62 – ఉషా - అనిరుద్ధుల సమాగమము

రాజోవాచ

బాణస్య తనయామూషాముపయేమే యదూత్తమః

తత్ర యుద్ధమభూద్ఘోరం హరిశంకర యోర్మహత్

ఏతత్సర్వం మహాయోగిన్ సమాఖ్యాతుం త్వమర్హసి

పరీక్షిత్తు ఇట్లు పలి కెను - మహాయోగివగు శుక మహర్షీ! యాదవశ్రేష్టుడగు అనిరుద్ధుడు బాణాసురుని కుమార్తెయగు ఉషను వివాహమాడెను. ఆ సందర్బములో శ్రీకృష్ణ భగవానునకు శంకరునితో భయంకరమైన గొప్ప యుద్దము జరిగెను. ఆ వివరములనన్నింటినీ తమరు చెప్పదగుదురు.

శ్రీశుక ఉవాచ

బాణః పుత్రశతజ్యేష్ఠో బలేరాసీన్మహాత్మనః

యేన వామనరూపాయ హరయేఽదాయి మేదినీ

శ్రీశుక మహర్షి ఇట్లు పలి కెను --- మహాత్ముడగు బలి చక్రవర్తి వామనరూపుడైన శ్రీహరికి భూమిని ఇచ్చేను. ఆ బలికి వందమంది కొడుకులు గలరు. వారిలో బాణుడు పెద్దవాడు.

తస్యౌరసస్సుతో బాణశ్శివభక్తిరతస్సదా

మాన్యో వదాన్యో ధీమాంశ్చ సత్యసంధో దృఢవ్రతః

ఆ బలికి ధర్మపత్నియందు జన్మించిన పుత్రుడగు బాణుడు సర్వకాల ములలో శివభక్తియందు ప్రీతి గలవాడు, సమ్మానించదగినవాడు, దాత, బుద్ధిశాలి, సత్యమునకు కట్టుబడినవాడు, గట్టి నియమనిష్ఠలు గలవాడు.

శోణితాఖ్యే పురే రమ్యే స రాజ్యమకరోత్పురా

తస్య శంభోః ప్రసాదేన కింకరా ఇవ తేఽమరాః

సహస్రబాహుర్వాద్యేన తాండవేఽతోషయన్మృడమ్

వేయి చేతులు గల ఆ బాణుడు పూర్వము శోణితమనే పేరు గల నగరమునందు రాజ్యమునేలెను. ఆతనికి శివుని అనుగ్రహముచే దేవతలు సేవకుల వలె నుండెడివారు. శివుడు తాండవము చేయుచుండగా, ఆతడు వేయి చేతులతో వాద్యములను వాయించి ఆయనను ప్రీతుని చేసెను.

భగవాన్ సర్వభూతేశశ్శరణ్యో భక్తవత్సలః

వరేణ చ్ఛందయామాస స తం వవై పురాధిపమ్

సకలప్రాణులను శాసించే శివభగవానుడు శరణు జొచ్చినవారిని పాలించును. భక్తులయందు గొప్ప ప్రేమ గల ఆ దేవుడు బాణుని వరమును కోరుకొమ్మని ప్రోత్సహించగా, ఆతడు ఆయనను తన నగరమునకు రక్షకుడవు కమ్మని కోరెను.

స ఏకదాఽఽహ గిరిశం పార్శ్వస్థం వీర్యదుర్మదః

కిరీటేనార్కవర్ణేన సంస్పృశంస్తత్పదాంబుజమ్

పరాక్రమముచే మిక్కిలి గర్వించియున్న ఆ బాణుడు ఒకనాడు సూర్యుని వలె ప్రకాశించే కిరీటముతో  పద్మములవంటి శివుని పాదములను స్పృశించి ప్రణమిల్లెను. అపుడాతడు తన ప్రక్కనే ఉన్న శివునితో నిట్లనెను.

నమస్యే త్వాం మహాదేవ లోకానాం గురుమీశ్వరమ్

పుంసామపూర్ణకామానాం కామపూరామరాంఘ్రిపమ్

ఓ మహాదేవా! నీవు లోకములకు తండ్రివి, శాసకుడవు. కోరికలు తీరని వ్యక్తులకు నీవు కోరికలను తీర్చే కల్పవృక్షమవు. నీకు నమస్కారము.

దోస్సహస్రం త్వయా దత్తం పరం భారాయ మేఽభవత్

త్రిలోక్యాం ప్రతియోద్ధారం న లభే త్వదృతే సమమ్

నీవు నాకిచ్చిన వేయి చేతులు కేవలము బరువు మాత్రమే ఆయెను. ముల్లోకములలో నిన్ను మినహాయిస్తే, నాతో సమానుడైన యుద్ధవీరుడు నాకు దొరకుట లేదు.

కండూత్యా నిభృతైర్దోర్బిర్యుయుత్సుర్దిగ్గజానహమ్

ఆద్యాయాం చూర్ణయన్నదీన్ భీతాస్తేఽపి ప్రదుద్రువుః

జగత్కారణుడవగు ఓ శివా! దురదతో నిండిపోయిన చేతులతో నేను యుద్ధమును చేయగోరి కొండలను పిండి చేస్తూ దిగ్గజముల వద్దకు వెళ్లితిని. అవి కూడా భయపడి పారిపోయినవి.

తచ్చ్రుత్వా భగవాన్ క్రుద్దః కేతుస్తే భజ్యతే యదా

త్వద్దర్పఘ్నం భవేన్మూఢ సంయుగం మత్సమేన తే

ఆ మాటను విని శివభగవానుడు కోపించి యిట్లనెను -- ఓరీ మూర్ఖా! ఏనాడైతే నీ జెండా విరిగి పడునో, ఆనాడు నాతో సమానమైన వానితో నీకు యుద్ధము జరుగును. దానిలో నీ పొగరు అణిగిపోవును.

ఇత్యుక్తః కుమతిర్హృష్టస్స్వగృహం ప్రావిశన్నృప

ప్రతీక్షన్ గిరిశాదేశం స్వవీర్యనశనం కుధీః

ఓ పరీక్షిన్మహారాజా! కైలాసవాసియగు శివుడిట్లు ఆదేశించగా, దుర్బుద్ధియగు బాణుడు హర్షముతో తన ఇంటికి వెళ్లి, తన పరాక్రమమును నశింపజేసే శివుని ఆదేశము (జెండా పడుట) కొరకు ప్రతీక్షించుచుండెను.

తస్యోషా నామ దుహితా స్వప్నే ప్రాద్యుమ్నినా రతిమ్

కన్యాఽలభత కాంతేన ప్రాగదృష్టశ్రుతేన సా

వానికి ఉష అని ప్రసిద్ధి జెందిన కుమార్తె గలదు. ఆ కన్య కలలో పూర్వమెప్పుడూ వినని కనని అందగానితో ప్రేమలో పడెను. ఆ అందగాడు ప్రద్యుమ్నుని పుత్రుడగు అనిరుద్ధుడు.

సా తత్ర తమపశ్యంతీ క్వాసి కాంతేతి వాదినీ

సఖీనాం మధ్య ఉత్తస్థౌ విహ్వలా వ్రీడితా భృశమ్  

ఆమెకు ఆ స్వప్నములోనే ఆ ప్రియుడు కనబడ లేదు. ఓ ప్రియుడా! ఎక్కడున్నావు? అని పలవరిస్తూ ఆమె సఖుల మధ్యలో నిద్ర లేచి నిలబడెను. అప్పుడామె కంగారునకు, అధికమగు సిగ్గునకు వశమయ్యేను.

బాణస్య మంత్రీ కుంభాండశ్చిత్రలేఖా చ తత్సుతా

సఖ్యపృచ్ఛత్సఖీమూషాం కౌతూహలసమన్వితా

బాణుని మంత్రియైన కుంభాండుని కుమార్తె చిత్రలేఖ ఉషకు చెలికత్తె. ఆమె కుతూహలముతో కూడినదై మిత్రురాలైన ఉషను ప్రశ్నించేను..

కం త్వం మృగయసే సుభ్రూః కీదృశ స్తే మనోరథః

హస్తగ్రాహం న తేఽద్యాపి రాజపుత్ర్యుపలక్షయే

అందమైన కనుబొమలు గల రాజకుమారీ!(కలలో) నీవెవరిని వెదుకుచున్నావు? నీ అభిలాష యెట్టిది? ఈనాటి వరకు నీకు వివాహము కాలేదు, పాణిగ్రహణము చేసిన భర్త లేడు.

ఊషోవాచ

దృష్టః కశ్చిన్నరస్స్వప్నే శ్యామః కమలలోచనః

పీతవాసా బృహద్బహుర్యోషితాం హృదయంగమః

ఉష ఇట్లు పలికెను --- నల్లనివాడు, కలువ కన్నులవాడు, పచ్చని వస్త్రమువాడు, పొడవాటి చేతులవాడు, అతివల హృదయమును దోచే ఒకానొక మానవుడు కలలో కనబడినాడు.

తమహం మృగయే కాంతం పాయయిత్వాఽధరం మధు

క్వాపి యాతస్స్పృహయతీం క్షిప్త్వా మాం వృజినార్ణవే

నేనా ప్రియుని వెదుకుచున్నాను. నాకు మధురమైన అధరమునందించి, ప్రేమించుచున్న నన్ను దుఃఖసముద్రములో పారవైచి ఆతడెక్కడికో వెళ్లినాడు.

చిత్రలేఖోవాచ

వ్యసనం తేఽపకర్షామి త్రిలోక్యాం యది భావ్యతే

తమానేష్యే నరం యస్తే మనోహర్తా తమాదిశ

చిత్రలేఖ ఇట్లు పలి కెను --- నీ దుఃఖమును పోగొట్టెదను. నీ మనస్సును దోచిన ఆ మానవుడు ముల్లోకములలో ఉన్నట్లైతే, ఆతనిని తీసుకువచ్చేదను. వాని గురించి చెప్పుము (వానిని గుర్తించుము).

ఇత్యుక్త్వా దేవగంధర్వసిద్ధచారణపన్నగాన్

దైత్యవిద్యాధరాన్ యక్షాన్ మనుజాంశ్చ యథాఽలిఖత్

ఇట్లు పలికి ఆమె దేవతలను, గంధర్వులను, సిద్ధులను, చారణులను, నాగులను, రాక్షసులను, విద్యాధరులను, యక్షులను, మానవులను కూడ ఉన్నవారిని ఉన్నట్లుగా బొమ్మలను గీసెను.

మనుజేషు చ సా వృష్ణీన్ శూరమానకదుందుభీమ్

వ్యలిఖద్రామకృష్ణౌ చ ప్రద్యుమ్నం వీక్ష్య లజ్జితా

మానవులలో కూడ యాదవులను, వారిలో శూరుని, వసు దేవుని, బలరాముని, శ్రీకృష్ణుని, ప్రద్యుమ్నుని కూడ చిత్రించేను. ఉష ప్రద్యుమ్నుని చూచి (పోలికచే ప్రియుని తండ్రియని) సిగ్గు పడెను.

అనిరుద్దం విలిఖితం వీక్ష్యోషావాజ్ముఖీ హ్రియా

సోఽసావసావిత ప్రాహ స్మయమానా మహీపతే  

ఓ పరీక్షిన్మహారాజా! అనిరుద్ధుని చిత్రపటమును చూచి ఉష సిగ్గుతో తల వంచి చిరునవ్వుతో, (కలలోని) ఆతడు ఈతడే, ఈతడే, అని పలికెను.

చిత్రలేఖా తమాజ్ఞాయ పౌత్రం కృష్ణస్య యోగినీ

యమౌ విహాయసా రాజన్ ద్వారకాం కృష్ణ పాలితామ్

ఓ పరీక్షిన్మహారాజా! చిత్రలేఖకు మహిమలు తెలియును. ఆతడు శ్రీకృష్ణుని కొడుకు కొడుకని ఆమె గుర్తించి, ఆకాశమార్గమున శ్రీకృష్ణునిచే రక్షించబడే ద్వారకకు వెళ్లాను.

తత్ర సుప్తం సుపర్యంకే ప్రాద్యుమ్నిం యోగమాస్థితా

గృహీత్వా శోణితపురం సఖ్యై ప్రియమదర్శయత్

ఆమె మాయాశక్తినాశ్రయించి, ఆ ద్వారకలో మంచి మంచముపై నిద్రించుచున్న ప్రద్యుమ్నపుత్రుడగు అనిరుద్దుని శోణితపురమునకు తీసుకువెళ్లి, మిత్రురాలగు ఉషకు ఆమే ప్రేమించినవానిని చూపించెను.

సా చ తం సుందరవరం విలోక్య ముదితాననా

దుష్ప్రేక్ష్యే స్వగృహే పుంభీ రేమే ప్రాద్యుమ్నినా సమమ్

అందగాళ్లలో అందగాడగు ఆ ప్రద్యుమ్నపుత్రుని చూచి ఉష ముఖము ఆనందముతో నిండెను. ఆమె అంతఃపురము మగవాళ్లకు చూడ శక్యము కానిది. ఆమె దానిలో ఆ అనిరుద్ధునితో గూడి రమించెను.

పరార్ఘ్యవాసస్స్రగ్గంధధూపదీపాసనాదిభిః

పానభోజనభక్ష్యైశ్చ వాక్యైశ్శుశ్రూషయాఃఽర్చితః

ఆమె అనిరుద్ధునకు మిక్కిలి విలువైన వస్త్రములు, పుష్పమాలలు, ధూపము, దీపము, ఆసనము, తాంబూలము మొదలగువాటిని సమర్పించేను. ఆతనికి పానీయములను, నమిలి తినదగిన మరియు మ్రింగదగిన ఆహారములను సమకూర్చెను. ఆమె అతనితో కబుర్లాడి సేవను చేసి ఆరాధించేను.

గూఢః కన్యాపురే శశ్వత్ప్రవృద్ధస్నేహయా తయా

నాహర్గణాన్ స బుబుధే ఊషయాఽపహృతేంద్రియః

ఆ అనిరుద్దుడు అంతఃపురములో రహస్యముగా ఉండెను. నిత్యము వర్ధిల్లుతున్న ప్రేమ గల ఉష ఆతని మనస్సును దోచివేసెను. ఆతనికి చాల దినములు గడిచిన విషయమే తెలియలేదు.

తాం తథా యదువీరేణ భుజ్యమానాం హతవ్రతామ్

హేతుభిర్లక్షయంచక్రురాపీతాం దురవచ్చ దైః

ఆ విధముగా ఆమె యాదవవీరుడగు అనిరుద్దునితో కలిసి రమిస్తూ మహానందముతో నుండెను. ఆమె కన్యాత్వమును కోల్పోయినదని దాచ శక్యము కాని గుర్తులను బట్టి అంతఃపురభటులు గుర్తించిరి.

భటా ఆవేదయాంచక్రూ రాజం స్తే దుహితుర్వయమ్

విచేష్టితం లక్షయామః కన్యాయాః, కులదూషణమ్

రాజభటులు బాణాసురునితో ఇట్లు విన్నవించిరి -- ఓ రాజా! కన్యయగు నీ కుమార్తె ప్రవృత్తి కులమును చెడగొట్టుచున్నదని మేము గుర్తించినాము.

అనపాయిభిరస్మాభిర్గుప్తాయాశ్చ గృహే ప్రభో

కన్యాయా దూషణం పుంభిర్దుష్ప్రేక్ష్యాయా న విద్మహే  

ఓ ప్రభూ! మేము క్షణము కూడా తొలగిపోకుండా జాగ్రత్తగా అంతః పురమును కాపాడితిమి. మగవాళ్లకు చూడ శక్యము కాని అంతఃపురములో కన్యను మగవాడు చెడగొట్టిన తీరు మాకు తెలియకున్నది.

తతః ప్రవ్యధితో బాణో దుహితుశ్ర్శుతదూషణః

త్వరితః కన్యకాఽఽగారం ప్రాప్తోఽద్రాక్షీద్యదూద్వహమ్

అప్పుడు కుమార్తె చెడిపోయినదనే వార్త విని చాల దుఃఖమును పొందిన బాణుడు వేగముగా కన్యకయొక్క అంతఃపురమునకు వెళ్లాను. అచట ఆయనకు యాదవశ్రేష్ఠుడగు అనిరుద్ధుడు కనబడెను.

కామాత్మజం తం భువనైకసుందరం

శ్యామం పిశంగాంబరమంబుజేక్షణమ్

బృహద్బుజం కుండలకుంతలత్విషా

స్మితావలోకేన చ మండితాననమ్

మన్మథుని పుత్రుడైన ఆ అనిరుద్దునితో సమానమైన అందగాడు ముల్లోకములలో లేడు. నల్లని ఆతడు పచ్చని వస్త్రమును దాల్చెను. పద్మములవంటి కన్నులు, పొడవాటి చేతులు గల ఆతని ముఖమునకు కుండలములు, ముంగురులు, చిరునవ్వుతో కూడిన చూపులే అలంకారములాయెను.

దీవ్యంతమక్షైః ప్రియయాఽభినృమ్ణయా

తదంగసంగస్తనకుంకుమస్రజమ్

బాహ్వార్దధానం మధుమల్లికాఽఽశ్రితాం

తస్యాఃఽగ్ర ఆసీనమవేక్ష్య విస్మితః

అనిరుద్దుడు సర్వాంగసుందరియగు ప్రియురాలి యెదుట కూర్చుండి ఆమెతో పాచికలాడుచుండెను. ఆతడు ఆమె దేహముతోడి సంగముచే స్తనములయందలి కుంకుమ గల మాలను వక్షఃస్థలము పై దాల్చెను. ఆ మాల వసంతకాలమునందలి మల్లెలతో గ్రుచ్చినది. ఆతనిని చూచి బాణుడు ఆశ్చర్యమును పొందెను.

స తం ప్రవిష్టం వృతమాతతాయిభిః

భటైరనీ కైరవలోక్య మాధవః

ఉద్యమ్య మౌర్వం పరిఘం వ్యవస్థీతో

యథాంఽతకో దండధరో జిఘాంసయా

ఆయుధములను పైకెత్తి పట్టుకున్న అనేకభటులు చుట్టువారి రాగా ప్రవేశించిన బాణుని చూచి, మధువంశీయుడగు ఆ అనిరుద్దుడు లోహమిశ్రమపు గుదీయను పైకెత్తి నిలబడెను. ఆయన సంహరించుటకై కాలదండమును ధరించిన యముని పోలియుండెను.

జిఘృక్షయా తాన్ పరితః ప్రసర్పతః 

శునో యధా సూకరయూథపోఽహనత్

తే హన్యమానా భవనాద్వినిర్గతా

నిర్భిన్నమూర్ధోరుభుజాః ప్రదుద్రువుః

అనిరుద్దుని పట్టుకొనగోరి ఆ రాజభటులు చుట్టుముట్టిరి. అపుడాతడు, గుంపుకు నాయకత్వము వహించే వరాహము కుక్కలను వలె, వారిని  గుదియతో మోదెను. తలలు పగిలి తొడలు, చేతులు విరుగుచుండ వారు భవనమునుండి బయటకు వచ్చి పలాయనము చిత్తగించిరి.

తం నాగపాశైర్బలినందనో బలీ

ఘ్నంతం స్వ సైన్యం కుపితో బబంధ హ

ఊషా భృశం శోకవిషాదవిహ్వలా

బద్ధం నిశమ్యాశ్రుకలాక్ష్యరౌదిషీత్

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే ద్విషష్టితమోఽధ్యాయః

బలిచక్రవర్తియొక్క పుత్రుడగు బాణుడు బలశాలి. ఆతడు తన సైన్యమును సంహరించుచున్న అనిరుద్ధుని నాగపాశములతో కట్టివేసెను. తన ప్రియుడు బంధించబడినాడని విని ఉష మానసిక దుఃఖముతో, శరీరమునందలి నీరసముతో వ్యాకులపడెను. ఆమె కళ్ల నిండా నీళ్లు పెట్టుకొని విలపించెను.

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో ఉషా-అనిరుద్ధుల సమాగమమును వర్ణించే అరువది రెండవ అధ్యాయము ముగిసినది (62).