భాగవత మహా పురాణము
15 - ధేనుకాసురుని ఉద్ధరించుట
శ్రీశుక ఉవాచ ।
తతశ్చ పౌగండవయశ్శ్రితౌ వ్రజే
బభూవతుస్తా పశుపాలసమ్మతొ ।
గాశ్చారయంతో సఖ్భిస్సమం పదైః
బృందావనం పుణ్యమతీవ చక్రతుః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- తరువాత బలరామకృష్ణులిద్దరి వయస్సు ఆరు సంవత్సరములు దాటెను. అప్పుడు నందాదులు వారికి (దూడలు మాత్రమే కాకుండా) పశువులను కాసే పనిని అప్పజెప్ప వచ్చునని స్వీకరించిరి. వారిద్దరు మిత్రులతో కలిసి గోవులను మేపుతూ తమ కాలి అడుగులతో బృందావనమును మిక్కిలి పవిత్రముగా చేసిరి,
తన్మాధవో వేణుముదీరయన్వృతో గోపైర్గృణద్భిస్స్వయశో బలాన్వితః
పశూన్పురస్కృత్య పశవ్యమావిశద్విహర్తుకామః కుసుమాకరం వనమ్! ।
లక్ష్మీపతియగు శ్రీకృష్ణ భగవానుడు పశువులు ముందు నడువగా బలరామునితో గూడి పిల్లన గ్రోవిని ఊదుకుంటూ పుష్పముల గనియగు ఆ బృందావనమును ప్రవేశించెను. ఆ వనము పశువులకు హితకరమైనది. గోపబాలకులు, విహరించగోరే ఆ బాలకృష్ణుని చుట్టూ చేరి ఆయన కీర్తిని గానము చేయుచుండిరి.
తన్మంజు ఘోషాలిమృగద్విజాకులం మహన్మనఃప్రఖ్యయస్సరస్వతా।
వాతేన జుష్టం శతపత్రగంధినా నిరీక్ష్య రంతుం భగవాన్మనో దధే ॥
మధురమగు ధ్వనులను చేసే తుమ్మెదలు, లేళ్లు, పక్షులతో హడావుడిగానున్న ఆ బృందావనమును చూచి శ్రీకృష్ణ భగవానుడు విహరించుటకు నిశ్చయించెను. అచటి సరస్సులలోని నీరు మహాత్ముల మనస్సును పోలి (స్వచ్చముగా) యుండెను. గాలి ఆ నీళ్ల పైనుండి వస్తూ పద్మముల సుగంధమును మోసుకువచ్చి ఆ వనమును సేవించుచుండెను.
స తత్ర తత్రారుణపల్లవశ్రియా
ఫలప్రసూనోరుభ రేణ పాదయోః ।
స్పృశచ్ఛిఖాన్వీక్ష్య వనస్పతీన్ముదా
స్మయన్నివాహాగ్రజమాదాపూరుషః ॥
సర్వజగత్కారణుడు, పూర్ణుడు అగు ఆ శ్రీకృష్ణుడు అక్కడక్కడ చెట్ల ఎర్రని చిగుళ్ల శోభకు ఆనందించేను. అధికమగు పళ్ల మరియు పువ్వుల బరువుతో వంగి కొమ్మల కొనలతో తన పాదములను స్పృశించే చెట్లను చూచి విస్మితుడాయెనా యన్నట్లు ఆయన అన్నగారితో నిట్లనెను.
శ్రీభగవానువాచ ।
అహో అమీ దేవవరామరార్చితం
పాదాంబుజం తే సుమనఃఫలార్హణమ్ ।
నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః
తమోఽపహత్యై తరుజన్మ యత్కృతమ్ ॥
శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- ఓ దేవశ్రేష్టా! ఆహా! ఈ చెట్లు తమకు ఏ పాపమైతే చెట్టు జన్మనిచ్చినదో ఆ పాపమును పోగొట్టుకొనుటకై పువ్వులు, పళ్లు అనే పూజాసామగ్రిని సమర్పించి, దేవతలు పూజించే నీ పద్మమువంటి పాదమునకు కొమ్మలతో నమస్కరించుచున్నవి. ఇవి ఈ భాగ్యము కొరకే చేట్టు జన్మనెత్తినవి.
ఏతేఽలినస్తవ యశోఽఖిలలోకతీర్థం
గాయంత ఆదిపురుషానుపదం భజంతే ।
ప్రాయో అమీ మునిగణా భవదీయముఖ్యా
గూఢం వన్వేఽపి న జహత్యనఘాత్మ దైవమ్ ॥
అన్నా! దోషములు లేని నీవు జగత్కారణమగు పూర్ణ బ్రహ్మవే. సకలలోకములను పావనము చేసే నీ కీర్తిని గానము చేస్తూ ఈ తుమ్మెదలు నిన్ను అడుగడుగునా సేవించుచున్నవి. ఇవి బహుశః నీ భక్తులలో అగ్రగణ్యులగు మహర్షుల గణములు కాబోలు. వారు అడవిలో రహస్యముగా ఉన్నా తమ దైవమగు నిన్ను విడిచి పెట్టుట లేదు.
నృత్యంత్యమీ శిఖిన ఈడ్య ముదా హరిణ్యః
కుర్వంతి గోప్య ఇవ తే ప్రియమీక్షణేన ।
సూక్తైశ్చ కోకిలగణా గృహమాగతాయ
ధన్యా వనౌకస ఇయాన్ హి సతాం నిసర్గః ॥
కొనియాడదగిన ఓ రామా! ఈ నెమళ్లు ఆనందముతో నాట్యమాడుచున్నవి. లేళ్లు గోపికలు వలె చూపుతో, మరియు కోకిలల గుంపులు మధురమగు కూతలతో ఇంటికి విచ్చేసిన నీకు ప్రీతిని కలిగించుచున్నవి. అడవిలో నివసించే ప్రాణులు కృతార్థులు. ఎందుకంటే, సత్పురుషుల స్వభావము ఇట్టిది (అతిథిని సత్కరించుట).
ధన్యేయమద్య ధరణీ తృణవీరుధస్త్వత్
పాదస్పృశో ద్రుమలతాః కరజాభిమృష్టాః ।
నద్యోఽద్రయః ఖగమృగాస్సదయావలోకైః
గోప్యోంఽతరేణ భుజయోరపి యత్స్పృహా శ్రీః ॥
ఈనాడు నీ పాదస్పర్శచే ఈ భూమి, గడ్డి, మొక్కలు, నీ చేతి వ్రేళ్ల స్పర్శచే చెట్లు, తీగలు, దయతో కూడిన నీ చూపులచే నదులు, పర్వతములు, పక్షులు, పశువులు, నీ వక్షఃస్థలమును స్పృశించుటచే గోపికలు కూడ ధన్యులైరి. నీ వక్షఃస్థలమును స్పృశించవలెనని లక్ష్మీదేవి కూడ కోరుచుండును.
శ్రీశుక ఉవాచ ।
ఏవం బృందావనం శ్రీమత్కృష్ణః ప్రీతమనాః పశూన్ ।
రేమే సంచారయన్నద్రేస్సరిద్రోధస్సు సానుగః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా శ్రీకృష్ణుని మనస్సు శోభాయుక్తమగు బృందావనమును చూచి చాల ప్రీతి జెందెను. ఆయన అనుచరులతో గూడి గోవర్ధన పర్వతమునకు సమీపములో యమునానదీతీరములయందు పశువులను బాగుగా మేపుతూ విహరించెను.
క్వచిద్గాయతి గాయత్సు మదాంధాలిష్వనువ్రతైః ।
ఉపగీయమానచరితస్స్రగ్వీ సంకర్షణాన్వితః ॥
శ్రీకృష్ణుని వెంట ఉండే గోపబాలకులు ఆయన చరితమును గానము చేయుచుండిరి. తేనెతో మత్తెక్కి తుమ్మెదలు ధ్వనిని చేయుచుండగా, బలరామునితో గూడి వనమాలను దాల్చియున్న ఆ శ్రీకృష్ణుడు ఒకప్పుడు తాసు కూడ వాటితో స్వరము కలిపి పాడును.
క్వచిచ్చ కలహంసానామనుకూజతి కూజితమ్ ।
అభినృత్యతి నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్ ॥
నురియొకప్పుడు శ్రీకృష్ణుడు రాజహంసల కూతను అనుకరిస్తూ కూయును. ఒకప్పుడు నాట్యమాడుచున్న నెమలి ఎదురుగా నాట్యమాడి గోపబాలకులను నవ్వించును.
మేఘగంభీరయా వాచా నామభిర్దూరగాన్ పశూన్ ।
క్వచిదాహ్వయతి ప్రీత్యా గోగోపాలమనోజ్ఞయా ॥
ఒకప్పుడు ఆయన మేఘగర్జన వలే గంభీరమైన వాక్కుతో దూరమునకు వెళ్లిన పశువులను వాటి పేర్లతో పిలుచును. ఆయన వాక్కు గోవులకు, గోపబాలకులకు మనోహరముగా నుండును.
చకోరక్రౌంచచక్రాహ్వభారద్వాజాంశ్చ బర్హిణః ।
అనురౌతి స్మ సత్త్వానాం భీతవద్వ్యాఘ్రసింహయోః ॥
ఆయన వెన్నెల పక్షి, కొంగ, చక్రవాక (జక్కవ) పక్షి, ఏట్రింత పక్షి, నెమళ్లను అనుకరిస్తూ కూయును. జంతువులలో పెద్దపులి, సింహముల గాండ్రింపులను విని భయపడినవాడు వలే పరుగెత్తును.
క్వచిత్క్రీడాపరిశ్రాంతం గోపోత్సంగోపబర్హణమ్ ।
స్వయం విశ్రమయత్యార్యం పాదసంవాహనాదిభిః ॥
ఒకప్పుడు అన్నగారగు బలరాముడు ఆటలతో అలసిపోయి గోపబాలకుని ఒడినే దిండుగా చేసుకొని పరుండగా, శ్రీకృష్ణుడు స్వయముగా ఆయన కాళ్లను పట్టుట, గాలి విసురుట మొదలగు సేవలతో విశ్రమింప జేయును.
నృత్యతో గాయతః క్వాపి వల్లతో యుధ్యతో మిథః ।
గృహీతహస్తౌ గోపాలాన్ హసంతో ప్రశశంసతుః ॥
గోపబాలకులు ఒకప్పుడు నాట్యమాడగా, మరియొకప్పుడు పాట పాడెదరు. ఒకప్పుడు గెంతి, మరియొకప్పుడు ఒకరితోనొకరు కుస్తీ పట్టెదరు. ఆయా సందర్భములలో బలరామ కృష్ణులు ఒకరి చేతులు మరియొకరు పట్టుకొని నవ్వుతూ వారిని కొనియాడెడివారు.
క్వచిత్పల్లవతల్పేషు నియుద్ధశ్రమకర్శితః ।
వృక్షమూలాశ్రయ శ్శేతే గోపోత్సంగోపబర్హణః ॥
ఒకప్పుడు శ్రీకృష్ణుడు బాహుయుద్ధములో బాగా అలసి, చెట్టు నీడలో గోపబాలకుని ఒడిని దిండుగా చేసుకొని చిగురుటాకుల శయ్యయందు పరుండును.
పాదసంవాహనం చక్రుః కేచిత్తస్య మహాత్మనః ।
అవరే హతపాప్మానో వ్యజనైస్సమవీజయన్ ॥
కొందరా మహాత్మునకు కాళ్లను పట్టగా, మరికొందరు విసిరే కర్రలతో బాగా నీచిరి. వారి పాపములు నశించెను.
అన్యే తదనురూపాణి మనోజ్ఞాని మహాత్మనః ।
గాయంతి స్మ మహారాజ స్నేహక్లిన్నధియశ్శ నైః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ప్రేమచే ఆర్ద్రములైన హృదయములు గల మరికొందరు ఆ మహాత్మునకు ఆయనకు తగ్గ మనోహరములైన పాటలను పాడి వినిపించిరి.
ఏవం నిగూఢత్మగతిస్స్వమాయయా
గోపాత్మజత్వం చరితైర్విడంబయన్ ।
రేమే రమాలాలితపాదపల్లవో
గ్రామ్యైస్సమం గ్రామ్యవదీశచేష్టితః ॥
లక్ష్మీదేవిచే లాలించబడే చిగుళ్లవంటి పాదములు గల - శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా తన చేష్టలతో గోపాలకుని పుత్రుడు వలె నటిస్తూ గోపబాలకులతో బాటు తాను కూడ ఒక గోపబాలకుడై విహరించెను. ఆయన తన స్వరూపమును మాయచే దాచియుంచిననూ, అప్పుడప్పుడు లీలలలో ఆయన అనంతశక్తి ప్రకటమయ్యెడిది.
శ్రీదామ నామ గోపాలో రామకేశవయోస్సఖా।
సుబలస్తోకకృష్ణాద్యా గోపాః ప్రేమ్ణేదమబ్రువన్ ॥
శ్రీరాముడని ప్రసిద్ధి గాంచిన గోపబాలకుడు బలరామకృష్ణుల నేస్తము. ఆతడు, సుబలుడు, స్తోక (చిన్ని కృష్ణుడు, దేవభద్రుడు మొదలగు - గోపబాలకులు ప్రేమతో ఇట్లు పలికిరి.
రామ రామ మహాబాహో కృష్ణ దుష్టనిబర్హణ ।
ఇతోఽవిదూరే సుమహద్వనం తాలాలిసంకులమ్ ॥
గొప్ప బాహువులతో మమ్ములను రమింపజేసే ఓ బలరామా! దుష్టులను సంహరించే శ్రీకృష్ణా! ఇక్కడకి దగ్గరలో తాటి చెట్ల వరుసలు దట్టముగా ఉండే అడవి గలదు.
ఫలాని తత్ర భూరీణి పతంతి పతితాని చ ।
సంతి కిం త్వవరుద్ధాని ధేనుకేన దురాత్మనా ॥
అక్కడ చాల పళ్లు ఇదివరకే పడినవి, కొత్తగా పడుతున్నవి ఉంటాయి. కానైతే దుర్బుద్ధియగు ధేనుకాసురుడు అడ్డు పడును.
సోఽతివీర్య్వోఽసురో రామ హే కృష్ణ ఖరరూపధృక్ ।
ఆత్మతుల్యబలైరన్యైర్జ్ఞాతిభిర్బహుభిర్వృతః ॥
ఓ బలరామా! ఓ శ్రీకృష్ణా! అధికమగు పరాక్రమము గల ఆ అసురుడు గాడిద రూపములో నుండును. వాని చుట్టూ వాని జ్ఞాతులనేకులు గలరు. వారికి కూడ వానితో సమానమగు బలము గలదు.
తస్మాత్కృతనరాహారాద్బీతైర్నృభిరమిత్రహన్ ।
న సేవ్యతే పశుగణైః పక్షిసంఘైర్వివర్జితమ్ ॥
శత్రువులను సంహరించే ఓ శ్రీకృష్ణా! నరమాంసమును భక్షించే ఆ రాక్షసునకు భయపడి మానవులు గాని, పశువుల గుంపులు గాని, పక్షుల గుంపులైననూ అటువైపు పోవుట లేదు.
విద్యంతేఽభుక్తపూర్వాణి ఫలాని సురభీణి చ ।
ఏష వై సురభిర్గంధో విషూచీనోఽవగృహ్యతే ॥
పరిమళముతో కూడి ఉండే ఆ పళ్లను ఇదివరలో మనమెన్నడూ తినలేదు. ఈ పళ్ల సువాసన నిశ్చయముగా అంతటా వ్యాపించుచున్నది. ఈ సుగంధము ఇచట స్పష్టముగా తెలియుచున్నది.
ప్రయచ్చ తావి నః కృష్ణ గంధలోభిత చేతసామ్ ।
వాంఛాఽస్తి మహతీ రామ గమ్యతాం యది రోచతే ॥
ఓ శ్రీకృష్ణా! ఆ పళ్లను మాకిమ్ము. వాటి సుగంధము మా మనస్సుల నాకర్షించుచున్నది. ఓ బలరామా! మాకు వాటి పై కోరిక మెండుగా గలదు. నీకభిమతమైనచో, అచటకు వెళ్లుము.
ఏవం సుహృద్వచశ్శ్రుత్వా సుహృత్ప్రియచికీర్షయా।
ప్రహస్య జగ్మతుర్గో పైర్వృతౌ తాలవనం ప్రభూ ॥
మిత్రులీ విధముగా పలుకగా సర్వసమర్థులగు బలరామకృష్ణులిద్దరు నవ్విరి. వారు గోపబాలకులు చుట్టువారి రాగా, వారికి ప్రీతిని కలిగించ గోరి, ఆ తాటి చెట్ల అడవికి వెళ్లిరి.
బలః ప్రవిశ్య బాహుభ్యాం తాలాన్ సంపరికంపయన్ ।
ఫలాని పాతయామాస మతంగజ ఇవౌజసా ॥
బలరాముడు మదించిన ఏనుగు గున్నవలె ఆ అడవిలో ప్రవేశించి రెండు చేతులతో బలముగా తాటి చెట్లను గట్టిగా గుండ్రముగా ఊపి, పళ్లు పడునట్లు చేసెను.
ఫలానాం పతతాం శబ్దం నిశమ్యాసురరాసభః ।
అభ్యధావత్ క్షితితలం సనగం పరికంపయన్ ॥
పడుచున్న ఆ పళ్ల చప్పుడు విని గాడిద రూపములోనున్న రాక్షసుడు వారి ఎదురుగా పరుగెత్తి రాగా, చెట్లతో సహా భూతలము కంపించేను.
సమేత్య తరసా ప్రత్యగ్ద్వాభ్యాం పద్భ్యాం బలం బలీ ।
నిహత్యోరసి కాశబ్దం ముంచన్ పర్యసరత్ఖలః ॥
బలశాలియగు ఆ దుష్టుడు వేగముగా వచ్చి రెండు వెనుక కాళ్లతో రాముని రొమ్ముపై తన్ని కఠోరముగా ఓండ్ర పెడుతూ చుట్టూ పరుగెత్తాను.
పునరాసాద్య సంరబ్ద ఉపక్రోష్టా పరాక్ స్థితః ।
చరణావపరౌ రాజన్ బలాయ ప్రాక్షిపద్రుషా ॥
ఓ పరీక్షిన్మహారాజా! గాడిద రూపములోనున్న ఆ రాక్షసుడు కోపముతో మరల దగ్గరకు వచ్చి వెనుదిరిగి నిలబడెను. వాడు బలరాముని తన్నుటకై కోపముతో రెండు వెనుక కాళ్లను విసిరెను.
స తం గృహీత్వా ప్రపదోర్ర్భామయిత్వైకపాణినా ।
చిక్షేప తృణరాజాగ్రే భ్రమణత్యక్తజీవితమ్ ॥
ఆ బలరాముడు ఒకే చేతితో వానిని రెండు కాళ్ల కొనలయందు పట్టుకొని గిర గిర త్రిప్పి తాటి చెట్టు పైకి విసిరేసు. ఆ త్రిప్పుటలోనే వాని ప్రాణము పోయెను.
తేనాహతో మహాతాలో వేపమానో బృహచ్చిరాః ।
పార్శ్వస్థం కంపయన్ భగ్నస్స చాన్యం సోఽపీ చాపరమ్ ॥
ఆ రాక్షసుని దేహముతో కొట్టబడిన మిక్కిలి యెత్తైన ( పెద్ద తల గల) ఆ పెద్ద తాటి చెట్టు ఊగిపోతూ విరిగి ప్రక్కనున్న చెట్టు పై పడగా, అది కుదిపివేయబడి విరిగెను. అది పడి ఇంకో చెట్టు, ఆ చెట్టు పడి మరో చెట్టు కూడ విరిగెను.
బలస్య లీలయోత్సృష్టఖరదేహహతాహతాః ।
తాలాశ్చకంపిరే సర్వే మహావాతేరితా ఇవ ॥
బలరాముడు అవలీలగా విసిరివేసిన గాడిద దేహము ఒక చెట్టును, అది విరిగి ఇంకో చెట్టును కొట్టెను. ఆ విధముగా తాటి చెట్లన్నీ పెద్దగాలిచే కుదిపివేయబడినవా యన్నట్లు ఊగినవి.
నైతచ్చిత్రం భగవతి హ్యనంతే జగదీశ్వరే । ఓతప్రోతమిదం యస్మింస్తంతుష్వంగ యథా పటః ॥
ఓ రాజా! జగత్తునకు ప్రభువగు అనంత భగవానుడట్లు చేయుటలో విడ్డూరమేమీ లేనే లేదు. ఎందుకంటే ఈ జగత్తు, వస్త్రము దారములయందు వలె, ఆయనయందే పడుగు పేకవలె నున్నది.
తతః కృష్ణం చ రామం చ జ్ఞాతయో ధేనుకస్య యే ।
క్రోష్టారోఽభ్యద్రవన్ సర్వే సంరబ్ధా హతబాంధవాః ॥
తరువాత, తమ బంధువగు ధేనుకాసురుడు సంహరించబడినందులకు వాని బంధువులగు గాడిదలకు చాల కోపము వచ్చినది. అవి అన్నీ బిగ్గరగా ఓండ్ర పెడుతూ బలరామకృష్ణుల పైకి పరుగెత్తి వచ్చినవి.
తాంస్తానాపతతః కృష్ణో రామశ్చ నృప లీలయా ।
గృహీతపశ్చాచ్చరణాన్ ప్రాహిణోత్తృణరాజసు ॥
ఓ పరీక్షిన్మహారాజా! మీదకు వచ్చుచున్న ఆ గాడిదలను బలరామకృష్ణులు వచ్చినవాటీని వచ్చినట్లుగా అవలీలగా వెనుక కాళ్లను పట్టుకొని తాటి చెట్ల పైకి విసిరి వేసిరి.
ఫలప్రకరసంకీర్ణం దైత్యదేహిర్గతాసుభిః ।
రరాజ భూస్సతాలాగ్రైర్ఘ నైరివ నభస్తలమ్ ॥
నేల పై పళ్లు గుట్టలుగా పడి చెల్లాచెదరుగా నుండెను. ప్రాణములు పోయిన రాక్షసుల దేహములకు తాటి చెట్ల తలలు తోడు కాగా, నేల మేఘములతో కూడిన ఆకాశతలము వలె ప్రకాశించెను.
తయోస్తత్సుమహత్కర్మ నిశామ్య విబుధాదయః ।
ముముచుః పుష్పవర్షాణి చక్రుర్వాద్యాని తుష్టువుః ॥
వారిద్దరి ఆ చాల గొప్ప లీలను చూచి దేవతలు పూల వానలను కురిపించిరి. గంధర్వులు వాద్యములను వ్రాయించగా, మహర్షులు స్తుతించిరి.
అథ తాలఫలాన్యాదన్మనుష్యా గతసాధ్వసాః ।
తృణం చ పశవ శ్చేరుర్హతధేనుకకాననే ॥
ధేనుకాసురుని సంహరించిన తరువాత ఆ అడవిలో మానవులు భయము తొలగిపోయి తాటి పళ్లను తినిరి. పశువులు కూడ గడ్డి మేసినవి.
కృష్ణః కమలపత్రాక్షః పుణ్యశ్రవణకీర్తనః ।
స్తూయమానోఽనుగైర్గో పైస్సాగ్రజో వ్రజమావ్రజత్ ॥
పద్మపు రేకులవంటి కన్నులు గల శ్రీకృష్ణుని లీలలను విన్నా కీర్తించినా మానవుడు పవిత్రుడగును. ఆయన అన్నయగు బలరామునితో కలిసి, సహచరులగు గోపబాలకులు కొనియాడుచుండగా, గోకులమును చేరెను.
తం గోరజశ్చురితకుంతలబద్ధబర్హ-
వన్యప్రసూనరుచిరేక్షణచారుహాసమ్ ।
వేణుం క్వణంతమనుగైరనుగీతకీర్తిం
గోప్యో దిదృక్షితదృశోఽభ్యగమన్ సమేతాః ॥
శ్రీకృష్ణుని ముంగురులు గోధూళితో నిండియుండెను. ఆయన వాటియందు నెమలి పింఛములను, అడవి పువ్వులను పెట్టుకొనెను. ప్రకాశించే చూపులు, అందమైన చిరునవ్వు గల ఆయన వేణువును వాయించుచుండగా, వెంట నడిచే గోపబాలకులు ఆయన కీర్తిని గానము చేసిరి. ఆయనను చూడగోరే కన్నులు గల గోపికలు గుంపుగా ఆయనకు ఎదురేగిరి.
పీత్వా ముకుందముఖసారఘమక్షిభృంగైః ।
తాపం జహుర్విరహజం ప్రజయోషీత్వోఽహ్ని । తత్సత్కృతిం సమధిగమ్య వివేశ గోష్ఠం
సవ్రీడహాసవినయం యదపాంగమోక్షమ్ ॥
గోకులమునందలి యువతులు మోక్ష ప్రదాతయగు శ్రీకృష్ణుని ముఖపద్మమునందలి తేనెను కన్నులనే తుమ్మెదలతో పానము చేసిరి. వారికి పగలు ఆయన విరహము వలన పుట్టిన మనస్తాపము తొలగిపోయేను. వారాయనను వాలు చూపులను విసిరి సత్కరించగా, ఆయనా సత్కారమును సిగ్గుతో, చిరునవ్వుతో, వినయముతో చక్కగా స్వీకరించి, గోకులమును ప్రవేశించెను.
తయోర్యశోదారోహిణ్యౌ పుత్రయోః పుత్రవత్సలే ।
యథాకామం యథాకాలం వ్యధత్తాం పరమాశీషః ॥
యశోదారోహిణులిద్దరికి పుత్రవాత్సల్యము మెండు. వారు బలరామకృష్ణులకు వారి ఇచ్చకు తగ్గట్లుగా కాలము మించకుండా ఉత్కృష్టమైన ఆహారము మొదలగు సౌకర్యములను వ్యవస్థ చేసిరి.
గతాధ్వానశ్రమౌ తత్ర మజ్జనోన్మర్దనాదిభిః ।
నీవీం వసిత్వా రుచిరాం దివ్యస్రగ్గంధమండితౌ ॥
ఆ గోకులములో వారిద్దరు తైలమును మర్దనా చేసుకొని స్నానము చేసి మార్గములో కలిగిన శ్రమను పోగొట్టుకొనిరి. మార్గములో శ్రమ తక్కువ యేమీ కాదు. వారు అందమైన ఉదికిన వస్త్రమును ధరించి ప్రకాశించే మాలతో, గంధముతో అలంకరించుకొనిరి.
జనన్యుపహృతం ప్రాశ్య స్వాద్వన్నముపలాలితౌ ।
సంవిశ్య వరశయ్యాయాం సుఖం సుషుపతుర్ర్వజే ॥
వారు గోకులములో తల్లులిద్దరు లాలిస్తూ ఇచ్చిన రుచ్యమైన ఆహారమును భుజించిరి. అపుడు వారు శ్రేష్ఠమైన (మెత్తని) శయ్య పై వాలి సుఖముగా నిద్రించిరి.
ఏవం స భగవాన్ కృష్ణో బృందావనచరః క్వచిత్ ।
యయౌ రామమృతే రాజన్ కాలిందీం సఖిభిర్వృతః ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఈ విధముగా ఆ శ్రీకృష్ణ భగవానుడు బృందావనములో సంచరించుచుండెను. ఆయన ఒకడు మిత్రులైన గోపబాలకులు చుట్టువారి రాగా, బలరాముడు లేకుండా, యమునానదికి వెళ్లాను.
అథ గావశ్చ గోపాశ్చ నిదాఘాతపపీడితాః ।
దుష్టం జలం పపుస్తస్యాస్తృషార్తా విషదూషితమ్ ॥
అప్పుడు గోవులు, గోపాలకులు కూడ వేసవి కాలపు ఎండచే తాపమును పొంది దప్పికతో పీడను పొందిరి. వారు ఆ కాలిందిలోని చెడు నీటిని త్రాగిరి. ఆ నీరు విషముచే కలుషితమైనది.
విషాంభస్తదుపస్పృశ్య దైవోపహతచేతసః ।
ని పేతుర్వ్యసవస్సర్వే సలిలాంతే కురూద్వహ ॥
కురువంశశ్రేష్ఠుడవగు ఓ రాజా! ప్రారబ్దముచే మోహితమైన బుద్ధి గల వారందరు ఆ విషపు నీటిని త్రాగి, ప్రాణములు పోగా నీటికి దగ్గరగా ఒడ్డుపై పడిపోయిరి.
వీక్ష్య తాన్ వై తథాభూతాన్ కృష్ణో యోగేశ్వరేశ్వరః ।
ఈక్షయాఽమృతవర్షిణ్యా స్వనాథాన్ సమజీవయత్ ॥
శ్రీకృష్ణుడు గొప్ప యోగమహిమ గలవారలకు కూడ ప్రభుడు. ఆయన ఆ విధముగా పడియున్న గోపబాలకులను చూచెను. వారికి తానే రక్షకుడు. ఆయన వారిని అమృతమును వర్షించే చూపుతో బ్రదికించెను.
తే సంప్రతీతస్మృతయస్సముత్థాయ జలాంతీకాత్ । ఆసన్ సువిస్మితాస్సర్వే వీక్షమాణాః పరస్పరమ్ ॥
ఆ గోపబాలకులందరికీ వెంటనే స్మృతి కలిగెను. వారు నీటి వద్దనుండి లేచి నిలబడి మిక్కిలి ఆశ్చర్యముతో ఒకరినొకరు చూచుకుంటూ ఉండిరి.
అన్వమంసత తద్రాజన్ గోవిందానుగ్రహేక్షితమ్ ।
పీత్వా విషం పరేతస్య పునరుత్థానమాత్మనః ॥
ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్ధే పంచదశోఽధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! తాము విషజలమును త్రాగి మరణించి మరల లేచి నిలబడుట గోవిందుని అనుగ్రహదృష్టి చేతనేనని వారు తలపోసిరి.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్దములో ధేనుకాసురుని ఉద్దరించుటను వర్ణించే పదునైదవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 15 of the Bhāgavata Mahā Purana is as follows:
As Śrī Kṛshṇa and Balarāma reached the *Paugaṇḍa* age (around seven to ten years), they were entrusted with the care of full-grown cows, wandering through the woods playing flutes, wrestling, and singing. One day, the cowherd boys mentioned the Tālavana forest, which was filled with ripe, fragrant palm fruits but guarded by the fierce donkey demon Dhenukāsura and his demonic herd. Desiring the fruits, Balarāma and Kṛshṇa entered the forest. Balarāma shook the palm trees with His mighty arms, sending ripe fruits cascading to the ground. Outraged, Dhenukāsura charged and kicked Balarāma's chest with his hind legs. Balarāma seized the donkey demon by his hind legs, swirled him around, and hurled him into the top of a palm tree, crushing the demon and destroying his entire herd.