55 - ప్రద్యుమ్నుని జన్మ - శంబరాసురుని వధ

శ్రీశుక ఉవాచ

 కామస్తు వాసుదేవాంశో దగ్ధః ప్రాగ్రుద్రమన్యునా

దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- వాసుదేవుని అంశయగు కాముడు పూర్వము రుద్రుని కోపముచే తగుల పెట్టబడినాడు. ఆతడు మరల

దేహమును పొందుటకై వాసుదేవునే ఆశ్రయించెను.

స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్యసముద్భవః

ప్రద్యుమ్న ఇతి విఖ్యాతస్సర్వతోఽనపమః పితుః

ఆ కాముడే శ్రీకృష్ణుని వీర్యము వలన విదర్భరాజపుత్రికయగు రుక్మిణియందు జన్మించి ప్రద్యుమ్నుడని ప్రసిద్ధి గాంచేను. ఆతడు సకలగుణములచే తండ్రికి తీసిపోనివాడు.

తం శంబరః కామరూపీ హృత్వా తోకమనిర్ధశమ్

 స విదిత్వాఽఽత్మనశ్శత్రుం ప్రాస్యోదన్వత్యగాద్గృహమ్

కోరిన రూపు దాల్చే శంబరునకు తన శత్రువైన కాముడు ప్రద్యుమ్నుడుగా పుట్టినాడని తెలి సెను. ఇంకనూ ప్రద్యుమ్నుడు పది రోజులు నిండని పసివాడు. శంబరుడా పసివానిని అపహరించి సముద్రములో పారవైచి ఇంటికి వెళ్లాను.

తం నిర్జగార బలవాన్మీనస్సోఽప్యపరైస్సహ

 వృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః

బలవంతమైన చేప ఆ శిశువును మ్రింగెను. మత్స్యకారులు పెద్ద వల వేయగా, ఆ చేపతో బాటుగా మరికొన్ని చేపలు దానిలో చిక్కి పట్టబడినవి.

తం శంబరాయ కైవర్తా ఉపాజహ్రురుపాయనమ్

 సూదా మహానసం నీత్వాఽవద్యన్ స్వధితినాఽద్భుతమ్

 మత్స్యకారులు ఆ వింత చేపను శంబరునికి ఉపహారముగా సమర్పించిరి. వంటవాళ్లు దానిని వంటశాలకు తీసుకువెళ్లి కత్తితో కోసిరి.

దృష్ట్వా తదుద రే బాలం మాయావత్యై న్యవేదయన్

 నారదోఽకథయత్సర్వం తస్యాశ్శంకిత చేతసః

బాలస్య తత్త్వముత్పత్తిం మత్స్యదరనివేశనమ్

 ఆ చేప పొట్టలో పిల్లవానిని చూచి ఆ వంటవారు శంబరుని దాసియగు మాయావతికి విన్నవించిరి. ఆమెకు మనస్సులో శంక కలిగెను. అపుడు నారదుడామెకు ఆ బాలుడు కాముని అవతారమని, రుక్మిణికి జన్మించిన విషయమును, చేప పొట్టను చేరిన వైనమును సర్వమును చెప్పెను.

సా చ కామస్య వై పత్నీ రతిర్నామ యశస్వినీ

 పత్యుర్నిర్దగ్ధదేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతీ

 ఆమె రతి అని ప్రసిద్ది చెందిన కాముని పత్ని, పతివ్రత. వాని దేహము దహించబడగా, మరియొక దేహము కలుగుటకై ఆమె వేచి చూచు చుండెను.

నిరూపితా శంబ రేణ సా సూపౌదనసాధనే

 కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదాఽర్భకే

ఆమె శంబరునిచే పప్పు-అన్నమును తయారు చేసే పనియందు నియోగించబడినది. ఆ పిల్లవాడు కామదేవుడేనని తెలిసి ఆమె అప్పుడా పిల్లవానియందు ప్రేమను కలిగియుండెను.

నాతిదీర్ఘేణ కాలేన స కార్ ష్ణీ రూఢయౌవనః

 జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమమ్

కృష్ణుని పుత్రుడగు ఆ ప్రద్యుమ్నుడు కొంత కాలమునకే యువకుడాయెను. ఆతనిని చూచే యువతులకు సమ్మోహము కలిగెడిది.

సా తం పతిం పద్మదలాయతేక్షణం

ప్రలంబబాహుం నరలోకసుందరమ్

 సవ్రీడహాసోత్తభితభ్రువేక్షతీ

ప్రీత్యోపత స్థే రతిరంగ సౌరతైః

ఓ పరీక్షిన్మహారాజా! పొడవాటి చేతులు గల ఆ ప్రద్యుమ్నుడు పద్మపు రేకుల వలె విశాలమైన కన్నులతో మానవలోకమునందే అందగాడుగ నుండెను. ఆ మాయావతి అట్టి భర్తను సిగ్గుతో కూడిన చిరునవ్వుతో కనుబొమలు నాట్యమాడుచుండగా ప్రేమతో చూస్తూ, ప్రేమను ప్రకటించే హావభావములతో సేవించెను.

తామహ భగవాన్ కార్ ష్ణిర్మాతస్తే మతిరన్యథా

 మాతృభావమతిక్రమ్య వర్త సే కామినీ యథా

కృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్న భగవానుడామెతో నిట్లనెను -- అమ్మా! నీ బుద్ది విపరీతముగా నున్నది. నీవు తల్లి ప్రేమను అతిక్రమించి కాముకురాలు వలె ప్రవర్తిల్లుచున్నావు.

రతిరువాచ

 భవాన్నారాయణసుతశ్శంబరేణాహృతో గృహాత్

 అహం తేఽధికృతా పత్నీ రతిః కామో భవాన్ ప్రభో

            రతి ఇట్లు పలికెను --- ఓ ప్రభూ! శ్రీకృష్ణభగవానుని పుత్రుడవగు నిన్ను శంబరుడు ఇంటి నుండి అపహరించి తెచ్చినాడు. నేను పూర్వజన్మయందు నీ ధర్మపత్నినగు రతీదేవిని. నీవు కాముడవు.

ఏష త్వాఽనిర్దశం సింధావాక్షిపచ్చంబరోఽసురః

మత్స్యోఽ గ్రసిత్తదుదరాదిహ ప్రాప్తో భవాన్ ప్రభో

            ఓ ప్రభూ! పది దినముల వయస్సు కూడ లేని నిన్ను శంబరాసురుడు సముద్రములో పారవేయగా చేప మ్రింగెను. ఆ చేపపొట్టలోనున్న నీవు ఇచటకు చేరుకుంటివి.

తమిమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః

మాయాశతవిదం త్వం చ మాయాభిర్మోహనాదిభిః  

నీ శత్రువగు అట్టి ఈ శంబరుని వశము చేసుకొనుట గాని, జయించుట గాని కష్టమే. ఈతడు వందల మాయలు తెలిసినవాడు. నీవు కూడ మోహనము (శత్రువునకు మూర్చ వచ్చునట్లు చేయుట), శోషణము (శత్రువునకు తీరని దప్పిక కలుగుట) మొదలైన మాయలచే వధించుము.

పరిశోచతి తే మాతా కురరీవ గతప్రజా

 పుత్ర స్నేహాకులా దీనా వివతా గౌరివాతురా

            తన కొడుకు దూరము కాగా కొడుకునందలి ప్రేమచే వ్యాకులపడు చున్న నీ దీనురాలగు తల్లి లకుముకి పిట్ట వలె, దూడను పోగొట్టుకున్న ఆవు వలే, దుఃఖించుచున్నది.

ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే

 మాయావతీ మహామాయాం సర్వమాయావినాశినీమ్

 మాయావతి ఇట్లు పలికి మహాత్ముడగు ప్రద్యుమ్నునకు మహామాయ అనే విద్యను ఉపదేశించెను. ఆ విద్య సకలమాయలను నశింప జేయును.

స చ శంబరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్

అవిష హ్యైస్తమాక్షే పైః క్షిపన్ సంజనయన్ కలిమ్

            ఆ ప్రద్యుమ్నుడు కూడ శంబరుని వద్దకు వెళ్లి, ఆతనిని సహించ శక్యము కాని కటువైన మాటలతో నిందిస్తూ, కలహమును సృష్టించి, యుద్ధమునకు సవాలు విసిరెను.

సోఽధిక్షిప్తో దుర్వచోభిః పాదాహత ఇవోరగః

నిశ్చక్రామ గదాపాణిరమర్షాత్తామ్రలోచనః

            చేడు మాటలతో నిందించబడిన ఆ శంబరుడు కాలితో తొక్కబడిన పాము వలే నుండెను. కోపముతో ఎర్రనైన కన్నులు గల ఆతడు గద చేతితో పట్టుకొని బయటకు వచ్చెను.

గదామావిధ్య తరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే

ప్రక్షిప్య వ్యనదన్నాదం వజ్రని ష్పేషనిష్ఠురమ్

 శంబరుడు గదను త్రిప్పి మహాత్ముడగు ప్రద్యుమ్నునిపై వేగముగా విసిరి, పిడుగుపాటు వలె మిక్కిలి కఠోరమైన నాదమును చేసెను.

తామాపతంతీం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదామ్

అస్య శత్రమే క్రుద్ధః ప్రాహిణోత్స్వగదాం నృప

 ఓ రాజా! మీదకు వచ్చి పడుచున్న ఆ గదను ప్రద్యుమ్న భగవానుడు గదతో త్రోసివేసి కోపముతో తన గదను శత్రువగు శంబరునిపై విసి రెను.

స చ మాయాం సమాశ్రిత్య దైతేయీం మయదర్శితామ్

 ముముచేఽస్త్రమయం వర్షం కార్ ష్ణౌ వైహాయసోఽసురః

 ఆ శంబరాసురుడున్నూ రాక్షసమాయనాశ్రయించి ఆకసమునందున్న వాడై శ్రీకృష్ణుని పుత్రుడగు ప్రద్యుమ్నునిపై ఆయుధముల వర్షమును కురిపించెను. ఆ మాయను మయుడు కనుగొనెను.

బాధ్యమానోఽస్త్రవర్షేణ రౌక్మిణేయో మహారథః

 సత్త్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్దినీమ్

            రుక్మిణి పుత్రుడగు ప్రద్యుమ్నుడు గొప్ప రథికుడు. ఆయన ఆయుధముల వర్షముచే పీడించబడినవాడై మహావిద్యను ప్రయోగించెను. సత్త్వగుణప్రధానమగు ఆ విద్య సకలమాయలను మట్టుబెట్టును.

తతో గౌహ్యకగాంధర్వ పైశాచోరగరాక్షసీః

 ప్రాయుంక్త శతశో దైత్యః కార్ ష్ణిర్వ్యధమయత్స తాః

తరువాత శంబరాసురుడు యక్ష-గంధర్వ-పిశాచ-నాగ-రాక్షసులకు చెందిన వందలాది మాయలను ప్రయోగించగా, శ్రీకృష్ణ పుత్రుడగు ఆ ప్రద్యుమ్నుడు వాటిని చెల్లాచెదరు చేసెను.

నిశాతమసిముద్యమ్య సకిరీటం సకుండలమ్

 శంబరస్య శిరః కాయాత్తామ్రశ్మశ్ర్వోజసాఽహరత్

ప్రద్యుమ్నుడు వాడి కత్తితో శంబరుని తలను బలముగా మొండెమునుండి వేరు చేసెను. ఆ తలకు కిరీటము, కుండలములు, ఎర్రని గెడ్డము మీసములు ఉండెను.

ఆకీర్యమాణో దివిజైః స్తువద్భిః కుసుమోత్క రైః

 భార్యయాఽoబరచారిణ్యా పురం నీతో విహాయసా

దేవతలు ప్రద్యుమ్నుని స్తుతిస్తూ దోసిళ్లతో పూలను కురిపించిరి. ఇంతలో మాయావతి ఆకాశమునందు సంచరిస్తూ ఆయనను ఆకాశమార్గము గుండా ద్వారకానగరమునకు తీసుకువెళ్లాను.

అంతఃపురవరం రాజన్ లలనాశతసంకులమ్

వివేశ పత్న్యా గగనాద్విద్యుతేవ బలాహకః

ఓ పరీక్షిన్మహారాజా! ప్రద్యుమ్నుడు భార్యతో గూడి వందలాది యువతులతో హడావుడిగానుండే గొప్ప (రుక్మిణి) అంతఃపురమును ఆకాశమునుండి, మెరుపుతో కూడిన మేఘము వలె, ప్రవేశించేను.

తం దృష్ట్వా జలదశ్యామం పీతకౌశేయవాససమ్

ప్రలంబబాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననమ్

స్వలంకృతముఖాంభోజం నీలవక్రాలకాలిభిః

 కృష్ణం మత్వా స్త్రియోహ్రీతా నిలిల్యుస్తత్ర తత్ర హ

మేఘము వలే నల్లని ఆ ప్రద్యుమ్నుడు పచ్చని పట్టు వస్త్రమును దాల్చెను. పొడవాటి చేతులు గల ఆయన కన్నులు తేనె రంగు కలిగియుండెను. ఆయన మోము చక్కని చిరునవ్వుతో అందముగా నుండెను. నల్లని గిరజాల ముంగురులనే తుమ్మెదలే పద్మమును పోలిన ఆయన ముఖమునకు చక్కని అలంకారములాయెను. ఆయనను చూచి అంతఃపురస్త్రీలు శ్రీకృష్ణుడని తలచి లోపల అక్కడక్కడ నక్కిరట.

అవధార్య శనైరీషద్వైలక్షణ్యేన యోషితః

 ఉపజగ్ముః ప్రముదితాస్సస్త్రీరత్నం సువిస్మితాః

ఆ స్త్రీలు మెల్లగా ప్రద్యుమ్నునికి శ్రీకృష్ణునికి కొద్ది తేడాను నిశ్చయముగా గుర్తించి దగ్గరగా వచ్చిరి. గొప్ప యువతితో కూడియున్న ఆతనిని చూచి వారు గొప్ప ఆశ్చర్యమును, ఆనందమును కూడ పొందిరి.

అథ తత్రాసితాపాంగీ వైదర్భీ వల్గుభాషిణీ

 అస్మరత్స్వసుతం నష్టం స్నేహస్నుతపయోధరా

నల్లని కనుకొనలతో మధురముగా మాటలాడే విదర్భరాజకుమారి రుక్మిణి అపుడచటకు వచ్చెను. ఆమె పాలిండ్లు ప్రేమతో పాలను స్రవించెను. ఆమెకు తప్పిపోయిన తన పుత్రుడు గుర్తుకు వచ్చెను.

కో న్వయం నరవైదూర్యః కస్య వా కమలేక్షణః

ధృతః కయా వా జఠరే కేయం లబ్ధా త్వనేన వా

మానవులలో శ్రేష్ఠుడగు ఈతడు ఎవడు? ఈ కలువ కన్నులవాడు ఎవరివాడు? ఈతనిని నవమాసాలు మోసి కన్న తల్లి యెవరో? ఈతడు భార్యగా పొందిన ఈ యువతి ఎవరై యుండును?

మమ చాప్యాత్మజో నష్టో నీతో యస్సూతికాగృహాత్

ఏతత్తుల్యవయోరూపో యది జీవతి కుత్రచిత్

నా పుత్రుడు కూడ తప్పిపోయినాడు. పురిటి యింటినుండియే అపహరించబడిన ఆ బాలుడు ఎక్కడో అక్కడ జీవించియున్నచో, వయస్సు, రూపు ఈతనిని పోలియుండును.

కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం శార్ జ్గధన్వనః

 ఆకృత్యాఽవయవైర్గత్యా స్వరహాసావలోకనైః

ఆకారము, అవయవములు, నడక, మాట, నవ్వు, చూపులు అనువాటిలో ఈతడు శార్ఙమనే ధనుస్సు గల శ్రీకృష్ణ భగవానునితో సమానముగా ఉన్నాడు. ఇది ఎట్లు ఘటిల్లినది? -

స ఏవ వా భవేన్నూనం యో మే గర్భే ధృతోఽర్భకః

అముష్మిన్ ప్రీతిరధికా వామస్ఫురతి మే భుజః

 నాకు వీనియందు అధికమగు ప్రీతి కలుగుచున్నది. నా ఎడమ చేయి అదురుచున్నది. నేను గర్భములో ధరించిన పిల్లవాడు నిశ్చయముగా ఈతడే అయి ఉండును.

ఏవం మీమాంసమానాయాం వైదర్బ్యాం దేవకీసుతః

 దేవక్యానకదుందుభ్యాముత్తమశ్లోక ఆగమత్

 విదర్భరాజకుమారియగు రుక్మిణి ఈ విధముగా తర్కించుచుండెను. ఇంతలో దేవకి పుత్రుడు, పవిత్రకీర్తి అగు శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులతో గూడి విచ్చే సెను.

విజ్ఞానార్థోఽపి భగవాంస్తూష్ణీమాస జనార్దనః

 నారదోఽకథయత్సర్వం శంబరాహరణాదికమ్

 దుష్టజనశిక్షకుడగు శ్రీకృష్ణ భగవానుడు విషయమంతా తెలిసినా మిన్నకుండెను. శంబరుడు పిల్లవానిని అపహరించుట, మాయావతిని కలుసుకొనుట మొదలగు వివరములనన్నింటినీ నారదుడు వివరించెను.

తచ్చ్రుత్వా మహదాశ్చర్యం కృష్ణాంతఃపుర యోషితః

అభ్యనందన్ బహూనబ్దాన్ నష్టం మృతమివాగతమ్

            ఆ గొప్ప అద్బుతమును శ్రీకృష్ణుని అంతఃపురములోని స్త్రీలు విని ప్రద్యుమ్నుని అభినందించిరి. ఆతడు చాల సంవత్సరములు తప్పిపోయి, మరణించినవాడే తిరిగి వచ్చినాడా యన్నట్లుండెను.

దేవకీ వసుదేవశ్చ కృష్ణ రామౌ తథా స్త్రీయః

దంపతీ తౌ పరిష్వజ్య రుక్మిణీ చ యయుర్ముదమ్

దేవకీ, వసుదేవుడు, శ్రీకృష్ణుడు, బలరాముడు, రుక్మిణి, అంతఃపురస్త్రీలు కూడ ఆ దంపతులను కౌగిలించి ఆనందించిరి.

నష్టం ప్రద్యుమ్నమాయాతమాకర్ణ్య ద్వారకౌకసః

 అహో మృత ఇవాయాతో బాలో దిష్ట్యేతి హాబ్రువన్

తప్పిపోయిన ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చినాడని విని ద్వారకానగరవాసులు ఇట్లు పలికిరట -- ఆహా! మంగళము. మరణించిన పిల్లవాడు తిరిగి వచ్చినాడా అన్నట్లున్నది.

యం వై ముహుః పితృసరూపనిజేశభావాః

తన్మాతరో యదభజన్ రహరూఢభావాః

చిత్రం న తత్ఖలు రమాస్పదబింబబింబే

కామే స్మరేఽక్షివిషయే కిముతాన్యనార్యః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

 ఉత్తరార్ధే పంచపంచాశత్తమోఽధ్యాయః

         ప్రద్యుమ్నుడు పూర్తిగా తండ్రియగు శ్రీకృష్ణుని పోలియుండెను. ఆతనిని చూచి కృష్ణపత్నులు పలు మార్లు తమ భర్త అని తలపోసి ఏకాంతమునందు ప్రేమను భావన చేసెడివారు. కాని, వెంటనే తెలుసుకొని ఆతనితో - యథోచితముగా వ్యవహరించెడివారు. లక్ష్మీదేవికి పెనిమిటియగు శ్రీహరియొక్క అవతారమైన శ్రీకృష్ణునకు పుత్రుడగు కాముని విషయములో ఇట్టి భ్రాంతి కలుగుట విచిత్రము కానే కాదు. సాక్షాత్తు కాముడు ఎదురుగా నుండగా, ఇతరస్త్రీలు ప్రేమను పొందిరని వేరుగా చెప్పవలయునా?

శ్రీమద్బాగవత మహాపురాణము పదవ స్కంధములో

ప్రద్యుమ్నుని జన్మను, శంబరాసురుని వధను వర్ణించే

ఏబది యైదవ అధ్యాయము ముగిసినది .