75 – రాజసూయము సమాప్తమగుట - దుర్యోధనునకు అవమానము

రాజోవాచ

అజాతశత్రోస్తం దృష్ట్వా రాజసూయమహోత్సవమ్

సర్వే ముముదిరే బ్రహ్మన్ నృదేవా యే సమాగతాః

దుర్యోధనం వర్జయిత్వా రాజానస్సర్షయస్సురాః

ఇతి శ్రుతం నో భగవంస్తత్ర కారణముచ్యతామ్

పరీక్షిన్మహారాజు ఇట్లు పలికెను --- ఓ శుక మహర్షి! శత్రువులే లేని ధర్మరాజుయొక్క రాజసూయయాగము గొప్ప ఉత్సవమాయెను. దానికి విచ్చేసిన బ్రాహ్మణులు, మహర్షులు, దేవతలు అందరు సంతోషించిరి. దుర్యోధనుడు మాత్రమే సంతోషించలేదు, అని మేము వింటిమి. దానికి కారణమేమియే చెప్పుడు.

ఋషిరువాచ

పితామహస్య తే యజ్ఞే రాజసూయ మహాత్మనః

బాంధవాః పరిచర్యాయాం తస్యాసన్ ప్రేమబంధనాః  

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నీ తాతగారు మహాత్ముడు ధర్మరాజు రాజసూయయాగమును చేసినప్పుడు ప్రేమబంధము గల బంధువులు ఆయనకు సేవలనందించిరి.

భీమో మహానసాధ్యక్షో ధనాధ్యక్షసుయోధనః

సహదేవస్తు పూజాయాం నకులో ద్రవ్యసాధనే

భీముడు వంటశాలకు, దుర్యోధనుడు కోశాగారమునకు అధ్యక్షులు. సహదేవునకు అతిథిపూజ, నకులునకు సామగ్రిని సమకూర్చుట విధులు.

గురుశుశ్రూషణే జిష్ణుః కృష్ణః పాదావనేజనే

పరివేష ణే ద్రుపదజా కర్ణో దానే మహామనాః

పెద్దల సేవలో అర్జునుడు, అతిథుల పాదములను కడుగుట అనే పనియందు శ్రీకృష్ణుడు, వడ్డనలో ద్రౌపది, దానమునందు పెద్ద మనస్సు గల కర్ణుడు నియుక్తులైరి.

యుయుధానో వికర్ణశ్చ హార్దిక్యో విదురాదయః

బాహ్లీకపుత్రా భూర్యాద్యా యే చ సంతర్దనాదయః

నిరూపితా మహాయజ్ఞే నానాకర్మసు తే తదా

ప్రవర్తంతే స్మ రాజేంద్ర రాజ్ఞః ప్రియచికీర్షవః

ఓ పరీక్షిన్మహారాజా! యుయుధానుడు, వికర్ణుడు, హార్దిక్యుడు, విదురుడు, బాహ్లికుని సంతానమైన భూరిశ్రవసుడు మొదలగువారు, సంతర్ధనుడు, కృపాచార్యుడు మొదలైనవారు అప్పుడా గొప్ప యజ్ఞమునందు వివిధకార్యములలో నియోగించబడిరి. వారు ధర్మరాజునకు ప్రియమును చేయగోరి పనులను చేసిరి.

ఋత్విక్సదస్యబహువిత్సు సుహృత్తమేషు

స్విష్టేషు సూనృతసమర్షణదక్షిణాభిః

వైద్యే చ సాత్వతపతేశ్చర్హణం ప్రవిష్టే

చక్రుస్తతస్త్వవభృథస్నపనం ద్యునద్యామ్

ఋత్విక్కులు, సభాసదులు, పండితులు, మిక్కిలి ప్రియులగు స్నేహితులు, బంధువులు మధురమగు వచనములచే, సత్కారములచే, దక్షిణలచే బాగుగా ఆరాధించబడిరి. చేదిరాజగు శిశుపాలుడు కూడ భక్తపాలకుడగు శ్రీకృష్ణ భగవానునీలో విలీనమాయెను. తరువాత వారు గంగానదిలో అవభృథస్నానమును చేసిరి.

మృదంగశంఖపణవధుంధుర్యానకగోముఖాః

వారిత్రాణి విచిత్రాణి నేదురావభృథోత్సవే

అవభృథస్నానమహోత్సవమునందు మధేళ్లు, శంఖములు, డోళ్లు, నౌబత్తులు, తప్పెటలు, కొమ్ము బూరాలు మొదలైన పలు రకములు వాద్యములు మ్రోగినవి.

నర్తక్యో ననృతుర్హృష్ణా గాయకా యూథశో జగుః

వీణావేణుతలోన్నాద స్తేషాం స దివమస్పృశత్

నాట్యకత్తెలు నాట్యమాడిరి. గాయకులు ఆనందముతో గుంపులుగా చేరి పాడిరి. వారి ఆ వీణల, వేణువుల, చప్పట్ల బిగ్గరయైన శబ్దము ఆకసమునంటేను.

చిత్రధ్వజపతాకాగ్రైరిభేంద్రస్యందనార్వభిః

స్వలంకృతైర్భటైర్భూపా నిర్యయూ రుక్మమాలినః  

రాజులు బంగరు మాలలను ధరించి బయలు దేరిరి. వారితో పాటుగా రంగు రంగుల జెండాల, టెక్కెముల కొనలు గల గొప్ప ఏనుగులు, రథములు, గుర్రములు, బాగా అలంకరించుకున్న భటులు వెంట నడిచిరి.

యదుసృంజయకాంబోజకురు కేకయకోసలాః

కంపయంతో భువం సైన్యైర్యజమానపురస్సరాః

యదుసృంజయకాంబోజకురు కేకయకోసలదేశముల రాజులు యజ్ఞకర్త ధర్మరాజు వెనుక సైన్యములతో వెళ్లుచుండగా భూమి దడదడలాడెను.

సదస్యర్త్విగ్ద్విజశ్రేష్టా బ్రహ్మ ఘోషేణ భూయసా

దేవర్షి పితృగంధర్వాస్తుష్టువుః పుష్పవర్షిణః

సభాసదులు, ఋత్విక్కులు, బ్రాహ్మణశ్రేష్ఠులు అధికమగు వేధ ఘోషతో వెంట నడచిరి. దేవతలు, మహర్షులు, పితృదేవతలు, గంధర్వులు పూల వానను కురిపిస్తూ ప్రశంసించిరి.

స్వలంకృతా నరా నార్యో గంధస్రగ్భూషణాంబరైః

విలింపంత్యోఽభిషించంత్యో విజహ్రుర్వివిధై రసైః

గంధము, మాలలు, భూషణములు, వస్త్రములతో చక్కగా అలంకరించుకున్న స్త్రీపురుషులు పలు రకముల రసములను చల్లుతూ, ఇతరుల పై పోస్తూ విహరించిరి.

తైలగోరసగంధోదహరిద్రాసాంద్రకుంకుమైః

పుంభిర్లిప్తాః ప్రలింపంత్యో విజహ్రుర్వారయోషితః

పురుషులు వేశ్యాస్త్రీలకు నూనె, పాలు, పెరుగు, గంధోదకము, పసుపు, కుంకుమ ముద్దలనలదగా, వారు కూడ వాటినీ పురుషులకు అలదుచున్నవారై విహరించిరి.

గుప్తా నృభిర్నిరగమన్నుపలబ్దుమేతద్ 

దేవ్యో యథా దివి విమానవరైర్నృదేవ్యః

తా మాతులేయసఖిభిః పరిషాచ్యమానాః

సవ్రీడహాసవికసద్వదనా విరోజుః

ఆ ఉత్సవమును చూచుటకు అంతరిక్షమునందు గొప్ప విమానములపై దేవతాస్త్రీలు వచ్చినట్లుగానే, భటులు రక్షించుచుండగా పల్లకీల పై ద్రౌపది మొదలగు మహారాణులు కూడ వచ్చిరి. పాండవుల మేనమామ (వసుదేవుడు) పుత్రుడగు శ్రీకృష్ణుడు, ఆయనయొక్క మిత్రులు మొదలగువారు వారిపై రంగులను చల్లిరి. అప్పుడు వారి మోములు సిగ్గుతో కూడిన చిరునవ్వుతో వికసించి ప్రకాశించినవి.

తా దేవరానుత సఖీన్ సిషి చుర్దృతీభిః 

క్లిన్నాంబరా వివృతగాత్రకుచోరుమధ్యాః

ఔత్సుక్యముక్తకబరచ్చవమానమాల్యాః

క్షోభం దధుర్మలధియాం రుచిరైర్విహా రైః

ఆ యువతుల దేహములు తడిసి అవయవములు, స్తనములు, ఊరువులు స్పష్టముగా కానవచ్చుచుండెను. ఉత్సాహముచే వారి జుట్టు ముడులు ఊడి పూలు జారుచుండెను. వారు పిచికారీలతో భర్తల సోదరులపై, మిత్రులపై రంగు నీళ్లను చల్లుతూ అందముగా విహరిస్తూ ఉంటే, మలినమైన అంతఃకరణము గలవారి చిత్తములు క్షోభిల్లేను.

స సమ్రాడ్ రథమారూఢస్సదశ్వం రుక్మమాలినమ్

వ్యరోచత స్వపత్నీభిః క్రీయాభిః క్రతురాడివ

చక్రవర్తియగు ఆ ధర్మరాజు మంచి గుర్రములను పూన్చి బంగరు మాలలు కట్టిన రథమును తన భార్యలతో గూడి అధిష్ఠించెను. ఆయన, వివిధ ప్రయాజాది అంగములతో కూడిన యజ్ఞరాజమగు రాజసూయము రూపు దాల్చినదా యన్నట్లు విశేషముగా భాసించెను.

పత్నీసంయాజావభృథ్యైశ్చరీత్వా తే తమృత్విజః

ఆచాంతం స్నాపయాంచక్రుర్గంగాయాం సహ కృష్ణయా

ధర్మరాజు పత్నీసంయాజమనే కర్మను, అవభృథమునకు చెందిన కర్మలను అనుష్టించెను. అప్పుడు ఆ ఋత్విక్కులు ఆయనను ఆచమ నము చేయించి, ద్రౌపదితో సహా గంగానదిలో స్నానము చేయించిరి.

దేవదుందుభయో నేదున్నరదుందుభిభిస్సమమ్

ముముచుః పుష్పవర్షాణి దేవర్షిపితృమానవాః

మానవుల దుందుభులతో సమానముగా దేవదుందుభులు కూడ మ్రోగినవి. దేవతలు, మహర్షులు, పితృదేవతలు, మానవులు పూల వానలను కురిపించిరి.

సస్నుస్తత్ర తతస్సర్వే వర్ణాశ్రమయుతా నరాః

మహాపాతక్యపి యతస్సద్యో ముచ్యేత కిల్బిషాత్

తరువాత వర్ణాశ్రమవంతులగు జనులందరు ఆ గంగలో స్నానము చేసిరి. అట్టి (అవభృథమునకు చెందిన) స్నానము వలన మహాపాపి కూడ వెంటనే పాపవిముక్తుడగును.

అథ రాజాఽహతే క్షౌమే పరీధాయ స్వలంకృతః

ఋత్విక్సదస్యవిప్రాదీనానరాభరణాంబరైః

తరువాత ధర్మరాజు కొత్త పట్టు వస్త్రముల జతను దాల్చి చక్కగా అలంకరించుకొనెను. ఋత్విక్కులు, సభాసదులు, వేదవేత్తలు, కళాకారులు మొదలగువారిని ఆయన వస్త్రాభరణములతో సత్కరించెను.

బంధుజ్ఞాతినృపాన్ మిత్రసుహృదోఽన్యాంశ్చ సర్వశః

అభీక్ష్ణం పూజయామాస నారాయణపరో నృపః

శ్రీహరియొక్క అనన్యభక్తు డగు ధర్మరాజు బంధువులు జ్ఞాతులు అగు రాజులను, ఇష్టులను, ప్రియమిత్రులను, ఇతరులను కూడ పలుమార్లు పూజించెను.

సర్వేజనాస్సురరుచో మణికుండలస్ర -

గుష్ణీషకంచుకదుకూలమహాఽర్ఘ్యహారాః

నార్యశ్చ కుండలయుగాలకవృందజుష్ట-

వక్తశ్రియః కనకమేఖలయా విరేజుః

పురుషులందరు  మణికుండలములను, మాలలను, తలపాగలను, చొక్కాలను, నాజూకు వస్త్రములను, మిక్కిలి విలువైన హారములను దాల్చి దేవతల వలె ప్రకాశించిరి. స్త్రీలు కూడ కుండలముల జంటతో, ముంగురుల గుంపులతో కూడి శోభిల్లే ముఖములు గలవారై బంగరు మొలనూలుతో విశేషముగా ప్రకాశించిరి.

అథర్త్విజో మహాశీలాస్సదస్యా బ్రహ్మవాదినః

బ్రహ్మ క్షత్రియవిట్ఛూద్రా రాజానో యే సమాగతాః

దేవర్షి పితృభూతాని లోకపాలాస్సహానుగాః

పూజితాస్తమనుజ్ఞాప్య స్వధామాని యయుర్నృప

ఓ పరీక్షిన్మహారాజా! తరువాత గొప్ప శీలము గల ఋత్విక్కులు, సభాసదులు, వేదవేత్తలు, బ్రాహ్మణక్షత్రియవైశ్యశూద్రులు, విచ్చేసిన రాజులు, దేవతలు, మహర్షులు, పితృదేవతలు, ఇతరప్రాణులు, అనుచరులతో కూడిన లోకపాలకులు పూజలనందుకొని ఆయన సెలవు పొంది తమ నివాసములకు వెళ్లిరి.

హరిదాసస్య రాజర్షే రాజసూయమహోదయమ్

నైవాతృప్యన్ ప్రశంసంతః పిబన్ మర్త్యాఽమృతం యథా

ధర్మరాజు రాజు మాత్రమే గాక శ్రీహరి భక్తుడు, ఋషి. జనులకు ఆయన చేసిన రాజసూయము యొక్క గొప్ప ఉత్సవమును ఎంత ప్రశంసీ స్తున్నా, అమృతమును త్రాగే మానవునకు వలె, తృప్తి కలుగనే లేదు.

తతో యుధిష్ఠిరో రాజా సుహృత్సంబంధిబాంధవాన్

ప్రేమ్ణా నివాసయామాస కృష్ణం చ త్యాగకాతరః  

తరువాత ధర్మరాజు మిత్రులను, సంబంధీకులను, బంధువులను, శ్రీకృష్ణుని కూడ వెళ్లిపోకుండా నిలిపివేసెను. ఎందుకంటే, వారి వియోగమంటేనే ఆయనకు దుఃఖము కలిగెను.

భగవానపి తత్రాంగ న్యవాత్సీత్తత్ప్రియంకరః

ప్రస్థావ్య యదువీరాంశ్చ సాంబాదీంశ్చ కుశస్థలీమ్

ఓ పరీక్షిన్మహారాజా! సాంబుడు, గదుడు మొదలైన యాదవవీరులను శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకు పంపివే సెను. కాని, ఆ ధర్మరాజునకు ప్రీతిని కలిగించుటకై ఆయన తాను అచటనే నివసించెను.

ఇత్థం రాజా ధర్మసుతో మనోరథమహాకర్ణవమ్

సుదుస్తరం సముత్తీర్య కృష్ణే నాసీద్దతజ్వరః

రాజసూయమును చేయాలనే కోరిక సముద్రము వలె మిక్కిలి దాట శక్యము కానిది. ఈ విధముగా ధర్మరాజునకు శ్రీకృష్ణుని అనుగ్రహము వలన ఆ మనోరథము - పూర్ణమయ్యెను. ఆయన మనోవ్యథ దూరమాయెను.

ఏకదాఽతఃపురే తస్య వీక్ష్య దుర్యోధనశ్శ్రియమ్

అత్యుద్ఘాజసూయస్య మహీత్త్వం చాచ్యుతాత్మనః

శ్రీకృష్ణ భగవానునియందు లగ్న మైన మనస్సు గల ఆ ధర్మరాజుయొక్క అంతఃపురములోని సంపదను దుర్యోధనుడోకనాడు చూచెను. పైగా, ఆయనకు రాజసూయము వలన కలిగిన గొప్పదనమును కూడ చూచి ఆతడు పరితాపమును చెందెను.

యస్మిన్నరేంద్రదితిజేంద్రసురేంద్రలక్ష్మీః

నానా విభాంతి కిల విశ్వసృజోపక్లుప్తాః

తాభిః పతీన్ ద్రుపదరాజసుతోపతస్థే 

యస్యాం విషక్తహృదయః కురురాడతప్యత్

ఆ అంతఃపురమునందు మయుడు మహారాజులకు, రాక్షసప్రభువులకు, దేవేంద్రునకు యోగ్యమైన పలు రకముల సంపదలను రచించెను. ద్రౌపది వాటితో భర్తలను సేవించెడిది. ద్రౌపదియందు లగ్న మైన మనస్సు గల కౌరవరాజగు దుర్యోధనుడు ఆ అంతఃపురమును చూచి పరితపించెను.

యస్మింస్తదా మధుపతేర్మహిషీ సహస్రం

శ్రోణీభ రేణ శన కైః క్వణదంఘిశోభమ్

మధ్యే సుచారు కుచకుంకుమశోణహారం

శ్రీమన్ముఖం ప్రచలకుండలకుంతలాడ్యమ్

ఆ సమయములో ఆ అంతఃపురమునందు శ్రీకృష్ణునియొక్క భార్యలు వేయి మంది ఉండిరి. వారు శ్రేణీభారముచే మెల్లగా నడచుచుండగా గణగణలాడే అందేలు పాదములకు శోభనిచ్చెను. మిక్కిలి అందమైన (సన్నని) నడుము గల ఆ యువతుల హారములు స్తనములయందలి కుంకుమచే, ఎర్రనయ్యెను. కదలాడే కుండలములతో, ముంగురులతో సంపన్నమైన వారి మోములు గొప్పగా శోభిల్లెను.

సభాయాం మయక్లుప్తాయాం క్వాపి ధర్మసుతోఽధిరాట్

వృతోఽనుజైర్బంధుభిశ్చ కృష్ణేనాపీ స్వచక్షుషా

ఒకనాడు మయుడు రచించిన సభయందు ధర్మరాజ చక్రవర్తి చుట్టూ ఆయన సోదరులు, బంధువులు, ఆయనకు చూపైన శ్రీకృష్ణుడు ఉండిరి.

ఆసీనః కాంచనే సాక్షాదాసనే మఘవానివ

పారమేష్ఠ్యశ్రియా జుష్టః స్తూయమానశ్చ వందిభిః

ఆయన సాక్షాత్తు ఇంద్రుడు వలె బంగరు ఆసనములో చక్రవర్తియొక్క శోభతో కూర్చునియుండగా, స్తోత్రపాఠకులు స్తుతించుచుండిరి.

తత్ర దుర్యోధనో మానీ పరీతో భ్రాతృభిర్నృప

కిరీటమాలీ న్యవిశదసీహస్తః క్షిపన్ రుషా

ఓ పరీక్షిన్మహారాజా! అదే సమయములో గర్విష్టియగు దుర్యోధనుడు సోదరులతో గూడి అచటకు వచ్చేను. కిరీటము, మాల, చేతిలో కత్తి గల ఆతడు కోపముతో (సేవకులను) తిట్టుచుండెను.

స్థల్వేఽభ్యగృహ్ణద్వస్తాంతం జలం మత్వా స్థలేఽపతత్

జలే చ స్థలవద్భ్రాంత్యా మయమాయావిమోహితః

ఆతడు మయుని మాయచే వ్యామోహితుడై నేలను నీరని భ్రమపడి పంచే కొంగును పైకి పట్టుకొనెను; నేలయని భ్రమపడి నీటిలో పడెను.

జహాస భీమస్తం దృష్ట్వా స్త్రీయో నృపతయోఽపరే

నివార్యమాణా అప్యంగ రాజ్ఞా కృష్ణానుమోదితాః

ఓ పరీక్షిన్మహారాజా! భీముడు, స్త్రీలు, ఇతరరాజులు ఆ దుర్యోధనుని చూచి నవ్విరి. వారిని ధర్మరాజు వారించినా, శ్రీకృష్ణుడు అనుమోదించెను.

స వ్రీడితోఽవాగ్వదనో రుషా జ్వలన్

నిష్క్రమ్య తూష్ణీం ప్రయయౌ గజాహ్వయమ్

హా హేతి శబ్దస్సుమహానభూత్సతా- 

మజాతశత్రుర్విమనా ఇవాభవత్

బభూవ తూష్ణీం భగవాన్ భువో భరం

సముజ్జహీర్షుర్భ్రమతి స్మ యద్దృశా

దుర్యోధనుడు సిగ్గుతో తల దించుకొని కోపముతో మండి పడుతూ మౌనముగా బయటకు వచ్చి.. హస్తినాపురమునకు వెళ్లిపోయెను. సత్పురుషులు అయ్యో! అయ్యో! అంటూ బిగ్గరగా హాహాకారమును చేసిరి. అజాతశత్రువగు ధర్మరాజు మనస్సు చెడినట్లాయెను. భూభారమును తగ్గించగోరే శ్రీకృష్ణ భగవానుడు మిన్నకుండెను. ఆయన చూపు కారణముగానే దుర్యోధనుడు భ్రాంతి పడెను.

ఏతత్తేఽభిహితం రాజన్ యత్పృష్ఠోఽహమిహ త్వయా

సుయోధనస్య దౌరాత్మ్యం రాజసూయే మహాక్రతౌ  

ఇతి శ్రీమద్బాగవతే మహాపురాణే దశమస్కంధే ఉత్తరార్ధే పంచసప్తతితమోఽధ్యాయః

ఓ పరీక్షిన్మహారాజా! ఈ రాజసూయ మహాయజ్ఞమునందు దుర్యోధనుని దుర్బుద్ధిని గురించి నీవు నన్ను ప్రశ్నించితివి. నేను నీ ప్రశ్నకు సమాధానమును చెప్పితిని.

శ్రీమద్భాగవతము పదవ స్కంధము ఉత్తరార్ధములో రాజసూయము సమాప్తమగుటను, దుర్యోధనుని అవమానమును వర్ణించే డెబ్బది ఐదవ అధ్యాయము ముగిసినది (75).