48 - శ్రీకృష్ణుడు ఆక్రూరుని ఇంటికి వెళ్లుట

శ్రీశుక ఉవాచ !

అథ విజ్ఞాయ భగవాన్ సర్వాత్మా సర్వదర్శనః

సైరంధ్ర్యాః కామతప్తాయాః ప్రియమిచ్ఛన్ గృహం యయౌ

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఉద్ధవుడు చెప్పిన విషయములను శ్రీకృష్ణ భగవానుడు తెలుసుకొనెను. సకల ప్రాణులలో ఆత్మరూసముగానుండే సర్వజ్ఞుడు. ఆయన ప్రేమచే పీడించబడిన సైరంధ్రి (త్రివక్ర) కి ప్రీతిని కలిగించగోరి ఆమె ఇంటికి వెళ్లెను.

 మహార్హోపస్క రైరాఢ్యం కామోపాయోపబృంహితమ్ ముక్తాదామపతాకాభిర్వతానశయనాసనైః

ధూ పైస్సురభిర్దీ పైస్స్రగ్గం ధైరపి మండితమ్

 ఆ ఇల్లు మిక్కిలి విలువైన సామగ్రులతో, ప్రేమను వర్ధిల్లజేసే ఉపాయములతో సమృద్ధమై యుండెను. ముత్యాల హారములు, జెండాలు, చాందినీలు, శయ్యలు, ఆసనములు, పరిమళ ధూపములు, దీపములు, పుష్పమాలలు, గంధములతో ఆ గృహము సంపన్న మై యుండెను.

గృహం తమాయాంతమవేక్ష్య సాఽసనాత్

సద్యస్సముత్థాయ హి జాతసంభ్రమా

యథోపసంగమ్య సఖీభిరచ్యుతం

సభాజయామాస సదాసనాదిభిః

 ఇంటికి వచ్చుచున్న ఆ శ్రీకృష్ణ భగవానుని చూచి ఆ సైరంధ్రా కంగారు పడెను. ఆమె వెంటనే ఆసనమునుండి లేచి నిలబడి చెలులతో బాటుగా తగిన విధముగా ఆయనకు ఎదురేగి, మంచి ఆసనము పాద్యము మొదలగువాటితో సత్కరించెను.

తథోద్ధవస్సాధు తయాఽభిపూజితో న్యషీదదుర్వ్యామభిమృశ్య చాసనమ్,

కృష్ణోఽపి తూర్ణం శయనం మహాధనం వివేశ లోకాచరితాన్యనువ్రతః

 ఆమె అదే విధముగా ఉద్ధవుని కూడ సత్కరించెను. కాని, ఆయన ఆమె చూపించిన ఆసనమును చేతితో స్పృశించి నేలపై కూర్చుండెను, శ్రీకృష్ణుడు జనుల చేష్టలను అనుసరించును. ఆయన వెంటనే మిక్కిలి విలువైన శయ్యనధిష్ఠించెను.

సా మజ్జనాలేపదుకూలభూషణస్రగ్గంధతాంబూలసుధాసవాదిభిః

ప్రసాధితాత్మోపససార మాధవం సవ్రీడలీలోత్స్మితవిభ్రమేక్షి తైః

 ఆమె స్నానము చేసి చందనాదులనలదుకొని కోకను సొమ్ములను పెట్టుకొని పుష్పమాలలనలంకరించుకొని తాంబూలము వేసుకొని అమృతమువంటి పానీయమును మొదలగు వాటితో తనను అందముగా తీర్చి దిద్దుకొనెను. ఆమె సిగ్గుతో విలాసంగా నవ్వుతూ కనుబొమల విరుపులతో ఓరగా చూస్తూ శ్రీకృష్ణ భగవానుని దగ్గరకు వచ్చెను.

ఆహూయ కాంతాం నవసంగమహ్రియా

విశంకితాం కంకణ భూషితే కరే

ప్రగృహ్య శయ్యామధివేశ్య రామయా

రేమేఽనులేపార్పణ పుణ్యలేశయా

కొత్త కలయిక వలని సిగ్గుతో సందేహిస్తున్న ఆ సుందరిని ఆయన దగ్గరకు పిలిచెను. కంకణములనలంకరించిన ఆమె రెండు చేతులను పట్టుకొని ఆయన ఆమెను శయ్య పై కూర్చుండబెట్టెను. ఆయనకు గంధమునర్పించిన పిసరంత పుణ్యము గల ఆమెతో ఆయన రమించెను.

సాఽనంగతప్తకుచయోరురసస్తథాఽక్ ష్ణోః

జిఘ్రంత్యనంతచరణేన రుజో మృజంతీ

దోర్భ్యాం స్తనాంతరగతం పరిరభ్య కాంతం

ఆనందమూర్తిమజహాదతి దీర్ఘతాపమ్

ఆమె శ్రీకృష్ణ భగవానుని పాదమునాఘ్రాణించి, వక్షఃస్థలము పై ఆన్చి, రెండు కళ్లతో చూసి హృదయములోని తాపమును తుడిచివేసెను. . ఆనందమూర్తియగు శ్రీకృష్ణుడు ఆమె వక్షఃస్థలము పైనుండెను. ఆ ప్రియుని ఆమె రెండు చేతులతో కౌగిలించి చిరకాలతాపమును విడిచెను.

సైవం కైవల్యనాథం తం ప్రాప్య దుప్ప్రాపమీశ్వరమ్

అంగరాగార్పణేనాహో దుర్భగేదమయాచత

అయ్యో! ఏమి దురదృష్టము! మోక్ష మునిచ్చే ప్రభుడగు ఆ శ్రీకృష్ణ భగవానుని పొందుట శక్యము కాదు. కాని, ఆ సైరంధ్రి ఒంటికి రాసుకొనే గంధమును అర్పించుటచే ఆయనను పొంది కూడ, దీనిని (చెప్పబడబోవు దానిని) కోరుకొనెను.

ఆహోష్యతామిహ ప్రేష్ఠ దినాని కతిచిన్మయా

రమస్వ నోత్స హే త్యక్తుం సంగం తేంఽబురు హేక్షణ

పద్మములవంటి కన్నులు గల ఓ ప్రియతమా! ఇచట ఉండుము. కొన్ని దినములు నాలో నిరంతరముగా రమించుము. నీ పొందును విడిచి పెట్టే శక్తి నాకు లేదు, అన్ని ఆమె పలికెను.

తస్యై కామపరం దత్త్వా మానయిత్వా చ మానదః

సహోద్ధవేన సర్వేశస్స్వధామాగమదర్చితమ్

సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుడు భక్తులను సమ్మానించును. ఆయన ఆమెకు కోరిన వరము నిచ్చుట ద్వారా సమ్మానించి, ఉద్ధవునితో బాటు సంపత్సమృద్ధమైన తన గృహమునకు వచ్చెను.

   దురారాధ్యం సమారాధ్య విష్ణుం సర్వేశ్వరేశ్వరమ్

యో వృణీతే మనోగ్రాహ్యమసత్త్వాత్కుమనీష్యసౌ

ఇంద్రుడు మొదలైన లోకపాలకులందరికీ ఈశ్వరుడగు శ్రీకృష్ణ భగవానుని ప్రసన్నుని చేసుకొనుట తేలిక కాదు. ఆయనను బాగుగా ప్రసన్నుని చేసుకొని ఎవడైతే మనస్సునకు ప్రియమైన భోగమును కోరునో, అట్టివాడు తెలివితేటలు గలవాడు ఎందుకంటే, మనస్సునకు ప్రియమైన సర్వము మిథ్యయే.

అక్రూరభవనం కృష్ణస్సహరామోద్ధవః ప్రభుః

కించిచ్చికీర్షియన్ ప్రాగాదక్రూరప్రియకామ్యయా

శ్రీకృష్ణ ప్రభుడు అక్రూరునకు ప్రీతిని కలిగించి ఆయనచే ఒక పనిని చేయించ గోరెను. అందుచే ఆయన బలరామ - ఉద్ధవులతో కలిసి అక్రూరుని ఇంటికి వెళ్లెను.

స తాన్నరవరశ్రేష్టానారాద్వీక్ష్య స్వబాంధవాన్

ప్రత్యుత్థాయ ప్రముదితః పరిష్వజ్యాభ్యనందత

వారు అక్రూరునకు బంధువులు మాత్రమే గాక మానవులలోని గొప్పవారిలో గొప్పవారు. వారిని దూరమునుండి చూచి అక్రూరుడు మహానందముతో ఎదురేగి కౌగిలించి అభినందించెను.

ననామ కృష్ణం రామం చ స తైరప్యభివాదితః

పూజయామాస విధివత్కృతాసనపరిగ్రహాన్

ఆ అక్రూరుడు బలరామ శ్రీకృష్ణులకు నమస్కరించెను. వారు కూడ ఆయనకు నమస్కరించిరి. వారందరు ఆసనమును స్వీకరించిన పిదప, ఆయన వారిని యథావిధిగా పూజించెను.

పాదావనేజనీరాఽపో ధారయఞ్ఛిరసా నృప

అర్హణేనాంబరైర్దివ్యైర్గంధస్రగ్భూషణోత్త మైః

అర్చిత్వా శిరస్వాఽఽనమ్య పాదావంకగతౌ మృజన్

ప్రశ్రయావనతోఽక్రూరః కృష్ణ రామావభాషత

ఓ పరీక్షిన్మహారాజా! అక్రూరుడు వారిద్దరి పాదములను కడిగిన నీటిని తలపై అంతటా చల్లుకొనెను. ఆయన వారిని అర్ఘ్యము, ప్రకాశించే వస్త్రములు, గంధము, పుష్పమాలలు, విలువైన అలంకారములు మొదలగువాటితో పూజించి తల వంచి నమస్కరించెను. ఆయన వారి పాదములను ఒడిలో ఉంచుకొని సంవాహనము చేసెను. తరువాత ఆయన వినయముతో వినమ్రుడై బలరామకృష్ణులతో ఇట్లు పలికెను.

దిష్ట్యా పాపో హతః కంసస్సానుగో వామిదం కులమ్

భవద్భ్యాముద్ధృతం కృచ్ఛ్రాద్దురంతాచ్చ సమేధితమ్

పాపియగు కంసుడు అనుచరులతో సహా వధించబడెను. మీరిద్దరు ఈ మీ కులమును అంతము కానరాని ఆపదనుండి గట్టెక్కించి వర్ధిల్ల జేసిరి. ఇది మంగళము.

యువాం ప్రధానపురుషా జగద్ధేతూ జగన్మయౌ

భవద్భ్యాం న వినా కించిత్పరమస్తి న చాపరమ్

 బలరాముడు జగత్తునకు ఉపాదానమగు మాయాశక్తి కాగా, శ్రీకృష్ణుడు నిమిత్తకారణమగు పరబ్రహ్మ. ఈ తీరున మీరిద్దరు జగత్తు రూపముగా ప్రకటమైరి. మీరిద్దరు లేకుండా కారణము గాని, కార్యము గాని ఏదీ లేదు.

ఆత్మసృష్టమిదం విశ్వమన్వావిశ్య స్వశక్తిభిః

ఈయతే బహుధా బ్రహ్మన్ శ్రుతప్రత్యక్ష గోచరమ్

ఓ పరమాత్మా! నీవీ జగత్తును సృష్టించి తరువాత నీ శక్తులతో దానియందు ప్రవేశించినావు. నీవే అనేకవిధములుగా వినబడేది (నామము), కనబడేది (రూపము) గా తెలియబడుచున్నావు.

యథా హి భూతేషు చరాచ రేషు

మహ్యాదయో యోనిషు భాంతి నానా

ఏవం భవాన్ కేవల ఆత్మయోని –

ష్వాత్మాఽఽత్మతంత్రో బహుధా విభాతి

కదిలే మరియు కదలని ప్రాణుల అనేకరూపములైన దేహములయందు పృథివి, జలములు మొదలగు పంచభూతములే ప్రకాశించుచున్నవి. అదే విధముగా, స్వతంత్రుడవగు నీవే నీనుండి ఆవిర్భవించిన సకలచరాచరములయందు అనేకరూపములుగా ప్రకాశించుచున్నావు. సర్వమునకు రెండవది లేని నీవే ఆత్మవు.

సృజస్యథో లుంపసి పాసి విశ్వం రజస్తమస్సత్త్వగుణైస్స్వశక్తిభిః

న బధ్య సే తద్గుణకర్మభిర్వా జ్ఞానాత్మనస్తే క్వచ బంధ హేతుః

నీవు నీ శక్తియగు రజోగుణముచే జగత్తును సృష్టించి, నీ శక్తియగు సత్త్వగుణముచే పాలించి, తరువాత తమోగుణముచే ఉపసంహరించెదవు. కాని, గుణములు గాని క్రియలు గాని నిన్ను బంధించవు. చైతన్యస్వరూపుడవగు నీకు బంధ హేతువగు అజ్ఞానమెక్కడిది? (లేదు).

దేహాద్యుపాధేరనిరూపితత్వాద్భవో న సాక్షాన్న భిదాఽఽత్మనస్స్యాత్

అతో న బంధస్తవ నైవ మోక్షస్స్యాతాం నికామస్త్వయి నోఽవివేకః

ఆత్మకు దేహము - మనస్సు మొదలగు ఉపాధులు ఉన్నవి అని గాని, లేవు అని గాని నిరూపించుటకు శక్యము కానివి (మిథ్య). కావున, ఆత్మస్వ రూపమునందు పుట్టుక గాని, భేదము గాని లేవు. కావున, నీకు బంధము గాని, మోక్షము గాని లేనే లేవు. అవివేకముచే మేము మా అభిప్రాయ ములకు తగ్గట్లుగా నీయందు బంధమోక్షములను కల్పిస్తూ ఉంటాము.

త్వయోదితోఽయం జగతో హితాయ యదా యదా వేదపథః పురాణః

బాధ్యేత పాఖండపథైరసద్భిస్తదా భవాన్ సత్త్వగుణం బిభర్తి

నీవు జగత్తు యొక్క హితము కొరకు సనాతనమైన వేదమార్గమును ప్రకాశింప జేసితివి. ఎప్పుడెప్పుడైతే ఆ మార్గము నరకహేతువులైన వేదవిరుద్ధమార్గములచే పీడించబడునో, అప్పుడప్పుడు నీవు సత్త్వగుణ ప్రధానమగు మూర్తి వై అవతరించెదవు.

స త్వం ప్రభోఽద్య వసుదేవగృహేఽవతీర్ణః

స్వాంశేన భారమప నేతుమిహాసి భూమేః

అక్షౌ హిణీ శతవధేన సురేతరాంశ –

 రాజ్ఞామముష్య చ కులస్య యశో వితన్వన్

ఓ ప్రభూ! అట్టి (సత్త్వగుణ ప్రధానుడవగు) నీవు భూభారమును పోగొట్టుటకై ఈ భూలోకములో వసుదేవుని ఇంట్లో నీ అంశయగు బలరామునితో గూడి అవతరించితివి. రాక్షసుల అంశలైన రాజుల వందల అక్షౌహిణీల సైన్యమును సంహరించి ఈ వంశము యొక్క కీర్తిని నీవు విస్తరింప జేసెదవు.

అద్యేశ నో వసతయః ఖలు భూరిభాగా

యస్సర్వదేవ పితృభూతనృదేవమూర్తిః

యత్పాదశౌచసలిలం త్రిజగత్పునాతి

స త్వం జగద్గురురధోక్షజ యాః ప్రవిష్టః

ఓ ఈశ్వరా! నీ స్వరూపము ఇంద్రియగోచరము కాదు. సకలదేవతలు, పితృదేవతలు, ప్రాణులు, రాజులు నీ మూర్తులే. నీ పాదములను కడిగిన నీరు ముల్లోకములను పవిత్రము చేయును. జగత్తునకు తండ్రివగు అట్టి నీవు మా ఇళ్లలో ఈ నాడు పాదము మోపీనావు. మా ఇళ్లు గొప్ప భాగ్యము గలవి సుమా!

కః పండితస్త్వదపరం శరణం సమీయాత్

భక్తప్రియాదృతగిరస్సుహృదః కృతజ్ఞత్

సర్వాన్ దదాతి సుహృదో భజతోఽకామాన్

ఆత్మానమప్యుపచయాపచయౌ న యస్య

నీకు భక్తుల యందు ప్రీతి. నీవి యథార్థవచనములు. హితకారివగు నీకు జనుల ధర్మాధర్మములు తెలియును. అట్టి నిన్ను కాకుండా వివేకి మరియొకనిని ఎవనిని శరణు జొచ్చును? (ఎవనినైననూ శరణు వేడడు). శుద్ధహృదయుడగు భక్తునకు నీవు సకలకామనలననుగ్రహించుటయే గాక, నిన్ను కూడ సమర్పించెదవు. కాని, నీకు వృద్ధిహాసములు లేవు.

దిష్ట్యా జనార్ధన భవానిహ నః ప్రతీతో

యోగేశ్వరైరపి దురాపగతిస్సురేశైః

ఛింధ్యాశు నస్సుతకలబోధనాప్త గేహ -  

దేహాది మోహరశనాం భవదీయమాయామ్

దుష్టజనశిక్షకుడవగు ఓ దేవా! నీ స్వరూపమును తెలియుట యోగిరాజులగు సనకాదులకు, దేవనాయకులగు ఇంద్రాదులకు కూడ చుర్ఘటము. అట్టి నీవు మా నీవు మా ఈ గృహములో ప్రత్యక్ష మైనావు. ఇది మంగళము. నీ మాయ వలన మాకు సంతానము, భార్య, ధనము, బంధువులు, ఇల్లు, దేహము, ఇంద్రియభోగములయందు మోహము కలిగి   మమ్ములను బంధించుచున్నది. ఈ అజ్ఞానబంధమును నీవు శీఘ్రముగా తొలగించుము.

శ్రీశుక ఉవాచ

ఇత్యర్చితస్సంస్తుతశ్చ భక్తేన భగవాన్ హరిః

అక్రూరం సస్మితం ప్రాహ గీర్భిస్సమ్మోహయన్నివ

శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా భక్తుడైన అక్రూరుడు పాపములను పోగొట్టే శ్రీకృష్ణ భగవానుని పూజించి గొప్పగా స్తుతించెను. అప్పుడాయన తన పలుకులతో మోహపెట్టుచున్నాడా యన్నట్లు చిరునవ్వుతో అక్రూరుని ఉద్దేశించి ఇట్లు పలికెను.

శ్రీభగవానువాచ

త్వం నో గురుః పితృవ్యశ్చ శ్లాఘ్యో బంధుశ్చ నిత్యదా

వయం తు రక్ష్యాః పోష్యాశ్చ అనుకంప్యాః ప్రజా హి వః

శ్రీకృష్ణ భగవానుడిట్లు పలికెను --- నీవే మాకు గురుడవు, పినతండ్రివి. సర్వకాలములలో కొనియాడదగిన హితకారివి నీవే. నీవే మమ్ములను రక్షించి పోషించువాడవు, పుత్రులమైన మాపై నీవు దయను చూపవలెను.

భవద్విధా మహాభాగా నిషేవ్యా అర్హసత్తమాః

శ్రేయస్కా మైర్నృభిర్నిత్యం దేవాస్స్వార్థా న సాధవః

శ్రేయస్సును మానవులు నీవంటి మహోత్కృష్టులైన మహానుభావులను నిత్యము సేవించదగును. దేవతలు హవిర్భాగములను కోరి భక్తులకు కామనలనిచ్చెదరు. కాని, సత్పురుషులయందు అట్టి స్వార్థము కానరాదు.

న హ్యమ్మయాని తీర్థాని న దేవా మృచ్ఛిలామయాః

తే పునంత్యురుకాలేన దర్శనా దేవ సాధవః

తీర్థములనగా కేవలము జలమయములు మాత్రమే కాదు. సత్పురుషులు కూడ తీర్థములే. దేవతలనగా కేవలము మట్టితో, రాళ్లతో చేసినవారు మాత్రమే కాదు, సత్పురుషులు కూడ దేవతలే. తీర్థములు, దేవతలు సేవించిన తరువాత పావనము చేస్తే, సత్పురుషుల దర్శనమాత్రముచే మానవుడు పునీతుడగును.

స భవాన్ సుహృదాం వై నశ్శేయాఞ్చ్ఛ్రేయశ్చికీర్షయా !

జిజ్ఞాసార్థం పాండవానాం గచ్ఛస్వ త్వం గజాహ్వయమ్

తమరు నిశ్చయముగా మా శ్రేయస్కాములలో అగ్రగణ్యులు. కాబట్టి, తమరు పాండవులకు హితమును చేయుటకు, వారి క్షేమమును విచారించుటకై హస్తినాపురమునకు ప్రయాణము కట్టుడు.

 పితర్యుపరతే బాలాస్సహ మాత్రా సుదుఃఖితాః

ఆనీతాస్స్వపురం రాజ్ఞా వసంత ఇతి శుశ్రుమ

తండ్రియగు పాండురాజు మరణించిన మిక్కిలి దుఃఖితులైయున్న ఆయన పిల్లలను వారి తల్లియగు కుంతిని ధృతరాష్ట్ర మహారాజు తన నగరము హస్తినాపురమునకు తీసుకువచ్చినాడనియు, ఇప్పుడు వారు అక్కడే నివసించుచున్నారనియు విని యున్నాము.

 తేషు రాజాంఽబికాపుత్రో భ్రాతృపుత్రేషు దీనధీః

సమో న వర్తతే నూనం దుష్పుత్రవశగోంఽధదృక్

అంబిక పుత్రుడగు ధృతరాష్ట్రుడు దీనమైన మనస్సు గలవాడు. ఈయన గ్రుడ్డివాడు, పైగా దుష్టులగు పుత్రులకు వశుడైనాడు. ఈయన పాండవులను తన పుత్రులతో సమముగా చూచుట లేదు. ఇది యథార్థము.

గచ్ఛ జానీ హి తద్వృత్తమధునా సాధ్వసాధు వా

విజ్ఞాయ తద్విధాస్యామో యథా శం సుహృదాం భవేత్

తమరు వెళ్లి ఆ ధృతరాష్ట్రుని ప్రవృత్తిని, పాండవుల బాగోగులను అరయును. ఆతని ప్రవృత్తి బాగున్నదా? లేదా? పాండవులు బాగున్నారా? లేదా? అనే విషయము తెలిసిన పిదప, ప్రియబంధువులగు పాండవులకు సుఖము కలిగే ఉపాయమును చేసెదము.

ఇత్యక్రూరం సమాదిశ్య భగవాన్ హరిరీశ్వరః

సంకర్షణోద్ధవాభ్యాం వైతతస్స్వభవనం యయౌ

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్ధే అష్టాచత్వారింశోఽధ్యాయః

జగత్తును శాసించువాడు, పాపములను పోగొట్టువాడు అగు శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుని ఈ విధముగా ఆదేశించెను. తరువాత ఆయన బలరాముడు, ఉద్ధవుడు తోడు రాగా తన ప్రాసాదమునకు వెళ్లెను.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో

శ్రీకృష్ణుడు అక్రూరుని ఇంటికి వెళ్లుటను వర్ణించే

నలుబది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (48).