భాగవత మహా పురాణము
16 - కాళీయ మర్దన లీల
శ్రీశుక ఉవాచ ।
విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణః కృష్ణాహినా విభుః ।
తస్యా విశుద్ధిమన్విచ్ఛన్ సర్పం తముదవాసయత్ ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- సర్వసమర్థుడగు శ్రీకృష్ణుడు నల్ల త్రాచుచే కలుషితము చేయబడిన ఆ యమునానదిని చూచి. దానికి పరిశుద్దిని కలిగించ గోరెను. ఆయన ఆ పామును అచటనుండి పంపించివేసెను.
రాజోవాచ ।
కథమంతర్జలేఽగాధే న్యగృహ్ణద్భగవానహిమ్ ।
స వై బహుయుగావాసం యథాఽఽసీద్విప్ర కథ్యతామ్ ॥
పరీక్షిత్తు ఇట్లు పలికెను --- ఓ మహర్షీ! శ్రీకృష్ణ భగవానుడు లోతైన నీటి మధ్యలో పామును ఎట్లు నిగ్రహించెను? ఆ పాము చాల యుగముల కాలము నీటిలో ఏ విధముగా ఉండగలెను? ఈ గాథను చెప్పడు.
బ్రహ్మన్ భగవతస్తస్య భూమ్నస్స్వచ్ఛందవర్తినః ।
గోపాలోదారచరితం కస్తృప్యేతామృతం భజన్ ॥
ఓ మహర్షీ! అనంతుడు, స్వేచ్చావిహారి అగు ఆ శ్రీకృష్ణ భగవానుడు గోవులను రక్షిస్తూ చేసిన గొప్ప లీలలు వినుటకు అమృతము వంటివి. వాటిని సేవించేవాడెవడు తృప్తిని జెందును? (ఎవడైననూ తృప్తి జెందడు).
శ్రీశుక ఉవాచ ।
కాలింద్యాం కాలియస్యాసీద్ధ్రదః కశ్చిద్విషాగ్నినా ।
శ్రప్యమాణపయా యస్మిన్ పతంత్యుపరిగాః ఖగాః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- యమునానదిలో కాలియనాగమునకు ఒక కుండము (ప్రవాహసంబంధము లేనిది) ఉండెను. అది దాని విషము యొక్క వేడికి ఉడికిపోతూ ఉండేది. దాని పైన వెళ్లే పక్షులు మరణించి దానిలో పడేవి.
విప్రుష్మతా విషోదోర్మిమారుతేనాభిమర్శితాః ।
మ్రియంతే తీరగా యస్య ప్రాణినః స్థిరజంగమాః ॥
ఆ కుండములోని విషపు నీటి తరంగములనుండి వీచే గాలిలో విషపు నీటి బిందువులుండేవి. ఒడ్డు పైన ఉండే ప్రాణులు కదిలేవి (పశువులు మొదలైనవి), కదలనివి (చెట్టుచేమలు) ఆ గాలి సోకి చచ్చిపోయెడివి.
తం చండవేగవిషవీర్యమవేక్ష్య తేన
దుష్టాం నదీం చ ఖలసంయమనావతారః ।
కృష్ణః కదంబమధిరుహ్య తతోఽతితుంగం
ఆస్ఫోట్య గాఢరశనో న్యపతద్విషోదే ॥
కాలియుని బలము భయంకరమగు వేగము గల విషమే. వాడు యమునానదిని కలుషితము చేసినాడు. ఈ సంగతిని చూచిన శ్రీకృష్ణుడు నడుమునకు వస్త్రమును గట్టిగా కట్టి ఎత్తైన కడిమి చెట్టునెక్కి జబ్బ చరచెను. దుష్టనిగ్రహము కొరకై అవతరించిన ఆయన ఆ చెట్టునుండి విషజలములతో నిండియున్న కుండములోనికి దుమికెను.
సర్పహ్రదః పురుషసారనిపాతవేగ-
సంక్షోభితోరగవిషోచ్చ్వసితాంబురాశిః ।
పర్యక్ ఫ్లుతో విషకషాయవిభీషణోర్మిః
ధావన్ ధనుశ్శతమనంతబలస్య కిం తత్ ॥
పాముల విషముతో కూడిన సెగలను పైకి చిమ్మే ఆ కాలియుని మడుగులోని నీరు విషముచే కషాయముగా చేయబడి భయంకరమగు కెరటములను లేపుచుండెను. పురుషోత్తముడు వేగముగా దుముకగా, ఆ జలసమూహము వంద ధనుస్సు (8 అడుగులు) ల దూరము వరకు పరుగెత్తి అంతటా ప్రసరించేను. అనంతమగు శక్తి గల భగవానునకు అది యెంతటిది?
తస్య హ్రదే విహరతో భుజదండఘూర్ణ-
వార్ఘోషమంగ వరవారణవిక్రమస్య ।
ఆశ్రుత్య తత్స్వసదనాభిభవం నిరీక్ష్య
చక్షుశ్శ్రవాస్సమసరత్తదమృష్యమాణః ॥
ఓ రాజా! గొప్ప ఏనుగుయొక్క పరాక్రమము గల శ్రీకృష్ణుడు ఆ మడుగులో విహరిస్తూ దండములవంటి భుజములతో నీటిని కొట్టుచుండగా పెద్ద ధ్వని కలిగెను. ఆ చప్పుడును కళ్లే చెవులుగా గల కాలియుడు వినెను. ఆ సర్పము తన నివాసముపై జరిగిన ఈ దాడిని చూచి, దానిని సహింపజాలక (కోపముతో) దగ్గరకు వచ్చెను.
తం ప్రేక్షణీయసుకుమారఘనావదాతం
శ్రీవత్సపీతవసనం స్మితసుందరాస్యమ్ ।
క్రీడంతమప్రతిభయం కమలోదరాంఘ్రిం
సందశ్య మర్మసు రుషా భుజయా చఛాద ॥
సుందరుడు, సుకుమారుడు అగు శ్రీకృష్ణుడు మేఘము వలె స్వచ్చమైన నల్లని వర్ణము గలవాడు. రొమ్ముపై శ్రీవత్సము గల ఆయన పచ్చని వస్త్రమును ధరించెను. చిరునవ్వుతో సుందరమైన ముఖము గల ఆయన భయము లేకుండా విహరించుచుండెను. ఆయన పాదములు పద్మపు పొట్టను పోలి ఎర్రగా నుండెను. ఆయనను ఆ పాము కంఠము మొదలైన మర్మస్థానములలో కరిచి తన దేహము (పడగ) తో కప్పివే సెను.
తం నాగభోగపరివీతమదృష్ట చేష్ట-
మాలోక్య తత్ప్రియసఖాః పశుపా భృశార్తాః ।
కృష్ణేఽర్పితాత్మసుహృదర్థకలత్రకామా
దుఃఖానుశోకభయమూడధియో నీపేతుః ॥
పాము పడగతో చుట్టి వేయగా ఆ శ్రీకృష్ణుని కదలికలు ఆయన ప్రియమిత్రులైన గోపాలకులకు కానరాలేదు. వారు తమను, బంధువులను, సంపదలను, స్త్రీలను, భోగములను శ్రీకృష్ణునియందే సమర్పించినవారు. వారు అధికమగు పీడను పొంది ఏడ్చిరి. బుద్ధి శోకముతో, భయముతో మొద్దుబారి పోగా, వారు నేలగూలిరి.
గావో వృషా వత్సతర్యః క్రందమానాస్సుదుఃఖితాః ।
కృష్ణే న్యస్తేక్షణా భీతా రుదత్య ఇవ తస్థిరే ॥
ఆవులు, ఎద్దులు, ఎదిగిన దూడలు ఆర్తనాదము చేస్తూ అధికముగా దుఃఖిస్తూ శ్రీకృష్ణుని వైపే కళ్లను అప్పగించి చూచుచుండెను. అవి భయముతో ఏడ్చుచున్నవా యన్నట్లు నిలబడి యుండెను.
అథ వ్రజే మహోత్పాతాస్త్రివిధా హ్యతిదారుణాః ।
ఉత్పేతుర్భువి దివ్యాత్మన్యాసన్నభయశంసినః ॥
వెంటనే గోకులములో నేలపై (భూకంపము), అంతరిక్షమునందు (ఉల్కలు పడుట), దేహమునందు (మగవారికి ఎడమ కన్ను అదురుట) అనే మూడు విధములైన అపశకునములు బయలు దేరినవి. మిక్కిలి భయమును గొల్పే ఆ అపశకునములు భయము దగ్గరలో రాబోవుచున్నదని సూచించును.
తానాలక్ష్య భయోద్విగ్నా గోపా నందపురోగమాః ।
వినా రామేణ గాః కృష్ణం జ్ఞాత్వా చారయితుం గతమ్ ॥
బలరాముడు లేకుండా శ్రీకృష్ణుడు గోవులను మేపుటకు వెళ్లినాడని నందుడు మొదలుగా గల గోపాలకులకు తెలిసెను. వారా అపశకునములను చూచి భయముతో ఆందోళనను చెందిరి.
తైర్దుర్నిమిత్తైర్నిధనం మత్వా ప్రాప్తమతద్విదః ।
తత్ప్రాణాస్తన్మనస్కాస్తే దుఃఖశోకభయాతురాః ॥
ఆ చెడు శకునములను చూచి మృత్యువే వచ్చిపడినదని వారు దుఃఖముతో కంగారు పడిరి. వారికి శ్రీకృష్ణుడంటే ప్రాణము. వారి మనస్సు ఆయనయందే ఉండెను. కాని, వారికి ఆయన ప్రభావము తెలియదు. అందుచే వారు బెంగతో, భయముతో వ్యాకులు రైరి.
ఆబాలవృద్దవనితాస్సర్వేంఽగ పశువృత్తయః ।
నిర్జగ్ముర్గోకులాద్దీనాః కృష్ణదర్శనలాలసాః ॥
ఓ పరీక్షిన్మహారాజా! గోకులములోని వారందరు గంగిగోవు వంటివారు. వారందరు పిల్లలు, వృద్ధులు, స్త్రీలతో సహా శ్రీకృష్ణుని చూడాలనే అధికమగు ఇచ్చ గలవారై దీనముగా గోకులమునుండి బయలు దేరిరి.
తాంస్తథా కాతరాన్ వీక్ష్య భగవాన్ మాధవో బలః ।
ప్రహస్య కించిన్నోవాచ ప్రభావజ్ఞోఽనుజస్య సః ॥
మధువంశీయుడగు బలరామ భగవానుడు ఆ విధముగా వ్యాకులపడుచున్న ఆ గోపాలకులను చూచి నవ్వి ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే, ఆయనకు తమ్ముడగు శ్రీకృష్ణుని మహిమ తెలియును.
తేఽన్వేషమాణా దయితం కృష్ణం సూచీతయా పదైః ।
భగవల్లక్షణైర్జగ్ముః పదవ్యా యమునాతటమ్ ॥
ఆ గోపాలకులు తమకు ఇష్టుడగు శ్రీకృష్ణుని వేదుకుతూ కాలి గుర్తులను బట్టి యమునానదీతీరమును చేరిరి. కాలి గుర్తుల యందు పద్మము మొదలగు చిహ్నములు ఆయన భగవానుడని సూచించును.
తే తత్ర తత్రాబ్జయవాంకుశాశనిధ్వజోపపన్నాని పదాని విశ్పతేః,
మారే గవామన్యపదాంతరాంతరే నిరీక్షమాణా యయురంగ సత్వరాః ।
ఓ పరీక్షిన్మహారాజా! వారు గోవుల దారిలో అక్కడక్కడ ఇతరగోపాలకుల కాలి గురుతుల మధ్య మధ్యలో గోపాలకుల నాయకుడగు శ్రీకృష్ణుని కాలి గుర్తులను చూసుకుంటూ వేగముగా వెళ్లిరి. శ్రీకృష్ణుని కాలి గుర్తులయందు పద్మము, బార్లీ గింజ, అంకుశము, వజ్రము, జెండాల చిహ్నములుండును.
అంతర్ర్హదే భుజగభోగపరీతమారాత్ ।
కృష్ణం నిరీహముపలభ్య జలాశయాంతే ।
గోపాంశ్చ మూఢధిషణాన్ పరితః పశూంశ్చ
సంక్రందతః పరమకశ్మలమాపురార్తాః ॥
వారికి దూరముగా సరస్సు మధ్యలో పాము పడగలచే చుట్టివేయబడి చేష్టలుడిగిన శ్రీకృష్ణుడు, సరస్సు ఒడ్డునందు మొద్దుబారిన బుద్ధి గల. గోపబాలకులు, మరియు చుట్టూ బిగ్గరగా ఆర్తనాదము చేస్తున్న పశువులు కూడ కనబడిరి. వారు చాల పీడితులై అధికమగు మోహమును పొందిరి.
గోప్యోఽనురక్తమనసో భగవత్యనంతే.
తత్సేహృదస్మితవిలోకగీరస్స్మరంత్యః ।
గ్రస్తేఽహినా ప్రియతమే భృశదుఃఖతప్తాః ।
శూన్యం ప్రియవ్యతిహృతం దదృశుస్త్రిలోకమ్ ॥
గోపికల మనస్సులో అనంతుడగు, శ్రీకృష్ణ భగవానునియందు అనురాగము గలదు. వారు ఆయన ప్రేమను, చిరునవ్వును, చూపులను, మాటలను స్మరించుచుందురు. మిక్కిలి ప్రియుడగు శ్రీకృష్ణుని పాము పట్టుకొనగా, వారు తీవ్రమగు దుఃఖముచే తాపమును పొందిరి. వారికి ప్రియుడగు కృష్ణునిచే విరహితమైన ముల్లోకములు శూన్యముగా తోచినవి.
తాః కృష్ణమాతరమపత్యమనుప్రవిష్టాం ।
తుల్యవ్యథాస్సమనుగృహ్య శుచస్స్రవంత్యః ॥
తాస్తా వ్రజప్రియకథాః కథయంత్య ఆసన్ ।
కృష్ణాననేర్పితదృశో మృతకప్రతీకాః ॥
తన పుత్రుడగు శ్రీకృష్ణుని వెంటే సరస్సులో ప్రవేశించబోయిన తల్లీ యశోదను ఆ గోపికలు పట్టుకొని ఆపిరి. వారికీ కూడ ఆమెతో సమానమైన దుఃఖముతో కన్నీళ్లు ప్రవహించుచుండెను. వారు గోకులమునకంతకూ ప్రియుడైన శ్రీకృష్ణుని లీలలను చెప్పుచుండిరి. వారు చూపులను శ్రీకృష్ణుని ముఖము పైననే అప్పజెప్పి శవములను పోలియుండిరి,
కృష్ణ ప్రాణాన్నిర్విశతో నందాదీన్ వీక్ష్య తం హ్రదమ్ ।
ప్రత్యషేధత్స భగవాన్ రామః కృష్ణానుభావవిత్ ॥
నందుడు మొదలగు గోపాలకులకు శ్రీకృష్ణుడే ప్రాణము. వారు కూడ ఆ సరస్సులో దిగబోగా, ఆ బలరామ భగవానుడు అడ్డుకొనెను. శ్రీకృష్ణుని మహిమ ఆయనకు తెలియును.
ఇత్థం స్వగోకులమనన్యగతిం నిరీక్ష్య
సస్త్రీకుమారమతిదుఃఖితమాత్మ హేతోః ॥
ఆజ్ఞాయ మర్త్యపదవీమనువర్తమానః ।
స్థిత్వా ముహూర్తముదతిష్ఠదురంగబంధాత్ ॥
శ్రీహరియే శ్రీకృష్ణరూపములో మానవుల రీతిని అనుసరించెను గదా! తన గోకులమునకు తాను తప్ప మరియొకరు శరణు లేరని ఆయన గమనించెను. తన నిమిత్తముగా స్త్రీలతో, పిల్లలతో సహా గోకులమంతయు దుఃఖములో మునిగిపోయినదని ఆయన తెలుసుకోనేను. ఆయన పాము యొక్క పట్టులో గంట లోపు ఉండి, తరువాత పైకి లేచెను.
తత్ప్రథ్యమానవపుషా వ్యథితాత్మభోగః ।
త్యక్త్వాన్నమయ్య కుపితస్స్వఫణాన్ భుజంగః ॥
తస్థా శ్వసఞ్చ్వసనరంధ్రవిషాంబరీష ।
స్తబ్ధేక్షణేల్ముకముఖో హరిమీక్షమాణః ॥
ఆ శ్రీకృష్ణుని శరీరము పెరుగజొచ్చెను. దానితో పామునకు తన పడగలయందు నొప్పి కలిగెను. దాని ముక్కు పుటములయందు విషము, నోళ్లయందు మంటలు ఉండెను. దాని స్థిరమైన కళ్లు ఎర్రగా కాల్చిన పెనముల వలె నుండెను. అది కోపముతో తన పడగలను పైకెత్తి నిట్టూరుస్తూ శ్రీకృష్ణుని విడిచి పెట్టి చూస్తూ ఉండెను.
తం జిహ్వయా ద్విశిఖయా పరిలేలిహానం ।
ద్వే సృక్కిణీ హ్యతికరాలవిషాగ్నిదృష్టిమ్ ॥
క్రీడన్నముం పరిససార యథా ఖగేంద్రో ।
బభ్రామ సోఽప్యవసరం ప్రసమీక్షమాణః ॥
ఆ పాము రెండు కొనలు గల సౌలుకలతో పెదవుల మూలలను చుట్టూ ఆస్వాదించుచుండెను. దాని చూపులు మిక్కిలి భయంకరమగు విషముయొక్క నిప్పులను చెరగుచుండెను. శ్రీకృష్ణుడు పక్షిరాజగు గరుడుడు వలె ఆ ఈ పాముతో ఆడుకుంటూ చుట్టూ తిరిగెను. అది కూడ కాటు వేసే అవకాశము కొరకు ఎదురు చూచెను.
ఏపం పరిభ్రమహతౌజసమున్నతాంస-
మానమ్య తత్పృథుశిరస్స్వధిరూఢ ఆద్యః ।
తన్మూర్ధరత్ననికరస్పర్శాతామ్ర-
పాదాంబుజోఽఖిలకలాదిగురుర్నవర్త ॥
ఈ విధముగా చుట్టూ తిరుగుటచే దాని బలము దెబ్బ తినెను. శ్రీకృష్ణుడు సర్వజగత్కారణుడు, కళలన్నింటికీ మొట్టమొదటి గురువు. ఆయన ఎత్తైన పడగలు గల ఆ పామును కొంచెము వంచి దాని పెద్ద తలల పైకెక్కి నాట్యమాడెను. దాని తలలపైనుండే రత్నసమూహముల స్పర్శచే పద్మములవంటి ఆయన పాదములు మిక్కిలి ఎర్రనయ్యెను.
తం నర్తుముద్యతమవేక్ష్య తదా తదీయ-
గంధర్వసిద్ధసురచారణదేవవధ్వః ।
ప్రీత్యా మృదంగపణవానకవాద్యగీత-
పుష్పోపహారనుతిభిస్సహసోప సేదుః ॥
ఆ శ్రీకృష్ణుడు నాట్యము చేయుటకు సంసిద్దుడగుటను చూచి అప్పుడు వెంటనే ఆయన భక్తులైన చారణులు మద్దెళ్లు, తప్పెట్లు, భేరీలు మొదలగు వాద్యములను వాయించగా గంధర్వులు పాడిరి. అప్సరసలు నాట్యమాడగా సిద్దులు పూలవానను కురిపించి ఉపహారములను సమర్పించిరి. దేవతలు స్తుతించిరి.
యద్యచ్చిరో న నమతేఽoగ శత్రికశీర్ష్ణః
తత్తన్మమర్ధ ఖరదండధర్వోంఽ ఘ్రిపాతైః ।
క్షీణాయుషో భ్రమత ఉల్బణమాస్యతోఽసృజ్
నస్తో వమన్ పరమకశ్మలమాప నాగః ॥
ఓ పరీక్షిన్మహారాజా! దుష్టులను శిక్షించే శ్రీకృష్ణుడు నూటొక్క తలలు గల కాలియుని ఏయే తల వంగలేదో, ఆయా తలను కాళ్లతో తొక్కి మర్ధించెను. బలము క్షీణించగా ఆ పాము గిర గిర తిరుగుతూ నోటినుండి ముక్కునుండి విషమిశ్రితమై భయంకరమైన రక్తమును గ్రక్కుతూ గట్టిగా మూర్ఛను పొందెను.
తస్యాక్షీభిర్గరలముద్వమతశ్శిరస్సు
యద్యత్సమున్నమతి నిశ్శ్వసతో రుషోచ్చైః ।
నృత్యన్ పదాఽనునవయన్ దమయాంబభూవ
పుష్పైః ప్రపూజిత ఇవేహ పుమాన్ పురాణః ॥
ఆ కలియుడు కన్నుల గుండా విషమును గ్రక్కుతూ కోపముతో నిట్టూర్చుచుండెను. ఆతడు ఏయే తలను పైకెత్తితే దానిని శ్రీకృష్ణుడు నాట్యము చేస్తూ కాలితో తొక్కివేసెను. ఈ సందర్బములో పురాణపురుషుడగు శ్రీకృష్ణుని కాలి పై రక్తబిందువులు పడి, ఆయనను కాలియుడు ఎర్రని పువ్వులతో పూజించినాడా యన్నట్లుండెను.
తచ్చిత్రతాండవవిరుగ్ణఫణాతపత్రో
రక్తం ముఖైరురు వమన్నృప భగ్నగాత్రః ।
స్మృత్వా చరాచరగురుం పురుషం పురాణం
నారాయణం తమరణం మనసా జగామ ॥
ఓ పరీక్షిన్మహారాజా! ఆ శ్రీకృష్ణుని రకరకముల తాండవముచే కాలియుని గొడుగులవంటి పడగలు అధికముగా గాయపడెను. అవయవములు విరిగిన ఆతడు నోళ్లనుండి రక్తమునధికముగా క్రక్కుచుండెను. ఆతడు మనస్సుతో స్థావరజంగమాత్మకమగు ప్రాణికోటికీ తండ్రియైన నారాయణుని మనస్సుతో శరణు వేడెను. పూర్ఖుడగు ఆ నారాయణుడే సర్వజగత్తునకు కారణము.
కృష్ణస్య గర్భజగతోఽతిభరావసన్నం
పార్ ష్ణి ప్రహారపరిరుగ్ణఫణాతపత్రమ్ ।
దృష్ట్వాఽహిమాద్యముప సేదురముష్య పత్న్య
ఆర్తాః శ్రథద్వసనభూషణ కేశబంధాః ॥
జగత్తంతా శ్రీకృష్ణుని గర్భమునందుండును. ఆ బరువుచే ఆక్రమించబడిన కాలీయుని గొడుగుల వంటి పడగలు కాలి మడమల దెబ్బలచే అంతటా గాయపడెను. ఆ స్థితిని గమనించి దుఃఖమును పొందిన ఆతని భార్యలు హడావుడిలో వస్త్రములు, భూషణములు, జుట్టుముడులు జారిపోవుచుండ, జగత్కారణుడగు శ్రీకృష్ణుని సమీపించిరి.
తాస్తం సువిగ్నమనసోఽథ పురస్కృతార్బాః ।
కాయం నిధాయ భువి భూతపతిం ప్రణేముః ।
సాద్య్వః కృతాంజలిపుటాశ్శమలస్య భర్తుః
మోక్షేప్సవశ్శరణదం శరణం ప్రపన్నాః ॥
తరువాత మిక్కిలి ఆందోళన చెందిన మనస్సు గల కాళియపత్నులు తమ పిల్లలను ముందుంచుకొని సకలప్రాణికోటికి ప్రభువగు శ్రీకృష్ణునకు దండప్రణామమునాచరించిరి. ఆ పతివ్రతలు తమ భర్తకు అపరాధమునుండి (శిక్షనుండి) విముక్తి కలగాలని కోరువారై దోసిలి యొగ్గి, శరణునిచ్చే ఆ శ్రీకృష్ణుని శరణు వేడిరి.
నాగపత్న్య ఊచుః ।
న్యాయ్యో హీ దండః కృతకిల్బిషేఽస్మింస్తవావతారః ఖలనీగ్రహాయ ।
రిపోస్సుతానామపి తుల్యదృష్టేర్ధత్సే దమం ఫలమేవానుశంసన్ ॥
కాలియనాగుని భార్యలు ఇట్లు పలికిరి --- పాపమును చేసిన ఈతనికి నీవు శిక్షను విధించుట న్యాయమే. శత్రువునందు, పుత్రులయందు నీకు సమదృష్టి గలదు. నీవు అవతరించినది దుష్టులను శిక్షించుట కొరకే. నీవు దుష్టుడు బాగుపడే విధానమును విచారించియే శిక్షను అమలు పరచెదవు.
అనుగ్రహ్వోఽయం భవతా కృతో హి నో ।
దండోఽసతాం తే ఖలు కల్మషాపహః ॥
యద్దందశూకత్వమముష్య దేహినః ।
క్రోధోఽపి తేఽనుగ్రహ ఏవ సమ్మతః ॥
నీవు మాకు ఈ విధముగా అనుగ్రహమునే చూపితివి. ఎందుకంటే, నీవు దుష్టులకు వేసే శిక్ష వారి పాపములను పోగొట్టును. గదా! పాపము వలననే ఈ జీవునకు పాము జన్మ కలిగినది. నీ కోపము కూడ అనుగ్రహమేనని మేము స్వీకరించెదము.
తపస్సుతప్తం కీమనేన పూర్వం నిరస్తమానేన చ మానదేన ।
ధర్మోఽథ వా సర్వజనానుకంపయా యతో భవాంస్తుష్యతి సర్వజీవః ॥
ఈతడు పూర్వజన్మలో అభిమానమును త్రోసిపుచ్చి ఇతరులకు సత్కారమును కూడ చేస్తూ ఏదో ఒక తపస్సును బాగుగా చేసియుండును. లేదా, ఈతడు సకలప్రాణులయందు దయతో ధర్మమును చేసియుండును. ఎందుకంటే, సకలప్రాణులలోని జీవశక్తి వైన నీవు ఆ తపోధర్మముల చేతనే ప్రీతుడవగుదువు.
కస్యానుభావోఽస్య న దేవ విద్మహే
తవాంఘ్రిరేణుస్పర్శాధికారః ।
యద్వాంఛయా శ్రీర్లలనాఽఽచరత్తపో
విహాయ కామాన్ సుచిరం ధృతవ్రతా ॥
ఓ దేవా! ఈతనికి నీ పాదధూళిని స్పృశించే యోగ్యత కలిగినది. అది ఏ తపస్సు ఫలమో (ప్రభావమో) మాకు తెలియదు. లక్ష్మీదేవి నీ పాద ధూళిని కోరి భోగములను విడిచి చిరకాలము ప్రతనిష్ఠతో తపస్సు చేసెను.
న నాకపృష్ఠం న చ సార్వభౌమం న పారమేష్ట్యం న రసాఽఽధిపత్యమ్,
న యోగసిద్దరపునర్భవం వా వాంఛంతి యత్పాదరజః ప్రపన్నా: ॥
నీ పాదధూళిని శరణు వేడిన భక్తులు స్వర్గ స్థానమును గాని, భూలోకరాజ్యమునైననూ, బ్రహ్మపదమును గాని, పాతాళరాజ్యమును గాని, యోగసిద్ధులను గాని, పునర్జన్మ లేని మోక్షమునైననూ కోరరు.
తదేష నాథాప దురాపమన్యైస్తమౌజనిః క్రోధవశోఽప్యహీశః ।
సంసారచక్రే భ్రమతశ్శరీరిణో యదిచ్ఛతస్స్యాద్విభవస్సమక్షః ॥
ఓ ప్రభూ! పాములకు ప్రభువగు ఈ కాలియుడు తమోగుణమునుండి పుట్టి కోపమునకు వశవర్తియే అయినా, ఇతరులచే పొంద శక్యము కాని ఆ పాదధూళిని పొందినాడు. సంసారమనే చక్రములో తిరిగే దేహధారి ఆ పాదధూళిని కోరినచో, ఆతనికి ప్రత్యక్షముగా (స్వయముగా) సంపద కలుగును.
నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే ॥
భూతావాసాయ భూతాయ పరాయ పరమాత్మనే ॥
ఓ భగవానుడా! పూర్ణుడవగు నీకు నమస్కారము. సర్వాంతర్యామి, సకలప్రాణులకు అధిష్టానము అగు నీవు సర్వులలో ఆత్మరూపుడవై యున్నావు. దేశకాలవస్తుపరిచ్ఛేదములు లేని సధనుడవీవే.
జ్ఞానవిజ్ఞాననిధయే బ్రహ్మణేఽనంతశక్తయే ।
అగుణాయావికారాయ నమస్తేఽప్రాకృతాయ చ ॥
జ్ఞానములకు, అనుభవములకు ఆశ్రయమగు పరబ్రహ్మ నీవే. నీవు నిర్గుణుడవే అయినా, నీ శక్తి అనంతము. ప్రకృతికి అతీతుడవగు నీయందు వికారములు (మార్పులు) ఏమీ ఉండవు. నీకు నమస్కారము.
కాలాయ కాలనాభాయ కాలావయవసాక్షిణే ।
విశ్వాయ తదుపద్రష్ట్యే తకర్ర్తే విశ్వ హేతవే ॥
కాలరూపుడవగు నీవే కాలశక్తికి, ఆశ్రయము, మరియు కాలావయవములగు క్షణనిమేషాదులకు సాక్షివి. జగత్తునకు నిమిత్త కారణము, మరియు ఉపాదాన కారణము కూడ జగద్రూపుడవగు నీవే. జగత్సాక్షివగు నీకు నమస్కారము.
భూతమాత్రేంద్రీయప్రాణమనోబుద్ద్యాశయాత్మనే ।
త్రిగుణేనాభిమానేన గూడస్వాత్మానుభూతయే ॥
పంచభూతములు, శబ్దాది తన్మాత్రలు, ఇంద్రియములు, ప్రాణాపానాది ప్రాణములు, మనస్సు, బుద్ధి, చిత్తముల యథార్థతత్త్వము నీవే. సత్త్వరజస్తమోగుణాత్మకములగు ఈ దేహాదులయందు నేను, నాది అనే అభిమానము ఆత్మరూపుడవగు నీవు అనుభవమునకు రాకుండా కప్పివేయును. నీకు నమస్కారము.
నమోఽనంతాయ సూక్ష్మాయ కూటస్థాయ విపశ్చితే ।
నానావాదానురోధాయ వాచ్యవాచకశక్తయే ॥
నీవు అంతము లేనివాడవు, సూక్ష్ముడవు, నిర్వికారుడవు, సర్వజ్ఞుడవు. నీవు పలు వాదములను అనుసరించి, ఆ వాదులనా రూపములలోనే అనుగ్రహించెదవు. నామరూపముల శక్తి నీవే (నీకు నమస్కారము). ,
నమః ప్రమాణమూలాయ కవయే శాస్త్రయోనయే ।
ప్రవృత్తాయ నివృత్తాయ నిగమాయ నమో నమః ॥
ప్రత్యక్షాది ప్రమాణములకు మూలమునందుండే సాక్షి చైతన్యము నీవే. సర్వజ్ఞుడవగు నీవే వేదకర్తవు, వేదప్రతిపాద్యుడవు. రామాద్యవతారము లలో ప్రవృత్తి, దక్షిణామూర్త్యాద్యవతారములలోని నివృత్తి నీ స్వరూపమే. వేదరూపుడవగు నీకు అనేక నమస్కారములు.
నమః కృష్ణాయ రామాయ వసుదేవసుతాయ చ ।
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాం పతయే నమః ॥
వసుదేవుని పుత్రుడవై భక్తులనాకర్షించే కృష్ణుడవు నీవే.(బల) రాముడవై భక్తుల హృదయములను రమింపజేసేది నీవే. ప్రద్యుమ్న (ఉత్కృష్ట ప్రకాశము గలవాడు)-అనిరుద్ద (ఆటంకములు లేనివాడు) రూపములలో నున్నది నీవే. యాదవులకు (సత్త్వగుణప్రధానులగు భక్తులకు) ప్రభువగు నీకు నమస్కారము.
నమో గుణప్రదీపాయ గుణాత్మచ్చాదనాయ చ ।
గుణవృత్త్యుపలక్ష్యాయ గుణద్రష్టే స్వసంవిదే ॥
గుణకార్యములగు దేహాదులను ప్రకాశింపజేసే చైతన్యము నీవే ఐనా, నీ స్వరూపమును వాటియందలి అభిమానమే కప్పి వేయును. ఐతే, గుణ. కార్యములగు మనస్సు మొదలగువాటి వ్యాపారములు నీ స్వరూపము వైపు సంకేతములనిచ్చుచునే యుండును. దేహేంద్రియాదులకు సాక్షియగు స్వయంప్రకాశ-ఆత్మవగు నీ కొరకు నమస్కారము.
అవ్యాకృతవిహారాయ సర్వవ్యాకృతసిద్ధయే ।
హృషీ కేశ నమస్తేఽస్తు మునయే మౌనశాలినే ॥
ఇంద్రియములను ప్రవర్తిల్లజేసే ఓ దేవా! మాయాశక్తియందు విహరించే నీనుండి సకలనామరూపములు సిద్ధించుచున్నవి. ఆత్మా రాముడవై ప్రకాశించే నీ స్వభావము మౌనమే. నీకు నమస్కారమగు గాక!
పరావరగతిజ్ఞాయ సర్వాధ్యక్షాయ తే నమః ।
అవిశ్వాయ చ విశ్వాయ తద్ద్రుష్ట్రేఽస్య చ హేతవే ॥
మాయాశక్తి మొదలగు కారణముల తత్త్వము, పంచభూతాది కార్యముల తత్త్వము సర్వసాక్షివగు నీకే తెలియును. నీవు జగద్రూపముగా ప్రకటమైననూ జగత్తులోని వికారములు నీకు లేవు. ఈ జగత్తునకు కారణమైన నీవే జగత్తునకు సాక్షి వై జగత్తును ప్రకాశింప జేయుదువు.(విశ్వము లేని నీయందు విశ్వము ప్రకటమగుచున్నది, అనగా నీవు విశ్వమునకు వివస్త్రాధిష్ఠానము). నీకు నమస్కారము.
త్వం హ్యస్య జన్మస్థితిసంయమాన్ ప్రభో
గుణైరనీహోఽకృత కాలశక్తిధృక్ ।
తత్తత్స్వభావాన్ ప్రతిబోధయన్ సతః
సమీక్షయాఽమోఘవిహార ఈహసే ॥
ఓ ప్రభూ! నీ విహారము అమోఘము. నీయందు క్రియ గాని, ఇచ్చ. గాని లేదు. అయిననూ, నీవు కాలము యొక్క శక్తిని దాల్చి సత్త్వరజస్తమోగుణములతో ఈ జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుదువు. నీయందు బీజరూపముగానున్న ఆయా ప్రాణుల స్వభావములను నీవు నీ చూపుతో ఉద్బుద్దము చేసి క్రీడించేదవు.
తస్యైవ తేఽమూస్తనవస్త్రిలోక్యాం
శాంతా అశాంతా ఉత మూడయోనయః ।
శాంతాః ప్రీయాస్తే హ్యధునిఽవితుం సతాం
స్థాతుశ్చ తే ధర్మపరీప్సయేహతః ॥
ముల్లోకములయందు సత్త్వగుణప్రధానములై శాంతములు (దేవాదులు), రజోగుణ ప్రధానములై అశాంతములు (మనుష్యాదులు), తమోగుణప్రధానములై మూఢములు (సర్పాదులు) అగు ఈ మూడు రకముల జన్మలు గలవు. అవన్నీ జగదధిష్ఠానమగు నీ - రూపములు మాత్రమే. ఇది నిశ్చయము. ఇప్పుడు నీవు సత్పురుషుల ధర్మమును రక్షించే కోరికతో ప్రవర్తిల్లుచున్నావు. సత్పురుషులను రక్షించుటకై నడుము కట్టియున్న నీకు శాంతజనులే ప్రీతిని కలిగించెదరు.
అపరాధస్సకృద్భర్ర్తా సోడవ్యస్స్వప్రజాకృతః ।
క్షంతుమర్హసి శాంతాత్మన్ మూఢస్య, త్వామజానతః ॥
శాంతమైన మనస్సు గల ఓ ప్రభూ! ప్రభువు తన సేవకుని తప్పును ఒక్కసారి క్షమించవలెను. ఈ కాలియుడు తమోగుణప్రధానుడు, కావుననే నీ మహిమను యెరుగడు. వీనిని నీవు క్షమించ దగును.
అనుగృహ్ణీష్వ భగవన్ ప్రాణాంస్త్యజతి పన్నగః ।
స్త్రీణాం నస్సాధుశోచ్యానాం పతిః ప్రాణః ప్రదీయతామ్ ॥
హే భగవన్! ఈ పామును అనుగ్రహించుము. లేనిచో ఇది ప్రాణములను కోల్పోవును. సత్పురుషులు స్త్రీల పై జాలిని చూ పెదరు. స్త్రీలమగు మాకు భర్తయే ప్రాణము. మాకు పతిభిక్షను పెట్టుము.
విధేహి తే కింకరీణామనుష్ఠేయం తవాజ్ఞయా ।
యచ్చ్రద్ధయాఽనుతిష్ఠన్ వై ముచ్యతే సర్వతోభయాత్ ॥
మేము నీ సేవికలము. మేము ఏమి చేయవలెనో ఆజ్ఞాపించుము. నీ ఆజ్ఞను శ్రద్దతో అనుష్ఠించువాడు, అన్ని వైపులనుండి భయముతో కూడియున్న సంసారమునుండి నిశ్చయముగా విముక్తుడగును.
శ్రీశుక ఉవాచ ।
ఇత్థం స నాగపత్నీభిర్భగవాన్ సమభిష్టుతః ।
మూర్చ్చితం భగ్నశిరసం విససర్జా ఘ్రికుట్టనైః ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- శ్రీకృష్ణ భగవానుని కాలితాపులతో పడగలు విరిగి కాలియనాగుడు మూర్చిల్లేను. ఆతని భార్యలీ విధముగా చక్కగా స్తుతించగా, ఆయన వానిని విడిచి పెట్టేను.
ప్రతిలబ్ధేంద్రియప్రాణః కాలియశ్శనకైర్హరిమ్ ।
కృచ్చ్రాత్సముచ్ఛ్వసన్ దీనః కృష్ణం ప్రాహ కృతాంజలిః ॥
కాలియునకు పోయిన ఇంద్రియశక్తులు, ప్రాణములు తిరిగి వచ్చేను. ఆతడు కష్టముగా నిట్టూర్పులను విడుస్తూ దీనముగా దోసిలి యొగ్గి పాపహరుడగు. శ్రీకృష్ణ భగవానునితో నిట్లనెను.
కాలియ ఉవాచ ।
వయం ఖలాస్సహోత్పత్త్యా తామసా దీర్ఘమన్యవః ।
స్వభావో దుస్త్యజో నాథ లోకానాం యదసద్గ్రహః ॥
కాలియుడిట్లు పలికెను --- ఓ ప్రభూ! మేము పుట్టుకతోటే దుష్టులము, తమోగుణప్రధానులము. మా కోపము చిరకాలము కొనసాగేది. ప్రాణులకు స్వభావమును విడిచి పెట్టుట దుర్ఘటము. సంసారులు దురాగ్రహము (దురభిమానము) ను కలిగియుందురు.
త్వయా సృష్ఠమిదం విశ్వం ధాతర్గుణవిసర్జనమ్ ।
నానాస్వభావవీర్యౌజోయోనిబీజాశయాకృతి ॥
ఓ విధాతా! సత్త్వరజస్తమోగుణముల కార్యమగు ఈ వైవిధ్యభరితమైన జగత్తును సృష్టించినది నీవే. దీనియందు పలు విధముల శాంతాది స్వభావములు, దేహశక్తి, ఇంద్రియశక్తి, తల్లి శక్తి, తండ్రి శక్తి, వాసనలు, రూపములు గలవు.
వయం చ తత్ర భగవన్ సర్పా జాత్యురుమన్యవః ।
కథం త్యజామస్త్వన్మాయాం దుస్త్యజాం మోహితాస్స్వయమ్ ॥
హే భగవన్! ఆ జగత్తులో పాములము మేమైతే పుట్టుకతోనే అధికమగు. కోపము గలవారము. నీ మాయను అతిక్రమించుట చాల కష్టము. మోహితులమై యున్న మేము మా అంత మాకుగా మాయను ఎట్లు అతిక్రమించగలము? (అతిక్రమించ లేము),
భవాన్ హి కారణం తత్ర సర్వజ్ఞో జగదీశ్వరః।
అనుగ్రహం నిగ్రహం వా మన్య సే తద్విధేహి నః ॥
జగన్నాథుడవగు నీవు సర్వము తెలిసినవాడవు. మా స్వభావమునకు కారణము నీవే. అనుగ్రహము గాని, శిక్ష గాని, దేనిని నీవు భావిస్తే, దానిని మాకు విధించుము.
శ్రీశుక ఉవాచ ।
ఇత్యాకర్ణ్య వచః ప్రాహ భగవాన్ కార్యమానుషః ।
నాత్ర స్థేయం త్వయా సర్ప సముద్రం యాహీ మా చిరమ్ ।
సర్వజ్ఞత్యపత్యదారాఢ్యా గోనృభిర్యుజ్యతాం నదీ ॥
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను -- శ్రీకృష్ణ భగవానుడు దేవకార్యము కొరకై మానవునిగా అవతరించెను. ఆయన ఈ మాటను వినీ, కాలియునితో నిట్లనెను: ఓ కాలియా! నీవిక్కడ ఉండవద్దు. బంధువులు, - సంతానము, భార్యలతో కూడి విలంబము లేకుండా సముద్రమునకు వెళ్లుము. ఈ నదిని గోవులు, మానవులు వినియోగించేదరు గాక!
య ఏతత్సంస్మరేన్మర్త్యస్తుభ్యం మదనుశాసనమ్ ।
కీర్తయన్నుభయోస్సంధ్యోర్న యుష్మద్భయమాప్నుయాత్ ॥
ఏ మానవుడైతే నేను నీకిచ్చిన ఈ శిక్షను రెండు సంధ్యలయందు కీర్తిస్తూ చక్కగా స్మరించునో, అట్టివానికి నీ వలన భయము కలుగదు.
యోఽస్మిన్ స్నాత్వా మదాక్రీడే దేవాదీంస్తర్పయేజ్జలైః ।
ఉపోష్య మాం స్మరన్నర్చేత్సర్వపాపైః ప్రముచ్యతే ॥
ఎవడైతే ఉపవాసము చేసి నేను క్రీడించిన ఈ సరస్సులో స్నానము చేసి, దేవతలకు పితృదేవతలకు తర్పణములనిచ్చి, నన్ను స్మరిస్తూ పూజించునో, అట్టివాడు సకలపాపములనుండి పూర్తిగా విముక్తుడగును.
ద్వీపం రమణకం హిత్వా హ్రదమేతముపాశ్రితః ।
యద్భయాత్స సుపర్ణస్త్వాం నాద్యాత్మత్పాదలాంఛితమ్ ॥
గరుడుని వలన భయపడి నీవు రమణకద్వీపమును విడిచి పెట్టి ఈ సరస్సునాశ్రయించితివి. నా పాదముల గుర్తులు గల నిన్ను ఆ గరుడుడు భక్షించకుండును గాక!
శ్రీశుక ఉవాచ ।
ఏవముక్తో భగవతా కృష్ణేనాద్బుతకర్మణా ।
తం పూజయామాస ముదా నాగపత్న్యశ్చ సాదరమ్ ॥
శ్రీశుక మహర్షి పలి కెను --- శ్రీకృష్ణ భగవానుని లీలలు అచ్చెరువును గొలుపును. ఆయన ఈ విధముగా పలుకగా, కాలియుడు మరియు ఆతని భార్యలు కూడ ఆనందముతో ఆదరపూర్వకముగా ఆయనను పూజించిరి.
దివ్యాంబరస్రజ్మణిభిః పరార్ఘ్యైరసీ భూషణైః ।
దివ్యగంధానులేపైశ్చ మహత్యోత్పలమాలయా ॥
పూజయిత్వా జగన్నాథం ప్రసాద్య గరుడధ్వజమ్ ।
తతః ప్రీతోఽభ్యనుజ్ఞాతః పరిక్రమ్యాభివంద్య తమ్ ॥
జగన్నాథుడగు శ్రీకృష్ణుని ధ్వజముపై గరుడుడు ఉండును. కాలియుడు ప్రకాశించే వస్త్రములను, మాలలను, మణులను, మిక్కిలి విలువైన ఆభరణములను, దివ్యమగు గంధలేపనములను, పెద్ద కమలముల మాలను కూడ సమర్పించి ఆయనను పూజించెను. ఆ విధముగా ఆయనను ప్రసన్నుని చేసి, ఆతడా తరువాత ఆనందముతో ఆయనకు ప్రదక్షిణము చేసి నమస్కరించి సెలవు తీసుకొనెను.
సకలత్రసుహృత్పుత్రో ద్వీపమబ్ధేర్జగామ హ ॥
తదైవ సాఽమృతజలా యమునా నిర్విషాఽభవత్ ।
అనుగ్రహాద్భగవతః క్రీడామానుష రూపిణః ॥
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే దశమస్కంధే పూర్వార్దే షోడశోఽధ్యాయః ॥
భార్యలు, బంధువులు, పుత్రులతో కూడి కాలియుడు సముద్రములోని రమణకద్వీపమునకు వెళ్లాను. అప్పుడే ఆ యమునానదిలోని విషము పోయి నీరు అమృతము వలె ఆయెను. అదంతా లీల కై మానవరూపమును దాల్చిన శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహమే.
శ్రీమద్బాగవత మహాపురాణమునందు పదవ స్కంధము పూర్వార్ధములో కాలియమర్దన లీలను వర్ణించే పదునారవ అధ్యాయము ముగిసినది.
Summary of chapter 16 of the Bhāgavata Mahā Purana is as follows:
The narrative records the historical purification of the Yamunā River. In a deep pool of the Yamunā resided the multi-hooded, venomous serpent Kāliya, whose deadly poison boiled the water and emitted toxic fumes that killed flying birds and surrounding vegetation. When the cowherd boys and cows drank the poisoned water, they fell lifeless on the shore; Śrī Kṛshṇa restored them to life with His merciful glance. Stepping onto a Kadamba tree, seven-year-old Kṛshṇa leaped heroically into the boiling pool. Kāliya wrapped his massive coils around Kṛshṇa, but Bhagavān expanded His body, forced the serpent to release Him, and leaped onto Kāliya's hundred hoods. Dancing with exquisite rhythmic steps (*Kāliya-mardana*), Kṛshṇa trampled the serpent's pride, causing him to vomit blood. Realizing Kṛshṇa's divinity, Kāliya's wives (*Nāgapatnīs*) offered exalted prayers begging for mercy. Kṛshṇa spared Kāliya's life, imprinted His lotus footprints upon the serpent's heads as protection against Garuḍa, and banished him to Ramanaka Island.