భాగవత మహా పురాణము
44 - శ్రీకృష్ణుడు చాణూరాదులను కంసుని సంహరించి ఉద్ధరించుట
శ్రీశుక ఉవాచ ।
ఏవం చర్చితసంకల్పో భగవాన్మధుసూదనః । ఆససాదాథ చాణూరం ముష్టికం రోహిణీసుతః ॥
శ్రీశుక మహర్షి ఇట్లు పలికెను --- మధువును మట్టుబెట్టిన శ్రీకృష్ణ భగవానుడీ విధముగా చర్చించి నిశ్చితమగు సంకల్పమునకు వచ్చెను.ఆయన చాణూరుని, రోహిణి పుత్రుడగు బలరాముడు ముష్టికుని ఎదుర్కొనిరి.
హస్తాభ్యాం హస్తయోర్బద్ధ్వా పద్భ్యామేవ చ పాదయోః । విచకర్షతురన్యోన్యం ప్రసహ్య విజిగీషయా ॥
వారు (మల్లక్రీడలో) నెగ్గాలనే కోరికతో ఒకరిని మరియొకరు చేతులతో చేతులను, కాళ్లతో కాళ్లను కూడ బంధించి బలముగా పట్టి లాగిరి.
అరత్నీ ద్వే అరత్నిభ్యాం జానుభ్యాం చైవ జానునీ । శిరశ్మీర్ ష్ణోరసోరస్తావన్యోన్యమభిజఘ్నతుః ॥
వారిద్దరు (శ్రీకృష్ణ - చాణూరులు, బలరాము - ముష్టికులు) ఒకరినొకరు మోచేతులను మోచేతులతో, మోకాళ్లను మోకాళ్లతో, తలను తలతో, వక్షఃస్థలమును కూడ వక్షఃస్థలముతో కొట్టుకొనిరి.
పరిభ్రమణవి క్షేపపరిరంభావపాతనైః । ఉత్సర్పణాపసర్పణైశ్చాన్యోన్యం ప్రత్యరుంధతామ్ ॥
ఒకరిని మరియొకరు పట్టి గిర గిర త్రిప్పుట, త్రోసివేయుట, కౌగిలిలో బిగించుట, క్రింద పడద్రోయుట, ముందుకు దుముకుట, వెనుకకు తగ్గుట మొదలగు విన్యాసములతో ఒకరి ఉద్యమమును మరియొకరు అడ్డుకొనిరి.
ఉత్థాపనైరున్నయనైశ్చాలనైః స్థాపనైరపి । పరస్పరం జిగీషంతావపచక్రతురాత్మనః ॥
వారు ఒకరినొకరు జయించగోరి ప్రతిస్పర్ధి దేహమును ముద్దగా చేసి పైకెత్తుట, చేతులను పట్టి పైకెత్తుట, విదలించి కొట్టుట, నేలపై నొక్కి ఉంచుట మొదలైన విన్యాసములతో, ఒకరి దేహమునకు మరియొకరు పీడను కలిగించిరి.
తద్బలాబలవద్యుద్ధం సమేతాస్సర్వయోషితః । ఊచుః పరస్పరం రాజన్ సానుకంపా వరూథశః ॥
ఓ పరీక్షిన్మహారాజా! స్త్రీలందరు గుంపులుగా కలిసివచ్చిరి. వారా యుద్ధమును చూసి దయ గలవారై, ఇది బలహీనులకు బలవంతులతో జరిగే యుద్ధము, అని ఒకరితోనొకరు చెప్పుకొనిరి.
మహానయం బతాధర్మ ఏషాం రాజసభాసదామ్ । యే బలాబలవద్యుద్ధం రాజ్ఞోఽన్విచ్ఛంతి పశ్యతః ॥
అయ్యో! రాజు యొక్క సభలోని జనులకు ఇది పెద్ద అధర్మము. ఎందుకంటే, చూచుచుండగనే (రాజుననుసరించి) బలహీనులగు పిల్లలకు బలవంతులగు మల్లులతో జరుగుచున్న యుద్ధముననుమోదించుచున్నారు.
క్వ వజ్రసారసర్వాంగౌ మల్లౌ శైలేంద్రసన్నిభౌ ! క్వ చాతీసుకుమారాంగౌ కిశోరౌ నాప్తమౌవనౌ ॥
అవయవములన్నింటియందు వజ్రము యొక్క చేవ కలిగి గొప్ప పర్వతమును పోలిన మల్లులెక్కడ? మిక్కిలి సుకుమారమైన దేహములు గల ఇంకా యౌవనము రాని ఆడుకునే పిల్లలెక్కడ? (పోలిక లేదు).
ధర్మవ్యతిక్రమో హ్యస్య సమాజస్య ధ్రువం భవేత్ । యత్రాదర్మస్సముత్తిష్ఠేన్న స్థేయం తత్ర కర్హిచిత్ ॥
ఈ సభాసదులకు నిశ్చయముగా ధర్మమునుల్లంఘించిన పాపము కలుగును. ఎక్కడనైతే అధర్మము బలపడునో, ఆ స్థానము ఏదైనా, అచట ఉండరాదు.
న సభాం ప్రవి శేత్ప్రాజ్ఞస్సభ్యదోషాననుస్మరన్ । అబ్రువన్ విబ్రువన్నజ్ఞో నరః కిల్బిషమశ్నుతే ॥
సభ్యులలోని దోషము గురించి తెలిసిన బుద్ధిమంతుడగు వ్యక్తి ఆ సభకు పోరాదు. ఎందుకంటే, అక్కడకు వెళ్లిన వ్యక్తి సత్యము తెలిసి పాపమును చెప్పకున్నా, తప్పుగా చెప్పినా, తెలిసి నాకు తెలియదని చెప్పినా కూడ పాపమును పొందును.
వల్గతశ్శత్రుమభితః కృష్ణస్య వదనాంబుజమ్ । వీక్ష్యతాం శ్రమవార్యుప్తం పద్మకోశమివాంబుభిః ॥
శత్రువగు చాణూరుని చుట్టూ పరు గెత్తుచున్న శ్రీకృష్ణుని పద్మమువంటి ముఖమును చూడుడు. చెమట బిందువులతో నిండిన ఆ ముఖము నీటి బిందువులతో కూడిన పద్మపు మొగ్గను పోలియున్నది.
కిం న పశ్యత రామస్య ముఖమాతామ్రలోచనమ్ । ముష్టికం ప్రతి సామర్షం హాససంరంభశోభితమ్ ॥
బలరాముని ముఖము కొంచెము ఎర్రనైన కళ్లతో, ముష్టికుని యెడల కోపముతో, నవ్వు యొక్క వేగముతో శోభిల్లుచున్నది. మీకు కనబడ లేదా?
పుణ్యా బత వ్రజభువో యదయం నృలింగ - గూఢః పురాణపురుషో వనచిత్రమాల్యః ।
గాః పాలయన్ సహబలః క్వణయంశ్చ వేణుం విక్రీడయాఽచతి గిరిత్రరమార్చితాంఘిః ॥
ఆహా! గోకులమునందలి స్థానములు పావనములు. ఎందుకంటే, కైలాసాధిపతియగు శివునిచే మరియు లక్ష్మీదేవిచే ఆరాధించబడే పాదములు ఈ పురుషోత్తముడు మనుష్యవేషముతో ఎవరికీ తెలియకుండా అచట సంచరించును. బలరాముడు తోడు కాగా, ఈయన అడవియందలి రంగు రంగుల పూల మాలను దాల్చి, గోవులను కాపలా కాస్తూ, వేణువును వాయిస్తూ, వివిధ క్రీడలతో విహరించును.
గోప్యస్తపః కిమచరన్ యదముష్య రూపం లావణ్య సారమసమోర్ధ్వమనన్యసిద్ధమ్ ।
దృగ్భిః పిబంత్యనుసవాభినవం దురాపం
ఏకాంతధామ యశసశ్శ్రియ ఐశ్వరస్య ॥
గోషికలు ఏమి తపస్సును చేసిరో? ఎందుకంటే, వారు ఈ శ్రీకృష్ణుని లావణ్యము యొక్క సారమైన ముఖమును కన్నులతో సానము చేసెదరు. ప్రతి క్షణము నూతనమైన ఈ రూపముతో సమానమైనది గాని, గొప్పది సమానము గాని మరియొకటి లేదు. పొంద శక్యము కాని ఈ రూపము ఇతరములగు ఆభరణాదులచే సిద్ధించేది కాదు. రూపము కీర్తికి, శోభకు, ఈశ్వరభావమునకు ఏకైకనిత్యనివాసస్థానము.
యా దోహనేఽవహననే మథనోపలేప - ప్రేంఖేంఖనార్బరుదితోక్షణ మార్జనాదౌ । గాయంతి చైనమనురక్తధియోకాశ్రుకంఠ్యో ధన్యా వ్రజస్త్రియ ఉరుక్రమచిత్తయానాః ॥
గోపికలు ధన్యలు. వారి బుద్ధి ఈ శ్రీకృష్ణుని పై ప్రేమతో నిండినది. పాదములతో ముల్లోకములను కొలిచిన ఈ భగవానుని తలపు వారి కళ్లకు నీటిని, కంఠమునకు డగ్గుత్తికను కలిగించును. పనులను చేసుకునేటప్పుడు కూడ వారి మనస్సు ఆయనమీదనే లగ్నమై యుండును. పాలసు పితుకుట, ధాన్యమును దంపుట, పెరుగు చిలుకుట, నీళ్లు చల్లుట, ఉయ్యాలనూపుట, ఏడ్చే పిల్లవానిని సముదాయించుట, (ఆ పిల్లలకు స్నానము చేయించుట), మొక్కలకు నీళ్లసు పోయుట, ఇంటిని తుడుచుట, స్నానమును చేయుట మొదలగు పనులను చేసుకుంటూ వారు ఈ శ్రీకృష్ణుని లీలలను గానము చేయుదురు.
ప్రాతర్వజాద్వజత ఆవిశతశ్చ సాయం
గోభిస్సమం క్వణయతోకస్య నిశమ్య వేణుమ్ ।
నిర్గమ్య తూర్ణమబలాః పథి భూరిపుణ్యాః పశ్యంతి సస్మితముఖం సదయాఽవలోకమ్ ॥
ఈతడు గోవులతో బాటుగా ఉదయమే గోకులమునుండి అడవికి వెళ్లి సాయంకాలమగుసరికి వేణువును వాయించుకుంటూ తిరిగి వచ్చును. గోపికలు మహాపుణ్యవతులు. వారా వేణునాదమును విని వెంటనే బయటకు వచ్చి మార్గములో చిరునవ్వుతో కూడిన ఆయన ముఖమును చూచెదరు. ఆయన వారివైపు దయతో చూచును.
ఏవం ప్రభాష మాణాసు స్త్రీషు యోగేశ్వరో హరిః । శత్రుం హంతుం మనశ్చక్రే భగవాన్ భరత్నభ ॥
భరతవంశీయులలో శ్రేష్ఠుడవగు ఓ పరీక్షిన్మహారాజా! స్త్రీలు ఇట్లు మాటలాడుచుండగనే పాపనాశకుడగు శ్రీకృష్ణ భగవానుడు శత్రువును అంతమొందించుటకు సంకల్పించెను. ఆయన యోగసిద్ధులకధీశ్వరుడు.
సభయాః స్త్రీగిరశ్శ్రుత్వా పుత్ర స్నేహశుచాకఽఽతురౌ । పితరావన్వత ప్యేతాం పుత్రయోరబుధౌ బలమ్ ॥
బలరామకృష్ణుల తల్లిదండ్రులగు దేవకీవసుదేవులు కారాగారములో ఉండిరి. స్త్రీల భయపూర్ణమగు పలుకులు వారి చెవిన పడినవి. వారికి తమ పుత్రుల శక్తి గురించి తెలియదు. పుత్రులయందలి ప్రేమచే శోకముతో వారు చాల ఆదుర్దాను, మనస్తాపమును పొందిరి.
తైస్తైర్నియుద్ధవిధిభిర్వివిధైరచ్యుతేతరౌ । యుయుధాతే యథాఽన్యోన్యం తథైవ బలముష్టికౌ ॥
శ్రీకృష్ణ భగవానుడు, చాణూరుడు ఒకరితోనొకరు పలురకములైన ఆయా మల్లయుద్ధపద్ధతులతో యుద్ధమును చేసిరి. బలరాముడు, ముష్టికుడు కూడ అటులనే యుద్ధము చేసిరి.
భగవద్గాత్రనిష్పతైర్వజని ష్పేష నిష్ఠురైః । చాణూరో భజ్యమానాంగో ముహుర్ గ్లానిమవాప హ ॥
శ్రీకృష్ణ భగవానుడు చేతులతో, మోకాళ్లతో కొట్టిన దెబ్బలు వజ్రము యొక్క దెబ్బలవలె చాల కఠోరముగా నుండెను. ఆ దెబ్బలకు చాణూరుని వయవములు నుజ్జు అగుచుండెను. ఆతనికి అధికమగు పీడ కలిగెను.
స శ్యేనవేగ ఉత్పత్య ముష్టీకృత్య కరావుభౌ । భగవంతం వాసుదేవం క్రుద్ధో వక్షస్య బాధత ॥
ఆ చాణూరుడు డేగ యొక్క వేగమువంటి వేగము గలవాడు. వాడు కోపముతో పైకెగిరి రెండు చేతులను పిడికిలిగా చేసి, వసుదేవపుత్రుడగు శ్రీకృష్ణ భగవానుని వక్షఃస్థలము పై కొట్టెను.
నాచలత్తత్ర్పహా రేణ మాలాఽఽహత ఇవ ద్విపః । బాహ్వోర్నిగృహ్య చాణూరం బహుశో భ్రామయన్ హరిః ॥
శ్రీకృష్ణ భగవానుడు మాలచే కొట్టబడిన ఏనుగు వలె ఆ దెబ్బకు చలించలేదు. ఆయన చాణూరుని రెండు చేతులను గట్టిగా పట్టుకొని పలు మార్లు గిర గిరా త్రిప్పెను.
భూపృష్ఠే పోథయామాస తరసా క్షీణ జీవితమ్ । విస్రస్తాకల్ప కేశస్రగింద్రధ్వజ ఇవాపతత్ ॥
ఆ వేగమునకు వాని పై ప్రాణములు పైనే పోయెను. శ్రీకృష్ణుడు వానిని నేలపై వేసి కొట్టెను. ఆభరణములు, కేశములు, మాలలు చెల్లాచెదరై వాడు ఇంద్రుని పూజకై నిలబెట్టిన జెండా వలె నేల గూలెను.
తథైవ ముష్టికః పూర్వం స్వముష్ట్యాఽహతేన వై । బలభద్రేణ బలినా తలేనాభిహతో భృశమ్ ॥
బలరామముష్టికుల యుద్ధము కూడ అదే రీతిలో సాగెను. ముందుగా ముష్టికుడు బలశాలియగు బలరాముని తన పిడికిలితో కొట్టగా, ఆయన వానిని అరచేతితో గట్టిగా చెంపకాయ కొట్టెను.
ప్రవేపితస్స రుధిరముద్వమన్ముఖతోఽర్దితః । వ్యసుః పపాతోర్వ్యుపస్థే వాతాహత ఇవాంఘ్రిపః ॥
ఆ దెబ్బకు ఆ ముష్టికుడు వణికిపోయి చాల పీడను పొందెను, వాడు నోటినుండి రక్తమును క్రక్కుతూ ప్రాణములు పోయి, గాలిచే పెకిలించివేయబడిన చెట్టువలె, నేల పై గూలెను.
తతః కూటమనుప్రాప్తం రామః ప్రహరతాం వరః । అవధీల్లీలయా రాజన్ సావజ్ఞం వామముష్టినా ॥
ఓ పరీక్షిన్మహారాజా! తరువాత వరుసలో కూటుడు ముందుకు వచ్చెను. యోద్ధలలో దిట్టయగు బలరాముడాతనిని తిరస్కారపూర్వకముగా ఎడమ చేతి పిడికిలితో కొట్టి అవలీలగా సంహరించెను .
తర్హ్యేవ హి శలః కృష్ణ పదాపహతశీర్షకః । ద్విధా విదీర్ఘస్తోశలక ఉభావపి ని పేతతుః ॥
అదే సమయమునందు శ్రీకృష్ణుడు కాలితో శలుని తలను ఊడగొట్టి, తోశలకుని రెండుగా చీల్చెను. వారిద్దరు ఆ విధముగా నేల గూలిరి.
చాణూ రే ముష్టి కే కూటే శలే తోశలకే హతే ! శేషాః ప్రదుద్రువుర్మల్లాస్సర్వే ప్రాణపరీప్సవః ॥
చాణూర ముష్టిక కూట శల తోశలకులు (ఈ తీరున) సంహరించబడిరి. మిగిలిన మల్లులందరు ప్రాణములను కాపాడుకొనగోరి పారిపోయిరి.
గోపాన్ వయస్యానాకృష్య తైస్సంసృజ్య విజహ్రతుః । వాద్యమానేషు తూర్యేషు వల్గంతౌ రుతనూపురౌ ॥
అప్పుడు వాద్యములు మ్రోగించబడెను. బలరామకృష్ణుల కాలి యందెలు శబ్దమును చేయుచుండెను. వారు తమ మిత్రులైన గోపాలకులను చేయి పట్టుకు లాగి వారితో కలిసి మల్లుల చేష్టలను చేస్తూ విహరించిరి.
జనాః ప్రజహృషుస్సర్వే కర్మణా రామకృష్ణయోః । ఋతే కంసం విప్రముఖ్యాస్సాధవస్సాధు సాధ్వితి ॥
కంసుని తప్పించి జనులందరు బలరామకృష్ణులు చేసిన పనికి హర్షమును పొందిరి. బ్రాహ్మణ శ్రేష్ఠులు, సజ్జనులు బాగు, బాగు అని కొనియాడిరి.
హతేషు మల్లవర్యేషు విద్రుతేషు చ భోజరాట్ । న్యవారయత్స్వతూర్యాణి వాక్యం చేదమువాచ హ ॥
మల్లులలో శ్రేష్ఠులు సంహరించబడగా మిగిలినవారు పారిపోయిరి. అప్పుడు కంసుడు తన వాద్యముల వారిని ఆపి స్పష్టముగా ఈ మాటను పలికెను.
నిస్సారయత దుర్వృత్తౌ వసుదేవాత్మజౌ పురాత్ ! ధనం హరత గోపానాం నందం బధ్నీత దుర్మతిమ్ ॥
వసుదేవుని పుత్రులగు బలరామకృష్ణులు దుష్టమగు చేష్టలు గలవారు. వారిని నగరమునుండి బహిష్కరించుడు. గోపాలకుల లాగుకొనుడు. దుర్బుద్ధియగు నందుని బంధించుడు.
వసుదేవస్తు దుర్మేధా హన్యతామాశ్వసత్తమః । ఉగ్రసేనః పితా చాపి సానుగః పరపక్ష గః ॥
వసుదేవుడు దుర్బుద్ధి, ముర్బుద్ధి, పరమదుష్టుడు. వానినైతే వెంటనే చంపివేయుడు. ఉగ్రసేనుడు నా తండ్రియే అయినా, తన అనుచరులతో కూడి శత్రువుల పక్షములో చేరినాడు.
ఏవం వికత్థమానే వై కం సే ప్రకు పితోఽవ్యయః । లఘిమ్నో పేత్య తరసా మంచముత్తుంగమారుహత్ ॥
కంసుడీ విధముగా వదరుచుండగా శ్రీకృష్ణునకు చాల కోపము వచ్చెను. ఆయన బలమేమియు క్షీణించలేదు. ఆయన లాఘవముచే వేగముగా పైకెగిరి ఎత్తైన సింహాసనమునెక్కెను.
తమావిశంతమాలోక్య మృత్యుమాత్మన ఆసనాత్ । మనస్వీ సహసోత్థాయ జగృహే సోఽసిచర్మణీ ॥
తం ఖడ్గపాణిం విచరంతమాశు శ్యేనం యథా దక్షిణ సవ్యమంబరే । సమగ్రహీద్దుర్విషహోగ్రతేజా యథోరగం తార్ క్ష్యసుతః ప్రసహ్య ।
కంసుడు కత్తిని చేతబట్టి ఆకాశములో డేగ వలె కుడి ఎడమలకు తిరుగుచుండెను. శ్రీకృష్ణుని తేజస్సు మిక్కిలి సహించ శక్యము కానిది. ఆయన వెంటనే వానిని, పపుత్రుడగు గరుడుడు పామును వలె, బలముగా గట్టిగా పట్టుకొనెను.
ప్రగృహ్య కేశేషు చలత్కిరీటం నిపాత్య రంగోపరి తుంగమంచాత్ । తస్యోపరిష్టాత్స్వయమబ్జనాభః పపాత విశ్వాశ్రయ ఆత్మతంత్రః ॥
శ్రీకృష్ణ భగవానుడు స్వతంత్రుడు, జగత్తునకు ఆశ్రయమైనవాడు. ఆయన అల్లల్లాడే కిరీటము గల కంసుని జుట్టు గట్టిగా పట్టుకొని ఎత్తైన సింహాసనమునుండి మల్లరంగముపై పడవైచి వాని పైన తాను పడెను.
తం సంపరేతం విచకర్ష భూమౌ హరిర్యథేభం జగతో విపశ్యతః । హా హేతి శబ్దస్సుమహాంస్తదాఽభూదుదీరితస్సర్వజనైర్నరేంద్ర ॥
ఓ పరీక్షి ద్రాజా! జనసమూహము చూచుచుండిరి. సింహము ఏనుగును వలె, శ్రీకృష్ణుడు మరణించిన ఆ కంసుని నేలపై లాగెను. అప్పుడుజనులందరు కలిసి అయ్యో! అయ్యో! అంటూ చాల పెద్ద శబ్దము చేసిరి.
స నిత్యదోద్విగ్నధియా తమీశ్వరం ఏబన్ వదన్ వా విచరన్ స్వపఞ్చ్వసన్ । దదర్శ చక్రాయుధమగ్రతో యతః తదేవ రూపం దురవాపమాప ॥
భయముతో నిండిన బుద్ధి గల ఆ కంసుడు అన్ని వేళలా నీటినిత్రాగుతూ, మాటలాడుతూ, సంచరిస్తూ, నిద్రిస్తూ, గాలిని పీలుస్తూ,చక్రము ఆయుధముగా గల ఆ శ్రీకృష్ణ భగవానుని తన యెదుట చూచెను.అందువలననే, ఆతడు పొంద శక్యము కాని అదే రూపమును పొందెను.
తస్యానుజా భ్రాతరోఽష్టౌ కంకన్యగ్రోధకాదయః । అభ్యధావన్నభిక్రుద్ధా భ్రాతుర్నిర్వేశకారిణః ॥
ఆ కంసునకు కంకుడు, న్యగ్రోధకుడు మొదలగు ఎనమండుగురుతమ్ములు గలరు. కోపించి అన్నగారి ఋణమునుతీర్చుకొనగోరి బలరామకృష్ణుల పైకి ఉరికిరి.
తథాఽతిరభసాంస్తాంస్తు సంయత్తాన్ రోహిణీసుతః । అహన్ పరిఘముద్యమ్య పశూనివ మృగాధిపః ॥
విధముగా కంసుని తమ్ములైతే అధికమగు వేగముతో కయ్యమునకు కాలు దువ్వుచుండిరి. రోహిణీనందనుడగు బలరాముడుఇనుప గుదీయను పైకెత్తి వారిని, సింహము పశువులను వలె, వధించెను.
నేదుర్దుందుభయో వ్యోమ్ని బ్రహ్మేశాద్యా విభూతయః । పుష్పైః కిరంతస్తం ప్రీతాశ్శశంసుర్ననృతుః స్త్రియః ॥
ఆకాశములో దేవదుందుభులు మ్రోగినవి. భగవానుని విభూతులైన(అంశలు) బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు మొదలగువారు హర్షముతోశ్రీకృష్ణునిపై పూలను చల్లి స్తుతించిరి. అప్సరసలు నాట్యము చేసిరి.
తేషాం స్త్రియో మహారాజ సుహృన్మరణదుఃఖితాః । తత్రాభీయుర్వినిఘ్నంత్యశ్మీర్షాణ్యశ్రువిలోచనాః ॥
ఓ పరీక్షిన్మహారాజా! కంసుని భార్యలు మరియు వాని సోదరుల భార్యలు తమ తమ భర్తల మృతికి దుఃఖించుచుండిరి. వారి కన్నులు కన్నీటితో నిండిపోయెను. వారు తలలను కొట్టుకుంటూ అచటకు వచ్చిరి.
శయానాన్ వీరశయ్యాయాం పతీనాలింగ్య శోచతీః । విలేపుస్సుస్వరం నార్యో విసృజంత్యో ముహుశ్శుచః ॥
దుఃఖముతో నిండిన ఆ స్త్రీలు వీరశయ్యయైన యుద్ధభూమిలో వాలిపోయిన తమ భర్తలను కౌగిలించుకొని నిరంతరముగా కన్నీటిని విడుస్తూ బిగ్గరగా రోదించిరి.
హా నాథ ప్రియ ధర్మజ్ఞ కరుణానాథవత్సల ! త్వయా హతేన నిహతా వయం తే సగృహప్రజాః ॥
అయ్యో! ప్రియమైన నాథా! నీవు ధర్మము తెలిసినవాడవు, దయ గలవాడవు, నాథుడు లేని వారియందు ప్రేమ గలవాడవు. నీవు వధించబడగా, నీవారలమైన మేము ఇళ్లు పిల్లలతో సహా హతులమైతిమి.
త్వయా విరహితా పత్యా పురీయం పురుషర్షభ । న శోభతే వయమివ నివృత్తోత్సవమంగలా ॥
ఓ పురుష శ్రేష్ఠా! మాకు, ఈ నగరమునకు ప్రభుడవగు నీవు లేకుండా పోయినావు. మాకు, నగరమునకు ఉత్సవము, మంగళము దూరమైనవి. మేము శోభిల్లము, ఈ నగరము శోభిల్లదు.
అనాగసాం త్వం భూతానాం కృతవాన్ ద్రోహముల్బణమ్ । తేనేమాం భో దశాం నీతో భూతధ్రుక్కో లభేత శమ్ ॥
ఓయీ! నీవు నిరపరాధులగు ప్రాణులకు ఘోరమైన ద్రోహమును చేసితివి. అదియే నిన్నీ దుఃస్థితికి చేర్చినది. ప్రాణులకు ద్రోహమును చేసే ఎవడు సుఖమును పొందును? (ఎవ్వడైననూ పొందడు).
సర్వేషామిహ భూతానామేష హి ప్రభవాప్యయః । గోప్తా చ తదవధ్యాయీ న క్వచిత్సుఖమేధతే ॥
ఈ శ్రీకృష్ణుడు ఈ లోకములోని సకల ప్రాణులను సృష్టించి, పాలించి, తనలో విలీనము చేసుకొనే పరమేశ్వరుడే. ఆయనను అవమానించే వ్యక్తి ఏ దేశమునందైననూ ఏ కాలమునందైననూ సుఖముగా వర్ధిల్లడు.
శ్రీశుక ఉవాచ ।
రాజయోషిత ఆశ్వాస్య భగవాంల్లోకభావనః । యామాహుర్లౌకి కీం సంస్థాం హతానాం సమకారయత్ ।
శ్రీ శుక మహర్షి ఇట్లు పలికెను --- లోకములకు మనుగడనిచ్చే శ్రీకృష్ణ భగవానుడు రాజపత్నులనోదార్చెను. మరణించినవారలకు పరలోకమునకు చెందిన ఏ అపరకర్మను స్మృతికారులు చెప్పిరో, దానిని వధించబడిన కంసాదులకు ఆయన చేయించెను.
మాతరం పితరం చైవ మోచయిత్వాఽథ బంధనాత్ । కృష్ణ రామౌ వవందాతే శిరసాఽఽస్పృశ్య పాదయోః ॥
తరువాత బలరామకృష్ణులు తల్లిదండ్రులను చెరనుండి విడిపించి వారి పాదములకు తల మోపి నమస్కారమును చేసిరి.
దేవకీ వసుదేవశ్చ విజ్ఞాయ జగదీశ్వరౌ । కృతసంవందనౌ పుత్రా సస్వజాతే న శంకితౌ ॥
ఇతి శ్రీమద్భాగవతే దశమస్కంధే చతుశ్చత్వారింశోకధ్యాయః ॥
తమకు నమస్కారము చేసిన పుత్రులిద్దరు జగన్నాథులని గుర్తించిన దేవకీవసుదేవులు (అపరాధమగునేమోననే) శంకతో వారిని కౌగిలించుకొనలేదు.
శ్రీమద్భాగవత మహాపురాణము పదవ స్కంధములో
శ్రీకృష్ణుడు చాణూరాదులను కంసుని సంహరించి ఉద్ధరించుటను వర్ణించే
నలుబది నాల్గవ అధ్యాయము ముగిసినది (44).
Summary of chapter 44 of the Bhāgavata Mahā Purana is as follows:
In the public arena, Kaṁsa's champion wrestlers Cāṇūra and Mushṭika challenged young Kṛshṇa and Balarāma to combat. Cāṇūra engaged Kṛshṇa while Mushṭika fought Balarāma. The spectators, including the women of Mathurā, condemned the unequal match between seasoned, giant wrestlers and delicate youths. However, within moments, Śrī Kṛshṇa whirled Cāṇūra around and slammed him to the arena floor, shattering his limbs, while Balarāma crushed Mushṭika with a single blow of His fist. Seeing his champions destroyed, an enraged Kaṁsa ordered his guards to execute Vasudeva, Ugrasena, and the cowherds. Instantly, Śrī Kṛshṇa leaped onto the high royal dais, seized Kaṁsa by his hair, dragged the tyrant to the wrestling floor, and threw Himself upon him, killing Kaṁsa instantly and liberating Mathurā from asuric tyranny.