భాగవత మహా పురాణము
25 - గోవర్ధనోద్ధారము
శ్రీశుక ఉవాచ।
ఇంద్రస్తదాఽఽత్మనః పూజాం విజ్ఞాయ విహతాం నృప ।
గోపేభ్యః కృష్ణ నాథేభ్యో నందాదిభ్యశ్చుకోప సః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఓ పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణుడు రక్షకుడుగా గల నందుడు మొదలైన గోపాలకులు తన పూజను ఆపివేసిరని తెలిసి, అప్పుడా ఇంద్రునకు కోపము వచ్చెను.
గణం సాంవర్తకం నామ మేఘానాం చాంతకారిణామ్ ।
ఇంద్రః ప్రాచోదయత్క్రుద్ధో వాక్యం చాహేశమాన్యుత ॥
లోకపాలకుడననే అభిమానముతో కోపించిన ఇంద్రుడు సాంవర్తకమని ప్రసిద్ధి గాంచిన మేఘముల గణమును ఆజ్ఞాపించెను. ఆ మేఘములు ప్రళయమును కలిగించును. ఆయన వాటితో నిట్లనెను.
అహో శ్రీమదమాహాత్మ్యం గోపానాం కాననౌకసామ్ ।
కృష్ణం మర్త్యముపాశ్రిత్య యే చక్రుర్దేవహేలనమ్ ॥
ఆహా! అడవిలో బ్రతికే గోపాలకుల ధనగర్వముయొక్క మహిమను చూడుడు. వారు మానవుడగు కృష్ణుని ఆశ్రయించి నాకు అవమానమును చేసిరి.
యథాఽదృఢైః కర్మమయైః క్రతుభిర్నామనౌనిభైః ।
విద్యామాన్వీక్షికీం హిత్వా తితీర్షంతి భవార్ణవమ్ ॥
కర్మరూపములైన యజ్ఞములు పేరుకి నావవంటివి. కాని, అవి గట్టివి కావు. కొందరు ఆత్మస్వరూపమును బోధించే జ్ఞానమును ప్రక్కన బెట్టి, వాటితో సంసారసముద్రమును తరించ గోరెదరు. అదే విధముగా గోపాలకులు చేయుచున్నారు.
వాచాలం బాలిశం స్తబ్ధమజ్ఞం పండితమానినమ్ ।
కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపా మే చక్రురప్రియమ్ ॥
కృష్ణుడు వదరుబోతు, మూర్ఖుడు, గర్విష్ఠి, అజ్ఞాని, పండితుడననే అభిమానము గలవాడు, మరణించే స్వభావము గల మానవుడు. వానిని ఆశ్రయించి గోపాలకులు నాకు అప్రియమును చేసిరి.
ఏషాం శ్రియాఽవలిప్తానాం కృష్ణేనాధ్మాయితాత్మనామ్ ।
ధునుత శ్రీమదస్తంభం పశూన్నయత సంక్షయమ్ ॥
ధనముతో గర్వించి యున్న వీరి మనోబలమును కృష్ణుడు వర్ధిల్ల జేసినాడు. వీరి పొగరును కడిగివేయుడు. పశువులను వినాశము చేయుడు.
ఆహం చైరావతం నాగమారుహ్యానువ్రజే వ్రజమ్ । మరుద్గణైర్మహావీర్యైర్నందగోష్ఠజిఘాంసయా ॥
నందుని గోకులమును నశింప జేయగోరుచున్నాను. నేను కూడ గొప్ప బలము గల మరుత్తుల గణములతో కూడి ఐరావతమనే ఏనుగునెక్కి మీ వెంట గోకులమునకు వచ్చెదను.
శ్రీశుక ఉవాచ।
ఇత్థం మఘవతాఽఽజ్ఞప్తా మేఘా నిర్ముక్తబంధనాః ।
నందగోకులమాసారైః పీడయామాసురోజసా ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- ఈ విధముగా ఆజ్ఞాపించి ఇంద్రుడు మేఘముల బంధనములను తొలగించివేసెను. అవి వేగముగా నందుని గోకులమునకు వచ్చి నీటి ధారలతో పీడను కలుగజేసెను.
విద్యోతమానా విద్యుద్భిః స్తనంతః స్తనయిత్నుభిః ।
తీవ్రైర్మరుద్గణైర్నున్నా వవృషుర్జలశర్కరాః ॥
మెరుపులతో అధికముగా ప్రకాశిస్తూ పిడుగుల ధ్వనులతో గర్జిస్తున్న మేఘములను ప్రచండచుగు గాలులతో మరుద్గణములు ప్రేరిపించినవి. అపుడా మేఘములు వడగళ్లను వర్షించినవి.
స్థూణాస్థూలా వర్షధారా ముంచత్స్వభ్రేష్వభీక్ ష్ణశః ।
జలౌఘైః ప్లావ్యమానా భూర్నాదృశ్యత సతోన్నతమ్ ॥
మేఘములు స్తంభములవలె దొడ్డు నీటి ధారలను నిరంతరముగా వర్షించినవి. నేల అంతా నీటి ప్రవాహములచే ముంచెత్తబడి, ఎత్తు పల్లములు కనబడకుండా పోయినవి.
అత్యాసారాతివాతేన పశవో జాతవేపనాః ।
గోపా గోప్యశ్చ శీతార్తా గోవిందం శరణం యయుః ॥
కుండపోత వర్షముతో కూడిన ప్రచండమగు గాలి వలన పశువులకు, గోపాలకులకు, గోపికలకు కూడ చలితో వణుకు పుట్టి బాధపడిరి. వారు గోవులను రక్షించే శ్రీకృష్ణుని శరణు వేడిరి.
శిరస్సుతాంశ్చ కాయేన ప్రచ్ఛాద్యాసారపీడితాః ।
వేపమానా భగవతః పాదమూలముపాయయుః ॥
కుండపోత వర్షము చే పీడించబడి వణికిపోవుచున్న ఆవులు తమ తలను, దూడలను దేహము క్రింద కప్పి, శ్రీకృష్ణ భగవానుని పాదముల మూలమును చేరుకున్నవి.
కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాథం గోకులం ప్రభో ।
త్రాతుమర్హసి దేవాన్నః కుపితాద్భక్తవత్సల ॥
ఓ శ్రీకృష్ణా! ఓ శ్రీకృష్ణా! నీవు మహాత్ముడవు, భక్తులయందు వాత్సల్యము గల ప్రభుడవు. గోకులమునకు రక్షకుడవు నీవే. కోపించిన ఇంద్రునినుండి గోకులమును, మమ్ములను రక్షించుటకు నీవే తగుదువు.
శిలావర్షనిపాతేన హన్యమానమచేతనమ్ ।
నిరీక్ష్య భగవాన్మేనే కుపితేంద్రకృతం హరిః ॥
వడగళ్ల వర్షపు దెబ్బలకు సకల ప్రాణులు స్పృహను కోల్పోవుచుండెను. ఆ దృశ్యమును చూచి శ్రీకృష్ణ భగవానుడు, అదంతా కోపించిన ఇంద్రుడు చేసిన పనియేనని తెలుసుకొనెను.
అపర్వత్యుల్బణం వర్షమతివాతం శిలామయమ్ ।
స్వయాగే విహతేఽస్మాభిరింద్రో నాశాయ వర్షతి ॥
మనము తన యాగమును ఆపివేసినందున ఇంద్రుడు మన వినాశము కొరకై వర్ష - ఋతువు కాకున్నా మిక్కిలి భయంకరమైన రాళ్ల నానను కురిపించుచున్నాడు. ఆ వర్షమునకు అధికమగు గాలి తోడై చాల భయమును గొల్పుచున్నది. (అని శ్రీకృష్ణుడు తలపోసెను).
తత్ర ప్రతివిధిం సమ్యగాత్మయోగేన సాధయే ।
లోకేశమానినాం మౌఢ్యాద్ధరిష్యే శ్రీమదం తమః ॥
ఆ విషయమునందు ప్రతిచర్యసు నేను నా సామర్థ్యము (మాయాశక్తి) చే బాగుగా సాధించెదను. మూర్ఖత్వముచే లోకపాలకులమనే అభిమానము గల ఇంద్రాదుల ధనగర్వమును, అజ్ఞానమును నేను పోగొట్టెదను.
న హి సద్భావయుక్తానాం సురాణామీశవిస్మయః ।
మత్తోఽసతాం మానభంగః ప్రశమాయోపకల్పతే ॥
దేవతం సత్త్వ ప్రధానమగు అంతఃకరణము గలవారు. వారుకి పాలకులమనే గర్వము , యుక్తము, కాదు. దుష్టులకు నేను చేసే గర్వభంగము వారికి అనర్ధములను గొట్టుటయందే పర్యంవసించును.
తస్మాన్మ చ్ఛరణు గోష్టం మ్న్నాథం మత్పరిగ్రహమ్ ।
గోసాయే స్వాత్మయోగేన సోఽయం మే వ్రత ఆహితః ॥
ఈ గోకులమునకు రక్షకుడను, ప్రభువును నేనే. నేనీ గోకులమును నా కుటుంబముగా స్వీకరించినాను. కావున, దీనిని నేను నా మాయాశక్తి చే రక్షించెదను. నేను అట్టి ఈ సత్పురుషులను రక్షించుట అనే వ్రతమును స్వీకరించినాను.
ఇత్యు క్త్వైకేన హస్తేన కృత్త్వా గోవర్ధనాచలమ్ ।
దధార లీలయా కృష్ణశ్ఛత్రాకమివ బాలకః ॥
ఇట్లు పలికి శ్రీకృష్ణుడు ఒకే చేతితో గోవర్ధన పర్వతమునూడబెరకి, పిల్లవాడు కుక్కగొడుగును వలె, అవలీలగా ధరించెను.
అథాహ భగవాన్ గోపాన్ హేంఽబ తాత వ్రజౌకసః !
యథోపజోషం విశత గిరిగర్తం సగోధనాః ॥
అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గోపాలకులతో నిట్లనెను – ఓ తండ్రీ! గోకులవాసులారా! ఈ పర్వతము యొక్క పల్లమునందు గోసంపదలతో సహా ప్రవేశించి విశ్రాంతిగా నుండుడు.
న త్రాస ఇహ వః కార్యో మద్దస్తాద్రిని తనే ।
వాతవర్షభయేనాలం తత్త్రాణం విహితం హి వః ॥
ఇచట నా చేతినుండి సర్వతము పడిపోవునేమోననే భయము మీకు వద్దు, మీరు గాలికి, వర్షమునకు ఇకపై భయపడవద్దు. ఎందుకంటే, వాటినుండి మీకు నేనీ రక్షణనేర్పాటు చేసినాను.
తథా నిర్వివిశుర్గర్తం కృష్ణా శ్వాసితమానసాః ।
యథాఽవకాశం సధనాస్సవ్రజాస్సోపజీవినః ।
శ్రీకృష్ణుడు వారి మనస్సులలో విశ్వాసమును కలిగించెను. అప్పుడు వారు ఆయన చెప్పినట్లుగా తమ సంపదలతో కూడి, సామానును బళ్లలో నింపుకొని, సేవకులు మొదలగువారితో సహా తొడతొక్కిడి లేకుండా విశాలమైన ఆ పర్వతము ఉండిన పల్లములోనికి ప్రవేశించిరి.
క్షుత్వడ్వ్యథాల సుఖా పేక్షాం హిత్వా తైర్వ్రబవాసిభిః ।
వీక్ష్యమాణో దధావరద్రిం సప్తాహం నాచలత్పదాత్ ॥
ఆ గోకులవాసులు చూస్తూండగా, ఆకలి దప్పికల పీడ గాని, సుఖాపేక్ష గాని లేకుండా, ఆయన నిలబడ్డ చోటునుండి కదలకుండా నిరంతరముగా ఏడు రోజులు పర్వతమును మోస్తూ ఉండెను.
కృష్ణ యోగానుభావం తం నిశామ్యేంద్రోఽతివిస్మితః ।
నిఃస్తంభో భ్రష్ట సంకల్పస్స్వాన్మేఘాన్ సన్న్యవారయత్ ॥
శ్రీకృష్ణుని యోగమాయ యొక్క ఆ మహిమను చూచి ఇంద్రుడు చాల విస్మయమును పొందెను. ఆతని గర్వము తొలగిపోయి గోకులమును నశింప జేయాలనే సంకల్పము జారిపోయెను. ఆతడు తన మేఘములను పూర్తిగా వెనుకకు మళ్లించెను.
ఖం వ్యభ్రముదితాదిత్యం వాతవర్షం చ దారుణమ్ ।
నిశామ్యోపరతం గోపాన్ గోవర్ధనధరోఽబ్రవీత్ ॥
ఆకాశములో సూర్యుడు ఉదయించి మేఘములు తొలగిపోయెను. దారుణమైన గాలివాన కూడ అగిపోయెను. అది చూచి గొవర్ధన శ్రీకృష్ణుడు గోపాలకు తో నిల్లనెను.
నిర్మాత త్యజత త్రాసం గోపాస్సస్త్రీధనార్భకాః ।
ఉపారతం వాతవర్షం ప్యుదప్రాయాశ్చ నిమ్మగా ।
ఓ గోసాలకులారా! స్త్రీలు, సంపదలు, పిల్లలతో కలిసి భయమును వీడి బయటకు నడువుడు. గాలి వాన ఆగినది. నదులలో నీరు కూడ తగ్గినది.
తతస్తే నిర్యయుగ్ధపాస్స్వం స్వమాదాయ గోధనమ్ ।
శకటోఢోపకరణం స్త్రీబాలస్థవిరాశ్శనైః ॥
పిదప ఆ గోపాలుగు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు తమ తమ గోసంపదను తీసుకొని, సామగ్రిని బళ్లపై ఎక్కించుకొని, మెల్లగా బయటకు వచ్చిరి.
భగవావపి తం శైలం స్వస్థానే పూర్వపత్ప్రభుః ।
పశ్యతాం సర్వభూతానాం స్థాపయామాస లీలయా ॥
సర్వశక్తిమంతుడగు శ్రీకృష్ణ భగవానుడు సకల ప్రాణులు చూచుచుండగా, ఆ పర్వతమును దాని స్థానమునందు ఇదివరలో వలెనే అవలీలగా స్థాపించెను.
తం ప్రేమవేగాన్నిభృతా ప్రజౌకసో
యథా సమీయుః పరిరంభణాదిభిః ।
గోప్యశ్చ సస్నేహమపూజయన్ముదా
దధ్యక్షతాద్భిర్యుయుజుస్సదాశిషః ॥
ప్రేమ యొక్క ఆవేశముతో నిండియున్న గోకుల వాసులు ఆ శ్రీకృష్ణుని కౌగిలించుట, చేతులు కలుపుట మొదలగువాటితో యథోచితముగా కలుసుకొనిరి. గోపికలు కూడ ప్రేమతో ఆనందముతో ఆయనను పెరుగు, అక్షతలు, జలములతో పూజించి, పవిత్రమగు ఆశీస్సులనందజేసిరి.
యశోదా రోహిణీ నందో రామశ్చ బలినాం వరః ।
కృష్ణమాలింగ్య యుయుజురాశిష స్స్నేహకాతరాః ॥
యశోద, రోహిణి, నందుడు, బలవంతులలో శ్రేష్ఠుడగు బలరాముడు కూడ ప్రేమ వలన కంగారు పడుతూ శ్రీకృష్ణుని కౌగిలించుకొని ఆశీస్సులను పలికిరి.
దివి దేవగణాస్సాధ్యాస్సిద్ధగంధర్వచారణాః ।
తుష్టువుర్ముముచుస్తుష్టాః పుష్పవర్షాణి పార్థివ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆకాశమునందున్న దేవతల గణములు, సాధ్యులు, సిద్ధులు, గంధర్వులు, చారణులు సంతోషముతో పూల వానలను కురిపించి స్తుతించిరి.
శంఖదుందుభయో నేదుర్దివి దేవప్రణోదితాః ।
జగుర్గంధర్వపతయస్తుంబురు ప్రముఖా నృప ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆకాశమునందు దేవతలు శంఖములను, దుందు భులను మోయించిరి. తుంబురుడు మొదలైన గంధర్వశ్రేష్ఠులు పాడిరి.
తతోఽనురక్తైః పశుపైః పరిశ్రితో
రాజన్ స గోష్ఠం సబలోఽవ్రజద్ధరిః ।
తథావిధాన్యస్య కృతాని గోపికా
గాయంత్య ఈయుర్ముదితా హృదిస్పృశః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే
పూర్వార్ధే పంచవింశోకధ్యాయః ॥
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత అనురాగము గల గోపాలకులు చుట్టువారి రాగా బలరామునితో గూడి శ్రీకృష్ణ భగవానుడు గోకులమునకు వెళ్లెను. ప్రేమతో హృదయమును స్పృశించే గోపికలు ప్రేమతో హృదయమును స్పృశించే ఈ శ్రీకృష్ణుని గోవర్ధనోద్ధారమువంటి లీలలను ఆనందముతో పాడుకుంటూ వెళ్లిరి.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము
పూర్వార్ధములో గోవర్ధనోద్ధారమును వర్ణించే
ఇరువది ఐదవ అధ్యాయము ముగిసినది (25).
Summary of chapter 25 of the Bhāgavata Mahā Purana is as follows:
Enraged by the cancellation of his annual sacrifice, King Indra felt his authority insulted by a seven-year-old cowherd boy. Intoxicated by false pride, Indra unleashed the devastating Saṁvartaka clouds—reserved for universal dissolution—to destroy Vṛndāvana with torrential rains, hurricane winds, and ice hail. The pastures flooded, and the shivering cowherds took shelter of Śrī Kṛshṇa. Demonstrating His supreme omnipotence, seven-year-old Śrī Kṛshṇa lifted the colossal **Govardhana Hill** using the pinky finger of His left hand, holding it aloft for seven continuous days like a giant umbrella. All the residents of Vṛndāvana, along with their cows and calves, stood safely under the hill. Exhausted and humbled, Indra withdrew his clouds, and Kṛshṇa safely replaced the hill, leaving the cowherds in awe.