ్మి, పాపినగు నేను పిల్లలను చంపితిని.
మా శోచతం మహాభాగావాత్మజాన్ స్వకృతంభుజః ।
జంతవో న సదైకత్ర దైవాధీనాస్త్రదాఽఽసతే ॥
ఓ మహాత్ములారా! పుత్రులు తమ ప్రారబ్దముననుభవించెదరు. వారిని గురించి శోకించకుడు. దైవవశవర్తులై ఉండే ప్రాణులు అన్ని వేళలా ఒక్కచోట యుండరు; ఉన్నచోటనైననూ కలిసి ఉండరు (విడిపోయెదరు).
భువి భౌమాని భూతాని యథా యాంత్యపయాంతి చ ।
నాయమాత్మా తథైతేషు విపర్యేతి యథైవ భూః ॥
ఈ లోకములో మట్టితో కుండ మొదలైనవి తయారై, మరల అవి శిథిలమగును. కానీ మట్టి స్థిరముగా నుండును. అదే విధముగా, దేహములు పుట్టి గిట్టుచున్ననూ, ఈ ఆత్మ వికారములను పొందదు.
యథాఽనేవంవిదో భేదో యత ఆత్మవిపర్యయః ।
దేహయోగవియోగౌ చ సంసృతిర్న నివర్తతే ॥
ఆత్మ అవికారి అనే ఈ సత్యమునీ విధముగా ఎవడైతే తెలుసుకోడో, వానికి అనాత్మలగు దేహాదులయందు ఆత్మబుద్ధి కలుగును. దాని వలన తాను సర్వమునుండి విడివడి ఉన్నాననే భేదబుద్ది కలుగును. దాని వలన ఆతడు దేహముతో సంయోగవియోగములను (పుట్టుక-చావులను) పొందుచుండును. అట్టి అజ్ఞానికి ఈ సంసారము తొలగిపోదు.
తస్మాద్బద్రే స్వతనయాన్మయా వ్యాపాదితానపి ।
మానుశ్చ యతస్సర్వస్వకృతం విందతేఽవశః ॥
ఓ కల్యాణీ! నేను నీ పుత్రులను చంపిన మాట యథార్థమే. ఐననూ, నీవు వారిని గురించి శోకించకుము. ఎందుకంటే, ఏ ప్రాణికైననూ సుఖదుఃఖముల విషయములో స్వాతంత్యము లేదు. ప్రతి ప్రాణి తన కర్మఫలమును మాత్రమే పొందుచుండును.
యావద్ధతోస్మి హంతాఽస్మీత్యాత్మానం మన్యతేస్వదృక్ ।
తావత్తదభీమాన్యజ్ఞో బాధ్యబాధకతామియాత్ ॥
ఆత్మస్వరూపమునెరుంగని వ్యక్తి ఇతరులు తనను పీడించినారనియు, తాను ఇతరులను పీడించినాననియు తలపోయును. ఎంతవరకైతే, అజ్ఞాని ఆ విధముగా దేహమే తాననే అభిమానమును కలిగియుండునో, అంతవరకు ఇతరులచే పీడించబడును, తాను ఇతరులను పీడించును.
క్షమధ్వం మమ దౌరాత్మ్యం సాధవో దీనవత్సలాః ।
ఇత్యుక్త్వాఽశ్రుముఖః పాదౌ శ్యాలస్స్వసోరథాఽగ్రహీత్ ॥
నేను దుర్బుద్ధిని, నన్ను క్షమించుడు, సత్పురుషులు దీనులపై ప్రేమను చూపించెదరు, అంటూ వసుదేవుని బావమరది యగు కంసుడు కళ్ల వెంబడి నీళ్లు పెట్టుకొనెను. తరువాత ఆతడు చెల్లి-బావల రెండు కాళ్లను పట్టుకోనెను.
మోచయామాస నిగడాద్విశ్రబ్దః కన్యకాగిరా ।
దేవకీం వసుదేవం చ దర్శయన్నాత్మసౌహృదమ్ ॥
యోగమాయ చెప్పిన మాటను బట్టి దేవకీవసుదేవులయందు తప్ప లేదని కంసుడు నమ్మెను. ఆతడు తన ప్రేమను చూపుతూ వారిద్దరిని సంకెళ్లనుండి విడిపింప జేసెను.
భ్రాతుస్సమనుతప్తస్య క్షాంత్వా రోషం చ దేవకీ ।
వ్యసృజద్వసుదేవశ్చ ప్రహస్య తమువాచ హ ॥
అన్నయగు కంసుని అధికమగు పశ్చాత్తాపమును చూచి దేవకి వానిని క్షమించి, కోపమును విడిచి పెట్టెను. వసుదేవుడు కూడ నవ్వి కంసునితో నిట్లనెను.
ఏవ మేతన్మహాభాగ యథా వదసీ దేహినామ్ ।
అజ్ఞానప్రభవాఽహంథీస్స్వపరేతి భిదా యతః ॥
ఓ మహాత్మా! నీవు చెప్పినది యథార్థమే. ప్రాణులయందు అజ్ఞానము వలన నేను అనే భేదబుద్ది ఉండును. దాని వలననే, వ్యక్తి తనవాడు, పరాయి వాడు అనే భేదమును చూపును.
శోకహర్షభయద్వేషలోభమోహమదాన్వితాః ।
మిథో ఘ్నంతం న పశ్యంతి భావైర్భావం పృథగ్దృశః II
భేదదృష్టి గల జనులు శోకము, హర్షము, ద్వేషము, లోభము, వ్యామోహము, గర్వములతో కూడియుందురు. కాలరూపుడగు ఈశ్వరుడు ఒక ప్రాణిని నిమిత్తముగా చేసి మరియొక ప్రాణిని మట్టుబెట్టును. ఈ సత్యమును ఆ జనులు తెలియ లేరు.
శ్రీశుక ఉవాచ ।
కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషితః । దేవకీవసుదేవాభ్యామనుజ్ఞాతోఽవిశద్గృహమ్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దేవకీవసుదేవులీ విధముగా ప్రసన్నమనస్కులై కంసునకు నిష్కపటమగు ఉత్తరమునిచ్చిరి. అపుడాతడు వారి వద్ద సెలవు తీసుకొని తన ప్రాసాదమునకు వెళ్లాను.
తస్యాం రాత్య్రాం వ్యతీతాయాం కంస ఆహూయ మంత్రిణః ।
తేభ్య ఆచష్ట తత్సర్వం యదుక్తం యోగనిద్రయా ॥
ఆ రాత్రి గడచెను. ఆ మరునాడు కంసుడు మంత్రులను పిలిచి, తనతో యోగమాయ ఏ మాటలను పలికెనో, వాటినన్నింటినీ వారికి వివరించెను.
ఆకర్ణ్య భర్తర్గదితం తమూరుర్దేవశత్రవః ।
దేవానతి కృతామర్షా దైతేయా నాతికోవిదాః ॥
దేవతలపై శత్రుత్వమును నెర పే ఆ దితిపుత్రులకు తెలివితేటలు (ధర్మాధర్మవిచారము) తక్కువ. కంసప్రభువు మాటను విని వారికి దేవతలపై కోపము వచ్చెను. వారు ఆతనితో నిట్లనిరి.
ఏవం చేత్తర్హి భోజేంద్ర పురగ్రామప్రజాదిషు ।
అనిర్ధశాన్నిర్దశాంశ్చ హనిష్యామోహఽద్య వై శిశూన్ ॥
ఓ భోజరాజా! పరిస్థితి. ఇట్లున్న పక్షములో మనము నగరములలో, గ్రామములలో, గొల్లపల్లెలలో, ఇంకనూ ఇతరస్థానములలో పిల్లలను, వారికి పది రోజుల వయస్సు దాటినా దాటకున్నా, చంపి వేసెదము.
కిముద్య మైః కరిష్యంతి దేవాస్సమరభేరవః ।
నిత్యముద్విగ్నమనసో జ్యా ఘోషైర్ధనుషస్తవ ॥
దేవతలకు యుద్దమంటే భయము. నీ నారి త్రాటి శబ్దములకు వారి మనస్సు ఎల్లవేళలా ఆందోళనతో నిండిపోవును. వారు యుద్ధోద్యమముల ద్వారా ఏమి సాధించెదరు?
అస్యత స్తే శరవాతైరన్యమానాస్సమంతతః ।
జిజీవిషవ ఉత్సృజ్య పలాయనపరా యయుః ॥
(ఒకప్పుడు) నీవు బాణములను గుంపులుగా ప్రయోగించి అన్ని వైపులనుండియు కొట్టుచుండగా, దేవతలు బ్రదుకు దీపీతో యుద్దమును విడిచి పెట్టిరి. వారు పలాయనమే బ్రదికే ఉపాయమని తలచి పరుగెత్తిరి.
కేచిత్ప్రాంజలయో దీనా న్యస్తశస్తా దివౌకసః ।
ముక్తకచ్ఛశిఖాః కేచిద్భీతాస్స్మ ఇతి వాదినః ॥
(ఆ యుద్ధములో) స్వర్గవాసులగు కొందరు దేవతలు ఆయుధములను విడిచి పెట్టి దీనముగా చేతులు జోడించిరి. మరికొందరి పంచకట్టులు, జుట్టుముడులు విడిపోతూంటే, మాకు భయం వేస్తోంది, అని పలికిరి.
న త్వం విస్మృతశస్త్రాస్తాన్ విరథాన్ భయసంవృతాన్ ।
హంసన్యాసక్తవిముఖాన్ భగ్నచాపానయుధ్యతః ॥
ఆయుధప్రయోగమును అస్త్రమంత్రమును మరిచిపోయినవారిని, రథము లేనివారిని, భయముతో నిండియున్నవారిని, మరియొకనితో యుద్దము చేయుచున్నవారిని, యుద్ధమునుండి వెనుదిరుగుచున్నవారిని, ధనుస్సు విరిగిపోయినవారిని, యుద్ధము మానివేసినవారిని నీవు చంపవు.
కిం క్షేమశూరైర్విబుదైరసంయుగవికత్థనైః ।
రహోజుషా కిం హరిణా శంభునా వా వనౌకసా ॥
కిమింద్రేణాలవీర్యేణ బ్రహ్మణా వా తపస్యతా ।
భయము లేని చోట దేవతలు శూరులు. యుద్దము లేనప్పుడు యుద్దము లేని చోట వారు బీరాలు పలికెదరు. విష్ణువు పాల సముద్రమువంటి రహస్యస్థానములో నివసించును. శివుడు అడవిలో నివసించును. ఇంద్రుని పరాక్రమము అల్పము. బ్రహ్మదేవుడు తపస్సు చేసుకొనుచుండును. వీరి వలన మనకు కలిగే ముప్పు ఏమి ఉండును?
తథాఽపి దేవాస్సాపత్న్యాన్నో పేక్ష్యా ఇతి మన్మ హే ।
తతస్తన్మూలఖననే నియుంక్ష్వాస్మాననువ్రతాన్ ॥
యథాఽఽమయోంఽగే సము పేక్షితో నృభిః
న శక్యతే రూఢపదశ్చికిత్సితుమ్ ।
యథేంద్రియగ్రామ ఉపేక్షితస్తథా
రిపుర్మహాన్బద్ధబలో న చాల్యతే ॥
దేహములోని అవయవమునందలి వ్యాధిని ఉపేక్షి స్తే అది ఆ అవయవమునందు గట్టిగా నాటుకొనును. అప్పుడు మానవులు దానికి చికిత్సను చేయజాలరు. ఇంద్రియముల సమూహమును ముందుగా ఉపేక్షించినచో, తరువాత వాటిని నియమించుట సంభవము కాదు. అదే విధముగా శత్రువును ఉపేక్షించినచో, ఆతడు నాటుకున్న బలము గలవాడై పెద్దవాడగును. అప్పుడా శత్రువును చలింప జేయుట శక్యము కాదు.
మూలం హి విష్ణుర్దేవానాం యత్ర ధర్మసనాతనః ।
తస్య చ బ్రహ్మ గోవిప్రాస్తపో యజ్ఞాస్సదక్షిణాః ॥
దేవతలకు మూలము విష్ణువే గదా! ఎక్కడనైతే కాలాతీతమగు ధర్మము ఉండునో, విష్ణువు అక్కడ ఉండును. వేదము, గోవులు, వేదవేత్తలు, తపస్సు, దక్షిణలతో కూడిన యజ్ఞములు కూడ ఆ ధర్మమునకు మూలములు.
తస్మాత్సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదినః ।
తపస్వినో యజ్ఞశీలాన్ గాశ్చ హన్మోహవిర్దుష్ఠః ॥
ఓ రాజా! కాబట్టి, వేదములనుపదేశించే వేదవేత్తలను, యజ్ఞములననుష్ఠించే స్వభావము గల తపశ్శాలురను, హోమధనములైన పాలను ఇచ్చే ఆవులను కూడా పూర్తి ప్రయత్నము చేసి అన్ని ప్రకారములుగా మట్టు బెట్టెదము.
విప్రా గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్శమః ।
శ్రద్ధా దయా తీతిక్షా చ క్రతవశ్చ హరేస్తనూః ॥
వేదవేత్తలు, గోవులు, వేదములు, తపస్సు, సత్యము, బా హ్యేంద్రీయ నిగ్రహము, మనోనిగ్రహము, శ్రద్ధ, దయ, సహనము, మరియు యజ్ఞములు శ్రీహరికి శరీరమువంటివి.
స హి సర్వసురాధ్యక్షో హ్యసురద్విడ్గుహాశయః ।
తన్మూలా దేవతాస్సర్వా సేశ్వరాస్సచతుర్ముఖాః ।
అయం వై తద్వధోపాయో యదృషీణాం విహింసనమ్ ॥
ఎందుకంటే, ఆ విష్ణువు సకలదేవతలకు ప్రభువు. బుద్ధిగుహ యందుండే రాక్షసద్వేషి ఆతడే గదా! శివునితో సహా, బ్రహ్మ దేవునితో సహా సకల దేవతలకు ఆశ్రయమాతడే. ఆ విష్ణువును నిశ్చయముగా వధించే ఉపాయమేదనగా, మహర్షులను అధికముగా హింసించుటయే.
శ్రీశుక ఉవాచ ।
ఏవం దుర్మంత్రిభిః కంసస్పహ సంమంత్య్ర దుర్మతిః ।
బ్రహ్మహింసాం హితం మేనే కాలపాశావృత్వోఽసురః॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- దుర్బుద్ధియగు కంసాసురుడు మృత్యువుయొక్క పాశముచే కప్పివేయబడి యుండెను. ఆతడీ విధముగా దుష్టులగు మంత్రులతో సలహా చేసి, వేదవేత్తలను హింసించుట తనకు హితకారి యని తలచేను.
సందిశ్య సాధులోకస్య కదనే కదనప్రియాన్ ।
కామరూపధరాన్ దీక్షు దానవాన్ గృహమావిశత్ ॥
దిక్కులన్నింటియందలి సత్పురుషుల సమాజములకు దుఃఖమును కలిగించే పనియందు ఆతడు రాక్షసులను నియోగించి, తన ప్రాసాదమునందు ప్రవేశించెను. కోరిన రూపములను దాల్చగలిగే ఆ రాక్షసులకు పరపీడనమన్నచో ప్రీతి మెండు.
తే వై రజఃప్రకృతయస్తమసా మూఢచేతసః ।
సతాం విద్వేషమాచేరురారాదాగతమృత్యవః ॥
రజోగుణ (కామక్రోధాది) స్వభావము గల ఆ రాక్షసుల బుద్ధి అజ్ఞానముచే వ్యామోహితమై యుండెను. నిశ్చయముగా చావు దగ్గర పడిన ఆ రాక్షసులు సత్పురుషులకు హానిని కలిగించ జొచ్చిరి.
ఆయుశ్శ్రియం యశో ధర్మం లోకానాశిష ఏవ చ ।
హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే చతుర్థోఽధ్యాయః ॥
మానవుడు మహాత్ములను అనాదరము చేయుట వలన ఆయుష్టును, సంపదను, కీర్తిని, పుణ్యలోకములను, పుత్రాది కామ్యములను, సకలశ్రేయస్సులను కూడ కోల్పోవును.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో యోగమాయ కంసునినుండి తప్పించుకొనుటను వర్ణించే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
Summary of chapter 4 of the Bhāgavata Mahā Purana is as follows:
Vasudeva returned to the Mathurā prison cell with the newborn female infant. When the prison guards alerted Kaṁsa that Devakī had given birth, the tyrant rushed into the cell and seized the child by her feet, attempting to dash her against a stone slab. However, the infant slipped from his grasp, rose into the sky, and manifested her divine eight-armed form as the goddess Durgā (Yoga-māyā). Holding weapons in her hands, she announced to Kaṁsa that his deliverer and slayer had already been born elsewhere in the world. Stunned and terrified, Kaṁsa released Vasudeva and Devakī, apologizing for his cruelty. However, the next morning, advised by his wicked asuric ministers, Kaṁsa initiated a ruthless campaign ordering his demonic agents to search every village and execute all newborn infants throughout the kingdom.