28 - శ్రీకృష్ణుడు నందుని వరుణలోకమునుండి విడిపించుట

శ్రీశుక ఉవాచ

ఏకాదశ్యాం నిరాహారస్సమభ్యర్చ్య జనార్దనమ్

స్పాతుం నందస్తు కాలింద్యా ద్వాదశ్యాం జలమావిశత్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- నందుడైతే ఏకాదశి నాడు ఉపవాసము చేసి, దుష్టజనశిక్షకుడగు శ్రీహరిని బాగుగా పూజించెను. ద్వాదశినాడు స్నానము కొరకై యమునానదీజలములయందు ప్రవేశించెను.

తం గృహీత్వాఽఽనయద్భృత్యో వరుణస్యాసురోంఽతికమ్

ఆవిజ్ఞాయాసురీం వేలాం ప్రవిష్టముదకం నిః

అది రాత్రియందలి రాక్షసులకు చెందిన వేళ, ఆ విషయము తెలియని నందుడు నీటిలో ప్రవేశించెను. వరుణుని సేవకుడగు రాక్షసుడాతనిని పట్టుకొని వరుణుని వద్దకు తీసుకొని పోయెను.

చుక్రుశుస్తమపశ్యంతః కృష్ణ రామేతి గోపకాః

భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతమ్

తదంతికం గతో రాజన్ స్వానామభయదో విభుః

ఓ పరీక్షిన్మహారాజా! నందుని రక్షకులగు గోపాలకులకు ఆయన కానరాలేదు. అపుడు వారు ఓ శ్రీకృష్ణా! ఓ బలరామా! అంటూ ఆక్రోశించిరి. అది విని, వరుణుడు నందుని కొనిపోయినాడని శ్రీకృష్ణుడు తెలుసుకొనెను. తన వారలకు అభయమునిచ్చే ఆయన ఆ వరుణుని వద్దకు వెళ్లెను.

ప్రాప్తం వీక్ష్య హృషీ కేశం లోకపాలస్సపర్యయా !

మహత్యా పూజయిత్వాఽఽహ తద్దర్శనమహోత్సవః

ఇంద్రియాధిపతియగు శ్రీకృష్ణుడు వచ్చుటను పశ్చిమదిక్పాలకుడగు వరుణుడు చూచెను. ఆయన  దర్శనముచే వరుణునకు గొప్ప ఉత్సాహము కలిగెను. ఆయన ఆ భగవానుని గొప్ప సపర్యతో పూజించి ఇట్లు పలికెను.

వరుణ ఉవాచ

అద్య మే నిభృతో దేహోఽద్వైవార్థోఽధిగతః ప్రభో

త్వత్పాదభాజో భగవన్నవాపుః పారమధ్వనః

వరుణుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! ఈనాడు నా జన్మ సార్థకమైనది. నాకీనాడే పరమప్రయోజనము సిద్ధించినది. ఓ భగవానుడా! నీ పాదములను శరణు వేడువారు సంసారమార్గము యొక్క ఆవలి గట్టు (మోక్షము) ను చేరెదరు.

నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే

న యత్ర శ్రూయతే మాయా లోకసృష్టి వికల్పనా

నిర్గుణ పరబ్రహ్మవు, సగుణబ్రహ్మవు, ప్రాణులలోని అంతరతమమగు ఆత్మవు నీవే. నీకు నమస్కారము. లోకముల సృష్టి రూపములోనుండే వివిధములగు కల్పనలకు ఆశ్రయమైన మాయాశక్తి నీయందు నీకంటె భిన్నముగా లేదని శ్రుతి చెప్పుచున్నది.

అజానతా మామకేన మూఢే నాకార్యవేదినా

ఆనీతోఽయం తవ పితా తద్భవాన్ క్షంతుమర్హతి

నా సేవకుడు కార్యపరిజ్ఞానము లేని మూర్ఖుడు. నీ తండ్రి అని తెలియక ఈయనను తీసుకువచ్చినాడు. ఆ పనిని నీవు క్షమించదగును.

మమాప్యనుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్

గోవింద నీయతామేష పితా తే పితృవత్సల

ఓ శ్రీకృష్ణా! నీవు సకలసాక్షివి, గోవిందుడవు, తండ్రియందు అనురాగము గలవాడవు. నీవు నన్ను కూడ అనుగ్రహించవలెను. ఈ నీ తండ్రిని నీతోబాటు తీసుకువెళ్లుము.

శ్రీశుక ఉవాచ

ఏవం ప్రసాదితః కృష్ణో భగవానీశ్వరేశ్వరః

ఆదాయాగాత్స్వపితరం బంధూనాం చావహన్ముదమ్

శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- లోకపాలకులకు కూడ ప్రభుడగు శ్రీకృష్ణ భగవానుని వరుణుడీ విధముగా ప్రసన్నుని చేసెను. ఆయన తన తండ్రిని తీసుకువెళ్లెను. నందుని చూచి బంధువులు ఆనందించిరి.

నందస్త్వతీంద్రియం దృష్ట్వా లోకపాలమహోదయమ్

కృష్ణే చ సన్నతిం తేషాం జ్ఞాతిభ్యో విస్మితోఽబ్రవీత్

లోకపాలకుడగు వరుణుని ఐశ్వర్యము మామూలుగా కంటికి కానరాదు. నందుడైతే దానిని చూచెను. పైగా, ఆ లోకములోని వారందరు శ్రీకృష్ణుని యెడల చూపిన వినయమును చూచి నందుడు ఆశ్చర్యపడి, ఆ విషయమును బంధువులకు చెప్పెను.

తే త్వౌత్సుక్యధియో రాజన్ ముత్వా గోపాస్తమీశ్వరమ్

అపి నస్స్వగతిం సూక్ష్మా ముపాధాస్యదధీశ్వరః

ఓ పరీక్షిన్మహారాజా! ఆ గోపాలకులైతే ఆ శ్రీకృష్ణుడు ఈశ్వరుడని తెలుసుకొనిరి. ఈ సర్వేశ్వరుడగు శ్రీకృష్ణుడు మనకు ఇంద్రియగోచరము కాని తన ధామమును చూపునా? అని వారి మనస్సులలో ఉత్కంఠ కలిగెను.

ఇతి స్వానాం స భగవాన్ విజ్ఞయాఖిలదృక్ స్వయమ్

సంకల్ప సిద్ధయే తేషాం కృపయైతదచింతయత్

సర్వసాక్షియగు ఆ శ్రీకృష్ణ భగవానుడు తన వారలకున్న ఈ విధమైన అభిప్రాయమును స్వయముగా గుర్తించెను. ఆయన దయతో వారి అభిలాష సిద్ధించుటకై ఈ విధముగా సంకల్పించెను.

జనో వై లోక ఏతస్మిన్నవిద్యాకామకర్మభిః

ఉచ్చావచాసు గతిషు న వేద స్వాం గతిం భ్రమన్

మానవుడైతే లోకములో అజ్ఞానము - కామనలు - కర్మలచే ఉత్తమములు మరియు అధమములు అగు జన్మలను పొందుతూ పరిభ్రమించుచుండునే గాని, తన స్వరూపమును తెలుసుకొనడు.

ఇతి సంచింత్య భగవాన్ మహాకారుణికో హరిః

దర్శయామాస లోకం స్వం గోపానాం తమసః పరమ్

గొప్ప కరుణామయుడగు శ్రీకృష్ణ భగవానుడీ విధముగా సంకల్పించి, గోపాలకులకు అజ్ఞానమునకు ఆవలనుండే తన ధామమును చూపెను.  

సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ జ్యోతిస్సనాతనమ్

యద్ధి పశ్యంతి మునయో గుణాపాయే సమాహితాః

ఆ ధామము అనంత సంబ్రహ్మయే. అది కాలాతీతమైన స్వయంప్రకాశ చైతన్యము. మహర్షులు ఏకాగ్రమగు చిత్తముతో సత్త్వరజస్తమోగుణముల సధిగమించి ఆ పంబ్రహ్మను ఆత్మరూపముగా దర్శించెదరు.

తే తు బ్రహ్మ హ్రడం నీతా మగ్నాః కృష్ణేన చోద్ధృతాః

దదృశుర్బ్రహ్మణో లోకం యత్రాక్రూరోఽధ్యగాత్పురా

ఏ జలాశయమునందైతో భగవానుడు అక్రూరునకు తన స్వరూపమును చూపైనో, అదే జలా శయమునకు శ్రీకృష్ణుడు గోపాలకులను తీసుకు వెళ్లెను. వారు దానిలో మునిగి పరబ్రహ్మ యొక్క వైకుంఠ భామమును దర్శించిరి. వారిని ఆయన మరల పైకి తీసుకువచ్చెను.

 నందాదయస్తు తం దృష్ట్వా పరమానంద నిర్వృతాః

కృష్ణం చ తత్రచ్ఛందోభిః స్తూయమానం సువిస్మితాః

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే

పూర్వార్లే అష్టావింశోఽధ్యాయః

నందుడు మొదలగు గోసాలకులైతే ఆ లోకమునందు వేదములు కూడ శ్రీకృష్ణుని స్తుతించుచుండుటను గాంచి పరమాశ్చర్యమునందు, మహానందమునందు నిమగ్ను లైరి.

శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధము

పూర్వార్ధములో శ్రీకృష్ణుడు నందుని వరుణులోకము నుండి విడిపించుటను

వర్ణించే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).